క్షంతవ్యులు

2112
0
Submitted Date 09/30/2020
Bookmark

క్షంతవ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

Originally published by Adarsa Grandha Mandali, Vijayawada.

© 1966 C.B. Rau; Revised E-book edition @2020 Bhimeswara Challa.

అంకితము - ప్రపంచంలోని 'క్షంతవ్యులు' కు.

E-book:

Cover image:

Painting of Nirmala Rau (author's spouse)

DTP Work

Jyothi Valaboju (writer, editor, and publisher)

Other books by the author:

అప్రాశ్యులు (A novel)

Man's Fate and God's Choice

An Agenda for Human Transformation

The War Within- Betwee and Good Evil

(Reconstructing Money, Morality, and Mortality)

అధ్యాయాలు

ముందుమాట

విజ్ఞప్తి

చాప్టర్ 1

చాప్టర్ 2

చాప్టర్ 3

చాప్టర్ 4

చాప్టర్ 5

చాప్టర్ 6

చాప్టర్ 7

చాప్టర్ 8

చాప్టర్ 9

చాప్టర్ 10

చాప్టర్ 11

చాప్టర్ 12

చాప్టర్ 13

చాప్టర్ 14

చాప్టర్ 15

చాప్టర్ 16

చాప్టర్ 18

చాప్టర్ 19

చాప్టర్ 20

చాప్టర్ 21

చాప్టర్ 22

చాప్టర్ 23

చాప్టర్ 24

చాప్టర్ 25

చాప్టర్ 26

చాప్టర్ 27

చాప్టర్ 28

చాప్టర్ 29

చాప్టర్ 30

చాప్టర్ 31

చాప్టర్ 32

చాప్టర్ 33

చాప్టర్ 34

చాప్టర్ 35

చాప్టర్ 36

చాప్టర్ 37

చాప్టర్ 38

చాప్టర్ 39

చాప్టర్ 40

 

ముందుమాట - Foreword

Many things in this long life of mine are a kind of 'mystery to myself', things that cannot be rationally explainable. One of them is my venturing into the Telugu literary arena, lo, as a novelist, to pen two novels. If anything, not only their content and the characters but also the timing of the muse that occasioned that never ceases to puzzle me.

Kshantavyulu, క్షంతవ్యులు, was written in the year 1956 when I was just a 21-year old lad, freshly out of university, living in Delhi with my elder brother, preparing, entirely untutored, for the toughest competition in India. I.A.S. examination. How the idea of writing a novel germinated in my head at such a career-defining time, how the plot of a complex tale took shape with so little exposure to the raw passions and evocative emotions exhibited by the characters in that endeavour defies my imagination 'even now'. However, I vividly remember the day I finished it; I was so relieved that I felt it did not matter if the manuscript remained unpublished or whatever might happen to my I.A.S attempt, indeed, if I lived or died that very minute.

It was altogether in a different set of circumstances of life that Aprāsyulu, అప్రాశ్యులు, followed in the year 1961, when I was the Sub-collector at Parvatipuram in Andhra Pradesh. How I summoned the zeal, drive and perseverance to write another all-consuming novel in the middle of doing a high-pressure job, as I look back, remains beyond my comprehension. Be that as it may, after I finished it, as I moved on professionally, the literary outpours of my youthful passions took a backseat in my life's pursuits. But it was, I think in 1965, when I was the Collector of Karimnagar District, now in the Telangana State, my good friend and colleague J. Bapu Reddy, already a well-known Telugu writer by then, believed that my literary excursions were publish-worthy; so he used his good offices to get both of them published by Adarsa Grandha Mandali, Vijayawada, in 1966.

Although technically 'published' these books that meant so much for me once would have gone into oblivion but for the conviction of my nephew BS Murthy (Babu, as we call him) a writer himself and a 'lover of literature', that they deserve a permanent place in the
e-shelf of the Telugu novels. It's thus, he has invested an enormous amount of energy and time to bring my over sixty-year old 'novel' muse into the Telugu e-book world, particularly so in the rehabilitation of Kshantavyulu, క్షంతవ్యులు, for its lone tome in my bookshelf was moth eaten in good measure. So, but for Bapu Reddy these books would never have come into public gaze then and they would not have had a re-birth now but for Babu. I am deeply grateful to both of them.

Thus, after a lifetime of prolific writing in English to some critical acclaim, it is intriguing as well as heartening that, in my fading moments, my literary work in my mother tongue is getting, so to speak, posthumously resurrected.

Now it is left to the readers, whom I urge to read my following విజ్ఞప్తి in the first edition, to judge if all this effort is worth all this while.

విజ్ఞప్తి

చిన్నతనంలో నేనూ, నా మేనకోడలూ పోటీలు వేసుకుని శరత్ సాహిత్యం వేసవి సెలవుల్లో చదివేవాళ్లం. పసి హృద‌యంలోకి శరత్ పాత్రలు శర వేగంతో చొచ్చుకుని పోయాయి. అనిర్వచనీయమైన అశాంతిని రేపినవి. ఆ పాత్రలే ఏనాడైనా నేనూ ఒక నవల రాయాలనే కోరిక నాలో వుద్భవింపజేశాయి. అయినా చాలా కాలం వరకూ నాకు ధైర్యం చాలలేదు; అవకాశమూ రాలేదు. విద్యాభ్యాసం ముగిసి ఉద్యోగాన్వేషణ ప్రారంభించినప్పుడు కలం చేతబట్టి, కళ్లు మూసుకుని ఒకనాటి సంధ్యాసమయంలో కూర్చున్నాను. ఈ నవల అవతరించింది. నా మేనకోడలు ఈ నవల చదివి శరత్ శైలి స్పష్టంగా కనబడుతోంది అంది. అది నిజమే అయివుండవచ్చు. శరత్ సాహిత్యం నాలో జీర్ణించుకుపోయి, నాలోని భావాలనూ, ఆశయాలనూ తీర్చిదిద్దినప్పుడు నా నవలలోంచి ఆ భావాలూ, ఆ ఆశయాలూ తొంగి చూడటం క్షంతవ్యమే అనుకుంటాను!

ఈ నవల రచించి సుమారు ఏడు సంవత్సరాలైంది. దీనిని ప్రచురించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఆత్మ సంతృప్తికి రాసినది అలాగే వుంచాలనుకున్నాను. కాని మిత్రులూ, శ్రేయోభిలాషులూ నాతో ఏకీభవించ లేదు. వారి ఒత్తిడి ఫలితంగానే ఈనాడు ఇది ప్రచురించబడుతోంది. కొన్ని నెలలక్రితం ఈ నవల తిరిగి చదువుతూంటే కొన్ని మార్పులు చేద్దామనే కోరిక కలిగింది. గత ఏడు సంవత్సరాల్లో నాలో కలిగిన అభిప్రాయాల మార్పులను నవల్లో ప్రతిబింబించేలా రాద్దామనుకున్నాను. కాని చివరకు అలా చేయడం మంచిదికాదనే నిశ్చయానికి వచ్చాను. ఆ నిర్ణయం నవల ఔన్నత్యానికే దోహదమవుతుందని ఆశిస్తున్నాను. కాకపోయినా నాచే ప్రప్రథమంగా సృష్టించ‌బ‌డిన‌ ఈ నవలను నేను విసర్జించలేను గదా!

రచయిత

 

చాప్టర్ 1

 

'జీవితంలో ఏంచేసినా నువ్వు కథలు రాయవద్దు రామం'' అని కాలేజీలో తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాప‌కం. ఆయన పండితులు. చాలా ఉద్గ్రంథాలు పఠించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. హరి కథలు కూడా చెప్పినట్లు గుర్తు. అందుచేత ఆయన చెప్పినది నిజమే అయివుంటుంది. అప్పుడు నేను ఆ మాటలను అట్టే పట్టించుకోలేదు. శ్రేయోభిలాషి చెప్పిన సలహా అని, భావించాను. ఈనాడు నేను ఆయన సలహాను ఉల్లంఘిస్తున్నానేమోనని భయంగా ఉంది. అయినా, నేను రాసేది కట్టుకథా కాదు, నవలా కాదు. అయితే ఏమిటది? సరైన సమాధానం నేను చెప్పలేను. కల్పన లేకుండా కథ ఉండదు. కథ లేకుండా నవల ఉండదు. ఇందులో రెండూ లేవు. ఇందులో యథార్థానికి (వాస్తవానికి) దూరములో ఉన్న విషయాలు చాలా తక్కువ.

గత జీవితాన్ని పర్యావలోకనం చేసుకోవాలనే వాంఛ ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. జీవిత సంధ్యాసమయంలోని వేకువఝామున ఇది మరీ ప్రబలంగా ఉంటుంది. ఈ భూమి మీద ఇంతకాలం బ్రతికాను. నేను సాధించినదేమిటి? ఎంతమందిని దు.ఖపెట్టాను? ఎంతమందిని సుఖపెట్టాను? ఇలాంటి ప్రశ్నలు మనస్సులో మెరుపులా మెరుస్తూ ఉంటాయి. అదే కోరిక నాకు ఈనాడు కలిగింది. అయినా ఎంతో సంశయంతో, ఎంతో అనుమానంతో ఈ ప్రశ్నకి సమాధానం వెదకడం మొదలుపెట్టాను.

నా జీవితమంతా వ్యర్ధంగానే గడచిపోయింది. ఆశయంలేని జీవితానికి గమ్యస్థానం కూడా తెలియదు. పుట్టినప్పటి నుంచి, ఇప్పటివరకూ నేనొక దమ్మిడీ కష్టపడి సంపాదించలేదు. చెమటకార్చి నేనెవరినీ పోషించలేదు. చాలా కాలం ఒక స్త్రీ ధనం మీద నేను బతికాను. అది చాలా 'హీనమైన పని' అని చాలా మంది అంటారు. ఎందుచేత? పురుషుని ధనం మీదే స్త్రీ ఎందుకు బతకాలి? స్త్రీ ధనం మీద పురుషుడు ఎందుకు బతకకూడదు? ఈ ప్రశ్నలకి సమాధానం నేనెంత ఆలోచించినా నాకు దొరకలేదు. అయినా పురుషుడు స్త్రీ ధనం మీద బతకడం హీనమైనది కాకపోయినా, వాంఛనీయమైనది మాత్రం కాదు. అందరూ ఎవరి దేహాన్ని వారే పోషించుకోవాలి, స్త్రీ అయినా, పురుషుడైనా ఇతరుల మీద ఆధారపడటం వివేకవంతమైనది కాదు. అదిసరే, 'గతాన్ని గురించి దు.ఖించి లాభమేమిటి?' అని నిటూర్పు విడిచాను, జీవితంలోని వెన్నెలంతా తెలుగుదేశం బయటే గడిపేశాను. అందులో సగభాగం మంత్రముగ్ధునివలె ఒక స్త్రీ వెంట తిరిగాను. ఈనాడు కూడా నాకు ఆశయం లేదు. నివృత్త జీవితం నుంచి నిష్కృతిని నిరీక్షిస్తున్నాను. కాని ఆ రోజులు వేరు. నా సర్వస్వమూ ఆమె గుప్పిటిలో ఇమిడి ఉండేది. ఇంత నిరర్ధకుడి భారం ఆమె ఎందుకు వహించింది? నా కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమెకు నా నుంచి తిరిగి లభించింది శూన్యం. అయినా జీవితపుటంచుల లాగే జీవితపు విలువలుకూడా మనకు తెలియవు. ఒక వ్యక్తి విలువ తక్కెడలో పెట్టి తూచగల శక్తి ఎవరికి ఉంది? ఒకరికి నిరర్ధక జీవిలా కనబడే వ్యక్తి మరొకరికి ప్రేమ పాత్రుడు, ఉత్తముడు గా కనిపిస్తాడు. సృష్టిలోని చిదంబర రహస్యమిదే.

చిన్నతనం నుంచి నేనెవరో ఒకరి ఛాయల్లోనే మెదిలాను, ఎవరో ఒకరి రక్షణలోనే బ్రతికాను, బాల్యంలో తల్లి, చిరుయవ్వనంలో సుశీ ఆ తరువాత యశో.... ఈ ముగ్గురు స్త్రీలు నా వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చారు. కాని వీరి ముగ్గిరి కన్నా మిన్నగా ఇంకొకరి రూపం నా హృద‌యంలో హత్తుకుపోయింది. ఆమే లఖియా, పవిత్ర అనురాగం దాన్ని భూమిమీద నడిచే ఏ స్త్రీ కైనా జతచేయ దలచుకొందేమో నన్నట్లు వుందీమె. ఇక సరళ సంగతి, అందరిలోకి ఆమెకే నేను అన్యాయం చేశాననిపిస్తోంది. ఆమెను నేనుఈ నాటికి అర్ధం చేసుకోలేక పోయాను. హృద‌యాంతరాళంలో ఆమె నన్ను ఏ విధంగా భావించేదో నేను ఎన్నడూ తెలుసుకోలేక పోయాను. ఇక సుజాత, ఆమె కథ విన్నాను. కాని ఎప్పుడూ కలుసుకోలేదు. నల్లటి అందమైన యువతులు కనబడితే స్మృతిపథంలో తళుక్కున ఒక సారి మెరుస్తుంది. ప్రమీలను కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అయినా చివరకు నా జీవితవిధానాన్ని మార్చే ప్రయత్నంలో ఆమె ఎంతో తోడ్పడింది. ఇక మిగిలింది సురేఖ, అపరిచిత బాటసారులుగా వెళ్లి ఆమె ఆతిధ్యాన్ని ఆరాత్రి మేము స్వీకరించాము. ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె సాంగత్యము లభించింది. కోరిన ప్రియుడిని వివాహము చేసుకోగలిగింది.

ఇంకోమాట, నవల రాయడం బొత్తిగా చేతకాదని ముందరే చెప్పాను. నేను రాసేది నవల కాదు, అని నన్ను నేను మభ్యపరుచుకొంటూ దీనిని మొదలుపెట్టాను. నవల దృష్టితో చూస్తే ఇందులో చాలా లోపాలుంటాయి. అయినా నిజం కల్పనకన్నా ఎప్పుడూ మంచిదనే నమ్మకంతో ముందుకు సాగిపోతాను. తెలుగు మాస్టారుని తలచుకొంటూ.

నా ఎనిమిదవ ఏట నేను, నా తల్లిదండ్రులు మద్రాసు వెళ్లాం. అనేకమందిని కోల్పోయిన తర్వాత నేనే వారిద్దరికి మిగిలింది. అందుకని తల్లిదండ్రులకి నేనంటే పంచప్రాణాలు. ముఖ్యంగా మా అమ్మకి ఇక వేరేపని ఉండేదికాదు. మద్రాసులోనే రెండు సంవత్సరాలు వుండి పోయాము. ఎగ్మూరులోని మాయింటి పక్క ఓ ప్లీడరు గారు ఉండేవారు. ఆయన కూడా మాలాగే ఆంధ్రుడు. మా కుటుంబానికి ఆయన కుటుంబానికి చాలా దోస్తీ. ఆయన పదేళ్ల కూతురు సుశీల, నేను ఒకే క్లాసు చదివేవాళ్లం. నేను ఆ ఊరికి కొత్తకనుక నన్ను స్కూలుకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి తీసుకొచ్చే పూచీ మా నాన్నగారు సుశీ పెట్టదలచారు. మొదటి సారి నేను వాళ్లయింటికి వెళ్లినప్పుడు వాళ్ల నాన్న గారు నన్ను సుశీ దగ్గరకు తీసుకెళ్లి ''సుశీ నీకు ఒక కొత్త స్నేహితుడు వచ్చాడు,'' అంటూ పరిచయం చేశారు.

సుశీ కొంచెము బొద్దుగా, నాకంటే బాగా పొట్టిగావుంది. (అప్పటి సుశీ ఫోటో ఇంకా నావద్ద వుంది) పరికిణీకట్టుకొని బుద్ధిగా కూర్చుని బయటికి పాఠాలు చదువుకొంటూవుంది. మేము లోపలికి వచ్చినవెంటనే లేచి నుంచుంది. తండ్రి చెప్పిన మాటలు విని నా ముఖం కేసి తదేకంగా చూసింది. నాకు అంతకుముందు ఆడపిల్లలతో స్నేహం లేదు. అక్క చెళ్లెళ్లు కూడా లేరు. స్త్రీ జాతినంతను మా అమ్మతో ఏకం చేసేవాడిని. ఇంకే ఇతర స్త్రీ ఏ అంతస్తులోనూ నావూహలోలేదు. పసివాడినైనా ఎందుకో ఆమె కళ్లు నాలోని సిగ్గుని బయటకి తెచ్చాయి. నాకంటే పొట్టిగావున్న ఆమె నాకంటె చాలా పెద్దదానిలా కనబడింది. ఏంచేయాలో అర్ధంకాలేదు. కళ్లు క్రిందికి దించేసుకుని ఆ గదిలోంచి బయటకు పారిపోదామని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి చూచి జాలికలిగిందని, ఒక విధమైన మాతృప్రేమ‌ పెల్లుబికిందని సుశీ నాకు తర్వాత చెప్పింది. ఆటలు ఆడుకునే సమయంలో బొమ్మలికి తల్లిగా నటించినట్లే తన కళ్లలోకి చూడటానికి భయపడుతున్న ఆ అబ్బాయిని కూడా బుజ్జగించాలనే కోరిక కలిగిందట.

''నీ పేరేంటి?'' అంది నా దగ్గరకు వచ్చి నా కళ్లలోకి చూస్తూ...

ఇంకా ఆ కళ్లలోకి చూడలేకపోయాను.

"రామం," అన్నాను నేలకేసిచూస్తూ.

''నా పేరు సుశీ... సుశీల,'' అంది నా చెయ్యి పట్టుకుంటూ.

''సుశీ . రామం నీతో స్కూలుకి వస్తాడు జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావాలి,'' అన్నాడు సుశీ తండ్రి.

సుశీ ఆయన మాటలను విన్నా, వాటికి సమాధానం చెప్పలేదు.

నా చెయ్యి పట్టుకుని ''నువ్వు నాకన్నా పెద్దవాడివా? చిన్నవాడివా?'' అంది.

''అది రామానికెలా తెలుస్తుంది. సుశీ . నీకెన్నేళ్లో చెప్పలేదు కదా నువ్వు?'' అన్నారు ఆయన నవ్వుతూ.

''నాకు పదేళ్లు,'' అంది సుశీ, ఆమె చేతిలో నాచెయ్యి అలాగేవుంది.

''నాకు ఎన్నేళ్లో నాకు తెలియదు. మా అమ్మ నాకు చెప్పలేదు,'' అన్నాను నెమ్మదిగా నాచెయ్యి విడదీస్తూ.

''నాకంటె పొడుగ్గా వున్నావు, నా కంటే పెద్దవాడివే అయి వుంటావు,'' అంది నా దగ్గర అలాగే నుంచుని.

''సరే ఇక పద రామం, మీ ఇంటికి వెళ్దాం, రేపు స్కూలుకు వెళ్లేముందు సుశీ మీ ఇంటికి వస్తుంది,'' అన్నారు సుశీ నాన్నగారు.

ఆయనతో నేను బయటికి వచ్చేశాను. సుశీ కూడా మా వెంట వచ్చింది.

ఆ విధంగా నాటుకున్న విత్తనం క్రమక్రమంగా పెరిగి పెద్దదయింది. స్కూలుకి కలిసి వెళ్లేవాళ్లం. కలిసి తిరిగి వచ్చేవాళ్లం. స్కూలులో కూడా ఒకే క్లాసులో ఉండేవాళ్లం, పక్కపక్కన ఇళ్లు కనుక ఇతర సమయాల్లో కూడా కలిసే ఉండేవాళ్లం, మొదటి నుంచి సుశీ నామీద అధికారం చెలాయించేది. స్కూలులో తోటి పిల్లలవద్ద ఎప్పుడూ నన్ను వెనకేసుకుని వచ్చేది. ఏమైనా అల్లరిపని చేస్తే మాష్టారి కంటె ఎక్కువగా సుశే నన్ను మందలించేది. అది నాకేమంత కష్టమనిపించేది కాదు. స్వతంత్రంగా నేను ఎప్పుడూ జీవించలేదు. ఇంటి దగ్గర మా అమ్మ, బయట సుశీ వీరిద్దరూ నన్ను పరిపాలించేవారు. మేము ఒకరిని విడిచి ఒకరం ఒక్కరోజైనా ఉండలేదు. అసలు అలాంటి అవసరమే రాలేదు. ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి, ఇక మద్రాసుని, సుశీనీ వదలవలిసిన సమయం అసన్నమైంది. ఆ మాట విని సుశీ ఏడ్చింది. గోలచేసింది. కాని ఆ చిన్న పిల్లమాట వినేదెవరు? నేనూ ఏడ్చాను, కాని నా ఏడుపు మా నాన్న గారి పేకబెత్తంతో పటాపంచలైంది. మేము మాఊరు వచ్చేశాము. మొదట్లో కొన్నాళ్లు అస్తమానమూ సుశీ జ్ఞప్తికి వచ్చేది. తర్వాత సుశీని క్రమ క్రమంగా మరచిపోయాను.

పద్ధెనిమిది సంవత్సరములయ్యే నాటికి సుశీ ఒక స్మృతిగా మిగిలిపోయింది. ఆమెది 'అప్పటి' ఫొటోని బయటికి తీసి అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని.

అవి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్సు చదివే రోజులు. నేను ఊరిలో ఒంటరిగా బస చేసేవాడిని. కాలేజీ తెరచిన రెండు నెలలకి ఒక అందమైన అమ్మాయి నా క్లాసులో చేరింది. ఆ రోజు సాయంత్రం నేను లాడ్జికి తిరిగి వస్తూవుంటే వెనుకనుంచి ఎవరో పిలుస్తన్నట్టయి వెనుదిరిగి చూశాను. ఆమే కొత్త అమ్మాయి, ఆగమని చేత్తో సంజ్ఙ‌ చేసేంది.

''క్షమించండి. నేను మీ క్లాసుమేట్ని, మీ ఫిజిక్సు నోట్సు ఓ సారి ఇవ్వగలరా?'' అంది నా దగ్గరకు వచ్చి.

నేనుఒక అపరిచిత కాలేజీ యువతితో మాట్లాడటం అదే మొదటిసారి. సుశీని వదలిన తర్వాత ఇంకెవరి సహవాసము నాకు లభించలేదు.

''నా రైటింగ్ బావుండదండీ, ఇంకెవరినైనా అడగండి,'' అన్నాను కాస్త తడబడుతూ.

''ఫర్వాలేదు మీదే ఇవ్వండి,'' అంది.

"కానీ అది నావద్ద లేదండి," అన్నాను ఎలాగైనా తప్పించుకుందామని.

అయినా ఆమె నన్ను వదలలేదు,

''మీతో మీ లాడ్జికి వస్తాను పదండి,'' అంది.

ముక్కూ మొగము తెలియని నాతో లాడ్జికి వస్తానన్న ఆమె మీద ఏహ్యాభావం కలిగిన మాట దాచటం అనవసరమనుకుంటాను. అయినా ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను, 'అందులో తప్పేముంది? నలుగురు అలా అనుకుంటారని అర్థంలేకుండా నేనుకూడా అలా ఎందుకు భావించాను?'

''ఎందుకు మీకింత శ్రమ? నేను రేపు క్లాసుకి తీసుకొస్తాను వెళ్లండి,'' అన్నాను.

''మీతో కాస్త మాట్లాడాల్సిన పనివుందండి. మీరొక్కరేనా రూములో ఉంటున్నది?" అంది కాసేపు నన్ను పరిశీలనగా చూచి,

"ఔనండి," అన్నాను.

"మీకభ్యంతరం లేకపోతే మీతో వస్తాను," అంది.

అభ్యంతరం వున్నా అడ్డు ఎలా చెప్తాను? నాతో రూముకు వచ్చింది.

తీరికగా కూర్చుని, "మీ పేరు తెలుసుకోవచ్చాండీ?'' అని అడిగింది, చెప్పాను. "మీ తండ్రిగారి పేరు?'' అదీ చెప్పాను. ఊరి పేరు సైతం అడగ్గా అదీ చెప్పాను. ఇంతలో ఆమె దృష్టి గోడకు తగిలించివున్న సుశీ చిన్ననాటి ఫొటో మీద పడింది. నా కేసి చూసి తిరిగి ''నేను ఎవరో గుర్తుపట్టలేదా రామం?'' అంది.

ఆమె సుశీ ఫోటోకేసి చూడటం, అలా అడగటాన్ని గ్రహించి 'సుశీ' అన్నాను. సుశీ కిలకిలా నవ్వి 'రామం' అంది. సుశీ స్వతహాగా అందగత్తె అని నాకు తెలుసు. కానీ ఇంత అందంగా తయారవుతుందని నేను ఊహించలేదు. స్త్రీలు యవ్వన ప్రవేశానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. సన్నగా, పొడుగ్గా, నాజూగ్గా ఉంది. అంతా మరిచిపోయి ఆమెకేసి తేరిపార చూస్తున్నాను.

''అలా చూస్తావేంటి రామం? అపరిచిత వ్యక్తిలా?'' అంది సిగ్గుతో కళ్లు క్రిందకు దించుకుని.

''నువ్వే ఆ సుశీవంటే నమ్మలేకపోతున్నాను. చాలా మారిపోయావు,'' అన్నాను ఆశ్చర్యంగా.

''మీరూ మారిపోయారు. అయినా క్లాసులో చూసినప్పుడే అనుమానం వేసింది. అందుకే మీ వెంట వచ్చాను,'' అంది.

 

చాప్టర్ 2

 

కొన్ని కొన్ని సంఘటనలు, ముఖ్యంగా మనమెన్నడూ ఆశించననవి, జీవిత కాలక్రమాన్నే మార్చేస్తాయి. తిన్నగా సాఫిగా సాగుతూన్న జీవితపు బాట వక్రమార్గాలు తొక్కుతుంది. దీనికి కారణం వెతకటం అవివేకమూ, అవాంఛనీయమూ కూడాను. లోకాన్ని చూసిన పెద్దలు క్రింద పెదిమ నొక్కిపెట్టి 'విధిచేష్టలు' అంటారు. ఏమో అయివుండవచ్చు, కానీ ఈ విధి, ఈనియంత, ఇంత పక్షపాతంగా ఎందుకు ఉంటాడా అని అసహ్యం వేస్తూవుంటుంది. ఎవరైనా సుఖపడుతూంటే ఇతగాడు ఓర్వలేడు.

ఏమయితేనే, సుశీ సాంగత్యమూ, స్నేహమూ నాకు లభించాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత పసి యవ్వనంలో తిరిగి ఈమె నాకు దొరికింది. సంతోషించానని వేరే చెప్పాలా? ఆనందంగా, ఆహ్లాదంగా, కులాసాగా ఆ సంవత్సరము గడిపేశాము. క్లాసులో సుశీకి ఎప్పుడూ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. సుశీ కొంటెగా ''నన్ను చూసి మార్కులు వేస్తున్నారు, జర్మన్ ప్రొఫెసర్ కి నేనంటే చాలా ఇష్టం తెలుసా'' అంది.

ఓసారి క్లాసులో జర్మన్ ప్రొఫెసర్ బ్లాకు బోర్డు మీద 'ఇష్ లీజర్ జీ మేర్' అని జర్మన్ లో రాసి, సుశీని ఇంగ్లీషులోకి తర్జుమా చేయమన్నాడు. అంటే దాని అర్ధం, 'నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అని, సుశీ నిస్సందేహంగా తర్జుమాచేసింది. క్లాసు అయిపోయింది. తర్వాత "ఈ రాత్రి ప్రొఫెసర్ నిద్రపోడు, బట్టతల గోక్కుంటూ కూర్చుంటాడు," అంది.

రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను శరవేగంతో మారిపోతున్నాయి. సాయం సమయాల్లో సుముద్రతీరానికి వెళ్లేవాళ్లం. విరామరహితంగా విరుచుకుపడే కెరటాలను చూస్తూ చీకటిపడేదాక ఉండిపొయే వాళ్లం. ఒక రోజు సాయంకాలం లాజన్సేబేవద్ద ఇసుకలో కూర్చొని ఉన్నాము. ఎందుచేతో సుశీ ఆ రోజు పరధ్యాన్నంగా ఉన్నట్లు కనబడింది. చీకటి పడిపోయింది. కాని లేచి రూముకు పోవాలనిపించడం లేదు. సుశీకూడ లేచే ప్రయత్నం చేయలేదు.

''ఇసుకలో ఏమని రాశానో చెప్పుకో,'' అన్నాను.

నా పక్కనే ఉన్న సుశీ ముఖకవళికలు స్పష్టంగా కనబడటంలేదు. కాని పెదిములు విడచుకుని తెల్లటి రెండు పళ్ల వరుసలు కనబడ్డాయి. బుగ్గలమీద రెండు గుంటలు పడ్డాయని ఊహించుకున్నాను. ఎందుకంటే చిరునవ్వుకి వాటికి ఏదో అవినాభావ సంబంధము ఉందని నాకు తెలుసు.

''ఇంకేమి రాస్తావు? నీవు ఎప్పుడూ ఆలోచించే ఆ ఒక్కటేగా," అంది.

''తప్పు చెప్పావు, సుశీల అని రాయలేదు. సుశీ అని రాశాను,'' అన్నాను.

"రెండింటికి తేడాయేమిటో?" అంది.

''సుశీల నా క్లాసుమేటు, సుశీ నా బాల్య స్నేహితురాలు, ఫిజిక్సునోట్స్ తోపాటు తిరిగి నేను ఆమెకు దొరికాను,'' అన్నాను.

''అవును, ఇంతకీ నువ్వు నాకు నీ ఫిజిక్సు నోట్సుఇవ్వనేలేదు రామం. ఆనాడు మరచిపోయాను,'' అంది.

''దాంతో ఇక అవసరమేముంది సుశీ, అది నీకు వంక మాత్రమే కదా,'' అన్నాను.

''నన్ను గురించి నువ్వేమనుకున్నావు? 'మీ రూముకు తీసుకెళ్లమంటె' నువ్వేమని భావించావు,'' అంది.

''చాలా ఆశ్చర్యపోయాను, ఒక అపరిచిత యువతి అలాంటి పని చేస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ సుందరాంగి సుశీ అనే అనుమానమే నాకు కలుగలేదు,'' అన్నాను.

''అవును; అదే స్త్రీ పురుషులకున్నతేడా, పురుషుని జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. కాని స్త్రీకి అదే సర్వస్వము. జీవిత కాలంలోని అనుక్షణము అందుకే అర్పిస్తుంది. స్త్రీ హృద‌యాన్ని అలా ఎందుకు సృష్టించాడో నాకు తెలియదు. బహుశా సృష్టికర్తకి కూడా స్త్రీ అంటే చిన్న చూపేయేమో. ఎందుకంటె దానివలన స్త్రీకి లభించేది దు.ఖం మాత్రమే,'' అంది.

సుశీ మాటల్లోని సత్యాన్ని ఇప్పుడు గ్రహించినంత సుస్పష్టంగా నేను అప్పుడు గ్రహించలేదు. నాకు అది నిరూపించవలసిన దౌర్భాగ్య స్థితి కలిగింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె మాటలకంటే ఆమె కంఠస్వరం నన్ను వ్యాకులపరచింది. ఆ విధంగా ఆమె ఎప్పుడూ అంతకుముందు మాట్లాడలేదు. సీరియస్గా దేని గురించి సుశీ మాట్లాడేది కాదు. అలాంటి చిన్న విషయాలను గురించి చింతించటం ఆమె స్వభావానికే విరుద్ధం. నేను అన్నమాటలు ఆమె హృద‌యాన్ని గాయపరిచాయని గ్రహించాను. అనాలోచితంగా అపరిచిత యువతి అన్నాను – చిన్ననాటి సుశీని చాలావరకు మరచిపోయిన మాట నిజమే.

చీకటి నలుమూలలా దట్టంగా వ్యాపించింది. కనుచూపు మేరలో ఉన్న సముద్ర తీరమంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నురుగలు కక్కుకుంటూ సముద్రం భీకరంగా ఉంది. దూరాన వున్న ఓడలోని దీపాలు, ద్వీపంలోని భవనపు దీపాన్ని జ్ఞాప్తికి తెస్తున్నాయి. మలుపు తిరుగుతున్న కారులైటు కాంతి మా ఇద్దరిమీద ఒక సారి పడింది.

''చాలా ఆలస్యమయినట్టుంది... సుశీ ఇక పోదామా ...'' అన్నాను.

''అప్పుడేవద్దు. రేపు ఆదివారం కదా? ఇంకా కాసేపు కూర్చుందాము,'' అంది.

నేను ఇంకేమీ మాట్లాడలేదు. రూముకు పోవాలనే తొందర నాకూ లేదు. కొన్ని నిమిషాలు గడిచిపోయాయి. నిద్రిస్తున్న నిశ్వబ్దాన్ని భంగపరుస్తూ సముద్రం ఘోషపెడుతూంది. ఎవరో ఒక జంట మా ముందు నడిచి వెళ్లేరు. సముద్రానికి ప్రేమికులకు యుగయుగాల నుంచీ సంబంధముంది. సాగర గర్భంలో ఎంత మంది ప్రేమికులు ఇమిడి ఉండలేదు. సముద్రం మీద ఏకాంత యాత్ర ఎంత మధురంగా ఉంటుంది. సముద్ర తీరం ప్రేమ కలాపాలకి ఎంత అనువైన స్థలం!

''చదువైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు, '' అంది సుశీ హఠాత్తుగా.

''ఏం చేస్తాను సుశీ . అందరూ చేసేదే నేనూ చేస్తాను, ఏదో ఒక ఉద్యోగం దొరకక పోతుందంటావా?'' అన్నాను.

"నువ్వు ఉద్యోగం చేస్తావా? అయితే చూడాలని ఉంది. కాని అది నీకు సరిపడదు,'' అంది సన్నగా నవ్వుతూ.

''ఉద్యోగం చేయక ఇంకేమిచేస్తాను సుశీ? హోటలు పెట్టమంటావా?'' అన్నాను నవ్వుతూ.

''అదికాదు, నువ్వు బహుశా కవివి అవుతా వేమో . లేకపోతే రచయిత అవుతావు . చిన్నతనంలో నువ్వు పాడుకధలు చెప్పి అందరినీ భయపెట్టే వాడివికాదా,'' అంది.

''లేదు సుశీ! అదేమీ సులభం కాదు. కవి కావాలన్నా, కవిత్వం రాయాలన్నా సత్యాన్ని అసత్యం నుంచీ, సంభవాన్ని అసంభవము నుంచీ, శుచిత్వాన్ని కల్మషం నుంచీ, విడదీసి విశదీకరించ గలిగే ఆత్మ పరిశోధనా శక్తి కావాలి. విజ్ఞానం అనుభవంగానూ, అనుభవం విజ్ఞానంగానూ, రెప్పపాటు కాలంలో మార్చగలిగే శక్తి కావాలి. బాహ్యనేత్రానికి కనబడని దానిని మనో నేత్రంతో పరిశోధించ గలిగే శక్తి కావాలి. అదిలేకుండా కలం కాగితంమీద పెట్టడం దుర్లభం, అది దుస్సాహాసం అవుతుంది. కేవలం మనం దేనినీ ఊహించి సృష్టించ‌లేము. అస్థిపంజరం లేకుండా శరీరాన్నీ ఊహించుకోలేము అలాగే ఆత్మలేకుండా మానవుడే ఉండడు,'' అన్నాను.

''కవిత్వం చేతకాదంటూ కవిత్వం మీద ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చారు,'' సుశీ ఈ మాటలు అంటూంటే ఒక పెద్ద కెరటం వచ్చి మా ముందర విరుచుకుపడింది. తరువాత భయపడుతూ, భయపడుతూ బుల్లి బుల్లి కెరటాలు సుశీ పాదాలను ముద్దుపెట్టుకున్నాయి.

''సుశీ! నాకు ఈ సముద్రాన్నీ, ఈ నురుగనీ చూస్తుంటే టాగూర్ రాసినది జ్ఞాపకం వస్తూంది. సముద్రతీరం సముద్రాన్ని అడిగిందట ... 'నీ కెరటాలు నిరంతరం చెప్పడానికి ప్రయత్నిస్తున్నదేమిటో రాసి చూపించు.' సముద్రం నురుగుతో పదే పదే చెప్పదలచుకున్నది రాసి, నిరాశా నిస్పృహ‌ల‌తో ఆ అక్షరాలను చెరిపివేసిందట'…అంటే దాని అర్థం ఆగమనంలోనే పురోగమనం ఇమిడి ఉందని కదా! సముద్రంలాగే మానవుడికి కూడా అందని అంతస్తులో అర్రులు చాచే ఆభరణం ఒకటుంటుంది. దానిని అందుకునే ప్రయత్నంలోనే చెయ్యి జారిపోయే విధానం కూడా ఇమిడి ఉంటుందని కదా?'' అన్నాను.

''అయివుండవచ్చు. అవును నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. తప్పు సముద్రానిది కాదని తెలుస్తూనే ఉంది. అయితే ఇంకెవరిది? దానినిసృష్టించిన‌వారిదే కదా? వారెవ్వరు? నిన్ను, నన్నూ సృష్టించిన‌ వారే కదా?'' అంది.

అప్పుడు నా ఆశ్చర్యానికి మేరలేదు, సుశీ ఎందుకీవాళ ఇలాఉంది. ఎన్నోసార్లు నేను ఇలా మాట్లాడుతూవుంటే మందలించేది. రాబోయే దానిని రహస్యంగా ఆమె అంతరంగం గుర్తించగలిగిందా? అయితే రాబోయేదేమిటి?

''అదిసరే, ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం మనము, '' అంది.

''అది నాలుగు సంవత్సరాల తర్వాత సంగతి కదా , అప్పుడు మనమెలా ఉంటామో, ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు,'' అన్నాను మాట తప్పించుకుందామని.

సుశీ మనస్సుని ప్రాపంచక విషయాల మీద మరలించడానికి అడిగిన ప్రశ్న అది. అయినా అది కూడా సరైన ప్రశ్న కాదు.

''మీ కేమీ ఆ భయం అక్కర్లేదు, అప్పటికి నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు,'' అంది.

ఈ మాటలు పరధ్యానంగా అన్నట్టు కనబడింది. మనస్సు ఎక్కడో విహరిస్తున్నట్టుంది.

''ఏమో సుశీ. జరగబోయే దానిని గురించి ఎవరికి తెలుసు?'' అన్నాను.

''అంటే నీ ఉద్దేశం ఏమిటి రామం? అంత నిగూఢంగా ఎందుకు మాట్లాడుతున్నావు?'' అంది.

''నిగూఢంకాదు సుశీ. గమ్యస్థానం తెలియని గుడ్డివాడిని చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు తీసుకువెళ్లాలి కదా? ఆశయంలేని వారికి అసహాయత విషం లాంటిది,'' అన్నాను.

''గమ్యస్థానం నీకేకాదు ఎవరికీ తెలియదు. నువ్వేమీ గుడ్డివాడివి కాదు. అయినా నా చెయ్యి మీకు ఎప్పుడూ లభిస్తుంది, అనవసరంగా భవిష్యత్తును గురించి ఆలోచించకు రామం. దాని వలన కలిగే లాభమేమిలేదు. మన ఇద్దరి జీవితాలు ఒకే పంథాతో నడుస్తాయి, ఆ భారం నేను వహిస్తాను,'' అంది.

ఇక్కడ కాస్త ఒక విషయం విశదీకరించాలేమో! సుశీ నన్ను అప్పుడప్పుడు 'మీరు' అని సంబోధించేది; అప్పుడప్పుడు అలవాటు ప్రకారం 'నువ్వు' అనేది, ఈ విధం తెలుగు భాషలోనే స్పష్ఠంగా కనబడుతుంది. ఇంగ్లీషులో ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ''యూ'' అనే పదానికి రెండు అర్ధాలు వస్తాయి. ఏదయితేనేం ఒక సారి 'ఎందుకు సుశీ ఈ బాధ? అలవాటు ప్రకారమే 'నువ్వు' అని పిలవకూడ దూ,' అన్నాను.

సుశీ ''ఇప్పటినుంచీ అలవాటు చేసుకోకపోతే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అందరి ఎదుట చిన్నతనంగా ఉండదా?'' అంది.

''స్త్రీలకు పురుషులతో సమానహక్కులు కావాలని ఇంటికప్పు లెక్కి అరచే వనితలలో ఒక దానివి కదా నువ్వు? మొన్న దాని మీద ఒక చిన్న ఉపన్యాసం కూడా యిచ్చావు. అందులో టాగూర్ నాటకం చిత్రాంగదలో చిత్ర చెప్పిన మాటలు ఉదహరించావు. 'నేను చిత్రని. పూజ చేసే దేవతను కాదు. అడుగులొత్తే దాసీనికాను. నీ సర్వస్వంలోనూ నాకు సమభాగం కావాలి' అంటూ చెప్పావు. అలాంటప్పుడు భార్య భర్తని మీరు అని ఎందుకు పిలవాలి? భార్యని భర్త ఎందుకు అలా సంబోధించకూడదు,'' అన్నాను.

''అవును అదీ నిజమే. కాని మనం సమాజంలో కొన్ని కొన్ని నియమాలకు బద్ధులమయి ఉండాలి. అంటే నా ఉద్దేశం అన్నింటికి తల ఒగ్గమని కాదు. ఆత్మ గౌరవాన్ని అణగతొక్కే వాటిని ప్రతిఘటించాలి. కానీ అందువలన కలిగే నష్టమేమీ లేదు. మీరు నాకంటే ఆరు నెలలు పెద్ద వారు. ఎలాగైనా పెద్దవారిని గౌరవించాలి కదా!'' అంది.

''నీకంటే ఆరు నెలలు చిన్నవాడినైతే ఏం చేద్దువు సుశీ?'' అన్నాను.

''చెయ్యడానికేముంది? అదే విధంగానూ అడ్డురాదు మన దారికి,'' అంది.

''కాని మన సమాజం అది ఒప్పుకోదు కదా! ఇది తల ఒగ్గవలసిన కట్టుబాటు కాదా?'' అన్నాను.

''కాదు. భార్యకన్నా భర్త ఒక మెట్టు పైన ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు పెట్టిన నియమం ఇది. ఈనాడు ఇది అర్థంలేనిది,'' అంది.

''అలా అయితే నన్నునువ్వు అని పిలిచేదానివా?'' అన్నాను.

''అవును. అల్లరిచేస్తే చెవులుకూడా మెలివేసేదానిని,'' అంది నవ్వుతూ.

''మన ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది సుశీ?'' అన్నాను.

''ఇంకెవరిది? నాదే, నేనే కాదు..మీరు ఎవరిని కట్టుకున్నా ఆమెదే అవుతుంది. మీ స్వభావమే అంత,'' అంది ధీమాగా .

ఆమె మాటలు నాకేమంత కష్టం కలిగించలేదు. ఆమె చెప్పినదే నిజమనిపించింది. తల్లిదండ్రులకి ఏకైక పుత్రుడిని అవటం వల్ల వచ్చిన నష్టమిది. సుశీ నామీద అనవసరమైన అధికారం చెలాయిస్తుందనే భయం నాకు కలుగలేదు, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుందనే విశ్వాసం నాకు. ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ నామాట చెల్లేది. మా ఇద్దరి మధ్య ఆనాడు ఉన్న సంబంధం ఈనాడు నాకు ఎంతో విచిత్రంగా కనబడుతుంది. భూతకాలాన్ని వర్తమానపు దీపంతో పరీక్షిస్తూంటే ఎప్పుడూ మేము ప్రేమ వాక్యాలు చెప్పుకునేవాళ్లం కాదు. వాటి అవసరం ఎప్పుడూ కలగలేదు. ఒకరి హృద‌యం ఇంకొకరికిస్పష్టంగా తెలుసు. అక్షర శబ్దాలని మించిన అనురాగం అది. సుశీ అప్పుడప్పుడు ఆమె చెప్పదలచుకొన్నది నేత్రాలతో వ్యక్తం చేసేది. ఎప్పుడైనా నేను కాలేజికి వెళ్లకపోతే ఆ సాయంత్రం నారూముకి వచ్చేది. తలుపు తోసుకొని రూములోకి వస్తూన్నప్పుడు ఆమె కళ్లు చూస్తే అప్పుడు నాకు వాటిలో ఆమె హృద‌యమంతా అద్దంలోని ప్రతిబింబములా కనపడేది. 'క్లాసులో ఈవేళ ఏం చేప్పారు?' అని అడిగితే, నవ్వుతూ ఏమో నాలుగు మాటలు చెప్పేది. ఇంక నేనేమి అడిగేవాడిని కాను, పాఠాలు వినలేదని స్పష్టంగా తెలిసిపోయేది.

''హోటలు భోజనం నీకు పడటంలేనట్టుంది,'' అంది ఒక సారి,

''నీకు హాస్టలు భోజనం పడుతోందా?'' అన్నాను.

''ఎందుకు పడటంలేదు, నేను నిక్షేపంలా ఉన్నాను,'' అంది. సుశీ ఏమీ నిక్షేపంలా వుండేది కాదు, పేలగా, పల్చగా, బలహీనంగా కనపడేది. చాలాకాలం అది ఆమె శరీర తత్వమే అనుకునేవాడిని. కాని చిన్నతనంలో ఎంత బొద్దుగావుండేదో జ్ఞాప‌కం వచ్చి అప్పుడప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. అయినా ఆ మార్పుని యవ్వనానికి అంటగట్టేవాడిని, ఇలా ఉంటేనే అందంగా ఉంది కదా? అలాంటప్పుడు ఎందుకు విచారించాలి? క్లాసులో నవ్వుతూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ ఉంటే ఎంత కొంటెగా, ఎంత మనోహరంగా ఉంటుంది? ఒకసారి మా ఇంగ్లీషు మాస్టారు అది కనిపెట్టి వేశారు. అయినా ఆయన పిల్లలున్నవాడు, ఇలాంటి అనుభవాలున్న తండ్రి, అందుకు ఊరుకున్నాడు. సుశీ ఈ సుఖం క్షణికమూ, శాశ్వతమూ అని నాలో నేను అప్పుడప్పుడు తర్కించుకుంటూండేవాడిని.

వేసవి సెలవలకి ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకొన్నాము. ఇంటివద్ద నుంచి మా నాన్న గారు గట్టిగా ఉత్తరం రాశారు. మేమిద్దరం దసరాకు, సంక్రాంతికి కూడా ఇంటికి పోలేదు. ఇక తప్పదనుకుని సుశీ మద్రాసుకు, నేను రాజమండ్రికి బయలుదేరాము. నేను కనీసం వారానికొకసారైనా ఉత్తరం రాస్తానని వాగ్దానం చేశాను. వెళ్లేముందు రెండు నెలలబట్టి సుశీ ఆరోగ్యం సరిగా ఉండేదికాదు. ఏదో నీరసంగా ఉండేది. ఏమిటంటే ఏమీ లేదు వేసవికాలం అనేది.

నేను రాజమండ్రి వచ్చి ఒక పక్షంరోజులయి ఉంటుంది. ఏమీతోచేదికాదు. ఎప్పుడూ సుశీ జ్ఞప్తికి వచ్చేది. నాహృద‌యవేదనను తెలియపరుస్తూ ఒక పెద్ద ఉత్తరం రాసి ఇలా ముగించాను. 'దైవం నీకూ నాకూ ఈ కలయిక ఎందుకు ఏర్పాటు చేశాడో నాకే తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం సుశీ. ఈ కలయిక ఏలాంటిదైనా, ఎలా ఏర్పడినా నిన్ను మాత్రం ఇక వదలదలచుకోలేదు. నా చేతుల్లోంచి జారిపోయిందనుకున్న వజ్రం నాకు అనాయాచితంగా, సునాయాసంగా తిరిగి లభించింది. ఎందుకు మళ్లీ పారవేసుకోవాలి? దైవం నీకు శుభం చేకూర్చు గాక!'

దీనికి జవాబుగా ఒక వారంరోజులకి టెలిగ్రాం వచ్చింది. అందులో తాను బయలుదేరి వస్తున్నాననీ, స్టేషనులో కలుసుకోమనీ ఉంది. మొదట నాకది అర్ధంకాలేదు, తర్వాత ఒంటరితనం భరించలేక వచ్చేస్తుందనుకొని ఆనందించాను.

ఆవేళ స్టేషనుకు వెళ్లాను సుశీకి స్వాగతం చెప్పడానికి. కాని రైల్లో నుంచి దిగిన సుశీ నేను ఊహించిన సుశీ కాదు. 'దిగినది' అనటంకన్నా 'దింపబడింది' అనటం ఉచితమనుకుంటాను. నేను ఒక క్షణం కొయ్యబారిపోయాను. ఒక చెయ్యి తల్లి భుజం మీద భారంగా వేసి, రెండవ చేత్తో తండ్రి చెయ్యి పట్టుకుని సుశీల అనే జీవచ్ఛవం రైళ్లో నుంచి నీరసంగా నాకేసి చూసి నవ్వుతూ దిగింది. సుశీల తండ్రి నా కంగారు చూసి భుజుం తట్టి ''తర్వాత అంతా చెప్తాను రామం. ముందర ఒక ట్యాక్సీ పిలుచుకురా'' అన్నాడు. నేను అక్కడనుంచీ కదిలేస్థితిలోలేను. కళ్లు చీకట్లు కమ్మాయి. ఆయనే బయటకు వెళ్లారు. తర్వాత ఆయన చెప్పిన సారాంశం ఇది...

సుశీ వాళ్ల ఊరు వెళ్లిన తర్వాత నీరసంతోపాటు దగ్గుకూడా పట్టుకుందట. అతినీరసపడిపోయింది. డాక్టరుకు చూపిస్తే సుశీలని పీడీస్తున్నది 'క్షయ' అనే మహా పిశాచం అని తేల్చాడట. సుశీని మాద్రాసులోనే హాస్పిటలులో చేర్పించుతానన్నాడట సుశీ తండ్రి. సుశీ తనను రాజమండ్రి శానిటోరియంలో చేర్పించమందిట, అందుకనే ఇక్కడికి వచ్చారు.

సుశీ నాతో మాట్లాడిన మొదటి మాటేమిటంటే ''మీ వజ్రం కోసం మీరు ఎవరితో పోరాడాలో తెలుసా?'' అంది.

''ఎవరితో పోరాడాలో వారిని ప్రార్థిస్తాను అది నాకు దక్కనివ్వమని,'' అన్నాను, చేతులుజోడించి.

 

చాప్టర్ 3

 

నా హృద‌యపు ఆరాటాన్ని, ఆవేదననూ నేను చెప్పలేకపోతున్నాను. నాకు బాల్యం నుంచీ దైవం మీద అచంచలమైన విశ్వాసం ఉండేది. చిన్నతనంలో రామనామం జపిస్తే దెయ్యాలు పారిపోతాయని నమ్మేవాడిని. అదే నమ్మకంతో నేను సుశీని రక్షించుకోగలనని నమ్మాను. ఎవరినైతే నేను నమ్ముకున్నానో వారు సుశీని నా నుంచీ వేరు చెయ్యరని ఆశించాను.

డాక్టరుని కలుసుకొని సుశీని దక్కనివ్వమని అడిగాను. ఆయన నాకేసి తేరిపార చూసి ''ఆమె మీకేమవుతుంది'' అన్నారు.

''అవవలసినంతా అవుతుంది డాక్టరుగారు. ప్రపంచంలో ఈమె కంటే నాకు అప్తులెవరూ లేరు. ఆమెను నేను మీ చేతుల్లో పెడుతున్నాను,'' అన్నాను.

''ఫర్వాలేదు, త్వరలోనే కనుక్కున్నారు... ఇలాంటి కేసులు చాలా నయమయ్యాయి, అయినా మీరు ఇక్కడ దొరకని మందులు విదేశాలనుంచి తెప్పించుకోవాలి,'' అన్నారు.

నాకు ఆ సమయంలో డబ్బంటే చాలా హీనంగా కనబడింది. ''డాక్టరుగారు, మీరు డబ్బు గురించి ఆలోచించకండి. ఎంత డబ్బయినా ఖర్చుపెడ్తాను. చివరకు నా ప్రాణం అయినా ఇస్తాను కావాలంటే, ఆమెను నయం చెయ్యండి,'' అన్నాను.

''నీ ప్రాణం నేనేం చేసుకుంటాను, కానీ నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను,'' అన్నారు, ఆయన నవ్వుతూ.

నా శక్తులన్నీ కూడతీసుకుని ఆమెను రక్షించుకోటానికి రంగంలో దిగాను. సుశీ వద్దంటూన్నా రాత్రి పగలు, తన పక్కనే కూర్చునేవాడిని.

''ఇది పాడు రోగము. నా వద్దకు రావద్దంటూంటే మీకు వినబడదా?'' అంది ఒక రోజున తను కొంచెము కోపంగా ముఖంపెట్టి,

''నాకేమీ ఫర్వాలేదు సుశీ. కాని నాక్కూడా ఈ రోగం వస్తే మరీ మంచిది. అప్పుడేమీ ఈ అడ్డంకులుండవు. హాయిగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుని చక్కగా ఎప్పుడూ కబుర్లు చెప్పుకోవచ్చు. చావటం తప్పకపోతే ఇద్దరమూ చద్దాము,'' అన్నాను నేను నవ్వుతూ.

మొదటిసారిగా సుశీ కళ్లల్లో నీరు అప్పుడే నేను చూశాను. వ్యాకుల కంఠంతో ''ఛీ, ఛీ. అలాంటి మాటలనకండి. అసలు మన మిద్దరమూ కలుసుకోక పోయినట్లైతే ఎంత బావుండును. ఎక్కడో చచ్చేదానిని,'' అంది.

సుశీ నోటివెంట అలాంటి మాటలువస్తే నేనెలా సహించగలను. కట్టతెగిన ప్రవాహంలా ఒక ఆశ్రుధార సుశీ శుష్క వక్షస్థలం మీదుగా ప్రవహించింది.

రోజులూ, వారాలూ గడిచిపోతూన్నాయి. సుశీ ఆరోగ్యం బాగవుతూంది, ప్రక్కన కూర్చుని వేళ తప్పకుండా మందులు ఆహారం ఇచ్చే వాడిని, నర్సులు నేను లేనప్పుడు వేళాకోళం చేసేవారట.

''అతను మీకేమవుతాడు?'' అని అడిగితే ''నా కాబోయే భర్త'' అని చెప్పేదట. ఎందుకలా అన్నావని అడిగితే ''ఏం! కారా?'' అంది. ఆ ఒక్కమాట నాకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్నీ ఇచ్చింది. ఆమెలో కోరికలున్నాయి. అదేచాలు.

కాని ఒక్కొకప్పుడు ఎంతో విచారంగా కుంగిపోయి మాట్లాడేది.

''నేనొకమాట చెప్తాను వింటారా?'' అంది ఒకసారి మంచంమీద లేచి కూర్చుని.

''చెప్పు సుశీ. ఎందుకు వినను,'' అన్నాను.

''నేనొకవేళ చనిపోతే మీరు... '' అని ఏదో అనబోయింది.

''అలాంటి మాటలనకు సుశీ. నాకు చాలా బాధ కలుగుతుంది. నీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది. నాకు తెలుసు,'' అన్నాను నెమ్మదిగా చెయ్యి ఆమె నోటిమిద పెట్టి.

సుశీ నెమ్మదిగా చెయ్యితీసి తన చెంపమీద పెట్టుకొని పక్కకు ఒరిగిపోయింది. నేను ముఖం పక్కకు తిప్పి చూద్దునుగదా, సుశీ కళ్లలోంచి స్వేచ్ఛగా, నిరాటంకంగా అశ్రుధార స్రవిస్తోంది.

 

చాప్టర్ 4

 

రెండు మాసాలు గడచిపోయాయి. సుశీ చాలావరకూ కోలుకుంది. టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసింది. శరీరం నిగనిగలాడుతూ ఉండేది. గండం గడిచిపోయిందనుకున్నాను. డాక్టరు కూడా అదే అన్నారు. ఇంకొక నెల లోపున పూర్తిగా తగ్గకపోతే ఆపరేషన్ చేస్తానన్నారు.

నేను ఒక రోజున మా ఇంటికి భోజనానికి వచ్చాను. అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టబోయే సమయానికి మా బంట్రోతు గబగబా పరుగెత్తుకుంటూ వచ్చి ''చిన్నబాబుగారు, అయ్యగారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. చిన్నమ్మగారి నోట్లోంచి రకతం పడుతూంది'' అన్నాడు. అలాగ ఎప్పుడూ అంతకుముందు జరగలేదు.

నేను వెంటనే అక్కడికి వెళ్లి చూసిన దృశ్యం నేనెన్నటికి మరువలేను.

సుశీ మంచంమీంచి క్రిందకు వంగి రక్తం కక్కుతూంది. సుశీ తల్లి, తండ్రి ఇద్దరూ కూడా ఆమెను పట్టుకోలేకపోతున్నారు. పక్కనిండా నెత్తురు, ఒంటి నిండా నెత్తురు. ఎర్రటి నెత్తురులో అక్కడక్కడ చిన్న మాంసపు కండలున్నాయి. ఇంతలో డాక్టరు వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. కొంత సేపటికి నెత్తురుపడటం తగ్గింది. కానీ సుశీకి వంటిమీద సృహ‌లేదు, ఆశాజ్యోతి ఆరిపోయే సమయం ఆసన్నమైందా అనే భయంతో వణికిపోయాను. కాని ఆ దినం గడిచిపోయింది. అయినా నెత్తురుపడటం తగ్గిపోలేదు, అలా జరిగినప్పుడల్లా తోకతెగిన పాములా కొట్టుకునేది. అంత కన్నీరు నాలో ఎక్కడ దాగివుందో. సుశీని చూసినప్పుడల్లా కళ్లు నీటితో నిండిపోయేవి. ఇక సుశీకి ఆ బంధనాల నుంచీ శాశ్వత విముక్తిలేదని గ్రహించాను.

''నేను ఎలాగా చచ్చిపోతాను. అయితే నేను ఏమయిపోతాను? మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి పోతాను చెప్పండి? నాకు మిమ్మల్ని విడిచిపోవాలని లేదు, నేను పోతే మీరు చాలా బాధపడతారు కదూ,'' అంది ఒకసారి సుశీ అయాసపడుతూ,

అలాంటి మాటలు విని నేనెలా సహించగలను?

''నువ్వు చనిపోవటానికి వీల్లేదు సుశీ. ఎన్నటికీ వీల్లేదు. నేను చనిపోనివ్వను. నువ్వు నాకోసం జీవిస్తావు. లేకపోతే నేనూ చచ్చిపోతాను,'' అన్నాను సుశీ చెయ్యి తీసుకుని నా హృద‌యం వద్ద పెట్టుకుని.

''ఛీ, ఛీ. నేను చనిపోతే మీరు చనిపోవటమేమిటి? మీరింత పిరికివారా? నేనెవర్ని మీకు? అసలు మీకూ నాకు సంబంధం ఏమిటి? ఏదో కొంచెం స్నేహం కలిగింది అంతే,'' అంది సుశీ గబుక్కున చెయ్యి లాక్కుని.

ఆ చివరి మాటలు ఆమె హృద‌యంలోంచి రాలేదన్న విషయం నాకు బాగా తెలుసు.

ఈ విధంగా ఒక పక్షంరోజులు దినదిన గండంగా గడచిపోయాయి. డాక్టరు వద్దంటున్నా, మా తల్లిదండ్రులు ఎంత బతిమాలినా, సుశీ ఎంత మందలించినా ఆమె దగ్గరే రేయింబగళ్లు గడిపేవాడిని. అమావాస్య కాలం సమీపిస్తూంది. 'నాకేమయినా సరే, ఈ తిరిగిరాని కాలాన్ని వృధా చెయ్యను. సుశీ పోయిన తర్వాత నేనేమవుతే ఏమిటి?' అని నిశ్చయించుకున్నాను.

సుశీ పరిస్థితి నానాటికి క్షీణించిపోతూంది. నా వజ్రాన్ని కాపాడమని భగవంతుడ్ని అహర్నిశలూ ప్రార్థించేవాడిని. ''సుశీని కాపాడు, కావాలంటే నన్ను తీసుకుపో'' అని రోదించేవాడిని.

ఆనాడు సుశీ పరిస్థితి మరీ విషమించి పోయింది. డాక్టరు చివరి గండం గడవటం చాలా కష్టమని చెప్పారు. డాక్టరుని తీసుకుని సుశీ వద్దకు వెళ్లాను. సుశీ నరకయాతన అనుభవిస్తుంది. డాక్టరు ఇంజక్షన్ ఇస్తానంటే మొదట చెయ్యి చాచలేదు. బలవంతాన చివరకి యివ్వగలిగేడు. కాని మరుక్షణంలోనే ఆమెకు స్పృహ‌పోయింది. మరికొంత సేపటికి స్పృహ‌ వచ్చింది. కాని మాట పోయింది.'సుశీ, సుశీ.' అని ఎంతో సేపు పిలిచిన మీదట ఆమె కళ్లు విప్పింది. నాకు ఏదో చెప్పాలని ఎంతో ప్రయత్నించింది. నాకేమి అర్థం కాలేదు. అప్పుడు డాక్టరు ''తన తల మీ ఒడిలో పెట్టుకోమంటూంది.'' అన్నాడు. సుశీకేసి చూశాను. ఆమె 'అవును' అన్నట్లు తల ఊపింది.

ఒక సారి నేను అలా చేస్తానని మాట ఇచ్చాను. సమయానికి ఆమె జ్ఞప్తికి తెచ్చేవరకూ అది మరచేపోయాను. ఆమె కోరిక ప్రకారం చేశాను. అలా చేసిన వెంటనే నేను సర్వం మరచిపోయాను. నాకు అప్పుడు కనిపించినదీ తెలిసినదీ ఒకటే. నాకోసం విధితో పోరాడే సుశీ... ఆమెమీద ప్రేమతో పెల్లుబికే నా హృద‌యం.... అంతే. మిగతాదంతామరచిపోయాను. 'సుశీ, సుశీ'' అంటూ పిచ్చివాడిలా అరచాను. సుశీ ఒక సారి కళ్లుతెరచి చూసింది. ఆచూపుతోనే నాకు వీడ్కోలు చెప్పింది. ఒక సారి చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించింది. పెదిమలు వణికాయి. ఆ పరిస్థితిలో ఆ శ్రమకు కూడా ఆమె తట్టుకోలేక పోయింది. కళ్లు మూసేసింది. అంతే, అందమైన కనురెప్పలు ఇక తెరుచుకోలేదు. డాక్టరు పల్సు చూస్తున్నారు. నేను బయటకి వచ్చేశాను. నాకేసి చూడనీ, నన్ను పలకరించనీ….సుశీని నేను ఇక చూడలేకపోయాను. జరగాల్సిన తతంగం అంతా జరుగుతూంది. ఇక నేనెందుకు.

 

చాప్టర్ 5

 

ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో ఒక పీడకల వచ్చినట్టయింది. మా అమ్మ దగ్గరకు వెళ్లి ''రాత్రి ఏదో పాడుకల వచ్చింది. సుశీకి ఎలావుందో ? ఆస్పత్రికి ఇప్పుడే వెళ్లి వస్తాను'' అన్నాను. ఆమె కళ్లలోని కన్నీరు చూడగానే సుశీ నిజంగా మరణించిందనే విషయం స్ఫురణకు వచ్చింది. అప్పుడు నాకు కళ్లవెంట నీరు రాలేదు. కళ్లు చీకట్లు కమ్మాయి. అక్కడే కూలిపోయాను.

సుశీ మరణం నాజీవితంలోని అతి ముఖ్యమైన సంఘటన. అది నాలోని కోరికలని, నమ్మకాల్ని సమూలంగా వూడబెరికింది. దైవం మీద నా విశ్వాసం సడలింది. భవిష్యత్తులో నా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, చేష్టలనీ తీర్చిదిద్దింది. దైవం నాకు అన్యాయం చేశాడనే అభిప్రాయం నా హృద‌ యంలో హత్తుకుపోయింది. అది ఎన్నడూ మాసిపోలేదు. చనిపోయినా సుశీకి నేను అన్యాయం చేయకూడదనే దృఢ‌ నిశ్చయానికి వచ్చాను. జీవితంలో ఇక వాటిని గురించి యోచించకూడదనుకొన్నాను. చాలా కాలంవరకు ఆ నిశ్చయానికి కట్టుబడివున్నాను.

ఆ తర్వాత ఇంకొక వ్యక్తి నా జీవితంలో ప్రవేశించి, నన్ను మభ్యపరచి నా మనస్సు కాజేసింది . అయినా చాలా కాలంవరకూ నా హృద‌యంలో సుశీ కే నేను మొదటిస్థానం ఇచ్చాను. సుశీ స్మృతిని నేనెన్నడూ కలుషితం చెయ్యలేదు. క్షణకాలంకూడా ఆమెను పూర్తిగా మరచిపోలేదు. కాలానికి మానవునికి ఇష్టాయిష్టాలతోప్రవేయం లేదు. నిరంతరంగా నిర్నీతరహితంగా అది ముందజ వేస్తూంది. మానవుని దు.ఖానికి అది కంటతడి పెట్టదు. సుఖానికి చిరునవ్వు నవ్వదు. నా విషయంలో కూడా అదే జరిగింది. జీవచ్ఛవంలా కాలము గడిపాను. సుశీని నానుండి దూరం చేసింది మానవుడు కాదు, ఎవరినైతే బాల్యము నుంచి నమ్ముకుంటున్నానో ఆ దైవమే యిలా చేశాడు. ఇలా శిక్షించటానికి నేను సుశీ చేసిన దోషమేమిటీ? దైవం ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని త్వరగా ఈ లోకం నుంచీ తనవద్దకు తీసుకుపోతాడు అంటారు. నిజమేకావచ్చు. సుశీని ఆయన ప్రేమించాడంటే నేను ఆశ్చర్యపడను. అదే నా ఆఖరి ఓదార్పు.

భగవద్గీతలో మరణమంటే భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక మాసిన చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుక్కోవటం మాత్రమే అని రాసి వుంది. అది నిజమో కాదో నాకు తెలియదు కాని ఒక విషయం మటుకు సుస్పష్టమైంది. కొత్త చొక్కా తొడుక్కున్న పిదప తను ఒకప్పుడు పాతచొక్కా ధరించాననే విషయం మానవుడు మరచిపోతాడు, అతడికి పూర్వజన్మ జ్ఞానమే ఉంటే పాత చొక్కా మార్చటానికి అంగీకరిస్తాడా? అయితే పూర్వ జన్మవుంటే పునర్జన్మ కూడా ఉండే ఉండాలి కదా. సుశీ ఎక్కడైనా పునర్జన్మించిందా? నేను ఆమె తలపుతో సతమతమవుతూంటే ఆమె ఒక పసిపాప రూపంలో వుగ్గుపాలుతాగుతూందా? ఇలాంటి ఆలోచనలు నన్ను అనుక్షణమూ వేధించేవి.

కొన్నాళ్లు పోయిన తర్వాత తిరిగి కాలేజీలో చేరాను. చదువులో మునిగి దుఃఖము మరచిపోదా మనుకున్నాను. అలా సాధ్యపడలేదు. ప్రతి స్థలమూ, ప్రతి వస్తువూ సుశీ స్మృతులను జ్ఞప్తికి తెచ్చేది. క్లాసులో పాఠం వింటూంటే సుశీ నాకేసి కొంటెగా నవ్వుతున్నట్లు కనబడేది. కాలేజీ నుంచి తిరిగి వస్తూంటే వెనుక నుంచీ ఎవరో పిలిచినట్టయ్యేది. దారిలో ఒక స్త్రీ కంఠం ''మీ ఫిజిక్సు నోట్సు ఒక సారి ఇస్తారా?'' అని అడుగుతున్నట్టు అనిపించేది.

అవి అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన రోజులు. బతకాల్సిన కాలం ఇంకా చాలా వుండి ఉంటుంది. శేష జీవితమంతా ఇలాగే గడపవలసిందా? అంతకంటే వేరే మార్గము కనబడలేదు. సుశీని దైవం ప్రేమించాడు. అందుకని ఆమెను తీసుకుపోయాడు. నన్ను కూడా అలాగే ప్రేమించాడనటానికి నిదర్శనాలు లేవు.

 

చాప్టర్ 6

 

ఆనర్సు చదువు పూరైంది. ఆ వేసంగి శలవులు ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో గడుపుదామనుకున్నాను. తల్లిదండ్రులు కాదనలేదు. అయితే ఎక్కడికి వెళ్లాలి? ఏదైనా ఒక హిల్ స్టేషన్ కు వెళ్తే, వేసవికాలం చల్లగా బాగుంటుంది. మా నాన్నగారు ముస్సోరీ వెళ్లమన్నారు. ఆయన ఆప్తమిత్రుడొకాయన బాగా డబ్బు గడించి అక్కడ స్థిరపడిపోయాడు. నాగురించి ఆయనకు రాస్తే తప్పకుండా అక్కడకు పంపించమని నొక్కి రాశారు. ''నాకు కొడుకూ, కూతురూ సర్వస్వమూ అయిన మా యశోకి మీ రామానికి ఏమీ తేడా చూపించనని మాటయిస్తున్నాను. నువ్వు రాసిన ఉత్తరం, నేను ఎన్నాళ్లు నుంచో ఎదురు చూస్తూవున్న సంఘటనలా నా మనస్సు పదే పదే చెప్తోంది. ఇది భగవత్సంకల్పం. సందేహం లేదు,'' అని రాశారు ప్రసాద్ గారు.

సరే, అక్కడకు బయలుదేరటానికే బెడ్డింగు చుట్టాను. నాన్నగారు ఆయన మిత్రుడికి టెలిగ్రాం ఇచ్చారు. కలకత్తా నుంచి ఆ ఎక్స్ ప్రెస్ రెండు రాత్రులు ఒక పగలూ ప్రయాణం చేసి డెహ్రడూన్ ప్లాటుఫాం మీదకి చేరి ఆగింది. పెట్టె, బెడ్డింగు దింపి ప్లాటుఫాం మీద నుంచున్నాను.

"'నాన్నా! ఆయనేమో", అన్న ఒక స్త్రీ కంఠం విని పక్కకు తిరిగి చూశాను.

ఒక ముసలాయన, ఒక యువతీ నావైపు నడిచి వస్తున్నారనిచూసి ఆగాను

''నాయనా, నువ్వే కదూ మా శేషు కొడుకు రామానివి? '' అన్నారు ఆ ముసలాయన దగ్గరకు వచ్చి.

''ఔనండి. నమస్కారం, మీరు ప్రసాద్ గారు కదా?,'' అన్నాను.

''అవునయ్యా ,నీ కోసమే ఎదురు చూస్తున్నాము. పద బయటకు వెళ్దాం. అన్నట్టు మరచిపోయాను. ఈవిడే మా అమ్మాయి యశో," ఆయన ఎంతో ఆప్యాయంగా అన్నారు,

అంతవరకూ ఆమెను నేను సరిగా చూడనేలేదు. అంత చక్కటి అమ్మాయిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. బంగారపు ఛాయ ఆమెది. శిల్పి చెక్కిన విగ్రహంలావుంది. పసుపుపచ్చటి పట్టుచీర కట్టుకుంది.

''నమస్కారమండీ,'' అంది నాకేసి చూసి సన్నగా నవ్వుతూ.

ఆ నవ్వుతో నా మనస్సుతో సదా మెదిలే సుశీ రూపం జ్ఞప్తికివచ్చింది. జవాబివ్వకుండా అలాగే చూస్తున్నాను.

''పద నాయనా బయటకు వెళ్దాం, బాగా అలసి పోయినట్లున్నావు. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ డెహ్రడూన్,'' అన్నారు ప్రసాద్ గారు.

ముగ్గురమూ బయటకి బయలుదేరాము. బయట కారులో సామానుపెట్టి బయలుదేరేముందు ఆమెకు ప్రతి నమస్కారం చెయ్యలేదని జ్ఞాప్తికి వచ్చి, ''నమస్కారమండీ,'' అన్నాను.

''ప్రతి నమస్కారమండీ,'' అంది యశో నవ్వుతూ.

శశి చనిపోయిన తరువాత మొదటిసారిగా నేను నవ్వు అణచుకోలేక పోయాను.

ఆమె అయితే నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూస్తూఉంది. నాలో దేనినో వెదకుతున్నట్టనిపించింది. బలవంతాన నవ్వు ఆపుకుంటూన్నట్లు కూడా అనిపించింది. యశో చాలా కొంటెపిల్లని గ్రహించాను.

పాములా వంకలు తిరిగి ఉన్న ఆ రోడ్లమీద కారు పరుగెడుతూంది. కవులు ప్ర‌కృతి సౌందార్యాని కెందుకు ముగ్ధులయ్యారో నాకు అప్పుడు తెలిసింది. ఎత్తైన ఆ కొండలు జలజలా ఆ రోడ్డుమీదకే వురికే జలపాతాలు కన్నులపండువగా ఉన్నాయి. మలుపుతిరిగితే ఎదురయ్యే మబ్బుల దృశ్యం మనోహరంగా ఉంది.

పక్కనే కూచున్న ప్రసాద్ గారికి భయపడో ఏమో డ్రైవర్ కారు నెమ్మదిగా పొనిస్తున్నాడు. ముగ్గురమూ మౌనంగానే ఉన్నాము.

ఇంతట్లో 'అబ్బా! ఎంత బావుంది' అంది యశో మమైకమయిన కంఠంతో. నా పక్కన కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ తన్నుతాను మరచి అన్నమాటలివి. పచ్చటి ఆమె ముఖం మీద ముంగురులు నాట్యం చేస్తున్నాయి. ఉదయభానుని లేత సూర్యరశ్మి ఆమె ముఖానికొకింత శోభనిస్తూంది. మనోరంజకమైన ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాను.

''ఏమిటో ఈ నేచర్ ని చూస్తూవుంటే నన్ను నేను మరచిపోతాను. ఇలాంటి ప్రదేశం ఎలా వదిలిపెట్ట బుద్ధి పుడుతుంది చెప్పంది,'' అంది హఠాత్తుగా ఆమె నా వైపు తిరిగి కాస్త సిగ్గుపడుతూ...

''అవును నాయనా యశోకి ప్ర‌కృతి అంటే తీరని పిచ్చి, ముస్సోరి వదిలి ఎక్కడకు రానంటుంది,'' అన్నారు ప్రసాద్ గారు.

ముస్సోరి చాలా మనోహరంగా ఉంది. ఏవైపు చూసినా చల్లటి మేఘాలు చక్కలిగింతలు పెడుతున్నాయి. అక్కడక్కడ దట్టమైన మబ్బులు ఒక గజంలోని వస్తువుల్ని కూడా మరుగుపరుస్తున్నాయి.

ఆఖరికి వారి బంగళా చేరేము. బయట ఒక ముసలి బంట్రోతు ఉన్నాడు. .

''ఈ కారు మాది కాదండోయ్. ఒక స్నేహితురాలి వద్ద పుచ్చుకున్నాను,'' అంది యశో మేము కారు దిగుతుంటే.

ఆమె అలా అనటం కాస్త అసభ్యంగా వుందనిపించింది నాకు.

''రామదీన్. సామాను మేడమీద అమ్మాయి పక్కగదిలో పెట్టించు. పద నాయనా, లోపలికి పద,'' అన్నారు ప్రసాద్ గారు అతనితో.

 

చాప్టర్ 7

 

ఆరోజు మధ్యాహ్నము నేను నిద్రలేచి మేడమెట్లు దిగి వస్తూన్నాను. క్రింది గదిలో యశో ఎవరితోనో మాట్లాడుతూంది. యశో అంటోంది ''అబ్బ. నేను రాలేను రాజేంద్రబాబు. ఈ ఒక్కరోజుకి నన్ను క్షమించలేరా?''

అతగాడు ఏమి జవాబిచ్చాడో నాకు సరిగా వినబడలేదు కాని మరల యశో అంది, ''నన్ను విసిగించకండి రాజేంద్రబాబు. నేను రావడానికి ఎంత మాత్రము వీల్లేదు.''

