అప్రాశ్యులు

1821
0
Submitted Date 08/12/2020
Bookmark

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

Published by: Adarsa Grandha Mandali, Vijayawada

© 1966 C.B. Rau. E-book edition @2020 Bhimeswara Challa

Cover painting of Nirmala Rau (author's spouse)

Other books by the author:

క్షంతవ్యులు (A novel)

Man's Fate and God's Choice (An Agenda for Human Transformation)

The War Within- between Good and Evil (Reconstructing Money, Morality and Mortality)

Acknowledgements to:

Jyothi Valaboju (writer, editor, and publisher) for shaping this ebook edition;

and Author BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book.

Book Blurb

అరవైయేళ్ల నాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం.

రజని ఆత్మనిర్భరశక్తి అసాధారణమైతే ఆమె చంచలస్వభావం అనూహ్యగోచరం.

కమల పాతివ్రత్య సంకల్పం ఆదరణీయమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిసహజం.

విశాల అఖండిత సేవాభావం మానవాతీతమైతే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీతత్వనిదర్శనం.

ఈ ఐ-బాటిల్లో ని రామం రజనీల అనూహ్య అనుబంధం, ప్రసాద్ కమలల విచిత్ర సంబంధం, సనల్ విశాలల పవిత్రబంధం నేటి పాఠకులకు వింటేజ్ వైన్. త్రీ ఛీర్స్!

అధ్యాయాలు

చాప్టర్ 1

చాప్టర్ 2

చాప్టర్ 3

చాప్టర్ 4

చాప్టర్ 5

చాప్టర్ 6

చాప్టర్ 7

చాప్టర్ 8

చాప్టర్ 9

చాప్టర్ 10

చాప్టర్ 11

చాప్టర్ 12

చాప్టర్ 13

చాప్టర్ 14

చాప్టర్ 15

చాప్టర్ 16

చాప్టర్ 18

చాప్టర్ 19

చాప్టర్ 20

చాప్టర్ 21

అంకితము - ప్రపంచంలోని 'అప్రాశ్యులు' కు.

చాప్టర్ 1

ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ సుగ్రాహ్యమే. అయినా అప్పుడప్పుడు మనమంతా ఆలా ప్రయత్నిస్తూనే వుంటాము. అది ఎంతో హాస్యాస్పదమయినా ఆ ఆలోచనలో వుండే మకరందాన్ని మనమంతా కాంక్షిస్తాము. ఎందుకంటేఆ ఆలోచన ఆహ్లాదకరమయినప్పుడు దానిని బలవంతంగా, ప్రయత్నపూర్వకంగా ఎందుకు బహిష్కరించాలి? అసంభవమయిన ఆలోచనలతో తెచ్చుకొన్న చిరునవ్వు, నిజమైన నిష్కల్మషమైన కన్నీరు కన్నా వున్నతమైనవంటే నేను అంగీకరించను. ఎందుకంటే ఆత్మవంచనకన్నా ఆత్మహత్య ఉన్నతమైనది. జీవితంలోని అనివార్యమైన దుఃఖాన్ని, దుర్భరమైన బాధల్ని ఎదుర్కొన్నప్పుడే మానవుడు ఆ ఆశ అనే పొగమంచులో తలదాచుకుంటాడు.పొగమంచు అంతరించి అంతర్ధానమయినపుడు ఆశారహితమై ఆత్మహత్యకు ఒడిగడతాడు, మరికొందరు అదేపంథాలో అంధులై సత్యాన్ని ఎదుర్కొనే సాహసము లేక అసత్యపు ఆత్మవంచనలతో ముందుకు సాగిపోతారు. మరణ సమయములో వీరులు కూడ యీ లోకాన్ని విడువలేక ప్రాకులాడుతారు. బావురుమని చేతులు జాపి ఆప్తులను ఆఖరిసారిగా ఆలింగనం చేసుకో ప్రయత్నిస్తారు. చాలా అరుదుగా మనకి యింకొక తరహావ్యక్తులు తటస్థపడుతారు. వారికి పొగమంచుతో ప్రయోజనము లేదు, ఆత్మవంచనకు ఆస్కారం లేదు, ఆత్మహత్యకు వెనుదీయరు. సాధారణంగా మధ్యతరగతి మానవ జీవితాలన్నీ వర్ణించదగ్గ సంఘటనలు లేకుండానే సాగిపోతూంటాయి. ఎక్కడో ఎవరికో జన్మిస్తారు. కొద్దోగొప్పో చదువుకుంటారు. ఎంతో కొంతమందిపిల్లల్నికంటారు. అవీ ఇవీ కష్టాల్ని నిత్యము ఎదుర్కొంటూనే వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో వ్యాధితోనో, ఏదో ప్రమాదంలోనో కాలధర్మం చేస్తారు. ఇలాంటి శుష్క జీవనానికి అలవాటుపడి వుంటాము. అప్పుడప్పుడుకష్టాలు కట్టలుగా వచ్చినప్పుడు, ఆశాకిరణం అస్తమించినపుడు జీవితాన్ని అంతం చేసుకోవాలని గట్టివాంఛ కలుగుతుంది. నిజం చెప్పాలంటే యీ వాంఛ దాదాపు ప్రతి మానవునికీ ఏదో ఒక సమయంలో కలుగుతుంది. కాని క్రియారూపంగా యిది చాలా తక్కువసార్లు వెలువడుతుంది. జీవితంమీద వుండేతీపి దీనిని త్రొక్కివేసి అణగార్చి వుంచుతుంది. కాని అప్పుడప్పుడు తీవ్రమైన వాంఛ జీవితంమీద విరక్తిగా విజృంభించి జీవిని కబళించి వేస్తుంది. జీవితమనే తాత్పర్యం లేని తతంగానికి తిరుగుబాటే ఆత్మహత్య.

కాకినాడలోని పేరు ప్రఖ్యాతులుగల డాక్టరు సుదర్శన రావుగారి కుమారుడు ప్రసాదరావు. ఆగర్భ శ్రీమంతుడు. ఏకైకపుత్రుడు ఎంతో గారాబంగా పెరిగాడు. చూడటానికి బాగా రూపసి. పచ్చటి బంగారపు శరీర ఛాయ, దారుఢ్యమైన అవయవాలు, సదా నుదుటిపై ప్రాకులాడే నల్లటి ఉంగరాల జుట్టు, శిల్పి మక్కువతో చెక్కిన మానవ విగ్రహంలా వుండేవాడు. కాని బాల్యం నుంచి అతనిలో ఒక రకమైన అశాంతి, క్షణికమైన ఉద్రేకాలు, ఆవేశాలు కనబడేవి, ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాడు. ప్రతి నిర్ణయాన్ని ధిక్కరించేవాడు. కోపము వచ్చినా, ప్రేమకలిగినా అతనంటే అందరికీ తగని భయం. చిన్నతనంనుంచీ మోటారుకార్లంటే సరదా. ఎంతో వేగంగా పోనిచ్చేవాడు. ఎవరితోనూ స్నేహం చేసేవాడుకాడు. ఎవరూ ప్రయత్నం చేసేవారు కారు. పక్కింటి ప్లీడరు విశ్వనాధంగారి అబ్బాయి రామంతోనే కాస్త స్నేహంగా వుండేవాడు. ఇద్దరూ చిన్నతనంనుంచి కలసి చదువుకున్నారు. సమవయస్కులు. రామం ప్రసాదంత రూపసి కాకపోయినా, చూడ చక్కనివాడే. సన్నగా, పొడుగ్గా చామనఛాయగా వుండేవాడు. మితభాషి. పలకరిస్తేనే కాని ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ప్రసాదుతో స్నేహంవున్నా అతనికి ఆప్తమిత్రుడు, కమలాకరం అనే వేరొక వ్యక్తి వుండేవాడు. కమలాకరం తండ్రిగారు కూడ ప్లీడరుగారే. వారిద్దరి తల్లిదండ్రులకు బాగా స్నేహం. మొదటి నుంచి వారికి, వీరికి రాక పోకలుండేవి. కమలాకరం, రామం-వీరిద్దరి మనస్తత్వాలు సరిపడేవి. కమలాకరం శాంతస్వభావి, సహృదయుడు. అతని శాంత గంభీర వదనం అందరినీ ఆకర్షించేది. కమలాకరానికి, ప్రసాద్ కి ఆట్టే స్నేహం లేకపోయినా రామం ద్వారా యిరువురికి పరిచయం ఏర్పడింది. ముగ్గురు బి. ఏ వరకు కలిసి చదివేరు. పరీక్షలో ప్రసాద్ తప్పాడు. దానితో అతనితండ్రి ప్రసాద్ ని ఢిల్లీ చదువుకి తన తమ్ముని వద్దకు పంపించి వేశాడు. దానితో రామానికి అతనికి మధ్యనున్న స్నేహం మరుగున పడింది. బి. ఏ తరువాత రామం కమలాకరం మూడు సంవత్సరాలు వుద్యోగాన్వేషణలో వృధాగా గడిపివేశారు. చివరకు అదృష్టవశాత్తు యిరువురూ ఢిల్లీ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ పరీక్షలో కృతార్ధులయ్యారు. ఢిల్లీ బయలుదేరే ముందు కమలాకరానికి వివాహమయింది. కమల ఇంటరు వరకు చదువుకుంది. చూచినవారంతా"చక్కని చుక్క", "పుత్తడిబొమ్మ" ఆనేవారు. పీలగా, పల్చగా బలహీనంగా కనబడేది. తెల్లటి శరీర ఛాయ, నిర్మలమైన నేత్రాలు, తీర్చిదిద్దిన ముఖకవళికలు, నవ్వితే సొట్టలుపడే పాలబుగ్గలు.

ఢిల్లీలో కమలాకరం కొత్త కాపురం పెట్టాడు.కరోల్ బాగ్ లో చిన్నయిల్లు అద్దెకు తీసుకున్నాడు. రామాన్ని కూడ వారితోనే కలిసివుండమన్నారు. కాని రామం అంగీకరించలేదు, "నూతనదంపతులు హనీమూన్ కానీయండి" అన్నాడు. కమలనవ్వుతూ "హనీమూన్ హృదయంలోనే యిమిడి వుంది. అయినా మీరు బయటవుంటేనే మంచిది. ఏకాంతంతో విసుగెత్తి వివాహం చేసుకుంటారు" అంది కమల.

కమల ఎప్పుడూ నవ్వుతూ మందహాసం చేస్తూండేది. కాని కోపం కూడ క్షణంలోనే వచ్చేది. దానికి అందరూ భయపడేవారు. కమలాకరం యెడ ఆమెకు కొద్దికాలంలోనే స్వచ్చమైన అనురాగం, విశ్వాసం, గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. ఆమెకేవిధమైన లోటు రానిచ్చేవాడు కాదు. ఇతరులలాగ బయటికి వెల్లడించకపోయినా ఆమెయెడ అతనికున్న ప్రేమానురాగాలు ఆమె గుర్తించగలిగింది. ఇరువురిలోను కమలదే కొంతవరకుపై చెయ్యిగా కనబడేది. చూచేవారు చాలామంది ఆదర్శదంపతులనేవారు ఈర్ష్యతో కొందరు "ఆడ పెత్తనం" అనేవారు. నిజానికి కమల నవ్వు అంతర్గతంలోని అశాంతిని, అలసటను కప్పిపుచ్చుతుంది, వీటికి కారణం ఏ మాత్రమూ లేదు,ఏదో అస్పష్టంగా ఆమె హృదయం ఘోషిస్తూంటుంది. ఏకాంతంగా వున్నప్పుడు మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూంటుంది. కమలాకరంవంటి సత్పురుషుడు, సహృదయుడు భర్తగా లభించటం తన అదృష్టమని ఆమె గుర్తించింది. కాని ఆమె హృదయం చేసే ప్రతి పనికి కారణాన్ని కాంక్షిస్తుంది. తన బుద్ధి కుశలతతో పరీక్షించందే ఆమె ఏదీ చేసేది కాదు. క్రమబద్ధంగా కారణరహితంగా చేసే ప్రతి పనీ ప్రశ్నించేది. అశాంతికి కారణమడిగితే కమల మౌనముద్ర వహిస్తుంది. కారణం ఆమెకే తెలియదు కాని దురూహ్యం కాదు. జీవితంలో శాంతికీ, చిరు నవ్వుకీ చోటు లేనప్పుడు, అశాంతికి అలసటకి కారణం వెదకడం అవివేకం కాదా? నిత్యం నిరర్థకంగా జీవితం గడిపే వారినే తిరిగి ప్రశ్నించాలి నీలోని యీ శాంతి ఎక్కడిది? అసత్యమైన యోగా శాంతికన్న సత్యమైన ఈ అశాంతే ఉన్నతమైనది కదా? క్రమంతప్పకుండా నువ్వుచేసే యీ తతంగానికి తాత్పర్య మేమిటి? కాలాతీతమైన ప్రశ్నలకి సనూధానంకోసం వెదుకకుండానే క్రమబద్ధంగా మనం జీవితం సాగిస్తాం. ఆకలి అయినప్పుడు ఆరగిస్తాము నిద్రవచ్చినప్పుడు నిద్రిస్తాము ఈ రెండింటినీ ఆమడదూరంలో వుంచితే రక్తమాంసాలు క్షిణిస్తాయి. సృష్టి అంతరించేలోగా ఇవి లేకుండా ఎవరు ఎప్పటికీ జీవించలేరా? మానవ ప్రయత్నానికి విజయాలు ఎన్ని చేకూరినా, ప్రకృతిని ఎంత జయించినా చివరకు ఆకలి, నిద్ర లేకుండా యీ శరీరయంత్రాన్ని నడపగలిగే విధానం కనిపెట్టలేరా? కమల వీటన్నిటి గురించి యింతగా ఆలోచిస్తూందని నేను చెప్పటం లేదు. కాని అప్పుడప్పుడు ఈ విధంగానే ఆమె మనస్సు పరిపవిధాల పరుగెడుతూ వుంటుంది.

ఆరోజు ఆదివారం. శలవుదినం గనుక రామం ప్రొద్దుననే కమలాకరం ఇంటికి బయలుదేరాడు. పరధ్యాన్నంగా రోడ్డుమీద నడిచి వెళ్లూన్నాడు. హఠాత్తుగా గట్టిగా శబ్దం చేస్తూ వెనుక, ఒక కారు ఆగినట్లు చప్పుడయింది. వులిక్కిపడి వెనుదిరగక మునుపే "ఇడియట్ వై డోన్టు యూ వాక్ ఆన్ దిపేవ్ మెంట్" అని ఏదో పురుషకంఠం అనడమూ, కిలకిలా ఒక స్త్రీ సవ్వడమూ వినబడ్డాయి రామం వెనుతిరిగి చూసేడు. ఒక పెద్ద కారులో ట్వీడ్ సూటు వేసుకొని ఒక యువకుడు స్టీరింగువద్ద కూర్చుని వున్నాడు, అతనిప్రక్కన మెరుపుతీగలా మిరుమిట్లు గొలిపే ఒక సుందరమైన యువతికూర్చుని వుంది. ఒక నలుపు మఫ్లర్ తలమీదనుంచి చెవులమీదుగా కట్టుకొని వుంది. వెను తిరిగిన మరుక్షణంలోనే ఆ యువకుడు తలుపు తీసుకుని వచ్చాడు "రామం" అంటూ. రామం అప్పుడు గుర్తుపట్టాడు ఆయువకుడిని. అతనే ప్రసాద్. ఇద్దరూ ఒకసారి ఆలింగనం చేసుకున్నారు.

"ఏమిటి రామం? ఇక్కడ ఏమి చేస్తున్నావు?ఎప్పుడొచ్చావుయిక్కడికి! ఏమిటి సంగతి?" అన్నాడు ప్రసాద్.

"అవన్నీ నేను తరువాత చెప్తాను. ముందర నీసంగతి చెప్పు. అప్పటినుంచీ నువ్విక్కడే వున్నావా?" అని అడిగేడు రామం .

ప్రసాద్ సమాధానం చెప్పేలోపునే కారులోని యువతి వారి వద్దకు వచ్చి "ప్రసాద్ ! మీ పరామర్శలు, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కార్లోకి పదండి. రోడ్డుకు అడ్డంగా కారు ఆపారు" అంది. అప్పుడు ప్రసాద్ "అలాగేరజనీ! అన్నట్లు మరచిపోయాను. ఇతనే రామం. నా బాల్యస్నేహితుడు నీకొకసారి చెప్పాను. చాలా కాలమయింది యితనిని చూచి" అని రామాన్ని పరిచయం చేసి.

"ఈవిడ పేరు రజని, నా స్వీట్ హార్ట్" అని "పద రామం కారులోకి పద" అన్నాడు కాని అతనికి ప్రసాద్ మాటలు వినబడలేదు. కన్నార్పకుండా రజని కేసి చూస్తున్నాడు, సూర్యరశ్మిలో బంగారంలా మిరమిట్లు గొలిపే ఆమె అందాన్ని తదేకంగా చూస్తున్నాడు. సుమారు యిరవై రెండు సంవత్సరాల వయసు వుంటుంది. పచ్చటి బంగారపు శరీరఛాయ, విశాలమైన నేత్రాలు, పల్చటి ఎర్రని పెదవులు, అందమైన ముక్కు, గులాబీబుగ్గలు, నల్లటి ఉంగరాల జుత్తు మఫ్లర్ లోంచి తొంగి చూస్తూ నుదుటిపై దోబూచులాడుతోంది. ఎత్తైన నిండైన వక్షస్థలం,పొడుగాటి నున్నటి వంకరలకు అన్యాయం చెయ్యకుండా అంటి పెట్టుకున్న కాశ్మీరు శిల్క్ చీర, ఇవన్నీ పరిక్షించి చూస్తూ రామం తన్మయుడై తనను తాను మరచిపోయాడు.

ప్రసాద్ రామం భుజం తట్టుతూ "ఏమిటలా చూస్తున్నావు?'' అన్నాడు.

రజని నవ్వుతూ "నన్నే చూస్తున్నారు కనబడటం లేదా? తళుక్కుమంటున్న అయస్కాంతంలాంటి నా అందం ఈయననికూడా, సందేహం లేదు తన్మయుని చేసింది" అంది. అప్పటికి రామం వూహాజగత్తు నుంచి వూడిపడి కంగారుపడుతూ "ఆ. ఏమిటంటున్నావు ప్రసాద్ నేను నీతో ఇప్పుడు రాలేను. నేను కమలాకరం యింటికి వెళుతున్నాను" అని గబగబా నడవటం మొదలు పెట్టాడు. ప్రసాద్ అతని భుజం పట్టుకొని "ఏమిటీ కంగారు రామం! నీకేమైనా మతిపోయిందా? ముందర కారుయెక్కు తరువాత అంతా చెప్పుదువు కాని" అన్నాడు. కారు దగ్గరకు వచ్చి రజని "నేను డైవు చేస్తాను స్నేహితులిద్దరు కబుర్లు చెప్పుకోండి. మీరు కబుర్లు చెబుతూ డ్రైవ్చేస్తే ఈయన ప్రాణంతో కారులోంచిదిగరు" అని స్టీరింగువద్ద కూర్చుంది. రామం, ప్రసాద్ కారులో ఫ్రంటుసీటులో రజనీ ప్రక్కన కూర్చున్నారు. రజని కారు స్టార్ట్చేసి ఎక్కడకు వెళ్దాం! పిక్చరుకి వెళ్దామా వద్దా?" అంది.

"ఏమంటావు రామం? మంచి పిక్చరుంది ఓడియన్ లో" అన్నాడు ప్రసాద్.

"నేను కమలాకరం యింటికి వెళుతున్నాను. నీకు గుర్తువున్నాడు కదా?" అన్నాడు రామం.

"కమలాకరం ఎవరు? అతనేనా మనతో బి. ఏ కలిసి చదివాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు?" అన్నాడు ప్రసాద్.

"మేమిద్దరం సెక్రటేరియట్ లో అసిస్టెంటులుగా పని చేస్తున్నాము. పెండ్లి చేసుకొని కరోల్ బాగ్ లో కాపురం పెట్టాడు అక్కడికి వెళ్ళాలి. నా కోసం ఎదురుచూస్తుంటాడు. ఇప్పటికే ఆలస్యంఅయిందన్నాడు.

రజనీ కారు నడుపుతూవున్నంత సేపు రామం, ప్రసాద్ వారు కాకినాడలో విడిపోయినతర్వాత జరిగిన సంగతులన్నీ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

"నేను ఇక్కడకు వచ్చి చదువుదామని ప్రయత్నించాను కానీ అది సాగలేదు. ఈలోగా మా నాన్నగారు పోయారు. జీవితంలో దేనికీ అర్థం లేదు. చదువు రూపంలో నిరర్ధకంగా కాలాన్ని వ్యర్థం చెయ్యటం నా కిష్టం లేకపోయింది. ఆనుభవించవలసిన సుఖాలు, పొందవలసిన వస్తువులు జీవితంలో చాలావున్నాయి. సమయం వున్నంతసేపు వీలైనవి, దొరికినవి అనుభవించాలి. కాని ఏదో అవి ఇవి చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ,నెమ్మది నెమ్మదిగా ఆత్మహత్యచేసుకోవడంలో ఏముంది చెప్పు! జీవితంలో చెయ్యవలసిన పనులెన్నో వున్నాయి కాని సమయం చాలా తక్కువ. నాకెప్పుడూ నన్ను మృత్యువు వెంటాడుతున్నట్లనిపిస్తుంది. అది నన్ను అందుకోక మునుపే జీవితంలోని రసమంతా నేను పీల్చివేయాలి, అనుభవించని ఆనందం మిగిలివుండకూడదు. నిరర్థకమైన గౌరవము, నీతి, కీర్తి, సమాజపు శబాష్ లు నాకు అక్కరలేదు. చేతకానివారు స్వార్థపరులనే "సత్పురుషుడు" అనే బిరుదు నాకు అక్కరలేదు'' అన్నాడు ప్రసాద్ ఉద్రేకంతో.

ప్రసాద్ మాటలు వింటూండిన రామం ఆశ్చర్యానికి మేర లేదు, అతను యిలా అవుతాడని తను కలలో కూడా వూహించలేదు. బాల్యం నుంచి ప్రసాద్ లో మరుగువున్న అశాంతి అతనికి తెలుసు. కానీ ఈరూపం దాలుస్తుందని అతను వూహించలేదు. అయితే ఈ మార్పులో రజనిపాత్ర ఏమిటి? ప్రసాద్ కు ఈమెకు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియక మునుపే రజని కమలాకరం యింటి ముందు కారు ఆపింది.

అందరూ లోపలికి వెళ్ళారు. కాని లోపల కమలాకరం లేడని తెలిసింది. కమల లోపల వంట చేస్తూంది. రామం పిలుపు విని బయటకు వచ్చింది. ఆదివారం కనుక తలంటుపోసుకుంది. జుట్టంతా ముడి లేకుండా భుజాలమించి వ్రేలాడుతోంది, ముఖాన వ్రాసుకున్న పసుపు యింకా మాయ లేదు.! బొట్టు కూడా పెట్టుకోలేదు. అపరిచితులైన ఈ అందమైన స్త్రీ పురుషులను చూచి క్షణకాలం ఆశ్చర్యపోయింది. రామం వెంటనే వారిద్దరిని కమలకు పరిచయం చేసేడు. వారందరు కూర్చున్న తరువాత రామం-

"కమలాకరం లేడా! నాకోసం ఎదురుచూడమన్నాను, వెళ్ళిపోయాడా?" అన్నాడు.

"బజారుకు వెళ్ళారు. మీకోసం చూసిచూసి వెళ్ళారు. కూర్చునివుండండి కాస్త కాఫీ తెచ్చియిస్తాను" అని లోపలికి వెళ్ళింది కమల.

ప్రసాద్ ఇల్లంతాకలయచూచి "ఇంత చిన్నయింట్లో ఎలా వుంటున్నారు? ఎంత అశుభ్రం వుంది? అన్ని వస్తువులు యెంత చిందరవందరగా వున్నాయి! ఇంటి యిల్లాలికి యింటి మీద శ్రద్ధాసక్తులు లేనట్లున్నవి?" అన్నాడు.

రజని నవ్వి "ఇంటి యిల్లాలికి యింటిమిద శ్రద్ధ లేకపోయినా ఫరవాలేదు. ఇంతకీ ఇంటియజమాని మీద వుందా?" అంది.

రామానికి వారిద్దరూ అలా మాట్లాడడం ఇష్టం లేకపోయింది. ముఖ్యంగా రజని అంటే కాస్త అసహ్యంకూడా వేసింది. ఒక స్త్రీ యింకొక స్త్రీని గురించి అనవలసిన మాటలేనా యివి? ఈమెలో సంస్కారం ససేమిరా లేదా?

"ఉంటున్నది. భార్యాభర్తలేకదా! కమలాకరానికి బొత్తిగా అశ్రద్ధ, దేనినిగురించి పట్టించుకోడు" అన్నాడు రామం

"ఎందుకు పట్టించుకోవాలి? పెళ్ళాం దొరికిందికదా?" అన్నాడు ప్రసాద్

సరిగ్గా అదేసమయానికి కమల కాఫీ ట్రేతో బయటకు వచ్చింది నవ్వుతూ. "పెళ్ళాం ఎవరికి దొరికింది చెప్పండి!" అంది కాఫీ ప్రసాద్ కు యిస్తూ.

ప్రసాద్ సమాథానం చెప్పక మునుపే రజని "మీరు వున్నారు కాబట్టి మీ ఆయన దేనినిగురించి శ్రద్ధవహించడం లేదంటున్నారు. పరిస్థితులు యెలావున్నా మీరు పారిపోరని వారికి తెలుసు"అంది.

రజని చేసిన అప్రస్తుతపు వ్యాఖ్యానానికి రామం విస్తుపోయాడు. ప్రసాద్ పకపక నవ్వటం మొదలు పెట్టాడు. కమల కుర్చీలో కూర్చొని నవ్వుతూ-

"వారికా నమ్మకం వుందో లేదో నాకు తెలియదండి. అయినా ఎవరితోనయితే పారిపోతానో వారు, వారికన్నా ఉత్తములవ్వాలి. వారు నన్ను, నా భర్త నీడను వదిలి పెట్టించేటంతగా నన్ను ఆకర్షించాలి, అలాంటివారు దొరుకుతారని అనుకోను. వజ్రానికి మెరుపుతోపాటు గట్టితనం కూడా వుంటుంది. లేకపోతే దానివిలువ శూన్యం" అంది. నవ్వుతూ అన్న మాటలే అవి. కాని వాటిలోని తీవ్రతని అందరూ గుర్తించారు. కమల ఎవర్ని గురించి ఈ మాటలలదో అందరూ గ్రహించారు. ప్రసాద్ కి చెంపపెట్టు పెట్టినట్టయిందీ.

"మీరు దేనినయితే శూన్యం అంటున్నారో అదే సర్వస్వమని మరికొంతమంది భావించటంకూడా అసహజం కాదనుకుంటాను" అన్నాడు కోపంతో.

"అసహజమనినేననటం లేదు. అవివేకమని అంటున్నాను" అంది కమల.

ఈసారి రజని "ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తి ఒకేవిధంగా విలువకట్టాలనటం అసమంజసం కదా? వ్యక్తుల విలువలు వారిలాగే చంచలంకదా?".

"అయితే చంచలత్వం గర్హ్యమైనది కాదా" అంది. కమల.

"ఉహుఁ! కాదు మనోచాంచల్వం అని మనం మనస్సుని యెప్పుడూ నిందించుకుంటాము.అచంచలంగా మనస్సు ఒకే వ్యక్తి మీద, ఒకేవస్తువు మీద లగ్నమయివుంటేజీవితంలోని సారాన్ని వదలి పిప్పిని మింగినట్టవుతుంది. ఎందుకంటే ఏ ఒకే ఒక వ్యక్తిలోను, ఏ ఒకేఒక వస్తువులోను సారం యిమిడి వుండదు. సారాన్ని కాంక్షించే వ్యక్తిలో కూడా సారం పూర్తిగా యిమిడివుండదు" అంది రజని

"అయితే మీరనేది కీటకంవలె పుష్పంలోని సారాన్ని పీల్చివేసి వదలివెయ్యాలంటారా?" అన్నాడు రామం కోపంతో.

సరిగ్గా యిదేసమయానికి బయట సైకిల్ గంట మోగిన చప్పుడయింది. మరుక్షణంలోనే తలుపుతోసుకొని సైకిలుతో పాటు లోనికి వచ్చాడు కమలాకరం, అలసి వచ్చినట్లున్నాడు. ఆరోజు ఆదివారం, కనుక షేవుచేసుకోలేదు జుట్టంతా చిందరవందరగా వుంది. లోపలికి వచ్చిన వెంటనే కమల లేచి వెళ్ళి బజారులొంచి తెచ్చిన సామానుల సంచీ అందుకుని "మీ స్నేహితులు వచ్చారు" అంది.

ప్రసాద్ లేచి నుంచుని కమలాకరం దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ చేసి"గుర్తుపట్టావా నన్ను?" అన్నాడు.

కమలాకరం స్వచ్చమైన మందహాసం చేస్తూ ''నువ్వు హఠాత్తుగా తారసిల్లితే గుర్తుపట్టలేనేమో అని ఒకప్పుడు భయపడ్డాను కాని యిప్పుడా భయం లేదు." అని రజనిని చూసి "నిన్నయితే గుర్తుపట్టాను. కాని ఈ అపరిచిత స్త్రీని గుర్తుపట్టలేకపోతున్నాను. వివాహం చేసుకున్నావా?" అన్నాడు.

ఏ ప్రశ్న అయితే రామం, కమల ఇద్దరు పలుమార్లు అడుగుదామనుకుని, అడగలేపోయారో ఆ ప్రశ్న కమలాకరం మొట్ట మొదటనే వేశాడు. ఆ ప్రశ్న అడగబడిన తర్వాత వారిద్దరు అనుకున్నారు "ఎంత సహజమైన ప్రశ్నయిది" అని.

ప్రసాద్ కుర్చీలో తిరిగివచ్చి కూర్చొని "వివాహమనే తతంగం మా యిద్దరి మధ్య జరుగలేదు. స్నేహితులం, కలసి నివసిస్తున్నాము" అన్నాడు.

"స్నేహితులకు సహజీవనం సానుకూలమైనదేకదా?" అన్నాడు కమలాకరం.

రజని కమలాకరం కేసి చూస్తూ "ప్రసాద్ నా పేరు మీకు చెప్పలేదు నన్ను రజని అంటారు. ఇక మీరన్నమాట- నేనొక స్త్రీని, ఆయనో పురుషుడు. మేమిరువురం కలసినివసించాలని నిర్ణయించుకున్నాము. పురుష సాంగత్యము, ప్రేమనాకు, స్త్రీ సాంగత్వము, ఆదరము ఆయనకు లభించాయి. ఈ అంగీకారం చిరకాలం నిలవాలని మేము కోరుకోవటం లేదు. ఏ ఒక వ్యక్తి యింకొక వ్యక్తి తో చిరకాలం కలిసి నివసించలేడు. కొంత కాలం పోయేటప్పటికి ప్రేమ సన్నగిల్లుతుంది. విసుగు, అసహ్యము" జనిస్తాయి. వాటిని ప్రయత్న పూర్వకంగా కప్పిపుచ్చుకొని కృత్రిమంగా ప్రేమ నటిస్తూ జీవించడం మాకిష్టం లేదు. ఇరువురికీ సమ్మతమయినంత కాలం కలసివుంటాము. ఆ తర్వాత విడిపోతాము. ఏ క్షణంలోనయినా యీయన నన్ను విడిచిపోవచ్చును. ఏ క్షణంలోనయినా నేను ఈయనను విడిచిపోవచ్చును. కట్టుబాట్లు లేవు క్రమబద్ధాలు లేవు. కృత్రిమము లేదు. ఒకరి మీద యింకొకరికి యేవిధమైన హక్కు లేదు. అధికారము లేదు. నేనాయన దానను కాను, ఆయన నా వారు కారు" అంది.

ఈ అసందర్భ వుపన్యాసాన్ని అందరు శ్రద్దగా విన్నారు. కమలకు ముఖకవళికలు అనేక విధాలుగా మారినవి.

కాని ఆ మాటలు రామానికి మాత్రం కోపం తెప్పించాయి, పరిహాసపూరితంగా నవ్వి,"ఏదో పాఠం అప్పగించినట్లు చెప్పారు. ఏదో ఎవ్వరూ చెయ్యని పని చేసే నూతనపంథా వెతుకుదామని మీరు అనుకుంటున్నారు. మీరు కొత్తకొత్త మాటలు వుపయోగించి గట్టిగా మాట్లాడినంత మాత్రాన వీటిల్లోని సారాంశం నేను గుర్తించకపోలేదు. కొంతమంది భరింపరాని క్లిష్టపరిస్థితులలో అవసర సమయాల్లో ఇలాంటి పనుల కొడిగడతారు వారినే మనమంతా నిందిస్తాము "క్షుద్రులు, చీడపురుగులు" అని అంటాము. మీరు సరదాకి, నూతనత్వానికీ, జీవితంలోని సారం పీల్చడానికి ఈ పంధా తొక్కుతున్నారు. అంతే తేడా" అన్నాడు.

రామం మాటలు విని అందరూ క్రుంగిపోయారు. ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్క కూడా లేదు. భయంతో అందరు రజని కేసి చూశారు. చివరకు ప్రసాద్ కూడా ఉద్రేకుడయ్యాడు రజనిని వేశ్య, జారిణి అని నిందించటం సహించలేకపోయాడు. కాని అతనికి ఏమనాలో తెలియలేదు. అందరిలోకి రజనిమాత్రం నిశ్చలంగా వుంది.

"మీరన్నది కొంతవరకు నిజమే! రామం బాబూ! కాని వేశ్యకు, నాకు ఒక ముఖ్యమైన తేడావుంది. వేశ్య ధనంకోసం విచక్షణ లేకుండా శరీరాన్ని అమ్ముకుంటుంది, విటుడిని ఎంత అసహ్యించుకున్నా విముఖత చూపలేదు. బరువు చూసే యంత్రంలో అణా బిళ్ళ వేస్తే బరువు చూపేబిళ్ళ ఎంత నిర్దుష్టంగా, క్రమం తప్పకుండా బయటకు వస్తుందో అదేవిధంగా వేశ్య కూడా శరీరాన్ని అమ్ముకుంటుంది. అవయవాలు యంత్రంలా పని చెయ్యటం నేర్చుకుంటాయి. చివరకు మానసికంగాను, శారీరకంగాను నాశనమవుతుంది. నేనలాంటి దానను కాననుకొంటున్నాను" అని ప్రసాద్ వైపు చూస్తూ "ఏమండీ, మీరు చెప్పండి నేను అలాంటి దానినా? పడక గదిలో మీనుంచిపైకం అర్థించానా?"అందికమల ముఖము సిగ్గుతో ఎర్రబడింది. రామం దుర్బరమైన వేదనతో తల వంచుకున్నాడు. క్రోధంతో తను రజనియెడల విడచిన అభియోగానికి లోలోన దహించుకుపోయాడు. ఆమెను క్షమాపణ కోరుదాముకున్నాడు కాని నోరు మెధలలేదు. మౌనం వహించాడు.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ కమలాకరం "ప్రపంచకంలో ప్రతి మానవునికీ తన ఆత్మ ఆదేశానుసారం జీవితాన్ని నడుపుకోవలసిన విధీ, హక్కు ఉన్నాయి వేరు వేరు బంధాలలో నడచినంత మాత్రాన ఒకరు వుత్తములు కారు. ఇంకొకరు కుత్సితులు కారు. కానీ ఆత్మవంచన అతిహీనమైనది. అధః పతనానికి అదే, అదీ కారణం అన్నాడు.

"కాని మీరు చేస్తున్నది. ఆత్మవంచన కాదా? ఒకరి మీద మీరు చెలాయిస్తున్న యీ ఆధికారం యీ హక్కు ఎక్కడిది? సర్వహక్కులు రచయితవే అని పుస్తకం మీద వ్రాస్తూన్నట్లు సర్వహక్కులు భర్తవే అని మీరు భావించడానికి మీరు స్వతంత్రత ఎక్కడిది? ఆమె మీకు అర్ధాంగిని, ఇంటికి యిల్లాలు, పిల్లలకు తల్లి - అయితే వీటన్నిటిలోను ఆమె వ్యక్తిత్వం ఏది" అంది రజని.

రజిని మాటలు విని కమలాకరం కాస్త బాధపడ్డాడు. "మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను కమలపై సంపూర్ణాధికారాన్ని చెలాయిస్తూ ఆమెను నొక్కి అణచివుంచానని స్వార్ధంతో ఆమెను ఒక యంత్రంలావుపయోగించుకుంటున్నానని మీరు ఎలా భావించారు? అపరిచితుని యెడ మీరు యీ అభియోగాన్ని ఎలా వెయ్యగలిగారు? అయినా మీ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది కమల కాని నేను కాను" అన్నాడు.

ఇంతవరకు కమల మౌనంగా తలవాల్చుకుని కూర్చుని వుంది. ఇప్పుడు నెమ్మదిగా తలయెత్తింది. కనుకొలుకలలో కన్నీటి బిందువులు చేరివున్నాయి. రజని వైపు నెమ్మదిగా చూస్తూ "వివాహపు బంధంలో మీకు నమ్మకం లేదు. అందుకు నేనేమి అనను, కాని యితరుల యెడ, ఇంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ఏలా వుండగలుగుతున్నారు? జీవితంలో కృతజ్ఞత, కరుణ, మార్ధవం మమకారము, అనురాగము, ఆదరణ, వీటికి చోటే లేదా? సర్వకాలంలోను, మీ మనస్సులో మెదిలేది. స్వలాభమేనా?"అంది.

"మీరన్న వాటన్నింటికీ జీవితంలో చోటు వుంది. "లేదనినేననను. కాని అవే సర్వస్వమూ కాకూడదు. వాటికి మనం బానిసలమయి పోకూడదు. వాటిని మనం అదుపులో వుంచుకోవాలి, అప్పుడే మనం జీవితంలో ఏదయినా సాధించగలుగుతాము" అంది రజని.

కమల మౌనంగా ఒక క్షణంవుండి "మీరన్నది కూడా నిజమే కావచ్చుకాని, నాకు వీనికి సమాధానం చెప్పండి. ఒక వ్యక్తికి గురుతరమైన బాధ్యత, కర్తవ్యము ఎవరిమీద వుంటాయి? తన మీదా, లేక యితరుల మీదా? ముందడుగు వేసే సమయంలో మనస్సు ఎవరిని గురించి యోచించాలి ? ఇంకొకటి–జీవితంలో మనం ప్రతీదీ నిర్ణీతంగా క్రమబద్ధంగా ఎందుకు నేరవేరుస్తాము?"

"మీ ప్రశ్నకు సమాధానం నన్ను చెప్పనీయండి. ముందర మొదటిది తీసుకుందాము. ప్రతి వ్యక్తికి గురుతరమైన కర్తవ్యభారం ఆవ్యక్తిలోనే యిమిడి వుంది. జీవితంలో కృతజ్ఞతకు తావేలేదండి. పిల్లలు పెద్దలకు కృతజ్ఞత చూపాలంటారు. నిన్ను పదిమాసాలు కని పెంచి, సేవ చేసిన తల్లికి, నీకు పుట్టుకనిచ్చి పెద్దవానిని చేసిన తండ్రికి కృతజ్ఞత చూపనవసరం లేదా? అంటారు. ఇదే విధంగా ప్రతివారు యితరుల వద్ద నుంచి కృతజ్ఞత ఆశిస్తారు కాని కృతజ్ఞత మనం వారికి ఎందుకు చూపించాలి? మన సమ్మతి ప్రకారం వీటిల్లో ఏవి జరుగుతున్నాయి? కృతజ్ఞత అనే రూపంతో మనవ్యక్తిత్వాన్నే కప్పిబుచ్చ ప్రయత్నిస్తారు. ఎల్లప్పుడూ ఎవరి బాధ్యత వారిదే. తనయిష్టానుసారం నడచుకునే హక్కు ప్రతి వ్యక్తికి వుంది. అలాంటివారిని, విశ్వాసహీనులు కృతఘ్నులు అని అంతా అంటారు. ఆలాంటి ప్రజలకు మనం భయపడితే, రజని చెప్పినట్లు జీవితంలో మనం ఏదీ సాధించలేము- రెండవ ప్రశ్న వేసారు మీరు. జీవితంలో క్రమబద్ధంగా మనం ఎందుకు చెయ్యాలని నిజానికి దాని సమాధానంకూడా మొదటి సమాధానంలో యిమిడి వుంది. నిర్ణీత రీతిగా మనం జీవన యాత్ర సాగించాలనీ నేను అనను కాని క్రమబద్ధంగా జీవితం గడపకూడదనే నిర్ణయంతో మనం దేనిని చెయ్యకూడదు. అయితే మఖ్యమైన సూత్రమేమిటంటే, ఏపని చేస్తే మనకి ఎక్కువ అనందం - క్షణికమైనా ఫరవాలేదు లభిస్తుందో ఆపని చెయ్యాలి. ఆదే ప్రతి పనికి గీటురాయి," అన్నాడు ప్రసాద్.

గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు ప్రసాద్. ఇంత వరకు ఎవరు గుర్తించని ఒక విషయం కమల అప్పుడు గుర్తించింది. ప్రసాద్ కంఠస్వరంలో ఆమెకు ఏదో వర్ణించరాని ఆకర్షణ, ఓదార్పు గోచరించాయి. ఏదో ఒక చెప్పలేని సంపూర్ణ సమర్పణ తిరుగులేని నిర్ణయం మనస్సును ముగ్ధంచేసే మమత ఆమెకు అందులో అనిపించాయి. ఏదేదో వింతలోకాలకి ఈడ్చుకొని పోయేయి. ఆమెకు అనిపించాయి కమలకి ఆ కంఠ స్వరం యింకా యింకా కావాలని తీవ్రమైన వాంఛ కలిగింది, కాని దానితోపాటు అది అంటే ఒక రకమైన భయం కూడా వేసింది. తనను ఒక బానిసను చేస్తుందేమోనని భయపడింది. చివరకు మౌనంగా వుండిపోయింది.

అప్పుడు రజని "చాలా ఆలస్యమయింది ఇక వెళ్దాం పదండి. ఇప్పటికే వీరికి చాలా అలసటలు పెట్టాము. మొదటి పరిచయమయినా మనము ముఖస్తుతి మాటలు మాట్లాడలేదు. అదే ఎంతో ఆనందదాయకమైన విషయం" అంది.

"మీరిద్దరి పరిచయం కల్గినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నేను, రామం ఒకరి ముఖాలు వొకరు చూచుకొని విసుగెత్తిపోయాం" అన్నాడు నవ్వుతూ కమలాకర్. ఆచలోక్తికి రామం నవ్వలేదు. నిజానికి అతను చాలాసేపటి నుంచి మాట్లాడలేదనే విషయం ఎవరు సరిగా గుర్తించలేదు. దగ్గర వున్న మేగజీన్ తిరగవేస్తూ అప్పుడప్పుడు మందహాసం చేస్తూ కూర్చున్నాడు. సమయం దొరికినప్పుడల్లా రజని కేసి చూస్తూ కూర్చున్నాడు.

"ఇక వెళ్తాము అప్పుడప్పుడు కనిపిస్తూనే వుంటాము. మీరు కూడా మాయింటికి వస్తూ పోతూ వుండాలి." అని. కమల వైపు చూచేడు ప్రసాద్. కానీ ఆమె అతని వైపు చూడుటం లేదు. ఆత్మపరిశోధన మొదలు పెట్టింది.

ముగ్గురు కారులో బయలుదేరారు. ఈసారి ప్రసాద్ డ్రయివు చేస్తున్నాడు. ఆ వేగానికి రామం భయంతో వణికి పోయడు. అరవై దాటిన తర్వాత స్పీడు మీటరు కేసి చూడడం మాని కళ్లు మూసుకుని కూర్చున్నాడు. మాట్లాడితే ప్రమాదం కలగటానికి ఇంకా అవకాశాలుంటాయని మౌనంగా వూరుకున్నాడు. రజని అతని కేసి చూచి నవ్వింది. ప్రాణంమీద మీకు యింత తీపా! భయపడకండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంది.

"ప్రాణం మీద తీపి వున్నాలేకపోయినా యింకొక వ్యక్తినిర్లక్ష్యానికి నేను చనిపోవటం నాకిష్టం లేదు నాకు నిజంగా భయం వేస్తూంది. ప్రసాద్ కేమైనా పూనిందా యేమిటి అలావున్నాడు" అన్నాడు రామం.

నిజానికి ప్రసాద్ ని అప్పుడు చూస్తే కొత్తవారికి కొంచం కలవరపాటు కలగడం సహజమే.

కారులో మెరిసే కళ్ళతో, దవడలు వుబ్బెత్తుగా పొంగి నల్లటి వుంగరాల జుట్టు గాలిలో ఎగురుతూ వున్న ప్రసాద్ రూపం ఏదో ఒక అమానుషత్వాన్ని గుర్తుకు తెస్తూంది. ప్రసాద్ వీరి మాటలే వినిపించుకోలేదు, హటాత్తుగా కారుని "కన్నాట్ ప్లేసులో" ఒక షాప్ వద్ద ఆపి రజనితో "నువ్వు కారు తీసుకొని వెళ్ళు రజనీ! నేను తరువాత వస్తాను." అని బయటకి చరచరా వెళ్ళిపోయాడు.

రామంతో ఒక మాటకూడా మాట్లాడలేదు. ప్రసాద్ చిత్ర ప్రవర్తనకి విస్తుపోయి వెర్రిగా చూస్తున్నాడు. రజని పకపక నవ్వుతూ "మత్తువదలించుకొని కాస్త యీకారుని ఎక్కడకు తీసుకు వెళ్ళాలో చెప్పండి. ఈసారి భయపడకండి నా ప్రాణమంటే నాకు, మీకు మీ ప్రాణం కన్న ఎక్కువతీపి. నాకు నూరు సంవత్సరాలు నిండుగాబ్రతకాలని వుంది. రోజూ నూరు దేవుళ్ళకి మొక్కుకుంటూంటాను చెప్పండి మిమ్మల్ని యెక్కడ డ్రాప్ చెయ్యాలి" అంది.

"లోడీకాలనీకి పోవాలి. ఇక్కడకు చాలా దూరం" అన్నాడు రామం.

"నేను మిమ్మల్ని అడిగినది ఎక్కడికి వెళ్ళాలని కాదు ఎక్కడ డ్రాప్ చెయ్యమంటారని" అంది రజని.

"అయితే యిక్కడే డ్రాప్ చెయ్యండి" అన్నాడు కొంచెం కోపంగా రామం.

రజని నవ్వుతూ "మీకు బలే త్వరగా కోపం వస్తుంది. మీలాంటివారికోసము నేను ఎంతో కాలం పట్టి ఎదురు చూస్తున్నాను. ఇక ఫరవాలేదు. కాస్త ఆసరా దొరికింది" అంది.

రామానికి రజని ప్రవర్తన మరీ మొరటుగా కనబడింది. కాని తను రజనిని వేశ్య అని అనినందుకు ఇంకా పశ్చాత్తాప పడుతున్నాడు. ఆమె ఆమాటకు తన పై కోపగించుకొనందుకు కొంచెం కృతజ్ఞత కూడ కలిగింది. అయినా క్షమార్పణ చెప్పుకోవటం తన విధిగా భావించి, "ఇందాక మీ యెడ నేను అపచారం చేశాను, నన్ను క్షమించాలి అన్నాడు.

"ఆశ్చర్యంతో అపచారం చేశారా! ఏం చేశారు? అంది రజని."

"అదే... యిందాకా... మిమ్మల్ని" అని రామం తడుముకుంటూంటేరజని "ఓ అదా ; అందులో అపచారం ఏముంది చెప్పండి. ఎవరికి తోచిన విధంగా వారనుకుంటారు. నేను వేశ్యనే అయినా అందులో అభిమాన పడవలసినది ఏముంది చెప్పండి, వేశ్యలలో వుత్తములు లేరని ఎవరనగలరు?" అంది.

రజని మాటలు వింటూంటే రామం హృదయం కలచినట్లయింది. ఆమె మనస్తత్వం అతని కేమి అర్ధం కాలేదు సమాధానం ఏమి చెప్పాలో అని ఆలోచిస్తూకూచునేసరికి కారు తన లాడ్జికి దగ్గరగా వచ్చిందని గుర్తించి "ఆపండి కారు, ఇదే నాలాడ్జి" అన్నా డు.

రజని హఠాత్తుగా కారు ఆపి "భలేవారు కాస్త ముందర చెప్పితే నష్టమేమిటి చెప్పండి" అంది.

రామం కారుదిగి "థాంక్స్ ! మళ్ళీ ఎప్పుడు కనబడతారు" అన్నాడు.

రజని నవ్వుతూ "మాట వరసకయినా మీరు లోపలికి రమ్మనమని అనలేదు కాదా" అంది.

రామం కాస్త కంగారుపడుతూ "అబ్బే అదికాదండి పొరపాటయింది తప్పకుండా రండి. నా చేతి కాపీ కాస్త తాగి వెళ్ళండి" అన్నాడు.

రజని కారులోంచి దిగుతూ "మీ చేతి కాఫీ కాచి నాకుయిస్తారా? అయితే నిజంగా తాగాలనే వుంది" అంది.

రజిని నిజంగా కారు దిగి తన గదిలోకి వస్తుందని రామం అనుకోలేదు. కంగారుగా తాళం తీసి రండి - రండి కూర్చోండి అంటూ కుర్చీ మీద పడివున్న బట్టలను ఒక మూలకు విసిరివేసాడు.

రజని కూర్చుందే గాని గది అంతా పరీక్షించి చూస్తూంది. ఆమె దృష్టి మరల్చడానికి "క్షమించాలి- అంతా చిందరవందరగా వుంది" అన్నాడు

"ఫరవాలేదు లెండి. రెండు గదులు తీసుకున్నారా ?" అంది రజని "అవునండీ రెండవది వంటగది'' అన్నాడు రామం.

"ఏమిటీ ! మీరే వంట చేసుకుంటున్నారా?" రజని ఆశ్చర్యంతో అంది.

"అవునండి హోటల్ భోజనం శరీరానికి పడటం లేదు" అన్నాడురామం,

"అయితే నాకు కాఫీ వద్దు అన్నం పెట్టండి ఆకలివేస్తోంది" అంది రజని దగ్గర వున్న కుర్చీలో కూర్చుంటూ.

రామానికి రజనీ, అలా పరిహాసానికి అందో, నిజంగా ఆందో అర్ధం కాలేదు. కానీ అతను సమాథానం చెప్పక మునుపే రజని "అయ్యొయ్యో ! ఏమిటీ అన్యాయం. ఒక అపరిచితుని యింట్లో బలవంతంగా జొరపడి మొరటుగా హాస్యం ఆడుతూ అన్నం పెట్టమంటున్న స్త్రీకి నీతి, నియమము, గౌరవము, మర్యాదా, సభ్యత సరసము తెలుసునా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సొదను ఎట్లా వదిలించుకోవటము? అని అనుకుంటున్నారు కదూ?" అని నవ్వుతూ యింటిని శుభ్రం చెయ్యడం ప్రారంభించింది.

రామానికి పూర్తిగా మతిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దిగ్భ్రాంతుడయి రజని ముఖం కేసికన్నార్పకుండాచూస్తున్నాడు.

అప్పుడు రజని - అలా చూస్తారేమిటి? ఇప్పటికే చాలా ఆలస్యమయింది. నాకు ఆకలి వేస్తోంది. కాస్త బియ్యము కూరగాయలు వగైరా తెచ్చి యిస్తే, నేనయినా ఏదో చేస్తాను. ఈ పూటకి శాఖాహారంతోనే సరి" అంది నిట్టూర్పుతో.