ఈసారి కంఠస్వరాన్ని హెచ్చించి అతను, ''అతిథులు మీ ఇంటికి రావటం ఏమీకొత్తకాదు. యశో, అతిథులు ఇంట్లో వుండగా పిక్చర్సుకీ, పిక్నిక్ కీ నాతో చాలాసార్లు వచ్చావు. అసలు ఈ అతిథి ఎవరు? నీకు ఇంతట్లో అతని మీద ఇంత అనురాగము ఎలా పుట్టుకొచ్చింది. నాకు జవాబులు కావాలి ఈ ప్రశ్నలకి,'' అంటున్నాడు.

నేను తిరిగి పోదామనుకుంటూంటే యశో నన్ను చూసింది. ఇంకా ఏమైనా అంటాడేమోనని ఆమె లేచి నుంచుని ''అప్పుడే వచ్చేసారే క్రిందకి, మీరు. రాత్రి సరిగా నిద్ర వుండివుండదు. మిమ్మల్ని మెలకువ వచ్చేవరకు లేపవద్దని అన్నారు నాన్నగారు,'' అంది.

నేను ఇక తప్పదనుకుని క్రిందకు వచ్చాను. యశో లేచి చిరునవ్వు తెచ్చుకుని నన్నతనికి పరిచయం చేసింది. ''ఈయన రాజేంద్ర కుమార్. ఈ ఏడాదే యం.బి.పాసయ్యాడు. డూన్ లో ప్రాక్టీసు పెట్టారు. నాన్నగారికి బాగా తెలుసు. ఈయన అప్పుడప్పుడు వస్తూంటారు.''

చివరి రెండు వాక్యాలూ అసందర్భమనిపించాయి నాకు. లోపలి నుంచి ప్రసాద్ గారు వచ్చారు.

''ఏమమ్మా యశో. మీ ముగ్గురూ యేమైనా ప్రోగ్రాం వేసుకున్నారా?'' అన్నారాయన మా ముగ్గురినీ చూసి

''లేదు నాన్నా. ఈ వేళేకదా వచ్చారు ఈయన. ఇప్పుడే అన్నీ చూపిస్తే తర్వాత ఏం చెయ్యటం? ఈ రోజు మన ఇల్లంతా చూపిస్తాను, మళ్లీ మరచిపోకుండా,'' అంది యశో.

రాజేంద్ర మాకేసి కాస్త కోపంగా చూస్తున్నాడు. ఆయనని చూస్తే నాకు కాస్త జాలివేసింది.

''పోనీ, మీరు ఆయనతో కలసి బయటకు వెళ్లిరాకూడదా? నేను ఈలోపు సామాను సర్దుకుంటాను,'' అన్నాను.

రాజేంద్ర చిరునవ్వు నవ్వాడు.

''అయితే నన్ను అప్పుడే వదలించుకోవాలని చూస్తారా? అయినా నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను. ఇంకొక సంగతి రామంబాబూ. నన్ను ఎందుకు 'మీరు' అని సంబోధిస్తున్నారు. లేకపోతే నా పేరు మీకు నచ్చలేదా చెప్పండి. 'యశో' అని పిలవటం ఇష్టంలేకపోతే 'రాజ్యం' అని పిలవండి. నా పూర్తిపేరు 'యశోరాజ్యం' అనే సంగతి మీకు తెలియదనుకుంటాను,'' అంది యశో కొంచెం కోపంగా

నాకు యశోమీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఆమె నలుగురి ఎదుట అతిథిని అలా ఎందుకు పరాభవించింది? ఇది అపరిమిత అనురాగమా లేక అంతులేని అహంకారమా? అదీకాక అంతమంది ఎందుట ఆమె అప్రస్తుత సంభాషణకి నేను కాస్త సిగ్గుపడ్డాను.

''సరేలేండి అలాగే పిలుస్తాను,'' అని మళ్లా జ్ఞాప‌కానికి వచ్చి ''సరే యశో. అలాగే పిలుస్తాను.'' అన్నాను.

యశో నా ఎదుట తనతో బయటకి రా నిరాకరించినందుకు రాజేంద్ర బాధపడుతున్నట్టు కనిపించాడు. కొంచెంసేపు పోయిన తర్వాత అతను వెళ్లిపోయాడు. వెడుతూ వెడుతూ నన్ను వాళ్ల ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానించాడు.

తరువాత యశో నన్ను వెంటబెట్టుకుని వాళ్ల బంగళా చూపించటానికి దారితీసింది. ఆపని ఒక అరగంటలోనే అయిపోయింది. అది ఒక వంక మాత్రమేనని గ్రహించాను. వాళ్ల ఇంట్లో తిరుగుతున్నంత కాలమూ నేనేమీ మాట్లాడలేదు. యశో కూడా చాలా ముక్త సరిగా ఉంది.

అంతా అయిపోయి నేను గదిలోకి వెళ్తుంటే, యశో వరండాలో నుంచుని,

''మిమ్మల్ని ఒక్క మాట అడిగితే కోపంరాదుకదా రాంబాబు,'' అంది.

''నేనెవరిని నీమీద కోపగించటానికి ? అడుగు,'' అన్నాను నేను వెనుదిరక్కుండానే,.

''ఇందాక మీరు రాజేంద్ర, మా నాన్నగార్ల ఎదుట నన్ను ఎందుకు అవమానించారు,'' అంది.

నేను ఆశ్చర్య చకితుడనయ్యాను.

''యశో, నేను నిన్ను అవమానించలేదు. అవమానించింది నువ్వు, రాజేంద్రని. ఇది చాలా స్పష్టమైన సంగతి,'' అని దృఢంగా, కాస్త కఠినంగా అన్నాను.

యశోలో ఆవేశం హెచ్చింది.

''మీతో సరదాగా కబుర్లు చెప్పుదామని ఇంట్లో ఉండిపోదామంటే, నన్ను బయటకి వెళ్లిపోమనటం అవమానించటం కాదా? నేను మీతో ఉండటం మీకు ఇష్టంలేదని, నన్ను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పటం కాదా? ఇక రాజేంద్ర సంగతి. ఆస్తమానమూ ఆయనమాటే చెల్లాలా. నామాటకు విలువలేదా? ఈ ఒక్కరోజుకే నన్ను క్షమించమంటే ఆయన ఎందుకు అంత పట్టుపట్టాలి?'' అంది తీక్షణంగా.

ఆమె అన్నిమాటలు అంత రుసువుగా మాట్లాడగలదని నేను ఊహించలేదు. కాస్సేపు మాట్లాడలేదు.

''నేను అంతదూరం ఆలోచించలేదు, యశో ఆలోచించివుంటే నేనలా అనేవాడిని కాదేమో. నేనెంతసేపూ రాజేంద్ర విషయమే ఆలోచించాను. నీ సంగతి గుర్తుకు రాలేదు ఎందుచేతనో?'' అన్నాను.

అయినా యశోకి కోపం పోలేదు.

''కాదు మీరు కావాలనే అన్నారు. నన్ను నలుగురి ఎదుట చిన్నబుచ్చాలనే అన్నారు,'' అంది తల అడ్డంగా తిప్పుతూ.

''అయితే నన్నిప్పుడేమి చేయమంటావు యశో. నా సత్సంకల్పాన్ని రుజువు చేసుకోవడానికి నేనేం చెయ్యాలి? అయినా నేను ఒక సంగతి అడుగుతాను. నన్ను అతిథిగా మాత్రమే చూస్తూన్నావా లేక ఇంకొక విధంగా చూస్తున్నావా? నా ఈ రెండు ప్రశ్నలకి జవాబివ్వాలి,'' అన్నాను నేను నీరసంగా.

''చెప్పమంటారా?'' అంది నా ముఖంలోని పరిశీనగా చూస్తూ.

"'చెప్పు యశో,'' అన్నాను.

''ఉహూ! ఇప్పుడుకాదు. మరొక్కప్పుడు చెప్పుతాను. ఈ స్థితిలో మీరు అర్థం చేసుకోలేరు,'' అని చరచరా తన గదిలోకి వెళ్లిపోయింది.

ఆ రోజు రాత్రినా అలవాటు ప్రకారం చాలా సేపటి వరకు చదువుతూ మేల్కొని వున్నాను. తలుపు ఎవరో తట్టినట్టయి ''ఎవరు. రామదీన్, లోపలికి రా,'' అన్నాను.

లోపలికి వచ్చింది యశో! రామదీన్ కాదు.

''టైమెంత అయిందో మీకేమన్నా తెలుసా? ఇంకా మేలుకునే వున్నారెందుచేత? నిద్రపోవాలనే ఆలోచన మీకున్నట్టులేదు,'' లోపలికి వస్తూ అంది.

''నాకు ఆలస్యంగా పడుకోవటం అలవాటు యశో,'' అన్నాను నేను నవ్వటానికి ప్రయత్నిస్తూ.

ఆమె ముందు నేనొక చిన్నపిల్లవాడినైపోయాను.

''ఈ అలవాటు ఎందుకు చేసుకున్నారు? అలవాటుకు కూడా మొదలు అంటూ వుంటుంది కదా? ఇంత పెద్దవారైనా మీ ఆరోగ్యం సంగతి మీరు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? ఇక్కడున్నంతకాలం మీ ఆరోగ్యం సంగతి మా బాధ్యత. దయతో ఇది జ్ఞాప‌కముంచుకోండి. ఇవాళే రామదీనుతో చెప్తాను... పది గంటలకల్లా ఇంట్లో లైట్లన్నీ ఆర్పివేయమని,'' అంది.

యశో నా చేతుల్లోంచి పుస్తకము తీసుకుని లైటు ఆర్పివేసింది. యశో వెంటనే వెళ్లిపోతుందనుకున్నాను కాని ఆమె అక్కడేనుంచుంది.

''యశో ఇంకా ఇక్కడేవున్నావా?'' అన్నాను ఆశ్చర్యంగా.

''అవును, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని ఉన్నాను,'' అంది నిబ్బరంగా.

''అయితే ఆలస్యందేనికి అడుగు,'' అన్నాను

''మీ పేరు నాకు నచ్చలేదు. ఇంకోక పేరు పెట్టి పిలువాలని అనుకుంటున్నాను. మీ ఆజ్ఞ అయితే.''

''ఏమని పిలుస్తావు? ఏదైనా జంతువు పేరు పెడ్తావా లేక రాక్షస స్మరణ చేసుకుంటావా?'' అన్నాను ఆచీకటిలో నవ్వుతూ.

"బాదల్ బాబు, కాదు, బాదకబాబు,' అంది యశో ఏదో స్వప్నాల్లో తేలుతున్నట్టుగా

నా ఆశ్చర్యానికి అంతులేదు. ఈ పేరు నేనంతకు ముందు ఏనవల్లో కూడా చదివిన గుర్తులేదు.

''అంటే ఏమిటి? అసలు నీకు ఈ కోరిక ఎందుకు కలిగింది. చెప్పు యశో?'' అన్నాను.

''ఆ విషయం మీరెప్పుడూ అడుగకూడదు. అయినా ఆ విషయం బహుశా రానురాను మీకే తెలుస్తుంది,'' అని ఆమె తలుపువైపు వెళ్లిపోతోంది ఆనిపించింది.

''అందరి ఎదుటా అలాగే పిలుస్తాను యశో?'' అన్నాను అనాలోచితంగా నేను.

''అంటే మీ ఉద్దేశం ఏమిటి? నలుగురి ఎదుటా అలా పిలిస్తే సిగ్గుపడతారా? సరే. అయితే ఇది మీ ముద్దు పేరు,'' అంది యశో.

నా జవాబుకి ఎదురు చూడకుండా గబ గబా బయటకు వెళ్లిపోయింది.

ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. యశో మాటల అర్థం నేను అస్సలు గ్రహించలేకపోయాను. అతి గారాబంగా పెరిగిన యువతి ఈమె అనిమాత్రం అర్ధమైంది . కారులో తల బయటకు పెట్టి 'అబ్బా ఎంత బావుంది' అన్న యశోకి, కోపంతో ప్రజ్వరిల్లిపోతూ 'మీరు నన్ను కావాలని అవమానించారు' అన్న యశోకి, చివరికి చీకట్లో 'మీ పేరు నాకు నచ్చలేదు' అన్న ఆమెకి నాకేమి పోలికలు కనబడలేదు. ఒక్క రోజులో ఈమె ఇంత చనువు నానుండీ ఎలా సంపాదించింది? ఈమెకు సుశీ విషయం తెలియదా? మా నాన్నగారు ఆ విషయం యశో తండ్రికి రాశారనే ఉద్దేశంతో నేనున్నాను, అయితే ఈయన తనతో ఆ విషయం చెప్పలేదా? ఏమయితేనేం, మనస్సులో ముద్రితమైన సుశీ ఛాయా పటాన్ని నేను చెరపలేను. అయితే ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న. నా కర్తవ్యం ఏమిటి?

 

చాప్టర్ 8

 

మరునాడు నిద్రలేచేటప్పటికి చాలా పొద్దుపోయింది. కళ్లు తెరచేటప్పటికి ఎదురుగుండా యశో నా బట్టలు సర్దుతూ కనబడింది.

''నీ కెందుకు యశో ఈ పనులన్నీ ? నేను సర్దుకుంటాను తర్వాత,'' అన్నాను, నేను లేచి కూర్చుని.

''ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందర ముఖం కడుక్కుని రండి, లేక మీకు పాచిపళ్లతో కాఫీ తాగటం అలవాటా?'' నవ్వుతూ అంది యశో.

నిజం చెప్పాలంటే నిద్రలేచిన వెంటనే కాఫీ ముందరవుంటే గడగడా తాగేస్తాను. కాని ఎందుకో యశో ఎదుట అది చెప్పడానికి భయం వేసింది. వెంటనే మంచంమీంచి లేచి బాత్రూములోకి వెళ్లిపోయాను.

నేను తిరిగి వచ్చేటప్పటికి యశో గదిలో లేదు. ఒక ఫ్లాస్కు, ప్లేటులో టిఫినూ, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ''బాదకబాబూ. ఫ్లాస్కులో కాఫీవుంది. మీరు స్నానం చేసి సిద్ధంగా ఉండండి. మనం బయటకి వెళ్తున్నాం'' అని ఉంది.

ఒక గంట పోయిన తర్వాత నేను యశో క్రిందికి వస్తూంటే ప్రసాద్ గారు ఎదురయ్యారు.

''యశో. ఎక్కడకు ప్రయాణం?'' అడిగారు ఆయన

''ఈయన్నిసరళ దగ్గరకు తీసుకువెళ్తా నాన్న,'' అంది యశో.

సరే అని ఆయన వెళ్లిపోయారు.

''సరళ ఎవరు యశో? ఆమె దగ్గరకి నేనెందుకు?'' బయటికి వచ్చిన తర్వాత నేనడిగాను.

"సరళ నా స్నేహితురాలు, వాళ్ల నాన్నగారు బాగా ధనవంతులు. మిమ్ములను గురించి సరళకు చాలా చెప్పాను. ఆమెకు మిమ్మల్ని చూపించి నా పందెం గెలుచుకుంటాను,'' అంది యశో నవ్వుతూ.

నాకేమీ అర్థంకాలేదు.

''ఏమిటిదంతా యశో. నా గురించి సరళకు ఎప్పుడు చెప్పావు? పందెం ఏమిటి? నేను నిన్ననేగా ఇక్కడికి వచ్చాను. అంతకుముందు నా గురించి నీకేమీ తెలియదుగా?'' అన్నాను.

''కంగారు పడకండి. బాదకబాబూ. రావటం మీరు నిన్ననే వచ్చారు ఇక్కడికి. కానీ, మీకోసం చాలా కాలం నుంచీ ఎదురుచూస్తూ ఉన్నాను. లేకపోతే ఒక్కరోజులో మీతో ఇంత చనువు ఎలా ఏర్పడింది చెప్పండి? సరళతో ఇదే చెప్పాను. ఆమె నమ్మలేదు. ఇవాళ మిమ్మల్ని చూపించి హాకిమన్స్ లో డిన్నరూ, పిక్చరూ అడుగుతాను మన ఇద్దరికీ,'' అంది.

యశో పెదవులమీద చిరునవ్వు వెలుగుతూంది. ముఖములోంచి గర్వమూ, అహంభావమూ తొంగి చూస్తూన్నాయి.

అక్కడకి దగ్గరలోనే ఉంది ఈ సరళ ఇల్లు కూడా. ఇంటిని బట్టి ఇంటి యజమాని బాగా ధనికుడని గ్రహించాను. ఇల్లు దగ్గరకు వచ్చిన వెంటనే యశో "సరళా, సరళా" అంటూ లోపలికి పరుగెత్తింది.

యశో కేకలు విని మేడమీదనుంచి ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి యశోని కౌగిలించుకుంది. బాగా పొడుగ్గా ఉంది. ఆమె యశో అంత తెలుపు కాకపోయినా మొత్తం మీద తెలుపనే చెప్పాలి. నిండైన విగ్రహం, చిలిపి కళ్లు, ఆమెలో కొట్టవచ్చినట్లు కనబడుతున్నాయి.

''ఏమిటి యశో. ఇవాళ చాలా హుషారుగా ఉన్నావే. ఇవాళ మీ ఇంటికి ...ఎవరు ఆయన? నీతో వచ్చారా?'' అంది అమె.

యశో అమె చెవిలో ఏదో చెప్పింది.

''ఏమిటి యశో. ఆయనని అలా నిలబెట్టేశావు. ఆయనకు నన్ను పరిచయం చెయ్యవా?''అమె నవ్వుతూ అంది.

యశో నన్ను సరళకు పరిచయం చేసింది. కొంటెతనంలో యశో కంటె ఆమె ఒక ఆకు ఎక్కువే చదివిందని గ్రహించాను.

ముగ్గురమూ కూర్చున్నామూ. సరళ నా గురించి చాలా ప్రశ్నలు వేసింది, అన్నింటికి నేను సమాధానం చెప్పాను. ఇక ప్రశ్నలు అయిపోయాయి. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కృత్రిమ‌మైన‌ నిశ్శబ్దం గదినిండా వ్యాపించింది. దానిని భంగపరుస్తూ యశో,

''హాక్ మన్స్ కి ఎప్పుడు వెళ్దాం? ఈ సాయంకాలం నీకేమైనా పనివుందా? మీ నాన్న నిన్ను ఇంటికి కాపలా కాయమనలేదు కదా?'' అంది.

''లేదు యశో, నాన్న గారు ఈ వేళ పొద్దున వెళ్లిపోయారు. రెండు నెలలదాకా తిరిగిరారు. ఈ లోపున ఈ ఇంటికి నేనే యజమానురాలిని,'' అంది సరళ నవ్వుతూ.

''అరే, ఎంత శుభవార్త. అన్నీ కలిసొచ్చాయి. రామంబాబు రావటం మీ నాన్న బెడ్డింగు చుట్టటం ఒక సారే జరిగాయి. అయితే సాయంకాలం ప్రొగ్రాం మారదు కదా?'' అంది యశో.

''సరే అలాగే చేద్దాం, సాయంత్రం మిమ్మల్ని తీసుకుపోతాను,'' అని, 'ఇప్పుడే వస్తాంటూ' సరళ లోపలికి వెళ్లిపోయింది.

కాసేపటిలో ఒక ప్లేటులో యాపిల్స్, టీ ట్రే పట్టుకు వచ్చింది. యశో ఒక యాపిల్ తీసుకుని కొరకటం మొదలుపెట్టింది. నేను తినటానికి తటపటాయిస్తూవుంటే యశో కనిపెట్టింది.

''అరే, మీరు తినటంలేదే? ఎందుచేత? ఓహో, సరళా, ఒక కత్తి పట్టుకురా ఈయనకి, యాపిల్ ని ముక్కలుగా కోసి నోటికందిస్తే గాని తినరుకాబోలు,'' అంది తను.

ఆ అప్రస్తుత మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. సరళ లేచి లోపలికి వెళ్లబోతే నేను వద్దన్నాను. అయినా ఆమె లోపలికి వెళ్లి కత్తి తెచ్చింది. యశో యాపిల్ ని కోయడానికి వుద్యుక్తురాలైంది. దాంతో నా కోపం మిన్నంటింది.

"యశో, నీవు ఆ యాపిల్ ను ముక్కలుగా కోసావంటే, నేను యాపిల్ నే కాదు, ఆసలేదీ ముట్టుకోను,'' అన్నాను పరిసరాల్ని మరచిపోయి.

యశో, సరళ నాకేసి బిత్తరపోయి చూస్తున్నారు. నామాటలు నాకే ఎంతో కటువుగా వినిపించాయి.

''ముక్కలుగా కోయడానికి చాలా టైం పడుతుంది తినటానికి కావాలంటే నేను నీకు కోసిపెడ్తాను,'' అన్నాను లేని చిరునవ్వు తెచ్చుకుని.

''ధన్యురాలినయానుగా ఇంకేంకావాలి. మీ ఇష్టం వచ్చినట్లే చేయండి,'' అంది యశో చిన్నబోయిన ముఖంతో.

ఇంకొక అరగంట పోయిన తర్వాత మేమిద్దరం బయలుదేరి వచ్చాము. సరళ సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పింది. ఇంటికి తిరిగి వస్తూ నా అసభ్య ప్రవర్తనకు నేను చాలా బాధపడ్డాను. వచ్చినప్పటి నుంచీ యశోకి ఏదో కష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాను. ఈ సారి క్షమాపణ చెప్పుకోవాల్సిన విధి నాదనిపించింది.

''యశో, నేను అలా ప్రవర్తించాలనుకోలేదు. నన్ను క్షమించాలి ఈ సారికి,'' అన్నాను.

''ఇందులో క్షమించటానికి ఏముంది చెప్పంది. మీలో ఇంత కోపం దాగివుందని నాకింతవరకూ తెలియదు. భవిష్యత్తులో జాగ్రత్త పడతాను,'' అంది యశో.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అయినా ఆమె నాకేమీ అవదు, అది నాపూచీ, సుశీ స్థానం ఈమెకు నేను అర్పించలేను అనుకున్నాను.

 

చాప్టర్ 9

 

ఒక వారం రోజులు దొర్గిపోయాయి. ముస్సోరి వాతావరణం నా శరీరానికి సరిపడింది. శరీరారోగ్యంతోపాటు మనస్సుకూడా బాగయింది. యశో నన్ను పిక్నిక్ స్థలాలకి తీసుకుని వెళ్లేది. అప్పటికి ఆమె నన్ను ఏ విధంగా భావిస్తోందో తేటతెల్లమయింది. ఎవరో 'బాదల్ బాబు' అనే ఒక పురుషుడిని ఊహించుకుంది, ఈమె నన్ను మొదటిసారి చూసిన ఆ అశుభముహూర్తాన నేనే అతగాడినని ఈమెకు తట్టింది.

"నమస్కారమండి" అన్నప్పుడు నేను పడిన తడబాటు ఈమె నమ్మకాన్ని దృఢతరం చేసింది. ఈమె మెదడులోంచి ఈ మిథ్యను ఎలా పోగొట్టటం? కాలమే ఈ సమస్యకి పరిష్కారం తీసుకువస్తుందని ఆశించాను. ఆమె నామీద ప్రదర్శించే అనురాగం, శ్రద్దా అవాంఛనీయమని ఆమెకు చూపించుదామనుకున్నాను. లేక మనస్సులో నాకు తెలియకుండానే ఆమె యెడఅభిమానం దాగియుందేమో? యశోకి సుశీ విషయం తెలిసివుంటుందనే ఆలోచనతో నన్ను నేనే మోసపుచ్చుకునే వాడిని, అలాకాకపోతే ఆమెకు ఇదంతా ఎందుకు చెప్పను?

ఆరోజు రాత్రి కూడా పదిగంటలకల్లా లైట్లు ఆరిపోయాయి. కాని నిద్రాదేవత వచ్చే సూచనలేమి లేమి. మరణించి సుశీ, జీవించివున్న యశో వీరిద్దరి రూపాలు మనోనేత్రం ముందు మెదలసాగాయి. వీరిద్దరి మధ్యా నా కర్తవ్యమేమిటి? సుశీ ఒక నాటి రాత్రి అన్న మాటలు చటుక్కున జ్ఞప్తికి వచ్చాయి. ''నేను ఎన్నటికైనా మీదాన్నే. కానీ మీరు నావారే అనటానికి ధైర్యం చాలటంలేదు. అయినా మీరు నావారే''. ఆమె అనుమానపడినట్లే ఆమెకు అన్యాయం జరుగుతుందా? నా చేతులకి ఆమె ఆందనంత మాత్రాన ఆమెకి ద్రోహం చేస్తానా? ఇలాంటి ఆలోచనలతో నిద్దరపట్టక బయటికి వచ్చాను.

వెన్నెలరాత్రి ఎంతో ప్రశాంతంగా ఉంది. చాలాసేపు దానిని చూస్తూనుంచున్నాను. హఠాత్తుగాదృష్టి వరండా చివర సోఫామీద పడింది. అక్కడ ఎవరో పడుకున్నట్టు కనబడింది. దగ్గరకు వెళ్లి చూశాను. టేబుల్ మీద తలమోపి యశో పడుకుని ఉంది. వెన్నెల కాంతిలో ఆమె ముఖం సృష్టంగా కనబడుతూవుంది. తెల్ల రాళ్ల మీద ప్రవహించే సెలయేరువలె ఆమె కన్నుల్లోంచి అశృవాహినులు సాగి వస్తున్నాయి.

''యశో, ఇక్కడ పడుకున్నావేమిటి? ఏమిటి ఇదంతా?'' అన్నాను నెమ్మదిగా

యశో చివాలున లేచి నా గుండెలమీద వాలిపోయింది వెక్కివెక్కి ఏడుస్తూ. నేను ఆశ్చర్యాన్వితుడనయి పోయాను. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయినా స్త్రీ కన్నీరు చూస్తే నా మనస్సు కరిగిపోయింది.

''ఏమిటి యశో? ఏం జరిగిందో చెప్పు? నేనేమైనా నీకు కష్టం కలిగించానా?'' అన్నాను యశో తల నిమురుతూ.

''నా దు.ఖ కారణం నేను నోటితో చెప్పలేను. అది కూడా తెలియని అమాయకులా మీరు? దేనికైనా ఒక హద్దువుంది బాదకబాబూ,'' అంది యశో ముఖం పైకెత్తి.

మరుక్షణంలోనే తుఫానులా తన గదిలోకి వెళ్లిపోయింది. హత బుద్ధుడనూ, అప్రతిభడనూ అయిపోయి అక్కడనే నిల్చుండిపోయాను. రాత్రి చాలా సేపువరకూ దుర్నివార్యమై పొంగివస్తూన్న దు.ఖాన్ని బలవంతాన అణచుకోవటానికి ఆమె చేస్తూన్న ప్రయత్నాలు నాకు పక్క గదిలోకి వినబడుతూనే ఉన్నాయి.

ఆమె దుఃఖ కారణం ఆ పరమాత్మకే తెలుసు. అందరినీ దుఃఖ పెట్టేది అతగాడేగా?

ఒక వారం రోజుల వరకూ నాకు ఈమెలేదు; ఈమెకు నేనులేను. ఈ కొద్దికాలంలో జన్మజన్మలకీ మరుపురాని సంబంధం ఎలా ఏర్పడింది? నా ఇష్టంలేకుండా ఈ వుచ్చులోకి ఎందుకు కాలుపెట్టాను? గడిచిన వారంరోజుల నుంచీ జరిగిన సంఘటనలను పర్యావలోకించి చూస్తే నాకు ఒకే ఒక సత్యం పొడచూపింది.

నేను ఒక ప్రవాహంలోపడి కొట్టుకుపోతున్నాను. ఎదురీదటం హాస్వాస్పదమైన సంగతి. గమ్యస్థానం నాకు తెలియదు. మునుగుతానో తేల్తానో నాకంతకంటే అ స్పష్టంగా ఉంది. ఇక మిగిలింది నా కర్తవ్యంయేమిటి?

 

చాప్టర్ 10

 

మానవుడు తలచేది ఒకటి, దైవం చేసేది వేరొకటి, అనే వాక్యంలో ఎంత సత్యం ఇమిడి వుందో నాకప్పుడు బాగా విదితమైంది. కాకపోతే ఈ జరిగినదానికి నేనెలా సంజాయిషీ ఇచ్చుకోవాలి? కలలోకూడా ఊహించని ఈ విషయాన్నీ, ఈ సంఘటనలనూ నేనెలా సమర్ధించగలను.

జరిగింది జరిగిపోయింది; జరుగవలసింది జరుగుతుంది, అనే నిర్బలులూ, నిస్సహాయులూ పలికే వాక్యాల్లో నేనెందుకు తల దాచుకుంటాను. నాస్తికుడివి అనే అభియోగానికి నేనెందుకు జవాబివ్వాలి?

రోజులు గడిచిపోతున్నాయి. స్థలానికీ, సంఘటనకీ లంకె ఎప్పుడూ ఉంటుంది. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క పురుషుడు తిరస్కరించలేని రమణీయమైన రమణిప్రేమ, ఇంకొకపక్క అద్వితీయమైన ప్రకృతి శోభ, ఈ ప్రబల శక్తుల బారినుంచి నన్ను కాపాడేదెవరు? రానురాను యశో ఆదరానికీ, ప్రేమకీ కట్టుబడిపోతున్నాను. ఆమె అనురాగానికీ, ఆదరణకీ, ప్రేమకీ హద్దుమించి కృతజ్ఞుడనయి పోయాను. స్నేహం, కరుణ, మార్దవం గట్టుతెంచుకుని ప్రవహించాయి. హృదయపు గోడలకు చిల్లులు పడ్డాయి.

గతాన్ని మరచిపోయి ఈ యువతితో ఎందుకు సుఖించకూడదు. భూతకాలంలో నాకు జరిగిన అన్యాయానికి వర్తమాన భవిష్యత్కాలాలలో నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? భవిష్యత్తులో యశో నన్ను మరచిపోయి తన పూర్వపు జీవితాన్ని గడపలేదనే విషయం స్పష్టమవజొచ్చింది. ఆమె నన్ను సంపూర్ణంగా నమ్మింది. పవిత్రమూ నిష్కళంకమూ, నిర్మలమూ అయిన అనురాగం నామీద కురిపించేది. ఒక క్షణంలో ప్రేమ స్వరూపిణిగా ఉండేది; మరొక క్షణంలో కొంటెపిల్లగా ఉండేది.

ఆనాడు చాకలికి నా బట్టలు వేసింది. వాడు వెళ్లిపోయిన తర్వాత యశో పకపకా నవ్వటం మొదలుపెట్టింది. ఆమె నవ్వు వింటూంటే జలజలా ప్రవహించే సెలయేరులు జ్ఞాప‌కానికి వస్తాయి. ఎందుకు నవ్వుతుందో అని ఆమెవైపు దృష్టి ప్రసరించాను. యశో నాకు మొదటిరోజు సరళ ఇంటికి వెళ్లక మునుపురాసిన చీటీ చేతిలో పట్టుకుని నవ్వుతూంది. అది మరచిపోయి చొక్కా జేబులో పెట్టినట్టున్నాను. అది ఆమె కంటపడింది. కాని నాకు ఇందులో నవ్వవలసిన విషయం ఏమీ కనబడలేదు.

''ఎందుకు నవ్వుతున్నావు యశో?'' అన్నాను.

''ఇదేమైనా ప్రేమలేఖ అనుకున్నారా? భద్రంగా జేబులో దాచుకున్నారు. మీకు కోరికగా వుంటే నాతో చెప్పలేకపోయారా? ఒక పెద్ద ప్రేమలేఖ రాసి రాజేంద్రచేత ఇచ్చి 'డూన్' లో పోస్టు చేయించేదానిని,'' అంది యశో, బలవంతాన నవ్వు ఆపుకుంటూ.

ఆ నవ్వు యశో కళ్లల్లో నీరు తెప్పిస్తే ఆ మాట నాకు కోపం కలిగించింది.

''చాలు యశో. నీకు దేనిని గురించి పరిహాసమాడాలో తెలియదు,'' అన్నాను.

"సరేలెండి, అప్పుడే కోపం వచ్చేసినట్టుంది మీకు, నాకు దేనికి పరిహాసమాడాలో తెలియదన్నారు, మీకు దేనికి కోపగించుకోవాలో తెలియదు,'' అంది కళ్లు తుడుచుకుంటూ.

తరువాత ఆ చీటీ పట్టుకుని తనలోతాను ఆలోచించుకుంటూ నేలమీద కూర్చుంది.

''ప్రేమలేఖ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు, రాయడానికి ఎవరూలేందే. ఇదిగో ఇప్పుడు వచ్చారు. మీరు రాస్తారా? చాలా పెద్దది రాయాలి తెలుసా,'' అని, నాకేసి చూస్తూ నవ్వింది.

కాని మరుక్షణంలోనే ముఖం వెలవెలపోయి ఆమె భయవిహ్వల అయింది. మంచం మీద కూర్చుని ఏదోనా అనుమానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడింది.

''మనకి ప్రేమలేఖలు రాసుకోవాల్సిన ఆగత్యం ఎందుకు కలుగుతుంది. చెప్పండి బాదకబాబు? మనమెప్పుడు ఒకరిని విడిచి ఒకరము ఉండం కదా; ఏమంటారు?'' అంది.

నేనేమీ మాట్లాడలేదు. ఆ అమాయకపు ముఖంలోని ఆత్రుతను చూస్తూంటే నా మనస్సు విచలితమైంది. ఇలాంటి ప్రేమను నేనెల తిరస్కరించగలను?

యశో నన్ను కదుపుతూ అంటూంది. ''ఏమిటండి, ఏమీ మాట్లాడరేమిటి? అక్కడేముందని చూస్తూ ఉన్నారు? నాకు భయం వేస్తుంది''

''మరీ నువ్వు నన్నింత నమ్మటం మంచిదికాదు యశో. నేనెలాంటి వాడినో నీకేమి తెలుసు, మనది కొద్దిరోజుల పరిచయం,'' అన్నాను, రుద్దకంఠంతో.

''మీరు అలా అనకండి బాదకబాబూ; నాకు చాలా బాధ కలుగుతుంది,'' అంది.

మరుక్షణంలోనే యశో దు.ఖపు తెరలను చెదరగొట్టింది.

''ఇవేళ నుంచీ మీరన్నట్టు మిమ్మల్ని మరీ అంతగా నమ్మను, బాదకబాబు. అది సరే, ఈ ఉత్తరం మీరే తీసుకోండి,'' అని దాన్ని నా జేబులో పడేసి నవ్వుతూ బయటికి వెళ్లిపోయింది.

 

చాప్టర్ 11

 

రాజేంద్ర ఆహ్వానాన్ని పురస్కరించుకుని నేనూ, యశో, సరళా ఒక రోజు ముస్సోరిలోనే వన్నవాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎప్పటిలాగే, సరళ కారుకు సారథ్యం వహించింది. ఆనాడు జరిగిన ప్రతి చిన్న విషయమూ నాకు ఈనాటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకంటే మా నలుగురి జీవితాల్లో ఆ దినం ఒక మైలురాయి లాంటిది.

ఒక చక్కని బంగాళా పోర్టికోలో సరళ కారు ఆపింది, బయటనించే తెలుస్తోంది అది రాజేంద్ర 'రెసిడెన్స్ కమ్ క్లినిక్' అని. బంట్రోతు మమ్మలిని లోపలలికిపంపుతూ రాజేంద్ర స్నానం చేస్తున్నాడని చెప్పేడు.

మేము డ్రాయింగ్ హాల్లోకూర్చుండగా కొద్దిసేపటికి రాజేంద్ర లోపలినుంచీ వచ్చాడు,

''క్షమించండి రాంబాబు. ఆలస్యం చేశాను. తలవని తలంపుగా వచ్చారు. యశోనికూడా తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది,'' అన్నాడు నాతో చేయి కలుపుతూ.

''యశోని నేను తీసుకు రావటంకాదు రాజేంద్ర, ఆవిడే నన్ను తీసుకువచ్చింది,'' అన్నాను.

''అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. యశో ఇక్కడకు వచ్చి సంవత్సరం దాటిపోయింది,'' అన్నాడు యశో వైపు చూస్తూ.

యశో అతనికేసి చూడటంలేదు, గోడమీద బల్లి పురుగులను కబళించటానికి పొంచివున్న దృశ్యాన్ని తదేకంగా చూస్తూంది.

ఇంతలో, లోపలినుంచి ఒక ఇరవై సంవత్సరాల యువకుడు వచ్చాడు.

''దిల్ బహదూర్. ఇంకొక నలుగురికి ఈ రోజు వంట చెయ్యాలి. ఇప్పుడు టీ తీసుకురా,'' అన్నాడు రాజేంద్ర.

''చాలా మంచివాడు. బాగా వంటచేస్తాడు, ప్రాణం తీయాలన్నా, ప్రాణప్రదంగా సేవ చేయాలన్నా నేపాలీలను మించినవారు ఉండరు,'' అతను లోపలికి వెళ్లిపోయాక అన్నాడు తను.

''ఇలా ఎన్నాళ్లు బాధపడతారు రాజేంద్రబాబు; పెళ్లి చేసుకోకూడదా?'' అంది సరళ నవ్వుతూ.

''పెళ్లి చేసుకుంటే మాత్రం నాకు కలిగే లాభం ఏమిటి?'' అన్నాడు రాజేంద్ర.

''పెళ్లి చేసుకున్నారంటే అభేద్యమైన ఇనుప కవచం మీకు లభిస్తుంది. మీరు ఏంచేసినా లోకం తప్పుపట్టదు. మీరు ఎన్ని పాపాలు చేసినా కప్పిపోతాయి. అందులో మీరు ధనికులు, ఇకనేం?'' అంది సరళ హఠాత్తుగా ఆవేశపడి.

అందరమూ సరళ కేసి నిశ్చేష్టులయి చూస్తూన్నాం. అంత హఠాత్తుగా వివాహం సంగతి ఎత్తి అంత ఆవేశంగా మాట్లాడుతుందని మేమెవరమూ అనుకోలేదు.

''మీరంతా నన్ను క్షమించాలి నా ఆవేశానికి. ముఖ్యంగా మీరు రాజేంద్రబాబూ; నేనన్న మాటలు మీ గురించికాదు, మీరు అన్యథా తలచకండి. వివాహపు బంధనం అవిచ్ఛిన్నమైనదని భావించి బలి అయిపోయిన ఒక ప్రాణ స్నేహితురాలు జ్ఞాప‌కమొచ్చింది. అది చాలా విషాదగాధ, చెప్పమంటారా?'' అంది మరల సరళ.

''చెప్పు సరళా; తప్పకుండా చెప్పు, విని చేయగలిగిందేమీ లేకపోయినా అలాంటివి జరుగుతూ ఉంటాయని తెలుసుకోవడం మంచిది,'' అన్నాను నేను.

సరళ 'లఖియా' కధ మొదలు పెట్టింది.

"లఖియా నా బాల్య స్నేహితురాలు, నాకు యశోతో పరిచయం అయ్యేటప్పటికే తను కాపుర నరకంలోకి తోయబడింది. తనకి పదహారేళ్లేడు నిండకుండానే పెళ్ళిచేసారు వాళ్ళ పెద్దలు. ఈ సంఘటన జరిగి మూడేళ్లయింది ముస్సోరిలోనే, అప్పటికి లఖియాకు వివాహమై నాలుగు సంవత్సరాలై ఉంటుంది చక్కటి రూపం వెన్నలాంటి హృద‌యం అమృత‌ కలశంలాంటి మనస్సు ఆమెది. భర్త కూడా అందగాడే కానీ క్రూరుడు; లోకంలోని దుర్గుణములన్నీ అతనిలోనే ముర్తీభవించాయి. లఖియాని చాలా కష్టం పెట్టేవాడు అన్నింటినీ ఆమె సహించేది. లఖియా కోసం అప్పుడప్పుడు వాళ్లఇంటికి వెళ్లేదాన్ని, నన్ను మంచి చేసుకోవటానికి ప్రయత్నించేవాడు. ఎందుకో అతనిని చూస్తేనే నాకు భయం వేసింది. ఒక రోజు సాయంకాలం ఆమె ఇంటికివెళ్లాను. లఖియా లోపల ఉంది. నేను లోపలికి వెళ్తూంటే నా వెనుక తలుపు మూసిన చప్పుడయి నేను తిరిగి చూశాను. లఖియా భర్త చేసినపని అది, నావైపు నడిచి వస్తూ, 'సరళా. నీతో కాస్త మాట్లాడాలి' అన్నాడు. నానోట మాటరాలేదు. ఎంత ధైర్యంగాఉందామనుకున్నా కాళ్ళు వణకసాగాయి. ఇంతలో లఖియా లోపలి నుంచి వచ్చింది.

''నువ్వు ఇక్కడకు ఎందు వచ్చావు, లోపలికి పో,'' అన్నాడు అతను వుద్రేకంతో.

''పోను, సరళ నాకోసం వచ్చింది,'' అంది లఖియా దృఢంగా.

కోపంతో ముఖం అంతా ఎర్రబడి పోయి, 'పోవా' అని హూంకరించాడు.

లఖియా ఈ సారి జవాబివ్వలేదు. హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని ''సరళా. నువ్వు పెరటి గుమ్మంగుండా బయటికి వెళ్లిపో. నా కోసం వీరిని క్షమించు,'' అని నన్ను బయటికి తోసేసి గడి వేసింది.

ఇదంతా క్షణకాలంలో జరిగింది. నా కళ్లు స్వాధీనం తప్పాయి. ఎలాగో పెరటి గుమ్మంగుండా బయటికి వచ్చేసరికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ లఖియా అసహాయ అర్తనాదం వినబడింది. వీధి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి చైతన్యరహితమైన అమె శరీరం నా కాళ్లకు తగిలింది. నా కేకవిని మా డ్రైవరు రామన్న పరుగెత్తుకు వచ్చాడు. లఖియాను కారులో పడుకొబెట్టాం. రామన్న కోపాన్ని ఎంతో కష్టంమీద శాంతిపచేశాను. ఇంటికి తీసుకొచ్చాను. డాక్టరు ఎంత ప్రయత్నించినా మానవత్వంలేని ఆమె భర్త డొక్కలో తన్నిన తాపులకి ఆమెకు రాత్రంతా స్పృహ‌రాలేదు. మరునాడు తెలివొచ్చి తన ఇంటికి తాను వెళ్లిపోతానంది. బహుశా ఓపికవుంటే వెళ్లేది. నేను ఆ కిరాతుడి వద్దకు పంపనందుకు లఖియా నామీద చాలా కోపపడింది. తనకు కొంచెం స్వస్థత చిక్కినవెంటనే భర్త వద్దకు పంపించి వేస్తానని వాగ్దానం చేసిన తర్వాత మందులు, ఆహారం తీసుకోవటం మొదలుపెట్టింది.

లభియాని ఎంతో వేడుకునేదానిని. భర్తకు విడాకులివ్వమని, ఆ బాధ్యత నేను వహిస్తానని, దానికి ఆమె కెనలేని కోపంవచ్చింది.

'నువ్వు నా సోదరివి కాబట్టి నీ నోట ఆ మాటవిని సహించాను. సరళా, కాని నువ్వైనా ఆ మాట మళ్లీ అనవద్దు. భర్త ఎన్నటికీ భర్తే. నా మెడలోని ఈ పుస్తెని తెంచే శక్తి మానవమాత్రునికి లేదు. కాని నా భర్తను నేను పొందగలననే విశ్వాసం నాకుంది. నేను ఎన్నడూ ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ఏ పాపము చెయ్యలేదు. అలాంటప్పుడు భగవంతుడు జీవితాంతం ఎందుకు శిక్షిస్తాడు. ఈ విధంగా నా భర్త అనురాగం నాకు తిరిగి లభిస్తుందనే విశ్వాసం నాకు ఉంది. నన్ను భగవంతుని పాదపద్మముల వద్ద వదలి, నువ్వు నిశ్చితంగావుండు సరళా. అదే నేను నీ నుండి కోరేది'' అంది చివరకు..

ఈ మాటలు చెప్తూ సరళ కంఠం అవరుద్ధమయిపోయింది. కళ్లలోంచి కన్నీరు తొంగి చూస్తూందేమో అనుకున్నాను. కాని ఒక క్షణంలో ఆమె తనను తాను సంబాళించుకుంది తిరిగి చెప్పటం ప్రారంభించింది.

ఒక వారం రోజులకి ఆమెకు కొంచెము స్వస్థతకి వచ్చింది. లేచి తిరగటం మొదలుపెట్టింది. కాని పక్కలో పోట్లు పూర్తిగా పోలేదు. అయినా ఆమె వెళ్లిపోతానంది. ఇంకా కొన్నాళ్లుండమని ఎంతో ప్రార్థించాను.

''ఇంకా ఇక్కడే ఉన్నానంటే ఆయన తిరిగి నన్ను రానీయడు. నన్ను ఎన్నటికీ క్షమించడు,'' అంది.

నా నోట మాట రాలేదు. క్షమించవలసింది లఖియానా లేక లఖియా భర్తా? అర్ధాంగిని సృహ‌తప్పేటట్టు తన్నినందుకు అతగాడు ఈమెని క్షమించాలట.

''నీ అభిప్రాయం నాకు తెలుసు. కాని నాకు ఆయన అభిప్రాయాలు కూడా తెలుసు. క్షంతవ్యం లేనిదైనా వారిని నువ్వు క్షమించాలి. రేపే నేను వెళ్లిపోతాను నా భర్త వద్దకు, అనారోగ్యం కారణంగా పుట్టింటికి వచ్చి కొన్నాళ్లున్నాను. ఆరోగ్యం బాగుపడింది. ఇక తిరిగి పోవాలి,'' అంది లఖియా నా ఊహలను గ్రహించి.

ఆ మరునాడే లఖియా వెళ్లిపోయింది. తర్వాత చాలాకాలం వరకూ ఆమె సంగతి తెలియలేదు. ఆమె మా ఇంటికి రాలేదు. వాళ్లఇంటికి వెళ్లడానికి నాకు భయం మానేసాను. అప్పుడప్పుడు తానే మాయింటికివచ్చేది. తను ఆ కసాయివానితో కాలం ఎలా గడుపుతుందో అని ఆశ్చర్యపోయేదాన్ని.

ఆఖరికి లఖియాను కలుసుకోకుండానే నేను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. రెండు నెలలు తర్వాత తిరిగి వచ్చాక రామన్న చెప్పాడు, లఖియా భర్త పోయాడని, తను ఇల్లువాకు తెగనమ్మి, అతని అప్పులన్నీ తీర్చ, కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్లిపోయిందని.

అతనైతే తన పాపాలని మూటగట్టుకుని, లఖియాను విధవను చేసి నరకంలోకి పోయాడు కాని ఆమె బాహ్యప్రపంచంలోకివెళ్లిందా లేక ఈ ఇల విడిచే వెళ్లిపోయిందా అనే అనుమానం అప్పుడప్పుడు కలిగేది. నన్ను ఎక్కువగా బాధించే సంగతేమిటంటే; తన సోదరి ఒకామె, ఆమెను ప్రేమించే తోటి స్త్రీ ఒకామె, జీవించే ఉన్నదనే విషయం లఖియా మరచిపోయిందని. నన్ను వదలి తనను దైవం తన పాదపద్మముల వద్ద నిశ్చితంగా ఉండమందో! లేక ఆ దైవం ఈమె ఇన్నికష్టాలు పడుతూ ఉంటే ఏం చేస్తూన్నట్లు? ఆమె చేసిన అపరాధం ఆయనని నమ్ముకోవటమేగా. లఖియా బతికివుంటే తిరిగి నా వద్దకు వస్తుందనే ఆశతో చాలా కాలం నిరీక్షించాను. రానురాను అదికూడా క్షీణించిపోయింది.

సరళ 'కథ' చెప్పటం ముగించింది.

ముగ్గురమూ ఆ గాధ చెప్తూన్నంతసేపు ఏదో మైకంలో ఉన్నట్టు విన్నాము. యశో కళ్లవెంట అనర్గళంగా కన్నీరు స్రవిస్తూంది.

"అంతే సరళా, నువ్వు చెప్పిందే నిజం, కష్టాలు సహించేవాళ్లనే సమాజమూ, దైవమూ కష్టాలు పెడతారు. నువ్వు నీ కర్తవ్యం నీవు చేయగలిగింది చేశావు. అదే చాల,.'' కొంతసేపటికి కన్నీళ్లు తుడుచుకుంటూ యశో అంది,

''దైవం చేసే అన్యాయానికి మనమేం చేయలేం యశో. కాని సంఘపు అన్యాయాన్ని మనం సహించకూడదు. లఖియా దుఃఖానికి ముఖ్యకారణం ఏమిటి? ఒక అపరిచిత వ్యక్తిని ఎవరినో వివాహమాడింది. అదే మూలకారణం. తనకు తెలిసిన వ్యక్తిని వివాహమాడినట్లైతే ఇవన్నీ తప్పును. హిందూ సమాజం స్త్రీకి చాలా అన్యాయం చేస్తూంది. స్త్రీకి యుక్తవయస్సు రాకుండానే, అసలు బాల్యంలోనే, వివాహం చేస్తారు. భర్తను మొదటిసారిగా వివాహపు మంటపం దగ్గర చూస్తుంది ఆడది. తనను చిన్నతనం నుంచీ ప్రేమించిన వ్యక్తులు చాలా మంది ఉంటారు, తలిదండ్రులు, అక్కచెళ్లెళ్లు, అన్నదమ్ములు, స్నేహితులు., అయినా, వివాహితస్త్రీ వారందరినీ విడిచి వారియెడ తన ఆప్యాయత మరచి, భర్త పుస్తెకట్టిన మరుక్షణం నుంచీ అతనిని వీరందరికన్నా మిన్నగా ప్రేమించాలంటారు," అంది సరళ.

"దీన్ని స్త్రీవాదం అనవచ్చు," అన్నాను

"కాని, నేనే శ్రీకారం చుట్టేనను," అని నవ్వి, తన ఉపన్యాసం కొనసాగింది, "అంతేకాదు, అప్పటివరకూ తను ప్రాణప్రదంగా కాపాడుకుంటూన్న తన సర్వస్వాన్ని భర్తకు సమర్పించాలంటారు. ఎవరో నల్లగానో, లేక తెల్లగానో ఉన్న ఈ నూతన వ్యక్తి అవసరం తనకేమిటి? ఎందుకు ఇతగాడికి తను అన్నీ సమర్పించాలి? జీవితం మధ్యలో హఠాత్తుగా ఎక్కడనుంచీ వూడిపడ్డాడు ఈయన. అందరికంటె మిన్నగా ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నలగురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఆలోచించిన వారికి జవాబులు దొరకవు. తర తరాల నుంచీ వస్తూన్న అర్ధంలేని ఈ తతంగానికి ఎదురు తిరగరు. దారీ తెన్ను కనబడక ఇతరులను అనుసరిస్తారు. చనిపోయే లోపున పిల్లల్ని కని, వారికి కూడా తమ తీరులోనే వివాహం జరిపిస్తారు మన ఆడవాళ్లు. ఈ ఆడదాని నాటకానికీ ఇప్పటికైతే ఆఖరి అంకంలేదు, బహుశా ఎప్పటికీ ఉండదేమో! కాలగర్భం నుంచీ జన్మించింది గనుక ఆమె కాలగర్భంలోనే లీనమయిపోవాలి. ఇదీ ప్రపంచ రీతి.''

''అయితే మీరనేది ప్రేమించి పెళ్లిచేసుకోమంటారు అంతేనా?'' అన్నాను.

''ప్రేమించనక్కర్లేదు రామంబాబూ. పేరు తెలిస్తే పదివేలు. అతగాడెవరో, ఎలాంటివాడో, అతని అభిప్రాయాలతో తను ఏకీభవించగలదో లేదో, భవిష్యత్తులో నైనా అతన్ని ప్రేమించగలదో లేదో ఇవన్నీ అయినా కనీసం ఆమెకు తెలియాలి. భర్త కంఠస్వరమే అపరిచితంగా ఉండకూడదు ఆమెకి. మీకు తెలియదు రాంబాబూ. స్త్రీ హృద‌యం ఎంత కరుణార్ద్రమయినదో తన మీద కనికరం చూపించిన వ్యక్తికోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. అది కూడా కరువైపోయింది ఆమెకు,'' అంది సరళ.

''నువ్వు చెప్పింది చాలా మట్టుకు నిజం సరళా, ఇందులో లోపం కొంతవరకు స్త్రీలదే, సమాజాన్ని ఎదిరించే శక్తిని పుంజుకోరు వచ్చిన అవకాశాన్ని జారవిడుస్తారు,'' అన్నాను .

''అవును, లోపం స్త్రీలలోకూడా వుంది. కమల అని నాకొక స్నేహితురాలుండేది. నా అభిప్రాయాలతో ఏకీభవించేది. చివరకు ఎవరో అపరిచితుడిని వివాహమాడింది. తర్వాత పూర్తిగా వ్యక్తిత్వమే కోల్పోయింది. ఈనాడు భర్త మాటను జవదాటదు. అతని ఇష్టంలేని చీరకూడా కట్టుకోదు. ఒకసారి ఆమెని కారణం అడిగాను. ఆమె ఏమందంటే, ''సరళా. భార్యాభర్తలలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. భర్తకు ఎదురుతిరిగానంటే నేను చివరికి బయటికి పోవాల్సి వస్తుంది. నాకంత ధైర్యంలేదు. అందరితోపాటు ఈ ఊబిలో నేనూ దిగిపోతాను.'' వివాహమైన తర్వాత కలిగేది జ్ఞానం కామోను. కమలకిప్పుడు ఇద్దరు పిల్లలు. సావిత్రి దమయంతులను జ్ఞాప్తికి తెచ్చే భారత నారీమణి,'' అంది సరళ.

దిల్ బహదూర్ భోజనం తయారైందని చెప్పాడు. భోజనాలయిన తర్వాత పిక్నిక్ కి బయలుదేరాము.

 

చాప్టర్ 12

 

డూన్‍కి నాలుగుమైళ్ల దూరంలో ఉంది ఆ ఆహ్లాదకర ప్రదేశం. దట్టమైన చెట్లు, వురకలు కక్కుతూ పరుగెత్తే సెలయేరూ, ఉత్సాహాన్ని ఉర్రూతలూగించే మలయమారుతం, ఇవన్నీ కలసి ఎంతో మనసు ను ఉత్తేజ పరుస్తాయి. కారుని ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఆపింది సరళ. ఆటలు ఆడి ఆడి అలసిపోయాము. కారులోంచి టిఫినూ, కాఫీ తీసుకుని ఆరగించాము. పరుగు పెట్టడంలో సరళ కాలు బెణికింది. తను అక్కడే కూర్చుంటానంది. నేను కూడా బాగా అలసిపోయాను.

"అలా ఆ సెలయేరు వద్దకు వెళ్లి వద్దాము వస్తారా?" అంది యశో నాతో కొంతసేపటికి.

''ఇప్పుడు అక్కడికెందుకు యశో, నలుగురము ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం,'' అన్నాను.

''నేను మిమ్మల్నడిగింది వస్తారా, రారా అని, సరే, అయితే రాజేంద్రబాబు, మీరైనా నా సాంగత్యాన్ని సహించగలరా,'' అని, యశో జవాబుకు ఎదురుచూడకుండా ముందుకు నడిచింది.

రాజేంద్ర జవాబివ్వలేదు. నా వైపు ఒక సారి చూశాడు. నేను సరళ వైపు చూశాను. తర్వాత అతడామె వెనుక సాగిపోయాడు.

వారిద్దరూ వెళ్లిపోయిన తరువాత మాలో ఎవరూ మాట్లాడలేదు. నేను సరళతో ఒంటరిగా ఉండడం ఇదే ప్రథమ పర్యాయం.

''ఇందాకా మీరేమీ తినలేదు ఒక యాపిల్ ఇమ్మంటారా?'' అంది తను మాటకలపడానికన్నట్లు.

ఆ కంఠస్వరంలో తీయని మార్దవం ఉంది. కళ్లల్లో అలసటా, అశాంతి కనబడ్డాయి. హఠాత్తుగా అన్న మాటలవి. ఉలిక్కిపడ్డాను. సరళ నాకు మొదటి నుంచీ జటిల సమస్యగానే ఉంది. ఆమె కంపిత కంఠస్వరం, చెదిరిన నేత్రాలు నన్ను వ్యాకులపరిచాయి. నేనేమీ మాట్లాడలేదు. యాపిల్ అందుకున్నాను.

''కత్తికావాలా రామంబాబూ,'' అంది సరళ సన్నగా నవ్వుతూ,

సరళ ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు నేను చేసిన రసాభాస జ్ఞప్తికి వచ్చింది. ఇంక నేనేమీ మాట్లాడలేదు.

"కొంత మందిని చూస్తూంటే రెక్కలు కప్పి రక్షించాలని బుద్ధిపుడుతుంది కదూ రామంబాబూ,'' అంది.

నేను దిగ్భ్రాంతుడనయ్యాను, ఏమిటి సరళ, ఇవాళ ఇలామాట్లాడుతుంది? ఈమె మాటల్లో ఎమైనా నిగూఢార్ధం ఇమిడివుందా? నా మనస్సు అక్కడ రాజేంద్ర యశోల మధ్య జరుగుతున్న సంభాషణని ఊహించుకుంటూంది.

ఇంక నేను మాట్లాడలేదు.

''మీకు ప్రేమలో నమ్మకముందా, రామంబాబు,'' అంది.

హఠాత్తుగా చెవివద్ద వీణ మీటినట్లయింది. ఏదో అస్పష్టంగా అన్నాను బహుశా ఉందని కామోను.

''నాకుమటుకు యేమంత నమ్మకంలేదు. అనేక సమయాల్లో నేనే అనేక మందిని ప్రేమించాను; ఈ క్షణంలో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నా సర్వస్వమూ మీదే; కానీ ఇదే విషయం ఇంకాసేపు పోయిన తర్వాత అనలేను. అదేమి ఖర్మోకాని, నన్ను ప్రేమించేవాళ్లను నేను తిరిగి ప్రేమించలేను. నన్ను ప్రేమించి నిరాశ చెందినవారు చాలా మంది ఉన్నారు రామంబాబూ;'' అని, చిరునవ్వు నవ్వుతూ, ''ఒకతను ధనికుడు, బాగానే వుండేవాడు. నేను తనని ప్రేమించకపోతే మా కారుకింద పడతానన్నాడు. భయంతో కొన్నాళ్లు కారు నడపటం మానేశాను. ఇదంతా మీకు అసందర్భ ప్రలాపములా కనబడుతోందనుకుంటాను; ఇవ్వాళ మనస్సంతా చాలా చంచలంగా ఉంది. రామంబాబు! మీరు నన్ను క్షమించాలి," అంది తను.

హృద‌య‌మంతా ఆమెయెడ కృత‌జ్ఞ‌త, జాలితో నిండిపోయింది. ఒక అందమైన స్త్రీ క్షణికమైనా, తనను ప్రేమిస్తానని చెప్పినప్పుడు ఏ యువక హృద‌యం చలించదు. సుశీ, యశో నాతో ఎన్నో ప్రేమ వాక్యాలు పలికారు కాని ఎన్నడూ 'నేను మిమ్మల్ని ఈ క్షణంలోప్రేమిస్తున్నాను. నా సర్వస్వమూ మీదే' అని చెప్పలేదు. కాని ఈ విచిత్ర యువతి ఒంటరిగా నాతో మొదటిసారి మాట్లాడుతూ అలా చెప్పగలిగింది. తను నమ్మిన వాటినీ, వాంఛించిన వాటినీ నిర్భయంగా, నిస్సంకోచంగా వెల్లడించగల శక్తి ఈమెలోఉంది.

''ఎందుచేత సరళా నిన్ను ప్రేమించేవాళ్లను నువ్వు తిరిగి ప్రేమించలేవు?'' అన్నాను.

''నాకూ తెలిస్తేగా మీకు చెప్పడానికి రామంబాబూ. కాని అప్పుడప్పుడు చాలా అశాంతిగా ఉంటుంది. ఈనాడు లఖియా జ్ఞాప‌కమొచ్చి మనస్సంతా పాడైపోయింది,'' అంది.

''లఖియా విషాద గాధ విన్నప్పటి నుంచీ నా మనస్సు కూడా సరిగా లేదు సరళా. జీవితంలో హృద‌యానికి హత్తుకుపోయిన కొద్ది మంది స్త్రీలలోను లఖియా ప్రథమస్థానం ఆక్రమిస్తుంది'' అని, ఆమెగురించి ఆలోచిస్తూ, ఆమె రూపాన్ని ఊహించడానికి ప్రయత్నించాను.

''నీలా యశో లా లఖియా కూడా అందంగా ఉంటుందా సరళా?'' అన్నాను ఆఖరికి.

''యశో లో లఖియా పోలికలు కనబడుతాయి రామంబాబూ. అందుకనే యశో అంటే నాకంత ఆపేక్ష,'' అంది సరళ తల పైకెత్తి నాకేసి చూసి.

కాస్సే పాగి మనస్సులో మెదుల్తూన్న భయంకరమైన ప్రశ్న వేశాను.

''లఖియా ఆత్మహత్య చేసుకుని వుంటుందనుకుంటావా సరళా?'' అన్నాను ఎందుకో.

సరళ ఒక్కసారి వులిక్కిపడింది.

''మీకలా అనిపిస్తుందా రామంబాబూ,'' అంది.

''లేదు సరళా. నాకలా అనిపించడంలేదు, నీవు చెప్పినదానిని బట్టి ఆమె అటువంటిది కాదనిపిస్తుంది. ఆమె విషాధగాధలో పిరికితనం ఏకోశానా లేదు. ఇందాకా నన్ను నేను ఎంతో కష్టంమీద నిబ్బరించుకున్నాను సరళా. కాని ఇప్పుడు నాకా అవసరం కనబడటంలేదు. నీ సమక్షంలో అజ్ఞాత‌ యువతికి జోహారులర్పిస్తున్నాను హృద‌య పూర్వకంగా ఈనాడు,'' అన్నాను.

సరళ నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూసింది.

''అదేమిటి రామంబాబూ. కన్నీరు కారుస్తున్నారు మీరు,'' అంది.

నా కళ్లు నిజంగానే చెమర్చాయి..

''అందులో తప్పేముంది. చెప్పు. పురుషులు కన్నీరు కార్చకూడదా. అది స్త్రీల హక్కేనా? కొన్నికొన్ని సమయాల్లో మనం కన్నీరు కార్చటం కంటే ఇంకేమీ చేయలేని అసహాయస్థితిలో ఉంటాము సరళా. హృద‌యంలోని సానుభూతీ, ఆవేదనా బయటకు ఎలా వెల్లడించటమో నువ్వే చెప్పు?'' అన్నాను కళ్లు తడుచుకుంటూ.

సరళ దానికేమీ జవాబివ్వలేదు. కొంత సేపు మౌనంగా వుండిపోయింది.

''లఖియా గాధ మీ మనస్సును కూడా పాడుచేసింది. ఇక ఆ విషయం గురించి మాట్లాడవద్దు,'' అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతూంటే....

''ఈ విషయంలో నువ్వు నాకొక వాగ్దానం చేయాలి సరళా! లఖియా సంగతి నీకెప్పుడైనా తెలిస్తే నాకు కబురు చెయ్యాలి. ఎంత దూరంలోవున్నా ఆమెను చూడటానికి వస్తాను. లఖియా నాతో మాట్లాడుతుంది కదా?'' అన్నాను నేను అడ్డుకుని.

''సరే అలాగే చేస్తాను. కాని అంతటి అదృష్టం నాకు లభిస్తుందనే ఆశ నశిస్తోంది,'' అంది.

''ఇప్పుడే వచ్చేస్తాను,'' అని లేవబోయాను.

''నన్ను వంటరిగా వదిలి వెళ్లిపోతారా?'' అంది కంపిత స్వరంతో... ఆ కంఠస్వరమూ, ఆ కళ్ళూ మళ్లీ నన్ను విభృతుని చేశాయి.

''హాస్యంకాదు రామంబాబు, ఈ ఆరణ్యంలో నేను ఒంటరిగా ఉండలేను; ఎక్కువగా మనుష్య సంచారం లేదు. వాళ్లే వస్తారు కొద్దిసేపటిలో, అయినా తప్పు చెయ్యకుండామీరు నన్ను ఎందుకు శిక్షిస్తారు? మీరు వెళ్లారంటే నా మీద ఒట్టే,'' అంది సరళ కంగారుగా నామనోభావాన్ని గ్రహించి నట్టుగా.

నా కాళ్లకు బ్రేక్ పడింది. ఇంక చేసేదిలేక తిరిగి చతికిలబడ్డాను.

''ఇంత చిన్న విషయాలమీద ఇంత రసాభాస ఎందుకు చేస్తావు సరళా? నిజంగా నీవు భయపడే నన్ను ఇక్కడ ఉండమన్నావా?'' అన్నాను కొంచెం కోపంగా.

''అవును, నిజంగానే భయం వేస్తూంది. నేను చెప్పానుకదా, ఈవేళ నా మనస్సు చాలా చంచలంగా ఉందని, కొన్ని కొన్ని సమయాల్లో స్త్రీలకు పురుష సహాయం చాలా అవసరం రామంబాబూ. అదిమీరెవరూ గుర్తించరు,'' అంది.

నేనింకేమీ మాట్లాడలేదు. ఏకాంతాన్ని ఏవిధంగా భగ్నం చెయ్యాలా అని ఆలోచిస్తూంటే అల్లంత దూరంలో రాజేంద్ర యశోలు కనబడ్డారు. ప్రాణం లేచి వచ్చినట్లయింది.

''అదుగో, వారు వస్తున్నారు,'' అన్నాను ఉత్సాహంగా.

సరళ ఒకసారి నావైపు వేదనా పూరిత నేత్రాలతో చూసింది. నేను ఆమెను తప్పించుకోటానికి ఆత్రుత పడుతున్నానని గ్రహించింది.

''మీరూ ఈ వేళ నా వాగుడంతా చాలా ఓపికతో విన్నారు. అందుకు నేను కృత‌జ్ఞురాలిని రామంబాబూ,'' అంది కొంచెం నవ్వుతూ.

మరుక్షణంలో హృద‌యమంతా ఆమెపై జాలితో నిండిపోయింది పాపం. ఈమె ఏమి చేసింది? నేనెందుకు ఈమెను వదలించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను? ఇంతలో రాజేంద్ర యశోలు చాలా దగ్గరకు వచ్చేశారు. నా దృష్టి వారి మీదకు పోయింది.

వారొచ్చిన కొంతసేపటికి తిరుగు ప్రయాణం పట్టేము

 

చాప్టర్ 13

 

యశోకి సుశీ సంగతి తెలుసునేమో అనే ఆశతో అంతవరకూ వున్నాను. ఆనాటి తర్వాత ఆమె ప్రవర్తన బట్టి ఆ ఆశ నిరాశ అని తెలిసింది. ఇక ఏమైనా ఈ వార్త ఈమెకు చెప్పాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా రోజులు గడిచిపోయాయి. ప్రతి రాత్రి ఆమెకు చెప్దామనుకునేవాడిని. కానీ నోట మాట వచ్చేది కాదు. రాత్రి భోజనం అయిన తర్వాత ఇద్దరమూ కలిసి నవలలు చదివేవాళ్లం. వాటిలోని పాత్రలను గురించి చర్చించేవాళ్లం.

''మీరు నవలల్లో ఎవరిపక్షం వహిస్తారు. విసర్జించబడిన ప్రేమికూడా లేక వివాహం చేసుకున్నవాడా?'' అడిగింది ఒక రాత్రి యశో.

''సాధారణంగా విసర్జించబడినవాడే యశో. అతనికి ఎంత దు.ఖం కలుగుతుంది చెప్పు. ఒక సారి హృద‌యమర్పించిన తర్వాత ఏం జరిగినా తిరిగి తీసుకోలేడుగా,'' అన్నాను.

''అయితే మీరు ఎవరి ప్రేమనూ తిరస్కరించరు కదా?'' అంది యశో ఎంతో ఆశతో

''ఆ విషయం నాకు తెలియదు యశో. నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు .అయినా ఇతర బంధనాలు లేకపోతేనూ, ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తూందని నమ్మకం కలుగుతే ఎందుకు తిరస్కరిస్తాను,'' అన్నాను.

''ఒక వేళ ఇతర బంధనాలు లేవనుకోండి; ఆమె మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తూందనుకోండి. మీకే తన హృద‌యాన్ని అర్పించిందనుకొండి...'' అని యశో ఎంతో ఆవేశంగా చెప్తూ నాకేసి భయంగా చూసింది.

నేను ఆమె మాటల అర్థాన్ని గుర్తించానేమోనని అనుమానం స్థిరపడిపోయింది కామోను గబుక్కున ఆగిపోయింది

''నన్ను క్షమించండి బాదకబాబూ. నేనన్న మాటలు మరచిపోండి. నామీద మీకు కోపం వచ్చిందా?'' అంది కొంతసేపటికి నా చేతులు పట్టుకుని..

భయపడుతూ, దీనంగా చూస్తూన్న ఆ కాటుక కళ్లని చూస్తూంటే ఏమనాలో తెలియలేదు.

''అలా అనకు యశో. నాకూ హృద‌యం ఉంది. నీ అభిమానానికీ, ఆదరణకీ కృత‌జ్ఞ‌ుడని, కాని నన్నేమి చేయమంటావో చెప్పు,'' అన్నాను.

యశో మంచంమీంచి క్రిందకు వంగి తన తల నా కాళ్లపై పెడుతుంటే నేను నాశ్చర్య పోయాను.

''ఇక్కడే కొంచెం చోటివ్వండి'' తను నన్నలా గద్గస్వరంతో 'శరత్' పార్వతి, దేవదాసును వేడుకొన్న రీతిలో అంటుంటే అవాక్కయిపోయాను.

తర్వాత కొంచెంసేపు గది అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. నా కాళ్లమీద నుంచి ఆశ్రుబిందువులు నేలపైన పడనారంభించాయి. .

''యశో . నేను తప్ప నీకిక గత్యంతరం లేదా?" అన్నాను నేను యశోను లేవదీసి.

యశో మాట్లాడలేదు. ఒకసారి నా కళ్లల్లోకి చూసింది. ఆ చూపుతోనే నన్నడిగినట్లుంది... ''దీనికి కూడా నేను జవాబివ్వాలా?''

నాక్కూడా కళ్లు చెమర్చాయి. అయినా ఈ అవకాశం జారవిడుచుకోకూడదు. యశోకి సుశీ సంగతి చెప్పితీరాలి.

''కాని నాకు ఇతర బంధనాలున్నాయి యశో,'' అన్నాను మనస్సు రాయి చేసుకుని,.

''చెప్పండి,'' అంది యశో ఒక్కసారి ఉలిక్కిపడి.

తన కప్పుడు నేను నా సుశీవ్యథను వ్యక్తపరచ్చేను..

యశో మట్లాడకుండా అంతా వింది. ఆమెలో ఆవేశం కనబడలేదు; విచారమూ కనబడలేదు. శూన్యంలోకి శూన్యంగా చూస్తూంది. తన విన్న ఆ గాధకూ తనకూగల ఆ భయంకరమైన సంబంధం గ్రహించటానికి కొంతసేపు పట్టింది. నిశ్చలంగా ఉన్న ఈమె ముఖం మేఘా వృత‌మైంది.

చివరకి భయ విహ్వల అయి నా చెయ్యి పట్టుకుంది...

''అంటే….మీరు నాకు ...మీరు నన్ను ఏంచేసి పోతారు,'' అంది.

''ఈ ప్రశ్నకి సమాధానం తెలియకే ఇన్నాళ్లూ నీకీ సంగతి చెప్పలేదు యశో, నేను పూర్తిగా నిస్సహాయుణ్ని.. జరిగిందంతా చెప్పాను. ఇక భవిష్యత్ లో ఏం జరగాలో నిర్ణయించవలసిన భారం కూడా నీమీద మోపుతున్నాను. నీ నిశ్చయానికి నేను కట్టుబడి ఉంటాను,'' అన్నాను.

యశో చాలా సేపు మాట్లాడలేదు. నా మనస్సు కాస్త తేలికబడింది. భారమంతా ఆమె తలమీద పెట్టాను. ఆమె మాటకు కట్టుబడి ఉంటాను.

''సుశీని మీరు మరచిపోలేరా ఎన్నటికీ?'' అని అడిగింది యశో

''మరచిపోతే సుశీ కాని, చివరకు నువ్వుకాని నన్ను క్షమించగలరా?'' అప్రయత్నంగా నానోటి వెంట జవాబు వచ్చింది.

యశో ఆవేశంతో తలను మంచం కోడుకేసి కొట్టుకుంటూంది.

''అదేమిటి యశో . ఏం చేస్తున్నావు?'' అంటూ ఆతృతగా ఆపబోయాను.

ఆమె తలమీద తగిలిన ఒక్కొక్క దెబ్బా బల్లెపు పోటులా నా హృద‌యానికి తగిలాయి.

''ఎంత పని చేశావు యశో,'' అన్నాను ఆఖరికి యశో తలను రెండు చేతుల్లోనూ తీసుకుని.

''దైవం నుంచీ, సమాజం నుంచీ, చివరకు మీ వద్దనుంచీ నేను పొందగలిగింది ఇదే. నానుదుట రాసివున్నది. నాకు జీవితంలో లభించేదీ ఇదే,'' అంది దుఃఖమూ, బాధా పొర్లివస్తున్న కంఠంతో.

ఈ మాటలు అని, యశో గదిలోంచి రివ్వున బయటికి వెళ్లిపోయింది.

శిలాప్రతిమలా అలాగే కూర్చుండిపోయాను. అలాంటి పరిస్థితిలో కూడా నా మనస్సు పూర్వంకంటే తేలికపడింది. నా దు.ఖాన్ని పంచుకోవడానికి ఇంకొక అభాగిని దొరికింది. కానీ ఆ ఆలోచనలో ఇంత స్వార్ధం ఇమిడి ఉందని నాకప్పుడు తెలియదు. భవిష్యత్తులో ఆమె చెప్పినట్టు చేస్తానని మాటయిచ్చాను. ఇక నా తప్పు లేదు అని అనుకున్నాను. యశో మొదట చూపిన నిగ్రహమూ, నిశ్చలతా కోల్పోయింది. ఆ పరిస్థితిలో మీరు నావారే అంటే నేనేమి చెయ్యాలి?

మరునాడు పొద్దుపోయిన తర్వాత లేచాను. కళ్లు తెరచేటప్పటికి ఎదురుగుండా యశో కనబడింది.

"రాత్రంతా ఆలోచించటమూ, ఆలస్యంగా లేవడమూ మీకలవాటయింది ఇప్పటికైనా లేవండీ,'' అంది చిరునవ్వుతో. నాకయితే, అది తెచ్చిపెట్ట్టుకున్న నవ్వు అనిపించింది.

యశో అలా దర్శనమిస్తుందని నేను ఊహించలేదు. అలా జరిగినందుకు నేను చాలా సంతోషించాను కూడా . కానీ, ఆ చిరునవ్వు దేనికి నాంది?

ముఖ ప్రక్షాళనం చేసి వచ్చేటప్పటికి యశోకి బదులు కాఫీ, టిఫినూ ఉన్నాయి. గ్లాసు తీసేటప్పటికి క్రింద ఒక చీటి కనబడింది. వణికే చేతులతో అది చదువనారంభించాను.

''బాదకబాబూ,

రాత్రంతా ఆలోచించాను, ఇంత పెద్ద బరువు నా శుష్క స్కంధాలమీద మీరెందుకు పెట్టారు? కాని నేను మీకిప్పుడు ఏమని చెప్పాలి? కల్లోలపూరితమైన నా మనస్సుకి ఒకే సత్యం దృగ్గోచ‌ర‌మ‌వుతూంది. మరణించినా సుశీ మిమ్మల్ని పొందగలిగిందిగాని బ్రతికుండి కూడా నేను కోల్పోతున్నాను . ఇతరులు మీకు లభించవచ్చు కానీ, ఇతరులు మిమ్మల్ని పొందలేరు. ఈ నిగూఢ సత్యాన్ని నేనెలా తోసిపుచ్చగలను?