"మీరు మాంసాహారులా ! ఆన్నాడు రామం"

రజని మందహాసం చేస్తూ – "మాంసాహారినే కాదు. మధుపానీయాలు కూడా తాగుతాను. అసహ్యమేస్తోంది కదూ! కాని ఎందుచేత ! మీరు భోంచేసే వరి - ఎక్కడిది ? వరి మొక్కను చంపితేనే కదా అది మీకు లభ్యమవుతుంది. జంతువుకి ప్రాణమునట్లే దానికీ ప్రాణం లేదా ?" అంది.

"అసహ్యం లేదండి ! ఆశ్చర్యమేస్తోంది. మీరూ, మీ ప్రవర్తన నాకు బొత్తిగా అర్థం కావటం లేదు.ఇదంతా మీ పరిహాసమా లేక నా మతిభ్రమ చెప్పండి? ఒకస్త్రీ యింకొక అపరిచిత పురుషుని యెడ, యింత చనువుగా వుండగలుగుతుందని నాకు తెలియదు, మీరు ఒక విచిత్రవ్యక్తియా లేక నన్నొక ఆట వస్తువుగా పరిగణిస్తున్నారా?" అన్నాడు.

"పరిగణిస్తున్నానో ప్రేమిస్తున్నానో తరువాత చెప్తాను. ముందర ఆకలి వేస్తోంది. త్వరగా కాస్త బియ్యము, అవి యియ్యండి నేనే వంటచేస్తాను" అంది.

"మీరు వంట చేస్తారా ? మీ బోటివారికి వంట చేతనవునా?" అన్నాడు.

"నేనేమీ రాకుమార్తెను కానండి" అని నవ్వుతూ "లేకవేశ్యలకు వేరేపనులుంటాయనుకుంటున్నారా?" అంది రజని !

రామం ముఖం సిగ్గుతోనూ, ఏవగింపుతోనూఎర్రబడింది. ఆవిషయాన్ని తిరిగి జ్ఞప్తికి తెస్తుందని తలచలేదు. ఇలాంటి స్త్రీ చేతి భోజనం తను చేయ్యాలా? కాని యింకో మార్గం కనబడలేదు.

కొంచెం కోపంతో - "మీరు అలాంటి మాటలు యింకా అంటే నేను సహించనండి ? ఎందుకు పదేపదే అలాంటి మాటలంటారు? మీకేమైనా తృప్తి కలుగుతుందా ?" అన్నాడు.

రజని తన మాటలవలన రామం హృదయం గాయపడిందని గ్రహించింది కాని ఆమె వాంఛించేది కూడా అదే?.

నవ్వుతూ "మీకు కోపం తెప్పించటమంటే నాకు చాలా సరదా? మనస్సుకి చాలా తృప్తి కలుగుతుంది!" అంది.

ఆరోజు రజనినే వంట చేసింది. రామం ఎంత వారించినా, ఎంత వేడుకున్నా ఆమె వినలేదు, ఎంతో ఆప్యాయంగా రామానికి ఆరోజు భోజనం పెట్టింది. రజని అర్ధంలేని ఆప్యాయతకు రామం మనస్సులో కృతజ్ఞత చెప్పుకున్నాడు. కాని బయటకు ఏమి అనలేకపోయాడు. ఎంత ఆలోచించినా అతనికి రజని ప్రవర్తన దురూహ్యమయింది. అలాంటి వింత యువతులుంటారని అతను వూహించలేదు. మొట్ట మొదట రజని ప్రవర్తన అతనికి అసహ్యము, ఏవగింపూ కలిగించాయి. హై సొసైటీలో మెదిలే ఒక అందమైన వేశ్య అని భావించాడు, ఆమెతో ఆనాడు గడిపిన ప్రతిక్షణం గడిచే కొలది అతని అభిప్రాయం మారజొచ్చింది.

భోజనాలయిన తర్వాత తాంబూలం అందించింది రజని ఇష్టం లేకపోయినా రామం నిరాకరించలేదు.

రజని కారులో బయలుదేరబోతుంటే రామం "చాలా ఆలస్యమయింది. ప్రసాద్ మీ కోసం ఎదురు చూస్తున్నాడేమో? కారు కూడా తీసుకు వచ్చారు. మీరు యిప్పటి వరకు ఎక్కడ వున్నారని అడిగితే ఏమని చెప్తారు?" అన్నాడు.

"ప్రసాద్ కి నిజం తెలిస్తే వచ్చి మీ ప్రాణాలు తీస్తాడని "భయపడుతున్నారా? కాని మీరు భయపడకండి ఆయనకి నేనే భార్యనయితే యిలా భయపడవలసి వుండును. కాని యిప్పుడు వేరు, నేను ఆయన పాదదాసిని కాను ,ఆయన ప్రేయసిని మాత్రమే అంది" రజని నవ్వుతూ."

కారు యింజను స్టార్ట్చేసి బయలుదేరబోయే సమయానికి, రామంకు ఎందుకో హృదయం బరువయి నట్టనిపించింది. అర్ధం లేని ఆవేదన అంతర్గతంలో ఆవరించింది. ఎంతోకాలపు ఆత్మీయత అంతం ఆవుతున్నట్లు అనిపించింది.

గబగబ దగ్గరకు వచ్చి "చూడండి మళ్లీఎప్పుడు కనబడతారు?" అన్నాడు.

నవ్వుతూ "స్వప్నంలో" అని రివ్వున వెళ్లి పోయింది.

 

చాప్టర్ 2

పది రోజుల తరువాత ఆరోజు సాయంకాలం కమలాకరము, కమల యిండియా గేటువద్దకు షీకారుకి వెళ్లారు. చలికాలం అవటం వలన, దాదాపు ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా వుంది. బాగా చీకటి పడింది. ఒకరి ప్రక్కన వొకరు చేతుల మీద ఆనుకుని పచ్చటి పరుపు మీద పరుండి ఆప్యాయంగా కబురు చెప్పుకుంటున్నారు. కొద్దిరోజుల నుంచి కమల ప్రవర్తనలో ఒక విధమైన మార్పు కమలాకరం గుర్తించాడు. పూర్వవు అశాంతి ఆమెలో మాయమయినట్లు కనబడింది. అర్ధం లేని ప్రశ్నలు వేసి పిచ్చిగా ప్రవర్తించటం లేదు. అతనిని సంతోషపెట్టడానికి ఆమె ప్రయత్నించేదీ. అతని ఆప్యాయతా, ఆదరం, అనురాగం కాంక్షించేది. వాటికి పూర్వము యివ్వని విలువ ఆమె యిచ్చేది భార్యలో కలిగిన యీ మార్పుకు ఎంతో సంతోషించాడు. అయినా దానికి కారణమడుగకుండా వుండటమే వుత్తమమని భావించాడు. వచ్చే ఆదివారం ఎక్కడికైనా సరదాగా వెళదామా చెప్పండి ? ఆరోజే కార్తిక పౌర్ణమి పుచ్చపువ్వు లాంటి ఆ పండు వెన్నెలలో తాజమహల్ కన్నుల పండువగా వుంటుంది. కల్లోల పూరితమైన మనస్సులకు అదే ఎంతో శాంతిని యిస్తుంది. అగ్ని రగిలే ఆత్మలకు అదే చల్లని జీవనం. భార్యాభర్తల అమర ప్రేమకి ఆదే పవిత్ర నిదర్శనం దానిని చూచిన కొలది చూడాలనిపిస్తోంది. ఆదృశ్యం మనస్సుకి నూతన శక్తిని నిలకడ యిస్తుందనే నమ్మకం నాకువుంది" అంది కమల వుద్రేకంగా.

కమలాకరానికి, భార్య మాటలు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. ఆమె యింతకు ముందెప్పుడు ఆవిధంగా మాట్లాడినట్లు గుర్తులేదు. ఆమెలో ఆ శాంతి మాయమయినదనుకోవటం ఒక అపోహ మాత్రమే అని గ్రహించాడు కాని, అది నూతన పరవళ్ళు తొక్కుతోందని గ్రహించాడు. పూర్వపుఅశాంతికి యీ మాటలోంచి తొంగేచూసే అశాంతికి, ఏదో విభేదం గోచరించింది. ఈ మాటలలో ఆప్యాయత అనురాగమువున్నాయి. ఇదే ఆతనికి ఎంతో సంతోషాన్ని కలుగజేసింది.

కమలాకరం భార్యను ఆదరంతో దగ్గరకు తీసుకుని "కమలా! అలాగే తప్పకుండా వెళదాము. నాకూ చూడాలనే వుంది. కాని నువ్వు నాకు యిది చెప్పాలి. నూతన శక్తి నిలకడ నీకీనాడు ఎందుకు అవసరమయ్యాయి?" అన్నాడు.

కమల ఒక క్షణం మౌనం వహించింది. మెల్లగా కారణం నాకు సరిగా తెలియదు కాని ఒక విషయం నేను మీకు చెప్పకుండా వుండలేను, మీరంటే నాకు ఎన్నడూ లేని గౌరవాభిమానములతో నా మనస్సుయీనాడు పెల్లుబుకుతోంది. మాటలకు మించిన మమత మనస్సులో మెదుల్తూంది" అంది.

స్పష్టంగా, సుమధురంగా వినిపించిన ఆ సున్నిత ప్రేమ వాక్యాలకి కమలాకరం కరిగిపోయాడు. గంభీరుడు, మితభాషి అయిన అతగాడు గద్గద కంఠస్వరంతో,"కమలా యిన్నాళ్ళు నీమాటల్లోని మాధుర్యాన్ని,మైమరపించే మమతను నానుంచి ఎందుకు దాచివుంచావు? కాలాతీతమైన ఈ కృతజ్ఞత నా హృదయాన్ని చీల్చి భరించరాని ఈ ప్రేమానురాగాన్ని నేను ఏ విధంగా వెల్లడించను" అని వుద్రేకంతో కమలను గాఢంగ హృదయానికి హత్తుకొన్నాడు."నిన్ను నాలో పూర్తిగాలీనం చేసుకోవాలని భరింపరాని కాంక్ష కలుగుతోంది కమలా." అని కమల ముఖంమీద ముద్దుల వర్షము కురిపించేడు. కమల ఆతని వుద్రేకానికి అసమ్మతి కాని సమ్మతి కాని తెలుపలేదు. మౌనంగా కళ్ళు మూసుకుని మెదలకుడా వూరుకుంది కమలాకరం పూర్తిగా తన్మయుడై తనను తాను మరచిపోయాడు. కొంత సేపు గడిచేటప్పటికి కమల మెల్లగా కళ్లు తెరిచింది. వెంటనే త్రుళ్ళిపడి కమలాకరం కౌగిలి విడిపించుకొని సిగ్గుతో వళ్లు సవరించుకుంది. మసక చీకటిలో కూడా తన యెదుట నిలబడి వున్న పురుషాకారాన్ని స్పష్టంగా గుర్తించగలిగింది కాని ఏం చెయ్యాలో ఏమనాలో ఆమెకు ఏమి తెలియలేదు కమలాకరం అది గ్రహించేడు కాని ప్రసాద్ని గుర్తించలేకపోయాడు.మత్తునిద్రలోంచి బలవంతంగా లేపినట్లు క్రోధంతో అతనిని వుద్దేశించి "రాస్కెల్" అన్నాడు.

ప్రసాద్ పకపక నవ్వుతూ "ప్రణయకలాపానికి భలే స్థలం కని పెట్టావు కమలాకరం కాని మీ దురదృష్టం. నా కారు లైట్లు మీ గుట్టు బయటపెట్టాయి. అయినా ఫరవాలేదు "కారీ ఆన్" అన్నాడు.

కమలాకరం కి ప్రసాద్ మాటలు ప్రవర్తనా కొద్దిగా ఆశ్చర్యం కలుగాజేసాయి. ప్రసాద్ కాస్తనిషాలో వున్నాడని గ్రహించాడు. కాని కమల ఆ వాసనబట్టి కాని, ప్రవర్తనబట్టి కాని ఆ విషయం ఊహించలేదు. చివాలున లేచిప్రసాద్ ని చెంప పెట్టు పెట్టింది. "నీకుయుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం,నీతి నియమాలు లేవని నాకు యింతకు ముందే తెలుసు కాని నువ్వు మూర్ఖుడవని, మొరటు వాడివని, నేను యిప్పుడే గ్రహించాను. ఫో యిక్కడి నుంచి" అంది.

ఈ మాటలు అని కమల వెక్కి వెక్కి ఏడుస్తూ నేలమీద కూలిపోయింది. చెంప పెట్టు తిన్న ఒక నిమిషం వరకు ప్రసాద్ అచేతనారహితుడై నిలబడిపోయాడు. చెంప పెట్టుతో మత్తు వదలిపోయింది జరిగినదంతా జ్ఞప్తికి వచ్చింది. కాని ఏం చెయ్యాలో తెలియలేదు కమలాకరంతో మాట్లాడటం ఇష్టం లేకపోయింది. చివరికి "కమలా!" అని పిలిచాడు. ఒక క్షణకాలం వరకు ఆమె జవాబు కోసం నిరీక్షించి ఆ తరువాత అతను రివ్వున వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. కొద్ది క్షణాలలోనేనిశ్శబ్దాన్ని నిర్ధాక్షణ్యంగా చీల్చుకుంటూ శరవేగంతో ఒక కారు బయలుదేరి వెళ్ళిపోయింది.

కమలాకరంకి భార్య ప్రవర్తన చాలావరకు సహజంగానే కనిపించింది. ప్రసాద్ నిషాలో వున్నాడన్న విషయం ఆమె గ్రహించలేదని తెలుసుకున్నాడు. కాని ఆమె చెంప పెట్టు పెట్టిన తర్వాత "ఎందుకు కమలా "అన్నాడు? అతనికి అర్ధం కాలేదు దగ్గరకు వెళ్ళి "కమలా ఎందుకలా అనవసరంగా దుఃఖపడతావు జరిగినది జరిగిపోయిందిలే" అన్నాడు.

కమల కన్నీటితో తడిసిపోయిన తన ముఖాన్ని చివాలున ఎత్తి "పర పురుషుడు నన్ను ఇలా అవమానిస్తే మీకు ఏ మాత్రము దుఃఖం కాని, క్రోధం కాని లేదా !" అంది.

"ఈవిధంగా జరిగినందుకు నాకు దుఃఖంగానే వుంది. కాని క్రోధం లేదు. ప్రసాద్ త్రాగి వున్నాడన్న విషయం గుర్తించలేదు" అన్నాడు.

ప్రసాద్ త్రాగి వున్నాడని తెలిసేసరికి కమల శరీరం జలజరించింది. అయినా ఆమె మాట్లాడలేదు.

"పద కమలా ! ఆలస్యమవుతుంది." అన్నాడు కమలాకరం.

మరునాడు వుదయం 9 గంటలకు కమలాకరం ఆఫీసుకి పోయే ప్రయత్నంలో వున్నాడు. కమల భర్తకు చొక్కా బొత్తాములు కుట్టియిచ్చే ప్రయత్నంలో వుంది. గత రాత్రి నుంచి కమల ఎంతో ముభావంగా వుంది. రాత్రంతా ఆమెకు సరిగా నిద్రపట్టలేదు. కల్లోల భరితమైన మనస్సును ఆమె పదేపదే ప్రశ్నించుకుంది. ఈ పరాభవానికి నేనెలా ప్రతీకారం చూపాలి. నా భర్త ముందర జరిగిన ఈ అవమానానికి నేనెలా కక్ష తీర్చుకోవాలి. నిజంగా ప్రసాద్ త్రాగి వున్నాడా లేక అది యంతా ఒక నటనా?" అనుకొంది . చిందర వందర అయిన జుట్టుతో, ఎర్రని కళ్ళతో, ముఖమంతా వాడివుంది

ముందర గదిలోకూర్చుని బొత్తాలు కుట్టుతున్న కమల ఎదుట ప్రసాద్ హఠాత్తుగా ప్రతక్ష్యమయ్యాడు. "గుడ్ మార్నింగు- కమలా" అన్నాడు. కమల పూర్తిగా చేతనరహిత ఆయిపోయింది. గత రాత్రి జరిగిన సంఘటన తరువాత ఆ మరునాడే ప్రసాద్ తనకి ముఖం చూపిస్తాడని కమలనుకోలేదు. కొన్నాళ్ల పాటయినా అతడు వారికి దూరంగా వుంటాడని భావించింది. ఆనందించింది. హఠాత్తుగా, ఆ విధంగా కనిపించేటప్పటికి ఆమె క్షణకాలం దిగ్ర్భాంతురాలైంది. కాని మరుక్షణమే ఆమె చివాలున లేచి లోనికి పోయింది. ప్రసాద్ కంఠస్వరం విని లోపలి నుంచీ కమలాకరం బయటకు వచ్చాడు. ప్రసాద్ ని చూసి నిర్మలంగా నవ్వుతూ! "ప్రసాద్. ఇంత త్వరలో నవ్వు దర్శనమిస్తావనుకోలేదు" అన్నాడు.

ప్రసాద్ కుర్చీలో కూర్చుంటూ. "నీ శ్రీమతికి నాపై కోపం ఉన్నట్టుందే." అన్నాడు

కమలాకరంనవ్వుతూ"చెంపపెట్టు అప్పుడే మరచిపోయావా?" అన్నాడు.

"మరచిపోలేదు అందుకనే వచ్చాను. పగ తీర్చుకోవాలి. అన్నట్టు మరచిపోయాను. వచ్చే ఆదివారం ఆగ్రా ప్రోగ్రాం వేయాలి. నేను రజని మీరు కూడా రండి".

కమలాకరం "కారులో నేనా? సరిగా మేముకూడా అదే అనుకున్నాము. అంతా కలసే వెళ్దాం"అన్నాడు. లోపలినుంచి వారి సంభాషణంతా వింటోనే వుందిచాటుగ పొంచి వుండి. ప్రసాద్ వీరి మాటలు గత రాత్రి విని వుంటాడనుకుంది. తనకు కమలాకరానికి మధ్య నడచిన సంభాషణ జ్ఞప్తికి వచ్చి సిగ్గుతో దహించుకు పోయింది. ప్రసాద్ తో కలసి ఆగ్రాకు వెళ్లకూడదని నిశ్చయించుకుంది.

కమలాకరం నవ్వుతూ "సరే! ప్రసాద్ నాకు ఆఫీసుకి ఆలస్యమవుతుంది. నేను వెళ్లాలి. నన్ను సెక్రటేరియట్ వద్ద డ్రాప్ చెయ్యగలవా?" అని "కమలా నా చొక్కా తీసుకురా ! నేను వెళ్ళాలి" అని పిలిచాడు.

లోపలినుంచి కమల వచ్చి కమలాకరానికి చొక్కా యిచ్చి లోపలికి వెళ్ళిపోతూవుంటే ప్రసాద్ "కమలా నామీద కక్ష తీరనట్లుందింకా?" అన్నాడు. "శిక్షకు సిద్దంగా వున్నాను." ఆ కంఠస్వరం వినపడేసరికి కమల మనస్సుఒకసారి ఝల్లుమంది. సమాధానం చెప్పకుండానేలోనికి వెళ్ళిపోయింది.

మిత్రులిద్దరు కారులో బయలుదేరారు. ప్రసాద్ అలవాటు ప్రకారం మనోవేగంతో కారు నడుపుతున్నాడు. కమలాకరం ఆ వేగానికి రామం వలె భయపడలేదు. కాని ఆశ్చర్యంతో "ఏమిటి ప్రసాద్ ప్రాణాల మీద నీకు తీపి లేకపోయినా నాకు వుంది. కాస్త నెమ్మదిగా పోనీయి" అన్నాడు.

కాని ప్రసాద్ వేగం తగ్గించలేదు. "కారు వేగంగా పోతుంటే నా మనస్సుఆకాశములో తేలిపోతున్నట్లుంటుంది. మనస్సు ఆహ్లాదంతో నిండిపోతుంది. గాలిని చీల్చుకుంటూ కారు పోతుంటే నా మనస్సుకి నేను ప్రపంచాన్ని చీల్చుకు పోతున్నట్టనిపిస్తుంది. ప్రపంచంలో అన్నింటిని చీల్చివెయ్యాలి కలయిక , శాంతి, కరుణ వీటికి చోటు లేదు'' అన్నాడు.

కమలాకరాని కెందుకో ఆ మాటలు మాట్లాడినది ప్రసాద్ కాదని, ఎవరో ఒక అపరిచిత వ్యక్తి అని అనిపించింది.

ఆశ్చర్యంతో "కారు ఆపు ప్రసాద్! సెక్రటేరియట్ వచ్చేసింది" అన్నాడు.

కమలాకరం కారు దిగి వెళ్ళిపోతూంటేప్రసాద్, "అయితే మనం శనివారం రాత్రి బయలు దేరి వెళ్ళుదామా లేకఆదివారం ఉదయం వెళ్దామా ఆగ్రాకి?" అన్నాడు,

కమలాకరం వెనుతీరిగి శనివారం రాత్రేవెళ్దాము శనివారం పౌర్ణమిట" అన్నాడు

కారులో ఒంటరిగా వెళ్ళిపోతూ ప్రసాద్ అనుకున్నాడు, పౌర్ణమి_తాజమహల్ _కమలా.

మరునాటి సాయంత్రం రామం ఆఫీసు నుంచి తిరిగివచ్చి చూచేసరికి బయట రజని, నిలబడి అతని రాక కోసం ఎదురు చూస్తోంది. రజనిని చూచేసరికి రామం హృదయం సంతోషంతో ఒకసారి స్పందించింది. ఆనాడు రజని వెళ్ళిపోయిన తరువాత అతనికి రజనిని అడ్రస్ అడగలేదని గుర్తుకు వచ్చింది. అప్పటి నుంచీ ఆమె ఎక్కడైనా కనబడు తుందేమోనని వేయికళ్ళతో వెదుకుతున్నాడు. ఈనాడు హఠాత్తుగా ఆలా తన రాక కోసం నీరీక్షణ చేస్తున్న ఆమె సుందర రూపం అతని హృదయానికి ఆహ్లాదం గలిగించింది.

"మీకోసం చూచి చూచి నా కళ్ళు కాయలు కాచిపోయాయి కాళ్లు తేలిపోతున్నాయి. ఇంత ఆలస్యం చేసేరేమిటి?" అని క్షణకాలం ఆగి" లేక నాబోటి వారికి ఎదురు చూడడం అలవాటే అంటారా?" అంది నవ్వుతూ,

"మీరిలా హఠాత్తుగా ఆకాశంనుంచి వూడిపడతారని నేనేమైన కలగన్నానా?" అన్నాడు తాళం తీస్తూ రామం.

"అవును. నేను మీకు చెప్పాను కదా, స్వప్నంలో మనము కలుసుకుంటామని" అంది లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ రజని.

"నాకు నిజంగానే మీరు కలలో కనపడ్డారు. కారులో మీరు పోతూ, కాలినడకను పోతున్న నన్ను చూచి పకపక నవ్వారు కోపంతో ఒక రాయితీసి మీ మీద విసిరాను కాని అది ప్రక్కనున్న ప్రసాద్ కి తగిలింది. ఇది నా కల" అన్నాడు రామం,

"మీరు రాయి విసిరింది నేను కారులో పోతూనవ్వినందుకు కాదు. ప్రసాద్ నా ప్రక్కన వున్నాడని యిర్ష్యతో ఆలా చేసారు. బెడ్డ వెసింది నాపై కాదు - ఎవరి మీద వెయ్యాలనుకున్నారో వారికే తగిలింది, మీదంతా బూటకం మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు" అంది రజని మందహాసం చేస్తూ.

స్వప్నానికి సునాయసంగా తీసిన ఆ అర్ధానికి రామం విస్మయపోయాడు "నాకు ప్రసాద్ వుంటేయిర్ష్యఎందుకు చెప్పండి మీదంతా పరిహాసమే" అన్నాడు.

రజని రామం కళ్ళలోకి చూస్తూ ; "ఒకరు కాంక్షించేవస్తువు ఇంకొరి సొత్తు అయినప్పుడు వారిమీద యిర్ష వుండదా ఇప్పండి? రక్తమాంసాలెంత సహజమో, మీబోటివారికీ ఈర్ష్య కూడా అంత సహజములే.స్త్రీ ఎప్పుడూ ఎవరిదో ఒకరి సొత్తుగా వుండాలని మీరనుకుంటారు. పరాయివాడు ప్రేమతో చూచినా, పరధ్యానంగా పళ్లికిలించినా మీ రక్తం కుతకుత వుడికి పోతుంది. రజని నాకు కావాలి. పరాయివారెవరు ? ఆమెను తాకకూడదు, అని మీరనుకుంటున్నారా? లేదా" అంది.

రజని వేసిన అభాండానికి రామం కంగారు పడ్డాడు. రజని వేసిన ఎత్తు అతను గ్రహించలేక పోయాడు. అజ్ఞాతంగా, అస్పష్టంగా ఆంతర్యంలో వున్న కోర్కెలకు ఆకారం యిచ్చి, అతని ముందర విగ్రహాన్ని నిలబెట్టింది. రామాన్ని ప్రేరేపించడానికి అన్నమాటలవి కాని, రామం అది గుర్తించలేక సిగ్గుతో క్రుంగిపోయి మీరు అలాంటి అపార్ధం కలిగే మాటలెందుకంటారు చెప్పండి "నాలో అలాంటి కోరికలేవీ లేవు. అలాంటిది నేను కలలో కూడా తలబెట్టను. ప్రసాద్ నా ఆప్తమిత్రుడు. అతనికి నేనే ద్రోహం తలపెడ్తానా?" అన్నాడు.

రజనీ వేసిన వుచ్చులో అతను పడిపోయాడు. "ప్రసాద్ మీఆప్త మిత్రుడు. కాకపోతేను ! మీరు ఆయనకి ద్రోహంచెయ్యవలసిన అవసరం లేకపోతేను ! మీరు ఏం చేస్తారూ" అంది.

రామం తబ్బిబ్బయ్యాడు. "అప్పుడు ఏం చేస్తానా ?" అని ఏదో అనబోతుంటే రజని కఠినంగా "రజని కోసం ఒంటికాలు మీద తపస్సు చేస్తారు. రాత్రింబగళ్ళు నిద్రమాని వెఱ్ఱి వెఱ్ఱిప్రేమలేఖలు వాస్తారు ప్రేయసీ, హృదయ రాణి అని గేయాలు వ్రాస్తారు. ఇదే ఆత్మవంచన. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఒక సమయంలో ఒక సంపూర్ణమైన పదార్థంగా పరిగణించరు, అర్ధం లేని అనేక వాటితో ముడి పెడతారు మీలో అన్ని (ఎమోషన్స్) ఆణచిన ఆవేశాలువుక్కిరి బిక్కిరి అయిన వుద్రేకలు - వీటికి పూర్తి స్వాతంత్యం ఎందుకు యివ్వరు?" అంది.

రజని మాటలకన్నా ఆమె కంఠస్వరంలో కర్కశత్వం ఆతన్ని ఆశ్చర్యపర్చింది. నెమ్మదిగా అయితే, జీవితంలో అన్ని వస్తువులు అందరి అందుబాటులోనూ వుంటాయా. రజని! అన్నాడు.

"వుండక పోవచ్చు. కాని వున్న వాటిని కూడ వారిది వీరిది అని వేసుకోవడం అవివేకమంటున్నాను" అంది నవ్వుతూ.

రామానికి, రజని ఆ మాటలు పరిహాసానికి అన్నదో, మాట వరసకే అందో నిజంగా అంతు తెలియలేదు. తప్పించుకొనే వుద్దేశంతో "కాఫీ చేస్తాను. కాస్త తాగితే మీమనస్సు కొంత కుదుటపడుతుంది అన్నాడు.

ఈసారి రజని తాను కాఫీ చేస్తానని ముందుకు రాలేదు. మెదలకుండా అక్కడే కూర్చుని రామం చేష్టల్ని కన్నార్పకుండా చూస్తూంది. కాస్త నిదానించి చూసే పెదవుల మీద మందహాసం కనబడుతుంది.

కాఫీతాగుతూ రజని "సినీమాకు వెళదాం పదండి" కాదంటే లాభం లేదని అతనికి తెలుసు. యిద్దరు కలసి సినిమాకు వెళ్ళేరు. సినిమా చూస్తున్నంతసేపు, రజని శరీరం తన శరీరానికి తాకినప్పుడల్లా అతని శరీరం ఝల్లుమంటోంది. అప్పుడప్పుడు రజని ప్రయత్నపూర్వకంగా అలా చేస్తూందా అనుకున్నాడు. సీనిమా ఒక అతి సాధారణమైన విషాధ గాధ. లలితా, శ్యాములు బాల్య స్నేహితులు. ఇద్దరు సమవయస్కులు. లలితకి యవ్వనంలో అడుగు పెట్టిన వెంటనే వివాహం చేస్తారు. అప్పటికి అతను చిన్నవాడు. లేత వయస్సప్పుడు అవటం వలన అతనికి ఆ గాయం అప్పుడు ఎట్టి బాధ పెట్టలేదు. కానీ కాలంగడిచే కొలది తాను కోల్పోయిన వస్తువు యొక్క విలువ తెలిసి వచ్చింది. ఆమె మీద ప్రేమ దినదినాభివృద్ధి చెందజొచ్చింది. ఆమె శ్యామం యొక్క మనస్సును మొదట గుర్తించలేదు. తరువాత అది తెలిసిన తరువాత అతనిని పరిహాసం చేసేది. కనీసం సానుభూతి కాని, ఆదరం కానీ, ఆమె చూపించలేదు. ఒకనాడు ఆ శ్యామే, లలితకు తన హృదయపు ఆవేదన నివేదించగా ఆమె అతనికి సలహా యిచ్చింది. "ఏ ఒక వ్యక్తికి యింకొక వ్యక్తి పై నవ్వు చెప్పినంత అనురాగము, ప్రేమ వుండడము అసంభవము. ఇదంతా నీ పిచ్చి. నీకింకా చిన్నతనం వదలలేదు. ప్రపంచ జ్ఞానం బొత్తిగా నీకు లే" దంది.

గాయపడిన హృదయంతో "నిజంగా అసంభవమా లలితా" అన్నాడు.

లలిత "అసంభవమైనా, కాకపోయినా, అవాంఛనీయం" అంది.

లలిత మాటలు శ్యామ్ హృదయంలో గునపాలు గుచ్చినట్లు అయింది, కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న దుఃఖాన్ని శక్తినంతా కూడదీసి సంభాళించుకొని అన్నాడు "నువ్వు నన్నుప్రేమించడం లేదని నేను అట్టే బాధపటం లేదు. లలితా! అది అసంభవమని నాకు తెలుసు, కాని నువ్వు నా ప్రేమనే హేళన చేస్తావు. కనీసం సానుభూతియైనా చూపించవు నా హృదయంలో సదా చెలరేగే యి బడదాగ్నిని నేను భరించలేను, కనీసం "నువ్వు నీ ప్రేమ నాకు తెలుసు. దానికి నా సానుభూతి వుంది కాని నేను అసహాయురాలిని. నేనేమి చెయ్యలేదు. కాని సదా నిన్ను నా మనస్సులో తలచుకుంటూ వుంటాను." అని హృదయ పూర్వకంగా చెప్పినట్లయితే నా మనస్సుకి కాస్త శాంతి లభిస్తుంది" అన్నాడు.

లలిత నవ్వుతూ "సినిమాలో సంభాషణలా వున్నాయి నీమాటలు" అంది.

చెళ్లుమని చెంప పెట్టు పెట్టునట్టు అయింది భరింపరాని ఆ అవమానంతో హృదయం అంతా దహించుకుపోయింది. దుఃఖంతో అభిమానంతో వణికి పోతూ "లలితా! ఒక వ్యక్తి ప్రేమను చులకన చేసే నువ్వు స్త్రీవి కావు పాషాణనివీ, అని బయటికి వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. లలిత పేర ఒక వుత్తరం విడచి వెళ్ళిపోతాడు. అందులో

లలితా?"నా జీవితమంతా నీ కోసమే గడిపేను. యీనాడు నా మరణానికి నీవే కారణభూతురాలవని నేను చెప్పి నిన్ను నేను కించపరచను. పుట్టుక నుంచి ప్రతి మానవునికి ఏదో ఒక మార్గం నిర్దేశించబడి వుంటుంది. దాని వెంబడే పయనించాం, నీనీడలో నేనా బాట నిర్దేశించబడింది. నీ యెడ నాకు ఏర్పడిన అనురాగాన్ని ఆత్మీయతని తెంచుకోవాలని నేను శక్తి వంచనలు లేకుండా ప్రయత్నించేను.

కాని నాకు అది సాధ్యపడలేదు. నీ చూపుకోసం, నీ కంఠం కోసం నాహృదయమెప్పుడూ తహతహలాడేది, నా శరీరంలోని, ప్రతి అణువు సర్వదా "లలితా ? లలితా ? అని ఘోషించేది. పరులు వుచ్చరించినా లలితా అనే శబ్దం నా హృదయాన్ని స్పందింపచేసేది కాని నువ్వు నాయెడ ఎప్పుడూ ప్రదర్శించే నిర్లక్ష్యం, నిర్దాక్షిణ్యం, పరిహాసం, నా హృదయానికి రంపపు కోతలాగ వుండేది. నేను దీనిని ఎంతో కాలం సహించేను, కాని యిక నేను సహించలేను. ఎన్ని కష్టాలనైన నేను భరించగలను. కాని నువ్వే నా ప్రేమను హేళన చేయ్యటం నేను భరించలేను. అందరి ఎడ నువ్వు ఎంతో అనురాగం, ఆదరం, సానుభూతి ప్రసాదిస్తావు. నేను చేసిన నేరం ఏమిటి? లలితా! కాస్త కనికరం చూపించి నట్లయితే నువ్వొక జీవి ప్రాణం కాపాడేదానివి. నాకు పునర్జన్మలో నమ్మకం లేదు. కాని ఆ దేవుడుంటే నీలాంటి స్త్రీ యెడ నా హృదయంలో ప్రేమ లేకుండా ప్రసాదించమని నేను భగవంతుని వేడుకుంటాను."

ఉత్తరం చదివి లలిత రెండు కన్నీటిబిందువులు రాల్చిందంతే. వాటితోనే ఆమె అన్నీ కడిగి వేసుకుంది లలిత భర్తకు శ్యాము సంగతిచూచాయగా తెలుసు. అతను చాలా దుఃఖపడ్డాడు. కాని లలిత నవ్వుతూ "ఆతని ఆత్మహత్యకు నేను బాధ్యురాలను ఎంతమాత్రము కాను, అతనికి నాపై ప్రేమ వుంటే నేనేం చెయ్యను. నాకు మీరే సర్వస్వం నా హృదయమూ, నా మనసూ, నా శరీరం అన్నీ మీరే. నాకు యితరుల ప్రసక్తి లేదు" అంది.

సరిగ్గా అదేఘట్టంలో రామం రజనితో "నేనింకా కూర్చోలేను. బయటకు పోదాం" అని బయటకు వచ్చేశాడు రజని ఆశ్చర్యంతో అతనిని అనుకరించింది.

బయటకు వచ్చి "ఏమయింది? ఆటమధ్యలో ఎందుకు వచ్చేసేవు" అంది.

"నేనిక అది చూడలేను. కధ మరీ అసంభవంగా వుంది, అలాంటి స్త్రీలు ఎక్కడేనా వుంటారా? పాషాణహృదయులు" అన్నాడు రామం.

రజని నవ్వుతూ. "ఓ అదా సంగతి. కధానాయకుని మరణం మిమ్మల్ని కలవరపెట్టిందా? లలితలాంటి వారు ఎందుకుండరు? అయినా ఆమె చేసిన తప్పేమిటి? పరుల ఆత్మహత్యలకు ఆమె బాధ్యురాలు కాదు" అంది.

"అది కాదు రజనీ ఆమె అతనిని ప్రేమించక పోవచ్చును, వివాహం అయివుండవచ్చు. తోటి మనిషని కష్టాలకి సానుభూతి చూపించటం ఆమె కనీస ధర్మం కాదా!

ఆమెకోసం ఒక వ్యక్తి ఆవిధంగా పరితపిస్తూ ప్రాణ త్యాగానికి తలపెట్టినప్పుడు కూడా ఆమెమనస్సు కరగలేదు. ప్రపంచంలో అనేక బాధలున్నాయి అనేక కష్టాలున్నాయి. కాని అన్నింటిలోకి భరించరాని బాధయిదే. తను ప్రేమించేవ్యక్తి తన ప్రేమను బూటకమని హేళన చేస్తే భరించటం కష్టం. తను ఎవరిరూపాన్ని అయితే హృదయపీఠంమీద ప్రతిష్టించి పూజిస్తూ వచ్చేడో, ఆ వ్యక్తి "నీకు నామీద వున్నది ప్రేమ కాదు. పుస్తకాలలోని పిచ్చి అంటే ఎంత బాధగావుంటుంది చెప్పు? అప్పుడప్పుడు రెండు మూడు అనురాగపూరిత వాక్యాలనినంతమాత్రాన ఆమె పాతివత్యానికి ఏమి భంగంవస్తుంది? అలాంటి మాటలే అతనికి మనశ్శాంతి నిచ్చివుండును. ఆహ్లాదకరమైన ఆమె స్మరణతో ఆనందాన్నిచ్చే అనుభూతితో అతను జీవించియుండును" అన్నాడు రామం వుద్రేకంగా.

ఇందులో రెండు విషయాలు వున్నాయి. మొదటిది ఏమంటే నిజంగా ఆమె మనస్సులో అతని యెడ ప్రేమ వుండినట్టయితే ఆమె చేసింది తప్పు. అందులో పాతివత్యం, పరాశక్తి వీటికి చోటు లేదు! రెండవది ఏమిటంటే ఒక వేళ ఆమె అతనిని ప్రేమించివుండక పోతే ఆతని ఆత్మహత్యకు బాధ్యురాలు కాదు. ఒకతను నన్ను ప్రేమించి నిరాశ చెంది వెళ్ళి ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. అతను కొన్నాళ్ళకు విమానం కూలి చనిపోయేడని పేపర్ లో చదివేను. అందుకు నేను బాధ్యురాలనా?" అంది రజని.

రామం కుతూహలంతో "ఎవరతను? ఎప్పుడు జరిగింది?" అన్నాడు.

"నాతో యూనివర్సిటీలో చదువుకున్నాడు.ప్రసాదుకి తెలుసు అతను. నషీర్ అనే బెంగాళీ వాడు. మంచి వాడే. మనిషిలో మర్మం ఏకోశానా లేదు. బాగా తెలివైనవాడు కూడాను; నన్ను చాయలా వెంబడించేవాడు. నామీద ఒకటో రెండో పద్యాలు కూడావ్రాశాడు. నాకు చాలా జాలివేసేది. పెళ్ళి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. నేను ససేమిరా ఒప్పుకోలేదు. స్నేహితుడుగా స్వీకరిస్తాను గానిప్రియుడుగా పనికిరావని చెప్పాను, కారణమేమిటంటే అతడు శారీరకంగా నన్నాకర్షించలేకపోయాడు, భగ్న హృదయంతో అతను యూనివర్సిటీ వదిలి ఎయిర్ ఫోర్సులో చేరినాడు. రెండు నెలల ముందు పేపర్లో చదివాను, విమానంకూలి మరణించాడని. నా పేర చాలా ప్రేమలేఖలు వ్రాశాడు. అవన్ని పెద్ద కవరులో పెట్టి పైన నా పేరు వ్రాసివుంచాడట. నా పేర తనజీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకున్నాడట. నాకు ఒక పది వేలరూపాయిలు వచ్చాయి. అవన్నీ అతని మరణం తర్వాత నాకు పంపించారు. అవన్నీ చదివి,తర్వాత నేననుకున్నాను. నిజంగా నన్ను అతడు ప్రేమించాడని. ప్రేమలేఖలు అచ్చు వేద్దామనుకున్నాను. యీ కాలంలో అవి బాగా చేల్లుబడి అవుతాయి. ప్రియురాలి ప్రేమకోసం తపిస్తూ ఉత్తరం వ్రాద్దామంటే వేలునడవక కలవర పడుతున్న ప్రేమికులు చాలామంది వున్నారు, అలాంటి వారికిది ఐస్ క్రీం లాంటిది. పరోపకారం చేసిన దాని నవుతాను ఏమంటారు?" అంది రజని.

రజని చెప్పిన ఆ విషాద గాధ రామం హృదయాన్ని కరగించివేసింది. రజని వ్యంగ్యంగా, పరిహాసంగా మాట్లాడడం అతనిని మరీ బాధ పెట్టింది. "అ డబ్బు ఏం చేశావు?" అని అడిగాడు.

"దాచివుంచాను. మీకు కావాలా?" అని అడిగి రామం ముఖకవళికలు చూసి "లేదండీ. అదంతా అతని తల్లిదండ్రులకు పంపించి వేశాను" అంది.

"అయితే, అతనంటే నీకు సానుభూతి లేదా? అతని స్కృతి నిన్ను బాధ పెట్టదా ? అతని పేరును అలా తిరస్కరించటం తప్పు కాదా? కేవలం శరీరాకర్షణయే ప్రధానమైన సంగతా? ఇక దేనికీ విలువ లేదా?" అన్నాడు రామం.

"మీరు అలా వుద్రేకపడి మాటలు కురిపించినంత మాత్రాన ఏమి లాభం లేదు. నాకు సానుభూతి వుందా అని అడిగారు. దాని అవసర మేమిటి? ఏదో వ్యర్ధంగా నాకు సానుభూతి వుంది అంటే మీరు సంతృప్తిపడతారు. ఆహా! రజనిది దయార్ద్రహృదయం అంటారు. లేకపోతే కఠినురాలు అంటారు. కాని దాని లాభమేమిటి? ఇక అతని స్మృతి నన్ను బాధపెట్టడం లేదా అని అడిగారు! అది నిజమే అప్పుడప్పుడు బాధకలిగిస్తుంది. అందుకనే నేను దానిని స్మృతిపధంలోకి తీసుకురాను. ఈ సినిమా చూస్తేజ్ఞాపకం వచ్చింది. ఇక మీ మూడవ పశ్న కేవలం శరీరాకర్షణయేనా ప్రధానం? అదే సర్వస్వము అని చెప్పను. కాని అది కూడా ముఖ్యమైనదే. అదే శూన్యమయితే మనస్సులు ఎంత ప్రేమించుకున్నా మనుష్యులు విడిగా వుండవలసిందే? ప్రేయసీ ప్రియులుగా వుండటం అసంభవం..." అంది రజని.

"జీవితంలో మనం ప్రతివిషయాన్నీ లాభనష్టాల దృష్టితో చూచి నిర్ణయించాలంటే, నేను శతవిధాలా అంగీకరించను. స్పర్శలకందని విలువలు జీవితంలో ఎన్నో ఉంటాయి. వీటిని మనం ఆశయాలంటాము అవి మరుగున వుండవచ్చు. కాని వాటిని మరచిపోకూడదు. ఆశయాలను అనుభవంలో పెట్టడం కష్టమని నేను ఒప్పుకుంటాను. చాలావరకు అవి ఎండమావులలాగే వుంటాయి. అయినాసరే అవి ప్రతి మానవుని మనస్సులోను మెదుల్తూ వుండాలి. అప్పుడప్పుడు దారి తప్పినప్పుడు కళ్ళెంలాగి అవి మనస్సును కాస్త వెనకకు లాగుతుంటాయి, లేకపోతే నావికుడు లేని నావలా ప్రవాహములో కొట్టుకు పోతాము" అన్నాడు రామం.

తరువాత తీరికగా మాట్లాడుకుందాము. నాకు కాళ్లు పీకుతున్నాయి. కాస్త ఏదైనా వాహనంలో పడవేసి ఇంటికి తీసుకువెళ్ళండి. అబలను, అసహాయురాలిని, నన్నిలా నడిపిచడంమీకు న్యాయం కాదు" అంది రజని నీరసంగా.

రామం ఆవేదనతో "క్షమించండి. మాటలలో పడి మరచిపోయాను" అని టాక్సీ వొకటి పిలిచి అందులో కూర్చున్నారు.

"టాక్సీని ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? మీయింటికా? మా యింటికా? ముందర నన్ను డ్రాప్ చేసి మీరు వెళితే సబబుగా వుంటుందేమో?" అన్నాడు రామం.

"ఇంత రాత్రి నన్ను తీసుకుని మా యింటికి వెళ్ళితే ప్రసాద్ ఏమయినా అపోహపడతాడని మీరు భయపడుతున్నారా? ఒక వేళ ఆయన నిజంగా నామీద నీలాపనిందలు మోపినన్నింట్లోంచి వెళ్ళగొట్టితే మీరే నాకు ఆశ్రయ మివ్వాలి. అందుకని మీరు దగ్గరవుండటమే మంచిది. అప్పుడు ఋజువవుతుంటుంది. లేకపోతే ప్రజల ఎదుట రజని ఎవరు! నేను యిమెను ఎప్పుడూ చూడనైనాలేదు. పేరేయినా యింతకుముందు వినలేదు అంటారు. చివరకు నేను నిజంగా ఒక భిక్షుకురాలిని అయిపోతాను. బాబోయ్! మా యింటికి పోనీయ మనండి. డ్రైవర్ ! మోతీ బాగ్ చలో " అంది రజని.

రజని మాటలు ఎందుకో రామం హృదయంలో అశాంతిని లేపాయి కళ్లల్లోకి కన్నీరు ఉబికివచ్చేయి. బలవంతాన వాటి ఆపుకొని "నేనలాంటి వాడినా, రజని? నా మీద నీకు నమ్మకము లేదా?" అన్నాడు రామం.

"మీరు అలాంటి వారు అవునో కాదో నాకేం తెలుసు? మూడునాళ్ల పరిచయం మీది. ప్రారంభంలోనే నన్ను వేశ్య అన్నారు. చివరకు నమ్మితే నష్టపోతానేమో, మగవాళ్లంతా మోసగాళ్లని మా అమ్మ అంటూ వుండేది " అన్నది రజని.

కాసేపు మౌన ముద్రవహించి "నెమ్మదిగా మీ అమ్మగార్కి మగ వారిమీద అంత అపనమ్మకం ఎందుకని రజనీ" అన్నాడు రామం.

"ఎవరో బాగా డబ్బున్న ఆయన మా అమ్మను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి మోసగించి పారిపోయాడట దాని ఫలితమే నేను" అంది రజని.

రజని పుట్టుపూర్వోత్తరాలు గురించి రామం, అప్పుడప్పుడు ఆలోచించేవాడు. కాని అడిగే ధైర్యం లేకవూరుకునే వాడు. యీనాడు అకస్మాత్తుగా తెలియవచ్చింది. క్షణకాలం అతని శరీరం గగుర్పొడిచింది. అయితే మీ అమ్మగారు యిప్పుడు జీవించి లేరా రజని" అన్నాడు రామం,

అది నాకు తెలియదు పదేళ్ల ప్రాయంలో నన్ను విడచి ఎక్కడికో వెళ్లి పోయింది. ఆ తరవాత మా మామయ్య నన్ను పెంచి పెద్ద దాన్ని చేసాడు" అంది రజని.

ఎందుకు వెళ్లిపోయిందో, ఎక్కడకు వెళ్లిపోయిందో, యిప్పుడు యేమి చేస్తూందో, అడగడం అతనికి యిష్టము లేకపోయింది. ఆ విషయాలన్ని తెలుసుకోవడమంటే ఎందుకో అతనికి భయం వేసింది రజని గత జీవితంతో తనకు ప్రసక్తి లేదు.

టాక్సీ వచ్చిరజని యింటిముందు పోర్టికోలో ఆగింది.

నవీన పద్ధతులలో నిర్మింపబడిన రెండు అంతస్తుల భవనమది. రజని అంత ధనవంతురాలని రామం ఊహించలేదు.

"రండి లోపలికి రండి. భయపడుతున్నారెందుకు? లోపల ఎవరూలేరు" అంది రజని.

అంత రాత్రి వేళ రజనితో వంటరిగా ప్రసాద్ కు కనబడటం అతనికి యిష్టంలేక పోయింది. కాని చేసేది ఏముంది. విషయం చెప్పితే పరిహాసం చేస్తుంది, మీరుయింత పిరికివారా? అంటుంది.

ఇంటి లోపలకూడ ఆధునిక పద్దతిలోకూడ అన్నీ అమిర్చివున్నాయి. పెద్ద డ్రాయింగురూము - అంత సుందరంగా అలంకరించబడియుంది. రజని కూర్చోమని చెప్పి లోపల నుంచి వంట వానిని పిలిచింది. ఈ బాబుగారు కూడ యిక్కడ భోంచేస్తారు త్వరగా అన్నం సిద్ధం చేయ్" అని చెప్పింది.

కంగారుతో "వద్దండి. ఆలస్యమయిందండి. యింటికి "పోవాలి." అన్నాడు రామం,

శ్రీవారు యింటికి వెళ్లి స్వయంపాకం చేసుకుని విందు ఆరగించేటప్పటికి సీమంతం గడచిపోతుంది" అని వంటవానితో నువ్వెళ్లి నేను చెప్పినట్లు చెయ్యి"అంది రజని.

రామం యింక మాట్లాడలేదు. ప్రసాద్ యింటికి వచ్చి అతనికి తెలియకుండా రజనితో విందు ఆరగించటం అతనికి ఎంతమాత్రం యిష్టం లేకపోయింది. రజని ఆ యింటిని స్వంత ఇల్లుగా చూడటం కూడ అతనికి ఆశ్చర్యం కలిగించింది.

రజని నవ్వుతూ "మనస్సులో మెదల్తూన్న ఆ ప్రశ్నని ఎంత సేపు లోపల ఆణచివేసుకుని సతమతమవుతారు? బయటక ఎందుకు అడగరు?" అంది.

రామం ఉలిక్కిపడి "ఏ ప్రశ్న" అన్నాడు.

"అది మీకు తెలుసు. రెండు ఆక్షరాల ప్రశ్న : "ప్రసాద్ ఏడి? అంది. "

రామం బలవంతాన నవ్వు తెచ్చుకొని ప్రశ్న మీరే చెప్పేరు. యిక సమాధానం కూడ మిరే చెప్పండి" అన్నాడు.

"ఇంట్లో లేరు. నాలుగురోజులనుంచి నాకు కనబడటం లేదు".

రామం ఆశ్చర్యంతో "నాలుగు రోజులనుంచి కనబడటం లేదా! ఆశ్చర్యంగా వుందే నిన్ననే కమలాకరరావు కనబడ్డాడని చెప్పేడే?" అన్నాడు. రజని నవ్వుతూ! "ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది. నాకిది మామూలే ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. ఆయన్ని నేను రాత్రింబవళ్లు ప్రేమబంధాలతో బంధించి యింట్లో వుంచాలనే కోరిక నాకు లేదు" అంది.

"రాత్రింబవళ్లు వుండక పోవచ్చు కాని ఢిల్లీలో వుంటూ కూడ నాలుగురోజుల బట్టి యింటికి రాకపోవడం అన్యాయం కదా!" అన్నాడు రామం,

"అన్యాయమేముంది చెప్పండి? నాకంటె ఇంకెవ్వరు గతిలేరు. నే నేకాకిని, అనాధని, ఆయనకు చాలా మంది స్నేహితులున్నారు. ఆప్తులున్నారు. ఆదరించేవారున్నారు. వారివద్దకు వారు వెళ్ళుతూ వుంటారు. ఇది నాకు చాలా సహజంగానే కనబడుతుంది" అంది రజని.

ప్రసాద్ కు ఆప్తులు, ఆదరించేవారు, ఇక్కడ వున్నారని నాకు తెలియదండీ. "ఒక బాబాయ్ వుండేవారు. వారు కూడ చనిపోయారని విన్నాను" అన్నాడు రామం.

రజని నవ్వుతూ "ఆప్తులు, ఆదరించేవారు, బంధువులే అయివుండాలా చెప్పండి. అజ్ఞాతులవకూడదా? వారు దయామయులు. నాబోటి వారికి ఎంతోమందికి ఆశయం యిచ్చేరు. ఇంకా చాలామందికి ఆర్ధిక సహాయం చేస్తూ - వుంటారు" అంది.

ప్రసాద్ దయామయుడని చాలామందికి ఆర్థిక సహాయంచేస్తూంటాడని రామానికి తెలియదు. స్వార్ధ పరుడని స్వీయమే అతనికి సర్వస్వమని అనుకుంటూ వచ్చేడు.

"ఎవరికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు చెప్పండి? నేను యింతకుముందు వినలేదే?" అన్నాడు ఆశ్చర్యంతో.

"అంతమాత్రాన అది అసత్యం కాదుకదా వారు ఢిల్లీ లోని హరిజన విద్యార్థులను కొంతమందిని కూడ దీసి వారికొక వసతి చూపించి వారి చదువు నిమిత్తం ఎంతో ధనవ్యయం చేస్తున్నారు. ఇంకా అనేక సంస్థలకి డబ్బు ఇస్తుంటారు. ఉదార స్వభావం, నిర్మలమైన మనస్సు, ఆయనది.వారికి మీరనుకునే నీతినియమాలు లేకపోవచ్చు. అయినా వారు మీ అందరికన్న శతవిధాల ఉత్తములు"అంది.

రజనికి ప్రసాద్ యెడయెంత గౌరవాభిమానాలు వున్నాయో ఆనాడు అతనికి తెలిసివచ్చింది. అంతర్గతంలో కాస్త యీర్ష్యకూడా జనించింది. ఆమాటలో తనను చులకనగా అన్న మాటలు కాస్త బాధపెట్టేయి.

బాధాపూరిత కంఠస్వరంతో "మీరన్నది సత్యమే - కావచ్చు. కాని మానవస్వభావాలు, తత్వాలు ఒకేవిధంగా నిర్మించబడలేదు. అలాగే మానవహృదయాలు కూడ వేరుగా వుంటాయి. అయినా దయ, కరుణ, ప్రేమవున్న మాత్రాన లాభం లేదు. వాటిని క్రియారూపంలో పెట్టడానికి తగిన సంపద శక్తికావాలి. నీతినియమాలందు నీకు నమ్మకం లేకపోవచ్చు. అందుకు నేనేమి అనను, కాని ఎవరికైన సహనం లేకపోతే వారిని నేను సహించలేను.ఒకరిని ఉత్తముడు, యింకోకరిని నీచుడు అనే అధికారం యేమానవునికి లేదు. ఎవరి కర్మ ప్రకారం వారు నడుచుకుంటారు" అన్నాడు

ఆఖరిమాటలు కాస్త వుద్రేకంగా వినబడ్డాయి. రామం అంత వుద్రేకంతో మాట్లాడడం ఆమె అంతకుముందు ఎప్పుడు వినలేదు. ఆమె అడిగిన మాటలు అతనిని గాయపరిచాయని గహించింది.

"సహనం వుండాలనే నేను ఒప్పుకుంటాను. కాని సహనరూపంలో అన్యాయాన్ని అంగీకరించమంటే నేను ఒప్పుకోను" అంది.

సరిగ్గా అదేసమయానికి వంటవాడు భోజనం తయారుగా వుందని చెప్పేడు రజని "లేవండి భోజనం చేద్దాం. ఆకలిగావుంటే ఆవేశాలు విజృంభిస్తాయి" అంది.

"ఆశ్చర్యంగా వుందే, మీరు అలాగ అనటం. ఆవేశాలు ఎందుకు విజృంభించకూడదు? అంటారు కాదా మీరు" - అన్నాడు రామం నవ్వుతూ.

"అవును అది నిజమే. కాని యీ ఆవేశాలు అసహజమైన దేదైనా అధఃపథనానికి దారితీస్తుంది" అంది రజని.

భోజనాలతర్వాత "ఇక నేను వెళతానండీ చాలా థాంక్స్ " అన్నాడు.

"పదండి మిమ్మల్ని టాక్సీలో ఎక్కించి తిరిగి వస్తాను" అని బయలు దేరింది రజని. ఎంత వారించినా వినకుండా.

టాక్సీకోసం చాలాదూరం నడవవలసివచ్చింది. అర్ధ రాత్రిరోడ్ల మీద ఎక్కడా మానవ సంచారం లేదు. వెన్నెల రాత్రి వీధిదీపాలు కూడా వెలగటం లేదు. నిర్మలమైన నిశ్శబ్దం, నిరాడంబరంగా నివురు కప్పింది. రజని పుచ్చవువ్వులాంటి వెన్నెలలో తన ప్రక్కన నడుస్తూవుంటే, రామం హృదయం ఎప్పుడూ అనుభవించని ఆనందం, సుఖం, శాంతి అనుభవించింది. ఆమె స్వభావానికి వ్యతిరేకంగా రజనికూడ నిశ్శబ్దంగా వుంది. మాడ్లాడితే ఆ సుఖం అంతరించి పోతుందేమో అని భయంతో రామంకూడ మౌనం వహించాడు. అలా ఎంత దూరం నడిచినా ఎక్కడా టాక్సీ కనబడలేదు ప్రశాంత వాతావరణం పున్నమి వెన్నెలలో రజని సౌందర్యం చిందులు త్రోత్కుతూ ప్రకృతినే సవాలు చేస్తున్నట్లుంది. తెల్లటి సిల్కు చీర వెన్నెలలో లీనమైనట్లు కనబడింది, నల్లటి పొడుగాటి జుట్టు బుజాలమీంచి జారుతూ నాట్యమాడుతూంది. మత్తెక్కి మైమరపించే ఆ స్త్రీ ప్రచండ సౌందర్యం రామాన్ని పూర్తిగా తన్మయుడిని చేసింది.

హఠాత్తుగా రజని చెయ్యి గట్టిగాపట్టుకొని వుద్రేకంతో వణకిపోతూ, ఆమెను ఆపి "రజని, అనంతమైన నీ అందం నన్ను మైమరపిస్తూంది. నన్ను ఎక్కడికో లాక్కుపోతూంది. నన్ను నేను సంబాళించుకోలేనేమో అని నాకు భయంగా వుంది" అన్నాడు .

రజని ఏమాత్రము భయపడలేదు. చెయ్యి విడిపించుకోడానికికూడ ప్రయత్నం చేయలేదు. తన చెయ్యి పట్టుకున్న అతని కుడిచేతిపై తన రెండవ చెయ్యి వేసి అతని కళ్ళల్లోకి నిర్మలంగా చూస్తు, సహజ శాంతస్వరంలో "మీరు మిమ్మల్ని సంబాళించుకోలేక పోవచ్చు. అందుకు నేనేమి దోషించను . నా స్త్రీ సౌందర్యం క్షణికంగా మిమ్మల్ని వున్మాదుని చేసిందనడం కొంతవరకు అది సహజమే. కానీ పరిణామాలు ఆలోచించకుండా మీరు ఏపని చెయ్యరని నాకు విశ్వాసంగా వుంది. కేవలం మీరు పురుషులే కాదు సత్పురుషులు. సహృదయులుకూడాను. ఆ విచక్షణాజ్ఞానాన్నే మీరిప్పుడు చేరదీసుకోవాలి" అంది.

అదే సమయానికి దూరంలో కారు లైట్లు కనబడ్డాయి. టాక్సీ అనుకొని రామం చెయ్యి చాపాడు, దగ్గరకు వచ్చికారు ఆగింది. కాని అది టాక్సీ కాదు. అదే ప్రసాద్ కారు చటుక్కున తన కుడి చెయ్యిని రజని చేతుల్లోంచి లాక్కున్నాడు రామం.

ప్రసాద్ నవ్వుతూ "ఏమిటి రజని! నీశి రాత్రి నడిరోడ్డుమీద నాటకం వేస్తున్నారా? లేక మనోవీధిలోని తారా కుమారునికి మన్మధడే నివేదించుకుంటున్నాడా?" అన్నాడు. రామం రజని కేసి భయం భయంగా చూచేడు ఆమె నిజం చెప్పివేస్తుందేమోనని భయంతో ఆమె కేసి చూచేడు

రజని "నవ్వుతూ ఒంటరిగా రోడ్డుమీద నడవటం భయమంటూ నన్ను వెంటలాకొచ్చారు అయన. మా దురదృష్టం. ఎంతదూరం నడచినా టాక్సీ పత్తాయే లేదు. నువ్వువచ్చావు వీరిని మీయింటి వద్ద విడిచి మనం యింటికి పోదాం. నాకు విపరీతంగా నిద్ర ముంచుకువస్తూంది. అనవసరం అబలని రెండు మైళ్లు నడిపించారాయన. ఆ వుసురు వూరికేనే పోదు. పైగా నడిరోడ్డు మీద..." అని అనబోతుంటే రామం కంగారుగా అడ్డు వచ్చి "ఏమిటి ప్రసాద్ -నాలుగు రోజులనుంచీ నారదుడిలాగ ఎక్కెడెక్కడ తిరుగుతున్నావు. రజని నీకోసం కళ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తుంది" అన్నాడు.

"ఈ మాటలను నువ్వు కమల విషయంలో అనినట్లయితే నిజమేమోననిభ్రమపడతాను. కాని రజని విషయంలో అవి నిజమని నన్నునేను మభ్యపెట్టుకుందా మనుకున్నా వీలుపడదు. ఆవిడ ఎవరికోసమైనా ఎదురుచూస్తూందని ఎవరయినా అంటే వారు అసత్యవాదులని, అది అభూత కల్పన అని వెంటనే చెప్పవచ్చు. అలాంటివి ఆమె స్వభావానికి విరుద్ధం" అన్నాడు ప్రసాద్.

"ఇక పదండి-ఇంకా ఆలస్యం చేసారంటే తెల్లవారి పోయేటట్లుంది" అంది రజని.

ముగ్గురు బయలు దేరారు. రామం తన లాడ్జివద్ద దిగి వెళ్ళిపోబోతూంటే రజని నవ్వుతూ. "మళ్ళా ఎప్పుడు కలుసుకుందాము?" అంది.

 

చాప్టర్ 3

అందరు శనివారం సాయంకాలం ఆగ్రా బయలు దేరారు. కమల రానని చాలాపట్టుపట్టింది. కాని చివరకి కమలాకరం బలవంతంమీద బయలు దేరక తప్పింది కాదు, కాలం గడచేకొలదీ ప్రసాద్ కోపం తగ్గింది. చెంప పెట్టు పెట్టినా అతను దానిని పట్టించుకోకుండా మరునాడేవచ్చి క్షమాపణ చెప్పుకోవటం ఆమెకి ఎంతో తృప్తినిచ్చింది. అప్పుడు కూడా తన ప్రవర్తన కఠినంగా వున్నా, అతను పట్టించుకోలేదు. చివరకు కమలకి యిష్టం లేకపోతే తను రావడం మానేస్తానని కమలాకరంతో చెప్పాడుట కూడాను, అలాంటి పరిస్థితులలో తాను రానని నిరాకరించటం అసమంజసంగా వుంటుందని కమల ప్రయాణానికి బయలు దేరింది.

రజని ఎంతవద్దన్నా ప్రసాద్ స్టీరింగ్ వద్ద కూర్చున్నాడు, నున్నటి ఆ తారురోడ్డుమీద విద్యుద్వేగంతో పోతున్న ఆ కారులోని వారంతా భయంతో వణకసాగారు. కమలాకరం, రామం ఎంత వారించినా ప్రసాద్ వినలేదు. ఆ పరిస్థితిలో ప్రసాద్ ని చూచి కమలకు భయంకూడా వేసింది. ముఖంలోని నరాలన్నీ వుబికి వున్నాయి. గాలికి "జుట్టంతా అగ్నిజ్వాలలా ఎగురుతోంది. ఎవరిమాటల్ని చెవిని వేసుకోకుండా తదేకంగా ముందుకు చూస్తూ నడుపుతున్నాడు. ముందరిసీటులో ప్రసాద్, రామాల మధ్య రజని కూర్చుని వుంది. వెనుక సీటులో కమలా, కమలాకరం కూర్చున్నారు. గాలికి రజని పమిట చెదిరి రామం ముఖం మీద పడి పూర్తిగా కప్పి వేసింది. రామంకు మత్తెక్కినట్లయి క్షణం చీరనుతన చేతిలో పట్టుకుని వుండిపోయాడు. రజని నెమ్మదిగా చీరని లాగుకుంటూ "రామంగారిలో కొన్ని దుశ్శాసనుని లక్షణాలు మూర్తీభవించాయని నాకిప్పటివరకు తెలియదు" అంది నవ్వుతూ. అదృష్టవశాత్తు గాలి విసురులో ఆ మాటలు రామంకి తప్ప ఎవరికి వినబడ లేదు. ఇంకా రజని ఏమయినా అంటుందేమోననే భయంతో రామం "మీకు నమస్కారం పెడతాను. కమలవుండగా మీరు అలాంటిమాటలు మాట్లాడకండి. మీకు పుణ్యముంటుంది" అన్నాడు.

రజని నవ్వుతూ "దుశ్శాసనుడు ధైర్యవంతుడు. నిండు సభలో పాంచాలిని పరాభవించాడు. నలుగురికీ భయపడలేదు, కానీ రామంగారు" అంది.

రజని నవ్వువిని కమలా కమలాకరాలు ఆశ్చర్యపోయేరు. ప్రాణభయంతో వారు సతమతమవుతూంటే ఈమె పరిహాసాలాడుతూ పకపక నవ్వటం వారిని దిగ్బాంతులను చేసింది. కృంగిపోతున్న ధైర్యాన్నంతా కూడదీసుకుని కమల "రజనీ ప్రాణం మీద నీకు తీపి లేదా? ఇంత వేగంగా పోతుంటే ఏక్షణంలో నైనా ప్రాణాపాయం సంభవించును కదా?" అంది.

రజని, "తీపి వున్నంత మాత్రాన అది మనం తప్పించగలమా చెప్పండి ఏక్షణంలో నైనా అలా జరగవచ్చని మీరే చెప్పారు. అందుకనే ఉన్న సమయంలోనే సాధ్యమయినంత వరకు జీవితంలోని సారాన్ని పీల్చివెయ్యాలి అలా చెయ్యకపోతే చివరకు ఇహము, పరము రెండూ శూన్య మవుతాయి."

కమల కోపంతో "అందుకని ఆత్మహత్య చేసుకోమంటారా మీరు?" అని గట్టిగా "ప్రసాద రావు గారూ మీరు కారు నెమ్మదిగా నడుపుతారా? లేకపోతే కారులోంచి బయటకు దూకమంటారా! చెప్పండి" అంది.

కమల మాటలు విని ప్రసాద్ నవ్వుతూ " ప్రాణభయంతో కారును నెమ్మదిగా డ్రైవు చెయ్యమంటూలేకపోతే ప్రాణం తీసుకుంటానంటున్నారేమిటి మీరు. చివరకు మిగిలేది మృతకళేబరమే కదా?" అని కారును కొంచెం స్లో చేసాడు. అది చూచి రజని చాలా ఆశ్చర్యమయింది ప్రసాద్ చేత కారు నెమ్మదిగా నడిపించే శక్తి ఎవ్వరికీ లేదని ఆమె అనుకుంటూ వచ్చింది. అసలు నడుపుతూ వున్నప్పుడు మాట్లాడటమనే అలవాటతనికి లేదు. అలాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించేసరికి, రజనికి నిజంగా నోటమాట రాలేదు. మదపుటేనుగుని లొంగతీసి మావటివాడు లభించాడనుకుంది. ప్రసాద్ రజని ఆలోచనలను గ్రహించి మరుక్షణంలోనే మామూలు వేగంకి కారును తీసుకువచ్చాడు.

రెండు గంటలలోనే ఆగ్రా చేరుకున్నారు. తిన్నగా తాజ్ వద్దకే వచ్చారు. నిశ్చలమైన ఆ పచ్చటి పున్నమి వెన్నెలో తాజ్ మహల్ అనిర్వచనీయమైన అమావాస్య అందంతో కన్నుల ముందు ఆవిష్కరించింది.

కారు ఆగిన మరుక్షణంలోనే కమల తన్మయంతో తాజ్ వైపుకు పరుగెట్టింది. అది చూచి కమలాకరం కాస్త కంగారుపడ్డాడు. కమలా? ఆగు. ఎక్కడకు వెళ్తున్నావు?" అన్నాడు.

"ఆపబోకండి కమలాకరం బాబూ ! ఆమెలో అణచి వున్న ఆవేశాలకి యి రాత్రి ఆసరా దొరికింది. ఇక ఆమెను హరి బ్రహ్మాదులు కూడ యీ రాత్రి అదుపులో వుంచలేరు" అంది రజని.

ప్రసాద్ నవ్వుతూ "హరి బహ్మాదుల దాకా పోతావెందుకు రజనీ! ప్రక్కన వున్న ప్రసాద్ ను పరిగణించ లేదెందుచేత ? అన్నాడు.

రజని కూడా నవ్వుతూ "పరిగణించక పోలేదు ప్రియా! పనికిరావని మాత్రం అనుకున్నాను ప్రగల్బాలికి కూడా పరీక్ష వుంటుంది. ప్రసాద్ బాబు " అని ఆమెకూడా నవ్వుతూ పరుగెట్టుకుని వెళ్లి పోయింది.

ఆమె ఆ వికృత నవ్వు, ఆమె ప్రవర్తన ఎందుకో కమలాకరాన్ని కలవర పెట్టాయి ఎందుకో మనస్సు అశుభం సూచించసాగింది. కమల గురించి మనస్సు ఆతురత పడ జొచ్చింది. అతను "రామం కమల ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు ఎందుకో కలవరపాటుగా వుంది. మన యిద్దరము వెళ్ళి వెదుకుదాము" అన్నాడు.

ఆ మాటలు రామానికి ఆశ్చర్యం కలగజేస్తాయి. కమలాకరం ఎంత మిత భాషో, గంభీరుడో, నిశ్చలతో, అతనికి తెలుసు. అలాంటి వాడు ఈనాడు ఈవిధంగా అనేటప్పటికి రామానికి కూడా ఎందుకో అశాంతి కలుగ జేసింది.

రామం సమాధానం చెప్పేలోపల ప్రసాద్ "ఇలా గాభరా పడటం నీ స్వభావానికే విరుద్ధం, కమలాకరం. కమల గురించి కంగారుపడకు. నేను హనుమంతుడిలాంటి వాడిని. నాశక్తి, నాకే తెలియదు" అని ప్రసాద్ కూడా పరుగెట్టసాగేడు.

దానితో కమలాకరానికి నిజంగా కంగారు పుట్టింది. అది గమనించి రామం ఈ పుచ్చపువ్వు లాంటి ఈ పండు వెన్నెల- చలవ రాత్రి ఈ చల్లదనం మనల్ని మత్తెక్కించి మైమరపిస్తోంది" అన్నాడు.

ఇద్దరు ఓదగ్గరకు వచ్చి చూస్తే అక్కడ చాలా మంది జనం వున్నారు. కాని వారిలో ప్రసాద్, రజనీ, కమలలు కనపడలేదు. ఇరువురు చెరొక వైపు విడిపోయి వెదకటం మొదలు పెట్టారు.

ప్రసాద్ కమలకోసం తాజ్ మహల్ లోపల ఎంత గాలించినా కనబడ లేదు. చివరకు అక్కడ వున్న మీనారెట్ కెక్కి వుండునేమోనను సంశయం కలిగి, అవికూడా గాలించేడు, చివరకు మూడవ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఒంటరిగా చిట్టచివర నుంచుని పరధ్యానంగా బయటకు చూస్తోంది. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి మెల్లిగా "కమలా!, అనిపిలిచాడు. కాని మొదట పిలుపుకి ఆమె సమాధానం చెప్పలేదు. ప్రసాద్ ఈసారి కొంచెం గట్టిగా 'కమలా' అని పిలిచాడు. ఆ పిలుపు కూడా ఆమెకు వినబడలేదు. కాని ఆస్తంభంలో ప్రతి ధ్వనించిన ఆ పిలుపు వినబడింది. హఠాత్తుగా నలువైపులా వినబడిన ఆ ప్రతిధ్వనికి ఆమె తుళ్ళిపడి ముందుకు అడుగు వేయబోయింది. అడుగు ముందర అంతా శూన్యం. ప్రసాద్ వెంటనే ఆమె భుజస్కంధంను గట్టిగా పట్టుకోని వెనక్కిలాగాడు. ఆమె తుళ్ళి అతని మీద పడింది. కమల పిలుపు ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో అవగాహన మయింది. అలాంటి సమయంలో బిడియపడటమేమంత ఆశ్చర్యకరమైన సంగతి కాదు. కాని ఆమెలో ఏదో అవ్యకమైన భయం ఆవరించింది క్షణకాలం ఆమెనోట మాట రాలేదు 'మీరా' అని మాత్రం అనగలిగింది. కాని ప్రసాద్ కమల ముఖం తదేకంగా చూస్తూ" నన్ను నువ్వు గుర్తుపట్టినా నన్ను చూచి అసహ్యంచుకుంటావేమోనని నేను భయపడ్డాను. కాని నీ ముఖంలో ఎక్కడ ఏవగింపు కనబడటం లేదు. బలహీనత, భయము కనబడుతున్నాయి. నాకు యిదే ఎప్పుడు అర్ధం కాదు. నన్ను చూచి నువ్వు ఎందుకు భయపడతావు? నాలో అంత భయానకమైన దేముంది? కాని అన్నింటిలోకి ఆశ్చర్యకరమైన దేమంటే నాకు నువ్వంటే తగని భయం ప్రపంచకంలో యింకెవ్వరికి ఇప్పటివరకు భయపడలేదు. నేను చేయదలచుకున్న పనిని చెయ్యకుండా ఎవరు అడ్డగించలేకపోయారు. ఇతరుల యిష్టాయిష్టాలతో నా కేమి నిమిత్తం వుండేది కాదు. కట్టుదిట్టాలు, క్రమశిక్షణ నాకు ఎప్పుడూ లేవు. కాని ఈనాడు నీ మాటని జవదాటటమంటే ఎందుకో మనస్సు వెనక్కు లాగుతూంటుంది. భయం వేస్తూంటుంది నీకు నామీద ఆగ్రహం వచ్చిందనే ఆలోచన నాకు" అని ఇంకేదో చెప్పబోతుంటే కమల అడ్డం వచ్చింది.

ఆమెకు భయంతో ముచ్చమటలు పోశాయి. "ఏమిటలా మాటాడుతున్నారు? మిగతా వాళ్లంతా ఎక్కడని, నన్ను క్రిందకు వెళ్లనీయండి" అంది.

నిజానికి క్రిందకు దిగడానికి ప్రసాదేమి అడ్డం లేడు. అతను "వెళ్లు కమలా, నిన్ను నేను బలవంతగా యిక్కడ వుంచాలనే కోరిక నాకు లేదు" అన్నాడు. కాని కమల ఎంత ప్రయత్నించినా కాలు కదప లేకపోయింది. భయంతో వణికిపోతూంది. దానితో పాటు ఆమెలో ఒక విధమైన బలహీనత కూడా ప్రవేశించింది. క్రిందకు దిగటానికి ప్రయత్నించిన కొలది ఆమెలోని బలహీనత ఎక్కవ కావొచ్చింది. చివరకు అక్కడ నిలబడే శక్తి కూడా ఆమెలో క్షీణించిపోయి అక్కడే ఒక మూల కూర్చుండి పోయింది. ఆమె శారీరక పరిస్థితి చూచి ప్రసాద్ కి విపరీతమైన జాలి కలిగింది.

"చలి వేస్తున్నదా? కమలా" అని అడిగాడు

కమల వణుకుతూ "అవునని" తలవూపింది. ప్రసాద్ వెంటనే తన కోటు తీసి ఆమెపై కప్పి వుంచాడు. నిజానికి ఆమెకేమి చలి వెయ్యలేదు. కానీ ఆమె అ ప్రయత్నంగా అవునని తల వూపింది. కాని ఆశ్చర్యకరమైన దేమంటే దానితో ఆమెలోని ఆ వణుకు పూర్తిగా ఆగిపోయింది. కోటును దగ్గగా లాక్కుని అలాగే లాక్కుని వుండిపోయింది. ప్రసాద్ కూడా ఆ తరువాత కొద్దిక్షణాల వరకు మాట్లాడలేదు. బయట వెన్నెల విరుస్తూంటే చీకటిలో ఆ మారుమూల భయంతో నక్కి కూర్చుని వున్న ఆ అసహాయ స్త్రీ పరిస్థితి ప్రసాద్ కి ఎంతో జాలి వేసింది." ఇక క్రిందకు వెళ్దాము పద, కమలా, వారంతా మనకోసం వెతుకుతూ వుంటారు. కాని వెళ్లేలోపున నాకు నువ్వొక వాగ్దానం చెయ్యాలి. నా యెడ నీ మనస్సులో ద్వేషానికి తావివ్వవని నాకు మాటివ్వాలి." అన్నాడు.

"ప్రపంచంలో నాకు ఎవ్వరిమీద ద్వేషం లేదు. ప్రసాద్ బాబూ!. కాని మీరు నాక్కూడ ఒక మాట యివ్వాలి. మీ అభిప్రాయాలు, ఆశయాలు, నాకు తెలుసును. వాటితో నేను సుతరాము అంగీకరించను వాటి గురించి నేను ఆలోచన కూడా చెయ్యను. నేను అల్పసంతృపురాలిని. నాకు వాటితో పని లేదు. మీ ఆశయాల నిరూపణకి నన్ను బలి చెయ్యడానికి, ప్రయత్నించకండి. నాహృదయంలో అనవసరంగా చిచ్చు పెట్టకండి, ఏ పాప మెరుగని నా జీవితాన్ని నాశనం చెయ్యకండి. వేటకాడులాగ నన్ను వెంటాడకండి. చెంపపెట్టు పెట్టానని పగ పట్టిన పాములా నామీద పగ తీర్చుకుంటారా?" అని అటు ఇటు కమల చేతుల్లో ముఖం దాచుకొని ఏడవటం మొదలుపెట్టింది. సానుభూతి పురుష సహజమైనా ప్రేమాభిమానాలు వెల్లివిరిసేయి. కానీ ప్రసాద్ లో అలాంటి భావాలేమి కలగలేదు. అతను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. సానుభూతి వాక్యాలైనా పలుక లేదు.

కఠినంగా "కన్నీళ్ళంటే నాకు తగని కోపం. కమల! మానవత్వానికి అవి మాయని మచ్చ. అందులో ఏడవ వలసిందేమీ లేదు. కన్నీళ్లకి కరిగిపోయే నిర్భలుడిని కాదు నేను- ఇక కట్టిపెట్టు కమలా? అన్నాడు.

కట్టిపెట్టడానికి కమల తన శక్తినంతా కూడ దీసుకొని ప్రయత్నించింది. కాని సఫలీకృతురాలు కాలేక పోయింది గట్టు తెగిన ప్రవాహంలో దుఃఖం ఉబుకు వచ్చింది.

కొంతమంది స్త్రీలకు కన్నీరు యింత సులభంగా ఎలా స్రవిస్తాయి నాకర్థం కాదు. రజని కంట కన్నీరు చూడాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కాని ఎప్పుడూ ప్రయత్నం ఫలించలేదు. ఆత్మాభిమానం వున్న వారెవరు పరుల ఎదుట కన్నీరు కార్చరు" అన్నాడు ప్రసాద్.

ఆ మాటలతో కమలలోని పౌరుషం పైకి వుబికింది. దుఃఖం క్రోధంగా మారింది. మీరు కర్కశ హృదయులు. మీలో దయాదాక్షిణ్యము బొత్తిగా శూన్యం. మీరు మానవాతీతులనుకుంటున్నారేమో? మీరు మానవాధములు మాత్రమే" అంది.

ప్రసాద్ నవ్వుతూ "శభాష్ కమలా, క్రోధం నీకు సహజమైనది. కాని కన్నీరు కాదు. కన్నీరు కార్చినా మనస్సుకరగిద్దామనుకోవటం కేవలం నామమాత్రమే. ఇప్పటివరకు నీవు ఆడిన నాటకమంతా వృధా ప్రయాస. యిక సహజంగా మళ్లీ ప్రారంభించు" అన్నాడు.

తన కన్నీరంతా బూటకమనేటప్పటికి కమల కోపం పట్టపగ్గాలు తెంచుకుపోయింది, తన ఒళ్లు తానే మరచి పోయింది. కుతకుత మనే క్రోధంతో ఏం చెయ్యాలో తెలియక చివాలున లేచి ప్రసాద్ కి చెంపపెట్టు పెట్టబోయింది. కాని ప్రసాద్ ఆమె చెయ్యి పట్టుకుని పక పక నవ్వుతూ "ఈసారి గురి తప్పావే - కమలా?- అయినా ఫరవాలేదు. క్రోధంతో ప్రజ్వరిల్లే నీనయనాలు నన్ను సమ్మోహితుని చేస్తున్నాయి, ఇప్పుడే నువ్వెంతో సహజంగా కనబడుతున్నావు, రజనిని పిలిచి నిన్ను ఇప్పుడు చూపించాలని కోరికగా వుంది. ఒక సారి నేను క్రోధంతో స్త్రీలు అందంగా వుంటారని అంటే రజని కాదంది. "ఆ సమయంలో నన్ను ఆకర్షించేది అందం కాదు. క్రోధం మాత్రమే అంది" ఇప్పుడు నిన్ను చూపించి ఆమెను అడగాలి. ఇది అందమా క్రోధమా రజని అని అన్నాడు.

కమల తన చెయ్యి చివాలున ప్రసాద్ చేతిలో నుంచి లాగుకొని "నువ్వంటేనే నాకసహ్యం. నీ ముఖం చూస్తేనే నాకసహ్యం వెళ్ళిపో యిక్కడ నుంచి" అంది.

ఆ మాటలు విని ప్రసాద్ ఉద్రిక్తచిత్తుడై కోపంతో మండిపోయాడు. కమల మాటలకన్న ఆమె ముఖంలో దృగ్గోచరమైన ద్వేషమే అతనిని వుత్తేజితుని చేసింది. గాయపడిన సింహంలా గర్జిస్తూ - "కమలా ! నువ్వన్నమాటలే నిజమయితే నాకిక జీవితంతో పని లేదు, ద్వేషాన్ని నీ హృదయంలో నేను సహించలేను." అని చివాలున క్రిందకు దూకడానికి ప్రయత్నించబోయాడు.

అది చూచి కమల కంగారుగా, ప్రసాద్ చెయ్యి పట్టుకోని వెనక్కు లాగుతూ "అది నిజం కాదు. ప్రసాద్ బాబూ! అది నిజం కాదు. కోపంతో అన్న మాటలు" అంది గద్గద స్వరంతో.

ప్రసాద్ అప్పుడు ఆ ప్రయత్నం మాని "కమలా! యీ విషయంలో పరిహాసం ప్రళయానికే దారి తీస్తుంది. ఇదేనా బలహీనత" అన్నాడు.

కమల యింకా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి పూర్తిగా కోలుకోలేదు, క్షణకాలం ప్రసాద్ ముఖంలోకి తీక్షణంగా చూచి గబగబ మెట్లు దిగసాగింది. ఆమెను వారిద్దామని ప్రసాద్ ముందు ఒక్క అడుగు వేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు కాని కమల చూపుల తీక్షణత తాళ లేక మరుచటి క్షణంలో పట్టు జారవిడిచారు. కమల చర చర మెట్లుదిగిపోయింది.

 

చాప్టర్ 4

ఈలోగా కమలాకరం, రామం, కమలకోసం నాలుగు మూలలా గాలించారు. రామం భవనం వదలి వెనుక వున్న వుద్యానవనంలో వెదకసాగేడు. అక్కడ కూడా చాలా మంది జనం గుమిగూడి వున్నారు. వెదుకుతూ వుంటే వెనుక భుజంమీద ఎవరో చెయ్యి వేసినట్లయి వెనుదిరిగి చూచాడు, కమల కోసం కాని ఆమె కమల కాదు.

రజనిని చూచి నవ్వుతూ "నువ్వా రజనీ, కమల కోసం వెదుకుతున్నాను ఎక్కడా జాడ తెలియడం లేదు" అన్నాడు

రజని చిరుకోపం ప్రదర్శిస్తూ "అందరు కమలకోసం వెదకేవారే! నా కోసం వెదకేవారే లేరు. నా కోసం ఆతురత పడే వారే లేరు. ఏమండీ నేనంత అవాంఛిత వ్యక్తినాచెప్పండి?" అంది.

"ఇతరులు నీ గురించి కంగారు పడవలసిన అవసరం లేదని అందరికి తెలుసు. అరణ్యంలో వదలి వేసినా ఆర నిముషములో ఆశ్రయం పొందగలవు"అన్నాడు రామం.

"అవును. నాలాంటి వారెప్పుడు ఎవరో ఒకరి ఆశ్రయంలోనే వుంటూంటారు. ఎవరో ఒకరి నీడలోనే బతుకుతాను విసుగెత్తి వొకరు వదలి వేస్తే ఇంకొకరి చెంత చేరుతాను. విరహతాపంతో వెయ్యి మంది అర్రులు చాచితే వంతులు వేస్తాను అంతేనా మీరనేది" అంది.

రామానికి రజని పరిహాసపు ధోరణి అలవాటయి పోయింది. అయినా ఆమె తనను గురించే ఆ విధంగా అంటూంటే సహించ లేకపోయాడు.

"రామాన్ని నువ్వింక సరిగా అర్థం చేసుకోలేకపోయాను, లేకపోతే యిలాంటి మాటలు పరిహాసానికైనా అనవు," అన్నాడు

రజని రామానికి కోపం వచ్చిందని గ్రహించి "వెన్నెల రాత్రులలో కూడా మరింత వేడి ఎలా ఎక్కుతారో నాకర్ధం కాదు. పదండి కాస్త తిరిగి వద్దాము " అంది.

ఇరువురు బయలుదేరారు. తిరిగి తిరిగి అలసి ఒక చోట కూర్చున్నారు. ఆ వెన్నెలలో రజని ప్రక్కన కూర్చుని వున్న రామంకీ మనస్సులో రమ్యమైన ఆచనలు చెలరేగసాగాయి, "తెల్లటి యీ వెన్నెలలో, తెల్లటి భవనం. నన్నెక్కడికో తరుముకుపోతుంది రజని, పున్నమినాడు యి దృశ్యం యింత అందంగా వుంటుందని నేనూహించలేదు" అన్నాడు.

"కాదు అమావాస్యనాడు యింకా అందంగా వుంటుంది. చుట్టూ నల్లటి కారు నలుపు మధ్యన తెల్లటి భవనం ఆ దృశ్యం యింకా మనోహరంగా వుంటుంది. ఇప్పుడు తెలుపులో తెలుపు లీనమయిపోతుంది. అప్పుడు నలుపులో తెలుపు నలువైపులా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది" అంది రజని :

"తెల్లటి శరీర ఛాయగల నీబోటి స్త్రీ నల్లటి క్లేశాలను విరబోసుకొని నల్లటి చీరె తెల్లటి జాకెట్లు వేసుకొని వెన్నెలలో ఏకాంతంగా విహరిస్తూ వుంటే..." అని రామం అంటూంటే!

"కామినీ భూతమని అందరు హడలి చస్తారు" అని చిరునవ్వుతో అయినా మీరు ఢిల్లీలో బయలు దేరేముందే చెప్పలేకపోయారా- యీ సంగతి ? నల్లటి చీరె, రవిక వేసుకునే దానిని అయినా తెల్లటి చీరె, పచ్చటి యీ రవికా నాకు శోభించటం లేదా చెప్పండి ?" అంది.

పరధ్యానంగా ప్రక్కలకు చూస్తున్న రామం నిండుగా రజనిని పరీక్షించి చూస్తూ "నన్నెందుకిలా ఉన్మాదుని చేస్తున్నావు రజనీ! శరీర సౌందర్యానికి, నేనిలా చలిస్తున్నానంటే నేను నీచుడిని కాదా?" అన్నాడు.

రజని నవ్వుతూ "నీచులు కారు – రసికులు" అంది.

"పరిహాసం కాదు - రజని నేను దీని గురించే చాలాసార్లు మనస్సులో మదనపడుతూంటాను. నీ సౌందర్యం నన్నెందుకు తన్మయుని చేస్తుంది? నిజం చెప్పు, ఈ అంధునికి దారి చూపించు" అన్నాడు రామం:

"అంధునికి నేత్రాలంటే వుండవు రామం బాబూ. కాని ఆత్మ అనేది ఒకటి వుటుంది. సాధారణంగా నేత్రాలలోటును కూడా అదే పూర్తి చేస్తూ వుంటుంది. అదే ఎప్పుడూ దారి చూపిస్తుంది. అయినా మీరు దీని గురించి బాధపడవలసిన అవసరమేమి లేదు. ఈ ఆకర్షణే శూన్యమయితే సృష్టి అంతరించి పోతుంది. ఔన్నత్య మనేది దీనిని అదుపు ఆజ్ఞలలో వుంచుకోవడంలోనే వుంటుంది, సౌందర్య పిపాస సర్వకాలం లోనూ మానవ హృదయాలలో మెదులుతూనే వుంటుంది. అది మరుగున వుండవచ్చు కాని మాసి పోదు" అంది .

రామం హృదయం లోంచి ఏదో బరువు తీసినట్టయింది, దీర్ఘంగా నిట్టూర్చి "అయితే యిందులో దోషం లేదు ! ఇతర బంధనాల తోటి దీనికి నిమిత్తం లేదా ? మనం చేసే చేష్టల వలన యింక ఏ యితర మానవునికి చాలా కష్టము కలుగకుండా చూచుకోవడం మన కనీస ధర్మం కాదా?" అన్నాడు.

"మీరలా చుట్ట చుట్టి మాట్లాడతారెందుకు? అడగదలచినది స్పష్టంగా ఎందుకు అడగరు? మీరనేది వివాహితను ప్రేమించడం దోషము కాదా అని కాదా ? కాదుముమ్మాటికీ కాదు. ఎందుకంటే ప్రేమించడం ప్రేమించకపోవడం మన యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. అది ఏలా సంభవిస్తుదో ఏలా పరిణమిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక వేళ మనం ప్రేమించే వ్యక్తి వివాహితులయినంత మాత్రాన అందులో మన తప్పేముంది. మనస్సులోని భావాల్ని ఆలోచనల్ని అనురాగాన్ని శాసించే అధికారం ఎవరకు లేదు. మనస్సుని మనం శాసించలేక పోయినప్పుడు వాటి చేష్టల్ని మన తప్పులుగా అంట కట్టడం అన్యాయం కాదా? అందుకని స్వేచ్ఛావిహారం చెయ్యమని చెప్పడం లేదు. మీరు చెప్పినట్లు సాధ్యమైనంత వరకూ దాని వలన ఆ వ్యక్తిపై ఆధారపడిన వ్యక్తికి భర్త లేక భార్యకి అన్యాయం జరగకుండా చూచుకోవాలి. అంతే" అంది రజిని.

"అంటే నువ్వనేది-వివాహమయిన వారిని మనస్సులో ప్రేమానురాగాలతో పూజించడంలో తప్పేమీ లేదంటావంతే ? ఏదో దోషం చేస్తున్నామని మనస్సులో మనం బాధపడవలసిన అవసరం లేదంటావు"? అన్నాడు రామం.

"మీరు మనస్సులో బాధ పడవలసిన అవసరం అసలు లేనేలేదు. ఎందుకంటే నేను వివాహితను కాను. సర్వ స్వతంతురాలైన స్త్రీని" అంది రజని.

రామం కొంచెం కోపంతో "నేను నాగురించి మాట్లాడటం లేదు రజని! జనరల్గా మాట్లాడుతున్నాను. అన్నింటినీ యిలా అర్థం తీస్తే ఎలా?" అన్నాడు.

"మీరు ఏ వ్యక్తిని మనస్సులో వుంచుకొని మాట్లాడుతున్నారో తెలుస్తూనే వుంది. నాకు ప్రపంచంలో ఏ బంధనలు లేవు మనస్సులో అంతకంటే లేవు, మీ మనస్సులో మీరు వాటిని నిర్మించుకుని మధనపడకండి" అంది.

రామానికి ఆ విషయంలో సంభాషణ పొడిగించటం యిష్టం లేకపోయింది. మౌనంగా వూరుకున్నాడు. కాని రజని వూరుకోలేదు. "దుఃఖాల్ని, నిరాశల్ని, నిస్పృహల్ని, మనస్సులో అణుచుకుని వుంచుకోవటం అనవసరమని నేను అనడం లేదు. జీవితపు రణరంగంలో గాయపడని హృదయాలు చాలా అరుదుగా వుంటాయి. ఏదో ఒక బాణం దూసుకు పోతుంది. బాధపెడుతుంది. నేను కాదనను. కాని, ఆగాయన్ని పదిలంగా భద్రపరచుకోడానికి ప్రయత్నిస్తారు కోందరు. అదే ఆత్మవంచన అంటాను నేను. ఇంకొకటి. ఆలోచనలు ఆశయాల – వాంఛలు- పరిపరి విధాల మనస్సులో చెలరేగుతాయి- అసంబంద్దమైన, అన్యాయమైన కోరికల్ని అణచుకోవడానికి ప్రయత్నించడం మంచిదే- కాని ఆలాంటి కోరికలు మనస్సులో కలిగాయని బాధపడడం అనవసరము- అవివేకము కూడాను. అంతర్గతంలోని కోరికలలో సహజమైనవి కానీ అసహజమయినవి కానీ - గర్వించగలిగినవి కొన్ని, సిగ్గు పడవలసినవి కొన్ని అంటూ విభేదాలు లేవు. అన్నీ ఒకే తరగతికి చెందుతాయి . మనం పాటించవలసిన సూత్రంఒక్కటే క్రియరూపేణ పెట్టవలసి వచ్చినప్పుడు వాటి పరిమాణాల గురించి ఆలోచించి నిర్ణయానికి రావాలి ఇంకొక మాట మీహృదయంలో స్థానం అందరికి అనవసరంగా యివ్వకండి. తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది" అంది.

ఆ చివర మాటలు వింటుంటే రామం హృదయంలో అత్యంతమైన అశాంతి చెలరేగింది, కళ్లల్లో నీరు నిండు కుంది. ఎంత ఆపుకుందామన్నా అవి ఆగలేదు. పక్కకు ముఖం తిప్పుకుని తుడుచుకోవడానికని రుమాలుకోసం జేబులు వెదకసాగాడు. కాని కావలసినది దొరకలేదు. ఆది రజని పసికట్టి "ఏది ఇలా చూడండి రామంబాబూ? దాచుకోవలసింది యిందులో ఏమి లేదు" అంది.

కన్నీరుతో నిండిన ఆ కళ్ళను, రుమాలుతో తుడుస్తూ "కన్నీరు మానవత్వానికే మాయని మచ్చ, అవి మండి పడతాడు ప్రసాద్. కాని అది నేను అంగీకరించను. "మనోదౌర్బల్యానికి నిదర్శనమని మాత్రంఅంటాను." అంది.

"మనోదౌర్బల్యమే కావచ్చును, కాని నువ్వే చెప్పేవు కదా , మనస్సుని శాసించడం చాలా కష్టం అని. ఆయినా నాకింత సునాయాసంగా ఏలా కన్నీరుబికి వస్తుందో నా కర్థం కాదు! ఆఖరికి విషాదకరమైన పాటలు వింటూంటే కూడా కన్నీరుబికి వస్తుంది" అన్నాడు రామం.

"మీకు సంగీతమంటేయిష్టమని నాకుయింకా తెలియదు. నన్ను పాటలు పాడమంటారా చెప్పండి?" అంది.

ఆశ్చర్యంతో "సంగీత సాధన కూడా చేశావా రజని! నాకు యీ ఆలోచన తట్టనైనా లేదు. ఎందుకో సంగీతానికి నీకు సరిపడడని నాలో ఒక భావం నాటుకుపోయింది" అన్నాడు రామం.

"అలా ఏలా అనుకున్నారు చెప్పండి – మాబోటివారికి సంగీత సాధనం- నృత్యం చాలా సానుకూలంగా వుంటాయి కదూ. చిన్నతనం నుంచి సాధన చేశాను. నృత్వం సాధన చేసాను కాని నాకు నచ్చలేదు - వదలి వేసాను. కాని సంగీతమంటే నాకు యిష్టమే- ఏమేమి పాటలు పాడమంటారు చెప్పండి" అంది రజని నవ్వుతూ.

ఆ తరువాత సుమారు ఒక గంట వరకు రామం రజని మధుర కంఠ స్వరాన్ని మైమరచి విన్నాడు. పాట కచేరీ పూర్తిగా అయిపోయిం తర్వాత రజని. "గంట సేపు నాకు కంఠశోష కలిగించారు. ప్రతిఫలం యివ్వకుండా మిమ్మల్ని నేను వదలి పెట్టను" అంది.

రామం కంటితడి తుడుచుకుంటూ "యివ్వడానికి నాదగ్గర ఏముంది రజని: వున్నదొక్కటి నీ కక్కర లేదు. ఇక నేనేం చెయ్యను?" అన్నాడు.

"అది నా కక్కర లేదని నేను అనలేదు. అది మీ దగ్గర వుంచుకుంటే నాకు మంచిదని నేనన్నాను. కాని మీరే చెప్పారు. వీటికి యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదని అయినా అవసరం రావచ్చును. అప్పుడు యాచిస్తాను కాదనరు కదూ?" అంది రజని.

రామం పూర్తిగా కరిగిపోయాడు. "నువ్వు మాట్లాడే దానిలో పరిహాసమేదో పరమార్థమేదో? ఎంత పరీక్షించినా నాకు ప్రసన్నమవదు రజనీ. కానీ యిదే నిజమవుతే నేను నీకీనాడు వాగ్దానం చేస్తూన్నాను. సర్వకాల సర్వావస్తలలోను నీకు నేను అండగా నిలబడుతాను. కాని యిదంతా పరిహాసానికంటున్నానని నీ మనస్సు చెప్తోంది. నీకు నేను అవసరం లేదు. నీ సహాయమే అందరికి కావలసి వస్తుంది. నిశ్చలమైన మనస్సు ధృడమైన విశ్వాసాలు. నీకు పరుల అవసరమేముంది? లేదు రజనీ! నీకు సహాయం చేసే అదృష్టం నాకు కలుగదు. నేను అందుకు నోచుకోలేదు. పైగా భవిష్యత్తులో నీ అవసరమే నాకుంటుంది" అన్నాడు.

"నిజంగా ఏమైనా సహాయం చెయ్యవలసి వస్తుందేమోనని మీరు అలా అంటారు. నోరు జారి - నాకు అండగా వుంటానన్నారు. కాని వెంటనే, ఏమో రజని "రాక్షసి – మాటయిచ్చేనంటే పట్టుకు వదలదని మాట మార్చి వేస్తారు. భలేవారు మీరు. అమాయకులనుకున్నాను. కాని నిజంగా మీరు దేవాంతకులు" అంది రజని నవ్వుతూ.

"ఏడుస్తూ వున్న వాళ్లని నవ్వించడము - నవ్వుతున్న వాళ్లని ఏడిపించటం నీకు పుట్టుకతోనే లభించిన విద్యలా వుంది" అన్నాడు రామం నవ్వుతూ.

"ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. ఇంకా సేపు పోయిన తర్వాత ఏమవుతుందో చెప్పలేము, అందుకని యిప్పుడే లేవండి. చాలా ఆలస్యమయింది. నేను చాలా అలసి పోయాను నిద్ర ముంచుకు వస్తూంది. కాసేపు యిక్కడే పడుకుంటాను. మీరు వెళ్లి కాస్త వారిని వెదకి తీసురండి యిక్కడికి - అని అక్కడే ఆ గడ్డిలో పవ్వళించింది. ఆకుపచ్చటి ఆనున్నటి గడ్డిపై వెన్నెలలో, వంపులతో వయ్యారంగే పవ్వళించిన ఆ సుందరాంగి సౌందర్యం రామాన్ని సమ్మోహితుని చేసింది. వెన్నెలలో లీనమైన ఆమె చీరె పచ్చటి ఆ గడ్డిలో ఆమెకొక వింత శోభ నిచ్చింది. రామానికి, ఆమెను వదలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది.

"లేదు రజని, వెళ్ళితే యిద్దరము కలసి వెళదాం లేకపోతే ఇక్కడే వుందాము. వాళ్లే వెదుక్కుంటూ వస్తారు" అన్నాడు.

"అలసిపోయి కాస్త అలసట తీర్చుకుంటానంటే మీరనవలసిన మాటలివేనా చెప్పండి? బొత్తిగా మీలో కృతజ్ఞత లేదు, గంటసేపు నాచేత గ్రామఫోనులా మీరు కావలసిన పాటలన్నీ పాడించుకున్నారు. ఇప్పుడు కాస్త సహాయం చేసి పెట్టమంటే చెయ్యనంటున్నారు. పైగా ప్రగల్భాలు పలికారు." అంది రజని.

"అది కాదు రజని, నిన్ను వొంటరిగా యిక్కడ వదలి ..."

"వదలితే ఏమవుతుంది ! ఇదేమి అరణ్యం కాదు. ఇక్కడున్న వారంతా మీలాంటి మనుష్యులే. మీరు లేనప్పుడు వారేమైనా చేసి పోతారేమోనని భయం మీకక్కర లేదు. ఒక వేళయిది అరణ్యమే అయినా, మీరన్నట్లు అర నిమిషంలో ఆశ్రయం చేరుకుంటానని" అంది.

రామం యిక వెళ్ళక తప్పలేదు. రజని మీద కొంచెం కోపం కూడా వచ్చింది. కాని ఆమెతో వాదించి నెగ్గటం అసంభవమని అతనికి తెలుసు. మిగతా ముగ్గురి అన్వేషణార్ధం బయలుదేరాడు. కాని మనస్సు పీకుతునే వుంది. రజని వద్దకు తిరిగి పోవాలనే కోరికను బలవంతాన అణచుకొని తాజ్ మహల్ చుట్టూ తిరగసాగాడు. మనస్సు రజని వద్ద వదలి వచ్చాడు. శరీరం మాత్రం వెదకసాగింది. ఆ కారణం వల్లనే అతనికి ఎవరు కనబడ లేదు. తిరిగి తిరిగి అలసిపోయి వెనుదిరిగి వస్తూంటే కమలాకరం కనబడ్డాడు.

కమల మీనారట్ దిగి కమలాకరంకోసం వెదికి వెదికి చివరకు కలుసుకుంది. కమలను చూచి వెంటనే కమలాకరానికి కలిగిన సంతోషానికి హద్దులు లేవు. కమలకూడా ఆనందంతో వుప్పొంగిపోయింది. ఇరువురు దగ్గరలో వున్న వుద్యానవనం కొలను వద్ద కూర్చుని తనివితీరా అనురాగాన్ని ఆస్వాదించారు.

కమల జరిగింది చెప్పడానికి ప్రయత్నించింది. కాని చెప్పలేకపోయింది. జరిగినదంతా వొక పీడకలలా ఆమెకు కనబడింది. దానిని మరచిపోవడానికి చేసే ప్రయత్నమే కమలాకరంపై అత్యధికమైన అనురాగంగా పరిణమించింది.