నన్ను గురించి నేనేమీచెప్పలేను. అయినా జీవితంలో మీనుండి యాచించవలసిన బిక్ష ఒకటి ఉంది. యాచితంగానో, అనాయాచితంగానో, స్వకర్మవల్లనో, పరకర్మవల్లనో మీ సాంగత్యమూ, మీ స్నేహమూ నాకు లభించాయి. జీవితంలో మరుపురాని ఘడియలు కొన్ని నాకు ప్రాప్తించాయి. ఇంకా కొద్దికాలమే మనమిద్దరమూ కలిసుంటాము. అలాంటి సుఘడియలు ఇంకా కొన్ని నాకు లభ్యమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించండి. ఇది నాకు లభించకపోతే ఇక నాకు జీవితంలో మిగిలింది ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. మీ నుండీ నేనేమీ వాంఛించటంలేదు. నేను సమర్పించేదాన్ని స్వీకరించమని అడుగుతున్నాను. మీరు స్వీకరించే వస్తువు మీకు సమర్పించలేనిదాన్ని, దాన్ని కలుషితం చెయ్యనని మీరు గుర్తుంచుకోవాలి.

జీవితంలో స్త్రీ ఒకసారి హృద‌యార్పణం చేస్తుంది బాదకబాబూ. తిరిగి పుచ్చుకోవటమనేది ఆమెకు చేతకాదు. నా విషయంలో కూడా అంతే. మీకు సుశీ ఎలాగో మీరు నాకూ అలాగే. సుశీ మరణించింది. నేను జీవించే ఉన్నాను ఇంక. అంతే''

ఇట్లు,

మీకేమవుతుందోతెలియని,

యశో''

ఉత్తరం చేత్తో పట్టుకుని అలాగే కూర్చున్నాను. అప్పటి మనస్థితి నేను సరిగా చెప్పలేను. సుశీ..యశో..యశో...సుశీ ఏమిటి ఈ అంతర్యుద్ధం? ఆ ఉత్తరం చాలాసార్లు చదివాను. ఈ లక్ష్మి నన్ను శాశ్వతంగా విసర్జించిందా? అనే ప్రశ్నకు నాకు జవాబు దొరకలేదు.

ఎంతసేపు అలా ఉన్నానో నాకు గుర్తులేదు. యశో హఠాత్తుగా గదిలోకి వచ్చి, నన్నూ, నా చేతిలోనిఉత్తరమూ చూసి, క్షణంసేపు గుమ్మంవద్దే నిలబడిపోయింది. కానీ ఇంతట్లో ఆమె దృష్టి టేబుల్ మీద ఉన్న కాఫీ, టిఫిన్ మీద పడ్డాయి.

''ఇంకా కాఫీ, టిఫిన్ తీసుకోలేదా? అరే,. కాఫీ చల్లారిపోయింది," అంది గబగబా దగ్గరకు వచ్చి.

"అయితే ఏమి యశో," అన్నాను.

"మళ్లీ ఇప్పుడే తయారుచేసి పట్టుకొస్తా'' అని అని వెళ్లిపోతూంటే హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని అన్నాను.

''ఒక్క రోజు చల్లారిన కాఫి తాగితే ఏం ఫర్వాలేదు యశో. ఈ మొండి ప్రాణం ఏమైపోదు. అయినా పొరపాటు నాది అలాంటప్పుడు నీకెందుకు ఈ శిక్ష," అన్నాను.

యశో కాసేపు తన చెయ్యిని నా చేతిలో అలాగే ఉంచింది. ఆమె కళ్లల్లో సన్నగా నీరు తిరుగుతున్నట్టనిపించింది...

''ఫర్వాలేదు ఇప్పడే పట్టుకు వస్తాను,'' అని నెమ్మదిగా చేయి విడిపించుకుని బయటకు వెళ్లిపోయింది.

వేడివేడి కాఫీ కొద్దిసేపటిలోనే వచ్చింది. కానీ యశోరాలేదు. రామదీన్ పట్టుకు వచ్చాడు. యశోకి కాఫీ చెయ్యటం ఏమంత కష్టంలేదు. కానీ గట్టులు తెంచుకుని ప్రవహించే ఆశ్రుధారలు ఆపటం అంత సులభంకాదు. చేతులంత సులభంగా నేత్రాలు మన ఆదేశాన్ని పాటించవు. ఆనాడు నేను తాగిన కాఫీలో కన్నీరు ఎంతవుందో నాకు ఈ నాటికి తెలియదు.

నేను రామదీన్ ని అడిగాను, యశో ఏం చేస్తూందని.

"ఏమిటో బాబూ. ఇవాళ అమ్మాయి పొద్దుటనుంచీ విచిత్రంగా ఉంది. రోజూ నవ్వుతూ ఎదురయ్యేది. ఇవాళ పొద్దున్న ఆ చిరునవ్వు మాయమైంది. దానికితోడు ఆ అమ్మ నన్నడిగింది, 'తాతా! చావటానికి అన్ని మార్గాలకన్నా సులబమైన మార్గం చెప్పగలవా?' అది పరాచకమే అనుకోండి అయినా పొద్దున్నే అలాంటి మాటలంటారా ఎక్కడైనా బాబూ,'' అన్నాడు.

అది పరాచకమే అన్నాడు రామదీన్. కాని నాకంత నమ్మకం కలుగలేదు. హఠాత్తుగా ఉత్తరంలోని వాక్యాలు గుర్తొచ్చాయి. ఈ భిక్ష నాకు లభించకపోతే ఇక జీవితంలో మిగిలిందేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే దీని అర్థమేమిటి? 'సుశీ మరణించింది. నేను జీవించే ఉన్నాను ఇంకా', ఈ వాక్యం అనుమానాన్ని పోగొట్టింది.

యశో నాకు ఒంటరిగా కనబడలేదు. నేను తనకోసం ఆ రాత్రి పొంచి వున్నాను

''కాస్త లోపలికి రా యశో. నీతో కొంచెం మాట్లాడాలి,'' అన్నాను ఆమె తన గదిలోకి వెళ్లిపోతూంటే.

''లోపలికెందుకు? ఇక్కడే చెప్పండి,'' అంది యశో వరండాలో నుంచుని.

''కాదు యశో, కాస్త లోపలికి రా,'' అన్నాను అభ్యర్ధనగా.

''చెప్పాల్సిందేమైనా ఉంటే ఇక్కడే చెప్పండి. లేకపోతే నేను వెళ్లిపోతాను,'' అంటే, ఆమె కంటి కన్నీరు, కోపంగా వ్యక్తమవుతూందని గ్రహించాను.

''నీ ఉత్తరం నాకు సరిగా అర్థంకాలేదు. యశో, నీ సుఖం కోసం...'' అని ఏదో అనబోతూంటే యశో అడ్డువచ్చింది.

''నా సుఖం కోసం మీరేమీ కష్టపడనక్కర్లేదు. నా ఉత్తరం అర్థం కాలేదన్నారు. ఉత్తరం స్పష్టంగానే రాశాను రామంబాబు,'' అంది తీక్షణంగా నాకేసి చూస్తూ.

రామంబాబూ, అని ఆమె నన్ను ఎప్పుడూ పిలవలేదు. చెంపమీద చెళ్లున కొట్టినట్టయింది. మనస్సు ఎంతో బాధపడింది.

''బాదకబాబుకు అంత్యక్రియలు ఎప్పుడు జరిపించావు యశో,'' అన్నాను దీనంగా చూస్తూ.

ఆ మాట విని వేటగాని బాణపు దెబ్బతిన్న హరిణిలా నాకేసి చూసిన యశోరాజ్యం, రివ్వు మని తన గదిలోకి పోయి తలుపు గడియ వేసుకుంది.

 

చాప్టర్ 14

 

ఇంకో రెండు వారాలు గడచిపోయాయి. మొదట కొన్నాళ్లు యశోని చూస్తే భయంవేసేది, ఆమె ఏమి అఘాయిత్యం చేస్తుందో అని అనుక్షణం భయపడేవాడిని. రాత్రింబవళ్లు నిద్రపట్టేదికాదు. చాలా సార్లు యశో గది తలుపులు నెమ్మదిగా తోచి చూసేవాడిని, తెరచి ఉన్నాయేమోనని. ఆమె గదిలో లేనప్పుడు లోపలికి వెళ్లి వెదకేవాడిని. మరో వారం తిరిగిన తర్వాత యశో కాస్త మామూలు స్థితికివచ్చింది. అయినా నా మీద కోపం పోలేదు. ఒక సారి రాజేంద్ర వచ్చాడు. నామీదకోపాన్ని అతని మీద అనురాగంగా మార్చింది. అందుకు అతనే కాస్త కంగారు పడ్డాడు. నేను మొదట కొంచెం బాధపడ్డానుకాని చివర కదంతా మంచికే అనుకున్నాను. సరళ కూడా ఇదంతా గమనించింది. ఒక సారి ఆమె నన్నుడిగింది. అంతా చెప్పేశాను.

''మీరు ఇదంతా యశోకి చాలా కాలం కిత్రం చెప్పిఉండాల్సింది రామంబాబూ. చాలా ఆలశ్యంచేశారు,'' అంది అంతా విని.

''అవును, అది నిజమే సరళా. నాదే అపరాధం. కాని నేనేమి చెయ్యను. మానవ బలహీనతకు కూడా మనం కొంచెం చోటివ్వాలి. చివరకు ఇలా పరిణమిస్తుందని నేను ఊహించలేదు. అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావు?'' అన్నాను.

''మీరు ఇదే నిశ్చయంలో ఉన్నట్లయితే యశోను త్వరలో విడిచి వెళ్లిపోండి,'' అంది.

ఇంత స్పష్టంగా సరళ ఎలా చెప్పగలిగింది. ఇందులో స్వలాభమేమైనా ఉందా? ఏదయితేనేం నా ఉద్దేశ్యంకూడా ఇదే. హఠాత్తుగా వెళ్లిపోతే యశో తండ్రి అనుమానపడతారేమోనని ప్రయాణం కొన్నాళ్లు వాయిదావేశాను.

యశో మామూలు స్థితికి వచ్చింది. ఆవేశం, ఆవేదనా అట్టడుకి అణచివేసింది. చాలా ముభావంగా ఉండేది. అయినా ఆదరణకీ, అనురాగానికి ఏమీ లోపం రానిచ్చేదికాదు. ఎప్పుడూ గదిలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూండేది. ఆ మౌనమే నన్ను చాలా భయపెట్టేది. ఏడ్చిగోలచేసినా ఫర్వాలేదు. ఆమె మనస్సులోసాగుతున్న ఆలోచన ఏమిటి? గొడ్డలి పెట్టులాంటి ఈ దెబ్బకు ఈ ఆభాగిని ఉన్మాదిని అయిపోతుందా. లేక తన హృద‌యజ్వాలను చల్లార్చుకోవడానికి నదీతారానికి పరుగెడుతుందా? అయితే ఈ పాపం ఎవరి మెడ కు చుట్టుకుంటుంది?

ఆనాడే ప్రయాణం, మధ్యాహ్నం యశో గదిలోకి వెళ్లాను యశో పక్కమీద పడుకుని ఉంది. కళ్లు మూసుకుని ఉంది, కాని నిద్రపోవటం లేదు అని నాకు తెలుసు.

"యశో," అన్నాను మెల్లిగా ఆమె చెవిలో.

యశో కళ్లువిప్పి చూసింది

''సామానంతా సర్దుకున్నారా?'' అంది మందహాసంతో.

''నేను సర్దుకోవటానికేముంది. యశో, నిన్నరాత్రి కూర్చుని నీవేగా సర్దావు,'' అన్నాను.

యశో జవాబేమీ ఇవ్వలేదు చాలాసేపు .

''అయితే ఈ వేళ వెళ్లిపోతారన్నమాట,'' అంది ఆఖరికి కళ్లు మూసుకుని.

ఆ మాట తనలో తను అనుకున్నట్టు వుంది. అందులో జీవంలేదు; ఆశ లేదు; ఉత్సాహం లేదు; ఉద్రేకంలేదు; భయంకరమైన తిరుగులేని నిశ్చయంమటుకు ఉంది.

''నామీద కోపం లేదు కదా . నాకు తెలుసు నీకు నేను చాలా బాధ కలిగించానని. కానీ.... కానీ నేనేమీ చెయ్యను?'' అన్నాను. గొంతు పెగలదీసి అన్న మాటలవి.

ఆతరువాత నా కంఠం అవరుద్ధమైంది.. ఆ గది అంతా నిశ్శబ్దమైంది.

తను కళ్లు తెరచి నావైపుచూస్తూ అంది, ''మీమీద కోపగించుకోవటానికి మీరేమి చేశారు? మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ నాటినుంచీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలి.''

''ఏమిటి అది యశో?'' అనడిగాను.

''జీవితాంతం ఈ హృద‌యంలో ఇంకొకరికి చోటివ్వను. సర్వ వేళలా నా సర్వస్వమూ మీరే,'' అంది.

''లేదు, యశో, నువ్వు పొరపడుతున్నావు. నీ జీవితం ఇంత చిన్నవయస్సులో విషాదపూరిత మవ్వటానికి వీల్లేదు నేను ఇక్కడికి రాక మునుపు నేను వస్తానని నీ మనస్సు చెప్పేదన్నావు; అప్పుడు నువ్వ ఊహించుకున్న 'బాదల్ బాబును' నాలో చూశావు, ఇప్పుడు నువ్వ కావాలను కుంటున్న 'రామం బాబు' వేరెవరో ఎందుకు కాకూడదు?'' అన్నాను.

యశో తల అడ్డంగా తిప్పుతూ అంది, ''కాదు నేను పొరపడలేదు. కాకపోయినా నాకు చింతలేదు. మిమ్మల్ని ఇన్నాళ్లూ ఇంత ప్రేమించాను. ఇదంతా బూటకమేనా? అలా ఎన్నటికీ జరుగదు. మీరలా మాట్లాడకండి. ఇవాళ ఆఖరిరోజు, ఇది కూడా సుఖంగా గడిచిపోనివ్వండి,'' అంది.

యశో కలవారి బిడ్డ. శైశవం నుంచీ అతి గారాబంగా పెరిగింది. ఆమె ఎవ్వరినీ చేయి చాచి అడిగేదికాదు. ఇప్పుడు వ్యాకులచిత్తురాలై వణికే కంఠంతో యాచించిన భిక్షశూలంలా హృద‌యాన్ని చేదించింది.

''మీరు నన్ను పూర్తిగా మరచిపోరు కదూ బాదల్ బాబు,'' అంది మరల కాసేపాగి.

''ఇది నువ్వు అడగాల్సిన ప్రశ్నకాదు. యశో, ఇంత జరిగిన తర్వాత నిన్ను మరచిపోతే నాలో మానవత్వం లోపించి ఉండాలి,'' అన్నాను, కన్నీళ్లు బలవంతాన ఆపుకుని.

యశో చీరకొంగు నోటిలో కుక్కుకుని అవతలివైపుకి తిరిగిపోయింది. అపరిమిత దుఃఖాన్ని సహనంతో సహిస్తున్న ఆమె ధైర్యాన్ని నేను చెదరగొట్టాను. ఆమె దుఃఖ కారకుడిని నేను. ఆమెని ఓదార్చటానికి ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వం?

లేచి నుంచుని, ''ఇక నేను వెళ్లిపోతాను. యశో, ఇంతకంటె ఆనందకర పరిస్థితుల్లో తిరిగి తప్పకుండా కలుసుకుంటాము. నీ దగ్గర నుంచీ శభలేక వచ్చిందంటే రెక్కలు కట్టుకు వాల్తాను'' అన్నాను.

యశో ఇంకా అటువైపే తిరిగి ఉంది.

''సరే వెళ్తాను,'' అన్నాను.

''ఆగండి. ఇంకొక యాచన ఉండిపోయింది'' అంది యశో లేచి నిల్చుని.

'' చెప్పు యశో,'' అన్నాను.

''భర్తకి పాదాభివందనం చేయాలని చిన్నతనంలో మా అమ్మ చెప్పేది. నన్ను ఆశీర్వదించండి,'' అని వంగి నమస్కరించింది.

''ఎప్పుడూ సుఖంగా ఉండు యశో,'' పళ్లను గట్టిగా నొక్కిపెట్టి, గుప్పిడి బిగించి అన్నాను.

బయటికి వచ్చేశాను, నన్ను నేను నమ్ముకోలేక.

 

చాప్టర్ 15

 

నేను రాజమండ్రి తిరిగి చేరుకున్నాను. దారిలోఎన్నోసార్లు తిరిగి వెళ్లిపోదామనిపించింది. శిలా విగ్రహంలా ఫ్లాటుపారంమీద నిల్చున్న యశో స్మతి నేనెలా మరువగలను.

''మీ నిశ్చయాన్ని భంగపరచను బాదల్ బాబూ,'' అని రైలు కదలబోయే ముందు చెప్పింది కంటతడిపెట్టి.

ఎవరికోసమని నేను యశోరాజ్యాన్ని వదిలి వచ్చాను? సుశీల చనిపోయింది; యశోని తిరస్కరించాను; ఇక మిగిలింది నేను.

యం.ఎస్.సీ లో చేరాను. చదువులో పడి యశోని మరచిపోవటానికని ప్రయత్నించాను. కానీ సాయం సమయాల్లో సముద్రపుటొడ్డున నడుస్తూవుంటే యశో మనో వీధిలో పరిమళం వెదజల్లుతూ పరుగెడుతున్న దృశ్యం కనబడేది. ఆమె జ్ఞాప‌క చిహ్నం నావద్ద ఏమీలేదు. అప్పుడు నా కాళ్లమీద తలపెట్టి 'ఇక్కడే కాస్త చోటివ్వండి' అన్న దృశ్యం మనస్సులో మెదిలేది. యశోలాంటి వనిత ఎంత బాధపడుతూంటే అలాంటిపనిచేస్తుందో నేను గ్రహించాను. అలాంటి సమయాల్లో నేను చేసిన పని వివేకవంతమైనదా కాదా అని నాలో నేను తర్కించుకునేవాడిని. కాని మరుక్షణంలోనే ఆ ఆలోచనల్ని తోసిపుచ్చేవాడిని. సుశీ చనిపోయిన తర్వాతకూడా ఈ విధంగానే చేసేవాడిని.

కాలక్రమేణా యశోని మరువడంలో కొంత వరకు స‌ఫలీకృతు‌డ‌ న‌య్యాను.

ఏదో విధంగా ఏడాది గడిపేశాను. చదువైపోయింది. నా భారమంతా తీరిపోయింది. యశో ఎప్పుడో కాని తలుపుకు వచ్చేదికాదు. ఈ లోపున ఎన్నైన జరిగివుండవచ్చు. యశో నన్ను పూర్తిగా మరచిపోయి వుంటుంది. బహుశా వివాహం కూడా జరిగి ఉండవచ్చు. జరిగిందంతా మంచికే జరిగింది. ఈ ఉచ్చులోంచి ఎలాగైతేనేం బయటపడ్డాను. ఇక తిరిగి అందులో కాలుపెట్టను.

ఇంకొక ఏడాదికూడా గడచిపోయింది. ఇక ఆమెను పూర్తిగా మరచిపోగలనని ఆశించాను.

కొంతకాలం జీవితం సాఫీగా గడిచిపోయింది. ఇలా ఉండగా ఒక ఆరునెలల్లో తల్లిదండ్రులిద్దరూ గతించారు. క్రూరమైన ఆ దెబ్బకు నేను తట్టుకోలేకపోయాను. జీవితమంతా అంధకార బంధురమై పోయింది. నాకు సోదరులు లేరు; అక్కచెల్లెళ్లు లేరు; ఒంటరివాణ్ణి, బాబాయ్ ఒక్కడే నాకు దగ్గర బంధువు మిగిలాడు. కాని ఆయన అదొక తరహా మనిషి, లలిత పిన్నికి నేనంటే మమకారమే. కాని వారిది పుట్టెడు సంసారం. నా బాధ్యతకూడా ఎక్కడ వహించగలదు. ఉద్యోగం చేయాలనే వాంఛ నశించిపోయింది. డబ్బు గడించి ఎవరిని ఉద్ధరించాలి? నాన్న గారు వదిలిన దానితో నా పొట్ట గడుస్తుంది, అదేచాలు.

కాలం ఎంతో బరువుగా గడచిపోయేది. జీవితం కాంతివిహీనమైంది. దైవం మీద విశ్వాసం మరింత సడలింది.

ఒక నాటి రాత్రి యశోకి ఉత్తరం రాయాలని బుద్ధిపుట్టింది. ఆమెకు అందుతుందనే నమ్మకంలేదు నాకు. ఎక్కడ ఉందో ఆమె? మనస్సులోని బాధ కాగితం మీద పెడితే బరువైనా కొంతైనా తరుగుతుందని ఉత్తరం రాశాను. ఆమెకి అందుతుందన్న ఆశ ఉంటే బహుశా ఇంకొక విధంగా రాసేవాడిని. కొన్నాళ్లు గడిచేటప్పటికి ఉత్తరం మాటే మరచిపోయాను. ఇలా ఉండగా ఒకరోజు నాకొక ఉత్తరం అందింది. చాలా పెద్ద ఉత్తరం.

''బాదల్ బాబూ,

నమస్కారమండీ. (జ్ఞాప‌కం ఉంది కదూ) మీ ఉత్తరం అందింది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. మీ నుంచి ఇన్నాళ్లకు జాబువస్తుందని నేననుకోలేదు. అస్వభావికమనీ కాదు. అవాంఛనీయమనీ కాదు. అప్రత్యాశితం కనుక చాలా కాలం క్రితం మీకు నేను చెప్పాను ప్రేమలేఖంటే నాకు తెలియదని, నాకుఎవరూ రాయలేదు. ఈ నాటికి మీ నుంచి అది లభించింది? మీరు నాకు ప్రియులు. అది మీ లేఖ గనుక ప్రేమలేఖేగా.

ఆ మీ లేఖ ఆఖరికి, ఎన్నో ఊళ్లు తిరిగి తిరిగి, చెక్కుచెదరక నాకు చేరిందంటే మీరు ఆశ్చర్యపోరా? నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం కావొస్తుంది. చెప్పినా ఈ ప్రదేశం పేరు మీకు తెలియదు. అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా నాన్న గారు చనిపోయిన మరుసటి నెలలోనే నేను ఇక్కడకు వచ్చేశాను. అప్పటినుంచీ ఇక్కడేఉంటున్నాను. ఈ ప్రదేశం పేరు చెప్పకుండా, ఎలా ఉంటుందో చెప్పకుండా ''ఇక్కడ ఇక్కడ '' అంటూంటే కోపంగా ఉంది కదూ? మీకు కోపం వచ్చిందంటే నాకు తగని భయం. అందుకు చెప్తాను.

నేను నివసిస్తూ ఉంది ఒక రకం ఆశ్రమం లాంటిది. ఆ ఆశ్రమం అంటే రుద్రాక్షమాలలూ, భయంకరంగా మూడవకన్ను తెరచే సన్యాసులూ, నారచీరలు ధరించే సన్యాసినులూ జ్ఞాప‌కమొస్తున్నారు కదూ? కాదనను, అలాంటి వాళ్లు కూడా ఉన్నారిక్కడ. కాని నేనుకాదు. ఈ ప్రదేశం లో నాదొక చక్కటి కుటీరం, అందులో చాలా సాదా చీరలు ధరిస్తూ గడుస్తూంది నా నిరాడంబర జీవితం. కాని మీకు జవాబు రాస్తూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా విలువైంది. ఇది ఎప్పుడూ ఇక్కడకు వచ్చినతర్వాత కట్టుకోలేదు. ఏమిటా 'ఇది' అని ఆలోచిస్తున్నారా. గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్పారే ఆనాడు; పసుపు పచ్చటి జార్జట్టు చీర కట్టుకుంటే నేను ముచ్చటగా ఉంటానని, అదే చీర ఇప్పుడు కట్టుకున్నాను. అన్నిటిని త్యజించేసుకున్నాదీనిని మాత్రం వదలలేకపోయాను. ఇంతరాత్రి సమయంలో ఈ చీర కట్టుకుని మిణుకుమనే ఈ దీపం దగ్గర కూర్చున్న నన్ను చూస్తే ఈ లోకంయేమంటుంది? అభిసారిక, ప్రేయసి అంటుంది కదూ. ఇందాకా మా రాణి అడిగింది. 'ఏమిటిదంతా చెల్లీ'. ఈ చీర ఇప్పుడు కట్టుకున్నావేమిటి? అంటే నేను చెప్పాను. 'నేను ఈ రాత్రి నా భర్తకు ఉత్తరం రాస్తున్నాను రాణీ.'

కాదంటారా? అంటే అనండి, నాకేం?

ముందు నేనిక్కడకు ఎందుకు వచ్చానో చెప్తాను మీకు. మీరు వెళ్లిపోయిన తర్వాత నాలో ఒకరకం ఉదాసీనత్వం, జడత్వమూ ప్రవేశించాయి. అర్థంలేని ఆడంబర జీవితంమీద విరక్తి కలిగింది. నన్ను ఎవరూ చూడకుండా ఉండాలనీ, చూసినా నన్ను పూర్వపు యశోగా గుర్తుపట్టకూడదనీ, ఎక్కడో ఎవరికీ తెలియని ప్రదేశంలో నివశించాలని వాంఛించాను. ఏకాంత జీవితం కోసం హృద‌యం తహతహలాడింది. అన్నట్టు చెప్పటం మరచిపోయా, ఇక్కడ నాపేరు యశోకాదు. ఇక్కడకు వచ్చిన వెంటనే మా గురువుగారు 'సుందరీ' అని నామకరణం చేశారు. నవ్వుతున్నారు కదూ. ఇక్కడ ప్రజలకి కూడా సౌందర్యపిపాస ఉందికదా యని కావచ్చు. కాని మీ లోకంలో లాగ అది ఇతరులకు హాని చెయ్యదు. సరే, ఆ బంగళా, ఆ ఆస్తినంతా అమ్మి ఇక్కడకు వచ్చేశాను. చాలా డబ్బే వచ్చింది. అదంతా బ్యాంకులో వేశాను. ఈ పనులన్నింటికీ రాజేంద్ర సహాయం పొందేను. తన గురించీ, సరళ గురించీ తర్వాత రాస్తాను. ముందర నా సంగతి అవనీయండి.

నేనెలా ఉన్నానో తెలుసుకోవాలని ఉందని రాశారు. నేను అంటే మీ ఉద్దేశ్యమేమిటి? నిగనిగలాడుతూ పచ్చగావున్న ఈ శరీరం ఉంది. బాహ్య నేత్రాలకి కనబడకుండా సహస్ర సూర్య ప్రమాణంతో ప్రకాశించే ఈ మనస్సు ఉంది. ఎందుకొ అందరూ నా శరీరానికే ప్రాముఖ్యత ఇస్తారు. నేను శరీరాలోచలని కట్టిపెట్టాను. పరులు కొనియాడే నా ఈ శరీర సౌందర్యాన్ని కాపాడు కోవటానికి ఇరవైమూడు సంవత్సరాలు వ్యర్థం చేశానా అనిపిస్తుంది. ఇంకా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకు పోమంటారా? ఆ దశని నేను దాటేశాను. ఇప్పుడు మనస్థైర్యం తప్ప మనోచాంచల్యం లేదు. నిశ్చలమైన ప్రేమ ఉంది. కాని దానిని అధఃపతనానికి తోసే మోహంలేదు. సూర్యోదయపు అరుణ కాంతిని చూస్తూంటే నా ఒళ్లు పులకరిస్తుంది. ప్ర‌కృతిని నే నేనెన్నడూ జయించకలేక పోయాను. మీకు తెలుసు, దాన్నిచూసి నేను ఎలా మైమమరచిపోతానో. అయినాకాని, ఆనాడు కారులో లా ఈనాడు మైమరువను. ఎందుకంటే నేను ప్ర‌కృతిలోనే జీవిస్తున్నాను, దానిలో ఒక భాగంగా. అదినాకు ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు; అదే నా సర్వస్వం. ఎప్పుడు నేర్చుకున్నా వీ కవిత్వం అంటారేమో; ఇది కవిత్వం కాదు. కవిత్వానికి ఊహ ఆయువుపట్టులాంటిది. దానికి కవి జీవం పోస్తాడు; కవిత్వం జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే సర్వస్వం కాదు. కాని నాకిది సర్వస్వమూ అక్షయమూ కూడాను. దీనికి దేశ కాలాలతో నిమిత్తం లేదు; యుగాలతో ప్రమేయం లేదు. నా జీవితాన్ని అతి కృప‌ణ్యంతో కొన్ని హద్దుల్లో నడుపుతున్నాను. ఇక ఆ అంచుదాటి ఒక అడుగుకూడా ముందుకు వేయను.

మీరు ఎగతాళి చేయనంటే ఓ మాట చెప్తాను. జన్మలనేవే వుంటే మళ్లీ జన్మలో నేనొక పుష్పాన్ని అయిపుట్టాలని చనిపోయేముందు కోరుకుంటాను. ఎందుకంటే సృష్టిలో దానిని మించిన అందమైనది వేరేలేదు. పుష్పపు వాసన నా ఆత్మను ఎక్క డెక్కడికో తీసుకు పోతుంది. అది నన్ను నిరర్ధక బంధనాల నుంచి విముక్తురాల్ని చేస్తుంది. ఇక్కడ చిన్న పూలతోట లోని రకరకాల పుష్పాలను ప్రాత.కాలములో కోస్తాను; కొన్నింటితో పూజచేస్తాను; మరి కొన్నింటిని తలలో పెట్టుకుంటాను. వాటి సుగంధ పరిమళం నాతోపాటు నలుదిశలా వ్యాపిస్తుంది. మొదటిసారి, పువ్వులు కోస్తూ కోస్తూ సువాసన లేని పుష్పాల దగ్గరకు వచ్చి అగిపోయా ను. అప్పుడు వాటిఅర్తనాదం వినిపించిందనిపించింది, "ఓ రమణి. మేము ఏం పాపం చేశాము. మాకు సువాసన లేకపోవచ్చు; కానీ మేమూ అందంగానే ఉంటాము. సృష్టికర్త విధించిన శిక్షే కాకుండా మానవులు కూడా మమ్మల్ని శిక్షించాలా?". ఆ ఫుష్పవిలాపం నా హృదయాన్ని కదిలించగా అప్పుడు వాటిని సున్నితంగా తుంచాను, అప్పటినించి నా పూలదండలో సువాసన లేని పుష్పాల్ని కూడా జతచేయ మొదలెట్టాను.

పూలదండ శిగలో ధరించి సంధ్యా సమయాల్లో పిల్లవాయువులు వీస్తూంటే, గంగ ఒడ్డున పరుగెడు తున్నప్పుడు నా హృద‌యం ఆహ్లాదంతో నిండిపోతుంది. ఆ పిల్ల వాయువులు నా బుగ్గలను ఎంత చొరవగా తాకుతాయను కున్నారు! సూర్యరశ్మి, వెన్నెలకాంతి మరియు మలయమారుతము సోకని వనిత అసలు యీ భువిలో ఉండునా? అలాంటి సమయాల్లో మీ రూపం మెదులుతూ వుంటుంది. బంధాలన్నీ పూర్తిగా తెంచి వేశాను కానీ మీ బంధన తెంచటం నా శక్యంకాలేదు. సరే, తెంచబడని దానిని తెంచ ప్రయత్నించడ మెందుకని ఇక మానుకున్నాను. అందుచేత పూర్వపు జీవితానికి, నూతన జీవితానికీ మీరు ఒక్కరే లంకె.

అలాగ ఇక నాకు మిగిలిన గత జీవిత స్మృతి మీరొక్కరిదే. అందువలన కొన్ని కొన్ని సమయాల్లో నేను భయపడుతూ ఉంటాను - నాలో అజ్ఞాత‌మైన‌ కోరికలు అణగారి ఉన్నాయేమోనని అనుభవాన్ని ఆశించే వాంఛలు మరుగుపడి ఉన్నా ఏమోనని? మీ ఛాయలో మెదిలే నా మనసు, నేను ఆశించే ఆత్మ సంయమనం ఇంకా నాకు లభింపనీయ లేదు. నాకు లభించింది సహనము మాత్రమే, శాంతి కాదు. నిర్దుష్ట మైన శాంతి లభించినప్పుడే ఆత్మ సంయమనం పరిపూర్ణంగా లభిస్తుంది. దానికోసం నేనింకా ఎంత కాలం ప్రయాణం చేయాలో! సరే, నా గురించి చాలా రాశాను. మొదట నేనంత రాద్దామనుకోలేదు, కానీ కలం నడుస్తూన్నంత కాలం దానిని ఎందుకు వారించాలి?

ఇక సరళా రాజేంద్రల సంగతి. వారిద్దరికీ నేను ఇక్కడకు వచ్చేముందు వివాహమైంది. అది నాకు చాలా సంతోషం కలిగించింది. మీరు వెళ్లిపోయిన తర్వాత చాలా కాలం వరకూ రాజేంద్ర నన్ను వేధించాడు. ఒక సారి వివాహం సంగతి ప్రస్తావిస్తే నేను చెప్పేశాను. 'నా హృద‌యం పరాధీన' మని. నావలన అతను ఏది నష్టపోలేదు; ఏమీ కష్టాలు పడలేదు. అందుచేత అతని రుణం నామీద లేదు. అయినా అతడు నాకు చాలా సహాయం చేశాడు. ఇక సరళ సంగతి మీకు తెలుసు ఎంత చెంచెల చిత్తయో. ఏదయితేనేం వీరిద్దరికీ వివాహం జరిగింది. మంచిదే.

ఇక మీ సంగతి. పూజ్యులైన మీ తల్లిదండ్రులు పరమపదించారని విని నేను ఎంతో దు.ఖించాను. వారి దర్శనభాగ్య మైనా నాకు కలుగలేదు. జీవితంలో అత్తమామల ప్రేమ నాకిక లభించ దన్న మాట. ఈ మాటలు ఏదో మర్యాద పూర్వకంగా అంటూన్నాని మీరను కోకండి. నిజంగానే వారి ఆశీర్వాదాలు పొందాలని తీవ్రవాంఛ ఉండేది. ఏ పని స్వంతంగా చేయలేదు మీరు. అలాంటి విషాద పరిణామాన్ని ఎలా తట్టుకున్నారు మీరు.

మీ గురించి మీరు చాలా తక్కువగా రాశారు. మీమీద మీరే అభియోగాలు వేసుకున్నారు. అది మీరు ఆత్మ పరిశోధన అనుకున్నరేమో. అది ఎన్నటికీ కాదు. అది ఆత్మనింద మాత్రమే. మీరు రాశారు - మానసికంగా నేను చాలా పిరికివాడిని. దుర్భలుడిని. నన్ను నమ్మినవారెవ్వరూ సుఖపడలేదు. అమ్మీ, సుశీ సంగతే చూడు. ఆమె నన్ను నమ్ముకుంది. చివరకు ఏమైంది. ఆమెకు నేను తగనని దైవమే ఆమెను నానుండీ వేరు చేశాడు. ఇక నీ సంగతి. నన్ను సర్వవిధాలా నమ్ముకున్న నిన్ను మోస పుచ్చి నడి సముద్రంలో వదిలి వచ్చాను. ఎందుచేత? నీ అపరాధంయేమిటి? ఏమీ లేదు. నన్ను నువ్వు ప్రేమించడమే నీ అపరాధం. అసలు నీకు మొట్ట మొదటే సుశీ సంగతి చెప్పాల్సింది. అలా అయినట్లైతే మన ఇద్దరిమధ్యా ఈ బాంధవ్యం ఏర్పడక పోనేమో. అయినా నేను బాధపడే దేమంటే సుశీ ..యశోల ఎడ నా కర్తవ్యం నేను నెరవేర్చలేక పోయాను. చివరకు ఈనాడు నన్ను నేను నమ్ముకోలేకపోతున్నాను.

మీ వాక్యాల్లోంచి అశాంతి మానసిక క్షోభ తొంగి చూస్తున్నాయి. అలా ఎందుకుండాలి? మీ అభియోగాలకి నేను జవాబిస్తాను. మిమ్మల్ని నమ్మన వారెవ్వరూ సుఖపడ లేదన్నారు. సుశీని గురించి ప్రస్తావించారు. సుశీ విషయం మీరు చెప్పినప్పటి నుంచీ నేను చాలా యోచించాను. సుశీ అక్కయ్యకు నమస్కారం చేయలేక పోయాననే విచారం ఎన్నటికీ విడనాడదు. కాని ఆమె చాలా అదృష్ట‌వంతురాలు, మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమించింది. మీ ఆదరణ తిరిగి సంపాదించింది. జీవితంలో ఆమె ఎవరికి కష్టం కలిగించలేదు. తనూ ఇతరుల వల్ల కష్టపడ లేదు. 'అంతిమ సమయం అందరికి ఆసన్న మయ్యేదే కదా. ఆమె మీ ఒడిలో చనిపోయింది. అంతకంటె ఇంకేమి కావాలి? నేను కూడా మిమ్మల్ని సుశీ యాచించిన భిక్షే యాచిస్తున్నాను. నాక్కూడా అలాంటి మరణమే సంప్రాప్తించేటట్టు ఆశీర్వదించండి. ఎక్కడున్నా సరే. అంతిమ సమయంలో మీరాక కెదురు చూస్తూంటాను. జీవన్మరణాల మధ్య ఊగిసలాడే సమయంలో బాదల్ బాబు దర్శనంకోసం నాకళ్లు స్వాతి వానకెదురు చూసే ముత్యపు చిప్పలా కాయలు కాసి ఉంటాయి. మీరాక మునుపే నేను చనిపోయినట్లైతే నేను మహా పాపినన్నమాట.

మీరు అనవసరంగా బాధపడకండి. సుశీ, ఎడే కాకుండా, మీరు యశో ఎడ కూడా కర్తవ్యం నిర్వహిస్తున్నారు. మీ ఉన్నతి గురించీ, మీ సుగుణాల గురించీ, మీఎడ నా అభిప్రాయం గురించీ నేను చెప్ప నవసరం లేదు. అని నా నరనరాలకీ తెలుసు. ఒక్కమాట మట్టుకు నేను ఇక్కడ చెప్తాను. మీ జీవితపు చరిత్రలో మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన సంఘటన ఏదీలేదు. అంతేకాదు, మిమ్మల్ని ప్రేమించిన వారు మిమ్మల్ని చూసి గర్వ పడతారు. ఈ మాటల్ని మీరు వివ్వసించండి; నన్ను కరుణించండి.అంతే.

ఇంకొక మాట మీకు అక్కడ మనశ్నాంతి కరువైనా లేక నాదగ్గరకు రావాలనిపించినా, ఇక్కడికి వచ్చేయండి. ఒక్కరూ ఏమి చేస్తా ర్కకడ; ఈ ఆశ్రమం డూన్ కి యాభై మైళ్ల దూరంలో ఉంది. నేను 'రాణి ' అని ఇంతకుముందు చెప్పానే ఆమె ఇంకెవరోకాదు ...లఖియా. సరళ చెప్పింది కదా ఆమె సంగతి. చాలా మంచిది. మేమిద్దరం ప్రాణస్నేహితుల మయ్యాము. అంత శాంత స్వభావిని. సత్యశీల, నిష్కల్మషురాలు అరుదుగా కనబడుతుంది ఈ పాప భూయిష్టమైన ప్రపంచంలో ఆమెనుకూడా చూద్దురు కాని. ఇక్కడికి వచ్చేయండి. మీ గురించి ఆమెతో చాలా చెప్పాను; ఇంతే

ఇక వుంటా

మీ యశో"

 

చాప్టర్ 16

 

ఆ ఉత్తరం అందిన ఒక వారం రోజుల తర్వాత ముస్సోరీ బయలుదేరాను. దానిముందర, వెళ్లటమా, మానటమా అని నాలో నేను చాలా తర్కించుకున్నాను. ఏకాంతజీవితంలో పూర్తిగా విసిగిపోయాను. యశో సన్యాసిని అయిందంటే నేను నమ్మలేకపోయాను. ఆమెను చూడాలనే వాంఛ ఆ వార్త విన్న తర్వాత హెచ్చింది. అయినా యశో ఉత్తరం ఒక సన్యాసిని రాసిన దానిలా అనిపించడంలేదు! లఖియా కూడా అక్కడే ఉందని విని ఆమెని చూడాలనే ఆత్రుత కలిగింది. ఆమె కథ నేనెన్నడూ మరువలేదు. యశో, లఖియా అక్కడ కలుసుకోవటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. వెళ్లటానికే నిశ్చయించాను. అన్ని భారాలతోపాటు ఇంటిభారం, భూముల భారం బాబయ్యమీద పెట్టాను. డెహ్రాడూన్ చేరుతూ అనుకున్నాను - మొదటి సారి వెళ్ళినప్పుడు నా రాక కోసం యశో ఆమె తండ్రి ఎదురుచూస్తున్నారు రైల్వే ప్లాట్ఫారం మీద, ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు స్వర్గంలో ఉన్నాను. ఇంకొకామె ఆశ్రమంలో ఉంది. మొదటిసారి సుశీని మరచిపోవటానికి వెళ్ళేను; రెండో సారి యశోను వెదకటానికి వచ్చాను.

నాకు యశోమీద కోపం వచ్చింది. మూర్ఖురాలు ఆశ్రమం ఎక్కడవుందో, అక్కడకు ఎలా జేరాలో, ఏమీ రాయలేదు. ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు నేనెంత బాధపడాలి? నాకు ఒకేఒక ఆశ కలిగింది. సరళను కలుసుకోగలిగితే. ఆమె ఎక్కడుందో యశో రాయలేదు. సహజమంగా అత్తవారింట్లోనే ఉంటుంది ముముస్సోరిలో; బహుశా యశో అందుకే రాయలేదేమో. సామాను క్లోక్ రూమ్ లో వదిలి, ముస్సోరి కి బయలుదేరాను. ముస్సోరి చేరుతూనే చూచాయగా గుర్తున్న సరళా-రాజేంద్ర గృహాన్వేషణ మొదలుపెట్టాను. బజారులోంచీ పోతున్నాను.

రామం బాబూ.' అని ఎవరో పిలిచినట్లైంది. పక్కకు చూశాను. ఇంకెవరు సరళే! షాపులోంచిబయటికి వస్తూ కనబడింది.

''ఎప్పుడు వచ్చారు రామంబాబూ. తలవని తలంపుగా కనబడ్డారు. ఎక్కడి కిలా వెళ్తున్నారు?'' అంది దగ్గరకు వచ్చి.

''ఇప్పుడే వచ్చాను సరళా. మీ ఇంటికే బయలుదేరాను,'' అన్నాను.

''భలేవారే మీరు. మా ఇల్లు బజారులో ఉందని ఎవరు చెప్పారు మీకు? క్రిందటి సారి మా ఇంటికి వచ్చారుగా!'' అంది నవ్వుతూ.

అప్పుడే రాజేంద్ర కూడా వవచ్చాడు రెండు షాపింగ్ బాగ్స్ తో.

''మీకు ఇంకా తెలియదనుకుంటాను, ఈయనగారు మా శ్రీవారు. మీకు శుభలేక పంపటం ఇష్టంలేక వెయ్యలేద,'' అంది సరళ రాజేంద్ర చెయ్యి పట్టుకుని .

అందుకు నేను కారణమడుగలేదు కాని ఇద్దరినీ కంగ్రాజులేటు చేశాను.

''రాజేంద్ర, మీకు ఇంకా ఏదో పని ఉందన్నారు కదా. అది చూసుకుని రండి. నేను ఈయనను ఇంటికి తీసుకెళ్తాను," అంది సరళ.

రాజేంద్ర రెండు షాపింగ్ బాగ్స్ సరళ కిచ్చి ఇంట్లో కలుస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.

''పదండి రామంబాబూ. మా ఇంటికి దారి చూపిస్తాను,'' అంది సరళ నా చేయి పట్టుకుని.

మూడు సంవత్సరాలైనా, వివాహిత అయినా ఆమె ఏమీ మారలేదు. నేను నవ్వి ఊరుకున్నాను.

''నాకు రాజేంద్రకు వివాహం అయిందన్న వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరచిందా రామంబాబూ,'' అంది సరళ.

''లేదు సరళా. నాకు అది చాలా సహజంగా కనబడింది. అయినా నాకిది ఇంతకు ముందే తెలుసు, యశో ఉత్తరం రాసింది,'' అన్నాను.

''యశో ఉత్తరం రాసిందా? ఎక్కడ ఉంది, ఎప్పుడు రాసింది,'' అంది సరళ ఆశ్చర్యంతో.

''ఉత్తరం ఒక వారం రోజుల క్రితం అందింది. ఎక్కడో డూన్ కి యాభైమైళ్ల దూరంలో ఒక ఆశ్రమంలో ఉంటున్నానని రాసింది. అందుకోసమే ఇక్కడకు వచ్చాను. ఈ సన్యాసినిని వెదుకుదామని,'' అన్నాను.

''అరె. గమ్మత్తుగా ఉందే. ఇంత దగ్గరలో ఉండి కూడా నాకు తెలియదు,'' అంది.

నేను కాస్సేపు మాట్లాడలేదు. నడిచిపోతున్నాం సరళ కూడా ఏదో ఆలోచిస్తూవుంది.

''సరళా. లఖియా సంగతి నీకేమైనా తెలుసా?'' అన్నాను.

లఖియా పేరు విని సరళ తుళ్లిపడింది.

''లేదు,'' అంది.

''తను కూడా అక్కడే ఉందిట,"అన్నాను.

''ఏమిటి మీరనేది రామంబాబూ. లఖియా యశోదగ్గర ఉందా?'' అంది, గట్టిగా నాచేయి పట్టుకుని.

''అక్షరాలా నిజం సరళా. యశో రాసిందలా,'' అన్నాను.

సరళ ఎంతో కష్టం మీద సంతోషాన్ని ఆపుకుంది. కళ్లు జ్యోతుల్లా వెలిగాయి.

''పదండి రామం బాబూ. నేనుకూడా వస్తాను మీతో. రేపు పొద్దున బయలు దేరుదాము,'' అంది ఉత్సాహం వుట్టిపడే కంఠంతో.

ఇంటి వద్దకు వచ్చేశాము. నా సామాను డూన్ లో వదిలివచ్చిన సంగతి అప్పుడుజ్ఞాపకం వచ్చింది.

''అరే. సరళా . నాసామానంతా డూన్ లో వదలివచ్చాను,'' అన్నాను.

''ఫర్వాలేదు లెండి, రోడ్డు మీద వదలకపోతే ఏమీ అయిపోవు. మీక్కావాల్సిన సదుపాయాలన్నీ నేనే చేస్తాను. రేపు పొద్దున దారిలో తీసుకుందాము,'' అంది.

నేనింకేమీ మాట్లాడలేదు.

ఒక గంట పోయిన తర్వాత రాజేంద్రతిరిగి వచ్చాడు. ఆనాడు భోజనాల దగ్గర సరళ ''యశోని చూడటానికి వస్తావా రాజేంద్రా,'' అంది.

యశో పేరు విని కాస్త కంగారుపడ్డాడు. యశో, యశో అంటూ, ''వస్తాను. అసలు ఎక్కడవుంది, ఏమి సంగతి?'' అన్నాడు.

''ఇక్కడ ఏదో ఆశ్రమంలో ఉందట. రేపు బయలుదేరుదాం. లఖియా కూడా అక్కడే వుందిట?'' అంది.

''అయితే రేఫు నీకు కనుల పండుగ,'' అన్నాడు నవ్వుతూ.

 

చాప్టర్ 17

 

యశో అన్వేషణార్దం, ఆ మరునాడు ఉదయం, ముగ్గురమూ బయలుదేరాము. అదృష్ట‌వశాత్తు వాకబ్ చేస్తే డూన్ కి దక్షిణదిశలో ఏవో ఆశ్రమాలున్నాయని తెలిసింది. దారిలో నా సామను కారులోకి ఎక్కించి. తినటానికి టిఫిన్ తీసుకుని బయలుదేరాము. ఒక గంట ప్రయాణం చేసేటప్పటికి ఏవో పర్ణ కుటీరాలు కనబడసాగాయి. కారు దిగి వెళ్లి ఆ ఆశ్రమాల్లోకి వెళ్లి అడిగేవాళ్లం, 'సుందరి అనే చక్కటి సన్యాసిని ఉందాయని'.

కొన్నిచోట్ల, 'ఆ, వుంది అనే వారు, నా గుండె వేగం హెచ్చేది. సుందరి వచ్చేది, కాని ఈ సుందరి వేరు; వెదకుతూన్న సుందరి వేరు, ఇలా చాలా చోట్ల జరిగింది. లఖియా, రాణీల పేరు చెప్పినా ఫలించలేదు.

తిరిగి తిరిగి అలసిపోయాము. యశో, లఖియాల ఆచూకి దొరకలేదు. నిరాశ, నిస్పృహ‌ల‌తో అందరి హృద‌యాలు నిండిపోయాయి. ఇంతదూరం వచ్చి వట్టిచేతులతో తిరిగి పోతామా? అక్కడ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందులో ఎక్కడో యశో ఉందని నాకు నమ్మకంగా ఉంది. కాని ఆమెను వెదకటం ఎలాగ? తెచ్చుకున్న టిఫిన్ అయిపోయింది. ఆకలికూడా వేస్తూఉంది. ఇదంతా వృధా ప్రయాసేనా? రాజేంద్ర నెమ్మదిగా కారు నడుపుతున్నాడు. అందరి ముఖాల మీద నిరుత్సాహం స్పష్టంగా కనబడుతుంది. ఇంతలో హఠాత్తుగా సరళ అరిచింది, "కారు ఆపండి"

రాజేంద్ర సడన్ బ్రేక్ వేసిన కారు సరిగ్గా ఆగకుండానే సరళ తలుపు తీసివెనుకకుక పరుగెత్తింది. మేమిద్దరమూ కారులోంచి బయటికి వచ్చేసరికి సరళ ఒక అపరిచిత యువతి కౌగిలిలో ఇమిడి ఉంది. వాళ్ళని రాజేంద్ర నేను కూడా చేరేము. ఆ యువతి; తెల్లటి శరీరఛాయలో తెల్లటి చీర ఇమిడి ఉంది. ఒక వ్యక్తి ముఖంలో అంత ప్రశాంతతా, చల్లదనమూ వెన్నెల్లా నేను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఆ సుందర యువతి నొసటి కుంకుమలేదు. ఆమె లఖియా అని గ్రహించాను.

సరళ కళ్లవెంట కన్నీటిధార కారుతోంది. 'లఖియా, లఖియా' అని మాత్రం అంటూ ఉంది. మమ్మల్ని చూసి, లఖియా సరళ కౌగిలినుంచి విడిపించుకుని, చీర చెంగు తల మీద పూర్తిగా కప్పుకుంది.

సరళ అప్పటికి ఈ లోకంలోకి వచ్చింది.

మాఇద్దరినీ లఖియాకి పరిచయం చేసింది. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాయి. లఖియా వదనం మీంచి దృష్టి మరల్చుకోలేక పోయాను. ఆమెని చూడాలనీ, కలుసుకోవాలనీ, నాలో వున్న విపరీతమైన వాంఛ అలా హఠాత్తుగా ఫలించేటప్పటికి నేను క్షణ కాలం మూగవాడి నై పోయాను.

''లఖియా, రామంబాబు ఒక సారి నాతో అన్నారు, లఖియా నీకు మళ్లీ కనబడితే నాకు తప్పకుండా కబురుచెయ్యి సరళా; నేను ఎక్కడున్నా, ఎలా వున్న చూడటానికి వస్తాను; ఆ అజ్ఞాత‌ యువతికి నేను జోహారులర్పిస్తున్నాను,'' సరళ అంది.

అలాంటి మాటలు సరళ ఇంత ఆసందర్భంగా, అనాలోచితంగా మాట్లాడుతుందని నేనూహించలేదు. లఖియాకు కోపం వస్తుందేమోనని భయపడ్డాను. ఆమె తలెత్తి నా కళ్లల్లోకి ఒకసారిచూసింది. ఆ చూపు నాకర్థం కాలేదు. కాని అందులో కోపం లేదు; చల్లటి వెన్నెల వుంది.

''మీరంతామా ఆశ్రమానికి తరలివచ్చారా? అయితే పదండి. సుందరికి ఇవాళ పర్వదినం అవుతుంది," అంది,అప్పుడు లఖియా.

లఖియాని కారులో ఎక్కించుకుని వాళ్ళ ఆశ్రమానికి బయలుదేరాము. రెండు ఫర్లాంగులు చెట్లు, చేమల లోంచి వెళ్ళేడప్పుడికి చిన్న చిన్న పూలతోటలూ, పర్ణకుటీరాలు ఎదురయ్యాయి.

''ఇదే సుందరి కుటీరం, లోపలికి వెళ్లి కూర్చోండి. నేను వెళ్లి పిలుచుకు వస్తాను,'' అంది లఖియా.

''ఒక వేళ లోపలుందేమో,'' అంది సరళ

''అబ్బే. ఆ ప్రశ్నకి తావేలేదు, సుందరి ఈ సమయంలో గురువు గారి దగ్గర ఉంటుంది. ఆమె భోజన మైనా మానుతుంది కాని ఇది తప్పదు. ఇప్పుడే తీసుకువస్తాను,'' అని లఖియా నవ్వుతూ వెళ్లింది.

తలుపు తోసుకుని లోపలికి వెళ్లాము. లోపల మట్టినేల అప్పుడే ఆలికినట్టుంది. గదికి ఒక మూల పూజాసామగ్రి వుంది. ఒక ఎత్తైన మట్టిగోడ ఆ పెద్ద గదిని రెండు భాగాలుగా విభజిస్తోంది. ఇంకొక మూల వంటసామగ్రి వుంది. ఇవికాక ఒక పెద్ద ట్రంకు పెట్టి ఉంది. బహుశా చీరలపెట్టి అయివుంటుంది. పెట్టి దగ్గర రెండు చాపలుకూడా ఉన్నాయి. ఆ కుటీరమూ, ఆ నిరాడంబరత్వమూ చూసి మా ముగ్గురినోట మాట పెగల్లేదు. సరళ చాప పరిచింది. ముగ్గురమూ కూర్చున్నాము. ఎవరికీ ఏమి మాట్లాడాలో తోచటం లేదు.

''భలే ఇళ్లు, వీరిద్దరినీ మనతోటి తీసుకుపోవాలి, ఏమంటారు,'' అంది సరళ అఖరికి.

జవాబుగా అన్నట్టు, అప్పుడే బయట అడుగుల సవ్వడి అవగా , నేను గుమ్మం వైపు చూసాను.

ఎదురుగా ఏ స్త్రీమూర్తిని చూడటానికి నా మనసు మూడు సంవత్సరాల నుంచీ తహతహ లాడుతోందో, ఆ నా యశోరాజ్యం స్వయానా ప్రత్యక్షమైంది. క్షణమాత్రం గుమ్మంవద్ద ఆగి, మరుక్షణంలో చీర చెంగు తలమీదికి లాక్కుని, గబగబా లోపలికి వచ్చింది. మా ముగ్గురికీ నమస్కరించి.

''ఎంత సుదినం, తలవని తలంపుగా వచ్చారే ముగ్గురూ,'' అంది.

మూడు సంవత్సరాల క్రితం విన్న అదే కంఠస్వరం ఎంత మధురంగా ఉంది.

''పవిత్రమైన నీ గృహాన్ని అపవిత్రం చేయ లేదు కదా, '' అంది సరళ వ్యంగ్యం గా.

''నా గృహం అపవిత్రమవ్వాలంటే నేను అపవిత్రమవ్వాలి సరళా. రాజేంద్రబాబూ, మీరు నన్ను క్షమించాలి. ఇంతకాలం ఇంతదగ్గరుండి కూడా మీకు నావునికి తెలియపర్చనందుకు,'' అంది యశో.

''అలా అనకు యశో. ఈనాడు చూశాము అదే చాలు'' అన్నాడు రాజేంద్ర. కంఠంలో కాస్త తొట్రుపాటు వుంది.

అంత వరకూ నా యశో నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అందరినీ పలకరించిన తర్వాత నా వైపు తిరిగి చిరునవ్వు నవ్వుతో.

''మీరు మీరిద్దరినీ ఎక్కడ కలుసుకున్నారు. రాజమండ్రి నుంచీ ఎప్పుడు వచ్చారు?'' అని అడిగింది యశో.

''నిన్న పొద్దున ముస్సోరీ బజారులో మా ఇంటి కోసం వెతుకుతూ కనబడ్డారు,'' అంది సరళ నా బదులుగా.

''అబద్దం చెప్పివుంటారు. అలా దేనికోసమైనా వెతకటం ఆయన స్వభావానికే విరుద్దం. అలా నడుస్తూంటే అదే కనబడుతుందనుకుంటారు. ప్రపంచంలో ఏదైనా ఆయన కాలికి వచ్చి తగలాలి. అప్పుడు స్వీకరిస్తారు అంతే కాని దాని కోసం ఆయన వెతకరు," అంది యశో బలవంతంగా నవ్వు ఆపుకుంటూ.

యశో వెనకాల నుంచుని లఖియా నాకేసి చిరునవ్వుతో చూస్తోంది. అంతమందిలో యశో నా స్వభావాన్ని గురించి చర్చించటం నాకు నచ్చలేదు.

''అది సరే సుందరీ. వీరికి బస ఎక్కడ చూపించుదాం, అదేదో చూడు ఆలస్యమవుతూంది,'' అంది లఖియా.

''నేనింక వెళ్లిపోవాలి సరళా. నువ్వు తర్వాత ఎప్పుడు వస్తావు,'' అన్నాడు రాజేంద్ర .

''ఇప్పుడెక్కడికి వెళ్తారు రాజేంద్రబాబు. మా అతిథ్యానని కొద్ది రోజులైనా స్వీకరించండి, తిరస్కరించకండి.'' అంది యశో కంగారుపడుతూ.

''అది కాదు యశో, రాజేంద్రను వెళ్లనీ, ఇప్పుడిప్పుడే కొన్ని కేసులు వస్తూన్నాయి. ఇవికూడా సరిగ్గా చూడకపోతే ఉన్న ప్రాక్టీసు కూడా పోతుంది. మళ్లీ వస్తారు. ఇప్పుడు ఈ ప్రదేశం ఆచూకీ తెలుసుకనుక,'' అంది సరళ భర్త తరుపున సంజాయిషీగా.

''అలా అయితే కాస్సేపాగండి, కాసిని పళ్లు తీసుకుని వెళ్లండి,'' అని, యశో ఆ మట్టిగోడ చాటుకు వెళ్లి ఒక పళ్లెంలో రకరకాల ఫలాలు పట్టుకువచ్చింది.

''అయితే తిరిగి ఎలా వస్తావు? నన్ను రమ్మంటావా?''అన్నాడు రాజేంద్ర సరళతో యశో ఫలహారం సేవించి.

''అదంతా మేము చూసుకుంటాము రాజేంద్రబాబూ, మీరు దిగులుపడకండి. కాని ఇది జ్ఞాప‌కముంచుకోండి, మీకు వీలున్నప్పుడల్లా మా ఆతిథ్యం ఎంత అల్పమైనదైనా లభిస్తుంది,'' సరళ కు బదులుగా యశో జవాబిచ్చింది.

''ఈ విషయం ఈనాడు చెప్పేవుకనుక జ్ఞాప‌కం ఉంచుకుంటాను యశో. సరళా, నేను తరచుగా వస్తాంలే,'' అని రాజేంద్ర వెళ్లిపోయాడు.

అతని మాటాల్లో కాస్త ఆవేశం పొడచూపింది.

ఆ తర్వాత కాస్సేపు మేము ఎవరమూ మాట్లాడలేదు. అప్పుడు యశోని పరిశీలనగా చూశాను. ఎంత గంభీర సౌందర్యం, ఆ పచ్చటి శరీర ఛాయ, నిండైన విగ్రహం, తీర్చిదిద్దిన రూపం. అన్నీ అలాగే ఉన్నాయి. ఆకుపచ్చరంగు చీరకట్టుకుని ఉంది. జుట్టు విరబోసుకుని ఒక ఎర్రటి రిబ్బను మెడకింద నుంచి లాగి నెత్తిమీద ముడివేసింది. ముఖం మీద చిన్న కుంకుమ బొట్టు ఉంది. ఆ అపురూప సౌందర్యరాశిని అలాగేచూస్తూ కూర్చున్నాను. ఈ స్త్రీనేనా నేను మూడు సంవత్సరాల క్రితం మొదటిసారిగా రైల్వే ప్లాట్ఫారం మీద చూశాను? చెంగుమని నవ్వుతూ నమస్కారమండి అంటే. ప్రతి నమస్కారం చెప్పడం మరచిపోయాను. ఈమేనా ఆనాడు నా కాళ్ళ మీద తన తలపెట్టి, ''ఇక్కడే కొంచెం చోటివ్వండి" అంది! మూడు సంవత్సరాల క్రితం యశోకి ఇప్పటి ఈ సుందరికీ ఒకటే తేడా కనబడుతోంది. ఇప్పుడు ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. క్రోధం హరించి పోయినట్టు కనబడుతోంది.

ఆమైకం లో, నేను నా ఎదురుగుండా కూర్చున్న యశోని గమనించలేదు.

''ఏమిటి, ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బాదల్ బాబూ?"అన్న యశో కంఠ ధ్వని నన్నీ లోకంలోకి లాక్కొచ్చినట్లయింది. చూడగా, సరళా, లఖియాలు లేరు మాదగ్గర.

"ఏమిటి, యశోకి, సుందరికి పోలికలు కడుతున్నారా?'' అంది.

అప్పటికి నాకు మత్తు పూర్తిగా వదిలింది.

''నిజం చెప్పావు యశో, కాని, ఇది మొదట చెప్పు. ఇంత శాంతంగా, చక్కగా చిరునవ్వు నవ్వటం ఎక్కడ నేర్చుకున్నావు? నీ ముఖంలో ఇంత ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది,'' అని అడిగాను.

''ముఖం మనస్సుకు ప్రతిబింబం మాత్రమే బాదల్ బాబూ, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇక శరీరానికి రోగాలుకూడా రావు, చూడండి, జనమంతా శరీర సంరక్షణకి ఎన్నో మందులూ మాకులూ మింగుతూ ఉంటారు. అయినా రోగాల దారి రోగాలదే, కాని ఇక్కడకి మాత్రం అవిచొరబడలేవు. అందుకే మేమెంత ఆరోగ్యంగా ఉంటామో చూడండి,'' అంది, చిరునవ్వుతో

''అయితే ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అమ్మీ'' అన్నాను.

''ఇంకెవరూ, మా గురువుగారే, అన్నట్టు మరచాను.. ఉత్తరంలో అమ్మీ అని నాకు కొత్త పేరు పెట్టారు దేనికి? ''అంది నవ్వుతూ.

"కొత్తగా పేరు పెట్టలేదు, అప్పుడప్పుడు ఆప్యాయంగా అలా పిలవాలని బుద్ధి పుట్టింది. అస్తమానమూ ఒకే పేరుతో పిలుస్తే ఏం బావుంటుంది చెప్పు. ఇప్పుడు నీకు మూడు పేర్లున్నాయి, యశో, సుందరీ, అమ్మీ,'' అన్నాను.

'అన్నిటిలోకి నాకు అమ్మీ అనే పేరు నచ్చింది తెలుసా,'' అంది సంతృప్తితో.

''సరే బాగానేవుంది. ఇక్కడ తాగడానికి కాస్త కాఫీ, టీ లాంటి జల పదార్థాలు దొరుకుతాయా? చాలా అలసి పోయాను,'' అని ఆ చాపమీద చేతులు తలకింద పెట్టుకుని పడుకున్నాను.

''ఆ సదుపాయాలన్నీ రేపటి నుంచి చేస్తాను. ఇక్కడకు పదిమైళ్ల దూరంలో ఇవన్నీదొరుకుతాయి, ఈ సాయంకాలమే రణధీర్‍ని ఆ ఊరికి పంపిస్తాను. ఈ పూటకు పండ్లుతిని గడపాలి,'' అంది యశో దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని.

తన కంఠస్వరంలోంచి వ్యాకులత నామీద నాకే కోపం తెప్పించింది.

''వద్దు యశో, ఊరికే అన్నాను. ఇక్కడ నీకు ఎలా గడుస్తుందో అలాగే ఉండనీ. నీకు లభించని సుఖం నాకు అక్కర్లేదు,'' అన్నాను.

''అలా మీరు ఉండలేరు. వ్యర్ధంగా పంతం కోసమని మీరలాంటి పనులు చేసి బాధపడి నన్ను బాధపెట్టకండి. మీరు ఈ ఆశ్రమంలోని వ్యక్తులు కారు కనుక ఈ నియమాలు మీకు వర్తించవు. ఇంకొకటి ..ఇక్కడ కూడా మీ భారమంతా నేనే వహిస్తాను. ఇక్కడ మీకు లోపాలు చాలా కలుగుతాయి. వాటిని హృద‌యానికి పట్టించుకుని నన్ను కష్టపెట్టకండి,'' అంది.

''ఎంతో కాలం తర్వాత అలాంటి ప్రేమావాత్సల్య పూరితమైన మాటలు విన్నాను. కరుడు కట్టిన నా హృద‌యం కరిగిపోయింది. నీకు తెలుసు గదా యశో, నేను మానసికంగా ఎంత బలహీనుణ్ణో, ఎంతనిరర్ధకుడినో, ఇలాంటి వాడిని దగ్గర పెట్టుకుని నీవేమి సుఖపడతావు అమ్మీ,'' అన్నాను.

''అదంతా నా బాధ్యతే బాదల్ బాబూ. మీ బలహీనత నాకు తెలుసు. సర్వవేళలా మిమ్మల్ని ఎవరో ఒకరు కనిపెట్టుకొనుండాలి. కాని మీలో వజ్రంలాంటి కాఠిన్యత వుంది. మీకు కోపం వచ్చిందంటే నాకు తగని భయం. ప్రతి చిన్న విషయాన్ని పట్టించు కోకండి. ముఖ్యంగా గతాన్ని గురించి ఆలోచించకండి,'' అంది యశో నా చొక్కాగుండీ తిప్పుతూ

ఆమె ముఖం లజ్జా రాగరంజితమైంది. ఈ మూడు సంవత్సరాల నుంచి దాగి ఉన్న ప్రేమా, వాత్సల్యం, అనురాగమూ ఈనాడు పెల్లుబికి వచ్చాయి. ఆ ధాటికి తట్టుకోలేక పోయింది. పళ్లు తీసుకొస్తాను అని లేచి పళ్లెంలో పళ్లూ, మంచినీళ్లు తీసుకువచ్చింది.

''తింటూ ఉండండి. నేను రణధీర్ తో చెప్పి వస్తాను,'' అని బయటికి వెళ్లిపోయింది.

కొంత సేపటికి లఖియా ''సుందరీ'' అంటూ లోపలికి వచ్చి, నన్ను చూసి గుమ్మం వద్ద ఆగిపోయింది.

''సుందరి ఎక్కడికి వెళ్లింది రామం బాబూ? '' అని అడిగింది.

''ఇప్పుడే వస్తుంది. లోపలికి రండి,'' అన్నాను నేను లేచి.

"మీ కొక మాట చెప్దామనుకున్నాను రామంబాబూ. సరళనీ, సుందరినీ పిలిచినట్లే నన్ను కూడా పేరు పెట్టి పిలవండి,'' అంది లఖియా లోపలికి వచ్చి నవ్వుతూ.

''తప్పకుండాఅలాగే చేస్తాను లఖియా, మూడు సంవత్సరాల క్రితం నీ వృత్తాంతం విన్నప్పట్నుంచీ, నీ గురించి చాలా ఆలోచించాను. అనేకసార్లు కన్నీరు కూడా కార్చాను. నీలో ఇంత సహనమూ, పేర్మి, ఔదార్యమూ ఎక్కడివి? అని అనుకునేవాడిని,'' అన్నాను.

లఖియా ఈ అప్రస్తుత ప్రశంసకి సిగ్గుపడింది.

''మీ దయకూ, అభిమానానికీ కృత‌జ్ఞురాలిని రామంబాబూ. కాని నాలో కూడా లోపాలు చాలా ఉన్నాయి. కళ్లకు కనబడేటంత మంచిదానను కానేమో,'' అంది ముఖం క్రిందకి దించుకుని,

''అది సరే లఖియా, జీవితంలో ఇప్పటివరకూ నువ్వు అష్టకష్టాలు అనుభవించావు. ఇక ఇప్పటినుంచీ నైనా సుఖపడాలని నా కోరిక,'' అన్నాను.

లఖియా ఏమీ జవాబివ్వలేదు.

"నువ్వు యిల్లు వదలి వచ్చిన తరువాత వెంటనే ఇక్కడికి వచ్చావా?'' అన్నాను సంభాషణ దారి మళ్లిద్దామని.

''లేదు,'' అంది.

''అయితే తర్వాత జరిగిందేమిటో వినాలని కోరికగా ఉంది. లఖియా,'' అన్నాను.

''అలా కోరికగా ఉండటము అస్వభావికమేమి కాదు రామంబాబూ, ఇప్పుడుకాదు, మరోసారి చెప్తాను,'' అంది లఖియా తల పైకెత్తి మందహాసము చేస్తూ.

''చాలా ఆలస్యమయిపోయింది. ఏం చేస్తూన్నారు?'' అంటూ లోపలికి వచ్చింది.

యశో వెనుక ఒక పద్దెనిమిది పందొమ్మిది సంవత్సరాల యువకుడు నెత్తిమీద ఒక మంచం పెట్టుకు నుంచున్నాడు.

''అరే. రాణి, సరళను వదిలి వచ్చావా ఇక్కడికి,'' అంది యశో లఖియాను చూసి.

''చిన్నక్కా, మంచం ఎక్కడ పెట్టను?'' అన్నాడు కుర్రాడు.

''ఆ గోడపక్కన పెట్టి, పెట్టి బాబుగారికి నమస్కరించు,'' అంది యశో అతనికి దారిస్తూ.

అక్కగారి ఆదేశాన్ని ఆ తమ్ముడు పాలించాడు. నాకు ఏమని ఆశీర్వదించాలో తెలియక మెదలకుండా వూరుకున్నాను.

''అలా చూస్తారేంటి? రణధీర్‍ మీ కోసం ఈ మంచం చాలా దూరం నుంచీ తీసుకొచ్చాడు. ఏమైనా చెప్పండి. ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు ఇంతే. సృష్టిక‌ర్త‌ ఈ ప్రపంచాన్నిమీ సేవకోసం సృష్టించాడని మీ ఉద్దేశం,'' అంది యశో

యశోకి ఈ అలవాటు మొదటి నుంచీ ఉంది. నా లోపాలను గురించి ఇతరుల వద్ద ఎంతో మమకారంతో మాట్లాడుతుంది. దానివలన, ఆమెకు అదొక విధమైన మానసిక సంతృప్తి లభిస్తుందను కుంటాను.

''అదేమిటి సుందరీ. రామంబాబు మీద ఎందుకు అలా చాడీలు చెప్తావు,'' ఆ అభియోగానికి ఈసారి లఖియా జవాబు చెప్పింది.

''మన కర్మ రాణి, చెపితే ఎవరూ నమ్మరు, బయటికి ఎంతో అమాయకుడిలా కనబడతారు, నీకు తెలియదు. మూడు సంవత్సరాలుగా ఆయన నన్నుఎంత దుఃఖపెట్టారో, హృద‌యం పగిలిపోయ్యేటట్టు కుమిలిపోతూంటే ఈయన ఒక సానుభూతి మాటైనా చెప్పలేదు. ఏడిచే దానిని ఇంకా ఏడిపించి పోయారు. పైగా నన్ను మరచిపో అని సలహా ఇచ్చారు,'' అంది యశో.

యశో మాటల తీరు నాకు నచ్చలేదు.

''రణధీర్‍ నిన్ను ఆశీర్వదించలేదని మీ అక్కకు కోపం వచ్చింది. అందుకని ఆశీర్వదిస్తాను అక్కగారి సేవలో సుఖంగా ఉండు," అన్నాను మాటలు తప్పించుకుందామని.

''బాగా ఆశీర్వదించారు రామంబాబూ. అన్నట్టు మా రణధీర్ ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడో మీకు తెలుసా, ఒకసారి ఆశ్రమం చూడటానికి వచ్చిన మూడు పెద్దపులులను తరిమివేశాడు. ఇంకోసారి ఒక నక్క...'' లఖియా నవ్వుతూ ఏదో చెప్తూంటే, రణధీర్ అడ్డువచ్చాడు.

''పెద్దక్క ఎప్పుడూ ఇంతేనండీ, నన్ను వేళాకోళం చేస్తుంది. ఆమె మాటలు నమ్మకండి,'' అన్నాడు.

''సరే చిన్నక్కతో పాటు ఈ యువకుడికి పెద్దక్కకూడా ఉందన్నమాట. కుర్రవాడు మంచివాడులాగే ఉన్నాడు. శరీర దారుఢ్యం కలవాడని స్పష్టంగా కనబడుతోంది. యశో, రణధీర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందర సరళను చూద్దాం పదండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్లిపోతుంది,'' అన్నాను

ముగ్గురమూ సరళ వద్దకు వెళ్లి తనతో సహా ఆ సాయంసంధ్యలో గంగాతీరం చేరి, బాగా చీకటి పడిన తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చాము. భోజనాలైన తర్వాత సరళ లఖియాతో వెళ్లిపోయింది.

పనులన్నీ ముగించుకుని యశో నా పక్క వేస్తోంది. అప్పటివరకూ నాకు ఈ మాటే గుర్తుకురాలేదు. ఆ ఒక్క గదిలో మేమిద్దరమూ ఎలా పడుకుంటాము. ఈ ఆశ్రమంలోని సన్యాసులు, ఇతరులు, మమ్మల్ని చూసి ఏమనుకుంటారు? ముఖ్యంగా లఖియా ఏమనుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారం నాకు ఏమీ కనబడలేదు.

''నేను బయట పడుకుంటాను యశో,'' అన్నాను నెమ్మదిగా, భయపడుతూ.

యశో పక్క వేయటం మాని నాకేసి ఒక క్షణం తీక్షనంగా చూసింది.

''ఈ చలిలో బయట పడుకుంటారా? మీకంత మీలో నమ్మకం లేకపోతే, మీకంత భయమైనట్లైతే నేను బయట పడుకుంటాను. మీరలా చేయాల్సిన అవసరం లేదు,'' అంది ఆఖరికి.

నేనేమీ మాట్లాడలేదు, ఏమనాలో తెలియలేదు. నేను భయపడిందేమిటంటే.. దీని ఫలితంగా యశో మీద అపవాదు పడుతుందేమోనని, ఒక అరగంట పోయిన తర్వాత, యశో ఒక చాప తీసుకుని బయటికి వెళ్లిపోతుంది. అది నేనెలా సహిస్తాను. నేనెలాంటి వాడినైనా పాషాణ హృద‌యుడిని కాదు, నేనెవరిని, ఆ ఇంటిలో ఒక అతిథిని, అది మరచిపోయి అలాంటి పని జరగనిస్తానా?

''నాకూ హృద‌యమంటూ ఒకటి వుంది అమ్మీ, పద లోపలికి, ఈ రేయినుంచీ మనం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దాము,'' అన్నాను నేను యశో చేయిపట్టుకుని.

యశో మాట్లాడలేదు. ఒక సారి నా కళ్లలోకి చూసి తల వంచుకుంది. అప్పుడు నేనే ఆమె చేతిలోంచి చాప తీసుకుని గదిలో మట్టిగోడకు ఆవలివైపున పరచేను.

ఆమె ఇంకా గడప దగ్గరే ఉంది. నేను ఆమె దగ్గరకు వెళ్లి, చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వచ్చాను. అయినా, తనకు ఇంత సిగ్గు హఠాత్తుగా ఎందుకు వచ్చిందో? నా మగత నిద్రలో ఆ రాత్రంతా ఊహిస్తూ నే ఉన్నాను.

 

చాప్టర్ 18

 

ఆ మరునాడు మధ్యాహ్నం, నన్నూ సరళనీ వెంటబెట్టుకుని యశో గురువుగారి వద్దకు బయలుదేరింది. వెళ్లాలనే కోరిక మాలో ఏమంత ఎక్కువగా లేదు. అయినా యశో పట్టుపట్టింది. వారి ఆశీర్వాదం పొందితే శుభం చేకూరుతుందంది.