"ఈ భవనమే అవిచ్ఛన్నమైన భార్యాభర్తల ప్రేమకు నిదర్శనము. దీనిని కట్టించి షాహజహాను తనకు ముంతాజ్ పైన వున్న ప్రేమను అమరం చేసాడు. మరణం తర్వాత ఏ భర్త యింతకంటే ఎక్కువ యింకేమి చెయ్యలేడు. భార్యాభర్తల బంధం క్షణికమని, క్షణభంగుర మని పలికేవారికీ యిదే తిరుగులేని తార్కాణం. అలా అనే వారంతా కుత్సితులు. కామాంధులు. కఠిన హృదయులు" అంది కమల.

"అంత కోపం పనికి రాదు. కమలా, ఎవరి ఆత్మకు తోచిన రీతిగా వారనుసరిస్తారు. ఇతరుల అభిప్రాయాలు, చేష్టలను విమర్శించి తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదు - ఇది మంచిది. ఇది చెడ్డది. యిది వుత్తమమైనదీ యిది కుత్సితమని, శాసించే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ మానవ కల్పితాలు దైవకల్పితాలు వేరు" అన్నాడు కమలాకరం.

"ఇతరుల అభిప్రాయాలతో నాకు నిమిత్తం లేదు. కాని వారి అభిప్రాయాలని యితరుల నెత్తిన బలవంతాన రుద్ది వారిని బాధించి మనోవోభ కలిగించడం అన్యాయం కాదా ?" ప్రశ్నించింది కమల.

"అదే నిజమయితే అది అన్యాయమే కమలా? కాని నువ్వు ఎవరిని వుద్దేశించి అలా అంటున్నావు?"

కమల కెందుకో ఆ వ్యక్తి పేరు చెప్పడం యిష్టం లేకపోయింది. "పోనీ అది వదిలెయ్యండి, కాని యిది నాకు చెప్పండి.. మన విధి, కర్తవ్యము, బాధ్యత మనకు తెలిసి వుండికూడా మనస్సు మనల్ని తప్పుదారి ఎందుకు పట్టిస్తుంది మన శరీరంలోని ఒక భాగమైన మన మనస్సును మనం ఎందుకు శాసించలేము!" అంది.

శాంతస్వరంతో "మనస్సుని శాసించగల వ్యక్తులు కూడా వున్నారు కమలా, వారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. వారి స్మృతీ యితరుల హృదయాలలో అజేయంగా హత్తుకొని పోతుంది. మిగతా వారంతా మట్టిలో కలిసిపోతారు మనమంతా యీ రెండవ తరగతికి చెందిన వ్యక్తులం. క్రోధం - కామం - ఇచ్చ -యీర్ష్య,యివన్నీ విజృంభించి వ్యక్తిత్వాన్నే మటుమాయం చేస్తాయి" అన్నాడు.

"మానవుడు దైవనిర్మితమయినప్పుడు యివన్నీ దైవనిర్మితాలు కావా? అలాంటి సమయంలో వాటిని అణచుకుని సిగ్గుపడవలసిన అవసరం ఏమిటి?" అంది.

"ఇవి దైవనిర్మితాలు కావని ఎవరు అనరు, కాని సృష్టిలో మంచి చెడు లేవా? ఆ విధంగానే మానవునిలో కూడా దైవం కొంత చెడు సృష్టించాడు. అదే లేకపోతే మానవుడు దైవసమానుడవుతాడు .. చివరకు దైవాన్నే ధిక్కరిస్తాడు. మానవుని ఎదుట దైవమే నిస్సహాయుడవుతాడు."

"అయితే మీరనేది దైవస్వలాభం కోసం యీ లోపాలన్నీ సృష్టించాడంటం, సృష్టికర్త అంత స్వలాభపరుడా?"

సమాధానం చెప్పబోయే సమయానికి రామం ఎదురయ్యాడు. "మీరిద్దరు యిక్కడ వున్నారా? మీకోసం వెతకి నా ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చాను. మీరు చల్లగా యిక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు" అన్నాడు అక్కడ కూర్చుంటూ.

"మీరు అంత వెదకటానికి మేమేమైనా ఎక్కడైనా పొంచి వున్నామా చెప్పండి. ఇక్కడే కదా వున్నాము. కాస్త మీరు పరికించి చూస్తే కనబడి వుండేవాళ్లము. మనస్సు ఎక్కడో వదలి వచ్చినట్లున్నారు" అంది కాస్త నవ్వుతూ కమల.

కమల మాటలు విని రామం కాస్త కంగారుపడ్డాడు. "అబ్బే అదేమీ లేదు. చీకట్లో కూర్చున్నారు మీరు" అన్నాడు.

నవ్వుతూ "చీకటంటావేమిటి రామం?. పుచ్చపువ్వులాంటి యీ పండువెన్నెలని. నీకేదో మతి భ్రమ కలిగినట్లుంది" అన్నాడు కమలాకరం.

మాట తప్పిద్దామని లేనిమాట తెచ్చుకుని, "కలిగిందేదో కలిగింది గాని, మీరింకలేవండి. మిమ్మల్నందరినీ కూడా తీసుకురమ్మని రజని ఆదేశించింది. అంతా స్వార్థపరులు. ఆవిడ అక్కడ వుంది. మీరు యిక్కడ కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక ప్రసాద్ యెక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఒకళ్ల ధ్యాస యింకొకళ్లకి లేదు. అంతా కలసి వచ్చేం. తర్వాత యిక్కడ ఏవరికి వారే యమునా తీరే అంటే ఎలా.. మధ్యన నా మీద పడిందిదంతా?" అన్నాడూ.

"రామం మనసులో యీర్ష్య దహించుకుపోతుంది. వెన్నెల వేడిమి పుట్టిస్తోంది. యీ చల్లదనం చికాకు కలిగిస్తోంది. బ్రహ్మచారులతో బాధే యిది. వారికి లభించని సుఖమితర్లకి లభిస్తే వోర్చలేరు" అంది కమల నవ్వుతూ.

"అలాంటి అన్యాయపు మాటలు మాట్లాడకండి మాబోటి వారిని చూస్తే మీకంతా పరిహాసమే. వివాహం వ్యక్తులని స్వార్ధపరుల్ని చేస్తుంది. స్త్రీల దృక్పధంలొ ప్రపంచమంతా మరుగునపడి, వారు వారి భర్త మిగులుతారు. ఇక వీరు దేనిని గురించి పట్టించుకోరు" అన్నాడు.

"రజని యిక్కడ వుంటే చప్పట్లు చరిచి నవ్వుతూ శబాష్ రామంబాబు అనును. మీరనిన యీ మాటలు రజనికి శోభిస్తాయి. మీ నోటివెంట వస్తే చాలా అసహజంగా వున్నాయి" అంది కమల పకపక నవ్వుతూ.

"మీరలా అనుకోవచ్చు,కాని రజని మాత్రం అసహజపు మాటలు అనదని నాకు నమ్మకం" అన్నాడు రామం.

కమలాకరం వీరిద్దరి సంభాషణ ఎంటొ కుతూహలంతో వింటున్నాడు. కమల మాటలలోని చురుకుతనం అతనికిఆశ్చర్యం కలగజేసింది. ఆమె మాటలు రామానికి కొంచెం బాధ కలిగించాయని గ్రహించి, "అదేదో ఆవిడనే అడిగి తెలుసుకుందాము పదండి. ఆవిడ ఎక్కడుంది ?" అన్నాడు.

ముగ్గురు కలిసి రజని వున్న ప్రదేశానికి వచ్చారు. వారు వచ్చేసరికి రజని గాఢ నిద్రలో వుంది. వెన్నెలలో ఆదృశ్యం ఎంతో మనోహరంగా వుంది. ఖాంతము. సంపూర్ణత ఆమె సుందరవదనంలో తాండవిస్తున్నాయి. పరిపూర్ణమైన ఆమె అవయవాలు నిద్రలో నిండుగా కాన వస్తున్నాయి. చిత్రకారుడు మక్కువతో చిత్రించిన చిత్రంలా గోచరించిస్తోంది. శిల్పి జీవితమంతా కష్టపడి సంపూర్ణత్వం సాధించిన చలువ రాతి విగ్రహంలా కనబడింది. రెండుమూడు నిమిషాలు ముగ్గురూ మైమరచి అదృశ్యం చూచారు. కమలాకరం కూడా తనను తాను మరచిపోయి నిశ్శబ్దుడై నిలబడిపోయాడు.

రజని, అని పిలచినా జవాబు లేదు. "గాఢనిద్రలో పున్నట్లుంది. యీ సుందర దృశ్యాన్ని ఎంత చూచినా తనివి తీరటం లేదు. ఆమె నిద్ర లేపి అంతా పాడు చెయ్యటం నా కిష్టం లేదు" అంది కమల.

రామం దగ్గరకు వెళ్లి రజనీ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుతో రజని వులిక్కిపడిప్రసాద్ అని గట్టిగా అంది - కళ్ళు విప్పకుండానే. ఆమాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. కాని వెంటనే అక్కడ, కమలా, కమలాకరం వున్నారని తెలుసుకొని "కాదు రజనినేను" అన్నాడు.

రజని కళ్లు తెరచి వారి ముగ్గురినీ చూచి "పాడుకల వచ్చింది." అని మధ్యలో ఆగిపోయి "ప్రసాద్ యేడి" అంది.

"ఎంత వెదికినా కనబడలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఇక్కడకు మనం వచ్చిన తర్వాత ఎవ్వరికి కనబడినట్లు లేదు" అన్నాడు రామం.

కమల జరిగినది చెప్తామని ప్రయత్నించింది. కాని ఎందుకో ఆమెకు అది చెప్పకుండా వుంటేనే మంచిదనిపించి మౌనంగా వుండిపోయింది. ఆ తర్వాత అరగంట సేపు అందరు ప్రసాద్ కోసం అంతా గాలించారు. కాని జాడ ఏమి తెలియలేదు. చివరకు పార్కు చేసిన కారువద్దకు వెళ్ళి చూస్తే అక్కడ అది కూడా తెలియలేదు.

కారు తీసుకుని వెళ్ళిపోయాడు. "చిత్రంగా వుంది. ఇంతసభ్యంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. ఎవరితోను ఏమి చెప్పనైనాలేదు" అన్నాడు రామం.

కమల మనస్సు ఎందుకో అశుభం సూచించింది. రజని మనస్సులో చాలా అశాంతి చేల రేగింది. మాటిమాటికి ఆమెకు పీడకల జ్ఞాపకానికి వచ్చింది. ప్రసాద్ రజని కారులోవెళ్తుండగా కారు యాక్సిడెంటు అయినట్లు కలవచ్చింది. కాని ఆమె అది ఎవరికి చెప్పలేదు. వ్యాకులపాటుతో మనస్సు సతమతమవుతున్నా ఆమె బయట కేమి వెల్లడించకుండా లోలోనే అణచుకుంది. అలాంటి పరిస్థితిలో అబలలు గుండెలవిసే కంటతడి పెట్టి బావురుమంటారు. అదే కమల అయితే భయంతో ఆతృతతో చేతనారహిత ఆవును కానీ, రజని నిండుకుండలాంటిది. మనస్సులోని పెనుగాలి మరగు పరచి పైకి మామూలుగానే వుంది రజని.

"నా అనుమానం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయార" ని అని మాత్రం అంది.

"మనల్నందరినీ ఇక్కడ వదలి ఎలా వెళ్తాడు! అయినా దానికి తగిన వాడే బొత్తిగా మేనర్స్ లేవు." రామం మండిపడుతూ అన్నాడు.

కమల కూడా "ఆహ్వానించి యిక్కడకు తీసుకువచ్చి యిలా అవమానిస్తారని నేనూహించలేదు. ఇప్పుడేం చెయ్యటం" అంది.

రామం, కమలల మాటలు వెళ్ళి రజని హృదయంలో ములుల్లా గుచ్చుకున్నాయి. మెల్లిగా "అదేమి పెద్ద సమస్య కాదు. ఢిల్లీ దగ్గరలోనే వుంది. అనేక బస్సులున్నాయి. రైళ్ళున్నాయి. మనం క్షేమంగానే వున్నాము. దానికోసం ఆతురత పడలసిన అవసరమేమీ లేదు. విపత్తు యేమైనా వాటిల్లితే వారికే వాటిల్లి వుంటుంది. అయినా దానికి మీరేమి కంగారుపడవలసిన అవసరం లేదు. రామం బాబు! మీకొకసారి చెప్పాను. ఈసారి కూడా అదే చెప్పవలసిన అవసరం వచ్చింది. వారికి మీరాశించే మేనర్సు లేకపోవచ్చు, కానీ వారు మనందరి కన్నా శతవిధాల వుత్తములు" అంది.

రామానికి చెళ్ళుమని చెంపపెట్టు పెట్టినట్లయింది. ఇతరుల ఎదుట రజని ఆలా తనని అవమానిస్తుందని అతను వూహించలేదు. కోపంతో "అవును విశ్వాసమనేది కూడా వొకటుందనీ మరచి పోయాను - తప్పునాదే" అన్నాడు.

క్షణకాలం రజని ముఖంలో నెత్తురుచుక్క లేదు. కానీ వెంటనే "అవును బహుశా మీరనేది సత్యం కావచ్చు. ఇన్నాళ్లు వారి వుప్పుతిని వారి పంచను బతికాను. కనీసం యీ మాత్రమే కృతజ్ఞత చూపించవద్దా. విశ్వాసమనేది విచక్షణా జ్ఞానాన్ని మటుమాయం చేస్తుందని నేనొక సారన్నాను. కాని మీ దృష్టిలో యిది సమర్ధనీయమైనదో కాదో, దీనిని గుర్తించరనేగా మీరొకసారి నన్ను నిందించారు? యీనాడు నాలో అది పొడచూపిందని నామీద మీరిలా కోపగిస్తే ఎలా చెప్పండి" అంది.

రామం ముఖం సిగ్గుతో వెల వెల బోయింది. కమల మనస్సు చిన్న బుచ్చుకుంది. కమలాకరం వొక్కడే రజని మనస్సులోని మనోవేదన గ్రహించాడు. ప్రసాద్ కేమైన ప్రమాదం సంభవించిందేమోనని ఆలోచన అతనికి తట్టింది. రజని మనోనిబ్బరం, సరళస్వభావం, నిశ్చలత్వం ఆతనిని ముగ్ధుల్ని చేసాయి. ఆమె మీద వొక విధమైన గౌరవం ఏర్పడింది. రామం పలికిన ములుకులు లాంటి ఆ మాటలకు అతని హృదయం ఎంతో క్షోభించింది. రామం స్వభావం అతనికి తెలుసు. మనస్సు మంచిదయినా ముందు వెనుక చూచుకోకుండా మాట్లాడతాడు. దుడుకుతనం యింకా వదలలేదు.

"తెల్లవారే వరకూ యిక్కడ కూర్చోవటం ఎందుకు? టాక్సీ కట్టించుకుని యిప్పుడే వెళ్ళిపోదాం ఏమైనా ఇంక రెండు గంటలలో తెల్లవార వొస్తుంది" అన్నాడు కమలాకరం.

రజని మనస్సులో మెదలిన ఆలోచన అదే. కమల మొదట అంగీకరించలేదు. వారు వెళ్ళిపోతే మనం "కూడా ఎందుకు వెళ్ళిపోవాలి? మనం యిక్కడికి వచ్చింది హాయిగా యీ వెన్నెల రాత్రి యిక్కడ గడుపుదామని కాని, వారిని వీరిని వెదకటానికి కాదు" అంది. కాని ఈ కమలాకరం పట్టుదల వలన అందరు టాక్సీలో బయలుదేరారు.

రజని వూహించినదే నిజమయింది. ప్రసాద్ కారు. ఢిల్లీ దగ్గరలోనే యాక్సిడెంట్ అయింది. కారు అట్టేపాడవలేదు. ప్రసాద్ కి దెబ్బలు తగిలేయనీ, ఢిల్లీలో హాస్పటల్ లో చేర్చారని అక్కడ వున్న పోలీసువాడు చెప్పాడు. ఆ మాటలు విని రామం, కమల కృంగిపోయారు. రజని ముఖం కేసి చూడలేక ముఖం క్రిందకు దించి వేసుకున్నారు. కమలాకరం క్షణ కాలం రజని ముఖం కేసి చూచి ఆశ్చర్యపోయేడు. భయవిహృదయి అయి బావురుమంటుందేమోనని భయపడ్డాడు. కాని రజని మందహాసం చేస్తూ "కలలు నిజం కావని, అవి కలలుగానే నిలచిపోవాలని నేను అనుకొనేదాన్ని, కాని యీ రాత్రి నాకు వచ్చిన ఆ పాడు కల నిజమైంది. తరువాత ఏం జరుగునో కూడా కలలో కనిపించేది? కాని రామం బాబు అదంతా పాడు చేసి రజని అని గావు కేక వేసారు. లేకపోతే భవిష్యత్తు కూడా చెప్పగలిగి వుండేదానిని" అంది.

కమల అత్యంత వేదనతో "నీలో యింత నిశ్చలత, నిబ్బరం ఎక్కడిది రజని! నేను పలికిన మాటలకి నాకెంతో సిగ్గు వేస్తున్నది" అంది.

"సిగ్గుపడవలసినదేమి లేదిందులో కమలా! ఎవరి జీవితంతో యుద్దాన్ని వారే నడుపుకోవాలి. ఈ సత్యం మరచిపోయే మనమంతా యిలా బాధపడుతూ వుంటాము. మమత అనే మాయలో పడిపోయే మానవులంతా మధనపడుతూ వుంటారు. కాని రామంబాబు దీని కంగీకరించరు. సహజమైన దానిని మనం ఎందుకుసవాలు చెయ్యాలి అంటారు." అంది రజని.

"ఆప్తులయిన వాళ్ళకు అపాయం సంభవిస్తే మనం ఆతురత పడటం అసహజమంటావా కమలా! నీ మనస్సు ఇప్పుడు క్షోభించటం లేదా?" అంది కమల.

"తోటి జీవులకేమైనా ప్రమాదం సంభవిస్తే దుఃఖిస్తారు .ఆప్తులయితే యింకా కొంచెం అధికంగా వుండదని నేననను . కాని ఏ వ్యక్తి లోటు భర్తీ కాకుండా నిలిచిపోదు కమలా?" అంది.

టాక్సీ జోరుగా వెళ్ళిపోతోంది. రజని మాటలు కమలాకరం చెవిలో మెల్లిగా మారుమోగేయి ఎందుకో అతని హృదయం బరువెక్కిపోయింది. కమలకేసి చూస్తూ "జీవితమంటే ఏవ్వక్తీ ఒంటరిగా గడపలేడు. రజని! మానవ సాంగత్యం లేకుండా ఎవరినైనా పూర్తిగా వేరు చేస్తే వారు జీవించవచ్చు. కాని వారు మానసికంగా మానవులు కారు. మీరు ఏవ్వక్తి లోటూ భర్తీ కాకుండా నిలచిపోదన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. కాని ప్రేమ లేని జీవితంలోని లోటు భర్తీ కాకుండానే నిలిచిపోతుంది. వ్యక్తి అసంతృపితోనే మరణిస్తాడు. ఇదిమటుకు సత్యం రజని-కాని నువ్వు దీనిని కూడా ధిక్కరిస్తావేమోనని భయంగావుంది" అన్నాడు.

కమలాకరం మాటలు అందరినీ కాస్త వ్యాకులపరచినాయి, రజని క్షణకాలం నిశ్శబ్దంగా వుంది. తల పైకెత్తి శూన్యంలోకి చూస్తూ "అనురాగానికి హృదయం తహతహలాడాలనుట అసహజమని నేననను. సృష్టి నశించిపోకుండా వుండటానికి ప్రకృతి చేసిన యేర్పాటేయిది. మానవనిర్మితమైనదేమైనా, స్త్రీ పురుషులకు మధ్యనున్న ఆకర్షణ ఆహ్లాదకరంగా వుండే, మానవుడు దీనిని వదలి వేస్తాడు. దానితో సృష్టి స్తంభించిపోతుంది. అలాంటి ప్రమాదం ఎన్నడూ జరుగకుండా వుండటానికి జరిగినదే ఇది" అంది.

కారు ఢిల్లీ చేరుకునేసరికి తెల్లవారింది. అందరు తిన్నగా ఇర్విన్ హాస్పిటలు వద్దకు వెళ్ళారు.

కారు దిగుతున్న సమయంలో కమల "అందరు లోమలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది! నేను కారులోనే వుంటాను, మీరు వెళ్ళిరండి" అంది కమల మాటలు కమలాకరానికి "కోపం తెప్పించాయి."వ్యర్ధమైన "కోపాలకు యిప్పుడు తావు యివ్వకు కమలా? ప్రసాద్ ప్రమాదంలోపడి బాధపడుతూ వుంటే ఈవిధంగా ప్రవర్తించటం మూర్ఖత్వమే కాని మర్యాద కాదు" అన్నాడు.

కాని కమల లోనికి రాలేదు. మిగతా ముగ్గురు లోనికి వెళ్ళారు. అదృష్టవశాత్తు గట్టి దెబ్బలు తగలలేదు. తలకు మాత్రం గట్టిగాయం తగిలింది చెయ్యికి బాండేజీ కట్టివుంది. దాని ఫలితంగానే ప్రసాద్ భరించరాని తలపోటుతో బాధ పడుతున్నాడు. వీరందరినీ చూసి బలవంతాన బాధను నొక్కి వేసి చిరునవ్వుతో "హాస్పటల్ లో కొన్నాళ్ళు గడపాలనే కోరిక నేడు నెరవేరుతోంది. నీకు జ్ఞాపకముందా రజని! నేనొక సారి యీ కోరిక వెలిబుచ్చితే నువ్వన్నావు "ఆ దుర్ఘటన జరిగిన రోజుననేను నీ చెంతను వుండకూడదనే నా కోరిక" అని నాకు శుశ్రూష చేస్తే భారం నీపై పడుతుందని "అది నీకిప్పుడు ఎలాగైనా తప్పదు" అని రజని సమాధానం చెప్పేలోపలే ప్రసాద్ "కమల ఏదీ? రాలేదా!" అన్నాడు.

"బయట కారులో వుంది. హాస్పటల్ లో రోగులను చూడలేదట" అన్నాడు కమలాకరం.

ప్రసాద్ ఆ మాటల అర్థం సులభంగానే గ్రహించాడు, కమల తన యెడల ప్రదర్శిస్తున్న ఆ అసహ్యతకి అతని హృదయంలో బడబాగ్ని రేగింది. చివాలున లేచి "కమల ఇక్కడకు రాకపోతే నేనే అక్కడకు వెళ్తా" నన్నాడు.

కదలికకు, తలపోటు అధికమైంది. అయినా అతను లెక్క పెట్టలేదు. ఎవరు వారించినా వినలేదు. కమలాకరం భుజంపై ఒక చెయ్యి, రామం భుజం పై యింకొక చెయ్యి వేసి బయటకు వచ్చాడు. కారులోకివచ్చి బాధ భరించలేక కన్నీరు కార్చచొచ్చాడు. ఆ దృశ్యం చూచేసరికి కమల హృదయంలో చెయ్యి పెట్టి కలచినట్లయింది. జాలి, కరుణ వుప్పెనలా పొంగి ఆమెని ముంచి వేసాయి.

"ఈ కన్నీరు శారీరకమైన బాధను భరించలేక కారుస్తున్న కన్నీరు మాత్రమే కమలా? ఉద్రేకాలకు, ఆవేశాలకు లోనైనది కాదు" అన్నాడు బాధతో మూలుగుతూ.

"కమల సమాధానమేమి చెప్పలేదు. ఆ మాటల అర్ధం రజని మాత్రమే గ్రహించింది. తాజ్ మహల్ వద్ద వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనని చూచాయగా వూహించుకోగలిగింది.

"ఇందులో నువ్వు సంజాయిషీ యిచ్చుకోవలసిన అవసరమేమి లేదు ప్రసాద్. అయినా యిది తగిన సమయము కాదు" అంది. కమలాకరానికి ఈ అప్రస్తుత సంభాషణనచ్చలేదు. రోగి వద్ద మాట్లాడవలసిన మాటలు కావని, "ఇక నువ్వు లోపలికి వెళ్ళాలి ప్రసాద్. బయటవుండడం మంచిది కాదు." అన్నాడు.

ప్రసాద్ ని లోనికి తీసుకు వెళ్ళారు. అప్పుడయినా కమల లోనికెళ్ళలేదు.

ప్రసాద్ ని వదలివస్తూ కమలాకరం "నీ కేమైన సహాయం చెయ్యవలసివస్తే కబురు చెయ్యి ప్రసాద్, సంతోషంతో మేము చేస్తాము. కాని రజని వుండగా నీకు యితరుల సహాయం అనవసరము" అన్నాడు.

రామం కమలాకరం బయటకు వెళ్ళబోతుంటే రజని "రామం బాబూ! మీరు కాస్త నాకోసం వేచివుండకూడదా? కొంచెం సేపు వుండి నన్ను యింటివద్ద విడిచి మీరు వెళ్ళవచ్చును" అంది.

రామం వెనక వుండిపోయాడు. తనకు తోడుకోసం వుండమనలేదని అతడు గ్రహించాడు. తాజ్ మహల్ వద్ద రజనిని అన్న మాటలకి అతను అభిమానంతోటి, అసహ్యం తోటి లోలోన కుమిలిపోతున్నాడు. ఆ క్షణంనుంచి యిప్పటివరకు ఎవరితోను అతను నొక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయం రజని మాత్రమే గుర్తించింది.

అరగంట పోయింతర్వాత రజని, రామం హాస్పటల్ నుంచి బయటకు వచ్చారు. రామం యింకా వొక్క మాట కూడా మాట్లాడలేదు. టాక్సీలో కూర్చుని రజని "నాతో మాట్లాడకూడదని మీరేమైనా ప్రతిజ్ఞ పట్టారా చెప్పండి" అన్నది.

రామం "ఏ మొహం పెట్టుకొని మాట్లాడను రజని?" అన్నాడు. రజని రామంముఖం తనవైపు తిప్పుకొని నవ్వుతూ "తీర్చిదిద్దిన యీ ముఖానికి వచ్చిన లోటేమిటి?మీరు చెబితే వినాలని కుతూహలంగా వుంది. శ్యామ వర్ణం, సుందర వదనం, వుంగరాల జుట్టు" అంది. కోపంవచ్చినా ఏం చెయ్యగలను చెప్పండి? ముల్లు వెళ్ళి ఆకుమీదపడినా, ఆకు ముల్లు మీదపడినా ఆకుకేకదా నష్టం! అవమానాల్ని, నిందల్ని, అపవాదుల్ని భరించటం నాకు చిన్నతనం నుంచి అలవాటే . అందరూ నన్ను మా నాన్నగారి పేరూ, మా అమ్మగారి పేరూ అడిగి నన్ను ఎగతాళి చేసి చీదరించుకొనేవారు. చిన్నతనంలో చాలా బాధపడేదానిని. యవ్వనం వచ్చిన తర్వాత నా అందమే నన్ను కాపాడుతూ వచ్చింది. దీని మాయలో పడి అంతానా గతచరిత్ర మరిచిపోయేవారు. కాని కొంతమంది నిరాశ చెంది నిరాయుధయైన నా పై బ్రహ్మాస్త్రం ప్రయోగించి పారిపోయేవారు. కాని ఇదంతా అలవాటయిపోయింది" అంది.

రజని మాటలు రామం హృదయంలోకి వాడి సూదులులాగ గుచ్చుకున్నాయి. భరించరాని భారంతో, దుఃఖభరితమైన కంఠ స్వరంతో "నేనూ అలాటివాడినే అనుకున్నావా? రజని" అన్నాడు.

రజిని నవ్వుతూ "అలాంటివారు కారని చెప్పటానికి ఋజువేమిటి చెప్పండి" అంది.

"పరిహాసంకాదు రజనీ, నా హృదయంలోని ఈ వేదనని అర్థం చేసుకోలేకపోతున్నావు" అన్నాడు రామం.

రజని ఈసారి "కాదు, మీరలాంటివారు కారని నాకు తెలుసు. బహుశా మీకంటే నాకే ఎక్కువగా తెలుసనుకుంటాను కాని ఏమిలాభం? అయినా అలాంటి మాటలు బాధ పెడుతూనే వుంటాయి. దిగమ్రింగి దరహాసవదనాన్ని దివ్యంగా చూపిస్తూ వుంటాను".

అనురాగంతో పొంగిపొర్లే హృదయపు భారాన్ని భరించలేక రామం "నామీద నీ కెందుకింతటి అభిమానమూ, ఆదరమూనూ చెప్పు రజని" అన్నాడు.

రజని రెండు మూడు నిమిషాల వరకు మాట్లాడలేదు. ఆ తరువాత నెమ్మదిగా "నిజంగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా!" అంది.

"చెప్పు రజనీ" అన్నాడు.

"నేను యింతకుముందే చెప్పానుకదా, ఈ విషయంలో బుద్ధి విచక్షణకు తావు లేదని. అలాంటప్పుడు మీరు కారణమడిగితే ఎలా చెప్పటం" అంది.

"నేను నిన్ను ప్రేమించానని చెప్పితే నువ్వు నవ్వుతావని నాకు తెలుసు రజని, కాని నేను చెప్పబోయేది నువ్వేప్పుడూ మనస్సులోవుంచుకోవాలి. రామం జీవితంలో నువ్వు ప్రవేశించావు, శుభం కోసమో అశుభంకోసమో నేను చెప్పలేను. నా జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన పాత్ర వొకటి ఎప్పుడూ వుంటుంది. కొన్ని బాధ్యతలు నీకు సంక్రమించాయి. వాటిని నువ్వు సక్రమంగా నెరవేరుస్తానని మాటియ్యి. లేకపోతే దారం తెగిన గాలిపటంలా నేనెక్కడో పడతానో, నేనేమైపోతానో నాకే తెలియదు. అలా జరిగితే నువ్వు నష్టపోతావని నేను చెప్పటం లేదు. అయినా నువ్వు సులభంగా త్రోసిపుచ్చవని నాకు తెలుసు" అన్నాడు.

టాక్సీవచ్చి రజని యింటిముందు ఆగింది. రజని టాక్సీలోంచి దిగి "మీరు మీ లాడ్జికి వెళ్ళి టాక్సీ పంపించి వెయ్యండి" అంది. రామం కూడ టాక్సీలోంచి క్రిందకు దిగి "అప్పుడే లాడ్జికి వెళ్ళాలని లేదు రజని, నీతో యింకాసేపు కలసివుండాలని కోరికగా వుంది. ఇవాళ ఎలాగో సెలవు పెట్టాను. అది వృధా చెయ్యటం ఇష్టం లేదు" అన్నాడు.

"అయితే సరే రండి. మీ వుద్దేశం చాలా సదుద్దేశమే, కాని నేనింకొక రెండుగంటలలో తిరిగి హాస్పటల్ కి వెళ్ళాలి. అంతవరకు మీరు నా వెంట వుండటానికి నాకేమి అభ్యంతరం లేదు" అంది రజని.

"ఆ తరువాత వెళ్ళిపోమంటావా రజనీ," అన్నాడు.

"ముందర లోపలికి పదండి, వంట ప్రయత్నం చెయ్యాలి. మీరుకూడా ఇప్పటికి యిక్కడే భోజనం. నా చేతి వంట తినందే నేను వదిలిపెట్టను" అంది.

మొదట్లో రామం చాలా సంకోచించాడు. ఆది ప్రసాద్ గృహం. కాని రజనిది కాదనే భావం మాటి మాటికి జ్ఞప్తికివచ్చింది. రజని అదే తన స్వంతయిల్లు లాగే భావించటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. కాని అలాంటివి అడిగితే ప్రమాదం. రజని సమాధానం ఎలాగుంటుందో వూహించటం కూడా కష్టం. అందుకు మెదలకుండా వూరుకొన్నాడు.

డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని కాఫీ తాగుతూ రామం "వంట నువ్వే చేస్తావా? వంటవాడు లేడా!" అన్నాడు.

"వున్నాడు, కాని ప్రసాద్ కీ పరిస్థితిలో కావలసినవి సరిగా చెయ్యలేడు నేనే చేస్తాను" అంది.

రజనికి ప్రసాద్ పై వున్న శ్రద్ధాభక్తులు, గౌరవాభిమానాలు రామానికప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే వున్నాయి. వారిద్దరిమద్యవున్న సరియైన సంబంధమేమిటో అని పలువిధాల ఆలోచించేవాడు. ప్రసాద్ లోని లోపాలు, స్వేచ్చావిహారం తెలిసివుండి కూడ ఆమెలో చెక్కుచెదరని ఆ సహనం, నిశ్చలత అతని కెంతో దిగ్భ్రాంతి కలిగించింది. మనస్సులో వొక మూల వొకవిధమైన యీర్ష్యకూడ పొడసూపింది. ఆలోచనలోపడి అంతా మరచిపోయి మంత్రముగ్దుడిలా అలాగే వుండిపోయాడు, రజని నవ్వుతూ "ఏమిటంతదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈమెలోని యీ శ్రద్ధాభక్తులు అనురాగ చిహ్నాలా? లేక విశ్వాసపు చిహ్నాలా అని కదూ!" అంది.

రామం విస్మయంతో "నీకు పరకాయ ప్రవేశంకూడ చేతనవునా? రజనీ" అన్నాడు.

"దీనికి పరకాయ ప్రవేశం అక్కరలేదు. కాస్త పరీక్షించి మీ ముఖకవళికలు చూస్తేనే తెలుస్తూ వుంది. విస్మయమూ, ఈర్య వుట్టిపడుతున్నాయి" అంది.

రామం మాటలు తప్పించుదామని హఠాత్తుగా "అది సరేలే రజని! కాశిలో మా మామయ్య వొక్కరే వున్నారా? భార్యాపిల్లలెవరూ లేరా? అన్నాడు.

"మామయ్య ఉన్నారు. విశాల ఎవరితోనూ చెప్పకుండా రెండు నెలలకే గతించిపోయింది. మామామయ్య కూతురు నాకంటె రెండు సంవత్సరాలు చిన్నది.దురదృష్టవంతురాలు మూడు సంవత్సరాల క్రితం వివాహమయింది.పేపర్లో ప్రకటన చూసి మామయ్య మురిసిపోయి, విశాలనిచ్చి అతగాడికి పెళ్ళి చేసేడు. బొంబాయిలో పెద్ద వుద్యోగం. పెళ్ళి రేపనగా మామయ్య కొక జాబు వచ్చింది. పేరూ వూరూ లేని ఆకాశరామన్న ఉత్తరం అది. అందులో ప్రకాశరావు మంచివాడు కాడనీ, ఒక స్త్రీని వుంచుకొన్నాడనీ, త్రాగుబోతనీ, విశాలని ఈలాంటి వాడికి యివ్వటం మంచిది కాదనీ యింకా యెన్నో వ్రాసివున్నాయి. అది చూసి మామయ్య ఆవేదనకి అంతులేదు, ఆ ఉత్తరాన్ని విశ్వసించటమా లేక అయిష్టులు కల్పించిన అభూతకల్పనా! పెళ్ళి ఆపు చేసే తలవంపులు కాదా! ఇక తర్వాత వివాహం కావటం కష్టం. అయినా చివరకు మామయ్య వివాహం ఆపుచేద్దామనుకున్నాడు. కాని విశాల వొప్పుకోలేదు. ఇంత జరిగింతర్వాత ఆగిపోతే మామయ్య హృదయానికి గట్టి గాయం తగులుతుందని గ్రహించింది. అలాంటి ఉత్తరాలు నిజం గావని, నిజమే అయితే అది తన దురదృష్టమేననీ దాని బాధ్యత పూర్తిగా తనదేనని, తన నొసటన వ్రాసిన వ్రాత జరగక తప్పదనీ బలవంతం చేసి వివాహం చేసుకొంది. వివాహానికి ముందర నాకు ఉత్తరం రాస్తూ. "రజని! రాత్రింబవళ్లు నేను దీన్ని గురించే ఆలోచించాను. ఆయన ఫోటో దగ్గర పెట్టుకొని తదేకంగా చూచాను. వాటిలోతును కనుక్కుందామని, వ్యక్తి స్వభావం తెలుసుకుందామని ప్రయత్నించాను. నాకు వాటిల్లో కుత్సితం, క్రూరత్వం కనిపించలేదు మంచో చెడో నేను నిశ్చయానికి వచ్చాను. ఆయన్నే చేసుకుంటాను. ఆ తరువాత జరిగేదేదో జరుగుతుంది. నేనెప్పుడూ ఎవ్వరికీ "అన్యాయం చెయ్యలేదు రజని. నాకు యితరులు చేస్తారని భయంకూడా లేదు. నాకు తోటి మానవులలో విశ్వాసముంది. నమ్మినవానివి నట్టేటముంచరనే నా నమ్మకం, విశ్వాసంతోటే ఆయన్ను వివాహం చేసుకుంటాను" అని వ్రాసింది.

నా సలహా అడగకపోయినా నేను అలాంటి పని చేయవద్దని వ్రాసేను. కాని నామాట వినలేదు. విశాల ఎవరి మాట వినగా నేను ఎప్పుడూ చూడలేదు. పట్టుమని పది నెలలయినా "కాపురం చెయ్యలేదు. పది నెలలలోనూ ఆమె ఎలాంటి నరకం అనుభవించిందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఒక్క ఉత్తరంకూడా వ్రాయలేదు. బక్కచిక్కి కళ్ళల్లో ప్రాణం పెట్టుకోని ఒక రోజున హఠాత్తుగా "మామయ్య" ఇంటికి వచ్చి తలుపు తట్టింది. 'నాన్నా' ఒక్క కేకేసి స్పృహ తప్పి పడిపోయింది, ఏంజరిగిందో ఆమె యింతవరకూ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు, "వారు నన్ను తిరిగి రావద్దన్నారు, వారి వద్దకు నేను వెళ్ళను" అనిమాత్రం అంది. ఇప్పటికి రెండు సంవత్సరాలయింది. విశాలమామయ్య యింటిదగ్గరే వుంటోంది. ఆ తరువాత అతగాడు మారు పెళ్ళి చేసుకున్నాడని వినికిడి.

విశాలగాథ రామాన్ని పూర్తిగా కదలించి వేసింది. "మానవులు ఇంత అమానుషంగా ఎలా మారిపోతారు రజని!" అన్నాడు.

విశాలగాథ జ్ఞప్తికి వచ్చి రజని మనస్సుకూడా బాధపడింది. మెల్లగా "అమానుషంగా అంటేనే నొప్పుకోను రామం బాబూ! మానవులే యిలాంటి పనులు చేస్తారు, జంతువులలో క్రూరత్వం, కుత్సితం వుండవు. విశాల మానవుని మంచితనం మీద భారం పెట్టి మెడలో మంగళసూత్రం కట్టించుకొంది. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటం అతగాడికి చేతకాదనుకొంది. కాని చివరకు ఏమయింది!" అంది.

రామం మనస్సులో విశాలని చూడాలనీ, కలుసుకొని మాట్లాడాలని తీవ్రమైన కోరికగలిగింది. "రజని! విశాలని కలుసుకోవాలని నాకు కోరికగా వుంది. అది వీలుపడుతుందా?" అన్నాడు.

"ఎందుకు వీలుపడదు? కాశీకి వెళదాం రండి. నన్ను చాలాకాలంపట్టి రమ్మనమని విశాల వుత్తరాలు వ్రాస్తోంది. పదిరోజులు సెలవు పెట్టండి. ఇద్దరం వెళ్ళివద్దాము" అంది రజని.

"అలాగే చేద్దాము రజని, అంతవరకూ నాకు అసంతృప్తిలాగ వుంటుంది" అన్నాడు.

రజని లేచినిలబడి "ఇక నేను వెళ్ళి వంట ప్రయత్నం చెయ్యాలి. మీరిక్కడే కూర్చుంటారా? లేక మీలాడ్జికి వెళ్ళివస్తారా?" అంది.

"ఉహుఁ! లాడ్జికి వెళ్ళను. ఈరోజు నిన్ను విడిచి వెళ్ళ బుద్దివెయ్యటం లేదు "వంటింటిలోనే కూర్చుంటాను కాస్త సహాయం చేస్తాను" అన్నాడు రామం

"సహాయం చెయ్యక్కర లేదు. పాడు చెయ్యకుండా వుంటే పది వేలు" అంది నవ్వుతూ.

రజని వంట చేస్తున్నంత సేపూ రామం ఆమెను కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. అనేక విధమైన ఆలోచనలు మనస్సులో మెదిలాయి. రజని ఎవరు? ఆమెకూ తనకూ సంబంధ మేమిటి? మొన్న మొన్నటివరకూ ఆమె తన జీవితంలో లేనే లేదు. ఇంత స్వల్ప కాలంలో యింత చనువు ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఆమెను చూడాలనే ఈ దాహం పూర్తిగా లోలోన దహించి వేస్తోంది. ఇది మంచిదేనా? ఇది ధర్మమేనా? ప్రసాద్ కి నేనేమైన ద్రోహం తల పెట్టుతున్నానా? నేను మిత్ర ద్రోహినా? ఈ ఆలోచనల్లో పడిపోయి తనకు తానే మరచిపోయాడు. వేడిగా చుర్రుమని ఏదో చేతికి తగిలేటప్పటికి వులిక్కిపడి వూహా ప్రపంచంలో నుండి బయటపడ్డాడు. "ఏమిటిది రజనీ" అన్నాడు చెయ్యి మండుతూవుంటే.

"అట్లకాడ కొంచెం కాల్చి వాత పెట్టాను, మళ్ళీ ఎప్పుడూ వెర్రి ఆలోచనల్లో పడిపోకుండా! వళ్ళు మరచిపోకండి' అంది నవ్వుతూ.

చెయ్యిని తీరికగా చూచుకుంటూ "ఏ వెర్రి ఆలోచనలు రజని?" అన్నాడు.

"నాకు తెలుసును, మీ ముఖాన్ని బట్టి, మీ ఆలోచనల్ని వూహించటం కష్టం కాదు. అని చెప్పాను. సరిగా ఏమిటో నేను చెప్పలేను. కాని అవి నాగురించే మాత్రం అని నేను చెప్పగలను" అంది. "అది నువ్వు చెప్పనక్కర లేదు రజనీ, అది నాకూ తెలుసును" అన్నాడు.

ఆమాటలు విని రజని నవ్వాపుకోలేక పోయింది. సరిగ్గా అదేసమయానికి సగ్గుబియ్యం పరమాన్నం చేస్తోంది. గరిట పెట్టి కలుపుతూ అంతా తిరగతోసింది. అంతా క్రిందపడి కొంత కుడికాలిమీద పడింది. బాధతో గట్టిగా అరచింది రజని. అదృష్టవశాత్తు పాలుఅంత వేడిగా లేవు. అయినా మృదువైన చర్మం కాబట్టి బాగా పొంగింది. అది చూసి రామం కంగారుకి అంతు లేదు. "అయ్యో ! ఎంతపని జరిగింది అంది రజని? అంతా నాతప్పే, నా తప్పే" అని దుఃఖపడడం ప్రారంభించాడు.

రజని బాధతో కూడిన కంఠస్వరంతో "ముందర మా యింటి ప్రక్కవున్న డాక్టరుగారిని తీసుకొనిరండి. తరువాత తప్పెవరిదో పరిశీలిద్దాము" అంది.

డాక్టరువచ్చి చూచి కట్టుకట్టి "ప్రమాదమేమీ లేదు. నాలుగయిదురోజులలో తగ్గిపోతుంది. అదృష్టవంతులు" అన్నాడు.

డాక్టరుగారు వెళ్ళిపోయిన తర్వాత రజని మళ్ళి వంటింటిలోకి కుంటుకుంటూ వెళ్ళటం రామంచూచి "వద్దు రజనీ. నువ్వు ఈ పరిస్థితిలో వంట చెయ్యకూడదు. వంటవాడు చేస్తాడు'' అన్నాడు.

"నా పరిస్థితి యిప్పుడు మీ పరిస్థితికన్నా బాగానేవుంది రామం బాబూ! మీరనవసరంగా కంగారుపడకండి" అంది రజనీ,

ఆమె యిక చెప్పినమాట వినదని రామం మాట్లాడలేదు. జరిగిన ఈ దుర్ఘటనకుఅతనిమనస్సు ఎంతో దుఃఖంచింది. ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళే సాహసం లేక బయట కూర్చుని బాధపడసాగాడు. అది గ్రహించి వంటగదిలోంచి "ఒక్కరూ ఏం చేస్తున్నారక్కడ? ఇక్కడకు రండి" అంది రజని!

రామం నెమ్మదిగా లోపలికి వెళ్ళి మెదలకుండా ఒక మూలకూర్చున్నాడు. తప్పు చేసిన పిల్లవాడిలా మౌనంవహించాడు. ఆమె కాలికేసి వేదనతో చూస్తూ "ఇదంతా నా దోషమే అమ్మా! మాటలతోనో, చేష్టలతోనో నేను మొదట నుంచీ బాధపెడుతూనే వున్నాను" అన్నాడు.

ఆమె నవ్వుతూ "వీటన్నింటికీ ఏదో ఒక రోజున పగ తీర్చుకోకుండా వుండను. మీరేమి అనుమాన పడకండి. ఆడవారి పగ తాచుపాము పగ కంటే భయంకరమైనదని మీకింకా తెలియదు" అంది.

''పగ దేనిమీద తీర్చుంటావు రజని! తుచ్ఛమైన ఈ ప్రాణం ఒకటే వుంది" అన్నాడు రామం.

ఆమె నవ్వుతూ "బాబోయి , అది తుచ్ఛమైనదంటేనేను ఒప్పుకోను. మీలాంటి సత్పురుషుల ప్రాణాలు అతి పవిత్రమైనవి" అంది.

రామానికి ఆమెమాటలు కోపం తెప్పించాయి. "అంతా నీ కెప్పుడూ పరిహాసమే రజనీ! నీతో ఏదైనా సీరియస్ గా మాట్లాడడానికి వీలు లేదు'' అన్నాడు.

"పరిహాసం కాకపోతే ఇంకేమిటి చెప్పండి ఈ అసందర్భపు మాటలు, ఏదో ప్రమాదం సంభవించింది. దానికి ఇంత రసాభాస ఎందుకు?" అంది ఆమె.

"కట్టుకట్టివున్ననీ కాలిని చూస్తూంటే నా హృదయంలో కాగడా పెట్టి కలచినట్లవుతోంది అమ్మా" అన్నాడు.

రామం మాటలకన్న అతని కంఠస్వరంలోని ఆవేదన ఆమెను క్షణకాలం కలవర పెట్టింది. కలవరపాటును కట్టి పెట్టి కోమల కంఠ స్వరంతో "ఇది చాలా చిన్న విషయం రామం బాబూ! త్వరలోనేగాయం మాసిపోతుంది, శరీరానికి తటస్థించే ప్రమాదాలన్నీ చిరకాలం వుండవు. కాని హృదయానికి సంభవిస్తే అది జీవిని కబళించి వేయగల శక్తి వుంటుంది. ఆ ప్రమాదాన్నుంచే మీరు ఎప్పుడూ మిమ్మల్ని రక్షించుకోవాలి" అంది.

"కాని అది ఎలా రజని! మార్గంకూడా చూపించు" అన్నాడు.

"ఒక వ్యక్తికి అనుకూలమైన మార్గం యింకొకరికి కాకపోవచ్చు. ఎవరికి వారే వెదకి వేసారి చివరకు గమ్యస్థానం చేరుకోవాలి. ఇందులోను నిజంగా నిస్సహాయురాలిని, నా సహాయం మీకేమీ లభించదు" అంది.

ఆమె మాటలలోని సారం గ్రహించాడు. వాటిల్లోని కాఠిన్యత, తిరుగు లేనినిశ్చయం అతన్ని చాలా బాధించాయి, తనను జాగ్రత్తపడమని ముందరే హెచ్చరించిందనుకున్నాడు.

రజని వంట ప్రయత్నం పూర్తి చేసేసరికి తలనొప్పి కూడా ప్రారంభమయింది తిన్నగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. రామానికి ఏమి చెయ్యాలో తోచక డ్రాయింగు రూములో కెళ్ళి కూర్చున్నాడు. అతనికి కొంచెం కోపంకూడ వచ్చింది. అతిధిని మర్యాద చెయ్యటంకూడ తెలియదు. నన్ను చులకన చేస్తోంది అనుకున్నాడు. బయటకు వెళ్ళిపోదామనుకున్నాడు. కాని కాళ్లు కదలలేదు. కొంత సేపటికి వంటవాడు వచ్చి "బాబూ! భోజనం తయారుగా వుంది. అమ్మగారు రమ్మనమంటున్నారు" అన్నాడు.

వంటవాడి చేత కబురు పంపించటం వల్ల రజనిమీద వున్న కోపం హెచ్చింది. కాని చేసేదేమీ లేక లోపలికి వెళ్ళాడు. రజని వొక కంచంనిండా భోజన పదార్థాలన్నీ పెట్టి వుంచింది. తన ముందర నొక చిన్న కంచంలో చాల అల్పంగా పదార్థాలు పెట్టుకుంది.

లోపలికి వెళ్ళిన వెంటనే "రండి! కూర్చోండి. నేను వంట చేశాను. కనుక నయినా కడుపు నిండా భోజనం అయినా చెయ్యండి" అంది.

రజనిమీద లోలోన రగులుతున్న కోపం ఈ మాటలతో విజృంభించింది. "కడుపునిండా భోజనం లేక నేనిక్కడకు వచ్చానా రజని? నేనసలు భోజనమే చేయను" అని కోపంతో కంచం ముందరకు తోసివేశాడు. క్షణకాలం రజనీముఖం వెలవెల బోయింది, కాని నెమ్మదిగా "మీరు భోజనం చెయ్యనంతమాత్రాన నాకేమైనా నష్టం కలుగుతుందనుకోవడం చాలా అవివేకం రామం బాబూ! మీరు యిలా అకారణంగా, అసభ్యంగా అలిగినంతమాత్రాన నేను మిమ్మల్ని బుజ్జగించి, బ్రతిమలాడి అన్నం తినిపిస్తాననుకోవడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరకు మిగిలేది నేను కొంచెం బాధపడటమే! అది మీరు మొదటి నుంచీ చేస్తూనే వున్నారు. ఇందులో కొత్త ఏమి లేదు" అంది.

శాంత గంభీరస్వరంతో పలికిన ఆ వాక్యాలు రామంలోని అహాన్ని సమూలంగా పెరికి వేసాయి. చింతాక్రాంత వదనంతో, వేదనాపూరిత స్వరంతో ఈరోజు ఎందుకో నా మనస్సులో నీమీద కోపంగా వుంది రజని. కారణం ఎంత వెదికినా కనబడ్డం లేదు. కాని ఒక విషయం మటుకు నీకు నేను చెప్పకుండ వుండలేను. ఈ యిల్లే నీ స్వగృహంగా నువ్వు భావించటం నేనెందుకో భరించలేకుండా వున్నాను" అన్నాడు.

రజని మందహాసం చేస్తూ స్త్రీలకు స్వగృహం లేనప్పుడు పరుల గృహాలనే స్వగృహాలుగా భావించుకోవాలి రామం బాబూ! ఇది మొదట్లోనే కాస్త నొప్పి కలిగిస్తుంది. తరువాత మాకిది అలవాటై పోతుంది. వివాహమయిన క్రొత్తలో స్త్రీలు భర్త యింటిలో పరులయింటిలో సంచరించినట్లు సంచరిస్తారు. పుట్టింటికోసం బెంగ పెట్టుకొని బాధపడతారు. కాని కొద్దికాలంలోనే పరిస్థితి పూర్తిగా మరిచిపోతుంది. పుట్టిల్లే పరాయి యిల్లయిపోతుంది. అక్కడ చాలా కాలం వుంటే ఆత్మగౌరవానికి ప్రమాదం సంభవించినట్లు భావిస్తారు.సంఘం కూడా వారిని చులకనగా చూస్తుంది" అంది.