వెళ్లటంవల్ల మాకు నష్టమేమీ లేదు పోతే యశో ఇంత గౌరవించే ఈ సన్యాసిని చూసినట్టవుతుంది. అంతవరకు నాకు సన్యాసులంటే నమ్మకమూ లేదు. అపనమ్మకమూ లేదు. అసలు నిజమైన సన్యాసిని నేను చూడలేదు.

దగ్గరలోనే ఉంది ఆయన నివాసం. మిగతావాటికంటె ఆ కుటీరం పెద్దదిగా కనబడింది. యశో ముందర లోపలికి వెళ్లింది, నేనూ సరళా గుమ్మంవద్ద నుంచుని తొంగిచూస్తూ ఉండిపోయాం ..

ఇక్కడ కాస్త ఆగి ఈ గురువుగారి గురించి చెప్పాలి. నేను అనుకున్నట్టు తానేమి ముసలివాడు కాదు, నలభై సంవత్సరాలు మించవు. నల్లటి పొడుగాటి గెడ్డంవుంది. ఒంటినిండా బ్రహ్మాండమైన బొచ్చువుంది, ఎలుగుబంటువలె. ఒక పచ్చటి పంచ కట్టుకుని ఒక ఎత్తైన ఆసనముమీద కూర్చున్నాడు. క్రింద పాముకోడు పాదరక్షలున్నాయి. ఆయన చుట్టూ నలుగురైదుగురు స్త్రీలు గుమికూడి ఉన్నారు. అందరూ వసకన్యల్లా ఉన్నారు.

కొంతసేపటివరకూ గురువుగారు శిష్యురాలిని అనుగ్రహించలేదు. చివరకి యశో దగ్గరికి వెళ్లి నమస్కరించింది.

''వచ్చావా సుందరీ, నీ రాక కోసం చూస్తున్నా,'' అన్నారు గెడ్డం రాసుకుంటూ.

అప్పుడు మాకేసి తన చెయ్యి చూపిస్తూ యశో చెప్పిన పిదప, అయన తలూపితే మమ్మల్ని రమ్మని సైగ చేసింది.

అప్పుడు, సరళ ననేనుఆయన దరిచేరి వినయంగా వంగి నమస్కరించాము, అంటే, యశో ముందర చెప్పినట్టు చేశాము.

''శుభం, నూతన దంపతుల్లా ఉన్నారు. చిరకాలం యీ పవిత్రబంధంలో ఇమిడి ఉండండి నాయనలారా,'' అన్నారు చిరునవ్వు నవ్వుతూ.

కథంతా అడ్డం తిరిగింది. ఇదెక్కడ గురువు ఈయన. నేను యశో వైపుచూశాను. కత్తివాటుకునెత్తురుచుక్క లేక ఆమె ముఖం వెలవెలబోతూంది. సరళ తనలోతాను నవ్వుకుంటూంది.

''కాని స్వామీజీ, వీరిద్దరూ దంపతులు కారూ...'' అని యశో ఏదో చెప్పబోతూంటే స్వామీజీ అడ్డువచ్చారు.

''అయినా ఏమీ ఫర్వాలేదమ్మా. త్వరలోనే దంపతులవుతారు. నామాటకు తిరుగు ఉండదు," అన్నారు.

యశో నోట మాట రావటంలేదు. పెదిమలు కదులుతున్నాయి కాని మాటలు వినబడలేదు. ఇప్పుడు సరళ రంగంలోకి ప్రవేశించింది.

''కానీ నాకు భర్త ఉన్నాడు స్వామీజీ. వారిని వదలిపెట్టి వీరిని కట్టుకోమని తమరి మీ ఆజ్ఞగా భావించనా?'' అంది సరళ.

ఇంత సూటిగా అడిగేటప్పటికి గురువుగారు చప్పబడ్డారు.

''ఏదైనా నా మాటకు తిరుగుండదు,'' అన్నారు సాలోచనగా.

''అప్పుడు ఈయన్ని మీ ఆశీర్వచనానికి మావారిగా తీసుకు రావచ్చా?'' అంది సరళ వదిలిపెట్టక.

సరళ మాట నాకు నచ్చలేదు, చాలా దూరం పోతోందనుకున్నాను. ఈ మాటలతో యశో మరీ కుంగిపోతున్నట్టు కనబడింది. అక్కడ ఉన్న సన్యాసినులు వింతగా చూస్తున్నారు ఈ వాగ్యుద్ధాన్ని.

''ఏది ఏమైనాకాని నా మాటకు తిరుగు ఉండదమ్మా'' అన్నారు గురువుగారు కాస్త కంగారుపడుతూ.

జవాబు చెప్పబోతున్న సరళను నేను వారించాను కాని, యశోకి ఏమనాలో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

''ఇక సెలవు తీసుకుంటాము స్వామిజీ ,'' అన్నాను.

ఈమాట అనేసరికి ఆయనకి ఊపిరి పీల్చుకోవడానికి సందు దొరికింది.

''మంచిది ఇంకా కొన్నాళ్లు ఉంటావనుకుంటాను. మళ్లీ ఎప్పుడైనా కనబడు నాయనా," అన్నారు.

అంటే ఆ ఆహ్వానం కేవలం నాకు మాత్రమే, సరళకు కాదు.

బయటకి వచ్చిన వెంటనే సరళ మొదలుపెట్టింది.

''మా భలే గురువుగారు, మిమ్మల్ని మళ్లా కలుసుకోమన్నారు. ఈయన గెడ్డం లాగి చూడండి, ఉంటుందో వూడుతుందో,'' అంది.

నేనేమీ మాట్లాడలేదు, నేను యశో గురించే ఆలోచిస్తున్నాను. ఆమెకి కలిగిన క్షోభ నేనే గ్రహించాను. ఒక వైపు గురువుగారి ఎడ ఆమెకు గల అపార విశ్వాసం, ఇంకో వైపు ఆయన భయానక శాపం. ఇప్పుడు తను నా వ్యక్తిత్వాన్ని నమ్మాలా , లేక గురువుగారి వాక్సుద్ధిని విశ్వసించాలా? ఈ బూటకపు గురువు, యశోని ఈ అడకత్తిరిలో పడేసి ఎంత మనోవ్యధకు గురిచేసాడు! నా 'అమ్మీ' ఎల్లా భరించగలదీ మనో వేదన?

''మీరు కూడా ఆయన మాటలకి విలువ ఇస్తున్నారా? మిమ్మలను లేవదీసుకు పోతానని భయపడుతున్నారా రామంబాబూ?'' అంది నా మొహాన్ని చూసి సరళ.

సరళ స్వభావమేమో నాకు తెలుసు, ప్రతీదీ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పుతుంది, అయినా యశో మానసిక సందిగ్ధత ఆమె కెలా తెలుస్తుంది?

''అది కాదు సరళా. నేను యశో గురించి ఆలోచిస్తున్నాను. ఆ ఆశీర్వాదం ఎంత భయంకరమైందో చూడు,'' అన్నాను.

సరళ నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూసింది.

''భయంకరమా. ఇందులో నాకు భయంకరమైనదేదీ కనబడలేదు రామంబాబూ. మీరంతా ఒక దొంగ సన్యాసి మాటలకి ఎందుకు విలువ ఇస్తున్నారో నాకర్థం కావటం లేదు. చక్కటి ఈ రోజును పాడు చేశాడు. ఈ దొంగ గురువు,'' అంది తను.

సరళతో ఇక వాదించటము అప్రయోజకమూ, అసందర్భము అని నేను ఊరుకున్నాను. ఈమె గురువు గారిని అనవసరంగా ఉసి కొల్పిందనే కోపం కూడా వచ్చింది. ఆ కోపం ఎంత అసమంజసమో నాకు అప్పుడు తెలియదు. నేనేమి మాట్లాడలేదు. ఇద్దరం అక్కడ నుంచి లఖియా కుటీరం వద్దకు వచ్చేశాము.

''కాస్సేపు లోపలికి వెళ్లి కూర్చుందాము రామంబాబు .. యశో అప్పుడే రాదుకదా'' అంది సరళ.

ఆమెకు ఇంకా కోపం తగ్గలేదు.

"ఉహూ ఇప్పుడు నేను పోతాను," అన్నాను.

నా కంఠంలో అనవసరమైన కాఠిన్యత ఉందేమో, సరళ కాసేపు అలాగే నుంచుండి పోయింది.

"రామంబాబూ... నాక్కూడా కొంచెం పని ఉంది. సాయంత్రం రాజేంద్ర వస్తాడనుకుంటాను సామాను సర్దుకోవాలి,'' అంది తను.

''సరే సరళా. అలాగే కానీ, వెళ్లే ముందు కనబడతావు కదూ?''అన్నాను.

''కనబడతాననే అనుకుంటాను, లేకపోతేమటుకూ నష్టమేముంది," అంది.

ఆ సమాధానం నన్ను దిగ్భ్రాంతుడ్ని చేసింది.

"రామంబాబూ, మనము బతకాల్సిన రోజులు చాలా ఉన్నాయి,'' అని లోపలికి వెళ్లిపోయింది.

నేను కాసేపు అలాగే నుంచుని, వెళ్లిపోవటానికి బయలుదేరుతూంటే హఠాత్తుగా లఖియా ఎదురైంది.

''అరే, ఇదేమిటి రామంబాబూ. ఒంటరిగా బయట నుంచున్నారు. లోపలికి పదండి,'' అని లోపలికి దారితీసింది.

అనుకోకుండానే ఆమె వెంట నేనూ బయలుదేరాను. తలుపు తోసి లోపలికి వెళ్లేటప్పటికి సరళ మంచం మీద పడుకుని ఉంది. తలుపు చప్పుడు వినికూడా లేవలేదు.

''సరళా, ఏమిటి ఇప్పుడు పడుకున్నావు. లే.. రామంబాబు వచ్చారు,'' అంది లఖియా.

సరళ అప్పుడు ముఖం పైకెత్తింది. ఆ ముఖం చూసి నేను ఆశ్చర్యచకితుడనయ్యాను. రెండు మూడు నిమిషాల క్రితం చూసిన దానికి, దీనికి పోలికేలేదు. ముఖమంతా ఎర్రగా గీచిన కందలాగ ఉంది. సిగ్గుతో కుంగిపోతూన్నట్టు ఉంది. బొట్టంతా నుదిటి పైనుంచి చెదిరిపోయింది. తలలోని సన్నజాజి దండ క్రింద పడిపోయింది.

ఆ పరిస్థితిలో చూశాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. ''ఇప్పుడు కాదు, లఖియా మరోసారి వస్తాను. ఇప్పుడెళ్లి పడుకుంటాను,'' అని బయటకి వెళ్లిపోయాను.

బయటకి వచ్చిన వెంటనే ఎవరో తరుముకు వస్తున్నట్టు గబగబా నడిచాను. ఆ సరళ ముఖమే నన్ను తరుముకు వస్తున్నట్టనిపించింది. దాని అర్థం ఏమిటి? సరళ మనసులో విపరీతమైన కోరికలు దాగిఉన్నాయా?

లోపలికి వచ్చి చాలాసేపటి వరకూ మంచం మీద కూర్చుండిపోయాను. గురువు గారి ఆశీర్వాదం, సరళ ఆయనతో అన్న మాటలు, యశో వ్యాకులపాటు, సరళ ఎర్రటి ముఖం ఇవన్నీ కలసి నన్ను చాలా కలవరపరిచాయి. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఈ గురువు దొంగ సన్యాసా? లేక భవిష్యను చెప్పగల యోగిపుంగవుడా? రెండవదే నిజమైతే నేనింత నీచుడను?

ఎంతసేపు అలా ఉన్నానో సరిగా తెలియదు. తలుపు చప్పుడుతో మళ్లీ ప్రపంచంలో పడ్డాను. యశో లోపలికి వచ్చింది. ఆమె ముఖం నేనూ ఊహించిన దానికన్నా ఉత్సాహంగానే ఉంది.

''మిమ్మల్ని చూసిన నిన్నటి సుదినం ఇవాళ ఎంత దుర్దినంగా మారింది! తప్పంతా నాదే, కర్మ కాలి, మీ ఇద్దరినీ ఒకేసారిగా నమస్కరించమని చెప్పాను. అయినా ఫర్వాలేదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాటి ఫలితం పోతుందని చెప్పారు గురువుగారు,'' అంది నా పక్క మంచం మీద కూర్చుని.

''ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి తప్పు ఎవరు చేశారు. తప్పేమైనా ఉంటే అది మీ గురువుగారిదే,'' అన్నాను.

''అబ్బే, గురువుగారి తప్పేమీ లేదు ఇందులో, నేనూహించలేదు, బహుశ , స్వాభిమానం వల్ల ఆయన తన మాటాల్ని తిరిగి తీసుకోవడానికి సందేహించారు. కాని నా కెంతో భయం వేసింది. ఆ మాటలు వింటుంటే, '' అంది నా చేయి తన చేతిలోకి తీసుకుంటూ.

"గురువుగారి మీద ఇంత విశ్వాసం ఎందుకు కలిగింది నీకు,'' అన్నాను కంఠస్వరంలో కోపం వ్యక్తం చేస్తూ.

నాకుయశో తన మౌనంచే సమాధానమిప్పించింది

''అయితే ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఏమవుతుంది యశో. ఆయన శాపం ఫలిస్తుందంటావా? నా మీద నీ కంత అపనమ్మకమా?'' అన్నాను ఊరుకోక.

''ఛీ, అలా అనకండి, మీ మీద నాకు నమ్మకం లేకపోవడ మేమిటీ. అది కాదు ప్రాయశ్చితం చేసుకోకపోతే వాటి చెడు ప్రభావం ఉండిపోతుంది, అంతే, '' అంది.

''చెడు ప్రభావం ఉండిపోతే ఏమవుతుంది యశో,'' అన్నాను అసహనంగా.

"ఊరుకోండి మీరు. మీకివన్నీ తెలియవు. అయినా చేసేదానిని నేను, మీరుకాదు కదా. అలాంటప్పుడు మీకెందుకు బాధ?'' అంది.

ఇంక నేను వూరుకున్నాను. ఈ మూఢ విశ్వాసానికి హద్దులేదు.

మరునాడు ఉదయం తన భార్యను తీసుకు వెళ్ళడానికి రాజేంద్ర వచ్చాడు అయితే చిన్నపిల్లలా లఖియాని వదలి వెళ్లనని సరళ చాలా పంతం పట్టింది. రాజేంద్రకి కొంచెం కోపం కూడా వచ్చింది కాని సరళ అక్కడ ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. తనని వారానికి ఒక సారి తీసుకు రమ్మన్నా తీసుకొస్తా నన్నాడు. తరువాత లఖియా నచ్చచెప్పగా, సరళ ఆరోజే వెళ్ళడానికి సిద్ధపడింది.

మధ్యాన్నం భోజనం చేస్తున్నంత సేపూ సరళ నాతో మాట్లాడలేదు,

''మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?'' అంది వెళ్లిపోయేముందు నాదగ్గరకు చేరి.

"ఇది నువ్వు నన్ను అడగాల్సిన ప్రశ్నకాదు సరళా. ఇక్కడ నేనొక అతిథిని మాత్రమే,'' అన్నాను.

"రామంబాబు, మీకు నేనే సలహాలు ఇవ్వాల్సిన దానిని కాదు. అయినాకాని ఇది చెప్తాను. తన శక్తికి మించిన పనిని ఎవరి వద్దా ఆశించకండి. మానవ బలహీనతకు కాస్త చోటివ్వండి. ఇదివరకొక సారి చెప్పాను, తప్పులేకుండా మీరు ఎవరిని శిక్షించలేదు. అదే ఈనాడు మీకు తిరిగి గుర్తు చేస్తున్నాను,'' అంది.

 

చాప్టర్ 19

 

క్రమబద్ధంగా నా జీవితం నడవసాగింది. చేసే పనిలేదు; బాధ్యత లేదు; విచారం లేదు, కాలంతోపాటు దొర్లిపోవటమే మిగిలింది. అదే చేశాను. పొద్దున లేచేటప్పటికి యశో గంగలో స్నానం చేసి వచ్చి కాఫీ కాస్తూ వుండేది. అప్పుడప్పుడు నేను కూడా ఆమెతో గంగవద్దకు వెళ్లేవాడిని. ఆమె స్నానం చేస్తూంటే నేను పువ్వులు కోస్తూ వుండేవాడిని. నన్ను వాసనలేని పుష్పాలనే కోయమనేది.

''అంటే నేను కూడా ఒక వాసనలేని పుష్పాన్నా, అమ్మీ, అన్నాను'' ఒకసారి.

''కాదు, దానికి వ్యతిరేకం మీరు, మీలోని సువాసనే ఇతరులను ఆకర్షిస్తుంది. అందంకాదు,'' అంది యశో నవ్వి.

స్నానం చేసి ఆమె దైవపూజకు పుష్పాన్ని కోసేది. నేను కోసిన పుష్పాన్ని జత చేసి ఎంతో ఇష్టంగా తన తలలో తురుముకునేది.

మధ్యాహ్నం భోజనాలైన తర్వాత యశో గుడికి వెళ్లిపోయేది. మళ్లీ సాయంకాలం వరకు వచ్చేది కాదు. ఆ సమయంలో నేను ఒంటరిగా గడపాల్సి వచ్చేది. సాధారణంగా ఆమె దగ్గర ఉన్నంతసేపు శరవేగంతో కాలం గడచిపోయేది. ఇద్దరం పలు విషయాలు చర్చించేవాళ్లం. ఆమెతో చాల విషయాల్లో నేను ఏకీభవించే వాడిని కాదు. కాని అన్నింటిలోనే ఆమెని వ్యతిరేకించలేదు, గౌరవించేవాడిని. చాలా వాటిలో నా అభిప్రాయాలని కొనసాగించాలనుకునేది. జీవితంలో నేను చాలా మంది స్త్రీలను చూశాను, పలువురు స్త్రీల పరిచయ భాగ్యం నాకు లభించింది. సుశీ, యశో, లఖియా వీరందరి పట్ల దైవం కఠినంగా వ్యవహరించాడు. దైవం మీద నా విశ్వాసం మరింత సడలింది. పుష్పంలాంటి సుకుమారి లఖియాకి ఒక పశుప్రాయుడైన భర్తని అంటగట్టేడు. స్ఫటికంలాంటి ఆమెను విధవని కూడా చేశాడు.

''రామంబాబూ, సుందరి మీ గురించి చాలా సంగతులు చెప్పింది. కాని ఈ విషయం మీరే చెప్పాలి. యశో ప్రేమను తిరస్కరించగల శక్తి మీకెక్కడిది? అది తప్పుకాదా?'' అంది ఒకనాడు లఖియా సూటిగా.

''నేను తిరస్కరించానని నువ్వు ఎలా అనుకున్నావు లఖియా? అలా అయితే నేనిక్కడ ఎందుకు ఉంటాను చెప్పు. వివాహ బంధనారహితంగా స్త్రీ పురుషులు ఒకరికొకరు లభించలేరా? ప్రేమించుకునే స్త్రీ పురుషుల మధ్య దాంపత్యం మినహా వేరే ఔన్నత్యానికి తావు లేదా?'' అన్నాను జవాబు కోసం కాస్త తడుముకుని.

లఖియా ఏమీ మాట్లాడలేదు.

''యశో నీకు సుశీ గురించి చెప్పిందా?'' అన్నాను నేనే కాసేపాగి.

"అవును అంతా చెప్పింది," అంది.

"అయితే నేను చేసినదే ఉత్తమమైనది కదా? ఆమెని నేనెలా మరువగలను. వివాహ బంధనం అవిచ్ఛిన్నమైందని నువ్వంటావు. ఎక్కడనుంచి వచ్చింది ఆ బంధనానికి అంత శక్తి? యశో ఒకసారి అంది, 'ఇతరులు మీకు లభించవచ్చు కాని, ఇతరులకు మీరు లభించలేరు' అని. ఇప్పుడనిపిస్తోంది అది నిజమేననీ, " అన్నాను ఆవేదనగా.

చాలాసేపు లఖియా మాట్లాడకుండా ఊరుకుంది.

"రామంబాబూ. ఈ విషయంలో మీమాటే నిజమనిపిస్తోంది," అంది సాలోచనగా.

సరిగ్గా అదే సమయానికి 'ఆనాటి' యశో తిరిగి వచ్చింది.

"ఏమిటి, లఖియావద్ద చాడీలు చెప్తున్నారు,'' అంది నవ్వుతూ

''చాడీలు చెప్పేవారైతే బాగానే వుండును సుందరీ. వీరిని వంటరిగా వదిలి ఇంత సేపు వెళ్లిపోతూన్నావు కదా. ఈయన ఒక్కరూ ఏం చేస్తారు చెప్పు,'' అంది లఖియా మందహాసంగా.

"నేనేం చెయ్యను లఖియా? అవతల గురువుగారు, ఇక్కడ ఈయన, మధ్య నేను నలిగిపోతున్నాను,''అంది యశో అసహాయంగా.

"గురువుగారికి సేవ చెయ్యడానికి చాలామంది వున్నాము. వీరికైతే నీవొక్కరివే కదా," అంది లఖియా.

యశో కాస్త సిగ్గుపడింది.

''సరే అమ్మీ. కాస్త కాఫీ చూడు, కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి,'' అన్నాను.

 

చాప్టర్ 20

 

యశో ఒకరోజు గురువుగారి దగ్గరకు చాలా ముందరగా వెళ్లిపోయింది. ఎందుచేతో ఏమీ తోచడంలేదు. అయినా లఖియా కూడా యశో వచ్చేవరకూ రాదు. అందుకని ఆమె దగ్గరికి నేనే బయలుదేరాను.

"లఖియా," అని పిలిచాను తలుపు వద్దకు వెళ్లి.

''లోపలికి రండి రామంబాబూ. తలుపు తెరిచే ఉంది," తక్షణమే జవాబు వచ్చింది.

తలుపు తోసుకుని లోపలికి వెళ్లాను.

తను చీర కట్టుకుంటూ ఉండడం చూసి నేను వెనకంజ వేయబోయాను, కానీ తను అలానే నాకేసి తిరిగి మందహాసంచేస్తూ అంది,

"రండి నాకు మీరేమీ పరాయివారు కాదు".

ఎందుకోగానీ ఆ స్థితిలో చూసిన ఆమె అద్వితీయసౌందర్యం ఆమెపై నాకున్న అపార ఆప్యాతను ద్విగుణీకృతంచేసింది.

"కూర్చోమండానికి ఒక్క కుర్చీ అయినా లేదు, చాపమీద కూర్చోండి రామంబాబూ," అంది 'అరిగిన' చీర కొంగు సవరించుకొంటూ.

నా మనస్సు చివుక్కుమంది.

"నువ్వలా అన్నావంటే చాపమీద కూడా కూర్చోను ఒట్టినేల మీద చతికిలపడతాను. అయినా, నువ్వు కూర్చోగాలేంది నేనెందుకు కూర్చోలేను చెప్పు," అన్నాను.

"వద్దు అంతపని చెయ్యకండి చాపమీదే కూర్చోండి, "అంది నవ్వుతూ.

చాపమీద కూర్చుని, ఒక సారి ఇళ్లంతా కలయచూశాను. యశో కుటీరం నిరాడంబరంగా ఉంది. లఖియా కుటీరంలో దారిద్ర్యం కనబడుతూంది. ఒక మూల పూజ సరంజామా ఉంది. దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. గదికి వెనుకవైపు ఒక దండెం వేలాడుతూ ఉంది. దాని మీద తెల్లటి చీరలు మూడున్నాయి. గదిలో చిన్న పెట్టైనా లేదు. అటువంటి గదిలో చాపమీద కూర్చుని లఖియా తన 'అరిగిన' చీర కట్టుకుంటూన్న దృశ్యం ఊహించుకుంటే ఎంత బాధ కలుగుతుంది? ఆమెకున్నవన్నీ తెల్లటి చీరలే. అందులో ఖరీదైన దొక్కటి కూడా లేదు. తోటి స్త్రీలంతా రంగు రంగుల చీరలు కట్టుకుని, పువ్వుల జాకెట్లు వేసుకుని ఘుమ ఘమా సంపంగి, సన్నజాజి వాసన వెదజల్లుతూ నడవగ లుగుతూంటే, వారందరినీ మించిన సౌందర్యరాశి, గుణవంతురాలైన ఈమెకి ఇది ఎందుకు ప్రాప్తించింది? తల మీద పువ్వు వుండటానికి వీల్లేదు. ముఖం మీద కుంకుమ పెట్టుకోవ డానికి వీల్లేదు. ఎందుచేత? భార్య చనిపోతే భర్త ఈ కఠోర నియమాలని ఎందుకు ఆచరించడు. ఆడవాళ్ళకి ఏ పాప ఫలం ఇది? దుష్ట శిక్షణా, శిష్ట రక్షణా విధులను నెరవేర్చే ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడు?.

ఈ తరహా ఆలోచనలన్నీ క్షణకాలంలో నా మెదడులో మెదిలాయి. అప్రయత్నంగా నిట్టూర్పు విడిచాను.

''నా మీద మీకు జాలి కలుగుతోందికదూ రామంబాబూ?'' అంది.

"నీకు వైధవ్యంతో పాటు దారిద్ర్యం కూడా సంప్రాప్తించాలా?" అన్నాను.

మనస్సులోని బాధతో ఉబికిన మాటలవి.

"రామంబాబూ, కోపగించి పరిస్థితులను మార్చగలమా చెప్పండి,'' అంది.

"నిరపరాధికి అన్యాయం జరుగుతూంటే కూడా చూస్తూ ఊరుకోమంటావా లఖియా? అయినా యశోని అనాలి, '' అన్నాను కోపంగా.

"ఇందులో సుందరి దోష మేమిలేదు, నేనే తన సహాయానాన్ని కాదన్నాను. దానికి తానెంత బాధ పడుతూందో నాకు తెలుసు,'' అంది.

యశో ఉదార హృదయం లఖియా ఆత్మాభిమానం నా హృదయాన్ని కలసి కదలించగా, అప్పుడు వారిరువురికి మనోవందనం చేసాను.

"నువ్వు మమ్మల్ని నీకేమి చెయ్యనివ్వక పోవచ్చు లఖియా. అయినా బాధాకరమైన పరిస్థితిని ఏవగించుకోవటంలో తప్పేముంది,'' అన్నాను.

''మీరన్నది నిజమే. అన్యాయం జరుగుతూంటే సహించకూడదు. కానీ దైవం అకారణంగా ఎవరినీ శిక్షించడు రామంబాబూ. ఏ తండ్రికీ తన బిడ్డలని శిక్షించటం ఇష్టంగా వుండదు,'' అంది.

''అయితే ఏ దోషం లేకుండా నిన్ను దైవం ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పు,'' అన్నాను.

''దీనిని మీరు శిక్ష అంటారా? అంటే అనండి. నేను మీరనుకునేటంత నిర్దోషిని కాను రామంబాబూ. నా వైవాహిక జీవితంలో నాకు అనేక కష్టాలు ఎదురు వచ్చాయి. నా భర్త నన్ను ఆదరించక పోయి ఉండవచ్చు అయినా ఆయనని నేను హృద‌యపూర్వకంగా ఎన్నడూ ప్రేమించ లేకపోయాను. అగ్ని సాక్షిగా వివాహమాడిన భర్తని ప్రేమించటం నా విధి, .కానీ నేనలా చేయలేకపోయాను. అన్నింటినీ సహించేదానిని కాని ఆత్మార్పణ చేసుకో లేకపోయాను. బహుశా అందుకనే నాకు ఈ శిక్ష లభించింది,'' అంది.

నా చెవులకు ప్రపంచం కూలిపోతుందా అనిపించింది. నాకు మాట రాలేదు. లఖియా జీవితంలోని కష్టాలు, అప్పటి ఇబ్బందులు తెలియవు నాకు, ఆమె చూపిన క్షంతవ్యమే కాని ఆమె చేసిన తప్పులేమీ ఎరుగను. ఆమె సర్వస్వమూ అతనికి అప్పగించింది. క్షుద్రమైన అతని జీవితానికి వెలుగు తీసుకువచ్చింది. అతనిని క్షమించింది కాని హృద‌యపూర్వకంగా ప్రేమించలేక పోయింది. అదేనా ఆమె చేసిన మహాపరాధం!

''మంచితనానికీ, అమాయకత్వానికీ కేరాఫ్ అడ్రస్ లఖియా. కష్టాలన్నీ నీనెత్తిన వేసుకుని తరించుదామనుకుంటున్నావు. అంతేకాని మరేమీకాదు,'' అన్నాను.

తన ప్రవర్తన మీద నాకు కోపం వచ్చిందని లఖియా గ్రహించింది.

''అయితే మీకు తరించటం, స్వర్గం పోవటం మొదలైన వాటిలో నమ్మకముందా?'' అంది.

''లేదు, కొంచెమైనా లేదు,'' అన్నాను.

''కానీ నాకు నమ్మకం ఉంది, రామంబాబూ. అవన్నీ మిథ్య అయితే నేను కూడా మిథ్యే, ఆ దృష్టితో చూస్తే ప్రపంచమంతా మిథ్యే. సృష్టిలో మానవుని బుద్దికి అంతుబట్టని విషయాలున్నంతకాలం, మానవాతీతమైన పరమశక్తి ఒకటుందని మనం గ్రహించాలి. ఆ శక్తినే మనము రకరకాలుగా పిలుస్తాము. దైవం, విధి, కర్మ అంటాము. చివరకు అన్నీ ఒకటే. అయితే మీరు దైవాన్ని కూడా గుర్తించరా?'' అంది.

''దైవాన్ని నేను గుర్తిస్తాను లఖియా. కాని దైవపు పోకడలు నాకర్థం కావు. దైవపు బుద్ధికుశలతతో నాకు నమ్మకం సన్నగిల్లుతోంది,'' అన్నాను.

''అక్కడే మీరు పొరపాటు పడుతున్నారను కుంటాను రామం బాబు . దైవమేమి ఒక నియంత కాదు. దైవాన్ని అంగీకరించినట్లైయితే అతని తీరు కూడా మీరు అర్ధం చేసుకోవాలి. తన ఇష్టాలకీ, చేష్టలకీ ఏమీ సంబంధం లేదు. అదొక పోస్టాఫీసులాంటిది. కొంతమందికి శుభలేఖలు వస్తాయి, మరికొంత మందికి చావు కబురు వస్తుంది. ఎవరి ఖర్మ వారిది. ఇది గ్రహించడమే మానవుని బుద్ధికుశలత,'' అంది.

"ఇంతకీ నువ్వనేది భగవంతుడికిహృద‌యం లేదంటావు అంతేగా?" అన్నాను.

"ఒక విధంగా అది నిజమేకానీ, మనము 'హృదయవిహీను'డను మాటను నిందాపూరితంగా వాడుతాము. మంచితనమూ, చెడుతనమూ మనం హృదయంతో ముడిపెడతాము. అందులో సంశయం లేదు," అంది.

ఇక ఏమనాలో నాకు తెలియలేదు. లఖియా తర్కశాస్త్ర పారాయణురాలని నాకు తెలియదు.

''అయితే చెప్పు లఖియా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? కాలేజీలో నేర్చుకున్నావా? లేక వేదాలూ, పురాణాలూ చదివేవా? "అన్నాను.

లఖియా నవ్వింది.

''లేదు రామంబాబూ. కాలేజీకి ఏమిటి, ఎన్నడూ స్కూలు కైనా వెళ్లలేదు, కాని ప్రపంచంలోని ఉత్తమ స్త్రీలలో ఒకామెను నేను తల్లిగా పొందగలిగాను. అది నా అదృష్టం,'' అంది.

''అది నీ అదృష్టమేకాదు, మా అందరి అదృష్టమూ కూడాను. లేకపోతే నీలాంటి అద్భుత వ్యక్తి మాకు లభించక పోనేమో?'' అన్నాను.

లఖియా ముఖం సిగ్గుతో జేవురించింది.

''వద్దు రామంబాబూ. మీరేమి నన్ను పొగడకండి. నేను చాలా అల్పురాలిని. అల్పులను ప్రశంసిస్తే అహంభావం అవతరిస్తుంది. అయినా మీకు నా గతజీవితం పూర్తిగా తెలియదుకదా,'' అంది.

''నువ్వొకనాడు వాగ్దానం చేశావు అది అంతా చెప్తానని, అయినా నీమీద నాకున్న సదభిప్రాయం మారేటట్లు అయితే అది చెప్పవద్దు. నాకు వినాలనే కోరికలేదు,'' అన్నాను.

''సదభిప్రాయం సహృదయం లోంచి జనిస్తుంది కనుక నిశ్చిన్తగా చెప్తాను. వినండి రామంబాబు,'' అంది.

 

చాప్టర్ 21

 

ఎవరిని దుర్భాషలాడని భాషలో, ఎంతో సున్నితంగా లఖియా ఆత్మకథ సాగింది. తనలాగా అంత విపులంగా చెప్పడం నా చేతకాదు, అందుచేత పాఠకులకు దాన్ని క్లుప్తంగా, నాకు తెలిసిన తీరులో విన్నవిస్తాను.

ఆఖరికి మరణ శయ్యమీద లఖియా భర్తకు జ్ఞానోద‌యం కలిగింది.

''నేను బతికి ఉన్నంతకాలం నిన్ను బాధ పెట్టాను లఖియా, నా తర్వాతనైనా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా భార్యవయినందుకు నా పాపాలు నీకేమీ అంటకూడదని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను,'' అని తల నిమురుతూ చెప్పాడు.

అప్పుడు భర్తను తనకు దక్కించమని ఎంతో ప్రార్థించింది, కానీ దైవం అతడి నుంచి వేరుచేశాడు. చివరికయినా భర్త ఆదరణ లభించింది అతని అనురాగం పొందింది అందుకే అంతకంటె ఆనందకరమైన రోజులు తన జీవితంలో లేవు అనుకుంటుంది.

ఇల్లువాకిలీ అమ్మి, భర్త అంత్యక్రియలు చేసి అప్పులు తీర్చింది లఖియా. తరువాత నుదుట కుంకుమ చెరుపుకుని, తెల్ల చీర కట్టుకుని, నాలుగు మూటలతో గడప దాటింది లఖియా, కానీ ఎక్కడకు వెళ్లాలి? తిండిలేకపోతే పస్తువుండవచ్చు కానీ, అందమైన స్త్రీలకోసం అర్రులు చాచే క్రూరమృగాలున్న ఈఅరణ్యంలో వుండటానికి తలుపువున్న ఒక ఇల్లు వుండాలి. కానీ ఆ నీడనిచ్చే వ్యక్తి ఎవరు? తటుక్కున తల్లి ఒక నాడు చెప్పినమాట జ్ఞ‌ప్తికి వచ్చింది లఖియాకి, 'ఎప్పుడైనా కష్టాల్లో వుంటే మామయ్య దగ్గరకు వెళ్లమ్మా, కాదనడు.'

లఖియా మామయ్య ఢిల్లీలో వున్నాడు. అయిదు సంవత్సరాల క్రితం భార్య హఠాత్తుగా కాలం చేసింది, ముగ్గురు కూతుర్లని, యిద్దరు కొడుకుల్ని భర్త మీద, గాలి మీద వదలి. అప్పట్నించి ఆయన అష్టకష్టాలు పడుతున్నాడు. ఏభై ఏళ్లు దగ్గిరకి వచ్చాయి. ఒక్కడూ ఏం చేయగలడు? ఒక వంటమనిషిని కుదుర్చుకుని, తల్లిలేని ఆ అనాధలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అటువంటి అక్కడకు ఆమె చేరింది. ఎన్నో ఏళ్ల తరువాత కలసిన మామయ్య, మేనకోడలికి చాలా ఆప్యాయంగా స్వాగతం పలికాడు.

లఖియాకి సోదంతా చెప్పి కంటతడి పెట్టుకున్నాడు.

"నువ్వు వచ్చావు ఈనాడు. మీ అమ్మకి ఒకప్పుడు వాగ్ధానం చేశాను. నీ కూతురు మీద ఈగ వాలకుండా చూస్తానని. పవిత్రమైన స్మృతిలో మునిగి వున్న మీ అమ్మ సుగుణాలని పొగడటానికి ఒక నోరు చాలదు. ఇంటి తాళం చెవులు నీకే యిస్తాను. ఇనప్పెట్టె తాళం చెవులు నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకయినా మంచిది. పాడు పట్టణం. ఢిల్లీలో దొంగలకి, దొరలకీ తేడా తెలియదు," అన్నాడు.

లఖియా కరిగిపొయింది. ఇంత మంచి మామయ్య ఉండగా తను చింతించవలసిన అవసరం లేదనుకుంది.

''ఎందుకైనా మంచిది మామయ్య. భోషాణం తాళం చెవులు కూడా నీ వద్దే వుంచుకో,'' అని, అవి తీసి ఇచ్చేసింది.

పిల్లలంతా ఈమెమీద ఎగబారేరు. చిన్నమ్మో, చిన్నమ్మో అంటూ. అందరికంటె పెద్దవాడు, కృష్ణుడు. కాలేజీలో మూడేళ్ల బట్టి బీఏ చదువు తున్నాడు. ఇంకొక రెండేళ్లలో తప్పక పాసవుతానని పదే పదే నొక్కి చెప్పాడు. పెద్దకూతురు సుజాత పెళ్లీడు వచ్చింది. చాలా మంచి పిల్ల, అందంగానే ఉంది. కానీ శరీరఛాయ నలుపు. కొద్దికాలంలోనే లఖియా హృదయం వశపరుచుకుంది. మిగతా వారంతా ఎదగని పిల్లలవడం వల్ల ఇంట్లో ఎప్పుడు ఎడతెరిపిలేని అల్లరి. వాళ్లకి భయం భక్తులూ బొత్తిగా శూన్యం.

ఆమె గుమ్మంలో అడుగుపెట్టిన వారం రోజులకి దాయి మానేసింది. ఇంకొక వారానికి వంటమనిషి ఉద్యోగానికి స్వస్తిపలికింది.. సుజాత ఏమేమో చెప్పింది. తన తండ్రే కావాలని పనివారిని మానిపించేశాడని. కాని అదేమీ నిజంకాకపోవచ్చు. మావయ్య అటువంటి మనిషి అనిపించదు. ఏదైతేనేం దీంతో ఇంటి పని మొత్తం లఖియా మీద పడింది. సుజాత సాయం చేసేది అయినప్పటికి ఆ సాయం ఏ మూలకొస్తుంది. ఇటు పసికూనలను చూడాలి, అటు ఇంటి పని చెయ్యాలి. మామయ్య ప్రతి చిన్న పనీ ఆప్యాయంగా అడిగి చేయించుకుంటాడు. కానీ కాస్త పొద్దున్నే పూజ చేసుకుందామనుకుంటే కూడా కుదిరేదికాదు.

ఆఖరికి ఒక నౌకరు మటుకు కుదిరాడు. దిలీప్ తెల్లగా, పుష్టిగా, గంభీరంగా నిండుగా వుంటాడు. పనివరకూ వచ్చేటప్పటికి నీరసమయ్యేవాడు. అయినా అప్పుడప్పుడు లాఖియాకి కొంత విశ్రాంతి కలిగేది. అలాగే కాలం గడిచి పోతూంది. సుజాతకి పెళ్లి చేద్దామని మామయ్య సంబంధాలు వెదికేవాడు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే సంబంధాలు ఎక్కడ నుంచీ వస్తాయి. చూసిన వారు పెదిమ విరిచారు. ఆమె శరీర ఛాయ ఆమె శత్రువయి పోయింది. సుజాత క్రుంగిపోయేది. ఒకనాడొక పెళ్లికొడుకు వచ్చి చూసి కాదని వెళ్లిపోయింతర్వాత చాటుగా కబురు పంపాడు...లఖియా అయితే అభ్యంతరం లేదని, పెళ్లంటే అట్టే పట్టింపులేదని. ఆపెళ్ళికొడుకు సందేశము లాఖియాను బాగా కలవరపరిచింది.

''నాన్నా, చిన్నమ్మలాంటి అందకత్తె మన ఇంట్లో వుండగా సుజాతకు పెళ్లెలా అవుతుంది. ఆపెళ్లికొడుకు చిన్నమ్మకేసి కళ్ళు పారేసుకోవడం నేను చూసాను,'' అన్నాడు కృష్ణుడు.

''నోరుముయి, భడవా,'' అని హుంకరించాడు మామయ్య.

అప్పటినుంచి సుజాతని చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు లాఖియా ఎక్కడో దాక్కునేది. అయినా పెళ్లి కుదరలేదు. సుజాత దుఃఖానికి మేరలేదు.

''అసలు నేనెందుకు పుట్టాను చిన్నమ్మా? మూడు సంవత్సరాల క్రితం టైఫాయిడు జ్వరం తీవ్రంగా వచ్చింది. అప్పుడు నేనెందుకు చనిపోలేదు. దేవుడు ఈ చర్మానికి నలుపు రంగు ఎందుకు ఇచ్చాడు. అయినా కానీ నల్లగావున్న అబ్బాయిలకి కూడా నేను ఎందుకు తగను," అంది సుజాత ఏడుస్తూ లఖియా ఒళ్లో తల పెట్టుకుని.

సుజాతకు పెళ్లి సంబంధం దొరకక పోవడంతో ఆమెను మామయ్య అనేక మాటలు అనేవాడు. అప్పుడప్పుడు ఆ కోపం లఖియా మీద కూడా చిగురించేది. లఖియా ఒకవైపున సుజాతని ఓదార్చాలి. మరోవైపు మామయ్య కోపం చల్లార్చాలి.

ఒకనాటి తెల్లవారుజామున సుజాత లఖియాని లేపి ఒళ్లోపడి ఏడ్వటం మొదలుపెట్టింది.

''ఏం జరిగిందో చెప్పు సుజాతా. మామయ్య ఏమైనా అన్నాడా?" అంది లఖియా ఖంగారుపడుతూ.

''కాదు పిన్నమ్మా, నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను'' అని బావురుమంది సుజాత.

''ఎక్కడికి సుజాతా? నాకు అంతా చెప్పు" అంది లఖియా.

''ఇంక ఈ ఇంట్లో నేను ఉండలేను చిన్నమ్మా. నేను అందరికీ అంటరానిదానినయ్యాను. నువ్వొక్కత్తివే నన్ను ఆదరించావు. మళ్లీ జన్మలో నీ కడుపున పుట్టి నీ రుణము తీర్చుకుంటాను. వారు వేచి వున్నారు, ఇక నేను వెళ్లిపోతాను చిన్నమ్మా,'' అంది సుజాత.

లఖియా ఆశ్చర్యానికి అంతులేదు. అంతవరకూ సుజాతకి కోపం వచ్చిందనీ, కాస్త బుజ్జగిస్తే మామూలు స్థితికి వస్తుందనీ అనుకొంది. కానీ సుజాత ఒక పురుషునితో సంబంధం కొనసాగిస్తుం దనుకోలేదు.

''వారు ఎవరు సుజాతా? ఆవేశంలోనూ, కోపంలోనూ ఏపనీ చేయకూడదు,'' అంది లఖియా.

''అంతా నీకు తర్వాత తెలుస్తుంది. చిన్నమ్మా ప్రస్తుతం నేను అదంతా చెప్పలేను. నా తలరాత ఎలా రాసివుంటే అలాగే అనుభవిస్తాను. నా గురించి నీవేమీ బాధపడకు. నన్ను ఆశీర్వదించు చిన్నమ్మా,'' అని సుజాత లఖియా కాళ్ళకి మొక్కింది

"సదా నిన్ను ఆ దైవం రక్షించుగాక,' అంటూ లఖియా సుజాత తలను తాకింద.

సుజాత లఖియాను కౌగలించు గుని వీద్డ్కోలు తీసుకుంది.

సుజాత ఎవరో పురుషునితో లేచిపోయింది. ఎవరా పురుషుడు? సుజాత ఎక్కడా ప్రేమకలాపాలు సాగించినట్లు లఖియాకు ఏ కోశానా తెలియదు. ఇంత హఠాత్తుగా ఇది ఎలా పరిణమించింది? లఖియా ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. సుజాత అంత సాహసం చేస్తుందని ఆమె అనుకోలేదు. మామయ్యకి చెప్పటమా, మానటమా అని ఆలోచించి చివరికి చెప్పకూడదనే నిశ్చయించింది.

ఆఖరికి రాత్రంతా మెలుకువగా ఉన్నలాఖియాకు తెల్లవారింది. సుజాత ఆత్మహత్య కుందేమోనని మామయ్య భయపడ్డాడు.. కాని ఆమె శవం ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు. జమునలో కూడా తేలినట్లు పోలీసులు రిపోర్టు చేయలేదు. సుజాత మాయమైన మరుసటి రోజు దిలీప్ పనిలోకి రావటం మానేశాడు. వాకబు చేస్తే వాడుకూడా ఆ రాత్రే అంతర్థానమయ్యాడని తెలిసింది. మామయ్య కోపానికి అంతులేదు. మచ్చలేని వారి వంశానికి మాయని మచ్చ తెచ్చిందన్నాడు. కృష్ణుడైతే చెల్లెలి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు.

లఖియా సుజాతను తరువాత ఎన్నడూ చూడలేదు. ఇక ముందు కూడా చూస్తాననే ఆశ లేదు తనకి. లఖియా ఆమె కథ చెప్పినప్పుడు ఆమె సరైన పని చేయలేదనుకున్నాను. ఆ దిలీప్ ఎవరో ఆమెని వివాహం చేసుకున్నాడనుకోవడానికి ఆస్కారం చాలా తక్కువ. అలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆ విధంగానే జరుగుతోంది. సుజాత ఇంటి నుంచి బయటికి వచ్చిన కారణంగా, కుటుంబం, తండ్రి, భవిష్యత్తూ అన్నీ కాలదన్నింది. ఇవన్నీ ఒక ఎత్తైతే సుజాతకి ఇక అతనే ఏకైక ఆధారం. కాని అతగాడు ఆమెను వదిలి సమాజంలో తిరిగి ప్రవేశిస్తే చేతులు జాపి చేరదీస్తుంది. ఒకవేళ సుజాత తన తప్పు తెలుసుకుని మళ్లీ వస్తే అదే సమాజం కుక్కలను పురిగొల్పి తరిమివేస్తుంది. కులట పాపి, కళంకిణి అనే పదాల్ని విరివిగా వెదజల్లుతుంది. దైవం కూడా అలాంటి స్త్రీల ఎడల కరుణ, కనికరం చూపించడు. పురుషుల పాపాల నెన్నిటినైనా కప్పివేస్తాడు. బయటకు వాటి సూచనలేమీ వుండవు. స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదిస్తాడు. దానితో ఆమె తప్పులన్నీ బయటపడతాయి.

స్త్రీ సాధారణంగా మాతృత్వం కంటె మిన్నగా మరేమీ కోరదు. తన బిడ్డను లాలించటంకంటె వేరుగా ఆమె ఆశించేది మరొక్కటి వుండదు. కాని ఇలాంటి పరిస్థితిలో మాతృత్వం ఆమెకొక శిక్ష. తల్లి కాబోతున్నదనే విషయం తెలిసిన వెంటనే అతగాడు అదే రాత్రి పలాయనం చిత్తగిస్తాడు. అందునా హోటలు బిల్లు చెల్లించకుండా. మగవాడు ఎంతమంది స్త్రీల నైనా తల్లులను చేయగలడు. తను ఎన్నడూ తల్లి కాలేడుగా. అందరూ ఇలాంటి వారని నేనెన్నడూ అనను. అలా అయినట్లైతే లఖియాతో నేను తర్వాత చెప్పినట్లు తల బద్దలు కొట్టుకుని ఆమెవద్ద చచ్చేవాడిని. ఇలాంటి స్త్రీలు కూడా వుంటారు. తేడా ఏమిటంటే వీరు బయట పడతారు; పురుషులు బయటపడరు అంతే.

ఏమైతేనేం, సమాజం మీద సుజాత కక్ష తీర్చుకుంది. చర్మం నల్లగా వుందని పెళ్లికొడుకు లందరు ఆమెని నిరాకరించారు. అందుచేత ఒక తెల్లటి పురుషుని తీసుకుని ఆమె యింట్లోంచి వెళ్లిపోవడానికి ఇష్టపడింది. ఆ పురుషుడు నౌక రైనా ఫర్వాలేదు. ఒకవేళ సుజాత అదృష్టం బాగుండి దిలీప్ మంచివాడేమో, ఆప్యాయతతో ఆమె జీవితం సుఖవంతం చెస్తాడేమో. అవును, అలా ఎందుకు కాకూడదు. ఎందుకు అన్యధా భావించాలి మనము. కాని నా మనస్సు ఎందుకో చెడు సూచిస్తూంది..

సుజాత ఇల్లు వదలటంతో లఖియాకు ఆమె సహచర్యం, ఓదార్పు కోల్పోయింది. అప్పుడు సుజాతను చూసే ఆ బరువంతా మోయగలిగింది. కాని ఇప్పుడు ఏం చేస్తుంది. అలాగే కాలం గడుపుతూ వుంది.

''చూడు లఖియా; నువ్వు మా కొక దేవతలా దొరికావు, ఇన్నాళ్లూ నువ్వు ఈ ఇంటి భారమంతా వహించావు. నువ్వు లేకపోతే ఏమి జరిగివుండునో ఊహించడంకూడా కష్టం. మా కుటుంబంలో ఒక వ్యక్తిగా మెలిగావు. నువ్విక్కడ శాశ్వతంగా వుండిపోతే ఎంతో ముదావహంగా వుంటుంది. ఏమంటావు?'' ఒక నాడు మామయ్య తన గదిలోకి వచ్చి అన్నాడు,

మామయ్య ఎంత మంచివాడు. లఖయా హృద‌య‌మంతా కృత‌జ్ఞ‌త‌తో నిండిపోయింది.

''ఇదంతా నీదయ మామయ్య. అలాగే చేస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు,'' అంది.

ఇంత త్వరగా ఒప్పుకునేసరికి మామయ్య కాస్త కంగారుపడ్డాడు.

''చాలా సంతోషం, అయినా చూడు దగ్గర చుట్టరికంలేందే ఎల్లకాలం వుండిపోతే నలుగురూ నాలుగు విధాలుగా అనుకుంటారు, అందుచేత...........'' అని మామయ్య ఆగిపోయాడు.

"నువ్వనేది నాకేమీ అర్థం కాలేదు. నెమ్మదిగా వెళ్లిపొమ్మంటున్నారా ఏమిటి మామయ్యా!, ఏమీ చేయమంటావు,'' అంది లఖియా.

"చూడు లఖియా న నాకేమంత వయస్సు మించిపోలేదు. అయినా పునర్వివాహంలో తప్పేముంది. అందుచేత నిన్ను నేను.........నిన్ను ఇంటిదానిని చేస్తాను. అలాగైతే నువ్విక్కడే వుండిపోవచ్చు. ఎవ్వరూ నోరు విప్పలేరు," అన్నాడు అతను.

లఖియాకి నోటివెంట మాట రావటం లేదు. రాతిబొమ్మలా ఉండిపోయింది. మామయ్య మాటల అర్థం తెలిసేటప్పటికి కొంత సేపు పట్టింది. తను మౌనంగా ఉండేసరికి మామయ్య ఉత్సాహం హెచ్చింది.

"నీ మౌనం చెప్తోంది నీకిష్టమేనని. వచ్చే నెల మంచి ముహూర్తం వుంది," అన్నాడు.

"మామయ్యా! చాలు ఇక అలా మాట్లాడకు, నేను నీ కూతురులాంటి దానిని, నన్నిలా అవమానం చేస్తావా? " అని, బయటకి వచ్చేసింది.

మామయ్యకు ఎవరో చెప్పివుంటారు. స్త్రీలు కాదంటే అవును, అవునంటేకాదు అని, అందుచేత ఆయన నిరుత్సాహపడలేదు. దాని ఫలితం ఏమిటంటే, మళ్లీ తన నాలుగు చీరలు మూట కట్టుకుని అమె ఆ ఇంటిలోంచి బయట పడింది. అదృష్టవశాత్తు ఎవరో పుణ్యాత్మురాలు దయతలచి కావాల్సిన డబ్బు ఇచ్చి అమెను ఈఆశ్రమానికి పంపించింది. గురువుగారు కూడా కనికరించి తనను ఆశ్రమంలో చేర్చుకున్నారు. అలాగ వారు లఖియాకి జీవితంలో సహాయం చేసిన వారి జాబితాలో చేరేరు - ఈ అజ్ఞాత స్త్రీ, సరళల తోటి . కాని నేను ఎప్పుడూ ఆమెకు ఏమీ చేయలేకపోయాను.

"మామయ్యను వదిలిపెట్టి రావటం సబబా, కాదా, అని ఇప్పటికి అనుమాన పడుతుంటాను. మామయ్య స్వతహాగా మంచివాడే. క్షణమాత్రం ఏదో పాడు బుద్ది పుట్టింది. మామయ్యతో మాట్లాడితే తన తప్పు తెలుసుకునేవాడు. ఇంట్లో ఆడదిక్కులేదు. తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో ఎంత కష్టపడుతున్నాడో ఆ పిల్లలతో పాపం. మామయ్య నాకెంతో సాయం చేశారు. నీను మాత్రం ఆయనకి ఈ విధంగా ప్రతిఫలం చూపించాను," అంది లఖియా జరిగిందంతా చెప్పి.

ఆ మాటలు వింటూంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. కోపంతో అన్నాను... ''చాలు లఖియా ఇక నువ్వు మాట్లాడకు. లేకపోతే నేను బయటికి వెళ్లిపోతాను.''

లఖియా బిత్తరపోయి అంది, ''ఏమిటి రామంబాబు మీరంటున్నది."

"ఇంత అమాయకురాలివి. ఈ ప్రపంచంలో నీకు ఎలా గడుస్తుంది లఖియా. లేకపోతే నువ్వనేదేమిటి? ఆ మామయ్యతో వుండకపోవటం నీ తప్పంటావా? నువ్వు పడిన ఈ కష్టాలు ఇంకొక స్త్రీ పడినట్లైతే పురుషుడంటేనే అసహ్యంచుకుంటుంది. పురుషజాతి తరఫున నిన్ను మమ్మల్నందరిని క్షమించమని వేడుకుంటాను. నీకు జీవితంలో తారసిల్లిన వారంతా చాలా అన్యాయం చేశారు. అయినా అందరూ అలాంటివారు కాదు లఖియా, లేకపోతే నేను ఇక్కడ తల బద్దలు కొట్టుకుని చస్తాను,'' అన్నాను నాకు దుఃఖము ముంచుకొస్తుంటే.

లఖియా నా ఆవేశానికి చాలా ఆశ్చర్యపోయింది. కొంచెం సేపు మాట్లాడలేదు కూడా; ముఖంమీద ఎప్పుడూ వెలిగే ఆ మందహాసమూ మాయమయింది. ఆమె మస్కిష్టం మేఘావృత‌మైంది.

"ఎంతైనా మామయ్యను మీరు దోషిగా పరిగణించకండి రామంబాబూ. తప్పెవరిదీ లేదిందులో. ఆ పరిస్థితుల్లో చాలా మంది మా మామయ్య లాగే చేస్తారనుకుంటాను," అంది

''అందరూ అలాగే ఎందుకు చేస్తారు. మళ్లీ అలాంటి మాటలనకు,'' అన్నాను.

"పురుషులంతా అలాంటి వారని నేనెప్పుడూ అనుకోలేదు. వారిని గురించి కూడా నేను చెడుగా భావించటంలేదు. అయినా నేను మిమ్మల్ని అలాంటి వారితో ఎప్పుడూ పోల్చలేను రామంబాబూ. అది ఎలాంటి తప్పిదమో నాకు తెలుసు. నేను అనేదేమిటంటే, కూతుర్ని కోల్పోయిన తర్వాత ఆడదిక్కులేక బాధపడుతూన్న సమయంలో మామయ్య నోరు జారి ఆ మాటలన్నాడు. అది పరిస్థితుల ప్రభావం. ఆయన తప్పుకాదు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనము అనేక పనులు చేస్తాము. నా జీవితంలో తటస్తపడ్డ వ్యక్తులంతా మంచి వారే. ఎవర్ని కూడా చెడ్డవారనటానికి కారణం లేదు," అంది.

నా అవేశానికి నేను కాస్త సిగ్గుపడ్డాను. లఖియా చెప్పిందే నిజమేమో? తన మామయ్య మంచి ఉద్దేశ్యంతోనే అలా చేశాడేమో?

"సరే, అలా అయితే మీ మామయ్య పేరు ఏమిటో చెప్పు లఖియా? ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు వారికి నా నమస్కారాలు చెప్పుకుంటాను,'' అన్నాను.

''వద్దు మీ నమస్కారాలు ఆయనకు చెప్పనక్కర్లేదు. ఇక్కడ నుంచే చెప్పండి. నాకు తెలుసు ఇలా అంటారని. అందుకనే పేరు చెప్పలేదు,"అంది లఖియా నవ్వుతూ.

''సరే లఖియా, నీలో ఇంత ఔదార్యమూ, క్షమాశక్తివున్నప్పుడు నేను అడ్డురాను. జీవితంలో మానవుడు నీకు చేయగలిగిందేదైనా ఉంటే నువ్వు మొదట అడగాల్సిన వాడిని నేను,'' అన్నాను.

''అవసరం వస్తే అలాగే చేస్తాను. రామంబాబూ. ఇక వెళ్లండి మీరు. సుందరి తిరిగివచ్చే వేళయింది," అంది.

అవును నిజమే యశో మాటే మరిచిపోయాను.

 

చాప్టర్ 22

 

కాలం దొర్లిపోతూంది. జీవితం సుఖంగా ఆహ్లాదకరంగా సాగిపోతూంది. లఖియా, యశో, వీరిద్దరూ నాకేమీ లోటు రానిచ్చేవారు కారు. ఈ ఇద్దరి స్త్రీలలోనూ ఎన్ని పోలికలునాయి. ఈ ఇద్దరూ స‌హృద‌యులే. ఒకామె విధవ, మరొకామె అవివాహిత ప్రేయసి. ఒకామెలో శాంతమూ, సహనము సమానంగా ఉన్నాయి. ఇంకొకామెలో సహనం వుంది, శాంతి లేదు. ఒకామె జీవితంలో చెప్పరాని కష్టాలు ఎదురయ్యాయి విధి చాలా అన్యాయం చేసింది ఆమెకు. అయినా ఆమెలో లేశమాత్రమయినా క్రోధం లేదు . ఎవరిమీదా ఈర్ష్య కూడా లేదు. కక్ష అసలు రాలేదు. వేరొకామె జీవితంలో కష్టాలను చవిచూడలేదు. అయినా అర్ధరహితంగా ప్రపంచాన్ని కాలదన్నింది. ఈమెలో అణగారిన కోరికలు ప్రేమించిన వ్యక్తి రాకతో అవి తిరిగి తల ఎత్తుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకామె సర్వస్వాన్ని హృద‌యపూర్వకంగా త్యజించింది.. ఇంకొకామె త్యజించాలని ఆశిస్తూ వుంది కాని అలా చేయలేదు. అలా చేయాల్సిన కారణం కూడా నాకు కనబడదు. ఇరువురికి ఒకరిమీద వొకరికి అమితమైన ప్రేమా, పూర్తి విశ్వాసమూ ఉన్నాయి.

పగలల్లా యశోకి ఏమి తీరిక వుండేది కాదు. నాకు వేళకు అన్నీ సమకూర్చడమూ, గురువుగారికి సేవ చెయ్యడంతో సరిపోయేది. రాత్రిళ్లే మాకు కులాసాగా కబుర్లు చెప్పుకోవడానికి వీలు దొరికేది. వెన్నెల రాత్రులలో గంగ ఒడ్డునకు వెళ్లేవాళ్లము. గంగ అల్లంత దూరంలో వుందనగానే యశోకి ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చేది. నా చెయ్యి పట్టుకుని లాగుతూ పరుగెత్తేది. నల్లతాచులాంటి జడను ముందర వేసుకుని, తామరతూడుల్లాంటి చేతులు నా భుజాలమీద వేసి కిలకిల నవ్వుతూ ''బాదల్ బాబూ'' అనేది కళ్లలోకి చూస్తూ. అటువంటప్పుడు తెల్లటి లతలాంటి ఆ చేయి, మృదువైన‌ ఆ వంకరలు, పచ్చటి ఆ చర్మంలోంచి తొంగి చూసే ఆ నీలి నరాలు నన్ను సమ్మోహితుని చేసేవి. మెత్తగా, నున్నగా వున్న ఆ బాహువులను చూస్తుంటే ఒళ్లు పులకరించేది. చిదిమితే లోపల నరాలు బయట పడతామో అనిపించేది . స్త్రీ హస్తసౌందర్యానికి ఎవరు ముగ్ధులవలేదు? ఎంతమంది కవులు కొనియాడలేదు? చిత్రకారులు చిత్రించలేదు?

''నీ చేతుల గాజులు ఏమయ్యాయి యశో?చేతులు పూర్తిగా బోడిగా వున్నాయి,'' అడిగాను ఒకసారి.

''అన్నింటితో పాటు అవీ పోయాయి బాదల్ బాబు. వాటి పని ఏముంది చెప్పండి?'' అంది యశో నవ్వుతూ.

''అయితే ఉన్న బంగారం అంతా అమ్మేశావా, అమ్మి?''అన్నాను.

"అమ్మలేదు అవసరం కోసం దాచాను,'' అంది నవ్వుతూ.

అప్పుడప్పుడు నిజంగానే పిచ్చెక్కేది యశోకి. గాలిలో తేలిపోవాలనుంది. పట్టుకోండి చూద్దామని లేడిలాపరుగెత్తేది. ఆ పరుగెత్తడంలో క్రిందపడి, '' నన్ను లేవదీయండి'' అనేది.

ఇన్ని కోరికలున్న వ్యక్తి సన్యాసిని ఎలా కాగలదు? ఒక వెన్నెలరాత్రికే యింత వుద్వేగపడే ఈమె సర్వస్వాన్నీ ఎలా త్యజించగలదు?

అయినా ఆమె నియమాలన్నింటినీ పాటించేది. పొద్దున్నే నదిలో స్నానం చేసి కోసిన పూలతో పూజా, గురువుగారి సేవా, ఉపవాసాలూ అన్నీ క్రమబద్దంగా ఆచరించేది. అయితే ఈమెలో ఏమైనా అంతర్యుద్దం జరుగుతోందా?

గురువుగారు మళ్లీ ఆయనను కలుసుకోమని ఆహ్వానించారు. దానిని పురస్కరించుకుని ఒకసారి యశోతో ఆయన వద్దకు వెళ్లాను. ఈసారి గుమ్మంవద్ద వుండగానే ఆహ్వానం వచ్చింది. నా వెనుక కాస్త పరికించి చూశారు స్వామిజీ. సరళ జాడలేమైన కనబడుతాయేమోనన్నట్లు.

''రా నాయనా, కూర్చో," అన్నారు చిరునవ్వుతో సరళ నాతో లేదనిగ్రహించి

ఎక్కడ కూర్చోను? అక్కడ ఏమీ ఆసనం, కనీసం చాపయినా లేదు. యశో నేల మీద కూర్చొని నన్ను కూడా అలాగే చెయ్యమని సంజ్ఞ‌ చేసింది. నేను ఇంకా సందేహిస్తూంటే, యశో నా జేబులోంచి రుమాలు తీసి కిందవేసింది. ఏం చేస్తాను? అలాగే కూర్చున్నాను. కాసేపు గురువుగారు మాట్లాడలేదు.

''నీకిక్కడ కాలం ఎలా గడుస్తూంది నాయనా," ఆఖరికి అడిగారు.

''బాగానే గడుస్తూంది స్వామి,'' అన్నాను వినయంగా.

''నువ్వు మామూలుగా ఏమి చేస్తుంటావు నాయనా?" అన్నారు గురువు గారు.

''ఏమీ చెయ్యను స్వామీజీ,'' అన్నాను.

సంభాషణ ఏమిటి ఇలా నడుస్తూంది? యశో అలాగే మా వంక చూస్తుంది. ఏదో మాట్లాడాలనే అతురతలో తప్పు పలుకుతానని సందేహం వస్తుంది.

''మీకు జ్ఞానోద‌యం ఎప్పుడు కలిగిందో తెలుసు కోవాలని ఉంది స్వామీజీ,'' అన్నాను.

గురువుగారు దాని కోసమే ఎదురు చూస్తున్నట్టు తడుముకోకుండా మొదలుపెట్టారు.

''నా ఇరవై అయిదవ ఏట కలిగింది నాయనా. అప్పటికి అయిదు సంవత్సరాల క్రితం నాకు వివాహ మయింది. సంసారజీవితంమొదలుపెట్టిన అనతికాలంలోనే నాకు తుచ్ఛ ప్రాపంచక భోగాలంటే విరక్తి కలిగింది. మానవుడు ఎందుకు పుట్టాడు? ఎక్కడకు పోతాడు? జీవితం యొక్క అర్థమేమిటి? ఈ ప్రశ్నలతో సతమతమయ్యేవాడిని, ఐతే భార్యమీద వున్న మమకారం ఒక్కటే నా జ్ఞాన శోధనకు అడ్డువచ్చేది. ఇలా వుండగా నాకొక జనకుడు జనించి ఆరునెలలకి కాలంగతం చేసాడు. ఆ పుత్రశోకంలో నా భార్యామణికి మతిపోయేటంత పనైంది. నాకును జీవితం మీద విరక్తి కలగసాగింది. ఎక్కడకు పోయాడు నా పుత్రుడు? నేను జీవించి వుండనా? ఆ ప్రశ్నకి సమాధాన అన్వేషణార్ధం గృహ విసర్జనం చేశాను. ఆ ప్రశ్నకి సమాధానం ఎలా దొరికిందో తెలుసుకోవాలనే కుతూహులం నాలో లేదు.''

''మీకు జ్ఞానోద‌యం మీ వివాహం కాకముందు జరిగినట్టయితే చాలా బావుండును కదా ,'' అన్నాను.

''ఎందుచేత నాయనా?'' అన్నారు.

''మీ సుఖం కోసం మీ భార్య సుఖం త్యాగం చేశారు కదా? ఆ తర్వాత ఆమె గతి ఏం కాను? అది ఆలోచించండి. మనము ఏ పని చేసినా దాని వల్ల మనకు సుఖము లభించినా ఇతరులకు అన్యాయం చేయకూడదనే సూత్రం మంచిది కాదా స్వామీజీ?"అన్నాను.

నా మనస్సు పుత్రశోకంతో బాధపడుతున్న దన్న అయన, భర్త విడబాటు వంటి గొడ్డలి పెట్టుకు తన భార్యఎలా తట్టుకుందా అని ఆలోచించలేదు. అందరికీ చెప్పినట్టే తన కథనులో తన త్యాగాన్నీ అనర్గళంగా వివరించారు గురువుగారు. అడ్డుప్రశ్న వేసేసరికి కాస్త ఇరకాటంలో పడ్డారు.

''ఆవిధంగా ఆలోచిస్తే మనం ఏ పనీ చేయ్యలేము నాయనా? మహానుభావుడు బుద్ధుడు కూడా అదే చేశాడు." అన్నారు ఆఖరికి తన మేధాశక్తినంతా ఉపయోగించి.

నాకు పట్టరాని కోపం వచ్చింది ఈసారి.

''మీకు నేను చెప్పాలా స్వామిజీ, బుద్ధుడు పుత్రశోకంతో ఇల్లు వదిలి వెళ్ళలేదని, తోటి ప్రజల కష్టాలని నివృత్తించడానికని, స్వీయ సమస్యల విముక్తి కోసం కాదని. సిద్ధార్ధుడు అన్నీవున్నా లోక కల్యాణం కోసం గృహంవీడి బుద్ధుడయ్యాడు, మానవకోటికి బౌద్దమతాన్ని ప్రసాదించాడు. తమరు ఒక మఠాన్ని స్థాపించారు సరే, కాని కొత్త ధర్మాన్ని ప్రతిస్థాపించేరనుకోను. ఏ విధంగా చూసినా వారికి మీకు చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి స్వామీజీ,'' అన్నాను.

''నాయనా నువ్వు చాలా ఘటికుడివి. అమ్మాయి సరళకంటె ఒక ఆకు ఎక్కువ చదివావు. తర్కంలో నేను నీకు సరితూగ నేమో. అయినా నేను చేసిన పనే వుత్తమ మైనదని నా నమ్మకం. ఒక వ్యక్తిని నేను కష్టపెట్టి వుండవచ్చు. కానీ అనేకమందిని చీకటిలోంచి వెలుగులోకి దారి చూపించాను. నేనలా చేయకపోతే సుందరి వంటి వారు ఏమవుతారో ఆలోచించావా?'' అన్నారు గురువుగారు లేని నవ్వు తెచ్చుకుని గెడ్డం రాసుకుంటూ.

''అందరికీ దారి చూపించేవాడే యశోకూ చూపిస్తాడు. అందువలన ఆమె బాధ్యత మీకు వలదు గురూజీ. అయినా తమరు తిరిగీ మీ భార్యను కలుసుకున్నారా?'' అన్నాను.

''తర్వాత చాలా కాలానికి ఆమే ఇక్కడికి వచ్చింది. తనతో తిరిగి రమ్మనమని బతిమాలింది. లేకపోతే ఆమె నాతో ఇక్కడ వుండిపోవడానికి అంగీకరించమంది. నేను దేనికీ అంగీకరించలేకపోయాను," అన్నారు గురువుగారు.

''ఎందుచేత స్వామీజీ,'' అన్నాను.

''భార్య నా దగ్గరవుంటే, నన్ను నేను సంభాళించుకోలేనేమోనని, ఆమె కన్నీళ్లకి కరిగిపోతానేమోనని భయం వేసింది,"అన్నారు ఆయన .

ఈ గురువుగారి వైరాగ్యం ఇంత గొప్పదని నేను ఊహించలేదు. భార్య దగ్గరవుంటే తనను తాను నిగ్రహించుకోలేని ఈ సన్యాసి దగ్గర యశో, లఖియా వంటి యువతులు వుండటం శ్రేయస్కరమేనా అసలు?

''గురువులకి, యోగులకీ ఇంద్రియ నిగ్రహం వుంటుందనుకున్నాను స్వామీజీ,'' అన్నాను.

ఇంతసేపూ యశోకి నా మాటలేమీ నచ్చలేదని తెలుస్తూనే వుంది.

''తమరి పూజా సమయం మించిపోతుంది స్వామీజీ," ఇక యీ సంభాషణను పొడిగించటం ఇష్టం లేక అంది.

''అవును సుందరీ, ఈనాటి కిక చాలు నాయనా, ఇంకా ఇక్కడ ఎన్నాళ్లు వుంటావు,'' అన్నారు గురువుగారు లేచి నించుని.

''ఇంకా దాని అవగాహన కలగ లేదు స్వామీజీ,'' అన్నాను.

"సరే మంచింది. తర్వాత కలుసుకుందాం,'' అని ఆయన యశోకేసి చూస్తూ, లోపలికి దారి తీశారు.

యశోకూడా ఆయనవెంట వెళ్లిపోయింది. నాతో ఒక్కమాటైనా మాట్లాడలేదు.

గురువుగారితో నా సంభాషణ ఆమెకు కోపం తెప్పించిందని తెలుస్తూనే వుంది. గురువుగారి మీద ఆమెకు అపార గౌరవమూ, అకుంఠిత విశ్వాసమూ వున్నాయి. నేనెందు చేత అలా పరిగణించలేక పోయాను? అప్పుడు యశో కంటె సరళ అభిప్రాయాలకీ, నా అభిప్రాయాలకీ దగ్గర సంబంధం కనబడింది. దీనివల్ల ఆమెకు క్షోభ కలుగుతుందని నేను గ్రహించాను. అసలు ఈ గురువుగారిని తిరిగి కలుసుకోవటమే నా తప్పిదం. ఇక మళ్లీ ఆయన వద్దకు వెళ్లకూడదని నిశ్చయించాను.

 

చాప్టర్ 23

 

రానురాను నాకు గురువుగారి మీద అపనమ్మకం హెచ్చింది. అందులో ఆయన మీద కోపం కూడా వుందేమో? నామాటకంటే గురువు మాటలకు యశో ఎక్కువ విలువ ఇచ్చేది. ఎప్పుడూ ఆయన మాట జవదాటదు. అయన సేవకు వెనకాడేది కాదు. ఈమె మీద ఇంత అధికారం ఎలా వచ్చింది ఈయనకు.

గురువుగారితో నా ప్రతిఘటన యశో ప్రవర్తనలో మార్పు తెచ్చింది. పూర్వపు శ్రద్ధా, మమకారమూ నా మీద సన్నగిల్లేయి. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకున్నా ఏమీ అనేది కాదు. బ్రేక్‍ఫాస్ట్ చెయ్యక పోయినా పట్టించుకునేది కాదు. రాత్రిళ్లు ఏదైనా సరదాగా మాట్లాడుదామనో, గంగవొడ్డుకు వెల్దామనో నేనంటే, ''నిద్రవస్తుంది, అలసిపోయాను,'' అనేది. ఆ ప్రవర్తనకి కారణం నాకేమీ అంతుబట్టలేదు. నా మనస్సుకు అమితంగా బాధ కలిగేది. లఖియా కూడా మా సంగతి గ్రహించినట్లు కనబడింది. కాని ఆమె కూడా ఏమీ అనలేదు.

అప్పుడప్పుడు సరళ వచ్చేది. ఆమెతోకూడా నేను పూర్వమంత చనువుగా వుండే వాడిని కాను. ఆమె మటుకు యధాప్రకారంగానే వుండేది. వీటినన్నింటినీ చూసి నేను అప్పుడప్పుడు భయపడేవాడిని, భవిష్యత్తులో ఏం కాబోతుంది? నాకు ఎంత నమ్మకం లేకపోయినా గురువుగారి మాటలు తలపుకు వచ్చేవి. ఆ దుష్ట మాటలు ఏపాడుశక్తి చెప్పించిందీయనచేత? యశో ఏదో ప్రాయశ్చిత్తం చేస్తానంది. అది ఏమిటో నేను ఎప్పుడూ అడుగలేదు. ఆమె చెప్పనూలేదు. ఈ గురువుమీద ఆమెకున్న నమ్మకం చూస్తూంటే మనస్సు పరిపరి విధాల పోయేది. చివరకు ఏం జరుగుతుంది?

కాలం గడిచేకొద్దీ యశో నాకు దూరమవజొచ్చింది. క్రమేణా ఒకే ఇంటిలో, ఒకే గదిలో వుంటున్నా పూర్వపు చనువు మాయమైంది. నా సదుపాయాలకు లోటు అట్టేరానిచ్చేది కాదు. యశో తన హృద‌య‌పు ద్వారబంధనాలన్నీ మూసివేసింది నానుంచి. ఇప్పుడు వాటిని తెరవటానికి ప్రయత్నించేవాడిని కాని సాధ్యం కాలేదు. యశో కూడా ఏదో ఆలోచిస్తూన్నట్లు ఉండేది. అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటున్నట్లు కనబడేది.

"కొన్నాళ్లు మా ఇంట్లో వుండకూడదా?" ఆ రోజు సరళ వెళ్లిపోయేముందు నా దగ్గరకు వచ్చి అంది.

యశో కూడా అక్కడే వుంది. నాకేమనటానికి నోరు రాలేదు; ప్రతి సారి యశో జవాబు చెప్పేది కానీ ఈ సారి నోరుమెదపలేదు. ఏమి అనలేదంటే నేను తనని విడిచి వెళితే యశోకి అభ్యంతరం లేదన్న విషయం నాకర్ధమయింది. సరే అందామనుకుంటుంటే, లఖియా పడింది.

"అదేలా సాధ్యపడుతుంది సరళా? అసలు వారు సుందరిని విడిచి నీతో ఎలా వస్తారనుకున్నావు? ఇంత దూరం వచ్చింది ఆమె కోసమేగా? ఏమంటావు సుందరీ," అంది లఖియా

''అదే మంచిది లఖియా,'' అంది యశో నీరసంగా నవ్వుతూ.

యశో ప్రవర్తనలో మార్పు సరళ కూడా గ్రహించి నన్ను రమని పట్టుపట్టలేదు.

ఇంకా కొన్ని దినాలు గడిచిపోయాయి. యశో నిరాదరణ కొనసాగుతూవుంది. అలా ఎన్నాళ్లు అక్కరకురాని అతిథిగా వుంటాను? ఏమైనా యశోని అడగాలని నిశ్చియించుకున్నాను.