రజని చెప్పిన ఆ ఉదాహరణ రామానికి నచ్చలేదు. "ప్రపంచంలో నీకు ఆత్మీయులు లేరంటే నే వొప్పుకోను, వాటి నన్నిటిని మీంచి యిది ఎందుకుప్రేమపాత్రమైంది" అన్నాడు.

"మీకు నేను మొదటే చెప్పాను. స్వగృహం లేనప్పుడు అద్దె ఇచ్చి మనం ఒక యింటిలో చేరుతాము. ఇంటిలో చేరే ముందు అనేక విషయాలు ఆలోచిస్తాము. ఈ యింటిలోకి ఎందుకు చేరాము, యిది ఎందుకుప్రేమ పాత్రమైంది యని అడిగితే మనం చెప్పడం కష్టం, అద్దె ఎక్కువ చేసినా ఆద్దె యిచ్చుకోలేక పోయినా, యివ్వడం యిష్టం లేక పోయినా యింటి వారు బయటకు వెళ్ళిపొమ్మన్నా యిల్లు వదలి పెట్టక తప్పదు. తరువాత వచ్చిన యింకొక యిల్లు దొరికితే సరేసరి లేకపోతే ఏ చెట్టునీడనో, ఏ రైల్వే ప్లాటుఫారంమీదనో తల దాచుకోక తప్పదు" అంది.

రజని మాటలు మళ్ళీ రామం కోపం రెచ్చగొట్టాయి. "నువ్వు ఆద్దె ఎంత యిస్తున్నావు రజని" అని అడిగాడు.

ప్రశ్న విని రజని క్షణకాలం స్తంభించిపోయింది, కమలని ఆ ప్రశ్న ఎవరయినా అడిగినట్లయిన క్రోధంతో మండిపడి చెంపదెబ్బ పెట్టి "మూర్ఖుడా సభ్యత, అసభ్యత తెలియని నీవంటి మొరటువానితో మాట్లాడమే భరించలేని అవమానం" అనేది. రజని కూడ సిగ్గుతో లోలోపల సిగ్గుతో దహించుకుపోయింది. ఆత్మనిగ్రహమనేది వుగ్గుపాలతో అలవడిన విద్య ఆమెకి. బలవంతాన మందహాసం చేస్తూ "ఈ రోజు నామీద మీకు నిజంగా కోపంగా వుంది, నేను చేసిన అపరాధ మేమిటో తెలియదు. అయినా ఈ ప్రశ్న మీలాంటి వారు వేయవలసినది కాదు. రామం బాబూ! సమాధానం చెప్పగలను, కాని వింటే బాధపడతారు, ఇంకొక సారి అడ గండి. ఇపుడు మీరు సరిగ్గా భోజనము, చెయ్యరు. కాలు భగ భగ మండుతున్నా, తలనొప్పిగా వున్నా నిజంగా మీకోసమే ఆప్యాయంగా వంట చేసాను . మీరు కడుపునిండా తినకపోతే నేను చాలా బాధపడతాను" అంది.

రామానికి అనుకోకుండా ఆ ప్రయత్నంగా నోరు జారిన ప్రశ్న అది. సిగ్గుతోటి, అవమాన తోటి, అసహ్యంతోటి లోలోన కుమిలిపోయాడు. రజని మందహాసం, శాంతస్వరం, మాటల్లోని ఆప్యాయతా గాయంమీద కారంజల్లి నట్లయింది. దుఃఖభరిత కంఠ స్వరంలో, వ్యాకుల వదనంతో నన్ను నేనేమి చేసుకోవాలో నాకే అర్థం కావటం లేదు రజని! నా నోటినుంచి ఆ మాటలు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. నీ ఔదార్యము, కనికరము రంపపు కోత పెడుతున్నాయి రజని! నేను నీ కోపానికి కూడ అర్హుడను కానా!".

రామం మాటలు వెళ్ళి తిన్నగా రజని హృదయంలో నాటుకుపోయాయి, తన శక్తి నంతా వినియోగించి వాటిని కూడబెరుకుతూ రజని అంది. "ఈ రోజు మీ మనస్సుబావు లేదు రామం బాబూ! ఆత్మనిండా, అశాంతి దీనిలో నిండి వున్నాయి.కడుపునిండా భోజనం చెయ్యండి. లేకపోతే నా మనస్సు చాలా బాధపడుతుంది

భోజనాలయింతర్వాత రజని ప్రసాద్ కి కావలసిన పదార్థాలు కారియర్ లో పెట్టుకొని బయలుదేరింది. రామం తనను కూడా ఆమెతో రమ్మంటుందేమోనని ఆశించాడు కాని రజని అలా అనలేదు. టాక్సీలో ఎక్కి వెళ్ళిపోతుంటే రామం మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం రజనీ! స్పప్నంలోఅని ఈసారి పారిపోతానంటే నేనూరుకోను. పరిహాసమాడకుండా సరియైన సమాధానం చెప్పి వెళ్ళాలి" అన్నాడు.

రజని "మీకెప్పుడు అలాంటి కోరిక కలిగితే అప్పుడు రండి. దానికి కూడ ఒక నిర్ణీత సమయం ఎందుకు చెప్పండి ? కాని ప్రసాద్ కి స్వస్థతచిక్కేవరకు ఎక్కువ కాలం నేను హాస్పటల్ లోనే వుంటాను" అంది.

రామం "వెళ్ళేముందు ఈ మాట విని వెళ్ళు రజని నా గురించి ఆలోచించే సమయంలో నా లోపాలను పరిగణించి నా కన్యాయం చెయ్యనని నాకు మాటయియ్యి."

రజని "పరిగణించనని మాటియ్యను. కాని అన్యాయం చెయ్యనని మాట యిస్తాను యిక వెళ్ళండి అలస్యమవుతోంది" అంది.

 

చాప్టర్ 5

ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రాత్రింబవళ్బు రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, దృఢత్వము, మృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున "ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!" అన్నాడు.

"వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని"అంది.

ప్రసాద్ "నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని" అన్నాడు.

నవ్వుతూ "నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి" అంది.

"నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు.

"ఫలితం గురించి నేనేమీ మాట్లాడలేదు. ప్రయత్నం గురించిమాత్రమే" అంది.

"నన్ను బాగా అర్ధం చేసుకున్నావనుకున్న నువ్వుకూడ నాకన్యాయం చేస్తున్నావు రజని, అలాంటి మాటలు ఎలా అనగల్గుతున్నావు! నిజంగా నీకు నీకు ద్రోహంతలపెడ్తాననుకున్నావా!'' అన్నాడు.

రజని పక పక నవ్వుతూ "ఇన్నాళ్ళకు నీ నోటి వెంట యిలాంటి మాటలు వినే దురదృష్టం కలిగింది. నీమీద నాకు మిగిలిన ప్రేమానురాగాలలో సగం సర్వనాశనమయి పోయాయి. కమల గురించి కలలుకంటూ, రజనివద్ద రహస్యాలు వెల్లడి చేస్తున్నావు. ప్రసాద్ ఇప్పటికయినా మేలుకో" అంది.

ప్రక్కనే కూర్చునివున్న రజనిని హఠాత్తుగా వుద్రేకంతో తన వక్షస్థలం మీదికి లాక్కుని "నీమీద నాకు ప్రేమ నశించిందంటే నేను నమ్మను రజని. అది లేకపోతే నువ్వు నా మీదంత శ్రద్ధాసక్తులతో ఎందుకు సేవ చేస్తావు?" అన్నాడు.

రజని క్షణకాలం మాత్రమే ప్రసాద్ కౌగిలిలో యిమిడివుంది. నెమ్మదిగా పట్టు విడిపించుకుని "నువ్వే కాదు ప్రసాద్, ఆప్తులెవరయినావుంటే ఈవిధంగానే చేద్దును. అయినా మన యిద్దరి మధ్య వున్న బంధం, ఆంగీకారం. యింకాతెగిపోలేదు. అంతవరకు నా ధర్మం యిదే. నీకు స్వస్థత చిక్కినవెంటనే తెగతెంపులు చేసుకొని నిన్ను వదలి వెళ్ళిపోతాను" అంది. మాటలు ఎంతో సహజంగా, మృదువుగా వున్నాయి. వాటిల్లో కోపం గానీ, ఏవగింపు కాని ఏమాత్రము లేవు. భయంకరమైన నిశ్చయం కనబడింది. ప్రసాద్ దానికి తిరుగు లేదని గ్రహించి, "దాని కేమైనా ప్రత్యేక కారణముందా రజని! ఇందులో నా దోషమేమైనా వుందా?

"కారణమేమీ అక్కరలేదని మనము మొదటే అనుకున్నాము, ఉన్నా చెప్పవలసిన అవసరంకూడ లేదు. మన యిద్దరికి పూర్వం వున్న భావాలు యిప్పుడు లేవనీ నీకు తెలుసు. నాకు తెలుసు. ఇది చాలా సహజమైనదనీ, సమంజసమనీ నీకు తెలుసు. ఇందులో విచారించవలసినది కూడ ఏమీ లేదు. సహజీవనం తప్ప మిగిలినవి యథాప్రకారంగానే సాగుతాయి. రజని ఎప్పుడూ ఎవరి సొత్తుగా లేదు. యిక ముందుకూడ ఎవరి సొత్తు కాదు?'' అంది గంభీరంగా.

ప్రసాద్ తన జీవితంలో ఒక ఆధ్యాయం ముగిసిపోయిందని ఆఖరికి గ్రహించాడు. మిగిలినదేదో వదులుకుందామని "మన బంధం విడిపోయినంత మాత్రాన నామీద నువ్వు కక్ష పూనుతావా రజని" అన్నాడు.

"ఆలా నేను చెయ్యలేననికూడ నీకు తెలుసు ప్రసాద్, నా చేత చెప్పిద్దామని అడిగావు. అయినా నేను చెప్పుతాను. నీమీదవున్న ప్రేమానురాగాలు నశించిపోయాయి. గౌరవాభిమానాలు కాదు. అవి సకాలం సజీవంగానే వుంటాయి. అంతే ఇక దీని విషయం ఆపి వెయ్యి" అంది.

ఆనాడు హాస్పటల్ నుంచి తిరిగి వచ్చినప్పటినుంచి కమల మనస్సులో బాధపడసాగింది. తన అసభ్య ప్రవర్తనకు ఎంతో నొచ్చుకుంది. ప్రసాద్ వంటి ఆత్నబలంగల వ్యక్తి, తనను చూడడానికని, అంత బాధతో ఈనాడు బయటకు వచ్చి కన్నీరు కార్చిన దృశ్యం ఆమె హృదయంలో హత్తుకు పోయింది.

కన్నీరును అసహ్యించుకొనే అతనుకూడ కన్నీరు కార్చడంతో అతను ఎంత బాధపడ్డాడో ఆమె గ్రహించింది. ఆవ్యాజమైన కరుణ, జాలి ఉప్పెన వలె పొంగిపొర్లే ఆ అభాగిని హృదయంలో, కమలాకరంతో కలసి ఒక రోజున వుదయం ప్రసాద్ ని చూడటానికి బయలు దేరింది. కాని దారిలో కమలాకరం "ఏదో అర్జంటు పనుంది. ఆఫీసుకి త్వరగా వెళ్లాలి నేను సాయత్రం చూస్తాను నువ్వు వెళ్లు." అని కమలను హాస్పటల్ వద్ద విడిచి వెళ్ళిపోయాడు. కమల "నేను కూడ సాయంకాలమే వెళ్తాను" అంది.

కమలాకరం భార్యను మందలించి ఇంతదూరంవచ్చి వెనుకకు వెళ్ళవలసిన అవసరం యేమిటి! రజనికూడ లోన వుంటుంది. ఆమె రోగిని వదలి ఒక్క క్షణంకూడ వుండదు" అన్నాడు.

అయిష్టంగానే కమల లోనికి వెళ్ళింది. రజని లోపల వుండేటట్లు అనుగ్రహించమని వెయ్యి దేవుళ్ళను ప్రార్థించింది మనస్సులో.కాని ఆమె ప్రార్థన పెడచెవినపడింది. తలుపు తెరచి వుంది. రజని గదిలో లేక పోవడం గమనించి వెనుకకు పోదామనుకొనే సమయంలో ప్రసాద్ ఆమెని చూసాడు, క్షణకాలం దిగ్భ్రాంతుడై పోయాడు. కాని వెంటనే "రా, కమలా! రా" అన్నాడు.

కమల భయవిహ్వలయై లోనికివచ్చి దగ్గరవున్న కుర్చీలో కూర్చుంటూ "నేను కమలాకరం కలిసి వచ్చాము. ఇక్కడకు వచ్చి పనివుందని ఆఫీసుకి వెళ్ళిపోయాడు. రజని యిక్కడ వుంటుందనుకున్నాను" అంది.

ప్రసాద్ నవ్వుతూ "ఈ తడబాటు ఎందుకు కమలా? నువ్వేమి తప్పుపని చెయ్యటం లేదు. నువ్వు యిక్కడకు వచ్చినది నన్ను చూడటానికా లేక రజనిని చూడటానికా?" అన్నాడు.

కమల "రజని కూడ వుంటుందనుకున్నాను. నాకు రాను రాను ఆమెమీద గౌరవాభిమానాలు ఎక్కువవుతున్నాయి. అద్భుత వ్యక్తి విచిత్ర వనిత" అంది అసందర్భంగా.

ప్రసాద్ క్షణకాలం మౌనం వహించి ''కాదని నేననను. కానీ ఆమె అవసరం నాకుతీరిపోయింది కమలా! యింకొకటి అవసరం వచ్చింది" అన్నాడు.

"అవసరం వచ్చినంత మాత్రాన అది తీరుతుందనుకోవడం అవివేకం ప్రసాద్ బాబూ ! వ్యక్తుల దృక్పధాలు వేరైనప్పుడు వ్యక్తుల అభీష్టాలూవేరుగానే వుంటాయి. బాటలు వేరుగానే వుంటాయి, గమ్యస్థానాలు వేరుగానే వుంటాయి" అంది.

"నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమేమోనని సందేహము కలుగుతుంది. లేకపోతే నువ్వానాడు నన్ను అలా అవమానించి వుండేదానివి కాదు. పాషాణ హృదయాన్ని పదిల పరుచుకొని కారులో బయట కూర్చునివుండేదానిని కాదు. తోటి మానవుని యెడ నీ కనీసధర్మాన్ని కూడ ఆనాడు నువ్వు మరచిపోయావు కమలా! దానికి నిన్నెన్నడు నేను క్షమించను, ఆ సంఘటన జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నిన్ను నేను అసహ్యించుకుంటూ వుంటాను" అన్నాడు.ప్రసాద్ "ముఖం క్షణకాలం ఏవగింపుతో నిండిపోయింది.

అది చూసి కమల భరించలేక పోయింది, "మరి మీరు అలా ఎందుకు చేసారు? నామీద కోపం చేతకదా మీరు ఆ అపాయంలో చిక్కుకున్నారు. ఆనాడు మీరు తాజమహల్ వద్ద కనుపించకపోతే నేననుకున్నాను. ఈ విషాద నాటకంలో యిదే నా అంతిమమట్టం. ఈ పాపంకూడ నా మెడకే చుట్టుకుంటుందా? అని. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అయినా వొక విధంగా అలా జరిగితేనే మంచిదేమోననిపిస్తు వుంటుంది అప్పుడప్పుడూ, దానికి నేను పరోక్షంగానే బాధ్యురాలిని, నా కర్తవ్యం నేను నెరవేర్చలేనేమోననే భయం తీరిపోయింది. నా హృదయంలో ఈ భరించలేని బరువూ సహించలేని ఈ చిత్రహింస ఆనాటితో అంతమైపోను. బాధాకరమైన స్మృతి ఒక్కటే ఆఖరకు మిగిలేది"అంది.

కమల తన మరణాన్నికాంక్షిస్తోందని విని ప్రసాద్ లోలోన చాలా భయపడ్డాడు, "నీ పాతివత్యానికి నన్ను బలి చేస్తావా కమలా? ఆది మినహా నీకిక జీవితంలో వేరే కర్తవ్యంథర్మమూ లేదా?" అన్నాడు.

"ఉన్నాయో లేవో నాకు తెలియదు. కాని నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది అదొక్కటే. ఆ ధర్మానికి యితర విధులకీ వైరుధ్యం ఏర్పడితే నేను నా సర్వస్వము వినియోగించి ఆ మొదటి దానినే రక్షించుకుంటాను. ప్రాణప్రదంగా నేను కాపాడుకుంటాను" అంది.

ఆ మాటలు అంటూవుంటే కమల నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి.ఆతీక్షణతని ప్రసాద్ భరించ లేకపోయాడు.

"కమలా! నేను నా జీవితంలో ఇంతవరకు ఓటమిని రుచి చూడలేదు. నన్ను తిరస్కరించిన స్త్రీలు నాకగు పడ లేదు కాని నేను నీ చేతుల్లో ఓడిపోతానేమోనని భయంగా వుంది" అన్నాడు.

కమల ఏదో మాట్లాడుతూ వుంటే లోపలికి ఒక పది మంది యువకులు, వొక యువతి లోనికివచ్చి వినయపూర్వకంగా నమస్కరించారు. యువతి ఎంతో ఆవేదనతోను నమ్రతతోను ముందుకు వచ్చి"మామయ్యా!మీరు ప్రమాదంలోచిక్కుకున్నారని యిప్పుడే మాకు తెలిసింది. అంతా ఎంతో ఆందోళనపడ్డాము, చూడటానికనివచ్చాము, దైవం మమ్మల్ని రక్షించాడు. లేకపోతే ఈ అనాధుల గతి ఏమయ్యేది?"అంది.

పదునెనిమిది సంవత్సరాల యువతి ఆమె. చామన ఛాయ, విశాలనేత్రాలు, అవయవాల్ని విడివిడిగా పరీక్షించి చూస్తే ఏమంత రూపసికాదనిపిస్తుంది. కాని కమలని ఆశ్చర్య పరచినదేమంటే ఆమెలోని సంపూర్ణత్వము శ్రావ్యమైన కంఠ స్వరమూను. మిగతా యువకులంతా అమెకంటే చిన్నవారులా కనబడుతున్నారు. వారంతా కూడా ఎంతో వినియపూర్వకంగా నిలబడియున్నారు.

ప్రసాద్ " చంద్రికా! నిన్ను చూడాలని యిక్కడకు వచ్చిన పదిరోజులనుంచి నాలో కోరికగా వుంది. కాని మీకుపరీక్షరోజులనీ, యీ విషయం మీకు తెలియకుండావుంటేనే మంచిదని రజని చెప్పింది. అందుకనే కబురు పంపలేదు. నిన్నటితో అన్నీ అయిపోయాయికదా? ఎలా వ్రాసారు?."

అంతా ఏకకంఠంతో బాగా వ్రాసామన్నారు. అంతవరకు ప్రసాద్ కమల అక్కడ వున్న సంగతే మరచిపోయాడు.అప్పుడది గుర్తించి కమలను వారికి పరిచయం చేసి "వీరంతా అనాథ విద్యార్థులు కమలా! వీరందరినీ నేను పెంచుకుంటున్నాను" అన్నాడు.

కమలకు ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అతి సామాన్యమైన వారిదుస్తులు, వేష భాషలు ఆమెలోని మాతృత్వ అనురాగపు గట్టులు తెంచి వేసాయి.

చంద్రికని ఆప్యాయంగా దగ్గర కూర్చో పెట్టుకొని "చంద్రిక ! చక్కటి పేరు. ఏం చదువుతున్నావు తల్లీ ?" అంది కమల.

"తల్లీ" అనే సంబోధన చంద్రిక కళ్ళల్లోకి కన్నీరు తెచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ "అయిదు సంవత్సరాల క్రితంవరకు నాకు అక్షరజ్ఞానం లేదు. అంతా మామయ్య చలువ. అప్పటినుంచి పట్టుపట్టి చదివించారు. ఈ సంవత్సరమే ఇంటర్ పరీక్షకు వెళ్ళాను, నిన్ననే పరీక్షలయిపోయాయి. వీరంతా కూడా నాలాటి వారే. మా అందరి కోసమని ఒక యిల్లు అద్దెకు తీసుకున్నారు. అన్ని ఖర్చులు వారే పెట్టుకుంటున్నారు. లేకపోతే నాకు బిచ్చమెత్తుకోవటమే గత్యంతరం" అంది.

"ఆ గత్యంతరం లేకుండా ఆదుకునేవారు వారొక్కరే కాదు చంద్రిక ఇక ముందునుంచి. నేను కూడా వున్నానని మరచిపోకు" అంది కమల.

చంద్రిక గద్గదస్వరంతో "అక్క!" అని కమల గాఢాలింగనంలో యిమిడిపోయింది.

"నువ్వదృష్టవంతురాలివి చంద్రికా. కమల ఆదరము, అనురాగము అంత సులభంగా లభించవు. వాటికోసం రాత్రింబగళ్బు, తపస్సు చేస్తున్న వ్యక్తులు చాలమంది వున్నారు. కాని వారికెప్పుడూ అది ఆమడదూరంలోనే వుంటోంది'' అన్నాడు ప్రసాద్.

మాటల అర్థం కమల గ్రహించింది. చంద్రిక గ్రహిస్తుందేమోనన్న భయంతో మాటలు మార్చి "జీవితంలో నీకు మీ మామయ్య నేర్పలేని విషయాలు నువ్వు స్వతహాగా నేర్చుకోలేని విషయాలు చాలా వున్నాయి. వాటిని నీకు స్త్రీ లే నేర్పాలి. అందుకుతగినవ్యక్తి రజనికంటె ఇంకెవ్వరు లేరు. అల్పురాలినైనా అవసరం వస్తే నేను వున్నాను" అంది.

"మామయ్య నా కెప్పుడు ఏవిధమైన బోధనా చేయలేదు. వారు ఏదైనా చెబితే అక్షరాలా పాటిస్తానని వారికి తెలుసు రజని వద్దనే నేను విద్యాభ్యాసం చేసుకున్నాను" అంది.

"అది మంచిదే చంద్రిక! కాని మీ మామయ్య ఎదుట ఇంకొకమాట చెపుతాను. వారు నీతో ఎప్పుడైనా చెప్పేరో లేదో నాకు తెలియదు. కాని వారు చాలాసార్లు అంటూవుంటారు. కృతజ్ఞతకు మన జీవితంలో చోటే లేదు" అని "అది వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుతుంది" అని. నేను జీవితంలో కృతజ్ఞతకు చోటు లేదంటే అంగీకరించను, కాని ఒక విషయం ఎప్పుడూ మరువబోకు చంద్రిక! కృతజ్ఞతరూపములో పరులు నీవద్ద నుంచి ఏమైనా యాచిస్తే నిరాకరించే అధికారం నీకువుంటుంది. అది యెన్నడూ యుక్తాయుక్త విచక్షణని కప్పిపుచ్చ గూడదు. ఈ ప్రమాదంనుంచే నిన్ను నువ్వు కాపాడుకోవాలని నా కనిపిస్తోంది. అది ఎప్పుడు జ్ఞాపకము వుంచుకో" అంది కమల.

కమల మాటలలోని అర్థం ప్రసాద్ గ్రహించాడు. చంద్రికను పెడదారులు త్రొక్కిస్తాడేమోనని భయంతో అనిన మాటలని గ్రహించాడు. అదే సమయానికి రజని లోనికి వచ్చింది. ఆమెను చూచిన వెంటనే అంతా ఆమెను చుట్టు ముట్టి వేసారు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది.

"రజని! నువ్విక్కడ వుంటామేమొనని వచ్చాను. కాని నువ్విక్కడ లేవు మీ యింటికే వద్దామని బయలు దేరపోతున్నాను" అంది కమల.

"జీవితంలోని చిత్రం యిదేకమలా! సరిగా సమయానికి కావలసిన వ్యక్తి సాధారణంగా దొరకరు అర నిమిషంఆలశ్యంగా వస్తాడు. కాని అప్పటికే పుణ్యకాలంకాస్తా గడచిపోతుంది" అంది రజని నవ్వుతూ.

రజని మాటలు చంద్రికకు నవ్వు తెప్పించాయి. కిలకిలా నవ్వుతూ "మా రజనిపిన్ని యెప్పుడూ యింతే. మన మేం మాట్లాడినా ఏదో ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంది, ఒక రోజున నాతో అంది. చంద్రికా! చందమామ చల్లటివాడని శాంతినీ, సుఖాన్నీ యిస్తాడని మనమంతా అంటాము. సూర్యరశ్మి మనకు చికాకు, చిరు కోపము కలిగిస్తుందీ. కాని వీరిద్దరిలోను ప్రకృతికి ఎవరు ముఖ్యం చెప్పు? ప్రకృతికేకాదు. సూర్యరశ్మి లేకపోతే చంద్రునకు వెన్నెలే వుండదు. మన స్పర్శజ్ఞానాలకుమించిన సువాసనలు చాలా వున్నాయి" అంది. ఆ మాటలలో అర్థం నా కిప్పటివరకు తెలియదు" అంది.

"ఆలోచించి చూస్తే రజని మాటలలో ఎప్పుడూ నిగూఢార్థం వుంటుంది చంద్రికా? అవి వెంటనే గ్రహించటం. అంత సులభం కాదు. అయినా వీటిలోనిసత్యం మనకు ఎప్పుడూ కనబడుతూనే వుంటుంది. నేనుకూడా మొదట ఆమె ఏదో చమత్కారంకోసమని మాటలను త్రుంచి విపరీతార్థంవస్తుందేమో నని అపోహపడ్డాను. కాని ఇప్పుడు పూర్తిగా మనస్సు మార్చుకున్నాను. తరచి తరచి చూస్తే వాటివిలువ కట్టడంకూడా కష్టం" అంది కమల.

"విలువ కట్టడమే కష్టమైనప్పుడు వాటిలో విలువుందని యెలా చెప్పగలం?'' అంది రజని నవ్వుతూ.

"నీతో వాదించి నెగ్గడం చాలా కష్టం రజనీ, కానీ అశక్తురాలిశ్రద్ధాంజలిని తిరస్కరించకుండా పరిస్థితుల ప్రాబల్యంవల్లనేనేమైనా నీ పరీక్షకు తట్టుకో లేకపోతేనన్ను పరాభవించక, ఇక నేను వెళ్ళాలి, ప్రసాద్ బాబూ! ఇంకా హాస్పటల్ లో ఎన్నాళ్ళు వుంటారు" అంది కమల.

"నాలుగైదురోజులకన్న ఎక్కన అక్కరలేదనుకుంటాను. అంతా రజని యిష్టం" అని రజని కేసి చూచాడు.

సమాధానం రజని చెప్ప లేదు. చంద్రిక చెప్పింది. "మామయ్య హాస్పటల్ లో యింకా ఎంత కాలంవుంటే అంత మంచిది. ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుంటారు. బయటకు వస్తే ఎడతెరిపి లేని పని. ఎక్కడన్నా ఏ బీదవాడైనా కష్టాలలో వున్నాడంటే అక్కడకు బయలుదేరుతారు. ఏ పని లేకపోతే విపరీతమైన వేగంతో కారు నడుపుతూ ఏదో ప్రమాదంలో చిక్కుకుంటారు" అంది.

"ఇక నేను వెళ్తా రజని! మేమెంత అంటరానివారమైనా మా యింటికి ఆ తరువాత ఒకసారి కూడా రాలేదు నువ్వు" అంది కమల.

"ఎందుకు రాను కమలా, తప్పకుండా వస్తాను. కానీయీసారికూడా వంటరిగా రాను. తోడు తీసుకు వస్తాను, అంది" రజని.

"నీతో ఎవరు వచ్చినా వారికి సుస్వాగతమే లభిస్తుంది రజని" అని బయటకు వెళ్ళిపోయింది కమల.

 

చాప్టర్ 6

వారం రోజులకి ప్రసాద్ హాస్పటల్ నుంచి విడుదలయ్యాడు. పూర్తిగా స్వస్థత చిక్కింది. ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులకి రజని యిల్లువదలి పెట్టింది. ప్రసాద్ వారించేడు వద్దన్నాడు. కాని రజని వినలేదు. ఇంటిలో వుండటానికి అభ్యంతర మేముంది రజని? సహజీవనం లేకపోయినా నహచర్యం మిగిలే వుందికదా? అన్నాడు.

"అభ్యంతర మేమి లేదు ప్రసాద్. కాని మన యిద్దరి జీవితాల్లోనూ ఒక అధ్యాయం ముగిసిపోయింది. నూతన అధ్యాయాన్ని నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలని నా కోరిక" అంది రజని.

"కనీసం యిదయినా చెప్పి వెళ్లు రజనీ నువ్వు ఎక్కడకువెళ్లుతున్నావు?" అన్నాడు ప్రసాద్.

"లోడి రోడ్డులో ఒక చిన్న యిల్లు కాస్తచవుకగా దొరుకుతుంది. ముప్పై రూపాయిలు అద్దె. చౌకే కదూ!" అంది రజని.

రజని మాటలు ప్రసాద్ కి ఎంతో బాధకలిగించాయి. అయినా ఏమీ మాట్లాడలేదు. రజనితత్వం అతనికి మొదటి నుంచి తెలుసును, ఆమె ఒక నిశ్చయానికి వచ్చిన తరువాత ఆది యిక ఏమాత్రమైన కదిలించడమనేది అసంభవం.

"కారులో దించివస్తాను పద రజనీ!'' అన్నాడు ప్రసాద్ ,

"వద్దు ప్రసాద్. ఇప్పటి నుండి నాకు జీవితమందు తీపికలుగుతోంది. అది మొదట్లోనే త్వజించబడటం నాకు యిష్టం లేదు" అంది రజనీ నవ్వుతూ.

"అదిసరే రజనీ నీ సామానుఏది?" అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.

"ఇదుగో ప్రసాద్, యీ రెండు పెట్టెలు, బెడ్డింగు మొదటిసారి వచ్చినప్పుడు నాతో తెచ్చుకున్నాను. అవే తీసుకు వెళ్తున్నాను" అంది.

"అయితే యిక వెళ్ళు రజనీ" అన్నాడు ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్చి.

రజనీ ఆ మరుసటి దినం నుంచి వుద్యోగంలో కూడా చేరింది. ఆమె అందాన్ని చూచి ఒక ప్రయివేట్ కంపెనీలో రెసెప్షనిస్ట్ వుద్యోగం ఆ కంపెనీ యజమాని యిచ్చాడు. రెండువందల రూపాయిలజీతం. ఒక నెల అడ్వాన్స్ జీతం కూడా యిచ్చాడు. వాటితో యింటికి కావలసిన సామానులన్నీ ఖరీదు చేసింది. ఆనాడు సాయంకాలం రజని రామం లాడ్జికి బయలుదేరింది. లాడ్జికి వెళ్ళేటప్పటికి రామం గది తాళం వేస్తున్నాడు. రజనీని చూచి ఆనందంతో సరిగ్గా నీవద్దకే బయలు దేరి వస్తున్నాను రజనీ" అన్నాడు.

నవ్వుతూ "వస్తున్నాననకండి. బయలుదేరుతున్నా ననండి, బాటసారి బయలు దేరిన తరువాత గమ్యస్థానం చేరే లోపున చాలా గండాలు గట్టెక్కి బయటపడాలికదా ? ఏమిటి యిన్నాళ్ళు బట్టి తమ దర్శనం కాలేదు!" అంది.

"నీకోసం నేను చాలాసార్లు మీయింటికి వచ్చాను" కాని ఎప్పుడూ హాస్పటల్ కి వెళ్ళావనే చెప్పారు. ప్రసాద్ కి ఎలా వుంది?" అన్నాడు రామం.

"పూర్తిగా బాగయి పోయాడు. యింటికి చేరుకున్నాడు" అన్నది.

"మంచిది. ఆయితే యిప్పుడెక్కడికి ప్రయాణం" అన్నాడు.

"నా వెంట రండి ఇంతకు ముందెప్పుడు మీరు వెళ్ళని ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను'' అంది. సుమారు రెండు మెళ్ళదూరం నడిపించి రజని తన యింటికి తీసుకువచ్చి తాళం తీసి లోపలికి రండి" అంది,

రామం అత్యంతాశ్చర్యంతో "ఇది ఏమిటి రజనీ యిది ఎవరి యిల్లు!''.

పరుల యింటిని నాయింటిగా భావిస్తున్నానని నా మీద మరొక నింద మోపారు. అందుకే మీరు బాధపడి నా మీద కోపగించి నన్ను నానా దుర్భాషలు ఆడారు, అప్పుడు మీరు నన్నడిగారు. ఈ యింటిలో వుండటానికి ఎంత అద్దెయిస్తున్నావు రజనీ'' అని. అప్పుడు నేను భాధపడి ఆ ప్రశ్నకు సమాధానం మరొక సారి చెప్తానన్నాను. ఇపుడు చెప్తున్నాను "ముప్పయి రూపాయలు" అంది.

రామం ఆశ్చర్యానికి పట్టపగ్గాలు లేవు "ఏమిటి రజనీ నీవు మాట్లాడేది నాకేమి అర్ధం కావటం లేదు' అన్నాడు.

"అంటే దాని అర్థం నేను ప్రసాద్ యిల్లు పదలి వేసేను. నా పూర్వపు సంబంధం నేను తెగతెంపులు చేసుకున్నాను. ఇప్పుడు కొత్తవారి కోసం వెదుకుతున్నాను. ఉద్యోగంలో కూడ చేరాను. నెలకు రెండువందల రూపాయిల జీతం. వచ్చేపోయే వాళ్ళ కేసి చిరునవ్వు విసరి "హలోమే ఐ హెల్ప్ యు అనడమే నాపని" అంది నవ్వుతూ.

"ఇదంతా నిజమేనా రజనీ ! లేక పరిహాసమా" అన్నాడు రామం.

"అక్షరాల నిజం రామం బాబూ. నమ్మకం లేకపోతే రేపు నాతోరండి" అంది.

అప్పటికి రామం రజని చెప్పినది నిజమని గ్రహించాడు. "ఇంత హఠాత్తుగా యీ పని ఎందుకు రజనీ? ప్రసాద్ కు నీకు యింత హఠాత్తుగా యీ విభేదం ఎలా సంభవించింది? ఇదంతా నాకు అగమ్య గోచరంగావుంది. దుఃఖించాలో, సంతోషించాలో కూడ తెలియటం లేదు" అన్నాడు.

"ఇందులో మీరు దుఃఖించవలసినది ఏమిలేదు, మీరు మొదటినుంచి యిదే గదా ఆశించారు? ఈ యీర్యతోనే నన్ను నానా మాటలు అనేవారు. ఇక మీ అభీష్టం ఫలించినప్పుడు దుఃఖమెందుకు చెప్పండి" అంది.

"ఎందుకో నాకు తెలియదు రజనీ, కాని నాకు ఆలోచించిన కొలది దుఃఖమే కలుగుతోంది. దీనికి కొంతవరకూ కారణభూతుడిని నేనే. ఆలోచన అందుకు యింకా దోహదమవుతోంది. ఈ పరిణామం మంచిదో చెడుదో నాకు తెలియదు. కాని దీని నుంచి చెడే ప్రాప్తిస్తేనాకు జీవితంలో మనశ్శాంతి వుండదు" అన్నాడు.

రజని లోపలికి దారితీసి "మనోదౌర్బల్యం కలవారికి మనశ్శాంతి ఏలా లభించగలదు చెప్పండి! అయినా అదంతా తీరికగా ఆలోచిద్దాం ముందు లోనికి పదండి" అంది.

రామం లోపల అడుగుపెట్టి గది అంతా పరిక్షించి చూచాడు. గది అంతా ఎంతో శూన్యంగా, నిరాడంబరంగా వుంది. కాని కుర్చీలు కాని, బల్లలు కాని, మంచాలు కాని ఏమి లేవు. ఒక మూలకొక బెడ్డింగు చుట్టబడివుంది. ఇంకొక మూల కొకేలానికి కొన్ని చీరలు వేలాడుతున్నాయి, పక్కగా ఒక పెట్టెవుంది అంతే.

"కుర్చీలు, సోఫాలు ఇక్కడ లేవు మీరు చాపమీద కూర్చోవాలి" అంది రజని చాపపరచి.

ఆదృశ్యంచూసేసరికి రామం కళ్లలో సన్నగా నీరు తిరిగింది. అందుకు నాకేమి అభ్యంతరం లేదు రజనీ. కాని ఐశ్వర్యానికి అలవాటుపడిన నీవు యీ దారిద్య్రాన్ని ఏలా భరించగలుగుచున్నావు?" అన్నాడు.

"ఇదేమంత కష్టం కాదు. మానవుని మనస్సు ఎంతో చిత్రమైంది. కష్టాలు ఎదురయ్యే వరకు వాటిని మనం ఎదుర్కోలేమని భయపడతాము, సంకోచిస్తాము కాని నిజంగా సమయం వచ్చేటప్పటికి వాటిని సునాయాసంగా దాటివస్తాము. ఈ మహత్తరమైన శక్తి మానవుని సదారక్షిస్తూ వుంటుంది." అంది.

"వేదాంతం మాట్లాడకు రజనీ, నిజంగా నీకు ఈ దారిద్యం భరించటం కష్టంగా లేదా?"అన్నాడు. "భరించక నేనేమి చెయ్యను చెప్పండి. కష్టాలలో ఆదుకునే ఆప్తులు నాకెందరున్నారు చెప్పండి. ఎవరింటికి వెళ్ళినా చీదరించుకుంటూంటారు" అంది.

ఆమాటలు రామానికెంతో బాధకలిగించాయి. హృదయం ఎంతో బరువెక్కిపోయింది. "అలాంటిఆప్తులు లేకపోలేదు రజనీ కాని వారిమీద నీకు నమ్మకం లేదు అది వారి దురదృష్టం." అన్నాడు.

"వారిలో వారికి నమ్మకం లేనప్పుడు ఇతరులను నమ్మమనటం న్యాయమా చెప్పండి! ఆత్మవిశ్వాసం లేని వారితో ముందడుగు వెయ్యటం ఏమంత శ్రేయదాయకమయినది కాదని నా అభిప్రాయం. పరిస్థితులను పరిణామాలను ప్రతిఘటించే ధైర్యం కావాలి రామం బాబూ" అంది.

రజని మాటలు రామం మనస్సులో కలవరం లేవదీశాయి, ఏదో అనబోతుంటే, "ఇప్పుడు నాకా వివాదంలో దిగడమంటే యిష్టం లేదు రామం బాబూ ముందర నా ఆతిధ్యం స్వీకరించండి" అంది.

రామం మాట్లాడకుండా వూరుకున్నాడు. వంట ప్రయత్నం చేస్తూ "మీరోనాడు నేను యితరుల యింట్లో మీకు భోజనం పెట్టానని బాధపడి మీరు సరిగ్గా భోజనం చేయలేదు. ఈసారి పదార్ధాలన్నీ నావే. ప్రయత్నమంతా నాదే. నాయింటిలో మొదటి భోజనం మీకే పెడ్తున్నాను. ఈసారైనా మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి?" అంది.

ఆ ఆప్యాయత రామాన్ని కరిగించి వేసింది.

"నీకెందుకు యీ ఆతురత రజనీ? నేను సరిగ్గా భోజనం చెయ్యకపోతే నువ్వెందుకు బాధపడాలి? ఇది చాలా అల్పమైన విషయం కాదా? అన్నాడు రామం.

"ఇది ఆడవారిలోని బలహీనతలలో ఒకటి. ఆప్తులెవరయినా వారు వడ్డిస్తున్నప్పుడు సరిగా కడుపునిండా భోజనం చెయ్యకపోతే చాలా బాధ కలుగుతుంది, ఆప్యాయం ఎక్కువగా వుంటుంది. మగవారు దీనిని అట్టే పట్టించుకోరు, కాని ఆడవారి సంగతి వేరు, ఇంటికి వచ్చి సరిగా అన్నం తినకపోతే వారిని కించపరచినట్లు బాధపడతారు ఆంది.

"ఇదే నిజమైతే ఆ ఆడవారిమిద కోపగించిన వారు కక్ష తీర్చుకోవడానికివే సులభమైన మార్గం" అన్నాడు నవ్వుతూ,

రజనికూడ నవ్వుతూ " కాదని నేనను. కాని వారు కర్కశ హృదయులని మాత్రం నేనంటాను" అంది.

"కాదని నేనూ ఆనను" అని నవ్వుతూ "ఇదే సమయము ఇంకోక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పు రజనీ, ఆడవారిని అర్థం చేసుకోవటం అసంభవమనీ, వారి ఆలోచనల్ని, చేష్టల్ని గ్రహించుట దుర్లభమనీ, వారు నిగూఢ హృదయులనీ, చంచలస్వభావులనీ నలుగురూ అంటుంటారు అది నిజమేనా?" అన్నాడు రామం.

రజని " స్త్రీ నయినా నాకు మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభం కాదు. స్త్రీ, పురుషుల మనస్తత్వాలకు విభేదం వుందనే విషయం వివాదాంశమైనది కాదు. ప్రకృతిలోనే అలా వుంది. జీవితంలో స్త్రీ పురుషుల కర్తవ్యము వేరు, అందుకు తగినవిధంగానే వారి వారి హృదయాలు కూడ వేరుగా నిర్మించబడ్డాయి. స్త్రీలు చంచలస్వభావులే కావచ్చు. కాని వారిలోని కార్య దీక్ష, త్యాగ శీలం, కరుణ, అనురాగము మీలోచాలా అరుదుగా కనబడుతాయి. దానికి కారణం అతిసులభమైనది. ప్రకృతి స్త్రీలకే మాతృత్వం ప్రసాదించింది" అంది.

రజని విస్తరిలో రకరకాల పదార్థాలు వడ్డించి "ఇక ఆలస్యం చెయ్యకండి" అంది.

రామం ఆశ్చర్యంతో "మరి నువ్వో" అన్నాడు.

"నేను తినటమే ప్రారంభించానంటే మీ సంగతే మరచిపోతాను. మీకు వడ్డించి తరువాత నేను కూర్చుంటాను" అంది.

"అలాంటి అన్యాయపు మాటలనకు రజనీ. ఇప్పటికి నేను రెండుసార్లు నీతో భోజనం చేసాను. మా అమ్మనే మరపించే అప్యాయతతో నాకు భోజనం పెట్టావు. అయినా అప్పుడు లేని శ్రద్ధాసక్తులు యిప్పుడెందుకు" అన్నాడు రామం.

రజనీ నవ్వుతూ "అప్పుడు పరులయింటిలో మీకు నేను అన్నం పెట్టాను. ఇప్పుడు వేరు. మీ కడుపునిండా భోజనం చేస్తుండగా చూస్తూంటే నాకెంతో తృప్తి కలుగుతుంది. అదీ నాకు కలగకుండా నాకు అన్యాయం చెయ్యకండి" అంది.

"ఇది నేను సహించను. రజనీ? నువ్వలా నిలబడి వడ్డిస్తూంటే నేను సరిగ్గా భోజనంకూడ చెయ్యలేను. లాభం లేదు రజనీ నువ్వుకూడ నా పక్కన కూర్చుని భోజనం చెయ్యాలి" అన్నాడు.

"సరే రామం బాబూ! అతిథులు మీరు. మిమ్మల్ని ఆయిష్టపరచటం నా అభిమతంకాదు'' అంది.

"మాటి మాటికి అతిథి అంటూంటే నాకు కష్టంగా వుంటోంది రజనీ! నేను నీకు అతిథిని మాత్రమైనా? అంత కంటే ఇంకేమీ కానా?" అన్నాడు రామం.

రజని నవ్వుతూ, "యిప్పుడు ఇంకేమి కాదు రామం బాబూ! ఆ తరువాత చెప్పలేను అది మీ యిష్టాయిష్టాల మీద ఆధారపడి వుంటుంది. ఇక ఆలస్యం చెయ్యకండి. అప్పుడే ఎనిమది దాటిపోయింది. మీరు చాలా స్వార్థపరులు. భోజనాలయిన తర్వాత అంతా సర్దుకునేసరికి యింకొక గంట పడుతుంది, మీరు తీయని తమలపాకులు నములుతూ తన్మయులయె తరుణం కోసం వేచివుంటారు. మాలాటి అబలలు అలసివచ్చేసరికి ...'' అని యింకా అనబోతూవుంటే రామం చెవులు మూసుకొని ఇంక చాలు రజనీ'' ఆకలి అవుతోంది అన్నాడు.

భోజనాలయిన తర్వాత రజని తమలపాకులందించి "ఆకులకి సున్నం వ్రాసుకోండి. అన్నీ మీకు చేసి పెట్టడానికి మీకు నేనేమి అర్ధాంగిని కాదు" అంది.

"అర్థాంగివి కాకపోవచ్చు రజనీ. కాని అత్మీయురాలివే కదా!" అన్నాడు.

సున్నితమైన తన వేళ్ళతో యీనెలు తీసి సున్నం వ్రాసి రామం చేతికందిస్తూ "మీకు తెలుసునా నేను యింత యీ వుపకారం ఎవ్వరికీ చెయ్యలేదు. ఇలాంటి పనులు చేయడమంటే నాకొక విధమైన అనహ్యంకూడ వుండేది? అంది.

"అయితే ఈనాడు అడగకుండానే ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు రజనీ! " అన్నాడు.

"ఆ ప్రశ్నకి సమాధానాన్నే నేను నా హృదయంలో వెదుకుతున్నాను, కానీ ఎక్కడా ఆచూకీ లేదు. సమాధానం దొరికిననాడు ఆలస్యమవకపోతే తప్పక మీకు చెప్తాను. దగ్గర లేకపోతే నేను మీకు ఉత్తరం వ్రాసాను" అంది.

"ఉత్తరం వ్రాయవలసిన అవసరం కలగకూడదనే నేను పదే పదే ప్రార్థిస్తూంటాను రజనీ" అన్నాడు .

"కాని యిది ఎప్పుడో ఒకప్పుడు సంభవించక తప్పదు కదా! నేను ఢిల్లీలో చిరకాలం వుండను. మీరు వుండినా కొద్దికాలం పోయిన తర్వాత అపరిచితులు అడుగుపెట్టి అంతా స్వాధీనం చేసుకొని "నీ సర్వస్వంలో నాది సగం" అని అహంభావంతో అంటారు. అదివారం నాడు ఏమి తోచక యింటికి వచ్చి తలుపుతట్టితే అపరిచిత స్త్రీ ఎవరో తలుపు తెరచి నన్ను చూచి "ఎవరు మీరు?'' అని నన్నడుగుతారు. అహంభావంతో ''రజనిని" అనే శబ్దం వుచ్చరించినప్పుడు లోనికి వెళ్ళివచ్చి వారి స్మృతిపథంలో అలాంటి శబ్దాలకిక తావు లేదుట" అని అంటారు.

"అంతా అబద్దం! అభూతకల్పన'' అన్నాడు రామం.

రజని నవ్వుతూ "అభూతకల్పనో కాదో తర్వాత ఆలోచిద్దాము. కాని యిది భూతాలు సంచరించే సమయం అప్పుడే ఆలస్యమయింది. ఈ రాత్రికి మీరు యిక్కడే పడుకోకూడదా? సరదాగా కబుర్లు చెప్పుకుని వుండొచ్చు" అంది.

ఈమాటలు విని రామం ఉన్నదొక్క గదినీ కలియ చూచి ఎంతో ఆశ్చర్యంతో "ఏమిటి నువ్వనేది రజనీ? పరాచిక మాడుతున్నావా? పరాభవిస్తున్నావా?" అన్నాడు.

"పరాచకమూ లేదు, పరాభవము లేదు రామం బాబూ! పరీక్షిస్తున్నాను. కొద్ది కాలం క్రితమే మీరు "ఆశయం యిచ్చేఆప్తులున్నారు రజనీ ! కావి వారిమీద నాకు నమ్మకం లేదు'' అన్నారు. ఒక్క రాత్రి నాతో ఈ ఇంటిలో ఏకాంతంగా గడపటానికి భయంతో వణికిపోయే మీరు మీ యింటిలో నాకు ఆశయం ఎలా యివ్వగలరు! మీ మనస్సును మీకు విశదపర్చటానికే నేను అలా అన్నాను'' అంది.

రామం అభిమానంతో అవమానంతో అవమానంతో క్రుంగిపోయాడు. జీవితంలో నన్నెవరూ యింతవరకు నేనింత అవమానంతో సిగ్గుపడేట్లు చేయలేదు రజనీ. నా చేత్తోనే చెంపమీద చెళ్ళుమని కొట్టావు . దుఃఖంలో నైనా నీచాకచక్యానికి నేను "శభాష్" అనక తప్పదు" అన్నాడు.

"ఎవరినీ 'శభాష్' అనవలసిన అగత్యం లేదు రామం బాబూ! మీ హృదయం మీరు భద్రపరచుకొని ముందుకు సాగిపొండి. జారవిడచారంటే మళ్ళీ మీకు చిక్కను" అంది.

రామం హఠాత్తుగా లేచినిలబడి "నీ హెచ్చరికని నేను జ్ఞాపకముంచుకోవడానికి ప్రయత్నిస్తాను రజనీ" కాని ఫలితం గురించి నేనేమి చెప్పలేను'' ఇక నేను వెళతాను.

రజని కూడ నిలబడి "చెప్పటం మరచిపోయాను. రేపు విశాల యిక్కడకు వస్తోంది. కలుసుకోవాలని కోరికగా వుందన్నారు. స్టేషన్ కు మీరూ రాకూడదా?" అంది.

విశాల రాక సమాచారం విని రామం ముఖం విప్పారింది, "ఆలాగే వస్తాను రజనీ. సాయంకాలం రైలు స్టేషనుకి వస్తాను" అన్నాడు.

 

చాప్టర్ 7

మరునాడు సాయంకాలం రామం, రజని కలుసుకొని విశాలకోసం ఎదురు చూడసాగారు. రైలు గంటన్నర లేటు అని తెలిసింది. ప్లాటు ఫారంమీద వున్న బెంచీపై కూర్చుని మౌనంగా వున్నారు.

రామం హఠాత్తుగా జేబులోంచి వొక ఉత్తరం తీసి రజని చేతిలో కిచ్చి "యిది చదువుకో రజనీ" అన్నాడు.

"ఎవరి ఉత్తరం" అంది రజని.

"మా నాన్నగారిది. నువ్వు చదవకూడనిది ఇందులో ఏమి లేదు అన్నాడు. రామం.

రజని వుత్తరం చదివి నవ్వుతూ "శుభవార్త ఎప్పుడు పెళ్ళి" అంది.

ఆ మాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. రజని బాధపడుతుందనీ, విచారం వ్యక్తం చేస్తుందనీ అనురాగపువాక్యాలు పలికి పూరడిస్తుందనీ వూహించుచున్నాడు.

"నీకిది శుభవార్త కావచ్చు రజనీ కాని నాకిది ఎంతో దుఃఖవార్త. నువ్వింక చెప్పవలసింది ఇంకేమీ లేదా? అన్నాడు రామం.

"చెప్పవలసిందింకేమి లేదు రామం బాబూ కాని మీరు గ్రహించవలసింది చాలా వుంది" అంది రజని.

రామం ప్రక్కకు ముఖం త్రిప్పుకుని మౌనం వహించాడు. ఆతని ముఖంమీద వేదనా రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చి "భవిష్యత్తంటే నాకెందుకో యీ రోజుల్లో భయం వేస్తుంది రజనీ. జీవితపు శకటానికి నేను సారథ్యం వహించుకోలేననీ, యితరుల సహాయం అర్థించవలసిన అగత్యం ఏర్పడిందనీ నాకనిపిస్తుంది. ఆ బిక్ష్యం ఎవరినుంచి యాచించనా అని ఆలోచిస్తున్నాను "అన్నాడు.