ప్రతి రోజూ యశో పక్క వేసేది. ఒకనాటి రాత్రి నేనే వేసుకోవటం మొదలు పెట్టాను. యశో కాసేపు చూస్తూ వూరుకుంది.

''నేను వేస్తాను వుండండి'' అని వేయటం మొదలుపెట్టింది తర్వాత దగ్గరకు వచ్చి.

నేనేమీ మాట్లాడలేదు. అలాగే అక్కడ నుంచుని వున్నాను. పక్కవేసి వెళ్లిపోతూంటే యశో చెయ్యి పట్టుకున్నాను. ఆమె కాసేపు అలాగే వుండనిచ్చి ''వదలండి'' అంది, పక్కకు చూస్తూ. ముఖం నాకు కనబడకుండా వుండాలని ప్రయత్నిస్తూంది.

''నీ వింత ప్రవర్తనకి కారణం చెప్పేవరకూ చేయి వదలను,'' అన్నాను.

యశో చెంపమీద కన్నీరు కారుతూంది.

"నన్ను నిష్కారణంగా ఎందుకు ఏడిపిస్తారు? నేను ఏమి తప్పు చేశాను. మీదేమైనా రాతిగుండా? వదలండీ,'' అంది.చెయ్యి లాక్కుంటూ.

వూహించని ఆ పరిణామంతో నిశ్చేస్టుడనయి చెయ్యి వదిలివేశాను.

యశో తన పక్కమీద పడి భోరుగా ఏడ్వటం మొదలుపెట్టింది. నాకు ఏం చెయ్యాలో తోచక ఆమెకేసి కన్నార్ప కుండా చూస్తూ ఉండి పోయాను.

చివరకు ఆమె దగ్గరకు వెళ్లి, 'యశో' అన్నాను. యశో ఏడుస్తూనే వుంది.

"దయ వుంచి నన్ను వదిలిపెట్టండి బాదల్ బాబూ. లేకపోతే నేనే బయటకు వెళ్లిపోతాను,'' అంది జీరస్వరంతో.

"విదలకేం చేస్తాను," అన్నాను అసహాయంగా.

యశో పూర్తిగా మారిపోయింది. అవసరం వస్తేగాని మాట్లాడేది కాదు. సంకోచ, సంశయములతో బాధపడేవాడిని. నేను అక్కడ వుండటం ఆమెకు ఇష్టంలేదా? ఏదో మాటవరసకని రాసిన వాక్యాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చానా? కాని ఆమె అంత దు.ఖములో కూడా ''బాదల్ బాబూ'' అని సంబోధించింది. అదొక్కటే నా ఓదార్పు.

లఖియాని అడిగి చూద్దామని నిశ్చయించుకున్నాను. లఖియా ముందర ఏమీ చెప్పలేదు. అసలు సంగతి ఆమెకు కూడా తెలియదంది. తెలిసిందేమిటో ఆదే చెప్పమన్నాను.

అసలు సంగతి ఇది. నేను యశో ఒకే కుటీరంలో కలసి వుండటం వల్ల నలుగురూ నాలుగు మాటలు అంటున్నారు. గంగఒడ్డున మా వెన్నెల రాత్రి విహారాలు కూడా వీరందరి చెవులా పడ్డాయి. చివరకు గురువుగారు కూడా యశోతో చెప్పారట, ఇదంతా ఏమీ బాగుండలేదని;ఆయినా యశో ఎంతగానో నచ్చ చెప్పిందిట, నాలాంటి మంచివాడు చాలా అరుదుగా కనబడుతాడని. ఇదంతా కొంత కాలం నించి నడుస్తోందిట; గురువుగారు నేను వద్దనడం, యశో నన్ను సమర్ధించడం. ఆయినా ఆయన ససేమిరా అనేవారట; ఆఖరికి మూడు రోజుల క్రితం ఆయన తేల్చివేశారుట. నన్ను పంపకపోతే యశోకూడా వెళ్లాల్సి వస్తుందనీ, ఆశ్రమపు పరువు ప్రతిష్టలు వ్యక్తుల కంటే ముఖ్యమని. అందుచేత నన్ను నెమ్మదిగా పంపించి వేయమని చెప్పారు. లఖియా ఈ విధంగా చెప్పలేక చెప్పింది. కాని దాని సారాంశమిది. నామీద ఆయనకు ముందరనించి అయిష్టతే, అయినా ఆయన్ని కించపరచి నేనే దాన్నిపెంచాను . ఇదే స్వయంకృతాపరాధం , యశోకి మరో శాపం.

యశోని బాధపెట్టే నిగూఢ రహస్యం తెలిసిన తర్వాత తనలోని బాధ నాకు అర్ధమైంది. ఒకవైపు బాదల్ బాబూ,మరోవైపు గురువు గారు. వీరిలో ఎవరిని త్యజించాలి? గురువుగారితో తనకు మనశ్శాంతమూ, సాఫీగా గడిచిపోయే భవిష్యత్తూ వున్నాయి. నాతో ఉంటే కష్టాలు, రక్షణ లేని భవిష్యత్తూ ప్రాప్తిస్తాయి. నా బరువంతా తనమీద పడుతుంది. వీటిలో దేనిని త్యజించాలి. అదీ సమస్య..నా రాకకు మునుపు ఆమె ఎంతో సరదాగా గడిపిందనే దానికి ఆమె ఉత్తరమే సాక్షి.

అంటే నేను వచ్చి అదంతా పటాపంచలు చేశాను. హృద‌యంలో అణగారిపోయిన కోరికలు చిగిర్చాయి. ఆగిపోతూన్న నిప్పు తుణకలను దగ్గరచేర్చి మంటచేశాను. దాని ఫలితమే ఇది. ఆమెకి ఇక్కడి జీవితం నచ్చిందనటానికి సందేహంలేదు. ఆ ఆశ్రమంలోనే జీవితాంతం వుండిపోదామని ఆమె అనుకున్నదనే విషయం నాకు తెలుసు. ఇవన్నీ ఈనాడు తారుమారవుతాయా?

అయితే నేను ఏం చెయ్యాలి? చాలా సేపు ఆలోచించాను. నా సంగతి మాత్రమే ఆలోచిస్తే యశో నాతో వుండటం చాలా ముఖ్యం. మళ్లీ నా భారాన్ని నేను వహించలేను. కానీ యశో సంగతి వేరు. నాతో వుండటం వల్ల ఆమెకు కష్టాలు, కన్నీరు తప్పవు. ఆమె సుఖపడటానికి అవకాశాలు ఏమీలేవు. నా స్వభావమే అంత, యశో చెప్పినట్లు నేను అందరివద్ద అన్నీ ఆశిస్తాను. స్వీకరిస్తాను. ఉపయోగించుకుంటాను. తిరిగి ఏమీ ఇవ్వను. ఇంత కృతజ్ఞుడితో ఈమె ఏమి సుఖపడుతుంది?

అసలు యశో ఏమనుకుంటూంది? నన్ను పొమ్మని చెప్పలేక బాధపడుతూందా? నా అంతట నేనే వెళ్లిపోతానని చెప్తాను. ఆమెకు ఆమాత్రం సహాయం నేను చేయలేనా? మూడు సంవత్సరాల క్రితం నా మటుకు నేను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని వదిలిపెట్టి పోయాను. తరువాత ఆమె విలువ గ్రహించాను. ఆమెను వెదుక్కుంటూ చివరకు ఇక్కడికి చేరుకున్నాను. ఆమెనించి ప్రేమా, వాత్సల్యం, అనురాగం అన్నీ పొందాను. ఈసారి ఇవన్నీ వదిలి నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లిపోవాలి అనుకున్నా... తనకు యశోకి మధ్య ఈ గురువుగారోకడు తయారయ్యాడు? అసలు తను నిజమైన సన్యాసేనా?

ఆ రోజు రాత్రి.

"యశో నాకు లఖియా అంతా చెప్పంది"అన్నాను తన దగ్గరకు చేరి, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా.

యశో ఒక్క నిమిషం ఆలోచనలో పడింది.

"అయితే ఏం చేస్తారు?" అంది కాసేపు వుండి.

దీంతో నాకు ఏం చెప్పాలో తెలియలేదు.

"నేను వెళ్లి పోతాను యశో,'' అన్నాను తలవని తలంపుగా.

అసలు అంతవరకూ నేనొక నిశ్చయానికి రాలేదు. కాని నోట ఆ మాటలు వచ్చేశాయి.

యశో కాసేపు మాట్లాడలేదు.

''అదే మంచింది'' అంది ఆఖరికి, కళ్లు మూసుకుని.

దగ్గరలో పిడుగు పడినట్లైంది. అదే మంచిది అంటే అర్థమేమిటి? ఇంతకు ముందు ఒకసారి సరళ నన్ను తనతో రమ్మన్నప్పుడు లఖియాతో యశో ఇదేమాట అంది. ఆ రెండు పదాల్లో మా ఇద్దరి భవిష్యత్తూ ఇమిడించిందా తను ? అంతకుముందే నన్ను వదిలేయటానికి నిశ్చయించి వుంటుంది. లేకపోతే ఎలా అనగలదు అలాంటి మాటలు. ఇక ఏమనాలి? మనస్సంతా ఎంతో బరువైపోయింది.

''రేపే వెళ్లిపోతాను యశో,'' అన్నాను.

''ఇంకా కొన్నాళ్లు వుండకూడదా?" అంది ఆద్రస్వరంతో.

''వద్దు యశో, ''అన్నాను.

''సరే అయితే, అదే మంచిది,'' అని అవతలవైపుకు తిరిగిపోయింది.

యశో అటుపక్కకు తిరిగి తనలోతాను నవ్వుకుంటూందనే ఘోర అనుమానం కలిగింది. ఎంత మారిపోయింది. వినడమే తడవుగా తోసిపుచ్చింది నన్ను? వెళ్లిపోవటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఇలాంటి వీడ్కోలుకి నా హృద‌యం సిద్ధంగా లేదు అనుకున్నాను. హృద‌యమంతా కల్లోల పూరితమైపోయింది..

మంచం మీదకు వెళ్లి పడుకున్నాను. మానసికంగా అలసి సొలసి, క్రమేణా నిద్రపోయాను.

ఆ రాత్రి ఏ ఝామునో….

"బాదల్ బాబూ", అని యశో లేపితే కళ్లు తెరిచాను.

నా ఎదురుగా 'పసుపు పచ్చటి జార్జట్టు' చీర కట్టుకుని ఉండి.

"లేవండి, బండి సిద్ధమైంది ప్రయాణానికి," అంది.

అప్పటికి నాకు పూర్తి మెలుకువ వచ్చింది.

"ఏమిటీ యశో నన్ను రాత్రికి రాత్రే రవాణా చేస్తున్నావా ?"దు.ఖముతో నా గొంతుక బొంగురుపోయింది.

''ఎంత చెడ్డదాన్నైనా నేను అలాంటి దానిని కాను బాదల్ బాబూ. పదండి నేనూ మీతో వస్తున్నాను,'' అంది నవ్వుతూ.

మొదట నాకేమీ అర్థం కాలేదు. యశో శాశ్వతంగా ఈ ఆశ్రమం వదలి నాతో వచ్చేస్తుందా! ఇంతలో ఈ మార్పెలావచ్చింది. నా చెవులను నేనే నమ్మలేని స్థిలో వున్న నన్ను చెయ్యి పట్టుకుని బయటికి నడిపించింది.

''బాబుగారి పక్కచుట్టి బండిలో పెట్టు, '' అంది యశో బయట ఉన్న రణధీర్ని ఉద్దేశించి.

అప్పుడే లఖియా చీకటిలోంచి రోడ్డుమీద వున్నఎడ్ల బండి లాంతరు వెలుతురు లోకి వచ్చింది. నాకు ఆమెను చూడగానే ఎందుకో మనస్సులో చాలా బాధ కలిగింది.

''నేను వెళ్లిపోతున్నాను లఖియా, యశోని నీవద్దనుంచి తీసుకు పోతున్నాను," అన్నాను తన దగ్గరకు వెళ్లి.

చీకటి ఆ గుడ్డి దీపం వెలుగులో లఖియా ముఖం చాలా అస్పష్టంగా వుంది. ఆమె కంటతడి వుందా? కాని ఆమె జవాబును బట్టి వుందని కాస్త ఊహించుకున్నాను.

"రామంబాబూ. మీ సొత్తును మీరు తీసుకెళ్తున్నారు. ఇక నుంచి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అందర్నీ కాపాడే ఆ భగవంతుడు మీ ఇద్దర్నీ కాపాడుతాడు," అంది.

"నువ్వు మాకొక మాటివ్వాలి. జీవితంలో నీకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన మాకు కబురుచెయ్యి. నీకు ధనం ఇస్తామని చెప్పము. అందుకు మేము అర్హులం కామేమో? ఎల్లప్పుడూ మా హృదయ కవాటాలు నీకు తెరిచి వుంటాయి. లఖియా, నువ్వు ఎల్లప్పుడూ సుఖపడాలనే నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను," అన్నాను తన చెయ్యిని నాచేతిలోకి తీసుకుని.

''అలాగే చేస్తాను రామంబాబూ. అవసరం వస్తే మీ వద్దకు వస్తాను. మీ ఇద్దరికీ నామీద వున్న అభిమానం, దయా నాకు తెలుసు అందుకు నేను తగిన దానిని కావాలనే నా కోరిక,'' అంది లఖియా.

''అదే పదివేలు మాకు," అన్నాను.

''రామంబాబూ. యశోని మీ చేతిలో పెట్టే భారం కూడా నేనే వహిస్తాను. సుందరీ, వీరిని గురించీ, నా కర్తవ్యం గురించీ నీకు నేను చెప్పదగిన దానను కాను. కాని ఇది చెప్తాను. వీరిని కాపాడుకోవటం కన్నా నీకిక వేరే కర్తవ్యం లేదు,'' అంది నా దక్షిణహస్తాన్ని యశో చేతిలో పెట్టి.

మరోక్షణంలో వారిరువురు గాఢాలింగనములో ఇమిడిపోయారు.

''ఈనాడు నాకు ఇది లభించటానికి కూడా నువ్వే కదా కారణం లఖియా, లేకపోతే వీరిని పారవేసుకునే దానిని కదా. ఈ రాత్రి నువ్వు నాకీ మార్గం చూపించకపోతే నేనేమయిపోయేదానినో? ఈ విషయం నేన్నటికీ మరువను. వీరన్నట్టు మా హృద‌యపు కవాటాలు నీ కోసం ఎప్పుడూ తెరిచే వుంటాయి,'' అంది యశో.

అయితే యశో నాకు లభించటానికి కారణం కూడా లఖియాయే అన్నమాట. ఈమె రుణం నేనెలా తీర్చుకునేది. ఈ పవిత్రతని అవిపత్రం చేయకుండా నేనేమి సమర్పించగలను?

లఖియా నా మనస్సులో భావాల్ని గ్రహించింది.

''వద్దు రామం బాబూ.. మీ హృద‌యంలోని భావాలు వుద్దేశాలు నాకు తెలుసు.....బయటికి వెల్లడించ నవసరంలేదు. శేష జీవితంలో మనము కలుసుకుంటామో లేదో నేను సరిగా చెప్పలేను. కాని యశోని, మిమ్మల్ని నా స్పృతిపథంలో భద్రంగా దాచుకుంటాను. కష్టసమయాల్లో మీ జ్ఞప్తి నాకొక ఓదార్పు. ఇక నేనేమి ఆశించను, '' అంది.

లఖియా చాలా శాంత స్వభావిని, మితభాషి. అవేశానికి ఎప్పుడూ లోనుకాదు. సర్వవేళలందూ ఆమె ముఖం మీద తేజోవర్ణమైన కాంతి వెలుగుతూంటుంది. అలాంటి లఖియా ఎంతో ఆవేశంతో ఆ చివరి వాక్యాలు పలికింది, "కష్టసమయాల్లో మీ జ్ఞప్తి నాకొక ఓదార్పు. ఇక నేనేమి ఆశించను."

యశో కళ్లవెంట నీరు కారుతూంది.

ఎడబాట్లు ఎప్పుడూ దుఃఖాన్ని కలుగజేస్తాయి. సన్నిహితులనూ, ప్రేమపాత్రులను వదలాల్సి వచ్చినప్పుడు ఇది మరీ ప్రబలంగా వుంటుంది. యశో గబగబా కళ్లు తుడుచుకుంది,

''పదండి రామంబాబూ, అలస్యమవుతూంది,'' అంది

లఖియాకేసి మరొక్కసారి చూశాను. చిరునవ్వుతో నా చెయ్యి పట్టుకుని బండివద్దకు తీసుకువచ్చి బండి ఎక్కించింది. యశో అప్పుడు లఖియాకి పాదాభివందనం చేసింది. మరొక్కసారి ఇరువురూ కౌగిలిలో ఇమిడిపోయారు. లఖియా యశోని కూడా బండి ఎక్కించింది.

ఇక పద రణధీర్,' అంది లఖియా, వీడ్కోలుగా చేయి ఊపుతూ.

ప్రతివీడ్కోలుగా యశో చేయి ఊపగా, నేను చేతులు జోడించి నమస్కరించాను.

రణధీర్ కొరడా దెబ్బ తిని ఎద్దులు పరుగెత్తాయి.

లఖియా చీకటిలో లీనమై పోయింది.

 

చాప్టర్ 24

 

ఆ నిశి రేయిలో యశో 'పసుపు పచ్చటి చీర' ప్రక్రుతిలో కలిసిపోయింది కాని దాని ప్రాముఖ్యత నాకు అప్పుడే అర్ధమయింది;

"మీకు జవాబు రాస్తూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా విలువైంది. ఇది ఎప్పుడూ ఇక్కడకు వచ్చినతర్వాత కట్టుకోలేదు. ఏమిటా 'ఇది' అని ఆలోచిస్తున్నారా. గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్పారే ఆనాడు; పసుపు పచ్చటి జార్జట్టు చీర కట్టుకుంటే నేను ముచ్చటగా ఉంటానని, అదే చీర ఇప్పుడు కట్టుకున్నాను," యశో రాసిన ఆ అక్షరాలు నాకు కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి.

నేను ఆ చీరకొంగుని సున్నితంగా నా మెడకు చుట్టుకుని యశో కేసి ఆప్యాయంగా చూస్తూ నా ముని వేళ్లతో దాని పల్లు స్పర్శని అనుభవిస్తూ కూచున్నాను.

"మీకు ఇది గుర్తు రావడం నా సౌభాగ్యం," అంది యశో.

''మనము ఇక్కడనుంచీ పారిపోతున్నామాయశో?" అన్నాను.

''ఇది పారిపోవడం కాదు బాదల్ బాబూ. మన జీవితంలో ఒక అధ్యాయం ముగిస్తునాం. అబ్బ. విపరీతమైన నిద్రవస్తూంది. పడుకుంటాను,'' అని, బండిలో గడ్డిమీద తలవాల్చి గాఢనిద్ర లోకి ఒరిగిపోయింది .

కొద్దిసేపు పోయిన తర్వాత గడ్డిలో ఏదో చప్పుడైనట్టుంది. నాలో భయంకరమైన అనుమానం ఒకటి ప్రవేశించింది. యశో గడ్డి మీద పడుకుంది. ఈ గడ్డిలో ఏదైనా పాడుకీటకముంటే ఏం కాను? గడ్డిలో పాములుంటాయి అంటారు. అలాంటిదేదయినా వుందా.... యశో అలా నిద్రపోతూండగా నాకీ ఆలోచనకలిగి వెంటనే ఆ గడ్డంతా చెయ్యి పెట్టి తడమడం మొదలుపెట్టాను. కటికాంధకారం. చేతికి ఏదో కాస్త మెత్తగా తగిలినట్లుంది. శరీరం ఒక్కసారి వణికింది. బయటికి విసిరేశాను. అది ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. బహుశా అది నా భ్రమే అయి వుంటుంది. పాము అయితే కుట్టకుండా అంతసేపు అలా ఎందుకు వుంటుంది? ఇంకా భయం పోలేదు. యశో తల నెమ్మదిగా ఎత్తి నా ఒడిలో పెట్టుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఆమె ముఖం వజ్రంలా తళ తళ మెరుస్తూంది. ఎంత అందంగా ప్రశాంతంగా వుంది.

బయట అంతా కటిక చీకటి. భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఎడ్ల మెడలోంచి గంటలు చప్పుడు చేస్తున్నాయి. వుండి వుండి దూరం నుంచీ జంబూకపు కూతలు వినపడుతున్నాయి. ఆకాశం నిర్మలంగా వుంది. గగనాన్ని తూట్లుపొడుస్తూ నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ వుల్కలు పచారులు చేస్తున్నాయి. చందమామకు అది సెలవు దినం కామోసు. ఎక్కడా అలికిడిలేదు.

మనస్సంతా కల్లోలంగా వుంది. గతించిన అనేక స్మృతులు మనో నేత్రాలముందు మెదలసాగాయి. ఆ ఆశ్రమానికి సరళతో కలిసి వచ్చాము. కారులో రాజేంద్ర సారధ్యం వహించాడు. ఈసారి నిద్రలో వున్న యశోని తీసుకుని నిశిరాత్రి రెండెడ్ల బండిలో ప్రయాణం చేస్తున్నాను. రణధీర్ కునికిపాట్లు పడుతూ బండిలో ఊగిసలాడుతున్నాడు. రాకకీ, పోకకీ ఎంత వ్యత్యాసముంది. ఇంతకి ఎక్కడికి వెడుతున్నట్లు? యశో అదేమీ చెప్పనేలేదు. రణధీర్ని అడగడం ఇష్టం లేకపోయింది. యశో పక్కన వున్నంతకాలం ఎక్కడికయితేనేమిటి?

హఠాత్తుగా సుశీ గుర్తుకు వచ్చింది. ఆమె జీవించి వుంటే నాకివన్నీ తప్పేవికాదా? అప్పుడు యశో ఏమవును? సరళ, లఖియాల మాటేమిటి? మానవ జీవితం ఎంత గమ్మత్తైనది. ఒకసంఘటన ఎన్నో సంఘటనలకు దారితీస్తుంది కదా? అసలు మొదలే యుండకపోతే తరువాడ ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం బహుశా విధాత కూడా ఇవ్వలేడు. మానవ జీవితం క్షణభంగురం. కాని మనము అనుకునేటంత అర్ధరహితం కాదేమో అనిపించింది.

యశో నా కోసం సర్వం త్యజించింది. కాని తనకి నేను ఇవ్వగలిగింది శూన్యం. నా వద్ద వున్నదేదో అది సుశీ తీసుకుపోయింది. నా వద్ద వున్న మిగులు తగులు ఏదైనా ఈమెకే సమర్పించుకుంటాను. ఈ వ్యర్థ జీవితాన్ని ఈమె చేతిలోనే పెడతాను.

కొంతసేపటికి, అలా కూర్చునే నిద్రపోయాను. మెలుకువ వచ్చేసరికి తెల్లవారుతూంది. ఇంకా యశో నిద్రపోతూనే వుంది. ఆమె తల నా ఒడిలో అలాగే వుంది, మరేమిటో గాని, అయినా తిమ్మిరనిపించ లేదు. ఉదయభానుని లేత కిరణాలు ఆమె ముఖానికొక వింతశోభ నిస్తున్నాయి. ఆ ముగ్ధ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తూన్నాను. నుదుటపైన ముంగురులు సరిచేశాను. యశో కళ్లు తెరిచింది.

''అరే, రాత్రంతా ఇలాగే కూర్చున్నారా? మీరు కూడా పడుకోలేకపోయారా?'' అంది గబుక్కున లేచి కూర్చుని.

"ఎక్కడ పడుకోమంటావు అమ్మీ?'' అన్నాను.

యశో ముఖం సిగ్గుతో ఎర్రబడింది.

''నన్ను లేపవల్సింది. నేను కూర్చుండేదాన్ని," అంది.

"అది సరే, ఈ ఎడ్లకి ఏమైనా గమ్యస్థానం వుందా? లేక స్వేచ్ఛా విహారమా," అన్నాను.

యశో నేను వేసిన చలోక్తికి నవ్వలేదు.

''ముందర ముస్సోరీ వెళ్లాలి. బ్యాంకులోంచి డబ్బు తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లాలో ఆలోచిద్దాం," అంది.

ఆ మాట వినగానే నా గుండెల్లో రాయిపడింది. సరళను మళ్లీ కలవాల్సి వస్తుంది ఈ పరిస్థితిలో, కానీ తప్పలేదు. డబ్బులేకుండా ఎలా గడుస్తుంది. నా దగ్గర పట్టుమని మూడు పచ్చనోట్లైనా లేవే?

"మనం ఢిల్లీ వెళదాం . అక్కడ నేనేదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకకపోదు. పెద్ద పట్టణం. మన గురించి పట్టించుకునేవారు కూడా వుండరు,'' అన్నాను.

యశో ఎంతో కాలం తర్వాత స్వచ్ఛంగా నవ్వింది.

''మీరు ఉద్యోగం చేస్తారా? మా భలేగావుంది? ఆఫీసుకు రోజూ మీతో పాటు నన్నూ తీసుకుపోతుంటారా? లేకపోతే మీకు గడవదేమరి. ఎవరూ మిమ్మల్నిఉద్యోగంలో ఒక వారం కంటే ఎక్కువ కాలం వుంచుకోరు," అంది నవ్వుతూ.

నా మనస్సు కాస్త చివుక్కుమంది. నేను అంత పనికిరానివాణ్ణా? అయినా యశో చెప్పిందే నిజం. ఉద్యోగం నా స్వభావానికి గిట్టదని నాకు తెలుసు. ఇదేమాట సుశీ కూడాఅనేది. అయితే ఇక మిగిలిందేమిటి? యశో చుట్టూ ఒక గ్రహంలా తిరగటమేనా?

''కానీ నేను ఉద్యోగం చెయ్యకుండా మనం ఎన్నాళ్లు బతకగలం? అమ్మీ నీ దగ్గరవున్న ధనం అక్షయం కాదుకదా? నా ఆస్తి మాటకొస్తే, కూర్చుని తింటూంటే కొండలైనా కరుగుతాయిగా? ఆ తర్వాత నువ్వు డబ్బు సంపాదించి పోషిస్తావా నన్ను?'' అన్నాను.

"వాటిని గురించి మీరనవసరంగా బాధపడకండి. ఆ బాధ్యత నాది. అవన్నీ నేను చూసుకుంటాను. మనవి రెండు జీవాలు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కంటే ఇంకేమి కావాలి? ఒక వేళ అన్నీఅయిపోతే నా నగలున్నాయి. నాకు తెలుసు మీరేమంటారో; స్త్రీ నగలను వాడనంటారు. మీరు నాకు ఇప్పుడు మాట ఇవ్వాలి మీ డబ్బు, నా డబ్బు అనే విభేదం చూపనని. అంతా ఒక్కటే. ఒకవేళ అంతా అయిపోతే మీరు ఉద్యోగం చేద్దురుగాని, అంతేగాని దండిగా సంపాయించి తర్వాత ఎవరికివ్వాలి చెప్పండి,'' అంది.

నేనేమీ మాట్లాడలేదు. జరగాల్సింది జరుగుతుంది. అయినా ఎప్పుడూ నేను అనుకున్నట్టు ఏదీ జరగదు. మొదటినుంచీ యిదే తంతు. నా చేతిలో లేని దానిని గురించి నేనెందుకు ఆలోచించాలి? యశో ఈనాడు నన్ను వెంటబెట్టుకుని అస్పష్టమైన భవిష్యత్తులో అడుగుపెడుతూంది. సరే చూద్దాం. ఏమవుతుందో?

''రణధీర్ కాస్త బండి ఆపు బాబుగారికి కాఫీ కాచిఇవ్వాలి,'' అంది యశో.

రణధీర్ బండిని ఒక పెద్ద చెట్టు కింద ఆపాడు. యశో బండిలోంచి కావాల్సిన సరంజామా అంతా తీసింది. ఈలోగా రణధీర్ ఎండిన కర్రముక్కల్ని ఏరి తీసుకొచ్చాడు.

''అయితే మనము ముస్సోరీకి తిన్నగా ఈ బండిమీదే వెళ్తున్నామా యశో?'' కాఫీ కాస్తూంటే అడిగాను.

''భలేప్రశ్న వేశారు. డెబ్బై మైళ్లు రెండెడ్ల బండిమీద వెళ్తున్నామనుకున్నారా? ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద పల్లెవుంది. ఏ పల్లె రణధీర్? '' అంది నవ్వుతూ.

''అయిదారు మైళ్లకంటె ఎక్కువ వుండదు చిన్నక్కా. భోజనం వేళకి ముందరే చేరుతాం,'' అన్నాడు.

''మంచిది, అయితే. మీరు అక్కడకాస్త ఎంగిలి పడవచ్చు,'' అంది.

అంటే దాని అర్థం ఆ పూట యశో పస్తుంటున్నదన్నమాట. అలాంటి విషయాల్లో ఆమెతో వాదించటం అనవసరం. తమ్ముడికి, నాకు తను కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చింది, అవి తిని కాఫీ తాగి మళ్లీ ఎడ్లబండెక్కాము.

సరళను మళ్లీ కలుసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనే నన్ను కలవరపరచసాగింది.

''అయితే మనం ముస్సోరీలో ఎన్నాళ్లు వుండాల్సి వస్తుంది యశో," అడిగాను.

"రెండు, మూడు రోజుల కంటె ఎక్కువ వుండనక్కరలేదనుకుంటా,'' అంది.

"ఇంతకీ మనము ముస్సోరీలో ఎక్కడ వుందాము, సరళ ఇంట్లోనా?" అన్నాను

"అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాం? అయినా, వాళ్ళింటికి వెళ్లకపోతే సరళ ఇంకెప్పుడూ మన ముఖం కూడా చూడదు. రాజేంద్రకు కూడా చాలా కోపం వస్తుంది. అయినా వుండేది రెండు మూడు రోజులేకదా? ఆ తర్వాత ఏంచేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. జీవితమంతా గూడులేని పక్షుల్లా తిరుగుతూ వుండలేం కాదా,'' అంది.

వింటూ వూరుకున్నాను.

''హే భగవాన్. సమస్యలేని వేళ నీ సృష్ఠిలోనే లేదా? అబ్బా, ఈ స్థితిలో ఎంత కాలం గడపాలో? ఎప్పటికయినా గమ్యస్థానం చేరుస్తావా!'' మళ్లీ తనే అంది పరధ్యానంగా.

ఆ మాటలు విన్నాక నాకు ఎంతోబాధకలిగింది. ఇరువైమూడు వసంతాల అందమైన యువతి, అవివాహిత, అనాల్సిన మాటలా ఇవి? జీవితంలో ఎంత విరక్తి కలగిందీమెకు? మూడున్నర సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఈమెను కలుసుకున్నప్పుడు తనకు బరువూ, బాధ్యతా, బాధా అంటే తెలియవు. ఎప్పుడూ చిలిపిగా వేళాకోళం చేస్తూండేది. అరక్షణంలో మూడుసార్లు నవ్వేది. ఆమెకిప్పుడు చిరునవ్వే కరువైపోయింది. మందహాసమే మరుగైపోయింది. నేను ఎంతో శోచనీయమైన పరిస్థితిలో వున్నానని, నా కోసం సర్వస్వం త్యజించి, నాకు సర్వస్వాన్ని సమర్పించిన ఈమెకు వుండటానికి ఇల్లు అయినా చూపించలేక పోతూన్నాను. నాకు ఒక ఇల్లు వుంది, కానీ ఏం లాభం?

ఇంకా నేనేమీ మాట్లాడలేదు. రణధీర్ హుషారుగా బండితోలుతున్నాడు. యాజమానిలోని ఉత్సాహం ఎడ్లలో లేదు. కొరడా పడితె పరుగెడుతున్నాయి, లేకపోతే నీరసించి పోతున్నాయి.

''ఇప్పుడు మనం తీర్థయాత్రలకి వెళితే బాగుంటుందనిపిస్తోంది. అంత దగ్గరున్నా రిషీకేశ్ నేనెప్పుడూ వెళ్లలేదు. ముందక్కడకెళ్లి, తరవాత హరిద్వార్, బృందావనం, ప్రయాగ వగైరా తిరిగి ఆఖరికి కాశీలో ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడదాం. ఏమంటారు?" అంది తను, మౌనాన్ని భంగం చేస్తూ.

''సరే అమ్మీ, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఎక్కడికిపోయినా నన్ను నీతో తీసుకునిపో అంతే, '' అన్నాను.

మళ్లీ నిశ్వబ్దంలో మునిగిపోయాను. యశో బండిలోంచి బయటకు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచించి, ఒక గాఢ నిట్టూర్పు విడిచింది

''నిన్న రాత్రి మీరు పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా?'' అని అడిగింది నాకేసి తలతిప్పి.

''లేదు యశో. తెలుసుకుని మాత్రం చేసేదేముంది; కానీ నా భవిష్యత్తూ, నా సర్వస్వమూ ఒక తక్కెడలో వూగిసలాడాయని మాత్రం తెలుసు,'' అన్నాను.

''అయినా చెప్తాను. చెప్తే నా మనస్సు కాస్త తేటపడుతుంది. మీరు పడుకున్న తర్వాత నేను చాలాసేపు మేల్కొనే వున్నాను. మనస్సంతా వేదానాపూరితమై పోయింది. మరునాడు మీరు వెళ్లిపోతారని మాటి మాటికి జ్ఞ‌ప్తికి వచ్చింది. అలాంటి స్థితిలో వుండగా బయట నుంచి లఖియా పిలుపు వినబడింది. ఆ సమయంలో లఖియా నా పాలిటి దేవతలా వచ్చిందనిపించింది. బయటికి వెళ్లి తనతో అంతా చెప్పి, 'మళ్లీ బాహ్యప్రపంచంలోకి వెళ్లడమంటే భయం వేస్తోందని ఇక్కడే నాకు నిశ్చింతగా వుందని' అని, 'నన్నేమి చేయమంటావు' అని అడిగేను,'' ఆపి, ఆమె మాటలు నన్ను బాధపెట్టేయేమో నన్నట్లు యశో నాకేసి చూసింది.

అప్పుడు, తను నన్ను ఆదరించిందన్న ఆనందంలో ఉన్న నన్ను ఆమె పాతసంశయాలు ఇబ్బందిపెట్టలేదు. అది గ్రహించి, యశో కధ కొనసాగించింది.

''లఖియా అప్పుడు అంది, సుందరీ, ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలనీ, పరిస్థితులను పరిగణించకూడదు. ఎవరికి తెలుసు ఏ వస్తువు ఎంత విలువెంతో? కర్తవ్య పాలన తప్ప, ఇతర ప్రశంసా లేక స్వీయసుఖము సమస్తమూకాదు. ఇంకొకటి, ప్రపంచంలో నాఅనదగ్గవారు బహు కొద్దిమంది వున్నారు. సుందరీ నువ్వు ఎవరినైతే వదలుకోవటానికి సిద్ధపడుతున్నావో వారే నీకు కావలసినవారు, అని చెప్పి, ఎంతో చక్కగా, సున్నితంగా ప్రభోధం చేసింది. వెంటనే నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత అక్కడ వుండ మనస్కరించలేదు. లఖియా నేను కలిసి సామానంతా సర్దాము. తలుచుకుంటూంటే భయం వేస్తుంది. లఖియా నాకు మార్గం చూపించకపోతే నేనే మిమ్మల్ని పోగొట్టుకునే దానిని కదా!'' అని మనస్సులో మళ్లీ ఓసారి లఖియాకి నమస్కరించుకుంది.

"ఎక్కడకు పోతాను నేను అమ్మీ . తిరిగి మళ్లీ నీ వద్దకే వచ్చుండేవాడిని,'' అన్నాను.

''అయినా నేను మిమ్మల్ని విసర్జించడమయ్యుండేది కదా? అదెంత మహాపాతకం,?'' అంది.

''అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటావా?''అన్నాను.

''మీరు ఙ్ఞాపకం చేశారు. ఏమో చేసుకోవాలేమో. కాశీలో మళ్లీ చెయ్యండి,'' యశో నవ్వింది.

''అయితే ఈ సారి సలహా ఇవ్వడానికి గురువుగారు లేరుకదా?'' అన్నాను నవ్వుతూ.

గురువుగారి పేరు విని యశో కాస్త సిగ్గుపడింది.

''ఇప్పటినుంచి మీరున్నారు కదా. ఆయన బదులు అన్నీ మీరే,'' అంది ప్రయత్నపూర్వకంగా నవ్వుతెచ్చుకుని.

రణధీర్ బండి ఆపాడు. మేము బస్సు ఎక్కాల్సిన బస్‍స్టాప్ వచ్చేసింది. బస్సుఎక్కి కూర్చున్నాము. బస్సులోంచి చేయిచాపి కొన్ని పదిరూపాయల నోట్లని యశో, రణధీర్ చేతిలో పెట్టింది.

''ఇదేమిటి చిన్నక్కా?''అన్నాడు రణధీర్, అతని ముఖమే చెప్తూంది దుఃఖం బలవంతాన్న ఆపుకుంటున్నాడని.

''చిన్నక్క అభిలాష ఇది....అంతకంటే ఇంకేమీ కాదు. నన్ను మరచిపోవు కదూ," యశో రణధీర్ గుప్పిటమూసి అంది.

ఇంక వాడి నిబ్బరం పటాపంచలైంది. కళ్లవెంట ఏకధారగా నీళ్లు కారసాగాయి.

''ఛా నీ చిన్నక్క అత్తవారింటికి వెళ్తుంటే ఏడుస్తావేంటి. అయినా నీకు నేనొక్కత్తినే కాదు. నాకంటే ఇంకా నిన్ను ప్రేమించే పెద్దక్క వుంది. పెద్దక్కని సదా కనిపెట్టి వుండు,'' అంది యశో,

''నన్ను ఆశీర్వదించు చిన్నక్కా,'' అన్నాడు అప్పటికి వాడి దుఃఖం ఆపుగుని కళ్ళుతుడుచుకుంటూ

''ఎప్పుడూ స‌హృద‌యుడై సుఖంగా వుండు రణధీర్, భగవంతుడు ఎప్పుడూ నిన్ను కాపాడుతూంటాడు,'' అంది యశో, చెమర్చిన కళ్లతో.

''చిన్నక్కను మీరు తీసుకుపోతున్నారు. బాబూగారూ నా లోటుకూడా మీరే తీర్చండి,'' అన్నాడు, వాడు నా చేయి పట్టుకుని.

''నీ చిన్నక్క గురించి నీవేమీ దిగులు పడకు రణధీర్. ఆమె ఎక్కడున్నా సుఖంగా వుంటుంది,'' అన్నాను నా చేయి బిగిస్తూ.

లఖియా నన్ను యశో చేతిలో పెట్టింది. రణధీర్ యశోని నా చేతిలో పెట్టాడు.

''మీరు కూడా ఆశీర్వదించండి బాబుగారూ,'' అన్నాడు.

''నీ అక్కలిద్దరి ఆశీర్వాదబలం దైవం ఎల్లప్పుడు నీకు సమకూర్చు గాక, '' అన్నాను.

బస్సు కదిలింది.

''వెళ్లివస్తాను తమ్ముడూ'' అంది యశో.

అ జన ఘోషలో బహుశా ఆమె మాటలు వాడికి వినబడి వుండవు. కొంతదూరం పోయిన తర్వాత వెనుదిరిగి చూస్తే కళ్లు తుడుచుకుంటూ ఎడ్లబండి వైపు వెళ్తున్నాడు యశో తమ్ముడు.

జీవితంలో మనకు ఎంతో మంది తారసిల్లుతూ వుంటారు. కొద్దిమందితోనే మనం జీవిత బాటలో కలిసి ప్రయాణం చేస్తాము. కొంతమంది చాలాకాలం, చాలామందైతే స్వల్పకాలమే మనతో కలిసి వుంటారు. తర్వాత దారులు వేరవుతాయి. కాని మానవ ప్రాణం మాత్రం ఈ ప్రపంచంను విడనాడటానికి ఎంతో బాధపడుతుంది. విధిని ఎదిరిస్తూ, ఇంకా ఇక్కడే ఉండడానికి జీవి చివరి శ్వాస వరకూ ప్రాకులాడుతుంది. కాని మరణం తప్పదు, జాతస్య ధ్రువో మృత్యు. బాంధవ్యాలుకూడా జనన మరణాల్లాంటివే. ఈ పరమసత్యం తెలుసుకున్నవాడు బాధారాహితుడవుతాడు, లేనివాడు బాధాగ్రస్తుడవుతాడు. అదే తేడా!

 

చాప్టర్ 25

 

ఆ మధ్యాహ్నం మేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో.

"రా యశో, రామంబాబుని ఆహ్వానిస్తే ఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అంది సరళ.

"రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను.

"మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలు అయిన వాళ్ళకి విస్తర్లు," అంది సరళ నవ్వుతూ.

"ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటం మర్చిపోయావు సరళా," అంది యశో నవ్వుతూ.

"నాకుకోపం తెపిద్దామనుకుంటే మీది వృధాప్రయాస, రోజులుమారాయి," అన్నాను.

అప్పుడే దిల్ బహాదూర్ మంచినీళ్ళు తెచ్చేడు, మమల్నిగుర్తుపట్టి నమస్కరించేడు.

"దిల్ బహాదూర్, డాక్టర్ గారికి బంధువు లొచ్చేరని చెప్పు," అంది సరళ.

ఆ రాత్రి నేనూ రాజేంద్రా మేడమీద కూర్చుని వున్నాము. సరళా, యశో కింద వున్నారు.

''అయితే రామంబాబూ. మీరిక్కడే వుండిపోకూడదా? అక్కడికీ, ఇక్కడికీ ఎందుకు వెళ్లటం? మాది లంకంత ఇల్లు. ఏం చేసుకుంటాము చెప్పండి. మేమిద్దరమూ, మా మామగారు కూడా ఇక్కడకు రావటం మానేశారు,'' అన్నాడు రాజేంద్ర.

మేము ఉదయం వాళింట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇదే ధోరణి. యశోని సరళ, నన్ను రాజేంద్ర ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే, అనుకున్న ప్రకారం ఇప్పుడు మమ్మల్ని విడదీసినట్టున్నారు.

''మీరలా అంటున్నందుకు చాలా థ్యాంక్స్ రాజేంద్రబాబూ. కానీ అదెలా సాధ్యపడుతుంది చెప్పండి. ఇది ఏమైనా నెలా రెండు నెలల మాటా. చివరకు మేము ఎక్కడో అక్కడ స్థిరపడిపోవాలి కదా. పూర్వపు స్మృతుల‌కు ఎంత దూరంగావుంటే అంత శ్రేయస్కరం కాదా," అన్నాను.

రాజేంద్ర ఏదో చెప్పబోతూంటే, హఠాత్తుగా సరళ, 'పోస్టు పోస్టు' అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.

''రాజేంద్రా, ప్రస్తుతం వీళ్ల ప్రయాణం ఒక వారం రోజులు వాయిదా వేయించాను. మిగతాది తర్వాత చూద్దాము,'' అంది సోఫాలో కూర్చుంటూ.

సరళ వెనకాల యశో వచ్చింది. నేను యశోకేసి కాస్త కోపంగా చూశాను.

"మీ అనుమతి కూడా కావాలి రామంబాబూ. లేకపోతే అంగీకారం అమలులోకి రాదని చెప్పింది," అంది సరళ అది కనిపెట్టి.

''అంతగా ఉండమంటుంటే ఉండననడం సమంజసంగా వుండదు,'' అంది యశో.

''సరే సరళా. యశో అంగీకరిస్తే నేను ఒప్పుకున్నట్టే. ఆ తర్వాత మమ్మల్ని వెళ్లిపోనీయి. అలా వుంటున్న కొద్ది వుండాలనిపిస్తుంది. ఎప్పటికైనా ఒక రోజు వెళ్లిపోవాల్సిందేగా?'' అన్నాను.

''మీరు అదే మాట అంటారు. ఎందుకు వెళ్లిపోవాలి మీరు? మా ఇంటిలో మీకు ఇష్టంలేక పోతే వద్దు. ఈ ఊరిలోనే ఇంకొక ఇల్లు కొనుక్కునో, అద్దెకు తీసుకునో వుండిపోకూడదా? మాకు తెలిసినవారు చాలామంది వున్నారిక్కడ. చవకగా దొరుకుతాయి. ఎక్కడికో కొత్త ప్రదేశానికి ఎందుకు వెళ్లిపోవాలి చెప్పండి. యశోకి ఈ ఊరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా? అదేగాక, లఖియాకి దగ్గరగా వుంటారు. అప్పుడప్పుడు వెళ్లి చూడవచ్చు. ఆమె ఎంతో సంతోషిస్తుంది. మీరిలా చేస్తే,'' అంది.

ఇవన్నీ నిజమే. కాదనలేని సూచనలివి. ఆ విషయం నాకు మొదటి నుంచి తెలుసు. అందుకనే నేను ముస్సోరీ వెళ్లటానికి భయపడ్డాను. నేనేం మాట్లాడకపోవడంతో సరళ అవకాశం జారవిడవటం ఇష్టం లేక ''జవాబు చెప్పు రామంబాబూ. ఈసారి మిమ్మల్ని వదలిపెట్టను,'' అంది.

నేను యశోకేసి చూశాను, యశో ఆకాశం లోకి చూస్తోంది. అంటే ఇక్కడ నాకే మాట సహాయం లభించదన్నమాట. రాజేంద్ర చిరునవ్వు నవ్వుతూ, ''ఇక లాభం లేదు రామం బాబు, సరళకు మీరు తిరుగులేని సమాధానం చెప్పాలి,''

"మా భిన్నమయిన జీవితం నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలి సరళా,'' అన్నాను.

అప్పుడు యశో ముఖం సింధూరంలా ఎర్రబడింది. సరళ తబ్బిబైంది. రాజేంద్ర అయోమయం లోకి చూస్తున్నాడు. నేను నాలిక్కరుచు కున్నాను.

మూడు రోజలు గడిచిపోయాయి. ముస్సోరిలో మా పనులన్నీ అయిపోయాయి. ఇంకా వారంరోజు లుండాలి అంగీకారం ప్రకారం. కానీ, ఎంత బలవంతం చేసినా యశో పూర్వంలా హక్ మాన్స్ కీ, పిక్చర్సు కీ, సుతరామూ రానంది.

అందుచేత మేము సాధారణంగా ఇంట్లోనే వుండిపోయేవాళ్లం. రాజేంద్ర మాత్రం క్లినిక్ కి అవసరం కలిగినప్పుడల్లా వెళ్ళేవాడు. అతని కళ్లల్లో ఇప్పటికీ యశోపై పూర్వపు మమతా, అనురాగం కనబడేవి. యశో పూర్వంలా కటువుగా వుండేదికాదు. ఎంతో సున్నితంగా వుండేది. దానితో నా హృద‌యం కాస్త తేలికపడింది. ఇక సరళ మా ఇద్దరినీ వదలి ఒక్క క్షణం కూడా వుండేది కాదు, వీలున్నప్పుడల్లా ఇక్కడ వుండిపొండి అనే మాట మంత్రంలా జపించేది. అప్పుడు కూడా ఆమె నాకొక సమస్యగా వుండిపోయింది. వివాహం ఆమెలో ఏమీ మార్పు తేలేదు. హఠాత్తుగా నవ్వేది. అప్పుడప్పుడు కళ్లలోంచి అనిర్వచనీయమైన విచారమూ, దు.ఖమూ వుట్టిపడేవి.

సరళను నేను ఎప్పుడూ అర్ధంచేసుకోలేక పోయాను. ఆమె అంటే అప్పుడప్పుడు జాలి వేసేది. అప్పుడప్పుడు కోపం వచ్చేది. నా మీద ఆమెకున్న అభిమానం తలచుకుంటే కృత‌జ్ఞత కూడా హృద‌యంలో మెరిసేది. కొన్ని కొన్ని సమయాల్లో ఆమె హద్దు మీరుతుందనుకునే వాడిని. అప్పుడప్పుడు ఆమె తలపుకు వస్తే రోబెర్టు బ్రౌనింగు తన భార్య ఎలిజబెత్ బారెట్ గురించి అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి - సోల్ ఆఫ్ ఫైర్ యెన్‍క్లోజ్డ్ ఇన్ ఎ షెల్ ఆఫ్ పెర్ల్. ఈమె జీవితంలోని అన్వేషణ ఏమిటి? ఇంత అశాంతిగా ఎందుకు వుంటుంది. ఈమె వైవాహిక జీవితం సుఖంగా లేదా అన్న ఆలోచన వచ్చినందుకు అప్పుడప్పుడు నేను బాధపడేవాణ్ణి. రాజేంద్ర ఆమె మాట ఎప్పుడు కాదనగా నేను చూడలేదు. యవ్వనం, అందం, ఆస్తి, ప్రేమించే భర్త ఇవన్నీ వున్నాయి. అయినా ఏమిటి ఆమె జీవితానికి లోటు?

ఆరోజు మధ్యాహ్నం రాజేంద్ర ఏవో కేసులు చూడటానికి డూన్ వెళ్లాడు. క్రింద హాలులో మేము ముగ్గురమూ ఉన్నాము. కొంతసేపు పోయిన తర్వాత యశో కొంచెం తలనెప్పిగా వుందంది. సరళ ఏదో లేపనం తెచ్చి యశో నుదిటిపై రాసింది. కాసేపు యశో అక్కడే కూర్చుని, తరువాత పడుకుంటానని వెళ్లిపోయింది.

ఇక మేమిద్దరమూ మిగిలాము. సన్నగా రేడియో పాడుతూంది. సరళ పూలు అల్లుకుంటూ వుంది. సోఫాలో కూర్చుని నేను ఏదో పుస్తకం చదువుతున్నాను.

''అయితే మీరు ఇక్కడ నుంచి వెళ్లక తప్పదా రామంబాబూ?'' అంది సరళ తలెత్తకుండానే.

''చెప్పాను కదా సరళా తప్పదని, జీవితంలో మనకు ఒక వ్యక్తి సాహచార్యమే జీవితాంతం వరకూ లభిస్తుంది. అదైనా అదృష్ట‌వంతులకే, మిగతా వారంతా ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతారు. అఖరుకి ఆనవాలు కూడా వుంచకుండా. వారిని మనము కఠిన హృద‌యులూ, నిర్ణయులూ అని లాభంలేదు. మానవ జీవితమే అంత,'' అన్నాను.

''అయితే సరే వెళ్లండి, కాని నాకు ఈ మాట ఇవ్వండి. నా మీద కోపం వచ్చికాని, నన్ను చూసి అనుమానపడికాని మీరు వెళ్లిపోవటం లేదని,'' అంది సరళ తల పైకెత్తకుండానే.

''నీ మీద కోపగించటానికి నేనెవరిని సరళా. అయినా నువ్వు యింత ఆదరంతో ఆతిథ్యం ఇచ్చినందుకు నీమీద కోపగించి క్రోధం చూపించాలా?''అన్నాను.

ఇంకా తను తలెత్తకుండా పూలు అల్లుకుంటొంది.

''నిన్ను నేను పూర్తిగా ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. సరళా,'' అప్రయత్నంగా, అనాలోచితంగా అన్నాను.

''ఎప్పుడూ అర్థంచేసుకోలేకపోయారా నన్ను?'' అంది అప్పుడు మెల్లిగా తలపైకెత్తి.

"అవును సరళా? ఆ మాట నేను కాదనలేను,'' అన్నాను.

"అదే నా బాధ రామంబాబూ. లఖియా, యశో, రాజేంద్ర వీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు. మీరుకూడా ఇంతేనా? జీవితాంతం నన్నర్ధంచేసుకొనే వ్యక్తి కోసం వెతుకుతూ వుండాల్సిందేనా? ఈ అన్వేషణకు అంతం లేదా?" అంది సరళ నిటూర్పుగా.

''రాజేంద్ర నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు సరళా. నిన్ను సరిగ్గా చూడడా?'' అన్నాను.

''అది కాదు రామంబాబు. రాజేంద్ర భర్తగా నాకేలాంటి లోటు రానివ్వడు; నేనూ, భార్యగా అతనికి ఏలోటు రానీయను. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. నాకు కావాల్సింది నాకు లభించలేదు.'' అంది.

అలా మాట్లాడుతూండగానే ఆమె కళ్లు నీళ్లతో నిండుకున్నాయి. ముఖం క్రిందకు దించేసుకుంది. నేను చకితుడనయ్యాను. సరళ కన్నీరు చూడడం ఇది రెండో సారి . మొదటిసారి తిరిగి కలుసుకున్నప్పుడు చూశాను. యశోలాగ సరళ ప్రతి విషయానికి కన్నీరు కార్చదు. నేను ఏమంటే ఆమెకు ఓదార్పు కలుగుతుంది? ఆమెకు కావాల్సింది నావద్ద లేదు. అది యశోకే లభించలేదు.

''నీకు నేను సహాయం చేయాల్సిందేదైనా వుంటే చెప్పు సరళా, నాకు సాధ్యమైతే చేస్తాను,'' అన్నాను.

సరళ మళ్లీ తల పైకెత్తింది. కళ్లల్లోంచి ఆశ తొంగి చూస్తూ వుంది.

''ఇక్కడే వుండిపోండి రామంబాబూ. మీరు అవునంటే యశో కాదనదు. మీతో మళ్లీ ఎప్పుడూ ఈ విధంగా వుండను. నా హృదయాన్ని ఎప్పుడు బయట పెట్టను. ఎప్పుడూ మీతో ఒంటరిగా ఉండను. సరే అనండి. మీకు జీవితమంతా కృత‌జ్ఞురాలినై వుంటాను. ఆ వొక్కమాట అనండి, తర్వాత మీరేమి అడిగితే అది చేస్తాను,'' అంది.

ఏమిటిదంతా? మళ్లీ కధ అడ్డం తిరుగుతూంది. అలా అవటానికి వీల్లేదు. గుండె రాయిచేసుకోవాలి.

''ఈ విషయంలో నీవు పట్టు పట్టకు సరళ. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. మొదట కొన్నాళ్లు కాస్త కష్టంగా వుండొచ్చు. ఆ తర్వాత నా మాటల్లోని వివేకాన్ని నీవే గ్రహిస్తావు. ఇంక ఈ విషయం గురించి ఆలోచించకు. మరి ఏ విషయంలో నైనా, నేను నువ్వు చెప్పిందే చేస్తాను,'' అన్నాను.

''అయితే ఈ విషయం చెప్పండి. మీరు నన్ను గురించి చెడుగా భావించటం లేదు కదా?'' అంది.

తుఫాను తగ్గుముఖం పడుతోంది, ఇంక పర్వాలేదు.

''నీ గురించి నేను ఎందుకు చెడుగా భావిస్తాను సరళా. నువ్వు నాకు సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ నీలోని మంచితనాన్ని, ఔదార్యాన్ని, విశాల హృద‌యాన్ని నేను గుర్తించాను. నీకొకమాట చెప్పాలని చాలా కాలం పట్టి అనుకుంటున్నాను. చెప్పమంటావా?'' అన్నాను.

''చెప్పండి,'' అంది.

''నువ్వు చంచల స్వభావినివే కావొచ్చు. కాని ఆ చంచలత్వాన్ని ప్రేరేపించకు, జీవితంలో మనము ఆశించినవన్నీ జరగవు. మన మనస్సు కోరినవన్నీ తీర్చలేము. చాలా కోరికలు, తీరని వాంఛలగానే వుండిపోతాయి. ప్రతి మానవుడి జీవితంలో ఇలాగే జరుగుతూంటుంది. వాటికి హృద‌యానికి పొందు కూడదు,'' అన్నాను.

''మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కాని వివాహమైనంత మాత్రాన ఇంక కోరికలూ, అభిమానాలూ, ఆవేశాలూ వుండకూడదంటే నేను ఒప్పుకోను. స్త్రీ జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన సంఘటన మాత్రమే. అది సర్వస్వమూ ఎన్నటికీ కానేరదు. మీరంతా నువ్వు వివాహితవు కనుక నీకు వివాహేతర అంశాలు తగవు అంటారు. నీ గృహమే నీ ప్రపంచం, నీ భర్త సర్వమానవ కోటి అంటారు. అది ఎప్పటికీ నేను ఒప్పుకోను,'' అంది.

గృహిణిగా మూడు సంవత్సరాలు గడిపినా సరళ లో ఏమీ మార్పు లేదు . అసలు ఆమె వివాహం ఎందుకు చేసుకుంది?

"అది సరే సరళా. నీ అభిప్రాయాలు, ఉద్దేశాలు నాకు తెలుసు, వాటిలో కొన్నింటిని గౌరవిస్తాను కూడా. కోరికలు వుండకూడదని నేను ఎప్పుడూ అనలేదు. వాటిని అదుపులో వుంచుకోవాలంటాను. నువ్వు నాకు ఒక మాట యివ్వాలి. ఈ వారం అయిపోయిన తర్వాత మమ్మల్ని సంతోషంగా సాగనంపు. మేము ఎక్కడున్నా నిన్నుతలుచుకుంటూనే వుంటాము. భవిష్యత్తులో మళ్లీ కలుసుకోమని ఎందుకనుకోవాలి. బుల్లి పాపాయి నీ యింట పాకుతూంటే చూడటానికి వస్తాము,'' అన్నాను.

సరళ ఇంతసేపటికి నవ్వింది.

''పిల్లలు పుట్టటానికి ఎంత అవకాశంవుందో, పుట్టకపోవటానికి అంతే అవకాశం వుంది. అయినా పుట్టటమే తటస్థిస్తే మొట్టమొదటి కొడుకుపేరు 'బాదల్ బాబు' అని పెట్టుకుంటాము,'' అంది.

ఆమె నవ్వుమాటలు తీరుపట్టి పిల్లలు పుట్టాలనే కాంక్ష ఆమెలో వుందనిపించింది.

''అలాగే చెయ్యి సరళా, మీ వాడికి నేను గాడ్ ఫాదర్ ని అవుతాను,'' అన్నాను.

గోడమీద గడియారం గర్వంగా మూడుగంటలు కొట్టింది.

''అరే, మూడయింది. దిల్ బహదూర్ కి కాఫీ పెట్టమని చెప్తాను . మీరు యశోని లేపండి'' అని లోపలికి వెళ్లిపోయింది.

నేను నెమ్మదిగా మేడమీదికి దారితీశాను. గదిలోకి వెళ్లి చూస్తే అసలు పగలు పడుకోవడమనే అలవాటు లేని యశో గాఢనిద్రలో వుంది. ముఖం కూడా కాస్త ఎర్రబడింది. నేను ఆందోళనతో తన పక్కమీద కూర్చుని, నెమ్మదిగా తన నుదిటిమీద చెయ్యిపెట్టేను. అరే, ఒళ్ళు సలసలా కాగిపోతూ యశో బాధపడుతూంటే నేను సరళతో కబుర్లు చెప్పుతున్నానా!! నాకు చాలా బాధ కలిగింది. నా ఉనికికి యశో కళ్లు విప్పి చూసింది. కళ్లు ఎర్రగా వున్నాయి.

''జ్వరంగా ఉందా యశో?''అని అడిగాను.

అవునంటూ తల వూపింది.

''తల నొప్పి కూడా వుందా?'' అన్నాను.

"అబ్బా," అని కళ్లు మూసుకుంది.

అప్పుడే సరళ వచ్చి, యశో పరిస్థితిని గ్రహించి, వెంటనే కిందకెళ్లి దిల్ బహదూర్తో క్లినిక్ లోనే ఉన్న రాజేంద్రకి కబురు పంపింది.

వెంటవెంటనే తిరిగి వచ్చి తను యశో నుదిటిమీద మెత్తగా ముద్దుపెట్టుకుంది అప్పుడు యశో కళ్లు విప్పిచూసింది. మొదట నేననుకుంది కామోసు... ఆశ్చర్యంగా, ''నువ్వా సరళా'' అంది.

''అవును నేనే యశో, ఇంత జ్వరంగా వుంటే ఎందుకు చెప్పలేదు," అప్యాయంగా అంది సరళ.

'"వీ రెలాగూ తెలుసుకుంటారని," యశో నా చెయ్యి పట్టుగుని నవ్వుతూ అంది.

"అమ్మీ, నీ నమ్మకం ఎప్పుడూ వమ్ముచేయను," అన్నాను పొంగుపొరలుతున్న ఆత్మేయతతో.

 

చాప్టర్ 26

 

హుటహుటిగా రాజేంద్ర వచ్చాడు. తనతో ఇంకొక డాక్టరుని కూడా తీసుకొచ్చాడు. అయన ఏదో స్పెషలిస్ట్, అప్పుడే వేరే పేషెంట్ని చూడడానికి రాజేంద్ర క్లినిక్కి వచ్చాడు. ఇద్దరూ యశోని పరీక్షించారు. జ్వరము మామూలుదే త్వరలోనే తగ్గిపోతుంది అన్నారు.

''త్వరలో అంటే ఎంతకాలమని," అడిగాను ఆతృతతో.

ఇద్దరూ ఏదో సంప్రదించుకున్నాక, నాలుగైదు రోజులన్నారు.

రాజేంద్ర ఆ కన్సల్టింగ్ డాక్టరుకి వీడ్కోలుచెప్పి, తన ఇంజక్షన్ సామగ్రి తీసుగుని వచ్చాడు.

''మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను రాజేంద్రబాబూ. రాక రాక జ్వరం మీఇంట్లోనే రావాలా చెప్పండి,'' అంది యశో నెమ్మదిగా, రాజేంద్ర తనకు ఎదో ఇంజక్షన్ ఇస్తుంటే.

''అలా అనకు యశో, నీకు సేవ చేసే అవకాశం మాకు ఇచ్చాననుకో. అయినా జ్వరం చాలా త్వరలో తగ్గిపోతుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు,'' అన్నాడు.

యశో ఇంకేమీ మాట్లాడలేదు. కళ్లు మూసుకుంది.

సరళ లోపలికెళ్లి కాఫీ తీసుకొచ్చింది. నెమ్మదిగా యశో కూడా త్రాగింది.

ఆ తరువాత, సరళా, రాజేంద్రా వెళ్లిపోయారు.

అప్పుడు యశో యెడల కలిగిన అనురాగంతో నా హృద‌యం కదిలింది.. దీనిని వెల్లడించటం ఎలా?

"అమ్మీ," అన్నాను యశో పక్కకు చేరి.

''మీరు అనవసరంగా కంగారు పడకండి. మీరు నాదగ్గర ఉంటే చాలు, నాకు కొండంతధైర్యం," అంది యశో కళ్లు విప్పి నాకేసి చూస్తూ.

''అది నువ్వు నాకు చెప్పాలా అమ్మీ,''అన్నాను బలవంతాన కన్నీళ్లు ఆపుకుంటూ.

అప్పుడే రాజేంద్ర కొన్ని మందులు తీసుకుని వచ్చాడు. మూడు గంటల కొక మోతాదు వెయ్యమన్నాడు.

రాత్రి పది గంటలైంది. మందుల ప్రభావమేమో, అప్పటికే యశో చాలాసేపుగా నిద్ర పొతొంది. నేను తన పక్క దగ్గర కుర్చీలో కూర్చున్నాను. ఎప్పటిలాగే నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి.

అప్పుడు సుశీ మళ్లీ ఇప్పుడు యశో... సుశీకి జబ్బుగా వున్నప్పుడు ఆమె పక్కవద్ద ఇలాగే కూర్చునేవాడిని, అయినా ఆమెని రక్షించుకోలేక పోయాను. ఆమె నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమె బదులు నాకు ఈ రత్నం లభించింది. ఈమెను నేను ఎన్నడూ పారవేసుకోను. ఆకాశం భూమైనా, మూడు ఆరైనా, ఆరు నూరైనా ఈమెను నేను రక్షించుకుంటాను. యశోకి నేను ఎప్పుడూ ఇసుమంతైనా సేవచేసి ఎరుగను. నా గురించి ఈమె ఎన్నో కష్టాలు పడింది. ఎంతో త్యాగం చేసింది. ఈసారి ఈ అవకాశాన్ని జారవిడువను.

అంతలో యశో మూలుగు వినబడింది.

"అమ్మీ" అని పలకరించేను, ఆమె దరి చేరి.

"అరే, మీరింకా పడుకోలేదా?'' అని నెమ్మదిగా అంది యశో కళ్లు తెరవకుండానే

''అవును అమ్మీ, నిన్ను చూ స్తూ కూర్చున్నాను,'' అన్నాను.

యశో ఒక నవ్వు నవ్వి తిరిగి నిద్రాదేవత వడిలో చేరింది.

''మీరింక వెళ్లి పడుకోండి రామంబాబు, నేను కూర్చుంటాను యశో దగ్గర,'' సరళ వస్తూనే అంది.

''అదేమిటి సరళా నువ్వెందుకు? నేనుంటాను, యశోకి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు, ఈసారైనా ఈ మాత్రం చేయనీ, '' అన్నాను.

''మరి వేరే అవకాశాలు భవిష్యత్తులో మీకు చాలా కలుగుతాయి లెండి. ప్రస్తతం యశో మా అతిథి, స్నేహితురాలు, సోదరి. నాకిలాంటి అవకాశం మళ్లీ తిరిగి రాదు,'' అంది.

మా మాటలతో యశోకి మెలకువ వచ్చింది.

''సరళా నువ్వు వెళ్లి పడుకో, వీరున్నారుగా నన్ను కనిపెట్టుగుని,'' అంది యశోమెల్లగా నవ్వూతూ.

యశో మాటలు నాకు ఎంత సంత్రుప్తినిచ్చాయో సరళను అంత నిరుత్సాహపరిచాయి.

సరళ ఏదో అనబోతూంటే, యశో ఆమెను తనమీదికిలాక్కుని, బుగ్గమీద ముద్దు పెట్టుకుని అంది. "ఇంకేమీ అనకు సరళా."

"సరే", అని సరళ వెళ్లిపోతూంటే, యశో అంది, ''టైమయినట్టుంది, కాస్త మందిచ్చి వెళ్లు సరళా.''

సరళ ముఖం కాస్త వికసించింది. ఎంతో అప్యాయంగా మందిచ్చి "గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్" అని, తలుపు జారేసి వెళ్లిపోయింది.

''సరళా, రాజేంద్రలనను ఇబ్బంది పెడుతున్నానని నాకు బాధగా వుంది. మీరు కష్టపడుతున్నారని నాకు చింతగాలేదు, కృత‌జ్ఞ‌త‌ చూపించాలనే ఆలోచనా లేదు? ఇది మీ కర్తవ్యంలా అనిపిస్తూంది,'' అంది యశో

''అవును అమ్మీ. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. జీవితమంతా కూడా నేను నా విధిని పాటిం చేటట్టు చెయ్యి. భారమంతా నువ్వే మోస్తే నాకు బాధగా వుంటుంది,'' అన్నాను.

మరికొద్ది సేపటి రాజేంద్ర వచ్చాడు.యశోని పరీక్షించి "రెస్పాన్స్ బాగుంది, ఇంప్రూవెమెంట్ ఉంది," అన్నాడు, ఆ రూమ్ లో వేరే బెడ్ ఉన్నా నేను రాత్రల్లా కుర్చీమీదే కూర్చున్నాను. అప్పుడప్పుడు కునికిపాట్లు పడ్డాను. యశోని రెండుసార్లు లేపి మందిచ్చాను.

తెల్లవారకమునుపే యశో నిద్ర లేచేటప్పటికి నేను కుర్చీమీద జోగుతున్నాను.

"ఎలావుంది అమ్మీ నీకు," అన్నాను మెళుకవ వచ్చి.

"నాకు బాగానే వుంది కానీ మీ వరసే ఏమీ బాగా లేదు, రాత్రంతా ఇలాగే ఉన్నారా?'' అంది కోపమూ, మార్దవమూ మిళితమైన దృక్కులు ప్రసరిస్తూ.

"అబ్బేలేదు అమ్మీ, ఇప్పుడే కూర్చున్నాను ఇక్కడ,'' అన్నాను.

''ఎందుకలా పరగడుపునే అబద్దాలాడుతారు. ఆ పక్క చూస్తే తెలియదా, పడుకున్నదీ లేనిదీ? మీరిలా చేశారంటే అసలు మిమ్మల్ని ఈ గదిలోకి రానీయను, సరళను రమ్మంటాను,'' అంది.

యశో ఎంత వద్దన్నా ఆ రాత్రి కూడా నేను తన గదిలోనే బెడ్ లైట్ వేసి వేరే పక్క మీద పడుకు న్నాను కానీ యశోకి ఏదైనా కావాల్సి వస్తుందేమో; నిద్రపట్టితే మెలకువ రాదేమోనన్న భయంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అయితే చివరికి ఎప్పటికో మగత నిద్ర పట్ట బోయింది, కానీ అంతలోనే తలుపు చప్పుడు విని గుమ్మం కేసి చూశాను. రాజేంద్ర తలుపు తోసి గదిలోకి తొంగి చూస్తూ కనబడ్డాడు. మొదట నాకు ఆశ్చర్యం వేసింది, తరువాత నాలో కుతూహలం చోటు చేసుకుంది, దాంతో నేను నిద్ర నటిస్తూ, ఆ మసక వెలుతురులో నా అరమోడ్పు కన్నులతో అతని ఆగడాలను వీక్షింపదలచేను. అతగాడు అక్కడినించే నా పక్క కేసి చూసి, దొంగలా గదిలోకి దూరి, నేరుగా యశో పక్కకు చేరేడు. అక్కడే చాలాసేపు మంత్ర ముగ్ధుడిలా ఆమె కేసి చూస్తూ నిలబడి పోయాడు. ఆఖరికి, నెమ్మదిగా యశో నుదిటిపై ఒక చెయ్యి వుంచి, రెండవ చేత్తో దుప్పటి సరిచేస్తుంటే ఆమెకు మెలుకువ వచ్చింది. కళ్లు తెరవ కుండానే, "ఎవరు? బాదల్ బాబు," అంది. అప్పుడు, చడీ చప్పుడూ కాకుండా అతడు గబ గబా వెళ్లడం చూసి, నేను యశో మంచం దగ్గరకు వెళ్లి అన్నాను, ''అవును అమ్మీ, నేనే."

యశో నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మళ్ళీ నిద్రలో ఒదిగిపోయింది.

ఆ అద్భుత దృశ్యం నాకిప్పటికీ కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. మనసులోని మమతా, మమకారం మాసిపోవట మనేది ఎంత కష్టమో గ్రహించాను అప్పుడు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించటం తటస్థిస్తే దాని నుండి విముక్తవడం ఎంత అసంభవం, అవకాశం దొరికినప్పుడల్లా అది తల ఎత్తుతుంది. శరీరం ఎవరికి చెందినా ప్రేమ మనస్సులో నివసిస్తూనే వుంటుంది. అది రావణకాష్టంలాంటిది, ఆ అగ్ని ఎన్నటికీ ఆగిపోదు. ఆ మంట ఎన్నటికీ చల్లారలేదు.

మరుసటి రెండు రోజులు, పగలల్లా నేనూ సరళా యశో దగ్గర వుండే వాళ్లం, రాజేంద్ర గుమ్మం కూడా కదిలేవాడు కాదు. గంట రెండు గంటల కోసారి వచ్చి యశోని చూసేవాడు. ఎందుకైనా మంచిదని మరొకమారు ఆ డాక్టరుని పిలిపించాడు. అప్పుడతడు తన జీవితంలో వచ్చిన ఆ అవకాశాన్ని చేజారకుండా చూసుకోవా లన్నట్టు ప్రవర్తించేవాడు.

అయిదవ రోజుకు యశోకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ బాగా బలహీన పడింది. మరి అలాంటి స్థితిలో అమెని తీసుకుని తీర్థయాత్రలకు ఎలా వెళ్లగలను నేను. అయినా ఫర్వాలేదు పోదామంది. ఈసారి నేను అడ్డుపెట్టవలసి వచ్చింది. సరళ సంతోషానికి మేరలేదు. ఒకసారి ఎగిరి గంతువేసి యశో మెడను పట్టుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.

''మీరు ఎంతకాలం వుంటే అంత సంతోషం మాకు రామంబాబూ. యశో చాలా నీరసంగా వుంది. నా శక్తి వంచన లేకుండా ఆమెకు నేను వైద్యం చేస్తాను. ఆమె మామూలుగా ఆరోగ్యవంతురాలయ్యేవరకూ మీరిక్కడే వుండిపోండి. ఇది చాలా ఆరోగ్యవంతమైన ప్రదేశం. ఆరోగ్యం కోసం అనేకమంది ఇక్కడకు వస్తూవుంటారు, మరి యశో ఏమిటో ఇక్కడనించి వెళ్లిపోతా నంటుంది!'' అన్నాడు రాజేంద్ర.

జవాబు యశో నోటివెంట వచ్చింది.

''మేమంటే మీకింత దయా, కరుణా ఎందుకు చెప్పిండి. బదులు తీర్చలేని దయ కూడా భరించటం కష్టంగా వుంటుంది రాజేంద్రబాబూ. మీ ఫీజు ఏమి ఇవ్వమంటారు?'' అంది.

రాజేంద్ర నేత్రాల్లోంచి అవ్యక్తమైన బాధ క్షణమాత్రం గోచరించింది.

''దీనిని దయా, కరుణా అని మమ్మల్ని కించపరచకు యశో, మీరు దగ్గరవుంటే మాకెంతో సంతోషంగా వుంటుంది. కేవలం స్వీయలాభం కోసం చేస్తున్నపని. మీరు ఇంకా కొన్నాళ్లు ఇక్కడ వుండటమే నాఫీజు,'' అన్నాడు.

రాజేంద్ర ఎంత గంభీరుడో సుశిక్షితుడో నాకు తెలుసు. అవసరం వస్తేనే పెదవులు విప్పుతాడు. లేకపోతే తాళం వేస్తాడు. అటువంటి వ్యక్తి ఎంత బాధపడుతూ ఆ మాటలన్నాడో నేను గ్రహించాను. తనను యశో పరాయివానిగా చూస్తుందనీ, తన పూర్వ ప్రేమకు విలువ యేమీ ఇవ్వడం లేదని గ్రహించి బాధపడివుండాడు. కాని ఈ సమస్యకు పరిష్కారం ఏముంది? సుశీ మరణించక పోతే, యశోని నేను కలవక పోతే బహుశా, యశో రాజేంద్రను వివాహ మాడేది. కాని విధి ఇంకొక విధంగా తలచింది.

మరి ఇంకొక నాలుగు రోజలు గడచిపోయాయి. రాజేంద్ర ఏవేవో విటమిన్స్, టానిక్స్ తెచ్చి ఇచ్చేవాడు యశోకి బలం చేకూర్చడానికి . యశో భారమంతా సరళ వహించింది. యశో ముఖంలో పూర్వపు తళుకూ, బెళుకూ వచ్చాయి.

ఒకనాటి మధ్యాహ్నం నేను మా గదిలోకి వచ్చేటప్పటికి సరళ వీణ శ్రుతి సవరిస్తోంది. సరళ కంఠస్వరం బాగానే వుంటుంది కానీ తనకు వీణా సాంగత్యం కూడా వుందని నాకు తెలియదు.

''రండి. మీ కోసమే యశో ఇదంతా బయటకు తీయించింది'' అంది సరళ నన్ను చూసి

" కర్మకాలి మీరు నన్ను పాడమనరు కదా?" అన్నాను నవ్వుతూ.

''మీరేం దిగులుపడకండి, సరళ ఈ మధ్య వీణ వాయించటం నేర్చుకుందిట. అందుకే ఈ గాన కచేరి,'' అంది యశో.

''సరే, సరళ పాట కంటే ఇం కేం కావాలి,'' అన్నాను

''మీకు తెలియదా రామం బాబు, యశో చక్కగా పాడుతుంది," అంది సరళ.

''వారు నన్ను ఎప్పుడూ పాడమని అడగలేదు,'' అంది యశో చిన్నబుచ్చకుంటునట్లు.

''యశో అది తెలియక చేసిన పాపం. నువ్వు పాడగలవని తెలిస్తే చెవులు కోసుకు వినుండేవాడినని ఊహించలేవా,'' అన్నాను నా రెండు చెవులు సాగదీసుగుని.

''అయితే ఒక చెవితో వీణాస్వరం మరో చెవితో యశోగాత్రం వినండి," అంది సరళ నవ్వూతూ.

''మరీ మాటకారవుతున్నారే," యశో నవ్వుతూ అని నా చెవులను నా చేతుల్నించి విడిపించింది.

"సహవాసం దోషం అనవు కదా యశో," అంది సరళ నవ్వుతూ.

"లేదు, యశోలాభం అనుకుంటాను," అంది యశో నాకేసి ఎంతో ఆప్యాయంగా చూస్తూ.

"ఏంటి సరళా, ఎప్పుడూలేనిది ఈ వేళ వీణ తీశావు,'' అన్నాడు అప్పుడే వచ్చిన రాజేంద్ర.

''నాకోసంకాదు రాజేంద్రా. యశో పాడతానంది''

"ఆలస్యం ఎందుకు శుభస్య శీఘ్రం, ప్రారంభించు యశో,'' అన్నాడు రాజేంద్ర.

రాజేంద్ర ముందు పాడటానికి యశో కాస్త సంశయించింది. ఆలస్యం చేస్తూంటే, సరళ తన చెవిలో ఏదో చెప్పింది. దాంతో యశో ముఖం లజ్జాపూరితమైంది.

సరళ వీణ వాయించటం ప్రారంభించింది. యశో పాట అందుకుంది. పాట సరిగ్గా జ్ఞ‌ప్తికి లేదు. ఏదో 'ముద్దుల నవ్వుల మోహన కృష్ణా….' అంటూ పాడినట్టు జ్ఞాపకం. యశో తలవంచుకుని పాడుతుంటే సరళ నాకేసి చూసి నవ్వుతూనే వుంది .

యశో కూనిరాగాల బట్టి తనంతచక్కగా పాడగలదని నేనెన్నడూ ఊహించలేదు. ఎంత విచిత్రంగా వుంది. అపార సౌందర్యము, సుగుణ సంపద, ప్రేమాభిమానాల తోటి మనస్సుని రంజింపచేసే ఈ శ్రవణానందకరమైన సంగీతశక్తి కూడా ఆమెకుందని తెలిసి నాకెంతో ఆనందం కలిగింది. బహుశా అది నాకు తనంతట తాను తెలియపరచటం ఇష్టం లేక మానివేసినట్టుంది. అయినా ఎప్పుడు నాగోలే కానీ నే నెప్పుడయినా తనగురించి పట్టించుకుంటే గదా తన్నుతప్పు పట్టడానికి. కొత్తగా నేర్చు కుంటున్నా సరళ కూడా వీణ బాగా వాయించింది. వీణ వాయించే ఆ భంగిమలో కూర్చుని తీగెలను మీటుతూంటే ఆమె ఎంతో మనోహరంగా వుంది.

పాటంతా అయిపోయిన వెంటనే రాజేంద్ర లేచి నుంచుని చప్పట్లు కొట్టగ నేనూ చేయూతనిచ్చాను

''కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుంది యశో. నాకు కాస్త అర్జంటుపని వుంది. బయటికి వెళ్లాలి,'' అని వెళ్లిపోయాడు.

ఆ మాటల్లో కాస్త ఆవేశం వుంది. ఆ పరిస్థితుల్లో తనను తను నమ్ముకోలేక వెళ్లిపోయాడని నాకర్ధమయింది. అతనికి పాట నచ్చటంలో ఆశ్చర్యమేముంది. ఎవరి పాటైనా బాగుంటే ఎవరైనా మరొక పాట పాడమంటారు. కాని అతను ఇంకొకటి పాడుతుందేమో నన్న భయంతో వెళ్లిపోయాడు. మానవుడు ఆవేశాలకి బానిస, వుత్సాహం అణచుకోవచ్చు కాని ఉద్రేకం అణచుకో లేము. యశో అదేమీ గుర్తించినట్టులేదు.

''ఎలావుంది మీకు?'' అంది.

''యశో ఇన్నాళ్లు నీ గానామృతం రుచి నాకెందుకు చూపించలేదు,'' అన్నాను.

''నా వాయిద్యం మాటేమిటి రామంబాబూ,''అంది సరళ ఆతృతగా

''ఒక వెంపు నీ శృతి, యశో స్వరంతో మిళితమవుతుంటే, వేరో వెంపు నీ భంగిమే నీ లయతో పోటీ పడినట్లనిపించింది," అన్నాను.

"యశోకి అభ్యంతరం లేకపోతే ఈ మీ అన్వయాన్ని జీవితాంతం పొందు పరచు కుంటాను," అంది సరళ ఎనలేని ఆనందంతో.

"వారివల్ల నువ్వు పొందిన దానిపై నాకెందుకు అభ్యంతరం సరళా," అంది యశో.

సరళ, యశోని తన హృదయానికి హద్దుకుని కళ్ళ వెంట నీళ్లు కార్చగా, నాకు అవి తుడవాలనిపపించిది కాని, నేను ఒక అడుగు కూడా ముందుకువెయ్యలేక పోయాను.

''నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు యశో, నీది ఇంద మధురకంఠమని,'' ఆ రాత్రి యశోని అడిగాను.

''మీరు నన్ను అడుగలేదు, అనేక సార్లు చెప్పుదామనుకున్నాను కాని, సిగ్గూ, పౌరుషమూ అడ్డువచ్చేవి. అయినా, మీరు అప్పుడు చెవుల్లో సీసం పొసుగున్నారు కదా,'' అంది తను సాలోచనగా.

"అంత నిష్టూరంగా మాట్లాడి నన్ను బాధపెట్టకు అమ్మీ," అన్నాను.

"మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నాబాధ చెప్పుకోవాలనిపించింది, అయినా గతం నాస్తి," అంది యశో నాచెయ్యి తీసుగుని.

''అయితే సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు?'' అన్నాను.

''మీరు ముస్సోరి ఒక సంవత్సరంలో వస్తారనగా మానేశాను. సంగీతపు మాస్టరు ఈ వూరువదిలి వెళ్లిపోయాడు'' అంది.

''గతం నాస్తి, ఇప్పుడొక జోలపాట పాడు,'' అన్నాను.

''నాకు జోలపాటలు రావు. కృష్ణుడిమీద పాటలే వచ్చు'' అంది యశో నవ్వుతూ.

రాజేంద్ర వైద్యం వల్ల సరళ శ్రద్ధవల్లా యశో పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. అపుడే అక్కడికి వచ్చి పక్షం రోజులైపోయాయి. ఇక ఎన్నాళ్లుంటాము. యశోకి చికిత్స చేయడంలో రాజేంద్ర మమత పునర్జీవించిందని గ్రహించాను. అలాంటి స్థితిలో ఇంకాఎక్కువ కాలం వుండటం ఎవరికీ మంచిదికాదు. నన్ను ఆశ్చర్యపరచిందేమంటే సరళ ఇది గ్రహించినా యశో దీనిని గుర్తించినట్లే కనబడలేదు. ఆమె ప్రేమించని పురుషుని ప్రేమను ఎంత నిర్దయగా తిరస్కరిస్తుంది. స్త్రీ? కనీసం సానుభూతి కనికరం అయినా చూపించదు.

ఆమాటకొస్తే, సరళ విషయంలో నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను. ఆమె నాపై చూపుతున్న ఎడతెగని మక్కువను రాజేంద్ర గ్రహించ కుండా ఉంటాడా? చెప్పాలంటే రాజేంద్ర కిది డబల్ జెపార్డీ. మరి నా మాటకొస్తే, ఇద్దరు అందమైన యువతులు నన్ను కోరుకుంటున్నా, నేనెవరికీ కాకుండాపోతున్నాను కదా. మాలాంటి వ్యర్ధ ఫోర్సమ్ ప్రపంచంలో ఎక్క డైన్ వుంటారా?

ఎంత వెళ్లిపోతామని మొత్తుకున్నా సరళ, ''ఇంకొక రోజు .. యింకొకరోజు,'' అనేది.

రాజేంద్ర కూడా యశో ఇంకా మామూలు స్థితికి రాలేదు అనేవాడు. డాక్టర్ గా రాజేంద్ర మాటలకు ఎదురుచెప్పలేక ఇంకొక వారం గడిపేశాము. చివరికి ఒక రోజున చెప్పాము మరుసటి దినం మా ప్రయాణమని. ఇక కాదనలేక ఒప్పుకోలేక ఒప్పుకున్నారు ఆ దంపతులిద్దరూ.

యశోని తీసుకుని అక్కడికి ఇక్కడికి ఆ స్థితిలో తిరగటం ఇష్టం లేకపోయింది నాకు.. అందుకే ముందర కాశీ వెళ్లి అక్కడ కొంత కాలం వుందామని నిశ్చయించుకొన్నాము. రాజేంద్ర కూడా డాక్టరుగా అదే సబబన్నాడు అన్నాడు

అపోద్దున్న సరళ ముఖంలో, రాత్రి నిద్రపోయిన చిహ్నాలు ఎక్కడా కనబడ లేదు. అనుకున్నట్టుగానే రాజేంద్ర కార్ లో నలుగురం డెహ్రడూన్ రైల్వేస్టేషన్ కి బయలుదేరాం. దారిపొడుగునా యశో, సరళా ఏదో మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లోకి వెళ్లి మా సామాను ఒక స్లీపర్ కోచ్ లో సద్ది ఫ్లాటుఫాం మీద నించునివున్నాము. ఇం కా రైలు బయలుదేరటానికి పదినిమిషాలుంది.

"డాక్టరుగా మీ ఫీజు చెల్లించ కుండానే వెళిపోతున్నాము, రాజేంద్రబాబూ," అంది యశో .

''నువ్వు త్వరలో వచ్చి ఇవ్వచ్చులే యశో,'' అన్నాడు రాజేంద్ర.

''లఖియాకి నా నమస్కారాలు చెప్పు సరళా'' అంది యశో రైలెక్కుతూ.

గార్డు పచ్చజెండా పడుతున్నాడు. రైలు కూసింది.

నేను కదులుతున్న రైలెక్కుతుంటే సరళ నా దగ్గరకు హఠాత్తుగా వచ్చి,

''నాకు మనస్సులో అన్యాయం చేయకండి రామంబాబూ,'' అంది ఆవేదనతో.

నేను జవాబిచ్చేలోగా రైలు కదిలింది. చెయ్యి మాత్రం ఊపాను.

 

చాప్టర్ 27

 

మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కాని యశో ఒక ఆంధ్ర ఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనే గంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము.

''మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం చేద్దాం చెప్పండి?'' అంది యశో పాలు పొంగిస్తూ.

ఆప్రశ్న కి సమాధానము తన కెంత తెలుసో నాకూ అంతే తెలుసు.

ప్రతిరోజు సూర్యోదయవేళ మేమిద్దరం కలిసి గంగాస్నానం చేసే వాళ్ళం. వారానికొసారి సాయంకాలం బోటు మీద గంగపై విహరించేవాళ్లం. అన్నిటి కన్నా నాకు అదే నచ్చింది. అప్పుడప్పుడు ఒక రాత్రికి బోటు అద్దెకు తీసుకుని రాత్రంతా అందులోనే గడిపేవాళ్లం.

అన్నివేళలా మాయిద్దరి జీవన బాట ఒకటైనా, కాశీ విస్వేస్వరుడి కొలువులో మాత్రం మాది వేరే దారి.

యశో ఆ దైవం ఎదుట అరమోడ్పు కన్నులతో తన్మయిస్తే నేను తనను పరవసిస్తూ చూసే వాడిని.

''దేముడి నుంచీ నీవు ఏమి కోరుకుంటావు అమ్మీ,'' అని అడిగాను ఒకసారి.

''మీ కంటే ముందు నన్ను తనదరి చేర్చుకోమని,'' అంది పూజ చేసిన పుష్పాల్లో ఒకటి జడలో తురుముకొంటూ.

"ప్రాపంచక విషయాల్లో లేని స్వార్ధం, ఆధ్యాత్మిక బాటలో ఎందుకు యశో?" అన్నాను.

యశో జవాబివ్వలేదు, బహుశా నా ప్రశ్నకు ఆమె సమాధానం వెదుక్కుంటోందేమో.

యశోకి చెప్పకుండా అదే రోజు మధ్యాన్నం నేను ఒక వంగపండు రంగు బనారస్ సిల్క్ చీర

కొనుక్కొచ్చాను.

"నచ్చిందా అమ్మీ?" అన్నాను చీర కొంగు విప్పిచూపిస్తూ.

"చాల బాగుంది, అమ్మవారికని కొన్నారా ఇంతలో ఎంత భక్తి పుట్టుకొచ్చింది మీకు," ఆ చీర తీసుకుని నవ్వుతూ అంది .

"అమ్మవారికి కాదు అమ్మీ, నా దేవత కోసం," అన్నాను.

ఆ చీర పట్టుగుని సంతోషంగా మా మూడో గదిలోకెళ్లి, దానిలో సంతృప్తితో వచ్చి నాకు కనుల పండగ చేసింది.

"ఆశీర్వదించండి," అంది నాకు పాదాభివందనం చేస్తూ.

"ఏమని?" అన్నాను తన తలమీద నా చెయ్యి ఉంచి.

"మీకు తోచినది," అంది తల పైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ..

"సదా సుఖీభవ," అన్నాను.

"నా ట్రాప్ లో పడ్డారు," అంది లేచి నవ్వుతూ.

"అదేం మాట అమ్మీ," అన్నాను.

"అంటే ఇంక నన్నెప్పుడు కష్టపెట్టరనేగా మీ ఆశీర్వాద అంతరార్దం," అంది.

"నిన్నుసుఖపెట్టలేక పోతున్నానన్న భాధ నన్నెప్పుడూ వేధిస్తూంది అమ్మీ," అన్నాను.

"ఉపశమనానికి మీకెప్పుడూ నా చీర చెంగు ఉందిగా," అని యశో ఆ చీర కొంగుని నామెడకు చుట్టింది.

"అయితే, ఎడ్లబండిలో నీది బూటకపు నిద్రన్నమాట," అన్నాను దాన్ని బిగించుకోబోతూ.

తన చీర కొంగు లాక్కుని నవ్వుకుంటూ యశో వంటిట్లోకి వెళ్ళిపోయింది.

కొంత కాలానికి యశో బలవంతం మీద తీర్ధయాత్రలకు బయలుదేరాము.

మామొదటి మజిలీ ప్రయాగరాజ్ లో ఆదిలోనే హంన్సపాదన్నట్లయింది.

ఆనాడు త్రివేణిలో స్నానానికి బయలుదేరాము. గంగా, యమున కలుసుకునే సంగమ స్థానం ఒడ్డుకి కొంచెం దూరంలోవుంది. అక్కడకు వెళ్లాం. అక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎర్రటి జండాలు ఎగురుతున్న పడవలున్నాయి. అవి బాగా లోతైన స్థలాలు. అక్కడ ఎవరూ స్నానం చేయకూడదు. నాకు కొంచెం ఈత వచ్చును. దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసేను, దానిలో చిక్కుకున్నాను. ఇంకేముంది కాళ్లకు నేల అందటం లేదు. చిన్న సుడిగుండముకూడా వున్నట్టుంది. అందులో గిర్రున తిరుగుతున్నాను. యశో అది చూసి గట్టిగా పిలిచింది. 'బాదల్ బాబూ ఇంక బయటకు రండి'. ఆమె కేక వినబడింది, కాని బదులు పలక లేక పోయాను. చేతులు ఊపడం మొదలుపెట్టాను. యశో పరిస్థితి గ్రహించి గస్తీ పోలీసుల దృష్టి నాకర్షించడం చూశాను. తర్వాత స్పృహ‌ తప్పింది.

మళ్లీ మెలకువ వచ్చేసరికి ఆస్పత్రిలో వున్నాను. శరీరంలో ఎంతో నీరసంగా వుంది. కాస్త తలనొప్పికూడా వుంది. నా మంచం దగ్గర కుర్చీలో యశో కూర్చుని, కిటికీలోంచి బయటకు పరధ్యానంగా చూస్తోంది. తెల్లటి బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనబడుతున్నాయి..

''అమ్మీ.'' అని నెమ్మదిగా పిలిచాను.

యశో ఉలిక్కిపడి నా వైపు తిరిగింది. మరుక్షణంలో తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవటం మొదలు పెట్టింది. లేవడానికి ప్రయత్నించాను. దానితో తలనొప్పి మరీ ఎక్కువయింది. 'అబ్బా' అని తిరిగి పడుకున్నాను.

''లేవకండి; మీకు ఇంకా స్వస్థత చిక్కలేదు," అంది.

''అసలు జరిగిందేదో చెప్పు యశో'' అన్నాను నీరసంగా.

''నన్ను ఎంత భయపెట్టారు మీరు? మీ గురించి నేను ఎంత యాతన పడ్డాను. తలచుకుంటే గుండె అవిసిపోతూంది. అనుక్షణం మిమ్మల్ని నేను ఎక్కడ చూడగలను చెప్పండి. ఈనాడు మిమ్మల్ని భగవంతుడు రక్షించకపోతే నా గతి ఏమగును?'' అంది చీరచెంగుతో కళ్లు తుడుచుకుంటూ.

"నన్ను రక్షించింది నువ్వు అమ్మీ. భగవంతుడు కాదు. నాకు ఆ దేవుడి అవసరం లేదు. ఒక విధంగా ఆ స్థానాన్ని నీవే ఆక్రమిస్తున్నావు. ఈ మాటు నా ప్రాణం కూడా నీదై పోయింది. ఇక నా వద్ద మిగిలింది ఏమీలేదు," అన్నాను.

''నేను మిగిలాను బాదల్ బాబూ. ఏమి పోయినా నా సర్వస్వమూ మీదే. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని నాకు మాటివ్వండి. జీవితంలో ఎప్పుడూ ఈ రోజు భయపడినంతగా నేను భయపడలేదు. అచేతనమైన మీ శరీరాన్ని చూస్తుంటే గుండెలలసిపోయాయి. ఏడుస్తూ ఈ ఆస్పత్రికి తీసుకువచ్చాను,'' అంది యశో పక్కమీదకు వచ్చి కూర్చుని.

''ఈ నాటి నుంచీ నేను నీ మాట జవదాటను అమ్మీ,'' అన్నాను తన చేతిని నాచేతిలోకి ప్రమాణ పరంగా తీసుగుని.

జరిగిన సంగతి తర్వాత తెలిసింది. పోలీసులు నన్ను బయటికి తీసేటప్పటికి బాగా నీరు తాగి వున్నాను. అలాంటి స్థితిలో యశో పరిస్థితి ఎంత హృద‌య విదాకరంగా వుండి వుంటుంది. ఎంత క్షోభపడి వుంటుంది. ఒంటరి స్త్రీ, నిస్సహాయురాలు నూతన ప్రదేశం, పడవలో సృహ‌లేని నా శరీరాన్ని దగ్గరపెట్టుకుని, ఆమె ఎంత దుఃఖించి వుంటుంది.

ఏడుస్తూ పోలీసులనర్ధించిందిట, ''ఈయనని ఆస్పత్రికి తీసుకువెళ్లండి, మీ మేలు ఎన్నటికి మరచిపోను''.

వాళ్లు పడవలోనే ప్రధమ చికిత్స చేసి ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

తడిబట్టలతో ఆస్పత్రికి చేరేక తను విలపిస్తూవచ్చి డాక్టరుతో అందిట, ''డాక్టర్ గారూ నాకు పతిభిక్ష పెట్టండి. ఈయనని రక్షించండి.''

''ఏమిఫర్వాలేదమ్మా త్వరలోనే నయమవుతుంది,'' అన్నారుట ఆ డాక్టరు.

ఆస్పత్రిలో నాలుగు రోజులున్నాను. యశో నన్ను కంటికి రెప్పలా కాచుకుంది. తర్వాత ఇంకా వారం రోజులు కదలకుండా పడుకోవాల్సి వచ్చింది. తరువాత ఉత్తరాది క్షేత్రాలన్నీ తిరగడం ప్రారంభించాము - హరిద్వార్, రుషికేష్, బృందావ‌నం, కురుక్షేత్రం, నాసిక్.

యశోనన్ను ఎక్కడా నదిలో ఈదనిచ్చేది కాదు. తనతోపాటు ఒడ్డునే నిలబడి స్నానం చేయమనేది. అప్పుడప్పుడు ఆ పనికూడా తానే చేసేది. ఎక్కడైన జనసమూహంలో నా చెయ్యి గట్టిగా పట్టకునేది. ఆ విధంగా నన్ను ఎన్నో ఊర్లు తిప్పింది. ప్రతి చిన్న పనీ ఆమే చేసేది. ఏమైనా నేను చేయబోతే ''మీరు ఊరుకోండి, మీరేమీ చేయనక్కర్లేదు, కాస్త మిమ్మల్ని మీరు చూసుకుంటే చాలు,'' అనేది.

ఒక్కొక్క చోట పది పదిహేను రోజులు వుండిపోయేవాళ్లం. చేసిన యాత్రలు చాలు ఇంటికి పోదాం అని నేను, వెళ్లి చేసేదేముంది చెప్పండి అని యశో, ఇదే వరస మాది ఆ రోజుల్లో.

ఆవిధంగా తిరిగి తిరిగి కాశీ చేరుకున్నామోలేదో, దక్షిణాది క్షేత్రాలు చూడటానికి బయల్దేరుదామంది. నేను అంత తొందరగా వద్దన్నాను. తిరిగి తిరిగి ఎంతో అలసిపోయాను. రైలు ప్రయాణ మంటేనే విసుగెత్తి పోయింది. అయినా యశో పంతం మీద వెళ్లక తప్పలేదు. జ్ఞానం వచ్చిన తర్వాత తెలుగునాడు ఎప్పుడూ చూడలేదట. మాతృభూమి చూడాలని కోరికగా వుందంది. మళ్లీ రైలెక్కాము. తిరుగుడికి అంతేముంది?

 

చాప్టర్ 28

 

జీవితంలో నాకొక ఆశయం లేదు. యశో వద్ద నాకు కావాల్సిన ఆదరం, అనురాగం, రక్షణా లభించాయి. నా భారమంతా ఆమే మోస్తోంది. వీటన్నింటినీ నేనెందుకు కాలదన్నాలి? ఎదురీత చేతకాన్నప్పుడు ప్రవాహంలోపడి కొట్టుకుపోవుటే ఉచితం. అదే చేశాను. అనేక పుణ్యక్షేత్రాలు తిరగాము. అప్పుడు మేము తిరుపతి నుంచి అన్నవరం వెళ్తున్నాము. దారిలో రాజమండ్రి స్టేషన్ తగులుతుంది.

"మీ ఊరు తీసుగెళ్ళి మన ఇల్లు చూపించండి. పగటి పూట ఇబ్బందనుకుంటే రాత్రి వేళయినా సరే,'' అంది యశో.

నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచీ పొలంతో పాటు ఇంటి వ్యవహారం కూడా బాబయ్యే చూస్తున్నాడు. ఇల్లు ఎవరికో అద్దెకిచ్చానని ఒకసారి రాశాడు. దానిమీద వచ్చిన అద్దె, భూముల మీద వచ్చిన శిస్తు కలిపి అప్పుడప్పుడు పంపిస్తూ వుండేవాడు. నేను ఏదో దేశ సంచారం చేస్తున్నానని ఆయన అభిప్రాయం. నాతోటి ఒక స్త్రీ కూడా వుందని తెలిస్తే ఆయన ముఖం మీద ఉమ్మివేస్తాడు. ఇక ఆయన ద్వితీయ కళత్రం లలితాదేవి సంగతి చెప్పక్కర్లేదు. పురాతన స్త్రీ మాత్రమే కాదామె. అంతకంటే అందకత్తె మా కుటుంబంలో ఎక్కడా లేదని ఆమె గర్వం. యశోని చూసిందంటే ఆమె ఈర్ష్యతో మండి పడుతుంది. అదీకాక యశోని ఏమని పరిచయం చేస్తాను? నేను మాట దాటేస్తే మాత్రం ఎవరూరు కుంటారు, తనెవరని అడగారూ? నేనేమి చెప్పగలను? అందరూ నన్ను వేలెట్టి చూపిస్తారు అదీకాక ఆమె నెవరయినా అవమానపరిస్తే? తాను బాధపడడం మాట అటుంచి అది నేనెల్లా సహించగలను? ఏతావాతా తన్ని అప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళడం శుద్ధ అవివేకం.

కానీ ఆమె కోరిక సమంజసమైంది. తన ఇల్లు తనకు చూపించమంటూంది. స్వర్గస్తులయిన నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆమెకు ఎలానూ లభించదు, ఇక వారి ఇల్లైనా చూపించలేనా? ఆమె కోరికను ఎలా నిరాకరించగలను? దారిలో రాజమండ్రి ఎలాగా తగులుతుంది. సరే రాత్రి మమల్ని ఎవరూ చూడరు కదా. ఒకసారి చూపించుదామని నిశ్చయించాను.

అల్లాగ ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు రాజమండ్రి స్టేషనులో సామాను వదిలి, మేమిద్దరం రిక్షాలో ఇన్నీసుపేట చేరాము. ఇల్లు కొంచెం దూరంలో ఉందనగా రిక్షా దిగి అక్కడికి నడచి వెళ్ళాము. వీధి తలుపు వేసివున్నా ఇంట్లో దీపాలున్నాయి. ఇంటి అరుగు దగ్గర ఆగి మాఇంటికి నేనే గైడ్ అయ్యాను.

'ఇదే నా పుట్టినిల్లు. ఆ యడమవైపు గదిలోనే రోహిణీ నక్షత్రంలో పుట్టానని మా అమ్మ చెప్పేది. నా బాల్య స్మృతులతో నిండివుందీ ఇల్లు," చెప్పేను యశోతో.

"నే లోపల అడుగు పెడితే అవుతుందిగా నామెట్టినిల్లు, " అంది యశో తనలో తానుగా.

యశోని ఇంటి వరకు తీసుకకెళ్లేను గాని గృహప్రవేశం ఎలా సాధ్యం? అదే అన్నాను తనతో.

నా ఇంట్లోకెళ్ళి అద్దెకున్న వారితో కూడా నేనెవరినో చెప్పుకునే ధైర్యం నాకులేదు. నేను చేసిన దోషమేమిటి? తల్లిదండ్రులు జీవించివుంటే ఎంతో సంతోషించేవారు. యశోని చూస్తే మా అమ్మ హృద‌యం కరిగి యుండేది. 'చక్కటి రూపమమ్మా నీది. బంగారపు బొమ్మలావున్నావు. మా తోటికోడలు పొగరు అణుస్తావు నువ్వు. పద ఇప్పుడే ఆమెకు చూపిస్తా' అనేదేమో. యశో చాలాసేపు ఇంటివైపు చూస్తూ నించుంది. ఆమె మదిలో సాగుతున్న ఆలోచనలేమిటి?

"ఈ ఇంటికి యజమానురాలినయినా రాత్రి వేళ దొంగలా బయట నిలపడి లోపటికి దూరడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యంవేరొకటుంటుందా?" ''అంది యశో దీర్ఘంగా నిట్టూర్చి.

"అమ్మీ తెలుసుకో, నీ ఆవేదనలోని ఆప్యాయతే నా ఆయువు," అన్నాను ఆమె భజం మీద చేయి ఉంచి.

"అది తెలుసుకానీ, మన ఇంట్లోకి దారి తీయండి," అంది యశో భావగర్భి తంగా.

''అది ఎలా సాధ్యం,'' అన్నాను.

''బాటసారులమని చెప్పి మంచి నీళ్లు అడుగుదాం,'' అంది హుషారుగా.

''నీ కేమయినా మతి పోయిందా అమ్మీ, రాత్రి వేళ మంచినీళ్లేమిటి?'' అన్నాను.

''రాత్రి దాహమేయదా ఏమిటి, కాదనకండి ఏ ట్రయల్ కాస్ట్స్ నథింగ్,'' అంది నా చెయ్యి పట్టుకు లాక్కెళుతూ.

''ఎవరు?'' తలుపు తట్టగా ఒక ముసలాయన వేసిన ప్రశ్న.

"మీ పక్కింటివారి బంధువుల మండి, ఇప్పుడే ట్రైన్ దిగి వచ్చాము, తీరాచూస్తే తలుపు తాళమేసివుంది," అన్నాను ఈలోపున నేను ఆవిషయం గమనించి.

"అలాగా, లోపలకు రండి, అనుకోకుండా పొద్దున్నే వాళ్ళు కాకినాడ వెళ్ళేరు," అన్నాడాయన.

యశో ప్రశంశా నేత్రాల మెరుపు నా మదినెన్నడు వీడలేదనడం అతిశయయోక్తం కాదు.

"సురేఖా, ఒకమారు ఇల్లారా, మీ శాంతా వాళ్ళింటికి ఎవరో వచ్చారు," అరిచాడాయన.

"తాతా, ఉదయమేగా వాళ్ళు ఊరెళ్లింది, పాపం వీళ్ళకు తెలియదేమో," అంటూ వచ్చింది పదహారేళ్ల సురేఖ.

"మిమ్మల్నివేళ కాని వేళ వచ్చి ఇబందిపెట్టడం సబాబు కాదని తెలుసు మాకు - ఈయన మా ఆయన బాదల్ బాబు , నేనాయని భార్య యశోరాజ్యం – కాని.. " అంది యశో సురేఖ దగ్గరకు వెళ్లి.

"భలే విచిత్రంగా మాట్లాడుతావు అక్కా, అయినా నా స్నేహితురాలి బంధువులు మా బంధువులేగా,"

అంది సురేఖ.

"బలే భేషుగ్గా చెప్పేవే మానవరాలా, వీళ్లకు వాళ్ళొచ్చేవరకు ఇక్కడే బస ఏర్పాటు చెయ్యి," అన్నాడాయన.

"నా ఊహకి, సహృదయుల నివాసమే నిజమైన దేవాలయం, అందులో నువ్వు నన్నుఅక్క అన్నావు కనుక నిన్ను ఎల్లప్పుడూ చెల్లిగానే భావిస్తాను," అంది యశో సురేఖ చేయిని తనచేతిలో తీసుకుని.

"బాబు గారూ, మీ సహృదయత కి మా ధన్యవాదాలు, ఈ రాత్రి తల దాచుకోడానికి చోటిస్తే చాలు, మేము తెల్లారకట్టే అన్నవరం అన్నవరం వెళ్లే ట్రైన్ పట్టుగొవాలి. అందుచేతే సామానంతా క్లోక్ రూమ్లో పడే సోచ్చ్చాము." అన్నాను.

"'సరే, దంపతులారా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి. మీ పడక ఏర్పాట్లు అవీ మా సురేఖ చూస్తుంది. నేవెళ్లి పడు కుంటాను తొందరగా లేవాలికదా," అన్నారాయన.

"ఒక వేళ మాకు మెలుకువ రాక పోతే మమ్మల్ని లేపండి బాబుగారు," అంది యశో.

"అల్లాగే నమ్మా కోడలా," అని ఆయన తన గదిలోకి నిస్ష్క్రమించేరు.

''కూర్చోండి, మీకు ఏవైనా పళ్ళు తీసుగొస్తాను," అని, వద్దన్నావినకుండా సురేఖ లోపలికి వెళ్ళింది.

గోడమీద పెద్ద ఫ్రేమ్లో వున్న మధ్యవయస్సు దంపతుల ఫోటోచూసి, యశో నాకేసి భావపూరితంగా

చూస్తే, నేను తన చెయ్యి పట్టుగుని నాతల్లితండ్రుల ఆశీర్వాదాలకు వారి దగ్గరకు తీసుకెళ్ళేను.

యశో ఆసక్తికరంగా వారిరువురి కేసీ చూసి, వారికి వంగి నమస్కరించిం అంది, "మీవన్నీ అత్తగారి పోలికలు."

"అయితే అదృష్ట మంటారుగా, అందుకే నువు దొరికావు," అన్నాను.

"ఏమిటి చూస్తున్నారు, ఈ యిల్లు ఆ స్వర్గీయ దంపతులది. మంచివారని అంటుంటారు," అంది సురేఖ ట్రైలో ఆపిల్ ముక్కలు వారికి అందిస్తూ.

"మంచివారి ఇంట్లో మంచివారు అద్దెకుంటున్నారు, ఎంత సంతోషింపదగ్గ విషయం," అంది యశో.

''ఇప్పుడు ఈ ఇంటి యజమాని వారి ఏకైక పుత్రుడు, ఆయన చాలా సౌమ్యుడని వినికిడి. అయితే మేమెప్పుడూ ఆయన్ని చూడలేదు. ఇక్కడ వాళ్ల బాబాయ్ వున్నారు. వారు చెప్పగా విన్నాను, ఆయన చిన్నతనంలో ఎవరినో ప్రేమించారట. ఆవిడ చనిపోవటంతో ఆయన ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూన్నారట.. పాపం ఎంత విషాధగాధ,'' అంది.

ఆ మాటలు వింటూంటే యశో కళ్లు నీళ్లు చెమర్చాయి.

''అవును చెల్లీ,'' అంది.

"ఇక మీగురించి చెప్పండి అక్కా," అంది సురేఖ కుతూహలంగా.

''మా గురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు చెల్లీ మా విచిత్ర దాంపత్యం తప్ప," అంది యశో నవ్వుతూ

''అదేమిటో చెప్ప్పుఅక్కా, బావగారికి అభ్యంతరం లేక పొతే," అందిసురేఖ కూడా నవ్వుతూ.

"అది వినడానికి నువ్వింకా చిన్నపిల్లవి చెల్లీ, తరవాత తప్పక చెపుతాను," అంది యశో

"ఆలా అంటావేమిటి అక్కా, మా తాత నాకు పెళ్లి చేద్దామని తాహతహ లాడుతుంటే," అంది సురేఖ.

"ఎంత వరకు వచ్చింది వరుడి వేట?" అడిగింది యశో.

"మా తాత కాళ్ళు కట్నం ఉచ్చులో చిక్కుకున్నాయి అక్కా . పాపం ఆయన మాత్రం అంతంత కట్నాలు ఎక్కడి నుంచీ తేగలడు, అదీకాక నాకు అన్నదమ్ములు అక్కచెల్లులు లేరు, చిన్నతనం నుంచీ ఈయనే పెంచాడు," అంది దిగులుగా సురేఖ.

సురేఖ అప్యాయత అమాయకత్వం యశో హృదయాన్ని పూర్తిగా కదలించేయి.

''నీకు నచ్చిన వాడు ఎవరూ లేరా చెల్లీ?'' అంది.

సురేఖ కాస్త సిగ్గుపడింది చెప్పడానికి.

''ఫర్వాలేదుమ్మా చెప్పు, అక్క బావలవద్ద నీకు సంకోచం ఎందుకు,'' అంది యశో సురేఖ చేయి తీసుగుని.

''మధు వున్నాడు. చాలా మంచివాడు. తన తల్లిదండ్రులు పేరుకైనా కట్నం లేకపోతే చేసుకోవటానికి వీలు లేదంటున్నారు. మధు ఎక్కడికైనా వెళ్లిపోదామంటున్నాడు. తాతయ్యని వదలి ఎలా వెళ్లను చెప్పు," సురేఖ సిగ్గుపడుతూనే అంది.

అప్పుడు నాకు లఖియా మేనకోడలు సుజాత జ్ఞాప‌కానికొచ్చింది. సురేఖ జీవితం కూడా అదే బాట లో నడుస్తుందా?

''నువ్వేమీ చింతపడకు చెల్లీ. మధు తలిదండ్రులు ఎంత కట్నం కావాలంటారు చెప్పు,'' అంది యశో.

''లాభం లేదు అక్కా; కనీసం రెండువేలైనా కావాలంటున్నారు,'' అంది సురేఖ నిరాశతో.

''నీకేమీ ఫర్వాలేదు, రేపే మధూతో చెప్పు, మీ అక్కయ్య నీ కట్నం ఏర్పాటు చేస్తుందని. ఆ రెండు వేలు నీకు త్వరలో అందేటట్లు చేస్తాను . నువ్వేమీ అడ్డుచెప్పుకు చెల్లీ; ఇది అక్కయ్య అభిలాష,'' అంది యశో ఎంతో ధీమాగా.

''నువ్వు నిజంగా మానవ మాత్రురాలివి కాదు అక్కయ్యా! దేవతలే మీ రూపంలో వచ్చి నన్ను ఆదు కుంటున్నారనిపిస్తోంది. ఇంత అందంగా మానవులుండరు,'' అంది సురేఖ యశోని కౌగిలించుకుని.

''అలాంటి అనుమానాలు పడకు చెల్లీ. మేము కూడా నీబోటి వాళ్లమే నా దగ్గర కాస్త డబ్బుంది, అందులో కాస్త చెల్లెలికి కట్నంగా ఇస్తాను అంతే'' అంది యశో నవ్వుతూ.

"తప్పు పట్టవు కదా, నీ అడ్రెస్ అడగచ్చా అక్కా?" అంది సురేఖకి ఇంకా నమ్మకం కుదరక.

"పేపరూ పెన్ తీసుకురా, నీ బావగారు రాసిస్తారు," అంది యశో.

"బావ గారూ, నా డైరీలో రాద్దురుగాని లోపలికి వెళదాం, మీరూ ఇల్లు చూసినట్టు ఉంటుంది," అంది సురేఖ.

మేము ఎడమవైపు గదిలోకి వచ్చినప్పుడు మెల్లగా యశోచెవిలో చెప్పాను, నేను అక్కడే పుట్టానని, యశో నా ముఖం కేసి చూసి చెయ్యి గట్టిగా పట్టుకుంది.

సురేఖ రెండు మంచాలు తెచ్చి పక్కలు వేసింది. చాలాసేపటివరకు అనేక కబుర్లు చెప్పింది. మధు ఆ ఊరిలో అందరికంటె అందంగా వుంటాడట. కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ఒకసారి లంఖించిన ఆంబోతు తరుముతూవుంటే అడ్డువెళ్లి చెయ్యి విరక్కొట్టుకున్నాడు

"బావగారూ, అక్కయ్యకు చూపించడానికి మనిద్దరం మధుని తీసుకొద్దాం, ఏమంటారు? అంది

ఎంత అమాయకురాలు ఈ సురేఖ?

మేము పక్క లెక్కే సరికి పన్నెండయింది. ఎంత విచిత్రం నా ఇంట్లో నేను అతిథిగా పడుకున్నాను, పూర్వకాలంలో ఇది మా నాన్నగారి ఆఫీసు గది. ఒక వైపు, నా మనసంతా పాత జ్ఞపకాలతో నిండిపోగా, మరొకవైపు నా మెదడంతా పరిపరి ఆలోచనలతో కలవర పడింది. అదే కాక బాగా నిద్రపట్టి తెల్లవారకట్ల మెలకువ రాకపోతే మాగుట్టు రచ్చకెక్కుతుందన్న భయం. ముసలాయన లేపుతా నన్నాడు కానీ ఏం చెప్పగల. ఏమయితేనేం, ఒక్క కునుకు కూడా తీయలేక పోయాను.

కాని, పక్క మంచమ్మీద యశో ప్రశాంతంగా నిద్రపోయింది. ఎంత సంతోష స్వభావం ఈమెది , నేను పెళ్లి చేసుకోక పోయినా, ఇది తన అత్తవారిల్లులా తలచి ఎంత తృప్తి పొందుతోంది. అయినా తన్ని ఇంకా ఎందుకు భార్యగా స్వీకరించ లేకపోతున్నాను. హే విధీ, సుశీ స్మ్రుతి యశో ఆత్మకే శాపం అయింది. తానే కావాలనుకుంటే రెచ్చగొట్టి నన్నుపొందవచ్చును, అయినా ఆ అవకాశం వున్నా దాన్ని దుర్వినియోగ పరచుకోదు,అదే నిదర్శనం ఆమె వ్యక్తిత్వ ఔచిత్యం, జీవన ఔన్నిత్యానికి . కాని నేను, ఆమె అందచందాలు అడవిగాచిన వెనన్నెలవుతున్నా చీమకుట్టనట్టు కూర్చుంటున్నాను. తనయవ్వనం వ్యర్ధపరుస్తుంటే నేనామె సేవలో కులుకుతున్నానంటే నేనెంత స్వార్ధపరుడ్ని. ఆలా పరిపరివిధాలఆలోచిస్తూ యశోని చూస్తూ రాత్రంతా గడిపాను.

తెల్లవారక నాలుగు గంటలకి యశోని నిద్ర లేపుతుంటే సురేఖ తాతగారు వచ్చారు. గాబ గబా తయారయ్యి మేము వెళ్ళబోయేముందు, యశో ఆయనకి పాదాభివందనం చేస్తే, 'శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు' అని దీవించారు. ఆ ఆశీర్వాదం యశోకి ఆనంద దాయకమయితే అది నా హృదయభారాన్ని మరింత పెంచింది.

డబ్బు తప్పకుండా పంపుతానని యశో సురేఖకు మళ్ళీ మాట ఇచ్చింది.

''బావగారూ. అక్కయ్యనిజాగ్రత్తగాచూసుకోండి,'' గడపదాటేక వెనకనించి సురేఖ నన్నుహెచ్చరించింది,

ఆనాడు రణధీర్ కూడా అలాగే చెప్పాడు. అతడు యశో తమ్ముడు ఈమె చెల్లెలు.

హుటాహుటిని స్టేషన్ చేరేము. ఆ రాత్రి తనకు పట్టినంత గాఢనిద్ర యిదివరకెప్పుడూ పట్టలేదంది. ఆ రాత్రి తన ఇంటిలో గడిపినందుకు ఎంతో మనశ్శాంతి లభించిందంది. సురేఖ లాంటి చెల్లెలు తనకు దొరికినందుకు చాలా సంతోషంగా వుందంది. మేము అన్నవరం, సింహాచలం, పూరి వగైరాలు తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికి సురేఖ సందేశంతో కూడిన అమె పెండ్లి శుభలేఖ స్వాగతం పలి కింది.

"ఈ శుభకార్యము నీ దయవల్లనే అవుతూవుంది అక్కయ్యా, నువ్వు రాకపోతే ఆ వెలితి తీరదు. మధుకూడా ఇదే అంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత బావగారికి నీకు మేమిద్దరమూ నమస్కరిస్తాము అక్కా. నీవు రావాలి, నాకు అమ్మలేదు, ఇంకెవరూ లేరు. నువ్వు వచ్చావంటే ఆ లోటులన్నీ తీరుతాయి. రాకపోతే పెళ్లిరాత్రి నేను ఏడుస్తూ కూర్చుంటాను. చెల్లి వివాహం నీవు చూడకపోతే ఇంకెవరు చూస్తారు. అక్కా తప్పక రావాలి. బావగారికి నా నమస్కారాలు.''

ఉత్తరం పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశో. ఏ మాత్రం వాత్సల్యం చూపినా ఈమె గుండె కరగిపోతుంది. ఇక చేసేదేముంది? పది రోజులక్రితం వచ్చిన ఉత్తరం ఇది. పాపం ఎంత బాధపడిందో అక్కయ్య రాలేదని, చివరికి ఉత్తరమైనా రాకపోతే నిజంగా దేవతలే అలా వచ్చారనుకుందేమో.

"మీరు వెంటనే తనకి టెలిగ్రాం ఇచ్చి ఒక మంచి బనారస్ సిల్క్ చీర పంపించి రండి

నేనీ లోపున ఉత్తారం రాస్తాను. మీ చీరల ఎంపిక గురించి వేరేచెప్పలాండి," అంది యశో నవ్వుతూ.

"మరదలు పిల్లతో పాటు తన అక్కకు కూడా ఒక చీర కొంటాను, ఏమాంటావు?" అని, యశో నగుమోము వీక్షిస్తూ, 'బాటా' చెప్పుల్లో కాళ్ళు దూర్చాను.

 

చాప్టర్ 29

 

ప్రయాణ బడలిక తీర్థయాత్రలు విసుగూ ఇంకా తీరక ఆమరునాటి మధ్యాహ్నం నేను నిద్ర పోతుంటే. యశో గదిలోకి ''బాదల్ బా బూ. బాదల్ బాబూ'' అంటూ అరచినట్లుగా వచ్చింది.

''ఏమిటి సుందరీ, ఏమైంది ?'' అన్నాను నిద్రమత్తు ఇంకా వదలలేదు.

''ఇంకెప్పుడూ అలాగా అలా పిలవకండి,''అంది తను చెవులు మూసుకుని.

నేను ఆశ్చర్యపోయాను. సుందరీ అనే పేరు తనకు నచ్చిందని ఆమే ఒక సారి చెప్పింది. పరిహాసమేమో అనుకున్నాను. ముఖం చూస్తే వెలవెల పోయింది . తన చేతిలో ఉత్తరం నా నా పక్క మీద పెట్టి తిరిగిచూడకుండా వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ . తీరా చూస్తే అది సరళ రాసింది. వణికే చేతులతో దాన్ని చదవటం ప్రారంభించాను.

''ప్రియమైన యశోకి,

నా సంగతి తర్వాత చెప్తాను. మొదట లఖియా విషయం చెప్పనీ, ఎలాచెప్పేది? ఆ విషయం తలచుకుంటూంటే హృద‌యం పగిలిపోతూంది. ఆమె కథ విని, నువ్వు ఒకసారి అన్నావు, 'కష్టాలు ఓరిమితో సహించే వాళ్లనే సమాజం, చివరకు దైవం కష్టపెడతాడని'. అది ఎంత యదార్థమైందో యిప్పుడు అర్ధమయింది నాకు , అసలు సంగతి చెప్పకుండా నిన్నీ ఉపోద్ఘాతం తో వేధిస్తున్నా ననుకుంటాను.

"నేను తరచుగా లఖియాని కలుస్తూవుంటాను. నువ్వు ఆమెకు రాసిన ఉత్తరాలు నాకు ఎప్పటికప్పుడు చూపిస్తుంది. (ఎక్కడున్నా ఉత్తరం రాస్తావని చెప్పావు కానీ ఎప్పుడూ రాయలేదు. నీ పక్షపాత వైఖరిని తర్వాత ఓ పట్టుపడటాలే)

కాని మొన్న నీ పూర్వాశ్రమానికెళితే అక్కడ నాకు మతి భ్రమించినంత పని అయ్యింది.

అప్పటికి వారం రోజుల క్రితం లఖియా గురువుగారిని తీవ్రంగా గాయపరచిందన్న అభియోగంమీద ఆమెని పోలీసులు రిమాండ్ లోకి తీసుగున్నారు. ఆ ఘోర సంఘటన లఖియా కుటీరంలో జరిగిందట. తలమీద ఆయన్ని ఒక ఇనుప దండెంతో కొట్టిందట. తల పగిలి ఆయన ఇంకా స్పహలేకుండా ఆస్పత్రిలోనే వున్నాడట. ఆ గాయానికి కారకురాలు తనే అని చెప్పి,, తను ఆ నేరాన్ని ఒప్పుకుందిట. పోలీసుల కారణమడుగుతే 'నా వైధవ్యాన్ని కాపాడుకునేందుకు ఆ పని చేయాల్సి వచ్చింది' అని చెప్పిందట. ఇంకెన్ని ప్రశ్నలడిగినా జవాబు చెప్పలేదట. లఖియా ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పని చేసిందో మనం సులభంగానే గ్రహించ గలం. అయినా నాకు మొదటి నుంచీ మీ గుగ్గురువు మీద అనుమానంగానే ఉండేది, అయినా లఖియా కి నీకు చెప్పడానికి సంకోచించాను. ఇంతకీ ఇక్కడ గమనించదగ్గ విషమేమిటంటే, రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదిలి వెళ్లిపోయాడుట.

వెంటన్ రాజేంద్ర నేను తన్ని డెహ్రాడూన్ జైలులో కలిశాము. వివరాలు చెప్పమని ఎంతో వేడుకున్నాను. దుఃఖము పట్టలేక తలను గోడకేసి కొట్టుకున్నాను. ''సరళా. ఆ వివరాలు తెలుసుకుని నీవు చేసేదేముంది? ఆ నేరం చేసింది నేనే. దానికి శిక్ష అనుభవించాల్సిందే, నాకు ఏమి శిక్ష వేసినా చింతలేదు. దీనిని సులభంగానే దాటివేస్తాను. ఆ తర్వాత భగవంతుని ముందు నిలబడి నేనేమి చెప్పుకోగలను? ఆ విషయమే నన్ను బాధపెడుతూంది'' అంది కాని ఇంకేమీ చెప్పలేదు.

మేము లాయర్ని కుదురుస్తామంటే ససేమిరా అంటోంది లాఖియా. అయినా ఈ ఊరిలోని ఒక మంచి లాయరుతోటి మాట్లాడేడు రాజేంద్ర. ఆత్మసంరక్షణ కోసం చేసిన నేరం గనుక శిక్షపడకుండా ప్రయత్నించవచ్చు నన్నాడతను. ఇదే విషయం నేను లఖియాకు చెపితే నామీద మండి పడింది. నేనీ ప్రయత్నం మానుకోకపోతే లాయర్ ముఖమే కాదు, నాముఖం కూడా చూడనని నిక్కచ్చిగా చెప్పింది. నా అనుమానమేమిటంటే, తన్ని కాపాడ్డానికి రణధీరే ఆ అఘాయిత్యం చేసి ఉంటాడు. అప్పుడు క్రుతజ్ఞతాభావంతో ఆ నేరం తనమీద మోపుకుంది కానీ ఇప్పుడు లాయర్ కచేరీలో డొంక కదిలిస్తే రణధీర్ బటపడతాడని తను భయపడుతోందనుకుంటున్నాను. మనకు తెలుసు ఇది కేవలం మూర్ఖత్వం అని, కానీ తనకి ఆ విషయం చెప్పేదెవరు? బహుశా రామంబాబు. ఈ ఉత్తరం చూసిన మరుక్షణమే మీరిద్దరూ బయలుదేరి వస్తారని నాకు తెలుసు. మీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము.

ఇదంతా చెప్పిన తర్వాత నా గురించి ఏమీ చెప్పబుద్ది వెయ్యటంలేదు. నా కొడుకుక్కి మొన్ననే ఏడాది నిండింది. పేరు 'రామం బాబూ', ఆయనకు నామాట గా చెప్పు, 'బాదల్ బాబూ కంగారుపడక గుర్తు తెచ్చుకో, మా బాబుకి గాడ్ ఫాథర్ అవుతానని ఒక సారి మాట ఇచ్చావు'. ఏమిటో, జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. లఖియా సంగతి విని మీరు చాలా దు.ఖపడతారు ఆమెకి ఎవరిని చూడాలనీ లేదంటుంది. అయినా మిమ్మల్ని చూస్తే కాస్త మనశ్శాంతి లభిస్తుందామెకు. ఎప్పుడు వచ్చేది వైర్ చేయండి.''

ఆ ఉత్తరం ఎలా చదివానో నాకే తెలియదు. అది పట్టుకుని అలాగే కూర్చుండిపోయాను. పిడుగులాంటి ఆ వార్త విని స్తంభించిపోయాను.

లఖియామీద దైవానికి ఎందుకింత కక్ష? అడుగడుగునా అందరూ ఈమెని ఎందుకిలా వెంటాడుతున్నారు? మొదట కట్టుకున్న భర్త, తర్వాత మామయ్య, ఆ తర్వాత గురువు, వీరందరినీ ఎందుకు పురిగొల్పాడు ఆ దేవుడు.

లఖియాని నేను ఒకసారి క్షమా భిక్ష యాచించాను. ''మానవుడు నీకు చేయాల్సిన సహాయమేమైనా వుంటే నువ్వు అడుగాల్సిన మొదటి వ్యక్తిని నేనే'' అని, అలాంటి అవకాశం లభించినప్పుడు నేనే ఏమీ చేయలేకపోయాను. ఆమె పిలుపుకి అందని చోట్ల ప్రేయసి వెంట తిరుగుతున్నాను. ప్రపంచంలో నా అనే వాళ్లు లేని ఈ అసహాయ స్త్రీ మీద సానుభూతితో నా హృద‌యం పెల్లుబికింది. సరళ మొదటి నుంచీ లఖియాకు ఎంతో సహాయం చేసింది. ఈసారి కూడా ఆమే చేయగలిగింది. సరళలో ఎన్ని దోషాలున్నా వాటినన్నింటినీ ఇది కడిగివేస్తుంది. అప్పటి నుంచి సరళ మీద నా అభిప్రాయం మార్చుగున్నాను. మూలుగా మనం చూసే స్త్రీలలా కోరికలనీ, అభిప్రాయాలనీ అణగదొక్కి బయటకి నవ్వుతూ ఆమె ప్రవర్తించదు. ఎవరన్నా భయం లేదు ఆమెకి. తన అభిప్రాయాలని నిష్కర్షగా చెప్పుతుంది. అగ్నిలాంటి హృద‌య మామెది. లోపాల్ని కప్పిపుచ్చదు. అన్యాయాన్ని సహించదు ఇలాంటి వ్యక్తి కనుకే లఖియాకి ఆమె సహాయం చేయ పూనుకుంది.

ఈ సంఘటన నుంచీ లఖియా ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి? పూర్వపు చిరునవ్వు అంతర్గతంలోని వెలుగు మాయ మయ్యాయా? ఆమెచేత దెబ్బ కొట్టించింది ఆ భగవంతుడే అందుకు సందేహం లేదు, తనను రక్షించుకోవటానికి చేతికందిన దానితో కొట్టి వుంటుంది. ఆ దెబ్బ తలమీదే తగలాలా? ఇలా ఆలోచిస్తూంటే హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అసలు ఆ దెబ్బ లఖియా కొట్టలేదేమో. రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదలిపెట్టాడని సరళ రాసింది. ఆమెను రక్షించటానికి అతను కొట్టాడేమో? రణధీర్ని రక్షించటానికి లఖియా బతిమాలో ,ఆత్మహత్యచేసుకుంటానని భయపెట్టో అతన్ని పంపించి వేసిందేమో? అందరి తప్పులూ, దోషాలూ తననెత్తిన వేసుకోవడం లఖియాకి వాడుకే గాదా!

అయినా, పురుషుల దుష్ప్రవర్తన మీద అంత అవగాహన ఉన్న లఖియా ఆ దొంగ సన్యాసి నైజం గ్రహించడంలో ఎలా విఫలమయింది? ఆమాటకొస్తే అంత గడుగ్గాయి అయికూడా యశో ఎందుకు తెలుసుకొని లేకపోయింది! యశో చెవులు మూసుకుని తనను 'సుందరీ' అని ఎందుకు పిలవద్దందో నాకు అప్పుడు అర్థమైంది. యశో నాకు రాసిన ఉత్తరంలో ఆశ్రమంలోని సన్యాసుల సౌంధర్యారాధన నిష్కల్మషమైనదనీ, ఇతరులకు హాని చెయ్యదని రాసింది. అదే దృష్టితో గురువుగారి నోటినుండి 'సుందరి' అన్న పిలుపు సహించింది. ఎందుకో మొదటి నుంచీ అతడిమీద ఆమెకు భక్తి, భయమూ ఏర్పడ్డాయి. అతగాడి మాట విని నన్ను కూడా వదలుకోవటానికి సిద్ధపడింది. లఖియాయే వుండిపోయింది. చివరకు ఇలా జరిగింది. ఈ వార్త యశోకు ఎంత క్షోభ కలిగించిందో నేను గ్రహించాను.

అప్పుడు నాకు యశోని ఓదార్చాలనే భావం కలిగి తన పక్కకు చేరి నెమ్మదిగా 'యశో' అని తన తల నావైపు తిప్పుకున్నాను. ఆప్యాయతగా నేను తన బుగ్గల మీద తన కన్నీటిని తుడుస్తుంటే, నా చెయ్యి తీసుగున ఆప్యాయంగా నోక్కింది.

''టెలిగ్రాం ఇచ్చిరండి. ఈ రాత్రే బయల్దేరుదాం,'' అంది యశో ఆవేదనతో.

 

చాప్టర్ 30

 

ఆ మరునాడు డూన్ చేరుకునే టప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయింది. స్టేషనుకు రాజేంద్ర సరళ వచ్చారు. దాయి వాళ్ల బాబుని ఎత్తుకుని వచ్చింది. పిల్లవాడు చాలా ఆరోగ్యంగా వున్నాడు. తల్లి పోలికలే వచ్చాయి వాడికి ముఖ్యంగా ఆ కళ్లు ముమ్మూర్తులా సరళవే. నేను ఎత్తుకునేటప్పటికీ ఏడుపు లంకించుకున్నాడు.

''మీకు పిల్లల్ని ఎత్తుకోవటం బొత్తిగా చేతకాదు, అన్నింటితో పాటు,'' అని యశో, బుల్లి రామంబాబుని నాచేతుల్లోంచి తీసుకుంది.

యశో వద్ద కూడా ఊరుకోలేదు వాడు. తల్లికేసిఉర్ర్ల్ చాచగా కొడుకుని తనదగ్గరకు తీసుకుంది సరళ.

''నీక్కూడా పిల్లల్ని లాలించటం చేతకాదు యశో. అయినా పిల్లలు ఇంట్లోలేందే ఎలా చేతనవుతుంది. అందుచేత ....'' అవి సరళ నవ్వుతూ ఆగిపోయింది.

''ఎందుకులేరు సరళా? వీరులేరా, పది మంది పిల్లల పెట్టు,.'' అంది యశో కూడా నవ్వుతూ.

నాకు కాస్త కోపం వచ్చింది. నా మనస్సంతా లఖియా మీద లగ్నమైంది. అలాంటి సమయంలో ఈ పరాచకాలేమిటి?

''అయితే ఇక పదండి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లి సామాను పడేసి వెళ్దామా లేక తిన్నగా లఖియా వద్దకు వెళ్దామా చెప్పండి రామంబాబూ,''అన్నాడు రాజేంద్ర నా భావాల్ని గ్రహించినట్లు.

''తిన్నగానే వెళ్దాం రాజేంద్రబాబూ. మళ్లీ ఇంటికి వెళ్లి తిరిగి రావటం ఎందుకు?'' అన్నాను.

మేమందరం, బుల్లి బాబు, దాయిలతో సహా, రాజేంద్ర కారులో బయలుదేరాము. దారిలో చాలాసేపటి వరకు మౌనంగానే ఉన్నాము. కాసేపటికి యశో సరళ ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు నా గురించి చెప్పటానికి ఎవరూ దొరకలేదు. ఎంతో కాలం పోయిన తర్వాత ఈ సరళ లభించింది. తీర్థయాత్ర విశేషాలు చెబుతూందని గ్రహించాను.

మేము డూన్ జైలు చేరేక సరళ తన కొడుకుని దాయితో వదలి, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన పిదప మమల్ని లోపలికి తీసుకెళ్లింది.

అదే ఖైదీలను కలుసుకోనిచ్చే గది.. అప్పుడా గదిలో ఇద్దరున్నారు - ఒక స్త్రీ ఒక పురు షుడు. ఆ స్త్రీ ఒక కుర్చీమీద కూర్చునివుంది. పురుషుడు ఆమె కాళ్లమీద పడి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఆమె శిలా ప్రతిమలా వుంది. చేతనారహితంగా కళ్లలోంచి నీరు కారటంలేదు. తిన్నగా గోడకేసి రెప్పవాల్చకుండా చూస్తూంది. ఇంతలో లోపలినుంచి పోలీసు వచ్చి లాఠీతో తలుపుమీద మూడు దెబ్బలు కొట్టాడు. ఆ స్త్రీ హఠాత్తుగా లేచినించుంది. ఆమె లేచినా పురుషుడు అలాగే కింద కూర్చున్నాడు ఏడుస్తూ. ఒక్కమాటైనా మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది ఆ స్త్రీ. కాసేపు పోయినతర్వాత అతను కూడా వెళ్లిపోయాడు. అలాగే ఏడుస్తూ...

ఇదంతా మేము గుమ్మంవద్ద నుంచి చూస్తున్నాము. వీరిద్దరి మధ్యవున్న నిగూఢ రహస్యం ఏమిటి? నేరం చేసింది స్త్రీ అని స్పష్టంగా తెలుస్తూంది. అయితే అతను ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఆమె హృద‌యంలో దయా, దాక్షిణ్యం, కరుణ, కన్నీరు ఇవన్నీ ఎగిరి పోయాయా? ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ ఇంకా ప్రౌఢ వయస్సులోనే వున్నట్టుంది. చూడటానికి ఇప్పుడు ఏమంత బాగులేదు కాని ఒకప్పుడు అందంగా వుండివుండాలి. పురుషుడు యవ్వనం వదిలి చాలా కాలం అయినట్లు కనబడుతూంది. వీరిద్దరి మధ్యా సంబంధమేమై వుంటుంది. భార్యభర్తలా? అన్నా చెల్లెలా? తండ్రి కూతురులా? మూడవది అయివుండదు. మొదటి రెండిటిలో ఏదైనా కావచ్చు. లేకపోతే యే అన్యాయం చేసిన పరదేశీయో ఈ పురుషుడు. తప్పు తెలుసుకున్నాక క్షమాభిక్ష వేడుకుంటున్నాడేమో, అయితే ఈమెలో క్షమాగుణం కూడా అడుగంటి పోయిందా?

మేము లోపలికి వచ్చి అక్కడ ఒక బల్లమీద కూర్చున్నాను. లఖియా చాలా లోపలి నుంచీ రావాలి. అందుకు కాస్త ఆలస్యమవుతుందని చెప్పింది సరళ. ఆ కాస్తసేపు కొన్ని యుగాల్లా గడిచాయి. నేను పరధ్యానంగా కిటికీలోంచి బయటకు చూస్తూన్నాను. ఎవరో వస్తున్న చప్పుడైనట్లు వినబడి నా ద్రుష్టి గుమ్మంవైపు మరల్చేటప్పటికి అక్కడ లఖియా నిలబడివుంది, మాసిన తెల్లటి చీరలో పాత దుప్పటి కప్పుకుని తలమీదకు లాక్కుని. ముఖంలో ఆ అందం అలాగేవుంది. కాని కళ్లలోంచి ఏదో మాయమైనట్టనిపించింది నాకు. నాకప్పుడదేమిటో సరిగ్గా తట్టలేదు. బహుశా నిశ్చలతయేమో.

యశోని నన్ను చూసి లఖియా క్షణకాలం ఆశ్చర్యపోయింది. తన శక్తినంతా వినియోగించి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ మందహాసానికి నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి ఆమె కాళ్లమీదపడి ఇందాకా ఆ పురుషుడు ఏడ్చినట్టు ఏడవాలనిపించింది. ఏకాంతంగా వుంటే బహుశా అలాగే చేసేవాడినేమో. అలా అయితేనా హృద‌యంలోని భారం తీరును. వీరందరి ఎదుటా నేనలా చేయలేను.

''ఎప్పుడు వచ్చారు మీరు యశో, చాలాకాలమైంది. మిమ్మల్ని చూసి'' అంది లఖియా.

మరుక్షణంలో యశో లఖియా పాదాల మీద పడిపోయింది. లఖియా ఆమెను పట్టుకుని హృద‌యానికి హత్తుకుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి.

'ఇప్పుడే వచ్చాం, సరళ ద్వారా నిన్ననే తెలుసుకున్నాం,' అంది యశో నెమ్మదిగా లఖియాని వదలి.

''రామంబాబూ, మళ్లీ కలుసుకోమేమోనని భయపడ్డారుకదూ చూడండి ఎంత త్వరలో కలుసుకున్నామో,'' అంది లఖియా నాకేసి చూసి నవ్వుతూ.

కాసేపు నేనేమీ సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఏమనాలో తెలియడంలేదు.

''రెండు సంవత్సరాలు లఖియా,'' అప్రయత్నంగా అని, ''ఈలోపున చనిపోయినా బాగుండేది,'' అన్నాను హృద‌యంలోని ఆవేదన భరించలేక

లఖియా ముఖం క్షణకాలం మేఘావ్రుతమైంది.

''అలాంటి మాటలు ఎప్పుడూ అనకండి రామంబాబూ. యశోకు ఎంత బాధ కలుగుతుందో గ్రహించలేరా? నాకూ కష్టంగా వుంటుంది,'' అంది.

అవును నిజమే, ఆవేశాలను అణచుకోవాలి. లఖియాని చూడటానికి వచ్చింది ఆమెకు కాస్త సంతోషం చేకూరుద్దామని ఆమెని కష్టపెట్టడానికి కాదు.

''ఏనాడూ నీ కష్టకాలంలో ఆదుకోలేకపోయాను, ఈనాడైనా నాకా అవకాశమియ్యి లఖియా,'' అన్నాను.

''మీకు నేనిచ్చిన మాట మరచిపోలేదు రామంబాబూ. కాని ఇందులో ఇతరుల సహాయం వల్ల జరిగేదేమీ లేదు. ఎవరి చేష్టల ఫలితం వారనుభవించాల్సిందే,"

"అదంతా సరే, నాదొక కోరిక తీరుస్తావా?'' అన్నాను.

''చెప్పండి, నేనే చేయగలదవుతే చేస్తాను. కానీ వాగ్దానం చేయలేను,'' అంది.

''నిన్ను ఇక్కడ నుంచి విడిపించి మాతో తీసుకుపోతాము. శేషజీవితమంతానువ్వు మాతోనే గడపాలి,'' అన్నాను.

మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికది. అంతకుముందు దీనిని గురించి ఆలోచించలేదు, అలాంటి ఆలోచన తట్టినందుకు నాకు ఎంతో ఆనందం కలిగింది.

''ఈ కోరికను తోసిపుచ్చకు లఖియా అంతకంటె వారినీ, నన్నూ సంతోషపరిచేదింకేమీ లేదు. నా కోసం కాకపోయినా, వారికోసమైనా, అవుననూ లఖియా,'' అంది యశో కూడా వెంటనే.

లఖియా ఇంకా ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెళ్లి కూర్చీలో కూర్చుంది.

''ఆనాటి నీ జీవితంలో దుఃఖపునాదులు అంతరించిపోయాయి లఖియా జీవితంలో పూర్తిగా కష్టాలే అనుభవించావు నీవు. ఈనాటితో వాటికి స్వస్తి చెప్పాలి. నిన్ను మా కులదైవంగా చూసుకుంటాము,'' అన్నాను ఆమె మనస్సు మారిపోతుందేమోనన్న భయంతో.

లఖియా ఎంతో బలవంతాన కన్నీరు ఆపుకుంటూంది. క్షణకాలం క్రింది పెదిమ వణికింది.

''అలాంటి మాటలనకండి రామంబాబూ. మీరూ, యశో, సరళా ఈ దీనురాలిమీద చూపుతున్న దయకూ ఎప్పుడూ అంతులేదు. ఇప్పుడు రాజేంద్ర బాబు నాపట్ల చూపుతున్నఆదరణకు నేనెంతో ఋణపడున్నాను. మీరందరిని భగవంతుడు కాపాడుతాడు, తన నుంచి నేను కోరుకునే అంతిమ కోరిక ఇదే. మీకు కష్టాన్ని కలిగించటం నాకు ఇష్టం కాదు. అయినా మీరన్నది చాలా అసమంజసము. జీవితంలో మనకు అనేక మంది తటస్థపడుతూంటారు. వారిలో కొంత మంది సన్నిహితులవుతారు; కొంత మందిని ప్రేమిస్తాము; చివరికి ఎక్కడో అక్కడ ఎవరి దారిని వారు పోవాలి. ఇది భగవత్ నిర్ణీతమైంది. దీనికి మీరూ, నేనూ ఏమీ చేయలేము,'' అంది లఖియా.

ఈ మాటలంటూంటే సరళ నా కళ్లల్లోకి చూసింది. ఇదే మాటలు నేనొకసారి ఆమెకు చెప్పాను. మమ్మల్ని వదిలిపెట్టలేక మమతతో బాధ పడుతూంటే ఆమెకు సహన శక్తి ఇవ్వటానికి చేసిన ప్రయత్నం మది, ఈనాడు భగవంతుడు పగబట్టి ఈ అనాధ స్త్రీని రక్షించుకోవటానికి ప్రయత్నిస్తూంటే అవే మాటలు లఖియా వెంట వచ్చాయి.

''అలాంటి మాటలన్నావంటే మళ్లీ ఎప్పుడూ ఇక్కడికి రాము లఖియా,'' అంది సరళక కోపంగా.

''అన్నీ మన ఇష్టప్రకారమే జరగవు సరళా? కారాగారవాసం కోరుకుంటే వస్తుందా? అయినా ఇదేమంత చెడు ప్రదేశం కాదు. శ్రీ కృష్ణుని జన్మస్థానం ఇదే,'' అంది లఖియా నీరసంగా నవ్వుతూ.

లఖియా తన దుఃఖాన్ని దిగ మింగడమే కాక ఇతరుల ఇబ్బందులను పసిగడుతుంది

''నన్ను మీరు క్షమించాలి రాజేంద్రబాబూ; రామంబాబూ, యశో మాటలలోపడి మిమ్మల్ని కించపరిచాను'' అంది లఖియా అప్పుడు అతనితో

''అలా అనుకోకు లఖియా,'' అన్నాడు రాజేంద్ర.

అప్పుడే లోపల్నుంచి పోలీసు వచ్చి తలుపు మీద లాఠీ కొట్టాడు, ఇరవై నిమిషాలు గడువైపోయింది. లఖియా ఇంక తిరిగి పనిలోకి వెళ్లిపోవాలి.

''నువ్వు ఏకాకివికావని గుర్తుంచుకో. నీ ఆలోచనా పర్యవసానం గ్రహించుకో. మళ్ళీ వచ్చికలుస్తా,'' అంది యశో.

''నేనే అఘాయిత్యం చేయనులే యశో, అయినా నా గురించి ఆలోచించి, ఆలోచించి మీ మనస్సు పాడుచేకోకండి. ముఖ్యంగా మీరు రామంబాబూ. నా గురించి మీరేమీ చింతించకండి.,'' అంది లఖియా.

పోలీసువాడు మళ్లీ తలుపుమీద కొట్టాడు. లఖియా లేచి నించుని గుమ్మంవైపు నడిచిపోతూ అంది, ''సరళా. బాబు కులాసాగా వున్నాడా?''

జవాబు కోసం క్షణకాలం గుమ్మం వద్ద ఆగింది లఖియా.

సరళ గబగబా ఆమె వద్దకు వెళ్లి బుగ్గమీద నెమ్మదిగా ముద్దుపెట్టుకుంది.

'కులాసాగానే వున్నాడు లఖియా, మళ్లీసారి తీసుకొస్తా," అంది సరళ.

లఖియా గుమ్మం వద్ద ఆగినఒక్కక్షణం కూడా వృధా చెయ్యబుద్ధి కాలేదు.

లఖియా గుమ్మం దాటింది. లోపలికి వెళ్లేదారి ఒక పొడుగాటి బాట. పొడుగైన వరండాలోంచి పోవాలి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచిపోతూంది. ఆమె పక్కన భుజానికి తుపాకీ తగిలించుకుని పోలీసువాడు నడుస్తున్నాడు. ఆ దృశ్యం నా హృద‌యంలో హత్తుకు పోయింది. లఖియా పారిపోకుండా చూడటానికి వాడు ఆమె ఛాయలా ఫాలో అవుతున్నాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నా రక్తం వుడికింది. మానవత్వానికే ఒక మాయని మచ్చ. భూకంపం వచ్చి ఆ జైలంతా పడిపోయినా, అక్కడి వారంతా చనిపోయినా ఆమె అక్కడ నుంచి కదలదు. సీతా దేవిలాగ భూదేవి ఈమెను కూడా తన ఆలింగనంతో ఇమడ్చుకోవాలి. ఆమె అంతుకి అంతకంటే మార్గం లేదు.

అంతా రెప్పవాల్చకుండా నడచిపోతూన్న ఖైదీని చూస్తున్నాం. కొంత దూరం నడచి మలుపు తిరిగి మాయమైంది. ఆమె అడుగుల్లో తొట్రుపాటులేదు. మా అందరి కళ్లెదుట ఆ ద్రుశ్యం అంతరించి పోయింది. ఒకసారైనా వెనుదిరిగి చూస్తుందేమోనని ఆశించాము. మలుపు దగ్గిర క్షణకాలం ఆగినట్టనిపించింది. కాని వెనుదిరక్కుండానే ముందుకు సాగిపోయింది. వెనుదిరగటమనేది ఆమె స్వభావానికే విరుద్దమని నేను ఆనాడు గ్రహించాను. కష్టాలు తండోపతండాలుగావచ్చి మీదపడినా ఈ ఆబల చెక్కుచెదరదు. కన్నీరు కార్చదు. ఇంత జరిగినా ఆమెకు భగవంతుని మీద విశ్వాసం అచంచలంగా వుంది. తన కష్టాలకు కారకుడైన అతగాడినే కొలుస్తూంది. లఖియానుంచి నేను నేర్చుకున్నది ఒక్కటేవుంది. అదేమిటంటే జీవితంలో ప్రతి మానవుడు దేనినో దానిని విశ్వసించాలి. అది ఏదైనా కావచ్చు. దైవమే అయివుండనక్కర్లేదు. తల్లిగర్భంలోంచి జన్మించినప్పటి నుంచీ చనిపోయేవరకూ నేనే నాస్తికుడిని అని చెప్పగలిగిన వారెంతమంది వున్నారు. సరళకు భగవంతునితో నిమిత్తం లేదు. అతగాడంటే భయంతో ఆమె ఏపనీ చెయ్యదు. తనకు తోచినట్లు తాను చేస్తుంది. అది అక్షరాలా నిజం. ఏదో ఒక సమయంలో ప్రతి మానవుడు దైవాన్ని ప్రార్థిస్తాడు. తను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయే సమయంలో కన్నీరు కారుస్తూ చేతులు జోడిస్తాడు. తన ప్రార్థన మాత్రంతో వారిని తను రక్షించుకోలేదు. అయినా అలా చేస్తాడు.

బరువైన హృద‌యాలతో మేము వెనుదిరిగాము, బయటకు వస్తూంటే యశో ఒక చేత్తో నా చెయ్యి, ఇంకొక చేత్తో సరళ చెయి పట్టుకుంది. సరళ తన రెండో చెత్తో రాజేంద్ర చేయి పట్టుకుంది. నలుగురుమూ కారువైపు నడిచాము, దాయి వడిలో బాబు సుఖంగా నిద్ర పోతున్నాడు.

 

చాప్టర్ 31

 

రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను.

సరళ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని కొద్దిగా ఇరుకుగా యశో దాయి లతో వెనకాల సీట్లో కూర్చుంది.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దల మూడ్ గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్న పోతున్నాడు

లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన వల్ల అది తగ్గించబడవచ్చుకూడా. ఆ తర్వాత ఆమె మా వద్దకు వస్తుంది. ఇహపరాలను లక్ష్యం చేయకుండా ఆమెను సుఖపెడతాను. జీవితమంతా చీకటిమయం కాదని నిరూపిస్తాను. ఈదారిలో ఎన్ని ఆటంకాలున్నా లెక్కచెయ్యను, అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ లఖియా మాటలతో వమ్ములయ్యాయి. ఈమె ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసివుందో. లఖియాని ధనసహాయం స్వీకరించమని అర్థించగలిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వద్ద నుంచీ ఏమీ స్వీకరించదు అనుకున్నాను.

చివరికి ఇంటికి చేరేము.

"అయితే లఖియాకు మనము ఏవిధంగానూ సహాయ పడలేమా రాజేంద్ర," అన్నాను కారుదిగుతూ.

"అంటారుగా, తనని తాను హెల్ప్ చేసుగున్న వాళ్ళకే దేముడు సహాయం చేస్తాడని, కానీ లఖియా తన కర్మకు తన్ని వదిలేయమని మొండికేసి కూర్చుంది. అయినా సాయంత్రం లాయర్ని మీరు కూడా కలుద్దురుగాని,' అన్నాడు తను దిగులుగా.

"ఒకవేళ లాయర్గార్కి మీరు కుటుంబ వైద్యులయితే ఆయన ఇక్క్కడికి వస్తారేమో అడగండి, మా అడ సలహాలు కూడాఉచితంగా పొందవచ్చు, ఏమంటావు సరళా,"అంది యశో నవ్వుతూ.

"సరిగ్గా చెప్పేవు యశో అలాగే చేద్దాం," .అన్నాడు రాజేంద్ర ఫోన్ దగ్గరకు వెడుతూ.