"సహాయం లభించవచ్చు. కాని సారథ్యం మీరే వహించాలి రామం బాబూ ! ఆ శక్తి ఎవరికయినా లోపించే వుంటే వారు అర్ధ జీవులు మాత్రమే జీవితమంతా వారికి దుఃఖమయంగానే వుంటుంది. దుర్బలత్వంనుంచే దుఃఖం ఆవిర్భవిస్తుంది" అంది.

రజని మాటలలో కాఠిన్యతా, నిశ్చయము రామాన్ని ఎంతో దుఃఖపరచాయి."అవసరమయితే జీవితంలో నీ సహాయం నాకు లభిస్తుందా రజనీ?" అన్నాడు.

"అది ఎప్పుడూ అందరికీ లభిస్తుంది రామం బాబూ! కాని ఒక విషయం మీకు చెప్పాలని చాలా కాలంపట్టి అనుకుంటున్నాను. ఇది సరియైన సమయం కాకపోయినా చెప్తాను. యింకొకరి పై హద్దును మించిన అనురాగము ప్రేమా కలిగినట్లయితే అది ఎప్పుడూ దుఃఖానికే దారితీస్తుంది. ఆకర్షణ సహజమే కాని, అది అయస్కాంతపు ఆకర్షణలాంటిదయితే అది అసంతృప్తి, అశాంతి కలుగజేస్తుంది" అంది.

రామం దుఃఖపూరిత కంఠస్వరంతో "మనస్సుని శాసించి అదుపులో వుంచుకోవడమెలాగో చెప్పురజనీ! ఈ విద్యే నాకు నేర్పావంటే నేను నీకు జీవితాంతం దాసోహం చేస్తాను. నీమాట జవ దాటను" అన్నాడు.

రామం మాటలలోని వేదన, అశాంతి రజని గ్రహించింది. సాధారణంగా ఆమె జవాబుగా ఏదో పరిహాస వాక్యాలు పలికి వుండేది. కానీ రామం ముఖకవళికలు కంఠ స్వరం ఆమెని వారించాయి. క్షణ కాలం మౌనం వహించి "ఈ ప్రశ్నకు సమాధానం నేనేమి చెప్పలేను రామం బాబూ! బహుశా విశాల చెప్పగలదేమో" అంది.

"విశాల చెప్పగలిగినా అది అక్కరలేదు రజనీ. మనస్సులోనే అణచుకోలేని అనురాగానికి ఆమెకీయేమి సంబంధం లేదు" అన్నాడు.

రజనికి రామం ఆ విధంగా విచారంగా మాట్లాడం యిష్టం లేకపోయింది ఆ సంభాషణ కట్టిపెట్టుదామనే ప్రయత్నంలో నవ్వుతూ "సంబంధం వున్న వారు సంశయిస్తున్నారని బాధపడకండి రామం బాబూ! సమయానికి వారు సంసిద్ధులై వుంటారు. ముందర కాస్త ఆ స్టేషన్ మాస్టారిని వెళ్ళి అడగండి. కౌల్లా మెయిల్ తరలి వస్తోందో, లేదో కనుక్కోండి ఈ రాత్రి సింహాసనం మీద కూర్చుని, కూర్చొని వొళ్ళంతా కాయలు కాచిపోయాయి. మీకు బొత్తిగా యితరుల ధ్యాసే వుండదు. కాస్త ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెడితే మీ సొమ్మేమయినా పోతుందా చెప్పండి" అంది.

"తప్పు నాదే. కాని నువ్వు అంత సుకుమారివని నేనూహించలేదు" అన్నాడు.

"సుకుమారిని కాక శూర్పణఖనా నేను? నా శరీరం కేసి ఒక సారి చూడండి, ఎంత పల్చగా మెత్తగా నున్నగా వుందో ఈ కుడి చెయ్యి ఒక్కటే కాస్త బండ తేరింది అని అంటూ అర చేయి రామానికి చూపింది. అ చేయి మృదువుగానే వుంది. కాని చూపుడు వేలు చివర కాస్త గోధుమ రంగులో వుంది.

అది చూసి రామం వ్యాకులపాటుతో "అదేటిమి రజని"

"ఏమి లేదు. వీణ వాయిస్తున్న వాళ్ళందరికీ అలాగే వుంటుంది. తీగలను మీటుతూ వుంటే కొన్నాళ్ళకి అది కూడ మాసిపోతుంది" అంది రజని.

"నువ్వు వీణ వాయిస్తావని నాకు తెలియదు రజనీ. నీ దగ్గర ఇప్పుడు వీణ లేదే? అన్నాడు రామం.

"ఒకప్పుడు వుండేది రామం బాబూ! కాని యిప్పుడు లేదు, అవసరానికొకసారి అమ్మివేసాను. ప్రసాద్ కొని వొకటి ఇచ్చాడు. కాని అది అక్కడే వదలివచ్చాను" ఉంది.

"నేను కానుకగా యిస్తే స్వీకరించగల సహనం నీలో వుందా రజనీ? లేక కృతజ్ఞతను ఆశించే నన్ను ఈ విధంగా బంధించాలని చూస్తున్నానని నన్ను నిందిస్తావా!" అన్నాడు.

"సహనం వుంది రామం బాబూ! కాని సమయం కాదు నేను ఏది ఇతరులవద్ద నుండి వొక విధమైన అంగీకారము, ఒడం బడిక లేకుండా స్వీకరించిను పరులకు ఋణపడటమనేది నాకు గిట్టదు" అంది రామం నిట్టూర్చి "అది సహజమని నేననను. కాని నేను పరాయి వాడిని కాను ఆత్మీయుడనని నువ్వే వొకసారి అన్నావు అది అప్పుడే మరచిపోయావా?" అన్నాడు.

"మరవ లేదు. కాని మీరు ఋణపడదగిన ఆత్మీయులు కారు. దానికి కారణంకూడ యిప్పుడే చెప్పాను. జీవితంలో మీరు బంధనాల్ని, గొలుసుల్ని తెంచి వేసుకోవాలి. అంత వరకు మీరు ఆత్మీయులయినా పరాయి వారు మాత్రమే'' అంది.

మాటలలో పడి వారిరువురు రైలు ప్లాటుఫారంమీదకు వచ్చేవరకు వారుగుర్తించలేదు. కంగారుగా లేచి వారు ఫస్టుక్లాసు, రెండవ క్లాసుపెట్టెలు వెదక సాగారు. కాని ఎక్కడా విశాల కనబడలేదు. వ్యాకుల చిత్తురాలైన రజని వెనకాల ఎవరో వచ్చి ఆమె కళ్లు మూసి "విశాలని ఎక్కడ వెదకాలో నీకింకా తెలియలేదా రజనీ? అంది.

రజని కళ్లు తెరచి "లేదు విశాల? నాకు అనుమానంగానే వుంది. కాని మాటలలోపడి రైలు రాకను గుర్తించలేదు. అందుకనే దగ్గరగావున్న పెట్టతో మొదలు పెట్టాను" అంది.

రామాన్ని ఇప్పటివరకు విశాలగుర్తించలేదు. కాని రామం విశాలను పరీక్షించి పరిక్షించి చూస్తున్నాడు. విశాల రజని రూపంతో పోల్చి చూసుకుంటున్నాడు. రజనికి ఆమెకివున్న వ్యత్యాసము గమనిస్తున్నాడు, రజనిది పచ్చనిబంగారుఛాయా. విశాలది లేత తెలుపు. రజనికన్న కాస్త బొద్దుగా వుంది కళ్లు అట్టే పెద్దవి కాక పోయినా ఆమె చిన్నది లక్క పిడతవంటి నోరు, చిన్నముక్కు, వాటికి అందాన్నిస్తున్నాయి. నల్లటి జుట్టు చక్కగా సిగ చుట్టబడివుంది కలిమిరంగు చీర నిండుగ ధరించివుంది. అప్పుడే రజని. రామాన్ని విశాలకు పరిచయం చేసింది. విశాల సన్నగా నవ్వుతూ, మీ గురించి రజనీ చాలా వ్రాసింది రామం బాబూ! కానీ మీ పరిచయం కలిగే భాగ్యం యింత త్వరగా లభిస్తుందని నేనూహించ లేదు" అంది.

రామం సమాధానం చెప్పేలోపల "రజని నువ్వువూహించక పోవచ్చు. కానీ వారు యీ తరుణంకోసం ఎంతో కాలంపట్టి ఎదురు చూస్తున్నారు" అంది విశాల.

అసంగతమైన ఆ మాటలు రామంలోని కోపాన్ని ప్రేరేపించేయి, ముఖమంతా ఎర్రబడింది. అది గమనించి రజని'ఇంకొక విషయం నీకు ముందరే చెప్పి హెచ్చరించాలి. విశాలా! వీరికి కోపం ఎప్పుడూ ముక్కు మిద మఠం వేసుకు వుంటుంది. చీటికి మాటికి గంతులు వేసి క్రిందకు వూరుకుతూవుంటుంది. అది నిజంగా విజృభించిందంటేమనమంతా భస్మమయి పోతాము" అంది.

విశాల మందహాసం చేసి రామం కళ్ళలోకి చూస్తూ నవ్వింది.

"మీరు రజని మాటలని ఆట పట్టించుకోకూడదని నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఆమె చిలిపితనం మీకు తెలియలేదనుకుంటాను" అన్నాడు రామం.

"ఆ విషయంలో మీరేమి ఆపోహపడనవసరము లేదు రామం బాబు, రజని నాకు బాగా తెలుసు పరాచకాలాడుతుంది. కాని ఆమె అసత్యం పలుకదని నాకు గట్టి నమ్మకం" అంది విశాల.

పోర్టరు నెత్తిన సామాను యెత్తుకుని, కాసేవు ఎదురు చూచి వీరి సంభాషణకు అంతం లేక పోయేటప్పటికి విసుగుతో బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించి రజని "అరె! మాటల్లో పడి సామాను మాట మరచిపోయాము, పోర్టరు బయటకు వెళ్ళినట్టున్నాడు. నేను బయటకు వెళ్ళి వెతుకుతాను అని వెళ్ళబోతూంటే రామం కంగారుగా రజని చెయ్యిపట్టుకొని ఆపి, ఆగు రజనీ! నేను వెళతాను" అని చరచరా బయటకు వెళ్ళిపోయాడు, విశాలతో వంటరిగా వుంటానికి భయపడి అలా ప్రవర్తించాడని గ్రహించింది.

"పద విశాల, మనం కూడా బయటకు వెళదాము. సామాను గుర్తు ఆయనకు తెలియదు, పోర్టరునికూడా ఆయన చూచివుండరు. ఇక ఆయన గుర్తుపట్టడం అసంభము" అంది రజని.

విశాల- "కాని వారు అప్రయోజకులు కారు రజనీ! అసహాయశూరులా అని అనుమానంగావుంది. బయటకు పోయి చూద్దాం . నువ్వనేది నిజమో కాదో తెలుస్తుంది రజని"

స్టేషను బయటకు రామం పోర్టరు కోసం వెదుకుతూ విశాల ఎదుట తన ఆప్రయోజకత్వం కనబడిపోతుందేమో నని భయపడసాగాడు. కాని పోర్టరు రామాన్ని గుర్తించి సామాను దగ్గరకు తీసుకువచ్చాడు. దానితో రామం మనస్సు కుదుటపడింది. సామాను టాక్సీలో వేయించి పోర్టరుకి డబ్బులు యిచ్చి పంపించి వేసాడు. సరిగ్గా అదే సమయానికి రజనీ, విశాల స్టేషనులో నుంచి బయటకు వచ్చారు. సామానంతా టాక్సిలో వుండటం చూచి విశాల రజని కళ్ళలోకి చూచి చిలిపిగా నవ్వింది. రజనికూడా ఆ దృశ్యం చూచి ఆశ్చర్యపోయింది. విశాలతో వేసినపందెంలో ఓడిపోయినా ఆమెకెందుకో సంతోషం కలిగింది. రామం ఆమె భయపడినంత నిస్సహాయుడు, నిర్భలుడు కాదనుకుంది.

ముగ్గురూ టాక్సీలో బయలుదేరారు. విశాల "నన్ను ఎక్కడకు తీసుకు వెళుతున్నావు రజనీ! ప్రసాద్ ఇంటికేనా?" అంది

"కాదు, విశాలా! రజని ఇంటికి" అంది.

అప్పుడు రజనికి విశాలకు జరిగినదంతా విశదీకరించి వెల్లడి చేసింది. అంతా విని, విశాల దీర్ఘంగా నిట్టూర్చి "నీలోని నిర్భయతే నన్ను భయపెడుతూవుంటుంది రజనీ?" అంది,

"భయపడవలసినదేదీ లేదు విశాలా! బాధ్యతలు ఎక్కువయ్యాయి. అంతే" అంది.

"కాని నీ బాధ్యతలు బరువుగా వుంటాయి రజనీ! మనస్సు చిక్క పెట్టుకోవడం అప్పుడే కష్టం" అందివిశాల.

"రామం బాబు నన్ను మనస్సుని శాసించటమెలాగో చెప్పమని నన్ను అడిగారు, నేను చెప్పలేను కాని మీ విశాల చెప్పగలదేమో అన్నాను – అంది.

"చెప్పమంటారా రామం బాబూ!" అంది విశాల

"చెప్పండి" అన్నాడు రామం.

"మనస్సుకి స్వేచ్ఛా స్వాతంత్యాలు యిచ్చేమంటేఅది మనస్సు సన్మార్గంతోనే నడుపుతుంది. అణచి వుంచాలని ప్రయత్నించినప్పుడే అది విజృంభిస్తుంది. సాధారణంగా మనస్సు కోరే కోరికలు అసహజమయినవి కావు సహజమే వాటిని అసహజంగా పరిగణిస్తుంది. మన నవీన నాగరికతే వాటికి ప్రబల శత్రువు.కాని కోరికలకి లొంగిపోవడంలో ఘనత లేదు. వాటిని నిగ్రహించుకోవడంలోనే మానవతత్వం వుంది" అంది విశాల.

"నేనడిగింది మనస్సుని ఎందుకు శాసించాలని కాదు. ఎలాశాసించాలని మాత్రమే" అన్నాడు రామం.

"ఆలోచనల్ని మనం అరికట్టలేము కాని ఆచరణని అదుపులో వుంచుకోవచ్చు. దీనికి ఇంద్రియ నిగ్రహం కావాలి. దీనిని ప్రయాసతో, పట్టుదలతో అభ్యసించవచ్చును. ఈ విద్య కరతలామలకమయినవారే వుత్తములు" అంది విశాల.

విశాల దృక్పథానికి, రజని ధృక్పథానికి వున్న వ్యత్యాసం రామాన్ని ఎంతో ఆశ్చర్యపరచింది. కట్టుదిట్టాలు, క్రమబద్ధాలు ఉంటే రజనికి గిట్టవు. సభ్యతా సభ్యతలు, నీతి నియమాలు మానవనిర్మితా లంటూంది. పరులకు హాని కలిగించక పోవటమే జీవితంలోని ఓకే ఒక సత్యం ఉంటుంది. కోరికల్ని అణచుకోకూడదు పాపమునే పేరుతో పిరికివారు మనల్ని చెదరగొట్టుతూవుంటారు. కాని విశాల కోరికల్ని అణచుకోవటంలోనేఔనత్యముందంటుంది.ఆశక్తి లభించినవారే వుత్తములు. జంతుజాలానికి మనకి వున్న ముఖ్య విభేదమీదే. కోరిక కలిగిన వెంటనే ఆ వాటిని తీర్చుకుంటాయి. మానవులు సమయా సమయాలు, యుక్తాయుకాలు, పరిసరాలు, పరులు-వీటన్నింటిని గుర్తించి ఆలోచించాలి.

"మీ మాటలు రజని అంగీకరించదని మీకు తెలుసును కాదా? నేనే ఆ మాటలు అనినట్లయితే ఆమె ఎగతాళి చేసి "ఆత్మవంచకులు, అప్రయోజకులు అని వుండును" అన్నాడు రామం.

"ఆలాంటివారు మీరు కారని నిరూపించుకునే బాధ్యత మీ మీదే వుంది రామం బాబు." అంది విశాల.

రజని కూడా నవ్వుతూ "అదికూడా అవసరం లేదు విశాలా, వారలాంటివారు కారని వారికే నమ్మకం లేదు. ఇతరులను నమ్మమనుట న్యాయమా చెప్పు! పైగా ఆయనకి ఏమన్నా పట్టపగ్గాలు లేనంత కోపం వచ్చి నోటికొచ్చినట్లు నానామాటలు అంటారు. నన్ను వారన్న మాటలన్ని చెప్పేనంటే... అమ్మోయి" అని గట్టిగా అరిచింది.

తను ఆమెను అన్న మాటలు చెప్పి వేస్తుందేమోనే భయపడుతూ కంగారుగా రామం ప్రక్కనే కూర్చునివున్న రజని కాలు గట్టిగా తన బొటన వ్రేలుతో ఒక్కసారి నొక్కాడు. బాధతో గట్టిగా ఆరిచి కుడి వేలు బయటకు తీసి చూసుకుంది. పచ్చటి ఆ చిన్న పాదమంతా ఎర్రబడింది. ఒక చోట కొంచెం చర్మం కూడా వూడివచ్చింది. అది చూచి రామం ఎంతో వ్యధనపడ్డాడు. రజనియెడ అపరిమితమైన జాలి, తన యెడ అసహ్యముతో హృదయమంతా నిండిపోయింది.

"చూడు విశాలా! ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తారు, బొత్తిగా మొండిమనుష్యులు. లేకపోతే అందరూ పూజించే యీఅందమైన పాదాన్ని అహంభావంతో ఇలా బూటుతో తంతారా రా చెప్పు! ఇదేనా వారి మగతనం" అంది రజని.

రామం వ్యాకులపాటుతో విశాల కేసి తిరిగి, "మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నేనలాంటి కఠినహృదయుడనని కిరాతకుడనని, మీరనుకున్నారంటే నాకు చాలా బాథగా వుంటుంది" అన్నాడు.

"చూచావా విశాలా! వీరు కనీసం విచారమైనా వ్యక్తం చెయ్యలేదు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా నీతో ప్రగల్భాలు పలుకుతున్నారు" అంది రజని.

విశాల నవ్వుతూ."నీరన్నదే నిజం రజనీ, చేష్టలకే మనం ప్రాధాన్యతనిచ్చేమంటే ప్రపంచంలో అంతా తల క్రిందులవుతుంది. అయినా మీ యిద్దరిమధ్యా నాకెందుకు? ఇంతకు ఈ టాక్సీ ఢిల్లీ అంతా తిరుగుతున్నట్లుంది. అప్పుడే మీటరు అయిదురూ రూపాయిలు చూపిస్తున్నది. ఇంకా ఎంత దూరం రజనీ!'' అంది.

"అదిగో! ఆ కనబడే పెద్ద మేడ పక్కన చిన్న యిల్లు వుంది. చూచావా!?" అంది.

ఇంటికి చేరుకునేసరికి తొమ్మిది గంటలయింది. లాడ్జికి వెళ్లి పోతానంటే విశాల వెళ్ళనివ్వలేదు. భోజనం చేసినతర్వాత బయలు దేరిపోతూంటే, రజని "రామంబాబు రేపు ఆదివారం విశాలను కాస్త అటు యిటు త్రిప్పుదాము. టూరిస్టు బస్సొకటి ఉదయమే బయలు దేరి ముఖ్యమైన ప్రదేశాలను త్రిప్పి తిరిగి సాయంకాలం చేరుస్తుంది. దానిమిద వెళ్ళితే యెంతో సునాయాసంగా అన్నీ చూపించవచ్చు. మీరు వుదయమే యిక్కడకు వచ్చేయండి..." అంది.

"అవునందామా? కాదందామా? అని ఆలోచనలో పడ్డాడు. విశాల ఏమైనా అనుకుంటుందేమోనని సంశయిస్తూ వుంటే "రజనీతోకబుర్లు చెప్పుతూ వుండడానికి ఒకరు చాలరు. పైగా నన్నుమాటల్లో పడవేసి సరిగ్గా అన్నీ చూపించడం మాని వేస్తుంది" అంది విశాల రామంతో.

రామం సరే నన్నాడు.

ముగ్గురు మరునాడు టూరిస్టు బస్సులో బయలు చేరారు. బస్ను చాలావరకు ఖాళీగానే వుంది. కొంత మంది విదేశీయులు కూడా అందులో వున్నారు. ఒకరిద్దరు నూతన దంపతులు కూడా వున్నారు. అందులో ఒక అమెరికన్ దంపతుల పరిచయం రజని చేసుకుంది. వారిద్దరు వివాహమైన తరువాత ప్రపంచ యాత్రకి బయలుదేరారు. యువకుడి పేరు డేవిడ్, అతని భార్య పేరు మేరీ. రజనితో వారికి స్నేహం ఏర్పడింది. అనేక విషయాలనుగురించి వారితో చెప్పింది. కనబడిన ప్రతి దానికి ఆమె వ్యాఖ్యాసం చేసి చర్చించింది. ఇక విశాలకు విశదీకరించవలసిన బాధ్యత రామంమీద పడింది.

రెడ్ ఫోర్టులో అందరు తలొకవైపు పచార్లు చేస్తున్నారు. రామం విశాలకి లోనవున్న భవనాలకి గల చారిత్రక ప్రాధాన్యతను విశదీకరించి చెప్తున్నాడు తిరిగితిరిగి అలసి, తిరిగివచ్చేసరికి రజనీ, అమెరికన్ దంపతులతోటి ఏదో గట్టిగా నవ్వుతూ మాట్లాడుతోంది. ఆ యువకుడు ఇంగ్లీషులో అంటున్నాడు . నీలాంటి స్త్రీ పరిచయం కలిగినందుకు నాకెంతో సంతోషంగా వుంది రజనీ! ఇండియా దేశ స్త్రీలు ఇంత ఫార్వర్డ్ గావుంటారని నేనూహించలేదు అయినా నాకిది చెప్పు యువతీ! మీ దేశీయులందరు ఇంత అందంగా ఏలా వుంటారు! మా దేశంలో ఇంత విశాల నేత్రాలు నేను ఎప్పుడూ చూడ లేదు" అన్నాడు.

రజని నవ్వుతూ, "పరదేశీయులంటే ఆ ఆకర్షణ అందరికి వుంటుంది డేవిడ్, నాకు కూడా మీ దేశం చూడాలని కోరికగా వుంది. కానీ ఏం చెయ్యను? అడపాతడపా నీబోటి నమూనాలతో సరిపెట్టుకోవాలి" అంది.

మేరీ ''అయితే మాదేశం వచ్చేయ్యకూడదా? అక్కడ వుద్యోగం ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ నీకెవరు లేరని చెప్పారు. ఇక్కడ నుంచి రేపే మేము వెళ్ళిపోతాము. మాతోపాటు నువ్వు మిగతా దేశాలన్ని తిరిగి అమెరికా రావచ్చు లేక నీ కిష్టం లేకపోతే మేము కూడా" శాపేరాతో తిరిగి అమెరికా వెళ్ళిపోతాము. అవసరమయితే రెండుమూడు రోజులుండి వెళతాము. డబ్బు గురించి నువ్వాలోచించకు. మా వద్ద కావలసిన ధనముంది. నువ్వు తిరిగి యివ్వవలసినఅవసరము లేదు.

చక్కటి ఆలోచన చేశావు మేరీ! ఇక దీనికి తిరుగు లేదు. నువ్వు మాతో రావలసినదే రజనీ! బలవంతంగానైనా నిన్న మేము తీసుకు వెళతాము. నువ్వు మాతో రావలసిందే" అన్నాడు డేవిడ్.

హఠాత్తుగా సంభవించిన ఆలోచన క్షణకాలం, రజనిని చకితురాలిని చేసింది. సంతోషంతో "సరే అయితే అలాగే చేస్తాను. రెండురోజులు తరువాత బయలు దేరి వెళదాము ఈ లోపున అన్నీ సర్దుకోవచ్చు" అంది.

డేవిడ్ రజని చెయ్యి పట్టుకుని షేక్ హాండు చేస్తూ సంతోషంతో థాంక్స్, నీవంటి ధైర్యవంతురాలిని, సాహసవంతురాలిని నేనిక్కడ యింతకుముందు చూడలేదు. క్షణంలో నిశ్చయానికి వచ్చేవు అది దృఢమైనదని, అచంచలమన, తెలుస్తునే వుంది. అమెరికాలో నీ అందం, నీ మాటలు అందరినీ తన్మయులని చేస్తాయి. పురుషులంతా నీకుదాసోహం మవుతారు" అన్నాడు.

రజని, వుత్సహంలోపడి రామం, విశాల సంగతే మరచిపోయింది. సరిగ్గా యిదే సమయానికి వారిరువురు తిరిగి వచ్చారు. వారిని చూచి రజనీ, విశాలతో జరిగిన సంగతి చెప్పింది. ఆ మాటలు విని రామం వ్యాకులత్తు డయ్యాడు. అది నిజమని నమ్మలేక పోయాడు. కాని రజని స్వభావం తనకు తెలుసు. తలచుకున్నది చెయ్యక మానదు ఆమెను అడ్డగించే అధికారం ఎవ్వరికీ లేదు. రజని ఎవ్వరిపొత్తు కాదని ఆమె పదే పదే చెపుతుంది. ఇక ఇప్పుడు ఏమి చెయ్యాలో అతని కేమి తోచలేదు. రజని శాశ్వతంగా దూరమయే భయంకరసమయమదేనని గ్రహించాడు. అది ఎలా భరించటం? హఠాత్తుగా హృదయమంతా దు:ఖంతో కరడుకట్టిపోయింది. పూర్తిగా చేతనారహిడయి పోయాడు, అతనికి ఏం చెయ్యాలో, ఏమనాలో అర్థంకాలేదు.

"బాగా ఆలోచించుకున్నారా?రజనీ హఠాత్తుగా అనాలోచితంగా యిలా చేసేవంటే తరువాత బాధపడతావేమో?" అంది విశాల.

"బాధపడడానికేమి లేదు విశాల. బంధనాలు బాధ్యతలు నాకు లేవు. ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు దొరకదు. నూతన ప్రదేశాలు చూడాలనీ, నూతన వ్యక్తులను కలుసుకోవాలని, నాకు చిన్న తనంనుంచీ కోరికగా వుంది. అక్కడ నాకు జీవనోపాధి లభించగలదని, శేష జీవితం సరదాగా, సాఫీగా పోగలదని నాకు నమ్మకంగా వుంది" అంది రజని.

వీరిద్దరి సంభాషణ అమెరికన్ దంపతుల కర్ధం కాక పోయినా విశాల ఆటంకాలు కల్పిస్తోందని గ్రహించారు. డేవిడ్ విశాలతో "మీరు రజనీ దారికి అడ్డం రాకండి. ఆమెను తీసుక వెళ్ళకుండా మేమూరుకోము. లేకపోతే మీరు వచ్చేయండి మాతోటి" అన్నాడు.

విశాల మెల్లగా నవ్వి "నేనేమి ఆటంకాలు కల్పించలేదు మిష్టర్ డేవిడ్. జీవితంలో ముందడుగు వేసే సమయంలో మరువకూడని విషయాలని జ్ఞప్తికి తెచ్చుకుని నిశ్చయానికి రావాలి. అదే ఆమెను హెచ్చరిస్తున్నాను"అంది.

"అది అసత్యమని నేననను విశాల! ముందు వెనుకా చూడకుండా సాహసించి చెయ్యవలసిన పనుల కూడా వుంటాయి. వాటికి పరిస్థితులతోటీ, పరిణామాలతోటి ప్రమేయం లేదు"అంది రజని.

రజని పట్టుదల, అచంచలమైన నిశ్చయము, విశాల గ్రహించింది. ఆమె రామం ముఖ కవళికలు గమనిస్తూనే వుంది. అతని తరవునే ఆమె ఆ వాక్యాలు పలికింది.

కనీసం రేపటి వరకు గడువు తీసుకో రజనీ అంతా తరువాత ఆలోచిద్దాము, ప్రసాద్ సలహా కూడా తీసుకోవచ్చు" అంది.

ఆ అవసరం నాకిప్పుడు లేదు విశాలా! నేను ఇప్పుడు ఏకాకిని ... ... అని ఏదో అనబోతుంటే రామం గర్జించాడు. "రజనీ! నేను నీతో మాట్లాడాలి" అని.

పిడుగులాంటి ఆమాట వినినప్పటి నుంచి రామం హృదయంలో బడబాగ్ని చెలరేగింది. రజని ఒక్కమాట కూడా తనతో మాట్లాడలేదు. ఆది గాయానికి కారం చల్లినట్లు అయింది. క్రోధంతో అన్న మాటలవి.

రామం మాటలకన్నా ఆతని కంఠస్వరమే అందరినీ ఆశ్చర్యపరచాయి. రజని అది మొదట గుర్తు కూడా పట్టలేకపోయింది. విశాల త్రుళ్లిపడింది

అమెరికన్ దంపతుల మాటలు అర్ధం కాకపోయినా, రామం ముఖ కవళికలు, కంఠ స్వరం విచలితుని చేసాయి.

"మిమల్ని మాట్లాడవద్దని నేనెప్పుడన్నాను రాంబాబు.ఇతరుల మాటలు వినననే అధికారం నా కెప్పడూ లేదు" అంది రజని.

"ఒంటరిగా మాట్లాడాలి" అన్నాడు రామం.

"ఆది ? సబబుగా కాదు వీరందరిని ఇక్కడ వదలి మీతో రహస్యమంతనాలు చేయటం న్యాయం కాదు. ఐనా మీరు చెప్పదలుచుకున్నది నాకు తెలుసు. నా స్వభావం మీరు గ్రహించినట్లయతే సమాధానం కూడా మీరూహించుకోవచ్చు" అంది రజని.

ఆ మాటలతో రామం హృదయంలోని ఆవేదన, విచారము, ఆప్యాయత, కాని క్రోథం పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆది గమనించి విశాల ''రజనీ స్వభావం నాకు తెలుసు కానీ ఇతరులని కూడా నువ్వు నీ ఆలోచనలతో సర్దుబాటు చేయాలి, వారితో కొంతగా సంప్రదించడంమనేది నీ ధర్మం. వారి అధికారము కూడాను. నీవు సర్వస్వతంత్రురాలివని దురహంకారతోటి సర్వాన్ని కాలదన్నుకోకు, ఇతరులను బాధించే అధికారం కూడా లేదు. ఇదేసంగతి నీవే నాకోసారి బోధ చేసావు. కాని ఇది నువ్వు మరచి ప్రవరిస్తున్నావు'' అంది.

విశాలమాటలు రామానికి ఎంతో వూరట కలిగించాయి . నిశ్శబ్దంగా, చేతనారహితంగా కృతజ్ఞతాపూర్వక వందనాలు నివేదించాడు. ఆమె మాటలు రజనినికూడా కదలించాయి.

"నువ్వు వ్యక్త పరచిన అభిప్రాయాలను నేనంగీకరించక పోయినా, ఆచరణలో నీ సలహానే పాటిస్తాను, కాని రాంబాబు వీరందరిని ఇక్కడ వదలటం సమంజసం కాదు. మనం టాక్సీలో వెళ్లిపోదాం. వీరు చూడవలసినవన్నిటిని చూచి తిరిగి చేరుకునేసరికి నా నిశ్చయం వారికి వెల్లడిచేయవచ్చు" అంది రజని.

అమెరికన్ దంపతులతో ఆవిధంగానే చెప్పి ఎంతో కష్టంమీద వారిని ఒప్పించింది. ఏమైనా సరే, రజనిని వదలకూడదనే పట్టుదల వారిలో కలిగింది. రజనిని చూచినకొలది ఆమె ఔన్నత్యం వారికి స్పష్టంగా కనబడజొచ్చింది. ఐదున్నర గంటలకి హోటల్ జన్ పద్ లో కలుసుకొని తన నిశ్చయాన్ని వెల్లడిస్తానని మాట యిచ్చి రజని, రామం విశాలతోకూడ బయటకు బయలు దేరింది. దారిలో "రజనీ నన్ను ప్రసాద్ ఇంటి వద్ద వదలిపెట్టండి ఒక సారి చూచివస్తా" అంది విశాల.

ఆమె మాటలు రజనీ అర్థం చేసుకుంది. "అలాగే కానీ విశాలా! వారు నిన్ను చూచి సంతోషిస్తారు. అకారణంగా నేను వారిని వదలివచ్చాను. ఆయన బాధపడ్డారు. మానసికంగాఆయన కూడా బలహీనులని నేనానాడు గ్రహించాను" అంది.

రజని, రామం కారు దిగలేదు, టాక్సీ రజని ఇంటికి దారి తీసింది. ఆ తరువాత కొన్ని నిమిషాల వరకు రామం కాని రజని కాని మాట్లాడలేదు సర్దార్ జీ అద్దంలో రజని రూపాన్ని పదేపదే చూస్తూ వువ్విళ్ళూరుతున్నాడు.

నిశ్శబ్దాన్ని నిర్దాక్షిణ్యంగా చిందర వందర చేస్తూ రజని "మీరు ఏకాంతంకోసం పరితపించి కాంక్షించారు. అది లభించినప్పుడు మీరిలా మౌనము దవహించడము ముదావహంగా లేదు రాంబాబు" అంది.

"ఆత్మీయులందరినీ వదలి అపరిచితుల వెంట అన్యదేశాలకు వెళ్లి పోతావా! రజనీ హఠాత్తుగా వచ్చిన నీ నిశ్చయంలో నా ధ్యాసే లేదా?" అన్నాడు రామం.

"ఇదే మనస్సుని వేధించే మమత రామం బాబూ! ఇదే మానవుని కష్టాలన్నింటికీ కారణ భూతం దీనిని జయించనివారు జీవితంలో దేనిని జయించలేరు" అంది.

అదే సమయానికి టాక్సీ రజని ఇంటి వద్దకు వచ్చి ఆగింది డబ్బులు ఇవ్వబోతూంటే, సర్దారు ఓ సలాం జేసి హిందీలో "వద్దు మేమ్ సాబ్, మీ అందానికి కానుకగా నేను మీ వద్ద డబ్బులు పుచ్చుకోను" ఇక సమాధానంకి ఎదురు చూడకుండా టాక్సీ నడపుకుని వెళ్ళిపొయ్యాడు.

రజనీ పక పక నవ్వుతూ "సరిగ్గా పన్నెండుగంటలైయింది. సర్దార్జీకి పిచ్చిపట్టింది'' అంది.

దుఃఖంలో కూడా రజని మాటలు రామానికి కూడా నవ్వు తెప్పించాయి. అని గంభీర వదనంమీద క్షణకాలం చిరునవ్వు వెలిసింది. రజని చూస్తుందేమోనన్న భయంతో ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు.

లోపలకు వెళ్ళిన వెంటనే రజని వంట ప్రయత్నం చెయ్య నారంభించింది. "ఈ దారిద్యం, ఈ బాధ అన్నీ తప్పుతాయి. అని నేను సుఖపడతానని మీ బాధ" అంది.

"ఈ విధంగా వెళ్ళిపోతే నువ్వు సుఖపడతావని నాకు తెలుసు. కాని యిక నేను సహించలేను రజనీ? ఇన్నాళ్ళ నుంచీ నేను ఏ సంగతి చెప్పడానికి సంకోచించి అభిమాన పడి నాలోదాచుకొనివున్నానో అది యీ నాడు చెప్పక తప్పదు. నువ్వు శాశ్వతంగా నానుంచి దూరమవుతే నేను జీవించలేను రజని నిన్ను నేను అప్పుడప్పుడు చూడగలుగుతుండాలి. నీ కంఠ స్వరం అప్పుడప్పుడు వినబడుతూవుండాలి. అంతకంటె నేనేమీ కాంక్షించాను, అనర్హుడనని కూడా తెలుసు" అన్నాడు రామం.

రజని, నవ్వుతూ "ఈ అనురాగపు నివేదన వంట యింటిలో జరిగిందని ఏ నవలా రచయిత అయినా వ్రాస్తే అది ఎంత హాస్యాస్పదకంగా వుంటుంది చెప్పండి" అంది.

రామం చేతులు జోడించి, గద్గద స్వరంతో "నీకు నేను నమస్కారం పెడతాను రజనీ ? ఇది జీవన్మరణాల సమస్య. పరిహసించదగిన సంగతి కాదు" అన్నాడు.

రజని రామం చేతులురెండు విడదీసి, "పరిహసించటంలేదు బాబు. పరిస్థితి విషమించక ముందే పారిపోతున్నాను. మీ హృదయంలోని భావాలు నాకు తెలుసు. వాటిని నిర్మూలించడానికి నేను శక్తి కొలది ప్రయత్నించాను కాని ఫలితం లభించలేదు. ఎన్నోసార్లు మీ హృదయం భద్రపరుచుకోమని హెచ్చించాను. కానీ మీరు నా సలహాని పేడ చెవిని పెట్టారు. దాని ఫలితమే యీప్రమాదం" అంది.

రామం"అయితే నన్ను ప్రమాదంనుంచి తప్పించడానికేనా నువ్వీపనికి పూనుకున్నావు?" అన్నాడు.

"అది పూర్తిగా నిజం కాదు. ఇది స్వార్ధత్యాగమని పగల్భాలు పలకటం నాకిష్టం లేదు. నిజంగానే నాకు పర దేశాలు చూడాలని నాకు చిన్న తనంనుంచి కోరికగా వుంది . అదీకాక నా స్వభావానికి ఆశయాలకీ పశ్చిమదేశ పరిస్థితులు అనుకూలంగా వుంటాయనీ నాకు నమ్మకంగా వుంది" అంది.

"ఇది లాభదాయకం కాదని నేననను. కాని నేను స్వార్థపరుడను రజనీ! నా జీవితంలో నువ్వు నిర్వహించవలసిన పాత్ర ఎంతైనా వుంది. నేను నిన్ను విడువను. కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్లు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్వదేశం-ఇవన్నీ వదలుకొంటాను. కాని నిన్ను విడచినేను జీవించలేను రజనీ?"అన్నాడు.

రామం మాటలు నిశ్చలమైన రజనీ హృదయంలో తుఫాను లేవదీశాయి.

"మీరన్న మాటలు నాలోని నిశ్చయాన్ని ఇంకా దృడత్వం చేస్తున్నాయి. ఉభయులకు ఇదే వుత్తమమయినదని నాకనిపిస్తోంది, కొద్ది కాలం బహుశా మీరు బాధపడుతారు. కాని భవిష్యత్తులో మీరు నా మాటలలోని నిజాన్ని గుర్తిస్తారు" అంది.

రామం రజని రెండు చేతులు హృదయానికి హత్తుకుని, "నేనంటే నీకీ విముఖత ఎందుకు రజనీ?'' అన్నాడు..

''విముఖత లేదు. మనయిద్దరి స్వభావాలు, వొక దానికొకటి సరిపడవు. శాశ్వతమైన మీ అనురాగము, ఆదరము, ప్రేమ నాకు సరిపోవు. వీటిల్లో నాకు నమ్మకం లేదు. నానుంచి ఎవరికీ అవి లభించవు. ప్రసాద్ లాంటి వ్యక్తులే నాకు సరిసమానులు. నానుంచి మీకు జీవితాంతం దుఃఖమే లభిస్తుంది సహజీవనం మనకు సరిపడదు. సంఘాన్ని ఎదిరించే ధైర్యసాహసాలు కూడా మీకు లేవు. ఇది నేను నిందాపూర్వకంగా అనటం లేదు. వొక సత్యాన్ని మాత్రము వెల్లడి చేస్తున్నాను" అంది రజని.

రజని మాటలు రామం హృదయంలో భరింపలేని దుఃఖాన్ని లేవదీశాయి. చేతులతో ముఖం కప్పుకుని రజని పాదాలవద్ద కూలిపోయాడు.

గద్గద స్వరంతో " నాకిక ఆత్మహత్య గత్యంతరం రజనీ!" అన్నాడు.

రజనీ రామం ప్రక్కన కూర్చుని మృదువుగా చేతులు విడదీసి కన్నీరు చీర చెంగుతో ఆప్యాయంగా తుడుస్తూ "అలాంటి అనర్థకపుమాట అనకండి రామంబాబు, మీరంత మానసిక భీరులు కారు. ఒక వ్యక్తికోసం ఇంకొకరు ప్రాణాలు తీసుకోవటమనేది దౌర్బల్యంకూడాను" అంది. "బాటంతా ముళ్ళు-హృదయమంతా చీకటి చేయూత లేదు. ఇక ప్రయాణం చెయ్యడమెలాగ రజనీ" అన్నాడు గద్గద స్వరంతో.

"అధైర్యపడకండి రామం బాబు, చేయూతనిచ్చే వారు భవిష్యత్తులో మీకు తప్పక లభిస్తారు. కాస్త వోరిమి వహించండి" అంది రామం తలనిమురుతూ.

రజని క్షణ కాలం మౌనము వహించి నిట్టూర్చి, "సరే రామం బాబు లేవండి" అంది.

అదేసమయంలో తలువుతోసుకుని, విశాల ప్రవేశించింది. కాని ఆమె వంటరిగా లేదు. ఆమె వెంట చంద్రిక, కమల, కమలాకరంకూడా వున్నారు. వీరంతా ఏలాగు కలిసారో? విశాలకు కమల, కమలాకరం పరిచయం ఎలా అయిందా రజనికి అర్థం కాలేదు, కాని జరిగినదేమంటే విశాల ప్రసాద్ యింటికి వెళ్ళేసరికి ఇంటిలో ప్రసాద్ లేడు. కాని చంద్రిక ప్రసాద్ ఇంటిలోనే వుంటూవుంది విశాలవద్ద నుంచి సంగతి తెలుసుకొని, ఆమెను వెంట తీసుకొని కమల ఇంటికి వెళ్ళింది. కమలకు, ఆమెకు ఆ సమయంలో సహాయం అవసరమని తోచింది. అదృష్టవశాత్తు కమలాకరంకూడా ఇంటిలోనే వున్నాడు, అందరూ ఒకే ఒక దృఢ నిశ్చయంతో బయలు దేరారు. రజని ప్రయాణం ఆపు చెయ్యాలి. వారందరిని చూచి రామం కంగారుగా లేచి నిలడ్డాడు.

రజని నవ్వుతూ "వీడ్కోలు చెప్పడాని కిదా సమయం చెప్పండి? మిట్టమధ్యాహ్నం, జబర్దస్తీగా యింట్లోయింతమంది జొరబడితే, యిల్లాలికి యిష్టంగా వుంటుందా?" అంది.

కమల నవ్వుతూ ముందుకు వచ్చి "ఇప్పుడు యిల్లాలి యిష్టాయిష్టాలతో మాకు ప్రమేయం లేదు రజనీ, స్వార్థపరులమంతా గుమిగూడి వచ్చాము.స్వదేశాన్ని పరిత్యజించి వెళ్ళ నిశ్చయించుకున్న నీ సదుద్దేశాన్ని పటాపంచలు చేద్దామనే దృఢ నిశ్చయంతో నలుగురముకూడబల్కుకుని వచ్చాము" అంది.

"కమలా! మగువల మనస్సు మార్చటం అంత సులభము కాదని నీకు తెలియదా?" అంది రజని.

"అది బాగా తెలుసు రజనీ! ముఖ్యంగా నీ పట్టుదలను సడలించడం సాధారణమయినది కాదని కూడా తెలుసు. అందుకనే అందరము కలసి దండయాత్రకు వచ్చాము. విడి విడిగా అందరము నీముందు ఓటమి అంగీకరించవలసిందే" అన్నాడు కమలాకరం.

"నామీద మీ కెందుకింత కక్ష కమలాకరం బాబు?" ఆంది రజని.

"ఆత్మీయతని అణచుకోలేక అందరు బాథపడతారు. అది త్రుంచుకోడానికే నేను ప్రయత్నిస్తూంటాను అందరు అడ్డగిస్తున్నారు ఇది అన్యాయం కాదా?" అంది.

"మామయ్యను వదలి వేసావు మమ్మల్ని కూడా విడచి వెళ్ళిపోతావా? అవసరానికి ఆదుకునేవారు లేరని అధైర్యపడకు చంద్రిక? నేనున్నాను" అని వొకసారి నువ్వన్నావు.ఈ అవసరానికి నువ్వే నన్ను ఆదుకోవాలి' అని అంది చంద్రిక.

"అవసరానికి ఆదుకునేవారు నీకిప్పుడు చాలామంది వున్నారు చంద్రిక! కమలవుంది, ప్రసాద్ వున్నాడు. రాంబాబు వున్నాడు అన్నట్టు మరచిపోయాను రాంబాబు నీకు తెలియదేమో"అని ఆ యిద్దరికి పరిచయం చేసింది.

"రాంబాబు. మీ కృషికూడా ఫలించలేదా?" అంది చంద్రిక.

"సమయానికి మీరు రాకపోతే బహుశా ఫలించేది? అంది రజని నవ్వుతూ. "రసవత్తమైన విషాదఘట్టంలో మీరు తలుపుతోసుకొని లోపలకు వచ్చారు".

రామం ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చంద్రిక కూడా నవ్వుతూ "అయితే రాంబాబు అదృష్టవంతులు అంది.

"అది వారి అదృష్టం నా దురదృష్టం చంద్రికా. నా పట్టుదలను మించిన పట్టుదల ఆయనిది. క్రోధంలో వారేమి చేస్తారో వారికే తెలియదు. అందుకనే నేను నిజంగా ఇప్పుడు సంకోచిస్తున్నాను'' అంది.

రజని మాటలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఆమె నిశ్చయాన్ని సడలించగల శక్తి రామాని కెక్కడిది?.

"సంకోచన సరిపోదు రజనీ! మా కందరికీ మాట ఇవ్వాలి" అంది కమల.

"మీ అందరిలో నా సుఖాన్ని కాంక్షించేవారెవ్వరు లేరా?" అని ఏదో అంటూంటే.

"ఎందుకులేరు రజనీ! నేనున్నాను" అని ఒక కంఠ స్వరం పలికింది. అంతా తుళ్ళిపడ్డారు. ప్రసాద్ లోనికి వచ్చి పక పక నవ్వుతూ "ఇక ఫరవాలేదు రజనీ! నేను వచ్చాను. వీరి ఆటలు ఇక సాగవు" అన్నాడు.

చంద్రిక ప్రసాద్ దగ్గరకు వచ్చి "మామయ్య! పిన్ని పరదేశాలకు పోతుందంట" అంది.

"మంచిదే చంద్రికా! కావాలంటే తోడు నేను కూడా వెళ్తాను " అన్నాడు ప్రసాద్.

"ఎవరివద్ద నుంచి పారిపోవాలనుకున్నానో వారినే వెంట తీసుకుని పొమ్మంటావా? ప్రసాద్" అంది రజనీ నవ్వుతూ.

"పారిపోయేవారు పరుగెట్టాలి రజనీ! నెమ్మదిగా నడుస్తే లాభం లేదు" అన్నాడు ప్రసాద్.

"వూరుకో మామయ్యా! ఈ పిన్నిని వెళ్ళనివ్వకూడదని మేమంతా కంకణము కట్టుకున్నాము. ఇక దీనికి తిరుగులేదు. నీ సహాయం కూడా మాకు కావాలి" అంది చంద్రిక.

"నిస్సహాయులకే ఇతరులసహాయం అవసరం ఉంది చంద్రికా! అయినా ఇతరుల మార్గానికి అడ్డు రావటమనేది నా స్వభావానికి విరుద్దం ముఖ్యంగా రజని ఏం చేసినా దానిని వ్యతిరేకించే అధికారం మనకెవ్వరకు లేదు" అన్నాడు.

కమల ఇంతవరకు మాట్లాడకుండా వుంది. ప్రసాద్ రాక ఆమెకేమంత ఆనందం కలిగించలేను. అతనిని క్రిందటిసారి చూచి కొద్దిదినాలుమాత్రమే అయినా ఎంతో కాలం తరువాత తిరిగి చూచినట్లనిపించింది. అతని కంఠస్వరం ఇంటి బయటి నుంచి పిలిచినప్పుడే ఆమె అది గుర్తుపట్టగలిగింది.ఈసారి మెల్లగా "ఆ అధికారం మీకు లేకపోవచ్చు. ప్రసాద్ బాబూ! కాని అది వున్నవారు కూడా వుండి వుండవచ్చునని మీరు మరచిపోకండి" అంది.

"నీ విషయంలో ఇది నిజమే కమలా! కాని రజని విషయంలో ఇది నిజం కాదని నా నమ్మకం'' అని రజనితో తగవుకు నువ్వే తీర్పు చెప్పాలి రజనీ!" అన్నాడు ప్రసాద్.

"అధికారం లేకపోయినా కొంతమంది చెలాయిస్తూ వుంటారు. అప్పుడప్పుడు మనం అయిష్టంగానే అది శిరసావహిస్తూ వుంటాము. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నేను లొంగిపోయాను" అంది రజని.

రజనీమాటల అర్దం రామం గ్రహించాడు. విశాల కూడా చూచాయగా గ్రహించింది. కమల అనుమానపడింది, కమలాకరం కంగారుపడ్డాడు, ప్రసాద్ ఆశ్చర్యానికి మేర లేదు. చంద్రిక ముఖం మబ్బులలోని చంద్రబింబంలా వికసించింది,

 

చాప్టర్ 8

రజనీ ప్రయాణం ఆగిపోయింది. ఆమె రామం కోసంచేసినయీ త్యాగపు విలువను ఎవరు గుర్తించలేకపోయారు, రజని కూడా మనస్సులో ఎంతో దుఃఖించిది. విదేశాలకు వెళ్ళే అవకాశం పోయిందని కాదు. జీవితంలో అంత వరకు ఎవరి ఇష్టాయిష్టాలను లెక్క చెయ్యని ఆమె వొక వ్యక్తి కన్నీటికీ, క్రోధానికి భయపడి అలాంటి సదవకాశాన్ని జారవిడుచుకుని, బలహీనతను ఆమె తన మనస్సులోనే గుర్తించుకుంది. ఆదే ఆమెను ఎందుకో కలవరపెట్టింది. మొదటి నుంచీ రామాన్ని ఆమె చులకనగా చూస్తూనే వుంది. మొదట్లో ఆమె యెడ అతను ప్రదర్శించిన క్రోధము, ఏవగింపు ఆమెలోని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. కాని ఆమె మనసే అతని యధికారాన్నంగీకరించేటప్పటికి ఆమె విచలితయింది. ఆమెరికన్ దంపతులిరువురు రజని నిశ్చయం విని ఎంతో దుఃఖించారు. ఆరోజల్లా అమె వారితోనే గడిపి, మరునాడు విమానాశ్రయానికి వెళ్ళీ వీడ్కోలు చెప్పింది. చిరకాలపరిచయం శాశ్వతంగా చీలి పోయేటప్పుడు పడే బాధ వారనుభవించారు.

"రజనీ! నీలాంటి యపూర్వ స్త్రీ పరిచయం కలిగినందుకు నేనెంతో సంతోషించాను మా దేశంవస్తారనీ, మన పరిచయం చిరకాలం వర్ధిల్లుతుందని కలలుకన్నాను. అవన్నీనాడు నేలకూలి పోయాయి. ఐనా వొక విషయం గుర్తుంచుకో రజనీ! నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కక్కడ స్వాగతం లభిస్తుంది. అక్కడ నీకు ఏవిధమైన కష్టము కలుగకుండా చూసుకునే భారం మాది" అన్నాడు డేవిడ్.

రజనికి కూడా ఆ మాటలు ఎందుకో బాధను కలిగించాయి. "నీకు కృతజ్ఞతనే పదంమీద అట్టే నమ్మకం లేదు డేవిడ్ కాని ఇప్పుడదే గత్యంత మేమోననిపిస్తోంది" అన్నది.

"ఇక మళ్ళీ మనం శేషజీవితంలో కలుసుకుంటామో లేదో తెలియదనుకుంటాను. పరిచయం ఒక రోజైనా స్మృతి జీవితాంతం వరకు నిలిచిపోతుంది. అప్పుడప్పుడు వుత్తరాలు వ్రాస్తూవుండు. పరదేశమయినా నీ వివాహానికి మేము తప్పక వస్తాము" అంది మేరి.

రజనీ నవ్వుతూ "పునర్జన్మంలో నాకు నమ్మకం లేదు. లేకపోతే మీ రాక కోసమయినా వివాహమాడుదును, సమయమంతా మించిపోయాక సంధికి వస్తానన్నారు మీరు" అంది.

రజనీ మాటలు అర్ధం పూర్తిగా వారు గ్రహించకపోయినా, ఆ సమయంలో ఆమెతో వాదించటం యిష్టం లేక యిరువురు ఊరుకున్నారు. విమానం ఎక్కవలసిన సమయం ఆసన్నమయినది. డేవిడ్ రజని చెయ్యి పట్టుకొని "రజనీ, ఏకాంతంలో అప్పుడప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకుంటూ వుండు" అన్నాడు , రజనికి ఆతని కళ్ళలో నీరు సన్నగా కనబడింది.

ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు సాయంకాలం రామం రజని యింటికి బయయి దేరి వెళ్ళాడు. రజని యింటికి తాళం వేసి వుంది. ఎంతో సేపు ఎదురు చూసాడు. విసిగి విసిగి కాళ్ళుపీకి అక్కడే కూలబడిపోయాడు. చీకటి పడి చాలాసేపయింది. రజని జాడ లేదు. చివరకు ఒక విధమైన మగత నిద్రలో పడ్డాడు, హఠాత్తు రాంబాబు అనే పిలుపు వినిత్రుల్లి పడిలేచాడు. స్త్రీ కంఠస్వరం, "రజనీ" అని లేచాడు.

ఆ కంఠస్వరం కిలకిలా నవ్వి "కాదు రాంబాబు చంద్రికని ఇదేం అన్యాయం చెప్పండి. యిక్కడ నిద్రపోతున్నారు? అంది.

"అందరూ నాకు అన్యాయం చేసే వారే చంద్రకా? చివరకునువ్వు కూడా అంతే. తీయని కలలు కంటూ నిద్రపోతున్న నన్ను లేపావు" అన్నాడు.

చంద్రిక "కలలతోను, కథలతోనుతృప్తి పడవలసిన అవసరం మీకెందుకు? అయితే మా పిన్ని యింట్లో లేదా? అంది.

"ఉంటే బయట తాళం వేసి లోపల నిద్ర పోతుందేమో! అయినా అది ఒక మంచి ఆలోచనే, రజనీ నిజంగా ఆలాగు చేసినా చెయ్యవచ్చు. అందుకు తగినదే. అని ప్రక్కనున్న కిటికి లోంచిలోనికి తొంగిచూచి నిస్పృహతో "అబ్బే లేదు" విశాలా, యీవిడఎక్కడోపచార్లు చేస్తున్నారు" అన్నాడు.

చంద్రిక: "అయితే పదండి రాంబాబు- మా యింటికి రండి, ఇక్కడ ఎంత సేవు ఇలా పడికాపులు పడ్డారు? "అంది.

"సరే పద చంద్రికా, చాలా అలసిపోయాను, తిన్నగా ఆఫీసు నుంచే ఇక్కడకు వచ్చాను. ఆకలి కూడా వేస్తోంది. అన్నాడు.

"అయితే యీ రోజు నా చేతి భోజనం చేద్దురు గాని రండి" అంది.

ఇద్దరు టాక్సీలో బయలు దేరారు. దారిలో రామం హఠాత్తుగా "చంద్రికా, నువ్వింకా పసిపిల్లవు. ప్రపంచంలో నీకింకా ఏమి అనుభవం లేదు. కాస్త జాగ్రత్తగా వుండాలి. ఇలా ఎన్నాళ్ళు వుంటావు? నీ భవిష్యత్తు గురించి నీవేమైనా ఆలోచించావా?" అన్నాడు.

"నా భవిష్యత్తు మామయ్య చేతిలో వుంది రాంబాబు. వారే నన్ను బాల్యంలో వీధుల వెంట ముష్టి ఎత్తుకుంటూ వుంటేచేరదీసి యింత దానిని చేసారు. వారి మాటకు ఎదురాడను" అంది.

"అయితే నువ్వువీధులలో వుండినట్లయితేనే భవిష్యతులో బహుశా సుఖపడేదానివి చంద్రికా? ప్రసాద్ నిన్ను చేరదీయటమనేది ఎంతో విషాదకరమైన సంఘటన అని నాకనిపిస్తోంది" అన్నాడు.

చంద్రిక "అలాంటి మాటలని నన్ను బాధ పెట్టకండి రాంబాబు, అన్యాయమయిన మాటలవి. మామయ్య వంటి కరుణామయలను ఉత్తములను ఇంకెవ్వరిని నేను చూడలేదు" అంది.

రామం "నన్నపార్ధంచేసుకోకు చంద్రికా, ప్రసాద్ నుంచి నీకేవిధమైన అన్యాయము, అపాయము జరగవని నాకు తెలుసు, కాని అతని మనసత్వం, ఆలోచనలు ఆశయాలు ఎంతో విచిత్రమైనవి. అవే మనలని కలుషితం చేస్తాయని నా ఆవేదన" అన్నాడు.

"ఇదంతా మీ ఊహా కల్పితం రాంబాబు, మీరనేది సత్యమయినా, అసత్యమయినా మామయ్య మాటను నేను జవదాటను" అంది.

"వివాహం మీద నీకు కూడా నమ్మకం లేదా చంద్రికా" అన్నాడు.

"నమ్మకం లేదు. అపనమ్మకం లేదు. నాకు మిగతా వన్నీ అనుకూలంగా వుండి వివాహపు రూపంలో జరిగే తతంగమే నా ఆనందానికి లోటయితే, అది కూడా పూర్తి చేయడానికి నేను వెనుదీయను. అదే విధంగా వివాహం చేసుకోవాలని మొదట నిశ్చయించుకొని తరువాత, వరులను ఏ వీధుల వెంట వెదకను. ముందర వ్యక్తి లభించాలి. తరువాతే వివాహపు సమస్య ఎదురవుతుంది" అంది.

చంద్రిక అంత చిన్న వయసులోనే ఆవిధంగా సిగ్గు, సంకోచము లేకుండా మాట్లాడగలిగిందంటే అది రజని ప్రభావమేనని గ్రహించాడు. కాని రజనీ అభిప్రాయాలకీ, యీ మే అభిప్రాయాలకీ చాలా వ్యత్యాసముంది.

"ఐతే అలాంటి వ్యక్తి ఎవరు దొరకలేదా చంద్రికా!?" అన్నాడు.

"వెదకినప్పుడే దొరుకుతారు. నేను వెదకటం లేదు, వారు తటస్థపడటం లేదు'' అంది.

"తటస్థపడతారు చంద్రికా! కాని యీ లోపున నువ్వు నిస్పృహ చెంది తొందరపాటుపడకు."

రామం ప్రదర్శించే అవాంఛనీయమైన ఆతృత చంద్రికను ఆశ్చర్యపరచింది.

"మనం దేనినైనా కాంక్షించి నిరాశ చెందినప్పుడే నిస్పృహ చెందుతాము రాంబాబు" అంది.

టాక్సీవచ్చి ప్రసాద్ ఇంటిముందు ఆగింది. చంద్రిక క్రిందకు దిగి "దిగిరండి రాంబాబు టాక్సీవానికి మీరే డబ్బులివ్వాలి. నా వద్ద దమ్మిడీ కూడ లేదు" అంది.

"ఇక్కడకు తీసుకు వచ్చావేమిటి చంద్రికా! ఇది ప్రసాద్ ఇల్లుకదా!" అన్నాడు

"అవును ప్రస్తుతం ఇదే నా యిల్లు రండి లోపలికి" అంది.

"ప్రసాద్ ఇంట్లో వున్నాడా?" అన్నాడు.

"లేరు. దగ్గర్లోనే వున్న గ్రామంలో అగ్నిప్రమాదంలో చాలామంది చనిపోయారు. అక్కడకు వెళ్ళేరు. వారం రోజులపట్టి ఇంటికి రావడం లేదు" అంది చంద్రిక.

రామానికి చటుక్కున రజని జ్ఞప్తికి వచ్చింది, ఒక సారి యీ విధంగానే ప్రసాద్ లేనప్పుడు రజని వెంట రాత్రి యీ ఇంటికివచ్చి విందారగించాడు. ఈనాడు ఈగృహంలో రజని లేదు. చంద్రిక వుంది. ఈ ఇంటిలోనే తన తప్పుమూలంగా రజని కాలు మీద వేడిపాలు పడ్డాయి. ఇప్పడు చంద్రిక చేతి వంట తినటముంటే అతని కెందుకో ఒక విధమైన అయిష్టత ఏర్పడింది.

"లేదు చంద్రికా! ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు చాలా పనివుందని" సమాధానంకు ఎదురుచూడకుండాడ్రైవర్ కి కారు స్టార్ట్ చెయ్యమని వెళ్ళి పోయాడు.

ఆ మరునాడు సాయంకాలం రామం మళ్ళీ రజనివద్దకే బయలుదేరాడు. అదృష్టం ఆరోజు వరించింది. ఆమె ఇంటి వద్ద వుంది. రామాన్ని చూచి నవ్వుతూ "నిన్న వచ్చి వెళ్ళారని విన్నాను. కోపంతో ఈరోజు రారు చల్లబడింతర్వాత రేపు వస్తారు అనుకుంటున్నాను" అంది.

"నేను వచ్చేనని నీ కెలా తెలుసు రజనీ?" అన్నాడు.

"మా పక్కింటావిడ చెప్పింది. ఎవరో ఒకాయన చామన ఛాయ- పొడుగరి- ఉంగరాలజుట్టు- విశాల నేత్రాలు వచ్చి ఇక్కడే ఎంతో సేపు నిద్రపోయి చివరకు ఎవరో ఒక దారిన పోయే స్త్రీతో కలసి వెళ్లి పోయారని చెప్పింది. ఆమె వర్ణనకు, రూపానికీ సరిగ్గా సరిపడలేదు. ఐనా మీరు తప్ప ఇంకెవరయినా అంతసేపు ఎదురు చూడరని గ్రహించాను, ఇక ఆ స్త్రీ ఎవరా? అని అలోచించాను చంద్రిక లేక కమల అనే ప్రశ్న కమల ఒంటరిగా వచ్చివుండదు. ఇక చంద్రిక అని గుర్తుపట్టాను".

"ఆమె విశాల కాకూడదా? విశాలే అది" అన్నాడు.

"నేనప్పుడు ఆమెవద్ద వున్నాను. ఆమె ఢిల్లీకి ఆరు మైళ్ళ దూరంలో వున్న కుష్టురోగుల కాలనీలో జేరింది" అంది.

పిడుగులాంటి ఆవార్త రామాన్ని క్షణ కాలం చేతనారహితుని చేసింది "ఏమిటి నువ్వంటున్నావు రజనీ!?" అన్నాడు.

"పరిహారం కాదు రాంబాబు విశాల ఢిల్లీకి రావడానికి కారణం కూడా ఇదే పేపర్లో కుష్టు రోగులకు సేవ చేయడానికి సరియైన వారెవరు దొరకటం లేదని, దొరికినా కొద్దిరోజుల తరువాత వెళ్లిపోతున్నారని, అందువలన రోగులు చాలా కష్ట పడుతున్నారని సరళ స్వభావంగల స్వార్థత్యాగులెవరయినా కావాలని వ్రాసేరు. అది చూచే ఈమె ఇక్కడకు వచ్చింది. ఆమె వెళ్ళి పోయి సరిగ్గా పదిహేనురోజులయింది. ఆమెను కలుసుకోడానికి నేను నిన్నవెళ్ళాను'' అంది.

ఇదంతా ఎంతో విచిత్రంగా వుంది రజనీ! ఈ విషయం. నాకు చూచాయగానయినా చెప్పలేదే" అన్నాడు.

"చెప్పక పోవడమే మంచిదయింది.. లేకపోతే లేని అధికారం చెలాయించే వారీమో? అంది.

రజనిమాటల్లోని వ్యంగ్యాన్ని వినీ విననట్లు వూరుకున్నాడు.

"ఎందుకు వెళ్ళనిచ్చేరు రజనీ!'' అన్నారు,

"ఎందుకు వెళ్ళనివ్వకూడదు! ఆమె చేయదలుచుకున్న ఉత్తమ కార్యానికి ఇదా మనం చూపించవలసిన సహాయం ఐనా ఆమేమీ చిన్న పిల్లమీ కాదు. ఆమె నిశ్చయాన్ని విశాల ప్రపంచంలో మార్చగల వారెవ్వరు లేరు. రజని లాగా కన్నీటికి, క్రోధానికి కరిగిపోదు' అంది."

రామం ఈసారి కూడా ఎత్తిపొడుపు వాక్యాలను పట్టించుకోలేదు. రజనికి! ఎంత ఆశ్చర్యం వేసింది. అతనినిప్రేరేపించాలని చేసిన ఆమె పన్నుగడ సాగలేదు.

"సరే పోనీ రజని! కనీసం నన్ను అక్కడకు తీసుకువెళ్ళు" అన్నాడు.

"భలే వారు! ఇదా సమయము చెప్పండి? ఎల్లుండి ఆదివారం వెళదాం రండి."

కమలా, కమలాకరం, రజని, రామం, విశాల వద్దకు బయలు దేరారు. రజనీ విశాలకు ఇవ్వబడిన చిన్న ఇంటికి వచ్చి గట్టిగా "విశాలా" అని పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. రజని తలుపుతోసుకుని లోనికి వెళ్ళింది. అంతా ఎంతో నిరాడంబరంగా, శూన్యంగా వుంది కమల అది చూచి "విశాలవంటి స్త్రీలుండవలసిన యిల్లుకాదిది రజనీ?" అంది.

"ఇందులో ఏముంది కమలా? చూడవలసింది చాలా వుంది. తొందరపడి అభిప్రాయం వెల్లడి చేసావు" అంది రజని.

అందరిని వెంట వేసుకుని రజని ఆ కాలనీ వెదకసాగింది. దగ్గరలోనే వున్న ఓక పెద్ద మర్రి చెట్టు కింద విశాల ఒక యాభై మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది. పిల్లల వయస్సు ఆయిదు నుంచి పది హేనువరకు వుంటాయి. చెట్టు మానుకి ఆనుకొని వున్న బ్లాక్ బోర్డు మీద ఏవో లెక్కలు వ్రాసివున్నాయి.

వీరినందరిని చూచి విశాల క్షణం సేపు ఆశ్చరపోయింది. రజని దగ్గరకు వెళ్ళి "ఇదంతా ఏమీటి విశాలా బడిపంతులు కూడా అయ్యావని నాకు తెలియదు. వీరంతా ఎవరు? అంది.

విశాల పిల్లలతో "ఇవ్వాల్టికి ఇక చాలు. వెళ్ళిపోండి" అంది. పిల్లలంతా పరుగెత్తుకుని పోయారు.

"ఇక్కడవున్న రోగుల పిల్లలు. చూచే దాత లేక చదువు సంధ్యా లేక పాడయిపోతున్నారు. వీరందరికి రోజు చదువు చెప్పే బాధ్యతకూడా నేనే వహించేను" అంది.

"తల్లిదండ్రులతో కలిసివుంటే వీరికి కూడా యీ వ్యాధి సోకదా?''అంది కమల.

"అది కొంతవరకు నిజం. కుష్టు వ్యాధి మనము అనుకునేటంత సులభంగా సోకదు. అయినా మేము వీరిని తల్లిదండ్రులనుంచి పూర్తిగా వేరుగానే వుంచుతాము.వీరికి వారి తల్లిదండ్రులెవరో తెలియదు. పుట్టుకతోనే వేరు చేస్తారు. మనం అసహ్యించుకొనే, అనేక రోగాలకన్న ఇదే ఎంతో నయం. ఎట్లో శరీర రూపాన్ని వీకృతం చేస్తుంది. అందుకనే అసహ్యించుకుంటాము కాని నిజంగా అలాంటి వాళ్ళే నాన్ ఇన్‌ఫెక్షస్ టైపు.మనకు బయటకు ఏమికనబడకుండా వునఇన్‌ఫెక్షస్టైపు. ఇలాంటి వాళ్ళని మనము కలుపుకుంటాను" అంది.

కమల, "ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు విశాలా? వచ్చి పదిహేను రోజులు కూడా అయింది" అంది.

"డాక్టరు సనల్ చటర్జీ గారివద్ద శిష్యరికం చేస్తున్నాను. వారే నాకన్నీ నేర్పుతున్నారు. వ్యర్థమవుకున్న నా జీవితానికి ఒక తాత్పర్యంజుపించేరు" అంది.

కమల: "అయితే నివ్విక్కడే స్థిరపడిపోతావా విశాల? నీకీ పనిలో మనశ్శాంతి, తృప్తి లభిస్తున్నాయా?" అంది.

"పూర్తిగా లభిస్తున్నాయి కమలా, ప్రపంచమంతా ఏవగించుకునే ఈ దురదృష్టవంతుల సేవ నా కెంతో మానసిక శాంతిని తృప్తిని ఇస్తున్నాయి. జీవితంలో నేను ఇంత సుఖం ఎన్నడు అనుభవించలేదు అంది.

రజని డాక్టరుని ఆ కాలనీ గురించి, వ్యాధి గురించి, ఆయన అభిప్రాయం తెల్పమంది.

ఆయన "కుష్టు రోగుల యెడ మీరు ప్రదర్శించే అసహ్యానికి అర్థం లేదు. ఈ వ్యాధికి ఇతర వ్యాధులకు యే విధమైన భేదం లేదు. ఇప్పుడు మిగతా వాటికన్నా దీన్నే నయం చేయుటకు ఎక్కువ సులభం, మనం అంటూంటాము. మూడు సంవత్సరాల క్రితం నాకు టైపాయడ్ వచ్చింది. అది వదలగానే మూడు సంవత్సరాల క్రితం నాకు కుష్టు వ్యాధి వచ్చింది. అది మనం అనగలిగే పరిస్థితికి తీసుకురావలనేదే నా ఆశయం. అసలు వీరికోసం ప్రత్యేకంగా కాలనీ వుంచటం మంచిది కాదు. అన్ని రోగాలతోపాటు దీనిని కూడా మామూలు ఆస్పతులలో ట్రీట్ చెయ్యాలి. లేకపోతే వారేదో అంటరాని వారని అనే భావం రోగులలో కలుగుతుంది. అది ఎంతమాత్రం మంచిది కాదు" అన్నాడు.

కమల: "అయితే మీరు దీనిని ఎందుకు స్థాపించలేదు'' అంది.

"ఇది నేను దిక్కులేని వారి కోసం పెట్టాను. వ్యాధి బాగుచేసే వారు లేక వీరు రోడ్ల వెంట తిరుగుతూ రోగాన్ని వీరు జీవనోపాధిగా చేసుకొని జీవిస్తూ వుంటారు. ఇంకొక కారణం కూడా వుంది. కుష్ఠు రోగి చాలా కాలం ఇంకొకరితో కలిసివుంటేనే వ్యాధి పాకుతుంది. భార్యాభర్తలని తల్లి పిల్లలను వేరుచేయరు, పుట్టుకతోనే ఈ వ్యాధి రాదు. కాని పుట్టిన తర్వాత ఎక్కువకాలం ఒకే ఇంటిలో జీవిస్తేనే యిది సోకుతుంది. అలా జరగకుండా వుండడానికే అలాంటి రోగులను వేరు చేసి యిక్కడకు తీసుకువస్తాము. ఇక్కడకు వచ్చిన తర్వాత తల్లిదండ్రలను పిల్లలనీ వేరు చేస్తాము. పేర్లు మారుస్తాము. కొద్ది కాలంపోయిన తర్వాత ఒకరి నొకరు గుర్తుకూడా పట్టలేరు. కాని మా వద్ద జాబితా వుంది, వ్యాధి పూర్తిగా నయమయి వెళ్ళే సమయంలో ఎవరి పిల్లలను వారికి అప్పగిస్తాము" అన్నాడు.

రజని: "విశాల మీకు నచ్చిందా డాక్టర్. ఆమె మనసత్వం యీ లాంటి పనికి సరిపోతుందా" అంది.

విశాల కాస్త చిన్న బుచ్చుకొని "నా ఎదుట అలాంటి ప్రశ్న వేస్తే ఆయన ఏం చేస్తారు రజనీ. నా శక్తి వంచన లేకుండా నేను కృషిచేస్తున్నాను. అయినా నేర్చుకోవలసింది, చెయ్యవలసింది చాలా వుంది" అంది.

డాక్టర్ సనల్ : "విశాల వచ్చిన తర్వాత ఈ కాలనీ రూపమే మారిపోయింది. అంతకి ముందరంతా, అనుచిత అశుభ, అల్లకల్లోలం వుండేది. పిల్లలంతా చిందరవందరగా తిరుగుతూ వుండేవారు. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు రోగులకుఆమె వద్ద అలవాటు యెక్కువ అయింది. మానవమాత్రురాలుకాదని వారిని వుద్ధరించడానికి వచ్చిన దేవత అని వారి నమ్మకం. ఆమె ముట్టుకుంటే బాధ ఉపశమనం అవుతుందనే భావం కూడా కుదిరింది" అన్నాడు.

" ఫ్లారెన్స్నైటింగేల్ లాగ" అంది రజనీ.

కమలాకరం అక్కడకు వచ్చిన తరువాత నుంచి ఒక్కమాటకూడా మాట్లాడలేదు. డాక్టరు చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా వింటున్నాడు.

"సాధారణంగా ఈ వ్యాధి కుదరటానికి ఎంత కాలం పడుతుంది డాక్టర్?" అన్నాడు.

"అదేవ్యాధి లేతవయస్సులో వున్నప్పుడయితే ఒక ఆరు నెలలలో పూర్తిగా నయమవుతుంది. వ్యాధి సోకిన వెంటనే అయితే ఒకటి రెండు నెలలలోనే నయమవుతుంది. కుష్టు రోగులలో రెండు తరగతులున్నారు. "లె ఫమింటిన్ , న్యూరలన్. మొదటితరగతిదే అంటు వ్యాధి. రెండవది కాదు'' అన్నాడు.

''మీ మాటలు విన్న తర్వాత మేము ఎంత అజ్ఞానంలో పడివున్నామో ఇప్పుడు అర్ధమయింది డాక్టర్. కుష్టు రోగమంటేనే శరీరం గగుర్పాటు వస్తుంది" అన్నాడు కమలాకరం.

డాక్టర్ సనల్ వీరందరిని రోగులవద్దకు తీసుకెళ్లాడు. కొంత మంది ఎంతో ఆరోగ్యంగా, అతి సాధారణంగా వున్నారు. రోగులని గుర్తుకూడా పట్టలేము. కాని అవన్నీ న్యూరల్ టిప్ తరగతివని అంటూ చెప్పేడు. కొంతమందికి వంటిమిద మచ్చలు తప్ప ఇంకేవిధమైన అంగవైకల్యం లేకుండా వున్నారు. వ్యాధి ఎంతో లేతవయస్సులో వుందని తప్పక నయమవుతాయని డాక్టర్ చెప్పాడు. కొంతమందికి చేతినిండా కురుపులు, దెబ్బలు కాల్పులు వున్నాయి. కారణమడుగుతే డాక్టర్ కుష్టురోగులకి కొంత కాలంపోయిన తరువాత స్పర్శాజ్ఞానం నశించిపోతుంది. వారికి నొప్పి, బాధ అనేవే తెలియవు, ఎంత మోటు పనైనా చేస్తారు. కత్తితో కోసి వేసినా వారికి బాధ తెలియదు. వీరంతా అలాంటి వారే. శక్తి సామర్థ్యాలకుమించి పనులు చేస్తూ ఇలాగయి పోతుంటారు" అన్నాడు.

"అయితే కుష్టురోగికి ఏవిధమైన బాధా వుండదా డాక్టర్?" అన్నాడు రామం.

"అదే ఎంతో దురదృష్టమయినది. మిగతా వ్యాథులన్నింటికి బాధ నొప్పి వుంటాయి. బాధ భరించలేక రోగులు త్వరగా డాక్టరు వద్దకు వస్తారు. దీనికి బాధవుండదు, అందుకని అందరు అశ్రద్ధ చేస్తారు అంగ వైకల్యము ప్రారంభమైనప్పుడే అందరు భయపడతారు. రహస్యంగా డాక్టరువద్దకు వస్తారు. కాని అప్పటికే చాలామట్టుకు మించిపోతుంది. ఐనా ఇంకా కొంతమంది సంఘానికి వెరచి డాక్టరువద్దకు రారు. ఒకాయన నాకు తెలుసు. చదువుకున్నాడు. సంస్కారి.దురదృష్టవశాత్తు వ్యాధిసోకింది. మొదలు గుర్తించలేదు. కొన్ని నెలలకు చేతుల వేళ్లు పోనారంభించాయి. అప్పుడు భయంతో చేతులకు గ్లవ్స్తొడుగుకొని తిరగటం ప్రారంభించాడు కాని నేను ఇతర గుర్తులను పసిగట్టి ఒక రోజున అడిగాను. నా ప్రశ్న విని భయంతో వణికిపోయి బయటకు పారిపోయి తిన్నగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి కుష్టు రోగం వచ్చినదనే విషయం సంఘానికి తెలుస్తుందేమోననే భయమే ఆ విచార పరిణామానికి దారితీసింది. ఇది ఏమి భయంకరమైనది కాదు. అనేక రోగాలలో ఇదోకటి మాత్రమే ఐనా సంఘం గుర్తించినప్పుడే ఆలాంటి వారికి ముక్తి వుందన్నాడు. ఆమెరికాలో 'లెప్పర్' అనే పేరు మార్చి వేసారు. పాన్ డన్స్ డిసీజంటారు" అన్నాడు.

రోగులంతా విశాలను, డాక్టరును చూచి సంతోషముతో వుప్పొంగిపోయారు. ఆమె అందరిని ఆప్యాయంగా పలకరించడం, కొంతదూరం పోయింతర్వాత రజని కూడా ఆమె ననుకరించి అందరిని పలకరించి వారి వారి వృత్తాంతాలను తెలుసుకొంది. కొద్ది కాలంలోనే వారితో స్నేహం చేసుకుంది. అది గ్రహించి డాక్టర్ సనల్ "మీరు రోగుల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నారు. విశాలలాగే మీరు కూడా ఈ పనికి పూనుకుంటే కృతార్థులవుతారు" అన్నాడు.

"అవునని నాకు నమ్మకంగా వుంది డాక్టర్ నాకు అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా నాకు చేతనయినది నేను చెయ్యవచ్చునని" అంది.

"అంతకంటే మాకు కావలసిందింకేమి లేదు" అన్నాడు డాక్టర్

రజని మాటలు విని రామం ఆమె కేసి తీక్షణంగా చూచాడు. ఆమె నవ్వుతూ "కాని ఒక షరతువుంది డాక్టర్, మీరు ఆయన అనుమతి తీసుకోవాలి" అంది.

"వారి అనుమతి తీసుకోవలసింది మీరు నేను కాదు. అయినా మీకు వివాహం కాలేదని విశాల చెప్పింది'' అన్నాడు.

మందహాసం చేస్తూ "ఇప్పుడయిందని ఎవరన్నారు. చెప్పండి ఇదంతా కలికాలం. అపరిచితులుకూడా అధికారం చెలాయిస్తూంటారు. అబలలము. తలవొగ్గాలి" అంది.

రజనీ పరిహసిస్తోందని డాక్టర్ గ్రహించి "మీరు చాలా విచిత్రవ్యక్తులు. అసమాన్యులు" అన్నాడు.

రజని తెలుగులో విశాలనుద్దేశించి "డాక్టరుకి వివాహమయిందా?" అంది.

"లేదు. వారిని పరిహసించకు రజనీ. వారు స్వార్థత్యాగులు, సంఘసంస్కర్తలు. పరులకష్టాలని తన కష్టాలుగా భావించే వుదారస్వభావులు" అంది.

"మాట్లాడేది నువ్వు కాదువిశాలా! నీలోని బలహీనత " అంది రజని.

"ఇదన్యాయం నా యెదుట నాకు తెలియని భాషలో మాట్లాడడం" అన్నాడు డాక్టరు.

"అన్యాయమేమీ లేదు డాక్టర్. మీరు స్వార్థత్యాగులంటోంది విశాల నేను కాదన్నాను" అది రజని.

"మీరన్నదే నిజం ఇందులో స్వార్థత్యాగమేమి లేదు. నాకు ఎంతో మనశ్శాంతి, సుఖం ఆనందం యీపని లభింపజేసింది. నా కోసమేనేనీ పని చేస్తున్నాను. పూర్తిగా స్వీయసుఖం కోసం చేస్తున్నదే ఇదంతా" అన్నాడు డాక్టరు.

"స్వీయసుఖమే అయినా అది పరుల సుఖానికి దోహదమౌతుంది. అదెంతమాత్రం, స్వార్థపరత్వం కాదండి" విశాల.

"స్వార్థపరత్వమని నేననలేదు. మానవుడు తను చేసే ప్రతీ పనికి సుఖాన్ని కాంక్షిస్తాడు. ఒక్కొక్కప్పుడు శారీరకంగాను, ప్రాపంచికంగాను యితరులకోసమని మనల్ని మనం కష్ట పెట్టుకుంటాము. మనమేదో "త్యాగం చేస్తున్నామని భ్రమపడతాము నిజానికి నేను ఇతరుల కోసం ఈపని చేశానని మానసికతృప్తి కలుగుతుంది దానిని ఆశించే మనం ఆలా జేస్తాము" అంది రజని.

కమల; "మాటల్లో పడి మనష్యున్ని మరచిపోకు రజనీ తీరికగా మాట్లాడుకోండి-ఇప్పుడు కాస్తా యిదంతా చూద్దాం" అంది.

అంతా తిరిగి అలసి డాక్టరు పనిమిద వీరిని వదలి అవతలికి వెళ్ళిపోయాడు. అంతా కలిసి విశాల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు.

రెండు మూడు నిమిషాల వరకు ఎవరు మాట్లాడలేదు. హఠాత్తుగా రామం "విశాలా! నీకు దైవంమీద నమ్మకముందా" అన్నాడు.

ప్రశ్న విని అందరు త్రుళ్ళిపడ్డారు. అంత ఆ సందర్భముగా ఉపోద్ఘాతం లేకుండా అలాంటి ప్రశ్న వేస్తాడని ఎవరు ఊహించలేదు. విశాలా క్షణం మౌనం వహించి "ఈ ప్రశ్నకు సమాధానం రజని చేప్తే ఎంతో సమంజసంగా వుంటుందేమో" అంది.

రజని"సమంజసమో, అసమంజసమో నాకు తెలియదు, విశాలా!కాని ఇది సమయం కాదు" అంది.

రామం కోపంతో "ఈ ప్రశ్న వేసింది. నిన్ను విశాలా? సమాధానం చెప్పవలసింది నీ కర్తవ్యం" అన్నాడు.

విశాల"చాలా కష్టమైన ప్రశ్న వేసారు మీరు. యీ ప్రశ్న మీరు ఎందుకు వేసారో నాకు తెలియదు." చిన్నతనం నుంచి నా మనస్సులో ఒక కోరిక నిలిచిపోయింది. మానవ హృదయాలలో ఎంతో దుఃఖం కరడుగట్టి వుంది, ఎంతో బాధ, వేదన ప్రతిమానవుడు జీవితంలో అనుభవిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో పరుల కన్నీటిని తుడువ ప్రయత్నించటంకన్న ఇక వేరే కర్తవ్యమేముంది! అంతకుమించిన దైవం సృష్టిలో లేదు. వున్న వారితో నాకు పని లేదు. దైవమనే పేరుతో మట్టి బొమ్మల్ని రాత్రింబగళ్ళు పూజిస్తూ తోటిమానవున్ని అసహ్యించుకొని, వారి ఆక్రందాన్ని పెడచెవిని పెట్టువారికి అన్యాయం చేసేవారు ఆత్మవంచకులు అధమాధములు.మానవ సేవే మాధవ సేవఅనేదే పరమ సత్యం. మనము నిత్యము పారాయణ చేయవలసింది భగవద్గీత కాదు. ఈ చిన్న సూత్రమే" అంది.

మాట్లాడుతూ, మాట్లాడుతూ విశాల కాస్త ఉద్రేకపడింది. అది చూచి రామం ఆశ్చర్యపోయాడు. విశాల స్వభావానికి, నాస్తికత్వానికి అతనికేమి పోలికలు కనబడలేదు.

"అయితే దైవాన్ని విశ్వసించే వారంతా మూఢ విశ్వాసలేనా? వారిని అసహ్యించుకోవలసిందేనా" అన్నాడు బాధపడుతూ.

"లోపాలు లేని మానవులు లేరు రామం బాబు" బలహీనతకు బలాడ్యులు లేరు. కాని మనం ఇంకోరికన్నా గొప్పవారము,నైతికంగా ఉత్తములు అని విర్రవీగేవారిని మనం మనస్సులో వేరు చెయ్యాలి.

"కాని దైవాన్ని విశ్వసించే వారంతా నైతికంగా అధములు అనుకునే వారు కూడా అలాంటి వారేగా!" అంది కమల.

కమల ప్రశ్న విశాలకు చటుక్కుమని తగిలింది. క్షణకాలం మౌనం వహించి "నీఆభియోగానికి నేను కొంత వరకు తలవొగ్గాలి కమలా! కాని నేను నిశ్చయంగా చెప్పుతున్నాను. నా హృదయంలో అలాంటి భావానికి తావు లేదు, ఏమంటావు రజని" అంది.

రజని ఈ సంభాషణ అంతా ఎంతో కుతూహలంగా వింటూంది. రెండు మూడు సార్లు జోక్యం కలిగించుకుందామని ప్రయత్నించింది. కానీ ఎందుకో ఏమనాలో తోచలేదు. సృష్టిలోని ప్రతి విషయం గురించి ఆమె ఎంతో నిర్భయంగా,నిస్సంకోచంగా మాట్లాడుతుంది. కాని దైవం గురించి చర్చ వచ్చినప్పుడు ఆమె సాధారణంగా మౌనముద్ర వహిస్తుంది. కమల వేసిన ఆభియోగం, ఈమెకు కాస్త బాధ పెట్టింది. "నాకు దానితో ఏమి ప్రయోజనం లేదు విశాలా? నా బుద్ది కుశలత ననుసరించి నేను సమస్యలను ఎదుర్కొంటాను. నాకు ఇతరులతో సంబంధం లేదు. వారు దైవమయినాసరే; వరం కోసమని నేను యిహం వదలుకోను, దైవం కోసమని నాజీవితాన్ని నేను నాశనం చేసుకోను. క్షణక్షణము ఆనందంగా గడచిపోతుంటే అనంతమైన వాటిని గురించి మన మెందుకు అలోచించాలి" అంది.

రామం మెల్లగా "క్షణికంగా మనం చేసే పనులలో కొన్ని క్షంతవ్యం లేనివి వుంటాయనేదిరజనీ?"అన్నాడు.

రజనీ"క్షంతవ్యం కాదని నిరూపించే కొలత బద్ద" అంది.

రామం"దీనికి నమాధానం తెలియకే సతమతమవుతున్నాను రజనీ" అన్నాడు.

రజని"ఈ ప్రశ్నకు అనేకసార్లు మీకు నేను సమాధానం చెప్పేను. కాని మీమనస్సుని నమ్మించలేక పోయాను. కమలాకరం బుద్ధికుశలతలో మీకు నమ్మకముందని నాకు తెలుసు. ఈసారి వారికి సమాధానం చెప్పనీయండి" అంది.

కమలాకరం"ప్రశ్నను స్పష్టంగా వెయ్యి రజనీ ఆ తరువాత అందులోని గూడార్ధం తీస్తాను" అన్నాడు.

"జీవితంలో మానవుని కర్తవ్యం ఏమిటి? ఆత్మ ఎడ లేక ఆత్మీయుల ఎడ? ఒక వ్యక్తి మంచి చెడ్డలని నిర్ధారణ అధికారం ఇతరుల కెలా సంక్రమిస్తుంది! దానికి వెరచి మన మంతా ఎందుకు సంచరించాలి" అంది

"కర్తవ్యం ఆత్మీయుడే రజనీ! కాని యీఆత్మ ప్రబోధాన్ని అర్థం చేసుకోవడమే కష్టం ఆ శక్తి కరతలామల కమవుతే ఆ వ్యక్తి యితరుల గురించి ఆలోచించనక్కర లేదు" అన్నాడు.

కమలాకరం దృక్పధం ఎంతో నూతనంగా, సమంజసంగా అందరికి కనబడింది. కాని రజనీ అంగీకరించలేదు. "అవి ఆత్మవిశ్వాసం లేని వారనే మాటలు. నేనంగీకరించను, అప్పుడప్పుడు అస్పష్టంగా కనబడవచ్చు, కాని చెవివొగ్గి వింటేఅది స్పష్టంగానే వుంటుంది" అంది.

కమల"ఆలస్యమయింది. ఇక పోదాము. వ్యర్ధమైన యీ వివాదాలతో మనకయితే సరిపోతుంది. కాని విశాలకు చేతినిండా పనివుంది. వంట ప్రయత్నం కూడా ఏమి ప్రారంభించినట్లు లేదు" అంది.

విశాల"అది ఎంత సేపు కమలా.పది నిమిషాలలో అయిపోతుంది. మిమ్మల్నిందరిని భోజనానికి వుండమనే తాహతు నాకు లేదు. వుండమననుకూడాను" అంది

రజని"ఆ మిషతో మమ్మల్ని బయటకు పంపివేస్తున్నావు విశాలా? సరే; ఇదేమి ఆఖరుసారి కాదు" అంది.

అంతా కృత్రిమంగా ఒకసారి నవ్వారు. బయటకు వచ్చి వెళ్ళిపోయేముందు కమల; "ఇది నీ స్థిర నివాసమా, విశాలా? లేక అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూంటావా" అంది.

"లేదు, కమలా, ఇక నాకు దానితో పని లేదు. వీలున్నప్పుడల్లా మీరే ఇక్కడకు రండి, కుష్టు రోగం సోకుతుందనే భయం లేకపోతే" అంది.

కమల"నీకు లేని భయం మాకెందుకు విశాలా! అలాగే వస్తాము అని ఒక మాట చెప్తాను, కేవలం ఆత్మ సంతృప్తితో ఇహం లభించదు" అంది.

విశాల"ఇది నేనెప్పుడూ కాదనలేదు. కమలా - అయినా సమయానికి స్ఫురణకు రాలేదేమోననే ఆతురతతో చెప్పావు దానికి కృతజ్ఞరాలిని" అంది.

 

చాప్టర్ 9

చంద్రికకు కమలకు బాగా స్నేహమయింది. కమలకు చంద్రికను మొదట చూచినప్పుడే హృదయంలో ఆప్యాయత ఏర్పడింది. అదీ కాక ప్రసాద్ చెడు ప్రభావం వల్ల పెడదారులు తొక్కుతుందేమోనని భయపడింది కూడా తన పరిచయం ద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించుదామనుకుంది. చంద్రకతో అంత స్నేహం చేయడానికి కారణం ఇంకొకటి కూడా వుంది. అది కమల వొప్పుకోదు. అది హృదయాంతరాళంలో మెదిలే రహస్యపు ఆలోచన. అలాంటివి బాహ్యరూపంలో అగుపడవు. కానీ చేష్టల్ని ఆవి తీర్చిదిద్దుతునే వుంటాయి. చంద్రిక ప్రసాద్ తో కలిసి నివశిస్తోంది. ఆమె కంటే ఆప్తులు అతనికి ఎవరు లేరు. అతని రాకపోకలు, చేష్టలు అన్నీ ఈమెకు తెలుసును. మొదట నుంచీ ప్రసాద్ కమలకొక సమస్యగానే వున్నాడు. అతని స్వభావం ఆమె అర్థం చేసుకోలేక పోయింది. సాధారణ మానవకోటినుంచి ఆమడదూరంలో వున్న విచిత్ర వ్యక్తిగా ఆమెకు అగుపించాడు, అతనంటే ఒక విధమైన భయం ఏర్పడింది. అయస్కాంతంలాంటి ఆతని ఆకర్షణని ఆమె జయించ లేక పోయింది. ఇష్టానికి వ్యతిరేకంగా నే ఆమె అతనికి హృదయంలో చోటిచ్చింది. శతవిధాల శక్తినంతా కూడదీసి ప్రయత్నించినా కమల ఆ విశృంఖలాలనిత్రెంచలేకపోయింది. అప్పటిలో అంతర్యుద్ధం అంతమయినా విజయం ఆమెకు లభించలేదు, అయినా తన కర్తవ్యాన్ని గుర్తించింది. సాధ్యమయినంతవరకు ప్రసాద్ ని మరచి పోవాలని, అతనిని చూడకూడదని నిశ్చయించుకుంది. కాని మనస్సులో ప్రసాద్ సంగతులు తెలుసుకోవాలని, అతని అభిప్రాయాలు అర్ధం చేసుకోవాలని కోరిక మాసిపోలేదు. ప్రసాద్ కి సంబంధించిన ఏ వస్తువయినా ఆమెకొక విధమయిన ఆకర్షణ ఏర్పడింది. ప్రసాద్ అనేమాట వినినప్పుడల్లా ఆమె హృదయం ఒక్కసారిగా గగుర్పొడిచేది. చంద్రికకు అన్ని సంగతులు చెప్పేది ప్రసాద్ బయటకు కనబడినంత కఠిన హృదయుడు కాడని, ఉదార స్వభావుడని, ఆలోచన మనస్సులో మెల్లి గా జొరపడింది. చంద్రిక ద్వారా చంద్రిక లాంటి అనాధుల యెడ ప్రసాద్ కనబరచిన ఔదార్యం ఆమెలో ఒక విధమైన గౌరవం ఏర్పడడానికి కారణమయింది. అతని సాహసం. నిర్ణయత్వం, ఆమెలో ఒక విధమయిన ఎడ్మిరేషన్ ను ఏర్పరచాయి.కమలాకరం భార్య ఆలోచన కొంతవరకే గ్రహించగలిగాడు.స్త్రీల ఆలోచనల్ని పడగొట్టటం ఎంత కష్టమో అందరికి తెలుసు. వారి వారి హృదయాలలో రహస్యపు ఆలోచనల్నీ, యదార్థాల్ని గ్రహించడం చాలా దుర్లభమైనది . ఏ వ్యక్తియెడ మక్కువా మమత వున్నాయో, ఏ వ్యక్తి యెడ ఏవగింపు వుందో బాహ్యా చేష్టలనుంచి గ్రహించడం ఎండమావులను వెంటాడటం లాంటిది. కమలాకరానికి కమల ప్రవర్తనలో పెద్ద మార్పేమీ కనబడలేదు. మొదటి నుంచి ప్రసాద్ అంటే ఆమెకు కోపమనీ గ్రహించాడు, అతని విషయమేదైనా ప్రస్తావిస్తే ఆమె మాటలు తప్పించేది.

చంద్రిక తరచుగా కమల ఇంటికి వెళ్తూండేది. కాని కమల వొకసారికూడ చంద్రికను చూడడానికి పోలేదు. చంద్రికబలవంతంమీద వొకనాడు వెళ్ళటానికి ఒప్పుకుంది. కాని జాగ్రత్తతో ముందర ఒక మాట తీసుకొంది. ప్రసాద్ ఢిల్లీలో లేడని. ఇంకొక వారం రోజుల వరకు రాడని చంద్రిక చెప్పింది. అదే తగిన సమయమనుకుంది. ఆమె అంగీకారానికి ఇంకొక కారణం కూడా వుంది. ప్రసాద్ నివాసస్థలం చూడాలని ఒక విధమైన కుతూహలం ఏర్పడింది.

ఆ రోజు సాయంకాలం చంద్రిక వద్దకు బయలు చేరింది. కమలాకరం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తానన్నారు. ఒంటరిగా బస్సు మీద బయలుదేరింది. అడ్రస్ తెలిసినా ఎంతో కష్టంమీద కాని యిల్లు గుర్తు పట్టలేకపోయింది. గుర్తుపట్టిన తర్వాత, అది కాదా అనే సందేహంలోపడింది. అంత పెద్ద భవనం ప్రసాద్ దా, ఎంత సుందరంగా వుంది? ఇంటి ఎదుట ఉద్యానవనం, కాని సందేహం లేదు. అదే వీధి అదే నెంబరు, భయపడుతూ, భయపడుతూ గేటు తీసి లోనికి వెళ్ళింది. వీధిగుమ్మం తెరచేవుంది. లోపల అలికిడి ఏమి లేదు. నెమ్మదిగా గుమ్మం వైపు నడుస్తూంటేవెనుక నుంచి "కమలా" అనే పిలుపు వినబడింది. అ గంభీర కంఠస్వరాన్నివెనుదిరుగకుండానే గుర్తు పట్టింది. క్షణకాలం శరీరoగగుర్పొడిచింది.నెమ్మదిగా వెనుదిరిగింది. ప్రసాద్ నవ్వుతూ నిలబడి వున్నాడు, చేతిలో మొక్కలకు నీళ్ళు పోసే క్యాన్ వుంది.

కమల: "మీరా?" అని మాత్రం అనగలిగింది.

"కాదు కమలా. తోటమాలిని. అయ్యగారు ఇంట్లో లేరు'' అన్నాడు నవ్వుతూ.

కమల ఛలోక్తికి నవ్వలేను. ప్రసాద్ ఇంటిలో వంటరిగా వున్నాడేమోననే భయంతో చంద్రిక లోపల లేదా?" అంది భయపడుతూ.

"కమలా, చంద్రిక వుంది. కాని నువ్వు వస్తున్నావని చెప్పలేదు. లేకపోతే బయటకు పంపించి వేసేవాడిని'' అన్నాడు ఇంకా నవ్వుతూ.

"అయితే లోపలకు వెళ్తా" నంది.

"ఇక పది పది హేను నిమిషాల వరకు నీకు చిక్కదు. కారణం చెప్పనంటే మొరటొడినంటావు. అయినా చెప్తాను. తలంటు పోసుకుంటోంది" అన్నాడు.

కమలకు చంద్రిక పై కోపం వచ్చింది తనను ఇంటికి పిలిచి చెయ్యవలసిన పనాయిది.

ప్రసాద్ "ఈ లోపున సహాయం చెయ్యాలి. పూల మొక్కలంటేనాకెంతో యిష్టం. ఎర్ర గులాబంటే నాకిష్టం లేదు. తెల్ల గులాబంటే నాకెంతో ప్రీతికాని స్త్రీలకుఎర్ర గులాబంటేనే ఇష్టం కదూ? అన్నాడు.

కమల"లేదు-గులాబీలంటేనే ఎక్కువ ఇష్టం లేదు. సంపెంగి, సన్నజాజి అంటే ఎంతో యిష్టం" అంది.

ప్రసాద్ "వాటిల్లో నిన్నాకర్షించేది సౌందర్యం కాదు కమలా, సువాసనమాత్రమే" నన్నాడు.

కమల"లేదు అది అసత్యం, సువాసనమైకంలో పడి మీరు, పురుషులు వాటి అందాన్ని గుర్తించరు. కొన్నిటిలోని అందాన్ని గుర్తించి సువాసనను చిన్న చూపు చూస్తారు. ఉంది.

"ప్రకృతిరీతే యింతే కమలా! ఈ రెండు సమపాళ్ళలో వున్న పుష్పాలు, పురుషులు అరుదుగా కనబడతారు. తలలో పెట్టుకోవడానికి తుంచే పుష్పాలకి సువాసన అవసరం. అయినా మీరు సువాసన లేని అందమైన పుష్పాలివి నిర్ధాక్షిణ్యంగా వదలి వేస్తారు. అవి ఎంత సోషిస్తాయో" అన్నాడు.

కమల"పుష్పవిలాపం వర్ణిస్తున్నారా" అంది.

ప్రసాద్"వల్లించడం లేదు కమలా నివేదించుకుంటున్నాను" అన్నాడు.

ఏ విషయం తప్పిద్దామని ఆమె విశ్వప్రయత్నం చేస్తూందో అది ప్రసాద్ నోటి వెంట వెలువడింది. కమల గుండె ఒక్కసారి వేగంగా స్పందించింది.

మాటలు తప్పిద్దామనే ఉద్దేశంతో: "చంద్రిక యింకా రావడం లేదేమి? లోపల వుందేమో" అంది.

"ఒక సమస్య నుంచి పారిపోయినంత మాత్రాన అది పరిష్కారం కాదు కమలా" అన్నాడు.

ఆ మాటలు కమలలోని పౌరుషాన్ని లేవదీశాయి "పారిపోవడం లేదు ప్రసాద్ - పోరాడుతున్నాను" అంది.

ప్రసాద్ పకపక నవ్వుతూ "ఈ విధంగానా? ముందర పరుగిడితే పారిపోవడమంటారు. వెనుక పరుగిడితే పోరాడడమంటారు. ఇంతేగా" అన్నాడు.

కమల కోపంతో"దుష్టులకు దూరంగా వుండడంలో పిరికితనం కాదు. అదే వివేకమంతమయిన యుద్ధం" అంది,

ప్రసాద్"దుష్టుడు అనేది నీనోట మాత్రమే కమలా. అది నీ హృదయపు అభిప్రాయమని నేను నమ్మను" అన్నాడు.

"అలా అనుకొనినిన్ను నీవే వంచించుకొంటున్నావు ప్రసాద్" అంది.

ఈసారి కమల మాటలు ప్రసాద్ కి నిజంగా కోపం తెప్పించాయి. అయినా తనను తాను తమాయించుకొని, "దుష్టుడనే కావచ్చు కమలా? కాని దుష్టులు ఆత్మీయులు కాకూడదా" అన్నాడు.

"సహృదయులు కాలేరు ప్రసాద్".

"అయితే రజని సహృదయ కాదా?" అన్నాడు.

"రజని విషయంలో నేనే చెప్పలేను, అది స్వతసిద్దమైనదో కాదో నాకు తెలియదు. అయితే చంద్రిక కృతజ్ఞతా భావం మాత్రమే ప్రసాదు, అది స్వతసిద్దమయిన అనురాగమనీ ఆప్యాయతయని భ్రమవడుతుంది" అంది.

కమల కఠిన వాక్యాలు ప్రసాదుని కాస్త నొప్పించాయి. కమల వద్ద నుంచి కాస్త దూరంగా వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోస్తూ" మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తపడాలి కమలా? ఎక్కువ నీళ్ళు పోసినా ప్రమాదమే సంభవిస్తుంది" అన్నాడు.

ప్రసాదు మాటలని గూడార్థం కమల చూచాయగా మాత్రంగ్రహించింది.

"అది నిజమే ప్రసాద్! కాని ఇంకొక సామెత కూడా వుంది. పల్చటి మొక్కలే పెనుగాలికి తలవొగ్గి జీవిస్తాయి. ముదిరిన మొక్కలకు మరణమే గత్యంతరం" అంది.