యశో నేను స్నానాలు చేసి వచ్చేటప్పడి కి డైనింగ్ టేబుల్ మీదున్న దిల్ బహదూర్ వేడి వేడి భోజనం

ఆహ్వానం పలికితే రాజేంద్ర వెల్కమ్ న్యూస్ తో రెడీగాఉన్నాడు. భోజనం చేశాక కాసేపు కునుకు తీసి అందరం లాయర్గారి రాక కెదురుచూస్తూ కూచున్నాము.

కార్లోంచి దిగిన రవిప్రకాష్ని రాజేంద్ర మాకు పరిచయం చేసాడు.

"మీట్ ద లైవ్ వైర్ లాయర్,' అన్నాడు రాజేంద్ర.

"హియర్ ద లైట్నింగ్ స్ట్రయిక్స్," అన్నాడు యశోని రవిప్రకాష్కి పరిచయం చేస్తూ.

"'హూఇజ్ స్ట్రక్," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ .

"బాదల్ బాబు యాని రామంబాబు," అంది సరళ నన్ను చూపిస్తూ.

"అరే, మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అన్న విషయం చెప్పడం మరిచాను," అన్నాడు రాజేంద్ర

"అయితే పెళ్ళిచూపులేమైనా ఏర్పాటు చేయకూడదూ," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

"మన్మధుడు తలస్తే అవే అవుతాయి, ఏం చెప్పగలం," అంది సరళ నవ్వుతూ.

"మీ కంపెనీ ఎంజాయ్ చేయడానికి వేరో మారు వస్తానుకాని ఇప్పుడు అనుకోకుండా 'రిట్' కేసు తగిలింది," అన్నాడు రవిప్రకాష్ .

"మంచిదేగా మరి. వీళ్లూ మాలాగే ఆమెకి శ్రేయోభిలాషులు. వీరికా లఖియా కేసు కాస్త బ్రీఫ్ చేస్తారా," అన్నాడు రాజేంద్ర.

"ఆ కేసులో విశేషమేమిటంటే అందులో అసలు కేసే లేదు. నిన్ననే ప్రభుత్వ ప్లీడర్ చెప్పేడు, ఆ దొంగ సన్నాసిని ఆస్పత్రినించి డిస్చార్జి చేశారని," అన్నాడు రవిప్రకాష్

"అయితే ఇప్పుడు లాఖియాను విడిచిపెడతారా?" అన్నాను నేను ఆతృతగా.

"విడిచిపెట్టరు, విడిపించాలి, అందుకు నాకు ఆవిడ వకాలత్ కావాలి," అన్నాడు రవిప్రకాష్.

"నేనిప్పిస్తా," అన్నాను ఆవేశంగా.

"అది అంత సులువయిన పనికాదు," అన్నాడు రవిప్రకాష్ నాకేసి ఆశ్చర్యంగా చూస్తూ.

"అలాగ ఎందుకనుకుంటున్నారు రవిప్రకాశ్ గారు," అన్నాను, ఆశ్చర్య పడడం నాఒంతవగా.

"లాఖియాదొక మానసిక ఋగ్మత," అన్నాడ రవిప్రకాష్.

"మీరేమంటున్నారు!"అన్నాను అసహనంగా.

"డాక్టర్గా రాజేంద్ర అడ్వకేట్గా నేను అప్పుడప్పుడు లఖియాలాని కలుస్తూవుంటాము. మానసికశాస్త్ర రీత్యా వీళ్ళు 'విక్టిమ్స్ అఫ్ మార్టైర్ సిండ్రోమ్'. తామే త్యాగమూర్తులమని భావిస్తూ వీళ్ళు, వాళ్ళ కష్టాల్లోనే సుఖానుభూతి పొందుతారు పరుల సానుభూతితో . వాళ్లని వారి వారి మిధ్యాలోకంవీడి నిజ జీవితం లోకి అడుగుపెట్టించడం బహుశా బ్రహ్మతరంకూడా కాదు," అన్నాడు రవిప్రకాష్ .

రాజేంద్ర తో సహా అందరం నిస్చేస్థితులమయ్యాము.

"ప్రేమకు తరంకాని దేమీ కాదిది. నేను ప్రాణం పణంగా పెట్టయినా లఖియాని ఒప్పిస్తాను," అన్నాను ఆవేశంగా.

"మీకా నమ్మకముంటే తప్పక ప్రయత్నించండి," అన్నాడు రవిప్రకాష్ ఆశ్చర్యపడుతూ.

"ఒకవేళ ఆయన లఖియాను ఒప్పిస్తే మీరు ఆమెను విడిపించగలరా?" అంది యశో.

"అది నా ఎడమచేతి పని అనుకోండి," అన్నాడు రవిప్రకాష్ ధీమాగా.

"అదెలా?" అంది యశో నమ్మ శక్యంకానట్లు.

"గాయపరిచింది ఆత్మరక్షణలో గనుక ప్రైమా ఫేసీ నేరంకాదని, అందునా బాధితుడు కోలుకున్నాడు గనుక ఆమెకు మొదటి హియరింగ్ లోనే బెయిల్ ఇప్పిస్తాను. ఆ తరువాత గురువుగారి మీద మానభంగం కేసు నమోదుచేసిప్లేటుఫిరాయించి కధ అడ్డం తిప్పుతాను. అప్పుడు ఆ సన్నాసి'దొంగ' తీగ లాగితే అన్ని ఆశ్రమాల

'డొంక' కదుల్తన్న భయంతో వాళ్ళ'లాబి'ప్రభుత్వ పప్లీడర్ని'చూసు' కుంటుంది. ఆ తర్వాత కధ కంచికి

లఖియా మీ ఇంటికి," ఆనాడు రవిప్రకాష్ .

"అయితే ఎప్పుడు సుముహూర్తం ?" అంది సరళ.

"రేపైతే కుదరదు ఎళ్ళుండి పెట్టుకుందాం," అన్నాడు రవిప్రకాష్ .

"మరైతే పరీక్షకు తయారవ్వండి రామం బాబు," అంది సరళ.

"నీ నోట్స్ సాహాయంతో," అన్నానునేను

"ఎలాగూ చీటీ లందించడానికి నేనుంటానుగా," అంది యశో నవ్వుతూ.

"సరే, ఈలోగా వార్డెన్అనుమతి పత్రం ఆమెవకాలత్నామావగైరా సిద్ధం చేస్తాను," అన్నాడు రవిప్రకాష్

చేతి వాచీ చూసుకుని.

"ఇంతకీ బెయిల్ ఎప్పుడు ఇప్పించ గలరు?" అంది యశో.

"అంతా సవ్యంగా జరిగితే రెండు మూడు నెలల్లో.ఆతర్వాత ఆమె మీద కేసుకంచికి ఆమె మీఇంటికి ," అన్నాడు రవిప్రకాష్ .

"అల్లాగే అయితే మీ ఫీజు రెండింతలు," అంది యశో.

"డబ్బేమీ చెదు కాదు కానీ ఎందుకది!" అన్నాడు రవిప్రకాష్ .

"లఖియా రెండు నిండు ప్రేమలకు జీవంపోసినందుకు," అంది యశో.

"ఆమె మీదున్న మీ అందరి అభిమానంతో నా భాద్యత పెంచారు," అన్నాడు రవిప్రకాష్ .

"కాస్త వుండండి ప్రకాశ్గారూ, ఐప్పుడే వస్తా," అనిచెప్పి యశో ఆలా వెళ్ళి ఇలా తిరిగివచ్చింది.

"దేనికంత తొందరేమిటండీ," అన్నాడు రవిప్రకాష్ యశో అందించిన కవరు అందుకుంటూ.

రాజేంద్ర,నేను రవిప్రకాష్ని సాగనంపింతరువాత, రాజేంద్ర తన క్లినికి వెళ్లగా నేనుతిరిగి ఇంట్లోకి వెళ్లేను.

"యశో ఏమిటీ నమ్మకం," అంటోంది సరళ.

"ఆయన మీద భరోసా," అంది యశో నన్ను చూపిస్తూ.

"యశో మీమీద చాల భారం మోపింది రామం బాబూ," అంది సరళ.

"లఖియా భగవంతుడి మీద ఆంటే సరి," అన్నాను.

"మా భలేవాడ్నే నమ్ముకుంటున్నారు," అంది తానునవ్వుతూ.

ఒప్పందం మేరకు రవిప్రకాష్ తన కారులో యశోని నన్ను డోన్ జైలు కి తీసుకెళ్ళేడు. దారిపొడుగునా తాను నెగ్గిన కేసుల గురించి చెపుతుంటే యశో నేను శ్రద్ధగా విన్నాము. అతడు సమర్ధవంతుడే నన్న భావన యశో తన కళ్ళతో వ్యక్తపరి చేది.

జైలు కెళ్ళింతరువాత నేను లాఖియాను కలువదానికి వెడుతుంటే యశో ఎంతో ఆశతో పంపించింది,

కాని పట్టుమని పది నిముషాలైనా తిరక్కుండానే తిరిగొస్తున్న నన్ను చూసిన తన ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.

కానీ హుటాహుటిగా నేను వారిని చేరి, లాయరుగారి కోసం 'లఖియా వేచివుంది' అన్నప్పుడు ఆమె ముఖారవిందం వర్ణనాతీతం.

"చెప్పండి," అంది గోమూగా యశో, రవిప్రకాష్ హుషారుగా వెళ్ళింతరువాత.

"ఉత్తినే చెప్పను," అన్నాను.

"అయితే గట్టిగా అరవండి," అండి నన్ను దూరంగా తోస్తూ.

అప్పుడు యశోని దగ్గరకి తీసుగుని లఖియాతో 'నా మాటకి మాట' చెప్పేను.

"లఖియా నేను ఆత్మహత్య చేసుకుంటే యశో వ్యధ ఊహించలేవా," అన్నాను.

"మహాపాతకం రామంబాబు," అంది చెవులు గట్టిగా మూసుకుని.

"నన్నునమ్ము, నువ్వు నీధర్మం వీడితే నేను నీకదే అంట గడతాను," అన్నాను.

"రామంబాబు, అసలు మీకు నోరెలావచ్చింది నాకు అధర్మప్రవర్తన ఆపాదించడానికి?" అంది కళ్ళలోంచి బటబట నీరుకారుతుంటే.

"ధర్మాధర్మాలు నిర్ణయించవల్సింది న్యాయమూర్తులు, నిందితులుకాదు, దానికి నీ విరుద్ధ వ్యవహారమే నీ అధర్మం. తప్పుపట్టనంటే, అహంకారం," అన్నాను.

"నే నహంకారినా, ఏమంటున్నారు రామం బాబు, మీరు," ఏడుస్తూ అంది.

"నీ అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవటమే నీఅహంకారం," అన్నాను.

"ఏమిటి నా ధర్మం?" అంది మరుక్షణం.

"నీ కృత్యం లోని ధర్మాధర్మ నిర్ణయం న్యాయమూర్తికి విదలడమే నీధర్మం. అయినా రణధీర్ మీద 'నీ వైధవ్యాన్ని కాపాడిన' కృతజ్ఞతా భావాన్ని గౌరవిస్తాను. నువ్వే చేశావన్న అసత్య వచనానికి ధర్మోపాయం, అశ్వద్ధామ హతః కుంజరః," అన్నాను.

"రామం బాబు, నా కళ్ళు తెరిపించేరు, కృతఙయురాలిని," అంది నాచేయి పట్టుగుని.

"నీ కిప్పుడు దారి చూపించటానికి లాయర్ రవిప్రకాష్ గార్ని తోడుతెచ్చింది యశో, ఆయన్ని కలుస్తావా?" అన్నాను.

"యశోని కూడా," అంది.

"లాయర్ని కలిసేక, సరేనా," అంటే, లఖియా తలూపింది.

ఆ 'నా మాటకి మాట' విన్న యశో, ఆనందసంభ్రమాలలో ములిగిపోయింది

"ఇంక' నాకేమి చేతకాదు అమ్మీ' పాట కట్టండి," అంది యశో తన చెక్కిలిమీద కారే ఆనందభాష్పాలు తుడుచుకుంటూ.

"ఇది నా స్వయం ప్రభావం కాదుఅమ్మీ, అంతా నీ సాంగత్య ఫలం," అన్నాను నేనూ ఆమె అనుభూతిని పంచుకుంటూ.

"సరళ కి ఫోన్ చేసి చెప్తేసరి," అంది.

"సరి కాదు బేసి, సరళ ఆనందం ఫోన్ లో మనం కళ్లారా చూ డలేంగా?" అన్నాను.

"నిజంగానే నాకు మతిపోయినట్లుంది," అంది నవ్వుతూ.

"నీకే కాదు సరళక్కూడా, లేకపోతే తన కొడుక్కి నాపేరు పెట్టడం ఏమిటి, రాజేంద్ర ఏమనుకున్నాడో ఏమో," అన్నాను.

"దీన్నే కందకి లేని దురద అంటారు," అంది సాలోచితంగా.

ఆతరువాత రవిప్రకాష్ రాకకు మేము మౌనంగా ఎదురు చూసాం.

మాకు క్షణ క్షణం ఒక యుగంలా గడుస్తూండగా, ఆఖరికి రవిప్రకాష్ మాకు థమ్స్అప్ సూచిస్తూ కనబడ్డాడు అతను ఇంకా మా దగ్గరకు రాకుండానే యశో ఆనందంగా లాఖియాని కలవడానికి పరుగుతీసింది.

యశో తిరిగివచ్చేలోపల రవిప్రకాష్, తను లఖియా దగ్గర సేకరించిన విషయాలు చెప్పి నన్నడిగాడు.

"అయినా ఏం మాయమాటలు చెప్పి ఆమె మనసు మా ర్చగలిగేరు?"

"చెప్పడానికి అవేమి మీ కచేరి వాదనలను బలపరచేవి కావు," అన్నాను నవ్వుతూ.

"ఎదో అనుకున్నానుకాని గట్టివారే మీరు," అన్నాడు చేయి కలుపుతూ.

యశో వచ్చిన తరువాత నేను లఖియా ఏమంది అని అడిగితే తనంది, "మౌనమే మా ఆనందం."

"మీ టిట్ కి మీ ఆవిడ టాట్ బాగుంది," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

అదేమిటంది యశో, తరువాత చెప్తా, అని నేనన్నాను. జైలు వార్డెన్ కి మా ధన్యవాదాలు చెప్పి ముగ్గురం ముస్సోరి ముఖం పట్టాము.

"ఇంటకీ లఖియా మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు," అడిగాను రవిప్రకాష్ ని.

"చూడడానికి బాగుంది, ప్రస్తుతానికింతే," అన్నాడు.

అతను మమల్ని ఇంటికి చేర్చేసరికి అనుకోకుండా రాజేంద్ర ఎదో పనిమీద బయటకు వెళ్ళాడు. నేనూహించినట్లే, యశోని హత్తుకుని సరళ పొందిన ఆనందానికి హద్దులేదు కానీ తను నన్ను కూడా తన కౌగిల్లో బిగించినప్పుడు నా ఆ శ్చర్యానికి అంతులేదు..

"హనుమంతుని హృదయానికి హత్తుకొని రాముడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి రామం బాబు," అన్న సరళను నేను నాహృదయానికి హత్తుకోలేకుండా ఉండలేకపోయాను.

"అందుకనే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని," అంది యశో సరళ భుజం మీద చెయ్యివేసి.

"కానీ కొమ్ముల పరిమితి స్వల్ప మాత్రం అయితే చెవుల పరిధి విశాలం కదా రామం బాబు," అంది సరళ నా కౌగిలి వీడుతూ.

ముస్సోరిలో మరో రెండు రోజులు ఆనందోత్సాహలతో గడిపి (నలుగురం హాక్ మన్స్ కి కూడా వెళ్ళేం) లఖియా బెయిల్ మీద విడుదలయ్యే సమయానికి వస్తామని కాశీకి యశో నేనూ తిరుగు టపా కట్టేము.

 

చాప్టర్ 32

 

యశో నేనూ, కాశీకి తిరిగివచ్చి ఒక వారం రోజులై వుంటుంది. ఆనాడు పొద్దున యశో ఓ టెలిగ్రామ్ నాకిచ్చి వెళ్లిపోయింది. అందులో మామయ్యకి చాలా జబ్బుగా వుందనీ తక్షణం బయలుదేరి రమ్మని వుంది.

మళ్లీ ఒక సమస్య ఎదురైంది. తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు బాబయ్య, లలిత పిన్నికీ ఇక మగదిక్కెవ్వరూలేరు. అలాంటి సమయంలో ఆమెకు సహాయం అవసరం, అదీకాక నా వ్యవహారాలన్నీ బాబయ్యే చూస్తున్నాడు. వెళ్లకతప్పదు కానీ యశోని తీసుకుని వెళ్లలేను. ఆ సమయంలో అలాంటిపని చేయడంకంటె తెలివితక్కువ పని ఇంకొకటి వుండదు.

టెలిగ్రాం చేత్తోపట్టుకుని లోపలికి వెళ్లాను. యశో వంటచేయడంలో నిమగ్నురాలైంది.

''యశో నన్నేమి చేయమంటావు?'' అన్నాను నెమ్మదిగా వెనకనుంచొని.

''చేసేదేముంది చెప్పండి. మీరు తప్పకుండా వెళ్లాలికదా? నన్ను కూడా తీసుగెళ్లాలా లేదా అన్నదే సమస్య. తీసుగెళ్తే నేను సురేఖను కూడా చూడవచ్చు,'' అంది చేస్తున్న పని ఆపి నా వైపుతిరిగి.

''అవును, కాని నేనొక్కడనే వెళ్లాలి యశో. నిన్ను ఇప్పుడు తీసుకెళ్ల లేను, '' అన్నాను.

''అదేమంచిది,'' అంది యశో గరిటె తిప్పుతూ, అంటే ఆమెకికోపం వచ్చిందన్నమాట.

''చూడు యశో,'' అని బుజ్జగించ బోతే యశో తీవ్రంగా స్పందించి.

''నాకు అంతా తెలుసు, మీరే వెళ్లండి, ఆయనకి స్వస్థత కావాలి, మీరు త్వరలో రావాలని ఇక్కడ నుంచే ప్రార్థిస్తూంటాను,'' అంది నిర్వికారంగా.

ఆ సాయంకాలమే బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. ఒక వైపు కర్తవ్యము, రెండో వైపు యశో ...ఈ రెంటి మధ్యా మనస్సు వూగిసలాడింది, కానీ చేసేదేముంది? యశో తన అంతర్యాన్ని, ఆలోచనని బయటపెట్టలేదు. నేనుకూడా వాటిని రేకెత్తించలేదు. అలా చేస్తే అణచివున్న దు.ఖము విజ్రుంభిస్తుంది. అంతకంటె దానివలన ఎవరికీ ప్రయోజనం లేదు.

రైలు బయలుదేరటానికి ఇంకా టైముంది. ఒకరి చెయ్యి నొకరు పట్టుకుని ప్లాటుఫాం మీద నడుస్తున్నాము. యశో నేను చేయాల్సిన పనులన్నీ చెప్పింది.

''నేను మీ ఆరోగ్యంగురించే ఆందోళన పడుతున్నాను. నేను లేకుండా మీకు జరుగదు. అంతమందిలో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు చూస్తారు?'' అంది అప్పుడే జ్ఞాపకమొచ్చినట్టు.

''ఎప్పుడూ ఎవరో ఒకరు ఎందుకు కనిపెట్టి వుండాలి యశో. ఎవరూ చూడకపోతే బహుశా నన్ను నేనే చూసుకుంటానేమో; అలా అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే,'' అన్నాను.

''కాదు మీకు జరుగదు. మీ స్వభావమే అంత,'' అంది.

ఆమె ఆరోగ్యం సరిగా చూసుకోమనిగాని, జాగ్రత్తగా వుండమని గాని చెప్పే అర్హత నాకులేదు. ఎంతో హాస్యాస్పదంగా వుంటుంది. విని వూరుకున్నాను. రైలు కదలబోయే వేళైంది. యశో పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి బేల అయిపోయింది.

''చూడండి; మీరు నాకు ఎంత అవసరమో నేను ఎప్పుడూ మీతో చెప్పలేదు. త్వరగా వచ్చేస్తారు కదూ,' నిబ్బరాన్ని గాలిలో వదిలిపెట్టి నా చేతులు పట్టుకుని అంది.

అలాంటి స్థితిలో మాటలు పెంచి లాభం లేదు. మౌనమే దానికి మందు.

''సరే యశో; వెళ్లినవెంటనే ఉత్తరం రాస్తాను,'' అన్నాను.

యశో పూర్తిగా రైలు కదిలేవరకూ వుండలేదు. గబగబా బయటకు వెళ్లిపోయింది.

బాబాయ్ పరిస్థితి ప్రమాదకరంగానే వుంది. జబ్బుతో పాటు ముసలితనం, ఉబ్బసం, ''కాలం సమీపించిందంటే అన్నీ వస్తాయి,'' అంది లలిత పిన్ని.

బాబాయ్ ముసలివాడని నాకంతవరకూ తెలియదు. యభై సంవత్సరాలు దాటివుండవు. ఈమె మాటలు వింటూంటే నిర్విచారంగా వున్నట్టనిపించేది. మనిషిని చూస్తే దానికి పూర్తి విరుద్దం. చాలా కాలం నుంచీ స్నానపానాదులున్నట్టు కనబడలేదు. ఎప్పుడూ బాబాయ్ మంచాన్ని అంటిపెట్టుకుని వుండేదట.

''బాబాయ్ చనిపోతూంటేకాని గుర్తురాలేదా రామం?," అంటూ బాబాయ్ నన్ను చూసి కండ్లనీళ్లు నింపుకున్నాడు.

"లేదు బాబాయ్ అలా అనకు, నువ్వు మళ్లీ కోలుకుంటావు. నీకు అనారోగ్యంగా వుందని తెలియలేదు. లేకపోతే ముందరే వచ్చేవాడిని,'' అన్నాను దుఃఖం ఆపుకుంటూ.

''అన్నయ్యా కాశీ నుంచి మాకు ఏమి తెచ్చావు?''అని మారం చేశారు పిల్లలంతా చూట్టూమూగి.

అంతలో పిన్ని హూంకరించేటప్పటికి నలుమూలలా పరుగెత్తారు.

బాబాయ్ రోగవివరాలూ, వైద్యమూ మొదలైనవన్నీ చెప్పడం అనవసరమనుకుంటాను. నేను వచ్చిన పదిరోజుల తర్వాత ఒక ఆదివారం తెల్లవారుజామున బాబాయ్, లలిత పిన్నిని దుఃఖసాగరంలో ముంచి పరలోకయాత్ర చేశాడు. చేయాల్సిన తతంగమంతా చేశాను. బాబాయ్ మరణవార్త విని, పిన్ని తలిదండ్రులు వచ్చారు. తాను బ్రతికుండగా కూతురు విధవవటం చూసి ఆ తల్లి హృద‌యం తరుక్కుపోయింది. దుఃఖం భరించలేక, భర్తను నిందించింది. రెండవ పెండ్లికి ఇవ్వద్దుంటూంటే ఇచ్చారు. దాని ఫలితమే ఇది,' అంది.

లలిత పిన్ని అక్కడే వుంది .'అమ్మా' అని ఒకసారి గట్టిగా అరచి 'నాన్నగారిని అలాంటి మాటలనకమ్మా. ఎవరి కర్మఫలం వారనుభవించాలి' అని ఏడుస్తూ తల్లి ఆలింగనంలో ఇమిడిపోయింది.

లలిత ముప్పది సంవత్సరాలు మించని అందమైన వనిత. బయటకు ఏవిధంగా కనబడినా మనస్సు మాత్రం మంచిది. జీవితంలో ఆమెకంటే ఎక్కువ సుఖాన్ని ఎవరూ అనుభవించలేదు. ప్రేమించే భర్త, దైవప్రసాదితులైన ముగ్గురు సుపుత్రులు తన కుటుంబమే స్వర్గమని భావించింది. భర్త మరణించిన మరుక్షణం నుంచీ జీవితమంతా చీకటిమయమయిపోయింది ఆమెకు. ఇద్దరు సవతి పిల్లలూ, ముగ్గురు తనవాళ్లు ఈమె భుజస్కందాలమీద పడ్డారు. వీరిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యతంతా ఈమెది. సవతి పిల్లలని ఆమె ఎన్నడూ విభేదం చూపించలేదు. నిజం చెప్పాలంటే వారిమీదే ఆమె అనురాగం వ్యక్తపరిచేది .

''ఈ ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచీ వీరిని నేను పెంచాను, మిగతావారంతా తర్వాత వచ్చారు. పుట్టుకలో ఏముంది?'' అనేది నవ్వుతూ,

ఒకరోజు, యశో ఇచ్చిన వుత్తరం జేబులో పెట్టుకుని సురేఖని కలుసుకోవటానికి బయలుదేరాను. వివాహమైన తర్వాత సురేఖ తాతగారిని తీసుకుని అత్తవారింటికి వెళ్లిపోయిందని తెలిసింది. అక్కడికీ బయలుదేరాను. ఇంటినిబట్టి, గుమ్మంవద్ద వున్న నౌకరునుబట్టి బాగా కలవారని గ్రహించాను.

''ఎవరు కావాలి?'' అడిగేడు బంట్రోతు.

''మధుగారున్నారా?'' అన్నాను.

''చిన్న బాబుగారు, విశాఖపట్నంలో వున్నారు,'' అన్నాడు వాడు, నన్ను ఒక సారి ఆపాదమస్తకం చూసి.

''పోనీ సురేఖ గారు వున్నారా?'' అన్నాను.

దానితో వాడి అనుమానం హెచ్చింది. కాస్త చిరాకుగా, ''ఇక్కడే వుండండి'' అని లోపలికి వెళ్లిపోయారు.

సురేఖ బయటికి వచ్చింది. సురేఖ కళ్లు తళుక్కుమని మెరిశాయి.

''బావగారూ'' అంది నా దగ్గరకు ఒక గంతువేసి నా చెయ్యి పట్టుకుని.

''మరదలా మీవారు విశాఖపట్నంలో వున్నారట,'' అన్నాను నవ్వుతూ.

"అవును, ఎంఎస్సీ చదువుతున్నారు, కానీ విశాఖపట్నంలో వున్నారని మీ కెలా తెలుసు?'' అంది,

"మీ బంట్రోతు చెప్పేడు?" అన్నాను.

''మీరు ఎప్పుడు వచ్చారు? అక్కయ్యని తీసుగులేదా? ఆమె ఎప్పుడూ నా మదిలో ప్రకాశిస్తుందిఅక్కయ్య అరే బయటే నించున్నారు. లోపలికి రండి,'' ప్రశ్నల వర్షంలో లోపలికి తీసుకెళ్లింది.

"మీ తాతగారిని పిలు," అన్నాను.

"తాతయ్య లేడు తీర్థయాత్రలకెళ్ళేడు," అంది.

''అయితే సురేఖా, మధు అక్కడ, నువ్వు ఇక్కడ, మధ్యన మేఘాలు ఏమిటి? నువ్వూ వెళ్లలేక పోయావా?'' అన్నాను కుర్చీలో కూర్చుంటూ.

''అది ఎలా వీలవుతుంది బావగారూ, నేను దగ్గరవుంటే బొత్తిగా చదవడు. ఇప్పటికీ పదిహేను రోజుల కొకసారి వస్తుంటారు. అది సరే అక్కయ్య ఎలావుందీ? అంతా చెప్పండి'' అంది సురేఖ సిగ్గుతో తలవంచుకుని.

''ఇది ముందర చదువుకో, ఏమైనా మిగిలితే గిగిలితే తర్వాత చెప్తాను,'' అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

సురేఖ ఎంతో ఆత్రుతతో ఉత్తరం చదువుకుంది. చాలా పెద్ద ఉత్తరంలావుంది. చదవటానికి చాలాకాలం పట్టింది. చదువుతూ చాలాసార్లు నాకేసి చూసి నవ్వింది.

''అక్కయ్య అంతా రాసింది బావగారూ, మీ గుట్టు బయటపడింది,'' అంది ఉత్తరం అంతా చదివి.

'ఇంటిగుట్టు లంకకు చేర్చకు, మధుకి తప్పఇంకెవరికి చెప్పకు,'' అన్నాను.

''సరేకాని ఆవిడ ఇక్కడికి రాకపోవడానికి కారణం మీరేనని రాసింది. ఎందుచేత తీసుకురాలేదు. చెప్పండి. అక్కయ్యను చూడాలని ఎంతో కోరికగా వుంది. ఆమె రుణం నేనెలా తీర్చుకోగలను?'' అంది.

''నేనెలా తీసుకురాగలను సురేఖా, సమాజం ద్రుష్టిలో మీ అక్కయ్య నాకేమీ కాదు. బాబాయ్ చనిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి మరీ అధ్వానంగా వుంది,'' అన్నాను

''అవును ఆయన చనిపోయారని విన్నాను, అక్కయ్య మిమ్మల్ని త్వరగా పంపించివేయమని రాసింది,'' అంది.

''త్వరగా ఎలా వెళ్లగలను సురేఖా? ఇప్పటివరకు అన్ని వ్యవహారాలు బాబాయ్ మీద పెట్టి వెళ్లాను. ఇప్పుడు ఎవరి మీద పెట్టగలను? ఏ పనీ స్వంతంగా చేయలేనని మీ అక్కయ్య అంటుంది. ఆమె దగ్గరవుంటే అన్నీ ఆవిడమీద పెట్టేవాడిని, ఇప్పుడెలాగ?'' అన్నాను.

అదంతా ఏకరువు పెట్టడం అనవసరం. అయినా అప్పుడప్పుడు మనస్సుని వేధించే ఆలోచనల్ని బయటికి పెడితే ఎంతోతేలికవుతుంది. సురేఖ చాలా శ్రద్ధతో అంతావింది.

''ఆ పరిస్థితి నేను గ్రహించాను, మీ గాధ ఎంత విషాదంగా వుంది,'' అని ఒక నిట్టూర్పు విడిచింది.

అంత చిన్నతనంలో యశో ప్రియసోదరి నా గురించి చింతించడం ఇష్టంలేకపోయింది. యశోని దుఃఖపెడుతున్నాను. అది చాలదా?

''అది సరే సురేఖా, ఆ రాత్రి జరిగిందంతా చాలా గమ్మత్తుగా వుందికదూ?'' అన్నాను.

''అలా నెమ్మదిగా అంటూన్నారేమిటి బావగారు? మరునాడు అదంతా ఒకకలలా అనిపించింది . తర్వాత కొన్నాళ్లకి అక్కయ్య వద్ద నుంచి డబ్బు వచ్చేటప్పటికి నా ఆశ్చర్యానికి, తాతయ్యసంతోషానికి మేరలేదు. ఒక రాత్రి పరిచయంతో అంత డబ్బు దేవతలు తప్ప ఎవరిస్తారు అనుకున్నాను. అక్కయ్య వివాహానికి రాకపోయేటప్పటికి నేను ఆ రాత్రి ఎంత దు.ఖించానో చెప్పలేను. దానితో సగం సంతోషం హరించిపోయింది. వివాహమంటపం దగ్గర కూడా నాకు కన్నీరు ఆగలేదు. మీరు మానవ మాత్రులు కారేమో అనే అనుమానం కలిగింది. తర్వాత చాలా కాలానికి అక్కయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికి అనుమానం పోయింది. ఆమె మానవులలోని దేవత అని తెలిసింది," ఏకరువు పెట్టింది సురేఖ.

''ఆగు సురేఖా; ఇంకా చాలు, కావాలంటే ఇదంతా ఉత్తరంలో రాసివ్వు. సురక్షితంగా నీ అక్కకి అందజేస్తాను. అదిసరే అయితే నాకు మీ ఆయనని చూపించవా?'' అన్నాను.

''ఎందుకు చూపించను బావగారూ? మీరు ఇంకా వుంటారుగా? ఇవాళే మథుకి టెలిగ్రాం ఇచ్చాను. వచ్చే వీక్ ఎండ్ కు రమ్మనమంటాను,'' అంది.

''అయితే ఇక నేను వెళ్తాను, ఎన్నాళ్లుంటానో చెప్పలేను. వెళ్లేముందు ఇంకోసారి కనబడుతాను,'' అని లేచాను.

''ఒకసారి ఏం బావా. రోజూరావాలి మీరు, లేకపోతే మీ ఇంటికి వస్తాను. అరె మరచి పోయాను, కాస్సేపాగండి ఇప్పుడు వస్తాను,'' అని లోపలికి వెళ్లిపోయింది.

కాఫీ తీసుకొచ్చింది. అడ్డుచెప్పకుండా తాగేశాను.

''మా అత్తమామలనీ చూడరా బావగారూ,'' అంది బయటకు వస్తూంటే సురేఖ.

"మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను,'' అన్నాను.

గుమ్మంవరకూవచ్చి సాగనంపింది.

''సురేఖా'' అని పిలిచాను బయటకు వచ్చేస్తూ వుంటే జ్ఞప్తికి వచ్చి.

ఆమె వెనుదిరిగి దగ్గరకు వచ్చింది.

''అన్నట్టు మాయింటికి వస్తానని చెప్పావు, ఇప్పుడు అలా చెయ్యటం మంచిది కాదు, వీలున్నప్పుడు నేనే వస్తుంటాను. మధు వస్తాడుగా,'' అన్నాను.

సురేఖ ముఖం దిగజారిపోయింది.

''ఈ లోపున ఇంకోసారి వస్తానులే సురేఖా. అలాంటి ముఖం మాత్రం పెట్టకు,'' అన్నాను.

సురేఖను త్వరలో కలవడానికి వీలుపడలేదు. అనేకవ్యహరాలు చూడాల్సివచ్చింది. స్వతహాగా సోమరిపోతును నేను. అయినా అప్పుడు గత్యంతరంలేక అన్ని పనులూ చేశాను. రోజువిడిచి రోజు యశోకి ఒక వుత్తరం రాసేవాడిని. ఆ పనిమట్టుకు క్రమం తప్పకుండా చేసేవాడిని, అలా చేస్తానని వాగ్దానం చేశాను. మాట తప్పితే ఆమె చాలా బాధపడుతుంది. బయలుదేరి వచ్చేసినా రావచ్చు. యశోని నేను పొందిన తర్వాత ఇదే మొదటి ఎడబాటు మాకు, ఇది ఆమె ఏవిధంగా సహిస్తోందో? ఆమె మనస్సంతా ఇక్కడే వుండి వుంటుంది. నా గురించీ, సురేఖ గురించీ ఆలోచిస్తూ కూర్చుని వుంటుంది. ఒంటరిగా ఆమె ఏమి చేస్తూ వుంటుంది? శరీరాలు దూరంగా వుంటే మనసులు దగ్గరకు వస్తాయంటారు. మా హృద‌యాలు ఎప్పుడో ఏకమయ్యాయి కానీ మా శరీరాలే దగ్గరగా ఉండికూడా విలీన మవలేదు. ఈ ఎడబాటువలన మాకు వేరే కలిగే నష్టమేమిటి?

అనుక్షణం యశో మనస్సులో మెదిలేది. కావలసింది లభించకపోయినా, వేళకి ఏమైనా జరుగకపోయినా నామనస్సడిగేది. 'యశో వుంటే ఇలా జరగనిచ్చునా?' అంటే నాకు లోపాలు కలిగాయని కాదు. లలిత పిన్ని నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. అయినా ప్రియురాలు యశోరాజ్యం వేరు, పిన్ని లలితాదేవి వేరు.

అన్నట్లుగానే ఆ ఆదివారం సురేఖ ఇంటికి వెళ్ళేను.

సురేఖ తంతి అందుకుని మధు మెయిల్లో వచ్చాడు. సురేఖ ఆ రాత్రి మధు ఆ వూరిలో అందరికన్న అందంగా వుంటాడని చెప్పింది. నేను అంతదూరం పోను, కాని ఈ యువకుడు అందంగానే వుంటాడు. సురేఖ మధు ఒకరి పక్కన ఒకరు నించుని నవ్వుతూంటే నామనస్సు సంతోషంతో నిండిపోయింది. ఎంత చక్కని జంట వారిది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు వీరు; నా అనుభవంలో ఇది వక్కటే ఇలా పరిణమించింది. వారి వివాహపు బాటలో ఆటంకాలు లేవు. మనస్పర్థలులేవు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. సురేఖకి సుజాతకీ ఎంత విభేదముంది. ఈ సుఖ పరిణామానికి బాధ్యులెవరు? యశో రాజ్య మంటే ఒక వుత్తమనారీమణి? కాని ఈ సుఖమే, ఈ దాంపత్య సౌఖ్యమే ఆమెకు లభ్యంకాలేదు, అందుచేతనే ఆమెను నాతో తీసుకరాలేక పోయాను. దీనికంతకీ కారకుడిని నేనే, నేనే.

''మమల్ని దీవించండి, బావగారూ,'' అంది సురేఖ మధుతో కలిసి నా కాళ్ళకి మొక్కబోతూ.

''అలాంటి పనులు చేయకు సురేఖా. నేనేమంత పెద్దవాడిని కాను. నన్ను అప్పుడే ముసలివానిని చెయ్యకండి,'' అన్నాను నా ఆలోచనలకు స్వస్తి పలుకుతూ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ.

''అలా అడ్డుపెట్టకండి బావగారూ. అక్కయ్యలేదు. ఇక మమ్మల్ని మీరైనా ఆశీర్వదించండి. వివాహ సమయంలో మాకిది లభించలేదు,'' అంది.

ఇక నేను అడ్డుచెప్పలేదు. మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకున్నాను. వీరిద్దరినైనాకష్టమూ దుఃఖమూ అనేవి అంటకుండా చూడమని.

''మీకు ఏ విధంగా కృత‌జ్ఞత వెల్లడించాలో తెలియటం లేదని సురేఖ చెప్పింది,'' అన్నాడు మధు.

''పొరబడుతున్నావు మధూ, నువ్వు నాక్కాదు ఈ సత్కారాలన్నీ చేయాల్సింది. ఆవిడ వేరొకచోటవుంది, మీ కృత‌జ్ఞతకి మీ నమస్కారాలకీ అర్హురాలు ఆమె,'' అన్నాను.

''అవును బావగారూ మీరు చెప్పింది నిజమే, మా అక్కయ్య నిజంగా పూజ్యురాలు, కాని ఆమెకు మీకంటే ఆప్తులు లేరు. ప్రాణం కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తూంది. అందుకని మీరు పూజ్యులే,'' అంది సురేఖ.

''సరే సురేఖా, అయితే అయ్యాను కాని ఆపనిమటుకు చెయ్యకు. కావాలంటే ఫోటో ఒకటి ఇస్తాను. దానికి చెయ్యండి,'' అన్నాను నవ్వుతూ.

''నిజమే బావగారూ. అక్కయ్య మీరు కలసివున్న చిత్రం ఒకటి ఇవ్వండి,'' అంది సురేఖ.

''వుంటే తప్పకుండా ఇద్దును, కాని మేమిద్దరమూ కలసివున్న చిత్రమేలేదు. చివరకు మీ అక్కయ్య ఫోటో కూడా లేదు నావద్ద," అన్నాను వాళ్లిద్దర 'తెల్ల' ముఖాలు చూస్తూ.

వాళ్ళతో కాసేపు కబుర్లాడి (అదృష్టవశాత్తు మధు తల్లితండ్రులు ఇంట్లోలేరు) పిన్నిఇంటికి చేరేను,

ఆ తరువాత సురేఖతో నా పరిచయం ఎక్కువైంది. వీలున్నప్పుడల్లా వాండ్ల ఇంటికి వెళ్లేవాడిని, అక్కచెల్లెళ్లు లేనికొరత సురేఖ ఆరోజుల్లో తీర్చింది. అది నాకొక కొత్త అనుభూతి. యశోలో, తల్లి, సోదరి, ప్రేయసి ఇవన్నీ మిళితమై వుండేవి. ఆమెకూడా దగ్గరవుంటే ఎంతో బాగుండును. చెల్లెలూ, మరిది తనను పువ్వులలో పెట్టి పూజిస్తుంటే ఆమె ఎంత సుఖించేదో? నేనెంత ఆనందించేవాడిని.

రాజమండ్రి వచ్చి ఒక నెల కావచ్చింది. లలితపిన్ని తలిదండ్రులు కూతురుతో అక్కడ వుండిపోవటానికి ఒప్పుకున్నారు. దానితో నామీద వున్న బరువు తీరింది. మిగతా సమస్యలు సులభంగానే పరిష్కారమవుతాయని ధైర్యం కలిగింది. మా ఇంటి అద్దె తిన్నగా కాశీ అందేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. భూముల మీద వచ్చే రాబడికి కూడా అదే ఏర్పాటు చేసుకున్నాను. పనులన్నీ అయిపోయిన మరునాడే బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. యశోకి తంతి ఇచ్చాను.

ఆరోజే నా ప్రయాణం. రైల్వేష్టేషన్లో ఎవరివద్దో ఒకరి నుంచీ నా తిరుగుళ్లలో కన్నీళ్లతో వీడ్కోలు తీసుకోటం నాకు పరిపాటి అయిపోయింది. హృద‌య విదారకమైన అనేక సంఘటనలకి అది రంగస్థలమైపోయింది. ఇలాంటి వాటితో నా హృద‌యం కరడుగట్టిపోయింది. సురేఖ ఇంకా లేతయవ్వనంలో వుంది. ఇప్పటివరకూ జీవితంలోని వెలుగు మాత్రమే చూసింది. అలాంటి స్థితిలో నాకు వీడ్కోలు చెప్పటానికి స్టేషన్ కు వచ్చింది. నేను వద్దనలేదు. ఇక రాజమండ్రితో చాలా వరకూ నా సంబంధము తీరిపోయింది. మరలా ఈమెను తిరిగి చూస్తాననే నమ్మకం లేదు. దాని గురించి నేనట్టే చింతించలేదు. సురేఖకి భవిష్యత్తులో కష్టాలు, కన్నీరు ఎదురు కాకూడదని వాంఛించాను. యశో సరళా, లఖియా, సుజాతా వీరందరికీ ఏవో దుఃఖ కారణాలున్నాయి. సురేఖ మాత్రమే ఇప్పటి వరకు ఈ దుఃఖాలలో చిక్కుకోలేదు. మునుముందర ఆమె బాటలో కూడా ముళ్లులేకుండా వుండాలి. అదే నా వాంఛ.

''ఈ నెల్లాళ్లూ అక్కయ్య మనతో వుంటే ఎంత బాగుండేది'' అంది సురేఖ తనలో తను అనుకున్నట్టుగా.

''ఎందుకు బాగుండదు సురేఖా. చాలా బాగుండేది,'' అన్నాను.

''అక్కయ్యని చూడాలని వుంది, బావగారూ,'' అంది.

''దానికి మీరు కాశీ రావాలి సురేఖా,'' అన్నాను.

''అది చాలా కాలం తర్వాత మాట,'' అంది సురేఖ దీర్ఘంగా నిట్టూర్చి.

''అక్కయ్యను మరచిపోవాలి సురేఖా. ఆమె నీకు అందుబాటులో లేదు. ఇక ముందు వుండ కపోవచ్చుకూడా. ఆమె నాకు చాలా అవసరం. ఇలాంటి వాటిని గురించి నీవు ఆలోచించకూడదు. ఇంకా చిన్నపిల్లవి. నీకు అన్నిటికన్నా మిన్నగా మధు వున్నాడు. ఈ వూరిలో అందరికంటే అందగాడు, అయినా నీ బావ ఎలా వుంటాడు సురేఖా ఎప్పుడు చెప్పలేదు,'' అన్నాను ఆమె భుజం మీద చెయ్యి పెట్టి.

"అక్కయ్యని అడిగి చెపుతా బావా," అన్న సురేఖ వణికే పెదవుల మీద చిరునవ్వు వెలసింది.

 

చాప్టర్ 33

 

ఒక నెల ఎడబాటు తర్వాత యశోని తిరిగి కలుసుకున్నాను. మనిషి ఎంతో చిక్కిపోయింది. ముఖం మీద అలసట, నీరసమూ స్పష్టంగా కనబడుతున్నాయి. చలికాలం అది. తను నా వులన్ కోటు పట్టుకుని, కాశ్మిర్ శాలువ కప్పుకున్నా, వణకుతూ, ప్లాటుఫారం మీద నా రాక కై ఎదురు చూస్తూంది. రైలు దిగిన వెంటనే నా కోటు ఇచ్చి వెంటనే తొడుక్కోమంది. టాక్సీలో ఇంటికి వెళ్తున్నాము ఒకరినొకరం హద్దుకు కూచుని.

''జబ్బుపడ్డావా అమ్మీ,'' అడిగాను తన చేయి తీసుగుని.

"లేదే, ఎందుకలా అడుగుతున్నారు?'' అంది నీరసంగా నవ్వుతూ.

''నీ వాలకం చూస్తే అలానే వుంది,'' అన్నాను రుగ్దకంఠంతో.

''ఇదంతా విరహం బాదల్ బాబూ. ఇక ఇప్పటి నుంచీ మిమ్మల్ని ఒక్కరినీ ఎక్కడికీ పంపించను. ఎడబాటంటే ఏమిటో తెలిసి వచ్చింది'' అంది హఠాత్తుగా ఒడిలో తల పెట్టి కళ్లు మూసుకుని.

''నేనెలా అనిపిస్తున్నాను,'' అన్నాను నా తల త్రిప్పి తన కళ్ళలోకి చూస్తూ

''మీరు ఏమీ మారలేదు, మునుపటి లాగే వున్నారు. నేను లేని లోటు మీకున్నట్లులేదు, '' అంది.

''అది కొంత మటుకు సురేఖ తీర్చింది అమ్మీ,'' అన్నాను.

''సురేఖ కొత్త కాపురమెలాగుంది?'' అంది.

''అన్యోన్య దంపతుల్లా ఉన్నారు, సురేఖ నాకుచెప్పగా మిగిలిన నీమీద ప్రేమను ఇందులో పొందు పరచిందను కుంటాను,'' అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

"ఇప్పుడు కాదు తర్వాత చదువుతాను, నన్ను ఇలాగే పడుకోనివ్వండి. ఈ నెల్లాళ్లూ ఈ సుఖం కోసమే పరితపించాను,'' నా ఒడిలో పడుకునే కళ్లు మూసుకుని అంది.

''నేను నీకు ఇంత అవసరమని ఎప్పుడూ చెప్పలేదేమి అమ్మీ? చెప్పివుంటే నిన్ను వదిలి వెళ్లేవాడిని కాను,'' శాలువ సరిగ్గా ఆప్యాయంగా కప్పి అన్నాను.

''అభిమానం అడ్డువచ్చింది. ఇక ఎన్నడూ ఈ పొరపాటు చెయ్యను,'' అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుని.

ఆమాటతో నా హృద‌యం పూర్తిగా కరిగిపోయింది.

"అలాగే చెయ్యి అమ్మీ, నేను ఎప్పుడూ ఇక నీ మాటకు అడ్డుచెప్పను,'' నెమ్మదిగా ఆమె తలను ముద్దుపెట్టుకుని అన్నాను,

''మీరు ఎప్పుడు అలాగే అంటారు,'' అంది మెల్లగా.

"కాదు అమ్మీ నిజం చెప్తున్నాను నమ్ము, నీ ప్రేమ విలువ ఇప్పుడు పూర్తిగా గ్రహించగలిగేను,'' అన్నాను.

యశో దీనికి జవాబివ్వలేదు. అలాగే కళ్లుమూసుకుని నా ఒడిలో వుండిపోయింది. కనుకొలుకుల్లో కొంత సేపటికి కన్నీటి బిందువులు కనబడ్డాయి. నెమ్మదిగా, మృదువుగా వాటిని తుడిచి వేశాను.

ఆ రేయి నెల తర్వాతి రేయి. నా నేత్రాలకు యశో అందం ఎన్నటికన్నా చందంగా ఉంది.

" నీకు గుర్తుందా అమ్మీ మన ఆంధ్ర ప్రాంతం చూడాలన్నావు," అన్నాను.

"మీరెల్లాగూ తేసుగెళ్ల లేదుగా, ఇప్పుడెందుకీ ఎందుకీ రెచ్చగొట్టడం," అంది బుగ్గ ముడిచి.

"ఎంత అందంగా ఉన్నవో వెళ్లి ఒమారు అడ్డం చూసుకో," అన్నాను చేయి చూపిస్తూ.

"మీ కళ్ళుండగా నాకు దాని అవసరమేమిటి చెప్పండి,' అంది నా పక్కన కూర్చో బోతూ.

"ఆగు కాస్త నా పెట్టేలోని ప్యాకెట్ తీసుకురా," అన్నాను.

"ఏం తెచుకున్నారేమిటి మీవూరినించి అంత శ్రద్ధగా," అంది ఆ ప్యాకెట్ అందిస్తూ.

"మన ఉప్పాడ చీరలు కట్టుకుని వాటి అందంపెంచుతావని ముచ్చటగామూడు చీరలు తెచ్చాను,"

అన్నాను ప్యాకెట్ విప్పుతూ.

"ఈ లెక్కన మీకు త్వరలో 'సరసశిఖామణి' బిరుదివ్వాల్సొస్తుందేమో," అంది వాట్లని పరిశీలిస్తూ.

"ఉండండి ఇపుడేవస్తా," అని మా మూడవగది లోకి అవి తీసుగెళ్లి, గచ్చకాయరంగు చీరలో తిరిగొచ్చింది యశో ఉల్లసంగా .

"ఎలావున్నాను,"అంది హొయలు మీరుతూ.

"నాకళ్ళు చెప్పటంలేదూ, చీర కెంత చంద మిచ్చావో!" అన్నాను ఆప్యాయంగా.

నాకు అప్పుడు అనిపించింది. యశో నా దగ్గరవుండటము ఎంత సహజమో, ఆమె అందంగా వుండటం కూడా అంత సహజమని తోచింది. అదేదో నా హక్కులాగ భావించేవాడిని.

''మీ అమ్మగారు అందంగా వుండేవారా అమ్మీ?'' అని అడిగాను

''ఏం అలా అడిగారు?'' అంది.

''ఏమో, అడగాలనిపించింది, చెప్పు,'' అన్నాను.

''అవును, మా అమ్మ చాలా అందంగా వుండేదని మా నాన్నగారు చెప్పేవారు. ఆవిడ పోలికలే నాకు వచ్చాయనేవారు, నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా చిన్నతనంలో తన్ని కోల్పోయాను,'' అంది.

''అది నిజమే అయివుండాలి. లేకపోతే ఇంత అందం నీకెక్కడి నుంచి వస్తుంది,'' అన్నాను.

''నేను అందంగావుంటానా?'' తన ముఖం వికసించగా అంది నవ్వుతూ అంది.

''నెమ్మదిగా అంటావేమిటి అమ్మీ?'' అన్నాను.

''కాస్త నా అందం వర్ణించ రాదూ, వింటాను, ''అంది పెదిమ నొక్కిపెట్టి నవ్వుతూ.

''నేనే కవినయితే నువ్వడగాలా భామినీ? అయినా నీకూ, ఇతర వన్నెలకూ వ్యత్యాస మేమనగా నీకు అందమైన కళ్లే కాదు, అందమైన ముక్కు కూడా వుంది. నూరు అందమైన నేత్రాలలో ఎదో ఒక ద్వయానికే సొంపయిన ముక్కుతో జతకట్టే యోగం ప్రాప్తిస్తుందన్న జేన్ ఆస్టిన్ మాటకి నీ ముఖం దర్పణం," అన్నాను

''మీకవిత్వం నా మనోరంజకం. నన్నుచూసిన ప్రతివారూ, నేను అందంగా వుంటానని అంటారు. కాని మీరెప్పుడూ ఇంతవరకూ అలా అనలేదు. చాలాసార్లు కోపం వచ్చిందికూడా మీ మీద. అయినా మీరు మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారేనా చెప్పండి,'' అంది సగర్వంగా.

''ముమ్మూర్తులా అలాగేవున్నావు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మరీ అందంగా వున్నావు. వయస్సుతో పాటు వయ్యారం, వంకరలూ వచ్చాయి,'' అన్నాను.

''చాల్లెండి, ఇంకవూరుకోండి, నాకు తెలుసు మీరు ఇతర పురుషుల్లా తళుకు వళుకుల శరీరాలకు లొంగిపోరని, అయినా ఆశ్చర్యపోయేదానిని నా అందం పట్ల మీరింత నిర్లక్ష్యంగా ఎలా వుండగలుగుతున్నారా అని," అంది.

''ఏమో తొలిచూపులోనే నీ అందం నన్ను అందాంధుడిని చేసిందేమో, అది నీకే తెలియాలి,'' అన్నాను.

ఆమాటతో యశోకి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. క్షణకాలంలో పచ్చటి ముఖం ఎర్రగా కుంకుమలా అయిపోయింది. మనస్సులోని భావమే ఆమె ముఖం మీద స్పష్టంగా కనబడింది. ముఖం క్రిందకి దించివేసుకుంది.

"అరె, ఇంత సిగ్గెందుకు యశో!" అన్నాను చేత్తో ఆమె ముఖం పైకెత్తి.

''నేను ఆనాడు చెప్పాను మీరు సువాసనగల పుష్పంలాంటివారని, అదే అందరినీ మీలో ఆకర్ఫిస్తుంది. మీకు అందం వుంది. కానీ అది ఎవరినీ మోసపుచ్చదు. మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే మీలోని ప్రత్యేకత కనబడిపోతుంది,'' అంది కళ్లు క్రిందికి దించుకునే.

"ఇది చెప్పడానికి ఇంత సిగ్గెందుకు అమ్మీ" అన్నాను.

ఆ సంభాషణ ఫలితంగా నేను ఒక విషయం గ్రహించాను. అదేమంటే ప్రతి స్త్రీ తాను అందంగా వున్నానని ఇతరులు - ముఖ్యంగా ఆమెని ప్రేమించేవారు చెప్పాలని కనీసం తనలో తనైనా అనుకుంటుంది. అపరిచితుడు చెప్పినా హృద‌యం ఒకసారి స్పందిస్తుంది. ప్రశంసనీయవాక్యాలు వీనులవిందుగా వుంటాయి. ప్రకృతిసిధ్దంగా పురుషుడు సౌందర్యాన్వేషి కాని స్త్రీ అలాకాదు, లేకపోతే వారిలో చాలా మంది యావజ్జీవ బ్రహ్మచారిణులుగా వుండిపోవాల్సి వస్తుంది. వనిత పురుషునిలో వాంఛించేది అందంకాదు; అతడి ఆదరణ, అనురాగము. యశో నాకు ఆ ఆశ్రమం నించి రాసిన ఉత్తరంలో కొన్నివాక్యాలు తలచుకున్నాను (నేను దాన్ని పూర్తిగా బట్టీ పట్టేను), ''ఎందుకొ అందరూ నా శరీరానికే ప్రాముఖ్యత ఇస్తారు. నేను శరీరాలోచలని కట్టిపెట్టాను. పరులు కొనియాడే నా ఈ శరీర సౌందర్యాన్ని కాపాడు కోవటానికి ఇరవైమూడు సంవత్సరాలు వ్యర్థం చేశానా అనిపిస్తుంది. ఇంకా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకు పోమంటారా? ఆ దశని నేను దాటేశాను.''

ఆరోజుల్లో ఆమె నిజంగా అలా చేసియుండవచ్చు. కాని అది ఆమెలో అణగారివుంది. అంతరించిపోలేదు. నేను ఆ కుటీరంలో అడుగుపెట్టిన క్షణంలోనే తిరిగి తలఎత్తింది. నేను ఆనాడు అనుకున్నది నిజమే. లఖియాలాగ యశోరాజ్యం ఎప్పుడూ సర్వసంగపరిత్యాగి కాదు. ఈమె ఎన్నడూ సన్యాసిని కాలేదు. లఖియాని ఆ దొంగ గురువు సుందరీ అని పేరుపెట్టి పిలిస్తే ఆమె సహించి వుండేది కాదు. అతగాడు ఆ విషయం గ్రహించి ఆమెకు రాణి అని పేరు పెట్టాడు. యశోని 'సుందరీ' అని పిలిస్తే ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఆమె అది నిష్కల్మషమైన హృద‌యంతో పెట్టిన పేరనుకున్నదనే విషయం నిస్సందేహమైంది. అయినా ఆమె సౌందర్యాన్ని ఇతరులు కొనియాడటం స్వాభావికమైనదని ఆమె అనుకొనివుంటుంది. అందుకనే ఆ పేరు ఆమెకి వచ్చిందని నాకు చెప్పింది. కాని ఆ పేరుపెట్టిన వ్యక్తి కల్మష హృద‌యుడని తెలసిన వెంటనే చెవులుమూసుకుని దానిని కాశీలో వదిలేసింది.

కాశీలో కాలం గడిచిపోతూంది మనస్సును బాధించే ఆలోచనలు కట్టిపెట్టాను. ఎందుకు వాటిని గురించి బాధపడాలి? దానివల్ల నాకు కలిగే లాభమేమిటి? జీవితంలో అంత సుఖం నేనెప్పుడూ అనుభవించలేదు. ప్రాణ సమానంగా ప్రేమించే ప్రేయసి, నిందారహితమైన మనస్సు, ఈ రెండూ ఎప్పుడూ నాకు ఇంతకు ముందు కలసిరాలేదు. ఇదివరకు ప్రవాహంలోపడి కొట్టుకుపోయేవాడిని కానీ ఇప్పుడు ప్రవాహంలో పయనించడం అభ్యసించాను. నేను వాంఛించిందంతా నాకు ఆమె వద్ద లభించింది. కాని ఆమె వాంఛించింది నానుండి ఆమెకు లభించలేదు. నేను తప్ప ఇంకెవరైనా ఆమెను సుఖపెట్టేవారు. అలాంటి స్త్రీకి ఏలోటు రానిచ్చివుండేవారు కారు. పిల్లలంటే యశోకి వున్న మమకారం నేను గ్రహించాను, సరళ కొడుకు 'రామం బాబూ' గురించి చాలాసార్లు మాట్లాడేది.

"సుశీకి మీకు వివాహం జరిగివుండినట్లైతే మీ మనుమడికి పెట్టుకోవల్సిన పేరది," అంది

''అప్పుడు బాదల్ బాబూ అనే పేరు నాకు వుండదు యశో. ఇంకెవరికో ఆపేరు పెట్టివుందువు,'' అన్నాను.

యశో వినివూరుకుంది, ఆమెవుద్దేశం నేను గ్రహించాను. ఆమె అన్న ఆ వాక్యంలో సుశీకి బదులు యశో అని చేరిస్తే సరిపోతుంది. అది ఆమె చెప్పలేక అలా అంది. కాని ఆమెలోని నిగ్రహశక్తి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచేది. లేకపోతే ఏం జరిగేదో?

 

చాప్టర్ 34

 

ఎదురుచూసిన శుభవార్త రానే వచ్చింది. లఖియా బెయిల్ హియరింగ్ వచ్చే గురువారం ఖాయమయిందని. యశో సంతోషానికి పట్ట్ట పగ్గాలులేవు, లేశమంత శంక అయినా లేదు న్యాయమూర్తి తీసుకోబోయే నిర్ణయంమీద, ఆమెకు రవిప్రకాష్ మాటలు బాగా వంటబట్టాయి.

మేమిద్దరం బుధవారంమధ్యాన్నం ముస్సోరి చేరి యధావిధిగా సరళ ఇంట్లోనే బసచేసాం. మరునాడు రాజేంద్రకు వీలులేకపోవడం వలన, సరళే మమల్ని డోన్ తీసుకెళ్లింది వాళ్ళ కారులో. సరళ కారు డ్రైవ్ చేస్తుంటే దారిపొడుగునా యశో, నేను వంతులేసుగుని 'రామంబాబు' తో ఆడుకుంటూ కోర్ట్ చేరిన విషయమే గుర్తించ లేదు.

"మీరో బుల్లిబాబుని కంటారా లేక నన్ను కని ఇమ్మంటారా?" అంది సరళ కంపౌండులో కారు పార్క్ చే స్తూ.

"మీరంటే వారి నుద్దేశించా లేక నన్నా," అంది యశో.

"ఇద్దరినీ," అంది సరళ.

"కనిపించడం అయన వంతు కనివ్వడం నా తంతు," అంది యశో నవ్వుతూ.

నాకు ఏమనాలో తెలియక నొరు మెదపలేదు.

"మవునం అర్ధాంగీకారం అంటారు, అవునా 'బాదల్ బాబు," అంది సరళ.

అప్పుడే కారు దిగి వచ్చిన రవిప్రకాష్ నన్నుఇరకాటం లోంచి తప్పించేడు.

కోర్ట్ లో అంతా రవిప్రకాష్ చెప్పినట్టే అయింది, ప్రభుత్వ ప్లీడర్ పెద్దగా పెదవి విప్పక పోగా లాఖియాను తక్షణం బెయిల్ మీద విడుదల చెయ్యాలని ఆదేశించడమేగాక, గురువుగారి మీద తాను మోపిన మానభంగ అభియోగం మూడు నెలల్లో పరిశీలించి కోర్టుకు తెలియపరచాలని పోలీసులను ఆగ్రహించారా న్యాయమూర్తి.

కోర్ట్ హాల్ బయటకొచ్చినతరువాత, యశో, సరళ, రవిప్రకాష్ని కౌగలించుకున్నతపని చేశారు.

కొంత సేపటికి రవిప్రకాష్కి కోర్టు ఆర్డర్ చేజిక్కగా, అందరం డూన్ జైలు చేరాము లాఖియాని స్వాగతించడానికి , కానీ రాబోయే సెంటిమెంటల్ తుఫానులో తనెందు చిక్కుకోడం అన్నట్లు రవిప్రకాష్ వార్డెన్ రూమ్ లోనే ఉండిపోయాడు.

మేమంతా గుమ్మంవద్ద నుంచుని పొడుగాటి ఆదారిని అవలోకించాము. లఖియా మలుపుతిరిగి మాకు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె పక్కన పోలీసువాడు లేడు. చేతిలో ఒక చిన్న మూట పట్టుకుని ఒంటరిగానడచివస్తూంది. మావద్దకు రాగానే ముందస్తుగా సరళ కొడుకుని ముద్దాడి, నాకేసి చూస్తూ, అంది, "పేరుకు తగ్గ పెద్దమనిషివి అవ్వరా."

తరువాత, సరళ, యశోల ఆలింగనలలో మునిగి, తేలి, నాదరి చేరి, పాదాభివందనంచేసింది.

'ఇదేమి బాగా లేదు లఖియా," అన్నాను తన్ను లేవదీస్తూ.

"రామంబాబు, ఇంతకంటే విలువైన గురుదక్షిణ నేనివ్వలేను, దయవుంచి స్వీకరించండి," అంది.

"సదా సుఖీభవః లఖియా," అన్నాను తన తలపై నా చెయ్యి ఉంచి.

తరువాత అందరం రవిప్రకాష్ని కలసినప్పుడు నేను లఖియా తో "ఈయన నాగురువు, నీ దైవం" అంటే "నాకు తెలుసు" అని ఆయన కాళ్ళకు కూడా మొక్కింది.

"కంగ్రాట్స్ లఖియా, నేచెప్పేనుగా మన కేసుకి ధోకా లేదని. నువ్వు తిరిగి ఈ దరిదాపుల్లోకి రానవసరం ఉండదని. కానీ ఈ వ్యవహారం తేలేవరకు నువ్వు ముస్సోరిలోనే ఉండాలి. దానికి నేను జమానతు యిచ్చాను," అన్నాడు రవిప్రకాష్ లాఖియాను లేవదీసి.

"ఇప్పుడు తనని కాశీ తీసుగెళదామనుకుంటున్నామే," అంది యశో.

"పది పదిరోజులైతే నేను పోలీసుస్టేషన్ లో మేనేజ్ చేస్తాను," అన్నాడు రవిప్రకాష్.

"వారం పది రోజుల్లో వచేస్తాలెండి," అంది లఖియా.

"వెల్కమ్," అన్నాడు రవిప్రకాష్

రవిప్రకాష్తో మాటా మంచికీ నే నాయన కారులో చేరగా, సరళ బాబుని తీసుకుని, యశో, లఖియాలతో తన కారు ఎక్కింది.

దారి పొడుగునా, తను లఖియాతో జరిపిన సంప్రదింపులు, ఆమెలో వస్తున్న చైతన్యం గురించి మాట్లాడిన విధానం రవిప్రకాష్ చెప్తుంటే నాకు వింతగా అనిపించింది.

కాశీకి బయలుదేరే ముందు యశో, నేను ముస్సోరీలో వారం రోజులున్నాము. రవిప్రకాష్ ప్రతి సాయంత్రంవచ్చి , సరళ బలవంతాన భోజనంచేసే వెళ్ళేవాడు. అతను లాఖియామీద చూపుతున్న శ్రద్ధాసక్తులు మేమందరం గమనించాము, లాఖియాతోసహా. నాకుమాత్రం తానేమీ పెద్దగా ఇబ్బంది పడుతున్నట్లనిపించలేదు.

మాతో సరళ కూడా బయలుదేరింది తన 'రామంబాబు' తో సహా, కాని రాజేంద్ర మాతో రావడానికి అంత సుముఖత చూపలేదు, "పనివుండి రాలేనన్నాడు".

అలా మొదలయింది కాశీకి మా తిరుగు ప్రయాణం, రాజేంద్ర వీడ్కోలుతో. సరళ తెచ్చిన కొత్త పేకలతో ఆ రైలు డిబ్బాలో, నలుగురం రమ్మీ ఆడ్డం మొదలెట్టేము ఆడవారి ఛలోక్తులతో. లఖియా తను నెగ్గినప్పుడు పొందిన సంతృప్తిని నే నామెలో ఇదివర కెన్నడు చూడలేదు. లఖియాలోని కోత్తదనం నన్నాశ్చర్యపరచింది. అదే నేనామెతో వ్యక్తపరిస్తే నవ్వి ఉరుకొంది. కొంతసేపటికి బాబు పేచీ మా ఆట కట్టించింది.

అప్పుడు సరళ బాబుని ఊరబెడుతుంటే, కిటికీ పక్కన కూర్చున్న లఖియా, బయటకు చూస్తూ వుంది, ఆలోచనా దృష్టితో.

"ఏమాలోచిస్తున్నావు లఖియా?" అన్నాను, చూసి చూసి.

"జీవితం ఎలా జీవించడమా అని," అంది తలా తిప్పకుండానే.

"మేమందరం ఉన్నామని మర్చి పోయావా?" అన్నాను బాధతో.

"కొత్త జీవితం మొదలెట్టడానికి మీ నలుగురి సహాయం కోరడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నాను కాని నేనాలోచిస్తుంది తరువాత జీవితం ఎలా జీవించడమా అని," అంది నాకేసిచూస్తూ.

"కొంచం అర్ధమయ్యేలాచెప్పు లఖియా," అన్నాను.

"ఎలాగైతే జన్మనిచ్చినవారి సంరక్షణ లేనీదే ఏ శిశువు బతికి బట్టకట్ట లేదో అలాగే నా కొత్త జీవన నాందికి ఎవరో ఒకరి సహయం కావాలి. నా రూపం, వయసు అది నాకు లబ్ధిపరచ గలదు కానీ నేను అందుకు నా సర్వస్వాన్ని ఫణంగా పెట్టాలి. ఎలాగయితే తమ సంతానాన్ని బాల్య దశలో తలితండ్రులు ఫలాపేక్ష లేక పెంచుతారో అలాగే మీనలుగురు నా నవ్య జీవినా రంభ అధ్యాయానికి శ్రీకారం చుడతారని నా నమ్మకం. అలాగే, ఎదిగిన పిల్లలు వారి పెద్దల ఋణం తీర్చుకున్నట్లు, నేనూ ఓనాడు నాధర్మం పాటించగలనని నా విశ్వాసం. మీరు చేయగల ధన సహాయంతో, నేనేదో జీవనోపాధి కల్పించుకుని, నా జీవితం నన్నెలా నడుపుతుందో చూస్తాను," అంది లఖియా సాలోచనగా.

"నువ్వు చెప్పిందేమీ కాదనము కానీ అదేదో మా దగ్గరుండే చేసుకోవచ్చుగా?" అన్నాను

"అదెలా సాధ్యమో ఆలోచించి చెప్పండి, తప్పక వుంటాను," అంది లఖియా.

యశో, సరళ, నేను; ఒకరి మొహాలు ఒకరంచోసుగున్నాము.

"ఇంతలో ఎంత ఎదిగావు లఖియా," అంది సరళ ఆఖరికి.

"నేనేదగలేదు సరళా, ఎదిగిపించారు, రామం బాబు నార వేసి, రవిగారు నీరు పోసి," అంది లఖియా క్తుతజ్ఞతాభరిత నేత్రాలతో.

ఆఖరికి కాశీ చేరి మా ఇంటికి వచ్చిన మొదటి అతిథులతో ఖాళీగా పడివున్న మూడవ గదిని ఉపయోగబరచాము. నేనదేమాటంటే సరళ నవ్వుతూ అంది యశో తో,

"మా రామం బాబు, మీ రామం బాబు ఇంట అడుగుపెట్టిన వేళావిశేషం వల్ల త్వరలోనీకడుపు పండుతుందిలే."

"తధాస్తు," అంది లఖియా యశోని కౌగలించుకుని.

మూడురోజులు కాశీ చుట్టుముట్టి, సారనాధ్ పై దండయాత్రకు వెళ్లాం. అప్పటివరకు, అయిదుమైళ్ల దూరంలో వున్న అక్కడికి నేను వెళ్లలేదు, యశో ఇంతకుముందు ఒకసారి ఎవరితోనో వెళ్లి వచ్చింది.

మేమంతా అక్కడి బుద్ధుని విగ్రహాన్ని తదేకంగా చూస్తూవున్నాము. ఒక పక్క లఖియా మరో పక్క యశో తలవంచుకుని వున్నారు. బుద్ధుని ముఖంలోంచి వుట్టిపడే శాంతం, ప్రశాంతతా లఖియా నిమీలిత నేత్రాలలో నాకు కనబడ్డాయి. ఎప్పుడూలేంది సరళ కళ్లుమూసుకుని మౌనంగావుంది.

నాకు ఆ దొంగ గురువు తనను ఆనాడు గౌతమబుద్ధునితో పోల్చుకున్న విషయం జ్ఞాప‌కం వచ్చింది. ఆరోజు నేను తన్ని ధిక్కరిస్తే యశోకి ఎంతో కోపం వచ్చింది. కానీ చివరకు ఇలాగ అవుతుందని ఎవరనుకున్నారు? నన్నునేనపుకోలేక అదేమాట అంటే, కలవపువ్వు లాంటి ఆ కళ్లతో నా కళ్లు వొకసారి చూసి క్రిందికి దించుకుంది. దాని అర్ధం ''ఈ గాయంతో ఇంకా నేను బాధపడుతున్నాను బాదల్ బాబూ. మీరు నాకు ఇంకా అది ఎందుకు జ్ఞాప్తికి తెస్తారు'' అని నేను గ్రహించాను .

"అనాలోచితంగా పుండ్ల మీద కారంచల్లినందుకు ఈ క్షంతవ్యుడ్ని క్షమించండి," అన్నాను లాఖియాను యశోను ఉద్దే శించి.

యశో క్షమా వీక్షణం తరువాత లఖియా తన జ్ఞాన నేత్రం విప్పిండి .

"దుష్టుడికి ఇతరుల నిస్సహాయత అగ్నికి ఆజ్యం లాంటి దైతే, సౌమ్యుడుకి తన లఖియాత అంధుడి చేతి దిక్సూచి లాంటిది. కరువులో చెట్టు నరికి కలప చేయడమే లఖియాత, నిఘంటువులో నాపేరు నేనే చేర్చుకున్నాననే దోషం సరి. నాభర్త అప్పులు తీర్చడం భార్యగా నావ్యక్తిగత ధర్మం కానీ, ఉన్నఇల్లు తెగనమ్మి, నిల్వ నీడ లేకుండా చేసుకోవడం నామూర్ఖత్వం లేక రామాంబాబూ, మీరన్నట్లు, 'నా అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవట మనే అహంకారం' అయివుండలి. నేనేగనక ఆ ఇల్లు నిలబెట్టుకొని అందులో కొంత భాగం అద్దెకిచ్చి, ఎదో చిన్న ఉద్యోగమమో లేక వ్యాపారమో చేసుకుంటూ అప్పులు తీర్చి ఉంటే, ఇహం పరం రెండూ దక్కేవి. కానీ నా లఖియాతతో రోడ్డున పడి, నన్ను నేనే నిస్సహాయురాలిని చేసుకుని నాస్వయంకృతాపరాధంతో నేనే నన్ను బలిపశువుని చేసుకున్నాను. ఈ తప్పు మరెప్పుడు చెయ్యను, అందుకు రామం బాబూ, మీకు, రవిగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను," అంది లఖియా మమ్మల్నందరిని అవాక్కుపరచేలా.

లఖియా, సరళ, బాబు మా ఇంటి కొచ్చి వారం రోజులయింది. ఆరోజే ముస్సోరికి వాళ్ల తిరుగు ప్రయాణం.

యశో,నేనువారిని సాగనంపడానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళేము. కొంత సేపటికి వాళ్ళుఎక్కేవలసిన ట్రైన్ ప్లాట్ఫారం కి చేరింది. నేను వారి సామాను తలుపుపక్కనున్న కంపార్టుమెంటులో సద్దిపెట్టాను. వాళ్లిద్దరూ చెరో కిటికీ దగ్గర కూర్చుండగా, మేమిద్దరమూ ప్లాట్ఫారం మీద వారి దగ్గర నిలుచుని ఉన్నాము. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కానీ నేను మౌనాం వహించాను.

ఇంతలో గార్డ్ పచ్చజండా చుపించగా లఖియా కిటికీలోంచి చెయ్యి వూపు తోంది. నాకెందుకో ఇంక ఆమెను తిరిగి చూడలేనేమో ననే భావం హఠాత్తుగా కలిగింది. అప్పటికే రైలు కదలిపోతూంది. నేనేమి చేస్తున్నానో నాకే తెలియలేదు. రైలు వెంట పరుగెడుతూ పుట్ బోర్డు ఎక్కి అప్రయత్నంగా లఖియావైపు వంగి అన్నాను, 'జీవితంలో నీకంటే అధికంగా ఎవరినీ ప్రేమించలేదు లఖియా.''

లఖియా ముఖం మీద అత్యంత ఆవేదనా ఆతురతా కనబడ్డాయి.

ఈలోపుగా రైలుప్లాటుఫారం పూర్తిగా దాటి పోయింది. అది చూసి నేను దిగటానికి ప్రయత్నించాను.

''వద్దు రాంబాబూ దిగకండి'' అంది లఖియా కంగారుపడుతూ.

ఆమెమాటలు నేను వినిపించుకో లేదు. వెనక్కోసారి తిరిగిచూసాను యశో కోసం, తను రైలుపట్టాల పక్కన పరిగెట్టు కొస్తూ కనబడింది. నాకంగారు మిన్ను ముట్టి వెంటనే కిందకి ఉరికాను. అంతే,తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.

 

చాప్టర్ 35

 

కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రి మంచం మీద పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళ మంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు చూసేక నా శరీరంలో నీరసం ఇంకా పెరిగిందనిపించింది .

''మీ ప్రయాణం ఆపేశాను కదూ,'' అన్నాను.

అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. క్షణకాలం అంతా నివ్వెరపోయారు. యశో గబగబా లేచివచ్చి నాగుండెల మీద వెక్కివెక్కి ఏడుస్తూ పడిపోయింది. అంత దుఃఖాన్ని నేనింతవరకూ ఎప్పుడూ చూడలేదు.

యశో తల హృద‌యం మీద వుండడంతో ఆయాసం కూడా పుట్టుకు వచ్చింది.

''కాస్త తలతియ్యి యశో ఆయాసంగావుంది, ఎందుకు చెప్పు ఇంత ఏడుపు,'' అన్నాను.

లఖియా చటుక్కున లేచినించుని యశోని లేవదీసింది. యశో ముఖం చూస్తే నాకెంతో భయం వేసింది. ఎంత పాలిపోయింది? కుడి కాలిలో శూలంపెట్టి పొడిచినట్టయింది. అప్పుడు భయంకరమైన ఆలోచన కలుగగా కాళ్లమీద కప్పివున్న దుప్పటి జరిపి చూశాను. రెండుకాళ్లచుట్టూ కట్లున్నాయి. కుడికాలి క్రింద భాగమంతా ఏదో తెల్లగా వుంది. అది కదపటానికి ప్రయత్నించాను. ఇసుమంతైనా అది నేను చెప్పినట్లు వినలేదు అది ప్లాస్టర్ చేసారని గ్రహించాను. ఎడమకాలు కదిపి చూస్తే కొంచెం కదిలింది..

''నా కాలుకి ఏమైంది?'' అని గట్టిగా అరచాను.

తలకు కూడా కట్టుకట్టివుందని అప్పుడే గ్రహించాను. మరుక్షణంలో స్పృహ‌తప్పి పోయింది.

తిరిగి స్ప్రుహ వచ్చేక నాపక్కన యశోనాకేసి దీనంగా చుస్తూ కనబడింది అప్రయత్నంగా ఆమె వైపుకు నా చేయి చాచేను; దాన్ని కళ్ల కద్దుకుంటూ తన కన్నీటితో పావనం చేస్తుండగా నాఆ లోచన్లు పరిపరి విధాలుగా సాగాయి.

నేను కుంటివాడినై పోయానా? చిన్నతనంలో ఒకసారి మద్రాసులో ఒక కుంటివానిని గేలిచేస్తే చిన్నపిల్లయినా సుశీ మందలించింది, "తప్పు రామం పాపం వాడేమిచేయగలడు చెప్పు? నవ్వకూడదు.'' ఇప్పుడు నా పరిస్థితీ అదే . ఒకవేళ సుశీ గనుక జీవించివుంటే ఏమనివుండును. స్వర్గంలో సుఖంగా వుంది. ఎవరికి తెలుసు బహుశా ఇదంతా యశో మంచికే జరిగిందేమో. మిసమిసలాడుతున్న యవ్వనంలో వున్న ఈ అందాలభరణి దేనికీ కొరగాని అంగవికలుడైన నన్నెందుకు భరించాలి? ఆమెకు నా మీద వున్న ఆశలన్నీ దానితో నేలకూలిపోయివుంటాయి. తను చేసిన పొరపాటు ఈ పాటికి గ్రహించివుంటుంది.

"ఎలావుంది?'' యశో ఆప్యాయత నాఆలోచనలకి అడ్డకట్టు వేసింది.

"నన్ను క్షమించగలవా అమ్మీ?" అన్నాను నా కళ్ళు నూతులవగా.

"చూడండి ఈనాడు మీరు నాకొక మాటివ్వాలి. దీనిని గురించి మీరేమీ చింతించకండి. అసలు ఆలోచించనేకూడదు. మీ ఎడమ కాలుకేమి ధోకాలేదనీ, కుడికాలు కూడా నిమ్మదిగా దారిలో పడుతుందని డాక్టర్ గారు భరోసా ఇచ్చారు నాకు. అప్పటివరకు మీ ఒక కాలుకి బదులు నా రెండు కాళ్లు, రెండు చేతులూ వున్నాయి. మీకాలు ఎలా వాడుకుంటారో నన్నుకూడా అలా వాడుకోండి. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మీదికానిది నావద్ద ఏమీలేదని, మీకు నేనేమీ లోటురానీయను, నా జీవితంలో నాకిక వేరే పనిలేదు,'' అంది నాజుట్టును చేత్తో సరిచేస్తూ

''నువ్వేంచెపితే అదే చేస్తాను యశో అని నేను మాట ఇవ్వలేను , నన్ను మిధ్యావాదిని కూడా చేయకు, అది నా శక్యంలో లేదు. నీ జీవితంలో కూడా అన్నీ కష్టాలే రాసివున్నాయి. అమ్మీ. నీవు నాతో ఏమి సుఖపడగలవు చెప్పు?'' అన్నాను.

''ఎందుకు పడలేను చెప్పండి, మీలో ఇప్పుడు వచ్చిన లోటేమిటి? పూర్వం కంటె ఇప్పుడు నామీద కాస్త ఎక్కువగా ఆధారపడతారు. అంతేగా? అదీ మంచిదేగా, పూర్వంకంటే మీ అనురాగము, అభిమానము నాకు ఇంకా ఎక్కువగా లభిస్తాయి. నాకు అంతకంటే ఏంకావాలి? '' అంది.

''నేను నీ జీవితంలో ప్రవేశించకపోతే ఎంత బావుండును అమ్మీ. ఎవరినో పెళ్లిచేసుకుని పిల్లలతో సుఖంగా వుండివుందువు,'' అన్నాను.

ఆ ధోరణితోనే. వెచ్చటి రెండు కన్నీటిబొట్లు నుదిటి మీద పడ్డాయి.

''నన్ను కష్టపెట్టాలని కోరికగావుంటే అలా అనండి, ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు మీరు ఎందుకు నమ్మరు చెప్పండి,'' అంది.

''నమ్మకపోవటం కాదు అమ్మీ. నిన్ను చూస్తూవుంటే నాకు అనిపిస్తూంటుంది. ఇంత అందమూ, బూడిదలో పోసిన పన్నీరై పోయిందిగదా అని, అందుకు బాధగావుంటుంది, '' అన్నాను.

''బాదల్ బాబు బూడిదలో ఎందుకు పోస్తారు లేక అందరిమీద ఎందుకు జల్లుతారు? వారి పన్నీరును వారి దగ్గరే దాచుకున్నారు,'' అంది యశో మెల్లగా నవ్వుతూ.

నేనేమీ జవాబివ్వలేదు, అంగవికలుడననే ఆలోచనపోలేదు. కాలుకేసి చూసినప్పుడల్లా చురుక్కుమని జ్ఞప్తికి వచ్చేది.

''నేనొకప్పుడు ఉద్యోగం చేస్తానంటే వద్దన్నావు. అమ్మీ ఇక నీకా భయం అక్కర్లేదే,'' అన్నాను.

''అవును, అవసరం వస్తే గడించి పెడ్తాను, అందులో తప్పేముంది. కాని ఆ అవకాశం రాదనే నా నమ్మకం. మీ ఇంటి అద్దే భూముల మీద శిస్తు కలిసి మన ఇద్దరికి గడిచిపోతూంది. నా డబ్బు ఖర్చుచేయటమేలేదు. ఆ తర్వాత ఇంకా నగలున్నాయి. ఇవన్నీ అయిపోతే నా చేతులున్నాయి,'' అంది.

''నీకొకమాట చెప్పాలి అమ్మీ, రైలు వెంట పరుగెడుతూ లఖియాతో నేను ఏమన్నానో నీకు తెలుసా?'' అన్నాను యశో కుడిచెయ్యి నా రెండు చేతుల్లోకి తీసుకుని.

''తెలుసును, లఖియా చెప్పింది,'' అంది.

లఖియా ఆవిషయం చెప్పిందని విని కాస్త ఆశ్చర్యపోయాను సరళ కూడా విందని జ్ఞప్తికి వచ్చి సిగ్గుపడ్డాను.

''విని ఏమనుకున్నావు, బాధపడ్డావా?'' అడిగాను.

''బాధపడటానికి ఏముంది చెప్పండి. మిమ్మల్ని గురించి మీ కంటె బాగా నాకే తెలుసు, ఆ విషయం నాకు చాలా కాలం పట్టి తెలుసు,'' అంది గోముగా.

''ఏమి తెలుసు అమ్మీ,' అన్నాను కాస్త భయపడుతూ.

''మీ మనస్సు మీకే తెలియదు, మీలో నేనంటే అమితమైన కృత‌జ్ఞత, లఖియా అంటే అమితమైన జాలి వున్నాయి. జీవితంలో మీరు ఎవరినైనా నిజంగాప్రేమించివుంటే ఆమె సుశీ మాత్రమే,'' అంది.

"అమ్మీ నువ్వు చెప్పిందంతా నేను లఖియాకి 'ఐ లవ్ యూ' చెప్పేరవరకు ముమ్మాటికీ నిజం కానీ తరువాత కాదు," అన్నాను యశోచేయి తీసుకుంటూ.

"అర్ధంకాలేదు," అంది ఆశా ఆశ్చర్య మిళిత వదనంతో.

"ఆ మరుక్షణం నిన్నుతలచుకొని మెడతిప్పి చూశాను నీకోసం. రైలు పట్టాల పక్క నువ్వా వంగ పండు రంగు చీరలో నాకోసం పరుగెత్తుకొస్తుంటే, ఒకవైపు లాఖియా "వద్దు రామం బాబూ దిగకండి'' అని నన్ను అభ్యర్దిస్తున్నా, నా ప్రేమ నీ వైపు పరవళ్లు తీసి నన్నా ట్రైన్ లోంచి దూకించింది. లేక పోతే, దానిలో ఎక్కి, చైన్ లాగడమో లేక పక్కస్టేషన్లో దిగడమో ఎదో చేసివాడిని. ఇప్పు డర్దమైయిందా అమ్మీ ?"

యశో ఆనందభాష్పాలతో నా హృదయం అంతా నిండిపోయింది.

"నీకు నాకూ తెలియని ఈ వాస్తవం నీ మనసు మొదటే గ్రహించి నీ త్యాగానికి చేయూత నిచ్చింది,"

అన్నాను నా ఆనందభాష్పాలు జత చేస్తూ.

''ఇదంతా త్యాగం కాదు, బాదల్ బాబూ, స్వలాభం కోసమే ఇలా చేస్తున్నాను. మీరులేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను,'' అంది యశో కళ్ళు తుడుచుకుంటూ.

నామీద ఆమెకు వున్న ఈ మమతని ఇంతచక్కగా ఎప్పుడూ ఆమె విప్పిచెప్పలేదు. ఆనాడు ఆమె హృద‌యం విప్పి నా ముందర పెట్టింది. లోపల ఏముందోనని కుతూహలంగా తొంగిచూశాను. బాదల్ బాబూ అనే ఒక్క మాట రాసివుంది. పొంగిపొర్లే ఆ నిర్మల ప్రేమను చూస్తూంటే హృద‌యమంతా అనురాగంతో నిండిపోయింది.

''నీకు నేను తిరిగి ఏమీ ఇవ్వలేనా అమ్మీ? ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం నీకు చేతగాదా?'' అన్నాను.

''ఇవ్వగలిగిందంతా ఇస్తున్నారు. నేను అంతకంటె ఏమీ ఆశించను. ఏమీ కోరుకోను'' అంది.

సరిగ్గా అదే సమయానికి డాక్టర్ స్వరూప్, సిస్టర్ సుగుణ తలుపుతోసుకుని లోపలికి వచ్చారు.

''ఎలావున్నావు రామంబాబూ?'' అన్నారు డాక్టర్ స్వరూప్ దగ్గరకు వచ్చి.

''చాలా కులాసాగావుంది డాక్టర్ గారు. అంతా మీదయ,'' అన్నాను.

''నా దయకాదు మిస్టర్ మీ మంచం మీద కూర్చున్న అవిడది. ఈ పది రోజులూ ఈవిడ మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని వుండకపోతే ఏమయివుండునో చెప్పలేం. ముఖ్యంగా మొదటి నాలుగు రాత్రులూ చాలా కష్టపడ్డారు. విపరీతమైన జ్వరం, వొళ్లు తెలియని ప్రేలాపన గిలగిలా కొట్టుకోవడం ఇవన్నీ చూస్తూంటే మా సిస్టర్స్ కే భయమేసింది. ఇంతనిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు,'' అన్నారు ఆయన.

"నేను కూడా మీ కోసం కష్టపడ్డాను. డాక్టరు గారి మాటలువిని నన్ను మరచిపోకండి," అంది సిస్టర్ సుగుణ నా బిపి చూస్తూ.

"ఆయనకు చెల్లి లేని లోటు తీర్చవని ఎప్పుడో చెప్పాను లే," అంది యశో నవ్వుతూ.

"ఇప్పట్నించి నీకు రాఖీ ఖర్చు పెంచింది నా యశో," అన్నాను

"ఊరికే కట్టించు కుందా మనుకుంటున్నారేమో, అదేంకుదరదు," అంది తను నవ్వుతూ.

 

చాప్టర్ 36

 

యశో వెళ్లిన కొంతసేపటికి సరళ వచ్చి నా మంచం దగ్గర కుర్చీలో కూర్చుంది. ముఖమంతా వుద్రేక పూరితంగా వుంది. అభిమానంతోటి, నిర్లక్ష్యంతోటి, కోపంతో వణికిపోతూ ఏమైనా సరే ఈ అవకాశం జారవిడవకూడదని నిశ్చయించుకున్నట్లు కనబడింది. పరిణామాలతో నిమిత్తం లేదనే మొండి ధైర్యం ఆమెలో ప్రవేశించినట్లు కనబడింది. అలాంటిఘడియలు ప్రతివారికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి.

''భోజనం చేశావా సరళా?'' అన్నాను.

'నా శ్రవణాలకి మీ నిరర్ధక సంభాషణ తప్ప వేరే ప్రాప్తి లేదా రామంబాబూ,'' అంది నా కళ్లలోకి ఒకసారి చూసింది.

'అల్లా అనడం నీకు తగదు సరళా, యశోకి, లఖియాకి ఆప్తులు ఇంకెవరూ లేరు. నీకు ప్రేమించాల్సిన భర్త, లాలించాల్సిన కొడుకూ వున్నారు'' అన్నాను.

ఆ ఆఖరి వాక్యం నోరు జారి అన్నాను. అందులో వ్యంగ్యం లేదనుకుంటాను, అయినా అది సరళ కోపాన్ని ప్రేరేపించింది.

''అవును రామంబాబూ. అదే నేను చేసిన పాపం, ఘోర పాపం. సమాజం స్త్రీకి ఎంత అన్యాయం చేస్తుంది. ఒకసారి నేరక చేసిన తప్పుకి జీవితాంతం వరకూ బాధపడాల్సిందేనా. ఒకసారి వుచ్చులో పడితే అందులోంచి కాళ్లు చేతులూ కాకపోయినా కనీసం తల అయినా బయటపెట్టి తొంగి చూడగూడదా? ఇక దీనికి గత్యంతరం లేదా?'' అంది ఆవేశంగా.

''నువ్వు చేసింది తప్పుకాదు, సరళా. నాకు తెలిసిన వారందరిలోనూ నువ్వే ఎక్కువగా సుఖపడుతున్నావు. నిన్ను చూస్తుంటే జీవితంలో సుఖం కూడా వుందనే విషయం జ్ఞప్తికి వస్తుంది. లేకపోతే అంతా చీకటిమయంగా కనబడుతుంది,'' అన్నాను.

"సుఖం," అంది, క్రుత్రిమంగా నవ్వుతూ.

"సుఖానికి నిర్వచన మేమిటి?" అన్నాను

''పెళ్లి చేసుకుని కొడుకుని కంటె సుఖపడుతూందని మీరంటారు. ఆ విషయం మనస్సులో మీరు నమ్మరు, బయటికి తియ్యటి మాటలని వదలించుకోవాలని ప్రయత్నిస్తారు. సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోరు, మీరందరూ ఇంతే రామంబాబూ, మీ రెప్పుడూ అంతే,'' అంది.

సరళ ముఖం వుజ్వలంగా వుద్రేకంతో ప్రకాశిస్తుంది. ముఖం ముఖ్యంగా, పెదిమలు ఎర్రగా అయిపోయాయి. క్రింది పెదిమ క్షణకాలం వణికింది.

సంబాషణ మార్చాలనే ఆతురతతో మళ్లీ తప్పుప్రశ్న వేశాను.

''నీ కొడుకుకి రామం బాబు అని పేరు పెట్టావు. నేను మాటవరుసకి పరిహాసంగా సరే అన్నాను. పెద్దయిన తర్వాత వాడు అది నా పేరని తెలుసుకుని ఏమనుకుంటాడో ఆలోచించావా?'' అన్నాను.

సరళ ముఖం ఆవేశంతో ప్రజ్వరిల్లిపోతోంది. కళ్లు మిలమిలా నిప్పుకణాల్లా మెరుస్తూన్నాయి. ''మనస్సులో మీరెప్పుడూ నాకు అన్యాయం చేస్తూనే వున్నారు, రామంబాబూ. నేనంటే మీకేమాత్రమూ కనికరం లేదు. నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పురుషులు ఎంత కఠిన హృద‌యులు,'' అంది.

''వద్దు సరళా, నాకు ఒకసారి నీవొక వాగ్దానం చేశావు. జ్ఞాప‌కముందా'' అన్నాను తను ఇంకా ఏదో చెప్పబోతూంటే.

''అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు," అంది నిస్పృహగా.

''ఏ విధంగా సరళా? మానసికంగానా, శారీరకంగానా?'' అన్నాను.

''రెండు విధాల కూడా, ఇప్పుడు మీరు కఠిన హృద‌యులైపోయారు. మీరు కూడా అందరిలాగే అయిపోయారు. అయినా మీమీద నాకున్న ఆలోచనలు ఆవేశాలు ఏమీ మారలేదు. దానికితోడు హృద‌యాన్ని చీల్చి వేసే అపరిమితమైన సానుభూతి కూడా దానికి తోడైంది. అందుకనే ఈనాడు అణచివున్నదంతా విజృంభించింది,'' అంది.

''ఇప్పుడు నాకెంతో మనశ్శాంతి చేకూర్చావు, కృత‌జ్ఞుడుని సరళా," అన్నాను.

"ధన్యురాలయ్యానని సంతృప్తిచెందమంటారా?'' అంది వేదనాపూరిత నేత్రాలతో నాకేసి చూస్తూ.

"నన్నిలా ఆడిపోసుకోవడంసబబా సరళా," అన్నాను బాధతో.

"యశో లఖియాల మీదున్న నమ్మకం మీకు నామీదెందుకు లేదు?" అంది.

''చెప్పానుకదా సరళా. నీవు నాకు సరిగా అర్ధం కావని," అన్నాను.

సరళ ముఖం హఠాత్తుగా మళ్లీ ఎర్రబడిపోయింది.

"ఎందుకు అర్ధం కాను రామంబాబూ, నాలో అంత అర్ధం కానిదేముంది. అందరిలాగే నేను కూడా ఒక సాధారణ స్త్రీని. అయితే మీకు అర్ధమయ్యేటట్లు విడమర్చి చెప్పమంటారా?'' అంది వుద్రిక్తతతో, కోపంతో.

''వద్దు సరళా వద్దు, ఇలాగే గడిచిపోనీ, దాని వల్ల కలిగే లాభమేమి లేదు,'' అన్నాను.

సరళ ఏమీ మాట్లాడలేదు, బలవంతాన వుద్రేకాన్ని అణుచుకుంటూన్నట్లు కనబడింది.

"బాబుకి అన్నీ నీ పోలికలే వచ్చాయి కదూ సరళా?''అన్నాను.

''పోలికలు నావి, పేరు మీది. బాగుంది కదూ రామంబాబూ. మీకు బాబు అంటే చాలా ఇష్టం కదూ,'' అంది చిరునవ్వులు చిందిస్తూ.

తల్లి ప్రేమంటే ఏమిటో ఆనాడు తెలిసింది. అలాంటి సమయంలో కూడా కొడుకు తలపుకు వచ్చి నవ్వకుండా వుండలేకపోయింది. మాతృ ప్రేమ ఒకసారి పెల్లుబికింది. సరళ ముఖంలో క్షణకాలం పూర్వపు వెలుగు కనబడింది.

"అవును సరళా చాలా ఇష్టం, నాకు పిల్లలంటేనే ఇష్టం అందులో నీకొడుకు కనుక మరీ ఇష్టం. నువ్వు పెద్దైన తర్వాత నిన్ను సుఖపెడతాడు. కానీ సరళా బాబుని నువ్వు కొంత నిర్లక్ష్యం చేస్తుంటావేమో అనిపించింది నాకు. వాడికి తల్లి ప్రేమ కొరవడనియ్యకు,'' అన్నాను.

''లేదు రామంబాబూ, బయటికి నేను అలా కనబడతాను. కాని నా ఆశలన్నీ వాడిమీదే ఉన్నాయి,'' అంది

"నా అపోహ తొలి గినందుకు సంతోషం," అన్నాను.

"సంతోషం, కానీ నా సంతోషం మాత్రం మీకు ఏమాత్రం పట్టదు," అంది అందంగా.

"ఇది పరమ అన్యాయం," అన్నాను.

"కాకపోతే ఆ నా రెండు సంతోష క్షణాలు ఏవో చెప్పండి,'' అంది రెండు వేళ్ళు చూపిస్తూ.

"నేను స్పందనా రహితుడ ననుకున్నావా?" అన్నాను.

"అయితే శ్రవణానందపరచండి," అంది.

"నీ వీణా భంగిమ, నీ కొమ్ముల వాడి, నన్నెన్నడు విడనాడవే నారీశిరోమణీ," అన్నాను.

"ఈ జీవితానికి ఇది చాలు, అయినాగానీ," అని, తన పెదవులతో నాపెదవులు కల్పింది.

తాను విడిచిన పెదిమలు నేను మెదిపేలోపున సరళ గది గుమ్మం దాటింది.

 

చాప్టర్ 37

 

ఆరోజే సరళా లాఖియాల తిరుగు ప్రయాణం. ఇదిగో అదిగో నని పదిహేను రోజులుండిపోయారు వారిద్దరు యశో ని ఆ పరిస్థితులలో విదలలేక. ఇన్నిరోజులూ ఒక్కమాటైనా లఖియా నాతో ఒంటరిగాలేదు, నామటుకునేనూ తన్నిఆపుకోవడానికి ప్రయత్నించానూ లేదు.

"ఇక సెలవు తీసుకుంటాను రామం బాబు," అంది లఖియా, సరళతో బాటు నాకు వీడ్కోలుపలక వచ్చి.

"నన్ను క్షమించాలి లఖియా, నువ్వు రవిప్రకాష్గార్కిచ్చిన మాటవమ్ము చేయించినందుకు," అన్నాను.

"నేను రవిగారికిఫోన్ చేసి పరిస్థితి చెప్పాను, అర్ధంచేసుకున్నారు. మీరు గమ్మునికోలుకోవాలని చెప్పమన్నారు," అంది లఖియా.

"వారికినా ప్రతినమస్కారాలు తెలియచేయి. నన్నుదానిక్కూడా క్షమించు లఖియా," అన్నాను.

"నేను చెప్పదలుచు కున్నది వెళ్లేముందే చెప్పుంటే బహుశా ఈ అరిష్టం పట్ట్టేదేకాదు మీకు. ఉత్తరం ద్వారా తెలియచేద్దామనుకున్నాను కాని ఇప్పుడు తెలుసుకున్నాను 'ఆలస్యంఅమ్రుతంవిషం' లోని సత్యం. అందుకు మీరు యశో కలసి నన్ను క్షమించాలి," అంది లఖియా.

"ఏమిటి లఖియా నువుచెప్పాలనుకున్నది?" అడిగాను అందరికంటేముందు కుతూహలంఆపుకోలేక.

"రామం బాబు ఆరోజు మీరిచ్చిన షాక్ తరువాత రవిగారిచ్చిన ట్రీట్మెంట్ నా జీవితంలో జీవం పోయగా నేను జీవితాన్ని జేవితంగా చూడటం మొదలుపెట్టేను. మనం ముస్సోరిలో గడిపిన వారంలో నే అనిచిందేమిటంటే, మనందరిలో ఒక్క రాజేంద్రగారే జీవితాన్ని జీవితంగా జీవిస్తున్నారేమోనని. నేను సాంస్కృతిక కుత్రిమ నీడలో నాజీవితాన్ని కుళ్లబెడుతుంటే మీరు మీ జీవితాన్ని గతస్మృతి మబ్బులో మరుగు పరచేరు గురువుకి పంగనామాలనుకోనంటే, మీకొక మాట చెప్పాలనుంది," అని ఊరుకొంది.

"తప్పక చెప్పు లఖియా, తనను మించిన శిష్యుని కన్నానా,' అన్నాను.

"మిమ్మలిని జీవచ్చవం చేసిన మీ అమర ప్రేమ మీ ఊహే కాకపోతే అక్కడికక్కడే గుండె పగిలి శశిని ఎప్పుడో పరలోకంలో జేరేవారు. అలాగే పాతివ్రత్యమే నాకు పరమార్ధమయితే, వైధవ్యాన్నికాపాడు కోవాలన్న వ్యర్ధ తపన బదులుగా సతికి దిగేదాన్ని. బహుశా మీ మానసిక దౌర్బల్యానికి నేను ప్రతిబింబం గనుకనే అందరికంటే నన్నెక్కువగా ప్రేమించానాని భ్రమపడ్డారు. ఇప్పుడు నేను ఆ లాఖియాను కాదు గనుక మీ ఆప్రేమ ఈపాటికే వాస్తవిక మేఘాలలో మిళిత మయ్యుంటుంది. మరి సరళ అయితే, అందని పళ్లకు అర్రులు చాస్తూ ఇంటనున్న ఫలాన్ని ఫ్రిడ్జిలో పడేసింది. ఇకపోతే యశో, తనకి జీవితంలో ఒక నిర్ధారిత లక్ష్యం వుంది, తాను దాన్ని చేరే మార్గం చేపట్టింది, అంతకంటే ముఖ్యం, ఆ ప్రయాణంలో

ఆనందానుభూతి పొందుతోంది."

"మనందరినీ కాచివడ పోసావు సరే, మరి రవిప్ప్రకాష్ గారి మాటేమిటి?" అంది సరళ.

"ఆయన ఆసక్తి కనబడుతున్నా నేను ఆశ పెంచుగోలేదు," అంది లఖియా యధాలాపంగా.

నే ఆత్మావలోకనంలో చేయి వూపుతుండగా యశో నన్ను విడిచి వాళ్ళను సాగనంపడానికివెళ్ళింది.

 

చాప్టర్ 38

 

ఆస్పత్రిలో ఇంకో రెండు నెలలు వున్నాను. యశోకి డాక్టర్ స్వరూప్ గారితో చనువు ఏర్పడింది. ఎవరితోనైనా చాలా సులభంగా స్నేహము చేసుకోగలదు యశో, ఆమె ముఖాన్ని మాటలని మందహాసాన్ని ఎవరూ జయించలేరు.

నాకూ గాయలన్నీ మానిపోయాయి. చెప్పిన విధంగా కుడి కాలి మడమ కింద భాగం నిరర్ధకమై పోయింది. ఈ రెండు నెలల్లో నాకూ డాక్టరుగారితో పరిచయం మరింత బలపడింది. మేమంటే ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. యశో మీద ఆప్యాయత ప్రదర్శించేవారు. యశో కూడా పూర్తిగా అది తిరిగి ఇచ్చేది. ఆమె కోరిక ప్రకారం యశోని ఆయన పేరుపెట్టి పిలిచేవారు.

ఆయన తరచుగా యశో అంత నిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు అనేవారు.

''అది ధైర్యమూ నిబ్బరమూ కాదు డాక్టరుగారూ, అదేమిటో మీ భార్య నడగండి,'' అంది యశో ఒకసారి.

''నా భార్య సంగతి నీకెలా తెలుసు యశో?" అన్నారాయన నవ్వుతూ

"బంగళా వారైనా, బర్మావారైనా స్త్రీ హృద‌యం ఒక రకంగానే వుంటుంది డాక్టరుగారూ,''అంది యశో.

''మీరు చెప్పింది సత్యం కాదమ్మా, నేనే అనేక మంది రోగులను చూస్తూ వుంటాను. స్త్రీలలో కూడా క్రూరులు, కుత్సితులు వున్నారు. భర్తని వదిలి పరుల వెంట పోయే క్షుద్రమైన స్త్రీలను నేను చాలామందిని చూశాను,'' అన్నారాయన.

''వారంతా బయటకు కనబడేటంత చెడ్డవారు కాదు డాక్టరు గారూ. ఏదో ఒక బలమైన కారణం లేకుండా స్త్రీ కూడా భర్తను వదలి పెట్టదు. నా వుద్దేశంలో వారు నిర్దోషులు, సరళ ఇప్పుడిక్కడుంటే లేడిలా గంతేసి 'హియర్ హియర్' అని వుండును. మీరేమంటారు. రామంబాబూ,'' అంది యశో.

''చాలా వరకూ యశో చెప్పిందే నిజం డాక్టరు గారూ,'' అన్నాను.

''భార్య మాట తో ఏకీభవిస్తే ఏ తంటా ఉండదనుకున్నారేమో, ఉండండి డాక్టర్గా నా తఢాకా చూపిస్తా మీకు. సిస్టర్ సుగుణతో చెప్పి ఇవాళ రెండు ఇంజక్షన్లు ఎక్కువ ఇపిస్తాను, " అన్నారాయన నవ్వుతూ.

''డాక్టరుగారు, మాకు మీ ప్రమీల పరిచయ భాగ్యం ఎప్పుడు కల్గిస్తారు?'' అంది ఒక రోజున యశో.

ఎప్పుడూ నవ్వుతూవుండే ఆయన ముఖం నల్లబడింది.

''యశో. నా ప్రమీల ఆత్మహత్య చేసుకుని మూడు సంవత్సరాలైంది,'' అన్నారు డాక్టర్ స్వరూప్.

మేమిద్దరమూ దిగ్భ్రాంతులమయ్యాము, ఆయన మాటలను బట్టి వారిద్దరిదీ అన్యోన్య దాంపత్య మనుకునేవాళ్లం, కాసేపు సంశయించి కారణమడిగాను, అభ్యంతరం లేకపోతే చెప్పమన్నాను.

''అభ్యంతర మేముంది రామంబాబూ. చెప్తాను, ప్రమీలను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లిచేసుకుని ప్రేమించాము. ఇద్దరమూ ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్లం. అప్పుడు మేము కలకత్తాలో వుండేవాళ్లం. ప్రమీలది చాలా సున్నితమైన మనస్సు, ఎంతో చక్కగా వుండేది. నాకు యశోని చూస్తోంటే ప్రమీల జ్ఞప్తికి వస్తుంది. ఏవో పోలికలు కనబడుతూంటాయి. పిల్లలంటే మాకు ఎంతో ఆపేక్షగా వుండేది. ప్రమీలకి పసిపాపలంటే ముఖ్యంగా మగపిల్లలంటే నిజంగా పిచ్చిగా వుండేది. పొరుగింటి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఆటలు అలంకారాలు జరిపేది. పెళ్లైన మూడు సంవత్సరాలకి ప్రమీలకి పిల్లలు పుట్టే సూచన కనబడింది. దీంతో మా ఇద్దరి సంతోషానికి అంతులేదు. ఎన్నో కలలు కన్నాము. రేయింబవళ్లు కూర్చుని పిల్లల దుస్తులు కుట్టుతూ వుండేది. అనేక కలలు కంది.

కళ్లల్లో నీళ్లు నిండగా తుడుచుకున్నారాయన.

"ఇలా వుండగా ప్రమీలకు పెద్ద జబ్బు చేసింది. పుట్టకమునుపే గర్భంలోనే శిశువు నశించి పోయింది. ఇక భవిష్యత్తులొ కూడా పుట్టే అవకాశం లేదని తేలిపోయింది. ఆ విషయం ప్రమీలకు తెలియకుండా వుండాలని ప్రయత్నించాను. కాని చెప్పడమే మంచిదని ఒకనాడు చెప్పాను. అది విని ప్రమీల నేను భయపడినంతగా దుఃఖించినట్లు కనపడలేదు. నిజానికి నేనెంతో పొరబడ్డాను. ఆమె ముఖం చూసి నేను జాగ్రత్త పడాల్సింది. దుఃఖ సమయంలో కన్నీరు కంటె మంచిది ఇంకొకటి లేదు. ఆ విషయం నేను అప్పుడు గ్రహించలేదు. డాక్టరు భార్య అవటం వల్ల ఆమెకు అన్ని మందులు గురించీ తెలుసు. ఒకనాటి రాత్రి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రాత్రి ఆమె ప్రవర్తన ఎంతో విచిత్రంగా వుంది. నేను మూర్ఖుడిని, మందబుద్ధిని అయి అప్పుడు నేను అది గ్రహించలేదు.

కాస్సేపు మాట మంతి లేక ఉండిపోయారాయన, ఆ సంఘటన నిన్నోమొన్నోజరిగినట్లు.

రాత్రి చాలా సేపటి వరకూ ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. పడుకుందామంటే ఇంకొంచెం సేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని చాలా ఆలస్యం చేసింది. ఒకటి రెండుసార్లు కళ్లలో నీళ్లు చూశాను. భుజం మీద చేయివేస్తే గజగజ వణికింది. కారణమడిగితే ఇవాళ మనస్సు బాగోలేదు ఎందుకో భయంగా వుంది అంది. ''పడుకుంటే అన్నీపోతాయి, పడుకో'' అన్నాను. ''అప్పుడు నాకు ఆలోచన కలుగలేదు. చివరికి నేను బలవంతంగా నిద్రపోయాను. ఎంత క్రూరంగా ప్రవర్తించాను. జీవితంలో ఎన్నో రాత్రులు వ్యర్ధంగా నిద్రపోతూ గడిపివేస్తూన్నాను. ఆ అయిదు గంటలూ నిద్రపోకపోతే నా ప్రమీల దక్కేదేమో, ఆ విషయం నాకు ఏ మాత్రం తెలిసివున్నా ఆమె మనస్సు మార్చివుండే వాడిని. నా మాట ఎప్పుడూ ఆమె కాదనలేదు. నా ప్రవర్తనలో కూడా ఏదో లోటు పాటు వుండి వుంటుంది. లేకపోతే ప్రమీల ఎప్పుడూ అలా చెయ్యదు. ఒక ఉత్తరం రాసి పరలోకం లోకి పయనించింది. అందులో జీవితమంతా సంతతి లేకుండా నేనుండలేను. నలుగురినోట ఆ మాట నేను వినలేను, నా ఆరోగ్య పరిస్థితి కారణంగా మీకు కూడా తండ్రి అయ్యే భాగ్యాన్ని నేను ఇవ్వలేకపోయాను. మన మిద్దరమూ కలసి కన్నకలల్ని నేను తుడివేస్తున్నాను. ఇంటిలోని ఆట బొమ్మలు, దుస్తులు చూస్తుంటే నేను భరించలేను. నేను వెళ్లిపోతాను. నన్ను మర్చిపోండి. నా మీద మీకేమైనా ప్రేమవుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి. ఆ విధంగా మీరు చేస్తే నా ఆత్మ శాంతిస్తుందని ప్రార్థిస్తున్నాను. నా అంతిమ కోరిక తీర్చండి. ఇంకొక సంగతి మీకు చెప్పకుండా మీవద్ద శలవు తీసుకోలేను. నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఏ భార్య ఏ భర్తనీ ప్రేమించలేదు, శలవు అని రాసింది. ఆమె వెంటనే నేను కూడా పోదామనుకున్నాను కాని వృద్ధ‌ తల్లిదండ్రులయెడ కర్తవ్యం అడ్డొచ్చింది. ప్రమీల పోయి మూడు సంవత్సరాలైంది.'' .

డాక్టరుగారు ప్రమీల గాధ చెప్తున్నంత సేపూ సర్వమూ మరచి విన్నాను. అంతా అయిపోయిన తర్వాత యశో ముఖం చూసి చకితుడ నయ్యాను. అంత క్రితం ఎప్పుడూ తనని ఆ విధంగా చూసినట్లు గుర్తులేదు. ఆమెలో దుఃఖం కంటే భయం ఎక్కువగా కనబడింది. ఆమె అంతరంగంలో సాగుతున్న ఆలోచలను ప్రమీల వృత్తాంతం బాహ్య ప్రపంచం లోకి తెచ్చిందా అన్న భావన కలిగింది నాకు. అమ్మీ కూడా ఈ విధంగా ఎప్పుడైనా ప్రమీలలా తలచిందా?

"అయితే మీరు ప్రమీల కోరిక నెరవేర్చరా డాక్టరుగారూ? అంది యశో కొంత సేపు మౌనంగా ఉండి

''ఎన్నటికీ నెరవేర్చలేను, అదే నా దౌర్భాగ్యం," అన్నారు డాక్టర్ స్వరూప్.

"మరణించిన వారి కోరికలు మనకు సాధ్యమైనంత వరకూ మన్నించాలి డాక్టరు గారూ. అయినా ఇందులో తప్పుకాని, నిందాకరమైనది కానీ ఏమీ లేదు. ప్రమీల చాలా దుర‌దృష్ట‌వంతురాలు, కానీ ఆమె మీకోసం ఎంతో త్యాగం చేసింది. ఇదంతా తనకోసమే అయితే అలా ఎన్నడూ చేసేది కాదనిపిస్తుంది," అంది యశో.

''అంటే ప్రమీల చేసింది మంచిదంటావా యశో, ఆత్మహత్యను సమర్ధిస్తున్నావా," అన్నారు డాక్టర్.

''మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నకు సమాధానం నాదగ్గర లేదు డాక్టరుగారు. కాని ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అలా చేసుకుందో నేను అర్ధం చేసుకోగలను, ఆత్మహత్య చేసుకుని మీకు ఎంతో దు>ఖాన్ని మిగిల్చి వుండొచ్చు. కొన్ని కొన్ని కార్యాలకి పరిణామాలతోనూ పరులతోనూ, పరలోకంతోనూ నిమిత్తం లేదు,'' అంది యశో.

ఈ సంభాషణ నన్ను చాలా కలవరపెట్టింది. అంత నిగూఢంగా మాట్లాడటం ఆమె స్వభావానికే విరుద్ధం. ఏదో సమస్య పెట్టుకుని మాట్లాడుతూందని స్ప‌ష్ట‌మైంది. అది ఏమై వుంటుంది. ఆ తర్వాత కొంత కాలం వరకూ యశోలో ఒక విధమైన మార్పు గమనించాను. నేను నిద్రపోయి లేచేటప్పటికీ కిటికివద్ద నిలబడి బయటికి తదేకంగా చూస్తూ వుండేది. పిలిస్తే వులిక్కిపడి "మీరా" అనేది. ప్రమీల గాధ ఆమె హృద‌యంలో తుఫాను లేవదీసిందని గ్రహించాను. నాకు సంబంధించినంత వరకూ ప్రమీల కూడా నా దుఃఖిత స్త్రీల పట్టికలో ప్రవేశ నార్హత పొందింది.

''ప్రమీల చాలా తప్పు చేసింది రామం బాబూ, భర్తకు చాలా అన్యాయం చేసింది. జన్మించటంలో మనకు ఎంత హక్కువుందో మరణించటంలో కూడా అంతే వుంది. ఆలోచించితే ఏమీ లేదని తేలుతుంది. ఆత్మహత్య సమర్థనీయమైన దైతే మానవకోటి క్షీనించివుండేది. ఏదో ఒక దుఃఖ కారణం ప్రతి వారికీ వుంటుంది. జీవితంలో మనకు లభించిన దానిని మనము స్వీకరించాలి. ప్రమీలకు నా సానుభూతి లభిస్తుంది. ఒప్పుదల కాదు భర్తకోసం అలా చేసింది. ఆమె పతివ్రతకాదా? ఆమె వుద్దేశాలు మంచివే రామంబాబూ, కాని ఆలోచనలు తప్పుదారి తొక్కాయి,'' అంది యశో.

 

చాప్టర్ 39

 

ఇంటికి తీసుకొచ్చేసింది యశో, కాలుకి బదులు ఒక ధృడ‌మైన కర్ర చేతికి లభించింది. అయినా దాని అవసరం కూడా అట్టే కలుగలేదు. యశో నా వెంట ఛాయలా వుండేది. నీడకూడా అప్పుడప్పుడూ మనకు కనబడదు. కాని యశో అలా కాదు. కొన్నాళ్లు పోయిన తర్వాత కూర్చొని నడుపుకోవడానికి వీలున్న ఒక కుర్చీకొంది. అందులో కూర్చుని ఇంట్లో తిరిగేవాడిని. సాయం సమయాల్లో బయటకు తీసుకెళ్తానంటే నేనే వద్దనేవాడిని, అభిమానంతో సిగ్గుతో హృద‌యం దహించుకుపోయేది. కుంటివాడిని కుర్చీలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూంటే లోకులేమనుకుంటారు. అప్పుడప్పుడు వెన్నెల రాత్రుల్లో నిద్రావస్తలో వున్న కాశీనగరంలో గంగ ఒడ్డుకు వెళ్లినప్పుడు గడిపిన వెన్నెల రాత్రులు జ్ఞ‌ప్తికి వచ్చేవి. వాటికీ వీటికీ ఎంత తేడావుంది. నయనాలతో నవ్వుతూ నన్ను లేవదీయండీ . అన్న ఆ యశోకీ కుర్చీతోసుకుపోతున్న ఈమెకీ ఎంత బేధముంది. తామరతూడుల్లాంటి ఈమె చేతులను చూసి తన్మయుడైన ఆ వ్యక్తికీ ఈ నిరర్ధకుడికి ఎంత వ్యత్యాసముంది? యశో బయటికి ఉత్సాహంగానే కనబడింది. ఆమె నన్ను ఒంటరిగా ఎప్పుడూ విడవలేదు. అయినా అప్పుడప్పుడు హఠాత్తుగా ఆమె కళ్ల నీళ్లు నిండడం నేను చూచాను. నేను చూడకుండా వుండాలని ముఖం పక్కకు తిప్పుకొనో, లేక వంటసాకు చెప్పో లోపలికి వెళ్లిపోయేది.

డాక్టరుగారితో ఆస్పత్రి పరిచయం మేము వదులుకోలేదు. ఆయన చాలా తరచుగా మా ఇంటికి వచ్చేవారు.. ఎంతో హుషారుగా వుండేవారు. యశోని ఎంతో సులభంగా నవ్వించగలిగేవారు. ఆ విద్య నాకు సుతరామూ చేతకాదు. మనస్ఫూర్తిగా ఆమె నవ్వుతూంటే నేను ఎంతో ఆనందించేవాడిని.

"ప్రమీలనుకూడా ఇలాగే నవ్వించేవారా డాక్టరుగారూ?" అంది యశో ఒకసారి.

"నేను నవ్వించటం కాదు యశో, ప్రమీల నన్ను నవ్వించేది. మేమిద్దరమూ పుట్టబోయే కొడుకుకి ఏ పేరు పెట్టాలా అని చాలా మాట్లాడుకునేవాళ్లం. ఎన్ని పేర్లు చేప్పినా ఆమెకు నచ్చలేదు. ఒక రాత్రి హఠాత్తుగా నిద్రలేపి స్వరూప్ బాబూ. మీఅబ్బాయికి పెట్టాల్సిన పేరు నాకు ఇప్పుడు తట్టింది, బాదల్, " అంది.

''ప్రమీలకు నాకు పూర్వజన్మ సంబంధం యేదో వుండివుంటుంది డాక్టరుగారు, ఒక రాత్రి నాకు కూడా హఠాత్తుగా ఈ పేరు తట్టింది. అది చాలా కాలం క్రితం, అప్పుడు నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారికి ఆపేరు పెట్టాలనుకున్నాను. అది వీరికి పెట్టాను. ఇదంతా విచిత్రంగా వుంది,'' అంది యశో వివర్ణ వదనంతో.

''పూర్వ జన్మమా, పునర్జన్మమా ఇదంతా ఒక పెద్ద భ్రాంతి యశో. ఇలాంటి పిచ్చినమ్మకాలకు తావివ్వకు. ఒకే పేరు ఇరువురికి పెట్టడంలో ఆశ్చర్యమేమీలేదు,'' అన్నారాయన నవ్వుతూ.

యశో మాట్లాడలేదు, మౌనంగా వుండిపోయింది. డాక్టరుగారు అనేకసార్లు నా కాలిని పరీక్షించడానికి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవారు. చాలా పరీక్షలు చేసేవారు.

"నువ్వు రామంబాబుని కలకత్తాకు తీసుకెళ్ళు యశో,"అన్నారు ఒకసారి ఆయన.

''స్థలం మార్పుకోసం అయితే ముస్సోరీ తీసుకెళ్తాను," అంది యశో.

నా గుండెల్లో రాయిపడింది, ప్రస్తుతం నేను వారిద్దరిని కలవడం అనుచితం.

''నేను మిమల్ని కలకత్తా వైద్యం కోసం వెళ్లమంటున్నాను. డాక్టర్ గంగూలిగారు నాకు బాగా తెలుస, ఆయనకి ఉత్తరం రాసి ఇస్తాను. ఒక ఆపరేషన్ చేస్తే ఇప్పటికంటె కొంచెం కాలు కుదుట బడుతుంది. పూర్తిగా నయం కావడం కష్టం, కానీ ఎంచెప్పగలం, మెడికల్ మిరకల్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అయినా దానిక్కావల్సిన కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లేవు,'' అన్నారు.

''మీకు శతకోటి నమస్కారాలు డాక్టరుగారు ఇంత సువార్త నా జీవితంలో నేను వినలేదు. మీకు మేము జీవితాంతం కృత‌జ్ఞులంగా వుంటాము. ఇప్పుడే ఆ ఉత్తరం రాసి ఇవ్వండి. రేపే బయలుదేరి వెళ్తాం. ఇన్నాళ్లు ఇది చెప్పలేదేమీ మీరు!'' అంది యశో చేతులు జోడించి.

"నిర్ధారణగా తెలిసేవరకూ చెప్పి మీలో అనవసరంగా ఆశలుపెంచదలచుకోలేదు. డాక్టర్ గంగూలీకి ఉత్తరం రాసి మీ కేస్ హిస్టరీతోపాటు రేపు ఇస్తాను,'' అన్నారు.

ఇక ఆ రోజల్లా యశో సంతోషం పట్టలేక పోయింది. ఎప్పుడూ నేను ఆమెను అంత సంతోషంగా చూడలేదు. ఒక చక్కని పాట నేను అడక్కుండానే పాడి వినిపించింది. ఒక చిన్న నృత్యం కూడా చేసింది. అది అయిపోయిన తర్వాత నా మెడ చుట్టూ చేతులు వేసి, "బాదల్ బాబూ" అంది.

"కాలు బాగుపడుతుందని డాక్టరుగారు చెప్పలేదు యశో, నువ్వు పొరబడుతున్నావు,"అన్నాను..

"మెడికల్ మిరకల్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు అని చెప్పేరు, చెవుడేమైనా వచ్చిందా మీకు. పోనీ పూర్తిగా కాకపోయినా ఇంతకంటె మెరుగు పడుతుందిగా, నాకదే చాలు. మీకది చాలదా, కొంచెం కొంచెమైనా నడవగలుగుతారు. అయినా ఒంటరిగా మిమ్మల్ని ఎప్పుడూ నడవనివ్వను...నేను ఎల్లవేళలా మీకు తోడుగా వుంటాను, నక్షత్రకురాలిగా, సరేనా," అంది హుషారుగా.

మరునాడే యశో నన్ను కలకత్తా తోలుకెళ్లింది. డాక్టర్ గంగూలిగారు నాకాలికి సరికొత్త ఆపరేషన్ చేసి యశో ఆశ మరింతపెంచారు. మూడు మాసాలు అయన ఆస్పత్రిలో సేవలుపొంది, నా కుడి కాలు నిలదొక్కు కుని, ఓ ఉదయం నేను కాశీ రైల్వే ప్లాట్ఫారం మీద 'వాకర్తో' నడుస్తుంటే, ఆరోజుని ప్రతి ఏటా 'శుభోదయం' గా జరుప నిశ్చయించింది యశో. ఇదంతా మానవమాత్రమా అనిపించిండి నాకా రోజంతా.

అలసి సొలసి వుండటం చేత ఆ రాత్రి యశో వెంటనే నిద్రపోయింది కానీ, చాలాసేపటివరకు నాకు నిద్రపట్టలేదు. వేర్వేరు ఆలోచనలు గుమిగూడి నా మెదడులో ప్రవేశించాయి.

యశో కనబర్చిన సంతోషం నన్ను కదిలించింది. మరుగుపడ్డ ఆలోచనలు తిరిగి మస్తిష్కంలో ప్రవేశించాయి. అడవి కాచిన వెన్నెల లాగ ఆమె జీవితం గడిచిపోతోంది; ఇరవైఆరు సంవత్సరాలు నిండబోతున్నాయి. ఇన్నాళ్లు ఈమె తన అందమూ యవ్వనమూ నాకోసం వృధా చేసింది. ఒక్కసారి కూడా ఆమె నాకా విషయం జ్ఞాప‌కం చెయ్యలేదు. నన్ను పల్లెత్తు మాటకూడా అనలేదు. యశోని చూస్తూంటే ఇంత వయస్సుందని ఎవ్వరూ అనుకోరు. ఆమె అందం చెక్కుచెదరకుండా వుంది. అదే రూపం, అదే విగ్రహం, అదే తీరు, అదే తెన్ను, అంతా అలాగే వుంది. ఆమె సౌందర్యం చూపరులను దిగ్భ్రాంతుల్ని చేస్తుంది. అది దేశ కాల మానాలకు అతీతం కామోసు! ప్ర‌కృతి విరుద్దంగా ఇది అంతా జీవితాంతం వరకూ వృధా అయి చివరకు స్మశానవాటికలో బూడిద అయిపోవలసిందేనా? ఈ ఆలోచనాధోరణిలో హఠాత్తుగా ఎన్నడూరాని ఒక తలంపు నాకు స్ఫురించింది.

తప్పు చెయ్యకుండా దైవం ఎవరినీ శిక్షించడని ఒక సారి లఖియా అంది. నా విషయంలో కూడా అది నిజమేనేమో. వివాహం కాకుండా నేను, యశో కలసి ఇంతకాలం వుండటమే నేను కుంటివాడి నవడానికి కారణమేమో? నా మీద ఆగ్రహించి ఆయన అలా చేశాడేమో? ఇప్పుడైనా తప్పు సరిదిద్దుకుంటే భవిష్యత్తులోనైనా సుఖపడగలమేమో? ఆ ఆలోచన కలిగిన వెంటనే మనస్సులో అంతర్యుద్దం ప్రారంభమయింది. అవును యశోని నేనెందుకు వివాహం చేసుకోకూడదు .అందువల్ల కలిగే నష్టమేమిటి? అయితే సుశీ సంగతి ఏమిటి? నా జీవితం నా యిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కాని యశో జీవితాన్ని నాశనం చేసే అధికారం నాకు లేదు. జీవితాంతం వివాహం చేసుకోకూడదనే నిశ్చయం నాలో వుంటే యశోకి నామీద మమత ఏర్పడక మునుపే నా నిర్నయం గురించి తనకు చెప్పివుండాల్సింది. అది వీలుపడకపోయినా మొదటిసారి విడిచిని తరువాత, తిరిగి ఆమెను వెతుక్కుంటూ ఆశ్రమం వెళ్లటం వలన నేను తనకి తెలియ పరచిందేమిటి? ఆమెకు మొదట వుత్తరం రాసింది నేనే. మాటవరసకని నన్ను అక్కడకు రమ్మని రాస్తే అది పురస్కరించుకుని పరుగు పెట్టాను. మాసిపోయిన మమకారాన్ని చిగురింపచేశాను. ఆమె జీవితం నాశనంచేశాను. ఇంతకాలం అందరికి శ్రీరంగ నీతులు చెప్తూ నేను యశో జేవితంతో చెలగాట మాడుతున్నాను. నా హహిపోక్రసి యశో గుర్తించకుండా ఉంటుందా? అయినా ఆమె కెందుకింత ప్రేమ గౌరవం నామీద. ఇంత జరిగిన తర్వాత ఇంకా సుశీ సాకు చెప్పి ఈమెకు అన్యాయం చేయటం చాలాతప్పు.

హఠాత్తుగా లఖియా అన్న మాట జ్ఞాపకమొచ్చింది, "మిమ్మలిని జీవచ్చవం చేసిన మీ అమర ప్రేమ మీ ఊహే కాకపోతే అక్కడికక్కడే గుండె పగిలి శశిని ఎప్పుడో పరలోకంలో జేరేవారు". బహుశా అదీ నిజమే కావచ్చు. లఖియా ఇంతలో ఎంత ఎదిగింది! సరళ కూడా అంది ఒకసారి, ''అధికారం వుంది కదా అని తప్పులేకుండా ఎవరినీ శిక్షించకండి". అది నిజమే, అందరినీ నేను ఇలాగే కష్టపెడుతూ వచ్చాను. యశో ఒక అపూర్వ స్త్రీ అని లఖియా అంటుందెప్పుడూ. 'అవును' అది అక్షరాల నిజం. ఇంకెవరైనా అయితే నన్ను ఏనాడో కాలదన్ని వుండేవారు. నేను యశోని వివాహం చేసుకోవాలనే ఆమె అభిప్రాయమని చాలాకాలం క్రితమే గ్రహించాను. స్వర్గంలోవున్న సుశీ కూడా నన్ను అర్ధం చేసుకుంటుంది. అవును ఎందుకు అర్ధం చేసుకోదు? నేను కష్టపడటం, ఇతరులను ఆమె గురించి కష్టపెట్టడం, ఆమె సహించదు. నా ప్రస్తుత పరిస్థితికి ఆమె ఆత్మ ఎంత బాధపడుతోందో. కానీ,యశో వంటి స్త్రీ నాకు లభించినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. సుశీ చనిపోయి ఇన్నేళ్లయినా ఎంతో స్పష్టంగా ఆమె ముఖాన్ని వూహించుకోగలిగాను. భయపడుతూ ఆమె కళ్లలోకి చూశాను. వాటిలో క్రోధమే లేదు. మందలింపు లేదు, మమకారంతో మిళితమైన మందహాసం వుంది.

ప్రమీల గురించి కూడా ఆలోచించాను. ఆమె కథవిని యశో అనిన మాటలు జ్ఞ‌ప్తికి వచ్చాయి. యశోకి పిల్లలంటే ఎంతో ఆపేక్ష. ప్రమీల తనకు పిల్లలు పుట్టరని తెలిసి పరలోకంలోకి పోయింది. ఆ వెలితి గురించి యశో చాలాకాలంగా ఆలోచిస్తున్నట్లు కనబడింది. ప్రమీల వృత్తాంతం దానిని తిరగతోడింది. యశో తన జీవితాన్ని పునరావలోకించుకొని ఇదే నాకు శరణ్యమా అని అనుకుందేమో? అదీ కాక ప్రమీల తన పుట్టబోయే బిడ్డకి బాదల్ అని నామకరణం చేద్దామనుకుందని యశో తెలుసుకుని ఏమనుకుంది? వారిద్దరూ గత జీవితంలో సవతులనుకుందా? అక్క చెళ్లెలనుకుందా? ఎందుకో నాకు భయం వేసింది. యశో స్వభావం నాకు తెలుసు. ఆమె ఆవేశాలకీ వుత్తేజితాలకీ సులభంగా లోనైపోతుంది. నన్ను నిస్సహాయుడిగా వదిలి ఎక్కడికీ వెళ్లదనే నమ్మకం నాకు వుంది. అయినా ఆమె నాకోసం ఇంత త్యాగం చేసినప్పుడు ఆమె వాంఛని తీర్చనంత కృత‌ఘ్నుడినా?

తన భుజస్కందాల మీద మోస్తూన్న నేను ఆమెకు ఏమీ కాదనే ఆమె హృదయరోదన వినలేని చెవిటివాడి నయ్యాను నేను! ఇక తటపటాయించించి లాభంలేదు. నిజంగా నేనే బాదల్ బాబు నైతే యశోకి తప్పక చెందాల్సిందే. దీనికి తిరుగు లేదు.

అప్పుడు ఆ నవ్య దృష్టితో యశో కేసి చూసాను.

ఎప్పటిలాగే అలవాటు ప్రకారం నా మంచం పక్కన వేరొక మంచంపై పడుకునివుంది. సన్నటి ఆ ఎర్రలైటు కాంతిలో ఆమె ముఖం ఎంతో ప్రశాంతంగా కనబడింది. ఎంత అందంగా వుంది. ఇంతకాలమూ నన్నావరించిన మానసిక మసక తొలగి, మొదటిసారిగా యశోని పొందాలనే వాంఛ కలిగింది.

ఇంకా నన్నునేను ఆపుకో లేక పోయాను.

"అమ్మీ,"' అని మెల్లగా పిలిచాను.

పిలుపు చెవిని బడిన వెంటనే వులిక్కిపడి లేచి కూర్చుంది.

''ఏం కావాలి,'' అంది నిద్రమత్తులో తెరిచీ తెరవని కళ్లతో .

''యశో నా పక్కకురా,'' అన్నాను కాస్త జరిగి చోటు చేస్తూ.

"అరె పన్నెండయింది. మీరింకా నిద్రపోనేలేదా,'' అంటూ ఆశ్చర్యపడుతూ నా పక్కమీద కూర్చుంది

''ఇంత సేపూ ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను అమ్మీ, అది నీకు చెప్పాలని నిద్రలేపాను," అన్నాను.

''గమ్మున చెప్పండదేమిటొ, నిద్రొస్తోంది,'' అంది.

ఎలా చెప్పాలో తెలియదు.

''నీ చేతులిలా వున్నాయేమిటి? నీ కుడిచెయ్యి ఇలా వుందేమిటి?'' అన్నాను ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుగుని.

"వయసు మీరడంలేదూ, అవి అలాగే కూర్చుంటాయా చెప్పండి పనీ పాట లేక , అయినా ఇంకా నేనేమీ పదహారేళ్ల పరికిణీని కాదు. ఇది చెప్పడానికా నా నిద్ర పాడుచేశారు," అంది యశో నవ్వి.

ఆ మాటలు వెళ్లి తిన్నగా నా హృద‌యంలో గుచ్చుకున్నాయి. నిజమే యశో పగలల్లా ఏదో చేస్తూనే వుంటుంది. ఆమె చిన్నపిల్ల కాదు అదీ నిజమే.

"అయితే ఇప్పుడు నీ వయస్సెంత చెప్పు అమ్మీ,'' అన్నాను.

''స్త్రీల వయస్సెంతని వారిని అడగకూడదని మీకు తెలియదా. అయినా నా ఉత్తరం బట్టి పట్టేరుగా, అక్కడనించి లెక్కలేసుకోండి, నేనింక పడు కుంటాను,"' అని లేవబోయింది.

"కాదు యశో . అసలు సంగతి చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియటంలేదు. నాకెందుకోగాని మనమిద్దరం ఇంత కాలం వివాహం చేసుకోకుండా వుండటం వల్లే ఇలా జరిగిందనీ అనిపిస్తూంది,'' అన్నాను తన చెయ్యి పట్టుకుని ఆపుతూ.

యశో శరీరం వక్కసారి వణకినట్లనిపించింది. ఆ మసక కాంతిలోకూడా ఆమె ముఖం వెలవెల పోవటం నాకు కనబడింది.

''అలాంటి ఆలోచించన వద్దని చెప్పాను కదూ,'' అంది.

"చెప్పేది పూర్తిగా విను. నన్నుపెళ్లి చేసుకుంటావా అమ్మీ,'' అని అడిగాను.

యశో మొహంలోని తెలుపు పోయి సింధూరం ప్రవేశించింది.

"చెప్పు యశో. నీ మనసులోని మాట చెప్పు," అన్నాను.

"మీకు తెలుసు కదా. మీది కానిది నావద్ద ఏమీ లేదని, మీరు ఏమి చేయమన్నా చేస్తాను. కాని నాకోసం మీరేమీ చేయవద్దు. నేను ఇలాగ జీవితాంతం వరకూ వుండిపోగలను. నాకు ఇంకేమీ అక్కరలేదు. నేను కష్టపడుతున్నాననే వుద్దేశంతో మీరేమీ చేయకండి,'' అంది.

''అయితే వివాహం చేసుకోకుండా నీ దేహాన్ని నాకివ్వగలవా?" అన్నాను తన చెయ్యి నొక్కుతూ.

అప్పుడు యశో ముఖాన్ని తన శరీరంలోని రక్తమంతా వచ్చి ఎర్రబరచగా, ఆమె నుదుట కుంకుమ మాయమయిందనిపించింది నాకు.. సిగ్గుతో ఆమె శరీరం దహించుపోతున్నట్లు కనబడింది.

"మీరు కావాలన్నదేమీ కాదనను, కానీ అది ధర్మవిరుద్దమేమో మీరే ఆలోచించండి," అంది ముఖం పూర్తిగా క్రిందికి దించుగుని.

ఆమె పరిస్థితి చూసి నేను సిగ్గుతో కుంగిపోయాను. ఆ ప్రశ్న వేసి నేను యశోని అవమానించాను. ఆమెవంటి స్త్రీని అడుగాల్సిన ప్రశ్నా ఇది? నేను ఎప్పుడూ ఇంతే, ప్రతిసారి ఇలాంటి తప్పుడు మాటలనే మాట్లాడుతుంటాను.

"యశో అలాంటి ప్రశ్న వేసినందుకు క్షమించి నన్ను భర్తగా స్వీకరించగలవా?"అన్నాను.

ఆమె వద్ద నుంచి ప్రేమ వాక్యాలు వాంఛించి అన్నమాటలి.

"అలా అనకండి నాకు చాలా బాధ కలుగుతుందని తెలుసుకదా?" అంది తను చివాలున తలయెత్తి నా నోటి మీద చెయ్యి పెట్టి.

''అయితే చెప్పు నీ కిష్టమేనా?" అన్నాను తన చెయ్యి తీసి నా హృద‌యం మీదకు చేర్చుగుని.

''మరి సుశీ మాటేమిటి?'' అంది.

"యశో సుశీ మధ్య ఏమీ వైరుధ్యం లేదని ఈనాటికి గ్రహించగలిగేనుయశో. దీనివల్ల సుశీ కేమీ అన్యాయంజరుగదు. ఇతరులను దుఃఖ పెట్టడం ఆమె ఆత్మకి విరుద్ధం. పరలోకంనుంచి మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ జ్ఞానోదయంలో లఖియపాత్ర మిన్న. తను, సుశీ, మనల్ని ఆశీర్వదిస్తారు," అని మనస్ఫూర్తిగా చెప్పాను.

యశో ముఖం పద్మంలా వికసించింది.

"అయితే, నా కోరిక తీరుస్తారా," అంది గోముగా నా చెవి దగ్గరకు తన పెదవులు చేర్చి.

"ఏదైనా సరే," అన్నాను తన తలను హత్తుకొంటూ.

...మెల్లగా చెవిలో చెప్పింది.

"ఆ నెరవేరుస్తాను, ఇంకొకటి కూడా తీరుస్తాను తెలుసా," అన్నాను.

"ఏమిటది?" అంది తన తలను నాగుండెపై చేరుస్తూ.

నేనూ మెల్లిగా ఆమె చెవిలో చెప్పాను.

''ఛా, వూరుకోండి,'' అంది ముఖాన్ని తలగడలో దాచుకుంటూ.

"మళ్ళీ అలోచిన్చుగో, భార్యాభర్తల బాధ్యతంతా నునువ్వేభరించాల్సొస్తుంది," అన్నాను నవ్వుతూ.

"మీ భారాన్ని నేను మొదటిసారి వహించినప్పుడు మీరే తుంచేసి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తు మళ్లీ నావద్దకు వచ్చారు. ఆ తర్వాత తప్పుడు మాటలు విని మిమ్మల్ని వదులుకోవడానికి సిద్దపడ్డాను. సమయానికి లఖియా పూనుకుని మిమ్మల్ని నాచేతి కప్పగించి ఇదే విలువకట్టలేని ధనమని. అదే రాత్రి బండిలో నేనూ అనుకున్నాను. ఇక ఈయనను ఎన్నటికీ వదిలిపెట్టను. సర్వకాలాల్లోనూ నా సర్వస్వం బాదల్ బాబూ. అలాగే ఈనాడు మీకు నేను వాగ్దానం చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎక్కువ భారం నేనే వహిస్తాను'' అంది నా గుండెలను తన చేతులతో చుట్టుకుని.

''చిన్నతనంలో నాకు భగవంతునిమీద అమితమైన ప్రేమ వుండేది అమ్మీ. సుశీ మరణం దాని కొక గొడ్డలి పెట్టు అయింది. ఆ తర్వాత లఖియా కష్టాలుచూసి అది పూర్తిగా నశించింది. కాని భగవంతుడేవుంటే నిన్ను రక్షిస్తాడు అమ్మీ. నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు. అలాకాకపోతే ఇక దేనినీ నమ్మను నేను,'' అన్నాను.

"అవును, నాదేవుడు ఇక నన్ను నా భర్త రూపంలో కాపాడుతాడు," అంది.

"అంటే, నీ భారమంతా నా మీదకు తరలిస్తావన్నమాట," అన్నాను.

"అది భర్తగా మీధర్మనిర్వహణకు నేనిచ్చిన అవకాశం అనుకోండి," అంది నవ్వుతూ.

"అదీ సబబే. ఇంతకాలం నీవు నా బరువు మోసి మోసి అలసిపొయావుగా," అన్నాను

"మళ్ళీ అదే పాతపాట. ఏదైనా కొత్త మాట చెప్పండి," అంది నవ్వుతూ.

"ఏదేమైనా నీ ప్రేమతో, రష్యన్ రచయిత ఇవాన్ టర్గెనెవ్ మాటలు నిజమనిపించావు," అన్నాను.

"అదేమిటో సెలవియ్యండి స్వామీ, ఇదేదో బాగుండే, అప్పుడప్పుడు మిమ్ములను స్వామీ అనిపిలుస్తాను," అంది ఆహ్లాదంగా.

"మనసుకు నచ్చిన వ్యక్తిని పొందగల అవకాశానుసారం ప్రేమ పెరుగుతుందని ఫ్రెంచ్ రచయిత ఎమిలి జోలా అంటే, పొందుతో సంబంధం లేని అనురాగమే ప్రేమ అన్నాడు టర్గెనెవ్," అన్నాను.

"అవి ప్రేమకి బొమ్మా బొరుసులనవచ్చు, కాదా?" అంది నా కళ్ళల్లోకి చూస్తూ.

"మన బొమ్మ నా ముద్దుగుమ్మ అంటాను, కావా," అంటూ తనని గట్టిగా హత్తుకున్నాను.

గువ్వపిట్టలా నా వళ్ళో వదిగిన యశో స్పర్శలో నా ప్రేమ అక్షరాలా కొత్త మలుపు తిరగగా, ఆమర్నాడు ఉదయం దైవసన్నిధిలో నా అమ్మీ నా అర్ధాంగయింది. అప్పుడు తను పొందిన సంతృప్తి నేను నా జీవితంలో ఎప్పుడూ, ఎవరిలోనూ చూడలేదు.

"దైవ కృప వలన మీ యశోరాజ్యం నా యశోరామం అయింది," అంది సంతోషంతో నిండిన మొహంతో.

అదే మధ్యాహ్నన్నం, మా 'తొలిరేయి' అనుభూతిలో మేము పొందిన ఆనందం నాకు తగిన గుణపాఠం - నా మూర్ఖత్వం మా ప్రేమానుబంధాన్ని ఎంత వ్యర్ధం చేసిందో అర్ధమయింది.

నేనామాటే అంటే,

"మరెందుకాలస్యం?" అని యశో పునారలింగనంలో మా పెదవులు కలిపింది.

అలా రోజులు దొర్లిపోతుంటే, జీవిత పరమార్ధం అర్ధాంగి ప్రేమానుభవం అనిపిస్తూంది.

 

చాప్టర్ 40

 

బహుశా ప్రేమపాశంలో చిక్కని జీవితముండదు, ఒకవేళ అరుదుగా ఉండుంటే, దాన్ని జీవితమనడం అనుచితమేమో. సాధారణంగా ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరిని ప్రేమిస్తాడు(ప్రేమిస్తుంది), కాంక్షిస్తాడు(కాంక్షిస్తుంది ). కానీ వారిలో కొంత మంది అదృష్టవంతులు మాత్రమే తాము ప్రేమించిన వారిచేత ప్రేమించబడుతారు, అయినా ప్రేమాత్రాసులో ఏ ప్రేమ జంటా సమపాళ్లలో తూగలేదు. వారిలో ఒకరు ఎక్కువ ప్రేమిస్తారు వేరొకరు ఎక్కువగా ప్రేమించబడుతారు, కానీ, ప్రేమకు బదులుగా నిర్లక్ష్యం లభించడం దురదృష్టకరం, అది భరించటం దుర్లభం. ఆరేళ్లపాటు తాను నరకయాతన అనుభవిస్తూ నాకు ప్రేమామృతాన్నితినిపించిన యశో మానవమాత్రురాలు కాదు, కేవలం దైవస్వరూపిణి. తెలిసి చేసినా తెలియక చేసినా, తనకా దుస్తితి కల్గించిన నేను నిస్సంకోచంగా దానవ సంభూతుడనే. వీటికన్నా దుర్భరమయినది, తనను ప్రేమించనివానిని ప్రేమించడం. ఆ బాధ సరళ అనుభవసిస్తోంది, దురదృష్టవశాత్తూ, దానికి కూడా నేనే కారకుడను.

ఈ మూడు కోవల్లొ దేనికోదానికి చెందని వారు చాలా అరుదుగా ఉంటారు. ఉదాహరణకి లఖియా; తనను నిర్లక్షించిన భర్త మరణానికి ముందు రెండు రోజులు ఆమె అతనిని ప్రేమించినంతగా బహుశా ఈ భువిలో ఎవరూ ఎవరినీ ప్రేమించి వుండకపోవచ్చు. అప్పుడు ఆమె అతనికి చేసిన సేవ దేవతలకే సాధ్యం అయ్యుండక పోవచ్చు. బహుశా ఆమె అతని స్వస్థతకు భగవంతుని ప్రార్థించినంతగా ఇంకెవరూ ప్రార్థించి ఉండేవారు కాదేమో. ఆవిధంగా అర్దాంగి ప్రేమంటే ఏమిటో ఆ అభాగ్యుడికి ఆమె చూపించింది. అంతవరకూ ఆమె అతనికి తన శారీరిక సౌందర్యము మాత్రమే సమర్పించగలిగింది కానీ ఆ రెండు రోజులూ దాని అవసరం అతగాడికి లేకపోయింది. ఎన్నిపాపాలు చేసినా అతడు అదృష్ట‌వంతుడు. అందుకే ఆమె సాంగత్యం ఆవ్యర్ద జీవికి లభించింది. .

భగవంతుడు సృష్టించిన‌ ప్రతిదానికి ఏదో ఒక తాత్పర్యం వుంటుంది. అలాగే మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ఏదో ఒక కర్తవ్యముంటుంది. అయితే ఆశృవుల మాటేమిటి? కన్నీరుకి కొరత లేదు. నేత్రాల్లోంచి అది అక్షయంలా వూరుతుంది. అసహాయుడికి అదే గత్యంతరం. ఆత్మకి అదే అంతరార్దం. మనమంతా ఏడుస్తూ పుడతాము. శైశవములో శారీరక కష్టాల్ని, వాంఛల్ని ఏడుపు ద్వారా వెల్లడిస్తాము, జ్ఞానంవచ్చాక మానసిక బాధల్ని ఏకాంతంలో కన్నీటితో లేక ఆప్తుల ఆలింగనంలో వ్యక్తపరుస్తాము.

మన ప్రేమపాత్రులు మనల్ని వదిలిపోయినప్పుడు మనం వారికి నిరాక్షేపణగా అశ్రుతర్పణం చెయ్యవచ్చు. కన్నీరు బలహీనతకు నిదర్శనమని, ధైర్యానికి బద్ధవిరుద్ధమని చాలామంది అనుకుంటారు,ఎందుచేత? మానవునికి ఆ గత్యం లేకపోతే అది ఎందుకిచ్చాడు ఆ అంతర్యామి! న్యాయానికి బలిపశువయిన వ్యక్తి చెంప కన్నీరు వ్యధావేదనయితే వాని గొంతుక పగులు అరణ్యరోదనే. కాకపోయినా, అతని కొరకు సమస్త మానవ నేత్రాల్లోంచి అశ్రుప్రవాహం జనించినా అతనికి ఒరిగేదేమిటి? అన్నింటిలాగే అది కూడా చివరకు సప్త సముద్రాల్లో కలసిపోతుంది. అయితే స్వలాభమే జీవితంలో పరమావధియా? అదికాక మానవ జీవనానికి వేరే దృక్పథమేలేదా? జీవితంలోని ప్రతి దానినీ లాభనష్టాల దృష్టితో చూడాలంటే నేను ఒప్పుకోను. నా ఆవేశానికి మీరు నన్ను క్షమించాలి.

కొంత మంది వ్యక్తులకి ప్రాపంచక సుఖాలు అందుబాటులో వుంటాయి. కాని వారు దేని కోసమో అస్పష్టంగా అన్వేషిస్తారు. అశాంతితో దేనినో కాంక్షిస్తారు. అది వారి చేతికెప్పుడూ ఆమడదూరంలో వుంటూ వారి అరచేతి దరిచేరదు. తోటి మానవుల నుంచి వారికి లభించేది ఒకేఒక పెదవి విరుపు మాట - నిలకడలేదు. దీనికి సరళ వ్యక్తిత్వం అద్దంపడుతుంది. తన తృష్ణ‌ తీర్చగల వ్యక్తికోసం అర్రులు చాచింది. ఆ తృష్ణ‌ ఏమిటో నాకు ఎప్పుడూ తెలియదు. ఒక సారి చెప్తానంటే భయంతో ''వద్దు వద్దు సరళా''అన్నాను. ఆమెకది చివరకు ఎండమావిగానే మిగిలిపోయింది. ''మనస్సులో నాకు అన్యాయం చెయ్యకండి రామంబాబూ'' అని రైలు కదలబోయే సమయంలో సరళ నన్ను అర్ధించింది. నిజంగానే ఈమెకు నేను అన్యాయం చేశాను. బహుశా మొన్నటి మాముద్దు ఆమె జీవితానికి కొంత ఉపశమనం కల్గించవచ్చునేమో. అయినా నా కర్ధం కానిదేమంటే, మనిషికి నిలకడ ఎందుకుండాలి? యంత్రంలా నడిచే ఈ మానవ జీవితంలో దీని అవసరం ఏమిటి? అడుగడుగునా ప్రశ్నలే ఎదురయ్యే ఈ పయనంలో ప్రశాంతతకు, ప్రవేశనార్హత ఎక్కడిది?

చెప్పాల్సిన వృత్తాంత‌మంతా చెప్పేశాను. ఇది కథా, కల్పన కాదు గనుక దీనికి అంతం లేదు. ముచ్చటగా ముగింపైనా లేదు. అందరూ చివరికి మట్టిలో కలిసిన విషాద నాటకం కాదు. ఇన్నాళ్లు గడిచిపోయిన తర్వాత జీవితంలో నువ్వు తెలుసుకున్నదేమని ప్రశ్నిస్తే కాసేపు తడుముకుంటాను. ఎందుకంటే స్వతహాగా నాకు ఏమి చేతకాదని సుశీ అనేది. యశో అంటుంది. నా భారమంతా వీరు, ముఖ్యంగా యశో మోశారు కనుక వీరి మాటలకు విలువ ఇవ్వాలి. అయినా చివరకు జీవితసమరంలో ఎవరి యుద్దాల్ని వారే నడుపుకోవాలి. కొంతమందినుంచి సానుభూతి ఆశించవచ్చు. అప్పుడప్పుడు ఎవరిదైనా ప్రేమ లభిస్తే స్వీకరించవచ్చు. అయినా చివరికి ఎవరి జీవన సారధ్యం వారే చేసుకోవాలి. కొన్నిసందర్భాలలో విజయం లభిస్తుంది కొన్నివిషయాలలో ఓటమి అంగీకరించాలి. మానవుడు గెలుపు ఓటములనే జీవన త్రాసులో తూచవలసింది ఫలితం కాదు, ప్రవర్తన మాత్రమే. అదే పరిపూర్ణ జీవిత పరిగణన.

(మరణ సమయంలో ప్రతి వ్యక్తి ఒంటరిగానే వుంటాడు. మనతో మనము ఎవరినీ తీసుకుపోలేము. జీవితంలో తటస్థపడ్డ వారందరికీ ఎప్పుడో ఒకప్పుడు వీడ్కోలు చెప్పాలి. పాఠకునికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. చెయ్యి పట్టుకుని గత జీవితాన్ని పర్యావలోకించాను. జీవిత పుటలోని ఆఖరి ప్రకరణం ఇంకా ముగియలేదు. అయినా మీకు సెలవు చెప్పాలి.)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Novelist, playwright, short story, non-fiction and articles writer, translator in verses, a little thinker and a budding philosopher of Addendum of Evolution - Origins of the World

Comments

Please login to post comments on this story