ప్రసాద్ కి కమల కంఠస్వరం మాత్రమే వినబడింది. ఆమె ముఖం చూచినట్లయితే భయపడి వుండేవాడు... చంద్రిక అప్పుడే బయటకు వచ్చి కమలను చూచి చకితురాలైంది. "కమలా!?" అని పిలిచింది. కమల చంద్రికను గుర్తించి ప్రయత్నపూర్వకంగా నవ్వి "చంద్రిక ఎంత చక్కగా వున్నావు?"అంది. ప్రసాద్ కూడా లేచి నిలబడి చూచాడు. నిజంగా ఆమె ఎంతో చక్కగావుంది, పసుపు పచ్చ ఖద్దరు చీర కట్టుకుని, ముఖానికివ్రాసుకున్న పసుపు ఇంకా పూర్తిగా వదలలేదు. నిండుగా ఎర్రటి బొట్టు పెట్టుకుని విశాలమైన నేత్రాలని ఇంకా విశాలంగా కనబడేటట్లు చక్కగా కాటుక దిద్దుకొంది. దాంతో అవి మరీ పెద్దవిగా కనబడుతున్నాయి.పొడుగయిన నల్లటి జుట్టు ముందర వేసుకొని దువ్వెనతోచిక్కుతీసుకుంటూంది. కమలమాటలువిని చంద్రిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల పంచుకొని"ఇదంతా ప్రకృతి సౌందర్యము కమలా! నీముందు నేనెంత?" అంది.

"ఇది ఆదినుంచి పరిష్కారంకాని సమస్య. ఇరువురు స్త్రీలు వారిలో ఎవరు సౌందర్యవంతులనే వివాదంలో దిగేరంటేసృష్టి అంతరించిపోతుంది కాని పరిష్కారం కాదు" అన్నాడు ప్రసాద్.

"ఇవి స్త్రీలను అందమైన అటవస్తువులుగా పరిగణించేవారు అనే మాటలు ప్రసాద్. సంస్కారులు అనేమాటలు కావు" అంది కమల.

కమల మాటలు చంద్రికకు కోపం తెప్పించాయి దగ్గరకువచ్చి "ఇవి కోపంతో అన్న మాటలు కమలా! మామయ్య ఆలాంటి వారు కారని, పరిహాసానికి మాత్రమే అలా అన్నారని నీకు తెలియదు" అంది.

"అప్పుడప్పుడు పరిహాసపుమాటలలోనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. చంద్రిక నువ్వింకా అనుభవ జ్ఞానం లేని యువతివి. కృతజ్ఞతామైకంలోపడి నువ్వు పెరిగి పెద్దదానవయ్యావు" అంది.

చంద్రిక ఎంతో బాధపడి "అనాధారంగా ఇతరుల మీద నిందలు మోపటం అన్యాయమని, అమానుషమని నీకు తెలుసును కమలా. ఐనా యీ రోజేదో కోపంతో వున్నావు. లోపలికి వచ్చి చల్లటి పానీయమేదేనా సేవించు. తర్వాత మాట్లాడుకుందాము" అన్నది.

కమలకు కూడా తన మాటలు కొంచెం అసమంజముగానే కనబడ్డాయి. తనను తాను సంబాళించుకోని చంద్రిక వెంట లోనికి వెళ్ళింది నవీనపద్దతిలో నిర్మించబడిన ఆ భవనం ఆమెను ఎంతో ఆశ్చర్యపరచింది.

"ఎలావుంది మాయిల్లు? ఎంత సుందర భవనం?" అంది చంద్రిక.

కమల నలుప్రక్కలా చూచి "ఈ ప్రపంచంలో ఎంతో మంది నిలువనీడ లేక బాధపడుతూంటే ఒకానొక వ్యక్తి ఇంత పెద్ద భవనంలో నివసించటం అన్యాయం. పైగా వారు దీనరక్షకులని, ఔదార్యవంతులని చెల్లుబడి అవుతారు" అంది.

"అలా నేను ఎప్పుడూ చెప్పలేదు కమలా? పైగా నా సుఖం తరువాతే పరులసుఖమనీ మొట్ట మొదటినుంచీ చెపుతూనే వున్నాను. నేనేమైనా ఇతరులకు చేసినా, అదంతాస్వాతిశయంతోనే కమలా?" అన్నాడు ప్రసాద్.

"అని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఇలాంటి మాట లను నేను సహించను. కమలా! నా యెదుట మామయ్యని ఏదయినా అన్నారంటేనేనూరుకోను. ఎవరైనా సరే నాకు లెక్క లేదు" అంది. ఆమాటలంటూ చంద్రిక తనను తాను మరచిపోయి నిప్పురవ్వలా ఓ క్షణ కాలం ప్రకాశించింది.

అతను నవ్వుతూ "శబాష్ చంద్రికా! ఈనాడు నా పరువు నిలబెట్టావు. ఆమె అభియోగాలకి సరియైన జవాబు చెప్పావు".

చంద్రిక తన వుద్రేకానికి సిగ్గుపడింది. "నువ్యు అతిథివన్న సంగతి మరచిపోయాను కమలా! క్షమించు. కూర్చుని వుండు ఇప్పుడే వస్తాను" అని లోనికి వెళ్లి పోయింది.

కమల దగ్గరలో వున్న కుర్చీలో కూర్చుని ప్రక్కనే వున్న మేగజేన్ లో ముఖం దాచుకుంది.

అతను ప్రక్కనేవున్న కుర్చీలో కూర్చుని "ఇంతమాత్రానికే ఇంతదూరం వచ్చావు కమలా?" అన్నాడు.

"వచ్చినంత మాత్రాన అస్తమానమూ వాగుతూండమంటారా చెప్పండి?'' అందామె.

"అనినేననను. కానీ, విముఖత, అహంకారము, అసమంజసంగా వుంటాయి కమలా!" అన్నాడు.

లోపలినుంచి చంద్రిక ట్రే లో చల్లని పానీయాలు తీసుకు వచ్చి ఆమెకు యిస్తూ "ఇది త్రాగి కాస్త ఉపశమించు కమలా! ఇంట్లో భార్యాభర్తలకు ఏదో రగడ జరిగివుంటుంది. ఆ కోపాన్నంతా యీ రోజు మా మీద చూపిస్తున్నావు".

"ఆలాంటివేవి కాదు చంద్రిక! వారికి నాకు అభిప్రాయభేదాలు లేవు, కలహాలు లేవు. వారు నా మాట జవదాటరు. నేను వారి మాట జవదాటను. అన్యోన్య దంపతులం" అంది కమల సగర్వంగా అతని కేసి చూస్తూ.

ఎంతో అసందర్భమైన మాటలు కాని అర్ధరహితమైనవి కావు. ఆమాటలు చంద్రికకు ఉద్దేశించబడినవి కావు. ప్రసాద్ కు ఉద్దేశించబడినవి. అది అతను గ్రహించి "అన్యోన్యత హృదయాలకు సంబంధించిన విషయం కమలా!అన్యులకు వాటితో పని లేదు. నీనోటి వెంట ఆ మాటలు వచ్చాయి కనుక నీలో నీకు ఈ విషయంలో ఆత్మవిశ్వాసము లేదని తెలిసిపోతుంది." అన్నాడు.

వీరిద్దరిమధ్య కలహం రేగుతుందేమోనని భయపడి "మామయ్యా! ఇక ఊరుకో కమల మన అతిధి" అనీ చంద్రిక "కమలా ఈమధ్య రజని కనబడిందా?" అంది.

"కనబడింది. నాలుగురోజుల క్రితం 'క్వీన్సే వే' లో రామం, రజని కనబడ్డారు. కుష్టువుల సేవలో ఆమె కూడా దిగింది. వారానికి రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లి వస్తూంటుంది. ఒంట్లో సరిగా కూడా లేదట ఎంతో నీరసపడింది ".

చంద్రిక కంగారు పడుతూ కుష్టువుల సేవ ఏమిటీ' అంది. ఆమె చంద్రికకు జరిగిన గాథ విశదపరచింది.

చంద్రిక దీర్ఘంగా నిట్టూర్చి "హరి బ్రహ్మదులు అడ్డు వచ్చినా ఆమెను ఆపలేరు చూస్తూ ఊరుకోవలసిందే మనమంతా" అంది.

"అది నిజమే చంద్రిక, కాని ఆ అధికారం ఎవ్వరికీ లేదు- కానీ కొంతవరకు రామమే అది సంపాయించగలిగా" డంది కమల.

"అదే సత్యమయితే రామం చాల అదృష్టవంతుడు, రజనివంటి వ్యక్తి ప్రపంచమంతా కంచుకాగడాతో గాలించినా మరొక్కరు దొరకరు" అన్నాడు ప్రసాద్.

ఆమాట లెందుకోకమలకి రుచించలేదు. కొంచెం వెగటుగా కనబడ్డాయి...అయినా దానిని దిగ మింగి "కనీసం యీ ఓక్క విషయంలోనయినా నేను మీతో సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను" అంది.

చంద్రిక నవ్వుతూ "నేను సంపూర్ణంగా నే అంగీకరిస్తాను. హమ్మయ్య! కమల వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు మన ముగ్గురికి ఈ ఒక్క విషయంలోనే అంగీకారం కుదిరింది" అన్నది.

ఒక అరగంట గడిచిన తర్వాత కమల లేచి నిలబడి: "నేనింక వెళ్ళాలి చంద్రికా! వారు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు'' అంది.

"పద కమలా! నేను నిన్ను భద్రంగా మీ యింటి వద్ద కారులో దిగవిడిచి వస్తాను" అన్నాడు ప్రసాద్.

"వద్దు ప్రసాద్! టాక్సీలో వెళతాను " అన్నది కమల భయంతో.

అతను నవ్వుతూ "భయపడకు కమలా! నీకేమి ప్రమాదం కలుగకుండా చూచేపూచీ నాది" అన్నాడు.

"నాకు దానితో సంతృప్తి లేదు. నా దారిని నన్ను పోనియండి" అన్నది కమల.

"అయితే నిస్సందేహంగా నేనంటే నువ్వు భయపడుతున్నావు" అన్నాడు ప్రసాద్.

కమల గర్వంతో "భయపడటమనేది నా స్వభావానికి విరుద్ధం ప్రసాద్! పదండి, అని కారు తలుపు తెరచి ముందు సీటులో కూర్చుంది.

ప్రసాద్ మారుమాట్లాడకుండా కారు స్టీరింగువద్ద కూర్చుని స్టార్టు చేసాడు.

కమల పౌరుషంతో, ఆత్మాభిమానంతో చేసింది కాని, మనస్సులో భయపడసాగింది. కారులో కూర్చుంటే ప్రసాద్ తనను తాను మరచిపోతాడని ఆమెకు తెలుసు, కాని యిక చేసేదేముంది? కాసేవు మెదడలాకుండా ఊరుకొని, మనస్సుని పదిలపరచుకోవటానికి ప్రయత్నించింది. విద్యుద్వేగంతో పోతున్న కారులో ఆమె గజగజ వణకి పోయింది. ప్రసాద్ కి ఇంతకు ముందొకసారి జరిగిన అపాయం జ్ఞప్తికి వచ్చింది.

కొంతసేపు పోయిన పిదప కారు నడుపుతూ నడుపుతూ ప్రసాద్ ప్రక్కకు తిరిగి చూచాడు చీర చెంగు తలమీద పూర్తిగా కప్పుకొని, కారు తలుపు కి ఆనుకొని, కళ్ళుమూసుకుని చేతనారహితంగా కూర్చునివుంది కమల. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా వుంది. ఆమె సౌందర్యం అతన్ని సమ్మోహితుని చేసింది. రెండు మూడు నిమిషములు తదేకంగా చూచాడు, పాత ఢిల్లీకి అవతలవున్న నిర్మానుష్యమైన అడవి ప్రదేశంలో కారు తీసుకు వచ్చి, ఆపి, కమలా! అని పిలచాడు అంతా గాడాంధకారం- ఎక్కడా ఏమి అలికిడి లేదు.

కమల ఉలిక్కి పడి, కళ్లు తెరచి "ఎక్కడికి తీసుకు వచ్చారు? ఏమిటీ? చీకటంతా?" అంది.

"చీకటికి అంతా ఎందుకు భయపడతారో నాకర్ధం కాదు కమలా! వెలుగు లేనప్పుడే వ్యక్తుల నిజ మనస్తత్వాలు నిర్మొగమాటంగా, నిర్భయంగా మాట్లాడవచ్చి బయటపడతాయి'' అన్నాడు.

అతని మాటలు ఆమెను ఇంకా భయపెట్టాయి. వెర్రివాని మాటల్లా వినబడ్డాయి.

"మా యింటికి తీసుకు వెళ్ళమంటే ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు! నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నారా?" అంది భయంతో.

"దారితప్పాను– కమలా! ఆజ్ఞ అయితే మీ యింటికే తీసుకు వెళతాను'' అన్నాడు.

ఎంతో నమ్రతతో అన్న మాటలవి.

ప్రసాద్ నోటి వెంట ఆమెకవి ఎంతో అసహజంగా వినబడినవి. ఆ పరిస్థితిలో కోపగించి ప్రయోజనం లేదని. ఆమె గ్రహించింది.

"నా అజ్ఞయ్యే ఇక్కడకు తీసుకొచ్చారా? చెప్పండి లోలోన మీరు సహృదయులు, ధర్మపరులని తెలుసు... వాటి సహాయాన్నే నేనిప్పుడర్ధిస్తున్నా" నంది.

"ఆలాంటి అనుమానం నీకెందుకు కలిగింది కమలా?" అన్నాడు.

"కలిగినమాట నిజమే నిజంగా దారితప్పి మీరిక్కడికి నన్ను తీసికొని రాలేదు నన్ను మభ్య పెట్టి, భయపెట్టి, నిస్సహాయను చేయటానికి ప్రయత్నించారు" అంది.

"కొన్ని కొన్ని పరిస్థితులలో సత్యం అసత్యంగాను, అసత్యం సత్యంగాను కనబడుతుంది కమలా? ఇక ఇప్పుడు తల వొగ్గడమే గత్యంతరం" అన్నాడు.

"అయితే అది అసంభవమంటావా? అంది కమల.

"అసంభవమని, అది నా చేత కాదనినేననను. కాని ఈ సమయంలో నాకు అలాంటి ఆలోచన కలగ లేదనిమాత్రమంటున్నాను" అన్నాడు.

సహజ స్వరంతో పలికినమాటలు ఆమెని విచలితను చేసాయి-క్రోధంలో అనిన మాటలు కావని ఆమె గ్రహించింది.

"మీరన్న మాటలనినే విశ్వసిస్తున్నాను ప్రసాద్ మీరెపుడైనా ఆలాంటి ఆలోచనలు పెట్టితే నేను అబలనని - నిస్సహాయనని మీరనుకోకండి - ఆత్మహత్య అందరికీ అందు బాటులోనే వుంటుంది" అంది శాంత స్వరంతో.

"ఆత్మహత్య గర్హనీయము. భీరత్వానికి నిదర్శనము కాదా? ఈ మాటలు చెప్పినన్నొకసారి నువ్వు వారించావు" అన్నాడు.

"బలాడ్యులు బలహీనులను నిర్బంధించి నిస్సహాయులను చేసి, ఆత్మాభిమానం బలవంతంగా చూరగొనడానికి ప్రయత్నిస్తే,ఆత్మహత్యకు వెనుకాడితే వారే భీరువులవుతారు. మానవులు ఆత్మహత్యకు వొడిగడతారు ప్రసాద్. జంతువులు ఎన్నడూ అలాంటి పని చెయ్యవు, ఎందు చేతంటేవాటికి విచక్షణాజ్ఞానం, ఆత్మాభిమానం మొదలయినవి లేవు, వాటిని వదలుకొని జీవితాన్ని అంటి పెట్టుకొని, ప్రాకులాడే వ్యక్తులు జంతుసమానులు" అంది.

కమల మాటలు ప్రశాంతమయిన ఆ చీకటిని చీల్చుకొని వెడలివచ్చాయి. ఆమె ముఖకవళికలు చూడటానికి ప్రసాదు ప్రయత్నించాడు. కాని కమల ముఖం పూర్తిగా ప్రక్కకు తిప్పి వేసింది. ఆ మాటలలోని నూతనత్వం అతనిని ఆకర్షించింది. కమల ఆందరి వంటి స్త్రీ కాదని, ఆమెలో వజ్రపుకాఠిన్యత వుందని, అగ్ని లాంటి ఆమె ఆత్మని ఆందుకోవడం అతిదుర్లభమని గ్రహించాడు. మొట్టమొదటిసారిగా అతనిలో నిస్పృహ, నిరాశాజనించాయి.

మెల్లగా "నేను కాలగర్భంలో లీనమయ్యేవరకు నా మనస్సు నిన్ను వెంటాడుతునే వుంటుంది కమలా" అన్నాడు.

కమల హృదయం వొక్కసారి క్రుంగిపోయింది. కళ్ళలో నీరు తిరిగింది. జలప్రవాహాలు చెక్కిళ్ళమీదికి కారసాగాయి, చీర చెంగుతో తుడుచుకోవడానికి అభిమానం అడ్డు వచ్చింది. చీకటిలో గమనించడని కన్నీరుని ఆవిధంగానే కారనిచ్చింది. నిజానికి ప్రసాదు గమనించలేదు కూడా.

"అయినా నీకు వొక వాగ్దానం చేస్తున్నాను కమలా? నీ యిష్టానికి విరుద్ధంగా బలవంతంగా, నిన్ను నేనేమీ చెయ్యను. నీ అంగీకారంతోనే నిన్ను నా దానిని చేసుకుంటాను" అన్నాడు.

ప్రసాద్ మాటలు కమల హృదయంలో బడబాగ్నిని లేవదీశాయి భగభగమని రగిలే ఆ మంటని ఆమె భరించలేకపోయింది. పెదిమలు గట్టిగా బిగించి కళ్ళు మూసుకుని కన్నీరును విడుస్తూ అలాగే వుండిపోయింది.

ప్రసాదు కారు సార్ట్ చేసి వెనుకకు తిప్పి "పద కమలా నిన్ను నీ ఇంటి వద్ద దిగవిడుస్తాను. ఇక ఆలస్యం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు.

 

చాప్టర్ 10

రజని దాదావు ప్రతి దినము విశాల వద్దకు వెళ్తూ వుండేది. రోగులకు సేవ చేయ్యడంలోని తృప్తి, ఆనందము, ఆమెగ్రహించి , అందులో పూర్తిగా నిమగ్నురాలయింది, రోగులకు కూడా ఆమె యెడ అంతులేని అనురాగం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఎప్పుడు సంతోషంతో నవ్వుతూ అందరిని నవ్విస్తూ వుండేది. ఆశారహితము, అంధకారబంధురము అయిన వారి జీవితాలకి కాంతి కిరణంలా వారికి కనబడేది. సాయంసమయాలలో వారినందరిని చేరదీసి మథురకంఠంతో పాటలు పాడి వారిని ఆనందపరిచేది. రజని సాయంకాలల్లో రెండు మూడు గంటలు మాత్రమే అక్కడ గడిపేది. మిగతా సమయాలలో విశాల వారిని కనిపెట్టి వుండేది. విరామరహితంగా ఆమె పని చేస్తూ వుండేది. ఒక వైపు రోగుల సేవ. ఇంకో వైపు వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం. రాను రాను ఆమె రెండవ అంశానికే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చేది. డాక్టరు సలహాలు కోరినది కూడా అదే, భవిష్యతంతా ముందర వున్న ఆ బాలులను సన్మార్గంలో పెట్టి,సంస్కారం నేర్పి, సహృదయులను చేయడమే ఆమె ప్రధమ కర్తవ్యమని ఈయన మనస్పృతిగా వొప్పుకున్నాడు. అదే రోగులకు కూడా ఎంతో మనశ్శాంతినిచ్చింది. తమ తమ పిల్ల లేవరో వారికి తెలియక పోయినా వారంతా సురక్షితంగా వున్నారనీ, సన్మార్గంలో పెరిగి పెద్ద వారవుతున్నారని అలోచన వారికెంతో వోదార్పు కలుగజేసింది. దానికి ముఖ్య కారణభూతురాలైన విశాల వారికొక దేవతలా కనబదేది.

రోగులలో అనేక రకాల వ్యక్తులుండే వారు. అనేక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారిలో ఒక వినోద్ అనే పంజాబీ యువకుండుడేవాడు, సుమారు ముప్పై సంవత్సరాల వయసు వుంటుంది. గత మూడు సంవత్సరాల బట్టి హాస్పటల్ లో వున్నాడు . వ్యాధి ఇక కుదరదని నిస్పృహ చెందాడు బి. ఏ, వరకు చదువుకున్నాడు ఉన్నత కుటుంబానికి చెందిన వాడే, ఒకప్పుడు నిండుయవ్వనంలో తొణకిసలాడే అంద మయిన యువకుడు, తనకు సోకిన వ్యాధి కుష్టురోగమని ఎంతో ఆలస్యంగా గ్రహించాడు. వెంటనే యిల్లు వదలి వచ్చేసాడు. తిరిగి తిరిగి చివరకు ఈ ఆసుపత్రిలో చేరాడు. తన స్వగ్రామమేమిటో తల్లిదండ్రులెవరో యింత వరకు ఎవరికి చెప్పలేదు. చెప్పమని డాక్టరు సనల్ కూడా అ బలవంతం చెయ్యలేదు.

ఆశలుడిగిన అతని జీవితానికి ఆశాజ్యోతిలా వెలిగింది. నిరాశతో మరణం కోసం ఎదురు చూసే ఆతని మనస్సులో జీవించాలనే అశ తిరిగి అంకురించింది. రజని ఎక్కువ కాలం ఆతని వద్దే గడుపుతూ వుండేది. అతను కుష్టు రోగి అన్న విషయాన్నే పూర్తిగా మరచీ పోయేటట్లు చేయడానికి ప్రయత్నించేది. ఆ విభేదమేమి పాటించకుండా, అతనితో చనువుగా కలసి వుండేది. అనేక విషయాలు గురించి చర్చించేది. అతనిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని పునరుద్దరించింది. కాని శరీరకంగా ఆతని పరిస్థితి దిన దినము క్షిణించ సాగింది. డాక్టరు సనల్ శక్తి వంచన లేకుండా ప్రయత్నించేడు. ఒక రోజున వినోదు "రజనీ" నీ పరిచయ గత సంవత్సరం కలిగినట్లయితే నా జీవితమే సమకూరి వుండేది. ఈపాటికి నీ సహాయంతో నేను ఈ వ్యాధిని జయించి వుండే వాడిని. అప్పుడు శారీరకంగా శత విధాలా బాగుండేది. కాని మానసికంగా నీ స్నేహంకోసం జీవించాలనితీవ్రమయిన వాంఛ ఏర్పడింది. కానీ శరీరం మరణానికి సంసిద్ధ మవుతూంది. కాని నేను పోరాడుతాను. దైవ కటాక్షము, నీ సహాయము వుంటే నేను సరళలీకృతుడవు తాను" అన్నాడు.

"తప్పక జయిస్తావు వినోద్, జీవించాలనే తీవ్రమయిన కోరిక వున్నప్పుడు ఈ వయస్సులోదేనినైన జయించవచ్చు. క్షణకాలం గూడా మరణం గురించి తలపెట్టవద్దు. శరీరంలోని శక్తులన్నీ కూడదీసుకొని పోరాటం సలుపు, విజయం నీదే! కావాలని మనస్ఫూర్తిగా నేను కాక్షింస్తున్నాను" అంది.

"జీవితంలోని విలువైన వస్తువులన్నీ సమయం మించి పోయిన తర్వాత లభించుతాయి రజనీ, ఇది అతి విషాదకర మయిన విషయం" అన్నాడు వినోద్.

"అది నిజమే కాని ఇంకొకటి కూడా వుంది. లభించిన వస్తువుల విలువపారవేసుకున్న తర్వాత కాని మానవులుగ్రహించరు" అంది.

"నీ స్నేహము, సాంగత్యము , ప్రేమ, లభించాయి, నా కిక వేరే ఇంకేమీ జీవితంలో ఆక్కరలేదు రజనీ! వీటి విలువపార వేసుకోకుండానే గ్రహించగలిగాను. కాని సమయం మించిపోయిందేమోనన్న భయం మాత్రం పడుతున్నాను" అన్నాడు.

రామానికి రజనీఈ విధంగా రోగులతో యింత చనువుగా కలసివుండటం ఇష్టం లేకపోయింది భయంకరమైన ఆ వ్యాధి రజనికి సోకుతుందేమోనని గజగజ వణకిపోయేవాడు, రజనినిబ్రతిమిలాడాడు, బెదిరించాడు, కాని ఫలితం లభించ లేదు. అప్పుడప్పుడు ఆమె వెంట వచ్చేవాడు. కాని అతని రాక వినోద్ కి ఇష్టం వుండేది కాదు. రజనితో వంటరిగా కాలం గడిపే అవకాశం లభించాలని అనేక సార్లు రజనితో ఫిర్యాదు చేసేవాడు. అతను రజనికి రామానికి మధ్య వున్న సంబంధం గ్రహించి ఈర్ష్యతో అనిన మాటలవి. అది రజనిగ్రహించింది. ఒకటి రెండుసార్లు అని మందలించినా అతను వూరుకునేవాడు కాడు కాని "నేను కుష్టు రోగిని నన్నిలా అవమానిస్తున్నావు రజనీ, రోజుకి రెండు మూడు గంటలు నాకు నీ సాంగత్యం లభిస్తోంది. మిగతా కాలమంతా వారి వద్ద గడపు. ఈ రెండు మూడు గంటలలోను, వారెందుకు నా ఆనందానికి అడ్డు రావాలి? అనేవాడు. ఒకటి రెండుసార్లు రామంతోనే ఆ విధంగా మాట్లాడాడు. దానితో రామం చాలా బాధపడి చాలావరకు రావడమే మానేసాడు. ఎప్పుడయినా వచ్చినావిశాలవద్ద కాలం గడిపేవాడు, రజని ప్రవర్తనలో కూడా ఒక విధమైన మార్పును గమనించాడు, పూర్వపు చిలిపితనం, ఆమెలో క్షీణించి పోయింది. ఒక విధమయిన వుదాసీనత్వము జడత్వము ప్రవేశించాయి. అప్పుడప్పుడతనిని తప్పించుకుంటున్నట్లు కూడా అనుమానం వేసింది. దీనికంతా వినోద్ కారణమని భావించాడు. ఒక రోజున విశాలతో ఈ విషయం చెప్పాడు.

"రజనిని అపార్థం చేసుకుంటున్నారు. మీరు రోగి మనస్తత్వం మీరు గ్రహించలేకపోయారు. రజని గ్రహించింది. ఇలాంటి విషయాలను వారు హృదయానికి పట్టించుకుంటారు. వారికి మానసిక తృప్తి లభిస్తే వ్యాధి కుదిరిత్వరగా నయమవుతుంది. రజని తన బుద్ధి కుశలతని శక్తి సామర్ధ్యాలను అంతా వినియోగించి వినోద్ ప్రాణాలను రక్షించాలని ప్రయత్నిస్తోంది . కొంతవరకు మీకు బాధ కలిగినా ఆమె ప్రయత్నానికి అడ్డు వెళ్ళటం సమంజసం కాదు. అనవసరంగా ఆమెను కూడా కష్టపెట్టినవారవుతారు" అంది విశాల.

"ప్రాణపదంగా ప్రేమించి రజనిని పరాయి పురుషుడు 'ప్రేయసీ' అని నా యెదుటే సంచరిస్తూవుంటే నే నెలా ఊరుకోను విశాల? అన్నాడు.

"ఇక వేరే గత్యంతర లేదు. రామం బాబూ ప్రపంచములో అందరు ప్రియులే అనే భావం మీరు అలవరచుకోవాలి? రజనీ ఆ పిలుపు అంగీకరించడానికి కారణం వుంది. రోగులకు, ముఖ్యంగా యీలాంటి వారికి తనను యింకొకరు ప్రేమిస్తున్నారని వారి ప్రేమ కోసం జీవించాలని, తీవ్రమైన కోరిక కలిగినప్పుడు వ్యాధి నయమవడానికి అవకాశాలు చాలావున్నాయి. అందుకోసమే రజని ఇలా సంచరిస్తోంది. మృత్యువునే ఎదిరించడానికి రజని ప్రయత్నిస్తోంది. మీరు యీర్ష్య, ఆభిమానాలు ప్రదర్శించకుండా ఆమె ప్రయత్నానికి సహాయం చేసి వుంటేమీరంటే ఆమె హృదయంలో గౌరవం ఏర్పడుతుంది. చివరకు అది మీ మంచికే దోహదమవుతుంది" అంది.

రామం దీర్ఘంగా నిట్టూర్చి, "ఏమో విశాలా? చివరకు ఏమవుతుందో ఎవరికి తెలుసు. అపరిచితులంటే రజని కెందుకో ఇంత అప్యాయత. అపరిచితులయిన అమెరికన్ దంపతులు రజనిని తీసుకుపోవటానికి , ప్రయత్నించారు. ఎంతో కష్టం మీద ఆమెను దక్కించున్నాను. చివరకు ఈ అపరిచితుడు నాకు ఆమెకు కాకుండా చేస్తాడేమోనని భయంగా వుంది" అన్నాడు.

"అధైర్యపడకు రామం చివరకు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి" అంది.

"వినోదుని మరణం నుంచి రక్షించడానికి రజని వేస్తున్న పధకమని నాకు నమ్మకం గలిగినట్లయితే నేను నిశ్చితంగా వుంటాను. కాని అదే కుదరటం లేదు. ఆమె నిజంగా మనస్సులో నా కన్యాయం చేస్తోందేమోనని నాకు భయంగా వుంది" అన్నాడు.

"రజనినే అడగకూడదా? రాంబాబు నిస్సంశయంగా ఆమె మీకు ఆమె మనస్సు విశదపరుస్తుంది" అంది.

"అడగటానికి నాకు ధైర్యం చాలటం లేదు విశాలా! ఆమెపై నా అధికారాన్ని ఆమె ఏ విధంగానూ ఎప్పుడు గుర్తించలేదు. నా ప్రశ్నకి ఆమె సమాధానంఊహించినంత మాత్రనే నాకు భయం వేస్తోంది" అన్నాడు.

రామం మనోవేదన విశాల అర్థం చేసుకుంది. రజని విషయం ఆమెకు తెలుసు. ఆ విషయంలో ఆమె చేయగలిగింది శూన్యం .

"రజని మనస్సుని అర్థం చేసుకోవడం చాలా కష్టం రామం బాబూ? ఏ క్షణంలో ఆమె ఏం పని చేస్తుందో ఊహించడం కూడా కష్టం. అధికంగా ఆమెపై ఆశలు పెట్టుకోవడం అనర్థానికీ అథారమవుతుందేమోనని నాకనిపిస్తోంది" అంది.

రామం నిట్టూర్చి "అది నాకు తెలుసు విశాలా? నాకు రజనికి భూమ్యాకాశాల వ్యత్వాసముంది. భూమి ఆకాశాన్ని ఎప్పుడూ అందులో లేదు, కనికరం కలుగుతే. ఆకాశమే భూమినందుకోవచ్చు. "అదే నా ఆశ" అన్నాడు.

కాలం గడిచిన కొలది రజనీ, వినోదుల సఖ్యత రామానికి నిజంగా ఎంతో మానసిక సంక్షోభ కలిగించింది. ప్రతి రోజు సాయంత్రపు కాలమంతా అతనివద్దే గడుపుతూవుండేది. శలవుదినాల్లో అతని ప్రక్కనే కూర్చుని కాలం గడుపుతూ ఉండేది. చూపరులకు వారిరువురు ప్రేమికులులా కనబడేవారు. రజని రామంతో పూర్వపు చనువుని కొంచెం సడలించింది. బాహ్వనేత్రాలకి అది ఏమంత మిన్నగా కనబడదు. కాని అది రామం గుర్తించకపోలేదు. అతను గుర్తించినది ఇంకొక విషయముంది. ఒక వినోద్ తో తప్ప ఆమె మిగతా అందరితోను ఆవిధంగానే ప్రవర్తిస్తోంది. అందులో విచక్షణ, పక్షపాతము లేదు. కమల కమలాకరం కూడా ఆమె ప్రవర్తననుచూచి ఆశ్చర్యపోయారు. కమల నిర్భయంగా ఒక రోజున రజనిని ప్రశ్నించింది"కొత్త స్నేహితులు దొరికారని, పాతమిత్రులను చిన్న చూపు చూడటం సమంజసం కాదు రజనీ!" అంది.

రజని నవ్వి "నూతన మిత్రులు కూడా కలకాలం నూతనంగా ఉండరు కమలా! వారుకూడాపాతబడతారు. అప్పుడు పాతవారు కొత్తవారవుతారు. ఆ సమయంకోసమే మనమంతా వేచివుండాలి" అంది.

రజని ఒక రోజు డాక్టర్ సనల్ ని ప్రశ్నించింది "డాక్టర్! వినోద్ పరిస్థితి ఎలావుంది? ప్రాణప్రమాదం ఇంకా వుందా?" అన్నది.

సనాల్ మందహాసం చేస్తూ "నీ ప్రయత్నంవల్ల పరిస్థితి ఎంతో మేలయింది రజనీ! పూర్తిగా ఆశలువదలి వేసిన అతని ఆరోగ్యంలో ఇంత మార్పు వచ్చిందంటే అదంతా నీ కృషి ఫలితమే, ఇదేరీతిలో యింకా కొంతకాలం పురోగమిస్తే ప్రమాదం తప్పవచ్చు. కాని ప్రస్తుతం గండం యింకా పూర్తిగా గడవలేదు"అన్నాడు.

"ఈ ప్రమాదం ఏవిధంగా సంభవిస్తుంది డాక్టర్ ? కుష్టురోగులు కేవలం ఈ వ్యాధి కారణంవల్లనే మరణించరని నేను ఎక్కడో చదివాను" అంది.

"అది నిజమే రజనీ! ఎవరూ కేవలం ఈ వ్యాధి కారణము చేత మరణించరు. ఈ వ్యాధి శరీరాన్ని ఎంతో బలహీనము చేస్తుంది. శరీర పరిస్థితి అలా వున్నప్పుడే ఏ యితర వ్యాధులైనా లోన ప్రవేశించి, పూర్తిగా వశపరచుకొని, మరణము కలిగించవచ్చు. ఇదే ప్రమాదం" అన్నాడు.

"అయితే ఈ ప్రమాదం నుంచి అతన్ని రక్షించటానికి చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి?" అంది.

"రజనీ! చెయ్యగలిగినదంతా నువ్వు చేస్తున్నావు... నేను చేస్తున్నాను. ఇంతకు మించినదంతా దైవం చేతుల్లో వుంది" అన్నాడు.

రజని వినోద్ లో మానసిక స్థయిర్యాన్ని నెలకొల్పగలిగింది. కాని దాని ఫలితంగా రజని వినోద్ కి ఎంతో సమర్పించవలసి వచ్చింది. ఎప్పుడు అతను ఆమెనోటి వెంట ప్రేమపూరిత వాక్యాలు ఆశించేవాడు. ఇతరుల ఎదుట కూడా గర్వంగా ఆమె తన ప్రేయసి అనే భావం కలిగేటట్టు ప్రవర్తించేవాడు. ఆమె సాధారణంగా మౌనం వహించేది. కాని ఆ మౌనంలో కూడా అయిష్టతని ప్రదర్శించేది కాదు. అదే ఆమెలోనీ ఔన్నత్వమనేది విశాల "అదే నన్ను బాధపెడుతోంది" అనేవాడు రామం.

ఒకనాడు సాయంకాలం రజనీ ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చింది. వినోద్ పక్క వద్దకువచ్చి చూస్తే అక్కడతను కనబడలేదు. కంగారుపడుతూ ఆమె బయటకు వచ్చి అంతా వెతికింది. వెదకగా వెదకగా ఆస్పత్రికి దూరంలో వున్న ఒక చెట్టు క్రింద కూర్చుని వున్నాడు.

రజని కంగారుపడుతూ "ఇక్కడ ఏం చేస్తున్నావు వినోద్ - ఎవరికీ చెప్పకుండా ఎందుకిలా వచ్చేసావు" అంది.

వినోద్ కోపంతో "నేను ఎక్కడ వుంటే నీకెందుకు" రజనీ! నీ ఆప్తులు, కావలసిన వాళ్ళు వేరొక చోటున్నారు. వారి వద్దకు వెళ్ళు, నా దారిన "నేను చస్తాను" అన్నాడు.

ఆమె అతని కోపానికి కారణం అతని ఆలోచనలు గ్రహించింది. నవ్వుతూ "అదంత సులభం కాదు వినోద్! దానికి కూడా నా అనుజ్ఞ కావాలి" అంది .

"నేను పగలల్లా సాయంకాలం ఆరుగంట లెప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాను. అరుగంటలయిన తరువాత కూడా ఆలస్యమయితే నేను భరించలేను" అన్నాడు.

రజని కాస్త విసుగ్గా ఆలస్యానికి కారణాలుంటాయి వినోద్. ఆఫీసులో ఆలస్యమవుతూంటుంది. బస్సు సమయానికి దొరకకపోవచ్చు. వెంటనే తనను తాను సంబాళించుకొని ఓక్షణకాలం ఆగి "నాకుమట్టుకు ఆలస్యం అయితే బాధగా వుండదా?" అంది.

చివరి వాక్యంలో అతని కోపం అంతరించిపోయింది. ఆమె కళ్ళల్లోకి ఆశగా చూస్తూ "నామీద నీకు నిజంగా ఇంత ప్రేమ ఉందంటే నేను అప్పుడప్పుడు నమ్మలేక పోతుంటాను రజనీ! నీలాంటి అపురూపు సౌందర్యవతి నన్ను ప్రేమించటానికి నాలో ఏముంది? అందరు అసహ్యించుకొనే నామీద నీకు ఇంత ఆదరం ఎందుకు?"అన్నాడు."

"ఇతరుల అసహ్యానికి అర్ధం లేదు వినోద్. ఎవరికైనా జబ్బు చేస్తే మనం ప్రదర్శించవలసింది ఆదరం, సానుభూతి కాని అసహ్యం కాదు" అంది.

"రజనీ! నేను నిజంగా తిరిగి ఆరోగ్యవంతుడవడమే తటస్థిస్తే నీకోసమే. జీవితంలో నాకిక వేరే కర్తవ్యం లేదు" అన్నాడు.

"అది తరువాత ఆలోచించవలసిన విషయం. నీ మొదటి కర్తవ్యం ఆరోగ్యం బాగు చేసుకోవడమే. ఇప్పటికీ నీగమ్యస్థానమది" అంది.

"జీవితంలో చేరవలసిన గమ్యస్థానాలన్నిటికి నీ చేయూత కావాలి రజనీ! లేకపోతే నేను నిస్సహాయుడను" అన్నాడు.

ఆ మాటలు రజనికి రామాన్ని గుర్తుకుతెచ్చాయి . ఈ యిరువురిది సుమారు ఇవే మాటలు. అతని నోటి వెంటకూడా వచ్చాయి. ఈ యిరువురిలోను తన కర్తవ్యం ఎక్కడుంది? సమాధానంకోసం ఆమె ఆట్టే తడుములేదు. అతని ఆరోగ్యం బాగయేవరకు ఇతనియందే వుంది. ఆ తర్వాత ... ఆ తరువాత అప్పుడాలోచించవచ్చు. అయినా ఆమె హృదయంలో ఆ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసు.

 

చాప్టర్ 11

విశాల రాత్రింబగళ్ళు అక్కడ పిల్లలతోనే గడపసాగింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంవరకు వారికి ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పేది. ఆ తర్వాత వారి భోజనాలయిన పిదప దగ్గర కూర్చుని వారికి కథలు చెప్పుతూ నిద్ర పుచ్చేది. మనశ్శాంతికి ఆప్యాయంగా కౌగలించుకొని గడపిన దినం వృధాగా లేదనే గర్వంలో ఆమె నిద్రించేది జీవితంలో ఎన్నడని ఆమె అంత సుఖం అనుభవించలేదు. దీనికి ఇంకొక కారణం కూడా వుంది. ఇద్దరి ఆశయాలకు వొక్కటే , గమ్యస్థానం ...సునల్ తో స్నేహం దినదినం వర్థమానమైంది, తీరిక ఉన్నప్పుడల్లా విశాలవద్దకు వచ్చి ఆమెతో కాలంగడుపుతూ ఉండేవాడు. అతని సహృదయత, సరళ స్వభావము, స్వార్ధరహితం ఆమెలో ఒక విధమైన గౌరవ భావాన్నికలుగజేసాయి క్రమక్రమంగా ఈ స్నేహమే అనురాగపు బీజాలని వారి హృదయాలలో నాటింది. వారికి తెలియకుండానే హృదయాలు సన్నిహిత మయ్యాయి

సంధ్యాసమయాల్లోనూ, వెన్నెల రాత్రులలోను ఒకరి వద్దకు ఇంకొకరు బయలుదేరేవారు, దారి మధ్యలో కలుసుకొని దారితప్పి దగ్గరలోనే వున్న తోటలోనికి వెళ్ళి కూర్చుని, అనేక విషయాలను గురించి చర్చించేవారు. కాని ఎన్నడు స్వంత విషయాలను గురించి మాట్లాడుకోలేదు.

ఒకనాడు వారిరువురు మాట్లాడతూ మాట్లాడుతూ చాలాదూరం నడిచి వెళ్ళిపోయారు. మానవజీవితంలోని ఆశయాలు, ఆచరించవలసిన కర్తవ్యాలు, అదుపులో ఉంచవలసిన ఉద్రేకాలు, వీటిగురించి వారు చర్చించసాగారు.

"ఆశయాలను ఆచరణలో పెట్టడం కష్టమని నేను ఒప్పుకుంటాను సునల్ బాబూ! ఆశయాలుండి ఆచరణలో పెట్టలేకపోవడం ఆశయాలు లేకండా వుండటంకన్న యెంతో మేలు. ఎవరైనా నువ్వెందుకు జీవిస్తున్నావని అడిగితే తడుముకోకుండా అతడు సమాధానం చెప్పటానికి వీలవుతుంది" అంది. విశాల.

"కొంతవరకు నేను ఒప్పుకుంటాను, కాని ఆశయాలను మనస్సులో వుంచుకొని వాటికి విరుద్ధంగా సంచరించడం ఆత్మవంచన విశాలా! ఆశయాలను సాధించలేక పోవచ్చు. కాని వాటికోసం శక్తి వంచన లేకుండా కృషి చెయ్యడము ఆ వ్యక్తి కనీస ధర్మం. దానికి ఫలితంతో నిమిత్తం లేదు" అన్నాడు.

"అది నేను వొప్పుకుంటాను. కానీ నేనన్నదది కాదు, మానసిక బలహీనత వల్ల ఆచరణ పెట్టడంలో సాధ్యం కాదనుకోండి. అంతమాత్రాన ఆశయాలను వదలుకోవలసినదేనా? వాటిని మనస్సులో ఉంచుకోవడంలో దోషం ఏమిటి?"అంది.

"సహృదయత, బలహీనత సమకూడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే మనస్సులో ఆశయాలు ఉన్నాయని ముగిసిపోయి వారిని వారేవంచించుకుంటారు. వాటిల్లో విశ్వాసం లేనివారి ప్రగల్భాలకి కూడా ఇది దోహదమవుతుం" దన్నాడు.

"నా విషయం తీసుకోండి. జీవితంలో నేను ఆశించేవి చాలావున్నాయి. హృదయంలో ఆశయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ రెండింటికి సఖ్యత లేదు" అంది.

"సఖ్యత లేకపోవచ్చును విశాలా! కాని నువ్వు నాకు చేస్తున్న సహాయాన్ని నేను ఎన్నడు మరువను, నువ్విక్కడికి రాక మునుపు నేను ఈ అమాయకపు పిల్లలను పంపెయ్యటమా,ఎలా పెంచి పెద్దవారిని చెయ్యటమా అని రాత్రింబగళ్ళు మధనపడేవాడిని. రోగుల గురించి నేను అట్టే అతురత పడేవాడినికాదు. వారికి వెయ్యగలిగినదంతా నేను చేస్తున్నాను, కాని పసితనంలో వారి మనస్తత్వాలని తీర్చిదిద్దే వ్యక్తి కావాలని. అ తరువాత నవ్వు లభించావు. వీరు పెరిగి పెద్దవారయిన తరువాత నువ్వు వారి యెడ ప్రదర్శిస్తున్న అనుపమానమయిన ప్రేమానురాగాలకి నిన్ను దేవతగా కొలుచుకుంటారు.నీ పరిచయం కలిగిన తరువాత నాలో ఒక నూతన శక్తి ఆవిర్భవించింది. దీనికి నేను ఏవిధంగా కృతజ్ఞత చూపగలనా యని సర్వదా ఆలోచించుచున్నాను" అన్నాడు.

ఆ మాటలు విని విశాల చాల ఆశ్చర్యపడింది. ఇంతకు ముందెప్పుడు ఆవిధంగా మాట్లాడలేదు. మితభాషి, గంభీరుడూ, ఉద్రేకము అతని స్వభావానికే విరుద్దము.

విశాల తలవంచుకొని "ఆ చివరివాక్యాలు నానోటి నుంచి వెలువడవలసినవి ..."

హఠాత్తుగా దగ్గర్లో పిడుగుపడింది.విశాల సనల్ బాబు వడిలోకి త్రుళ్ళిపడింది. అతను క్షణకాలం ఆమెను హృదయానికి హత్తుకొని వదలివేసాడు, ఆమె సిగ్గుతో "చాలా దగ్గరలో పిడుగు పడివుంటుంది. త్రుళ్ళిపడ్డాను" అంది.

దగ్గరలోవున్న ఒక చెట్టుమీద పిడుగుపడి దానిమీద విశ్రమిస్తున్న రెండు పక్షులు నేలకూలి చెట్టు భస్మమైంది. మాటలలో పడి వారు వాతావరణాన్నే మరచిపోయేరు. ఉరుములు, మెరుపులు విజృంభించాయిఆకాశమంతా నల్లటి మేఘాలచ్చాయతో మరుగుపడి వుంది. నల్లటి ఆ మేఘాలకి బీటలు వేస్తూ మెరుపులు మెరుస్తూన్నాయి. పెనుగాలికి చెట్లు వుర్రుతలూగుతున్నాయి.

"మాటలలోపడి అంతా మరిచిపోయాం. పెద్ద వాన వచ్చేటట్టు వుంది. త్వరగా పరిగెట్టాలి. పద విశాలా" అన్నాడు సునీల్.

ఇద్దరు పరుగెత్తడం ప్రారంభించేరు. కాని కొంత దూరం వెళ్ళేసరికి విశాల ఆయాసంతో ఆగిపోయింది, సనాల్ వెనుకకు వచ్చి నా చెయ్యి పట్టుకో త్వరగా నీవు, విశాల అన్నాడు ఆ చెయ్యి పట్టుకుని నడుస్తూవుంటేవిశాలకు ఎక్కడా లేని శక్తి వచ్చింది. కాని కొంత దూరం వెళ్ళేసరికి భోరున పెద్ద వాన ప్రారంభమయింది. ఇద్దరు పూర్తిగా తడసిపోయారు. ఎక్కడా తల దాచుకోటానికి చోటు లేదు. దగ్గరలో వున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరేరు. విశాల శరీరమంతా పూర్తిగా తడిసిపోయింది. చలికి వణుకుతూంది. ఆ దృశ్యం చూచి సునల్ హృదయం వ్యధతో నిండిపోయింది! కాని చేసేది ఏముంది?తన బట్టలన్నీ పూర్తిగా తడసిపోయేయి.

దగ్గరకు వెళ్ళి "విశాల" అని పిలిచేడు. ఆ పిలుపులో కరుణ, మార్థవం, తిన్నగా ఆమె హృదయాన్ని అంటుకున్నది. భయంకరమైన వాతావరణం ఆమెలో భరించలేని ఒక విధమైన భయాన్ని లేవదీసింది. ఆ సమయంలో సనల్ శోక కాలాతీతమైన ఆధారము, ఆశ్రయం లాగా కనబడ్డయి, హాఠాత్తుగా ఆమె ఆతని హృదయం మీద వాలిపోయింది, సునాల్ క్షణకాలం నిర్గాంతపోయేడు. కాని మరుక్షణంలోనే ఆమెను హత్తుకొని అలాగే మారుమాట్లాడకుండా నిలబడిపోయాడు. కొన్ని నిముషాలు గడిచిపోయిన తరువాత "చలి వేస్తుందా విశాల!" అన్నాడు.

విశాల తల పైకెత్తకుండానే జవాబు ఇచ్చింది "లేదు ఇప్పుడంతా పోయింది. మనస్సంతా ఎంతో తేలిక గావుంది. ఈ విధంగా జీవితమంత నేను నడపగలను" అంది మెల్లగా.

సనల్ మందహసము చేస్తూ "ఈ మాటలు నానోట నుంచి వెలువడలసినవి విశాల" అన్నాడు

విశాల "చిరునవ్వు నవ్వింది. నిర్దాక్షిణ్యంగా వాన కురుస్తూనే వుంది. వర్షపు బిందువులోకరి శరీరాన్నుంచి ఇంకొకరి శరీరానికి విస్తరిస్తున్నాయి. ఆకు పచ్చటి చీర ఆమె వంటికి అంటుకునిపోయివుంది. అపాద మస్తకము ఆమె అవయవ సౌష్టమును కన్నుల కింపుగా కనపడుతూంది. నెమ్మదిగా సనల్ విశాలని విడదీసి, "వర్షము వెలిసే సూచనలు ఏమి లేవు, విశాల, ఇంకా ఇంకొంచెం సేపు అలాగే వున్నామంటే నిమోనియ తప్పకుండా వస్తుంది" అన్నాడు.

విశాల "వస్తే రానీయండి. మీకు వస్తే నేను, నాకు వస్తే మీరు ఉపచర్యలు చేయవచ్చు" అంది.

"ఇద్దరికి ఒకసారే వస్తే ఏం చేస్తావు విశాలా"అన్నాడు.

''మా రజని వుంది. రోగులకు సేవ చేయడంలో ఆమె చాకచక్యం శ్రద్ధాసక్తులు ఆసమానమయినవి" అంది.

"రజని అనే స్త్రీ యే అసమానమయింది. విశాలా వినోద్ ని నిజంగా ఆమె ప్రేమిస్తుందా?" అన్నాడు

"దానికి సరియైన సమాధానం ఒక రజని తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. రజని చెప్పదు. ఏది ఏమైనా ఆమె వినోద్ ఒక నూతన జీవితాన్ని ఇస్తూంది" అంది.

"అది నిజమే విశాల. కాని అతని పరిస్థితి శారీరకంగా ఇంకా చాలా ప్రమాదంగా వుంది. అతి బలహీనంగా వున్నాడు. ఏవిధయమైన వ్యాధి సోకినా ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. రజని అతనిలో ఆత్మవిశ్వాసాన్ని, జీవితం మీద తీపి నెలకొల్పింది.కాని ఆమె మృత్యువుతో పోరాడలేదు" అన్నాడు.

వర్షం కొంచెం వెలిసింది. విశాల చెయ్యి పట్టుకొని సనల్ పరిగెత్తుకొని ఆసుపత్రి దగ్గరకు వచ్చేడు. అదే సమయానికి రజని లోపలనుంచి బయటకు వస్తూంది. సన్నగా వర్షం కురుస్తున్నా నెమ్మదిగా ఎంతో తీరుబడిగా.ఆమెను చూచి ఇద్దరు హటాత్తుగా ఆగిపోయారు.

"అన్నింటితోపాటు విశాలకు వర్షపు విలువను నేర్పుతున్నారా, డాక్టర్? కాని ఇంకొకటి మిగిలిపోయింది. వెన్నెల, దాని విలువ కూడా నేర్పండి" నవ్వుతూ అందిరజని.

డాక్టర్‌కి ఏమనాలో క్షణకాలం తోచలేదు. యింకా ఇద్దరి చేతులు కలిసే వున్నాయి. రజని ఎదుట ఇద్దరిలో ఎవరికి విడిచే ధైర్యం లేదు.

సనల్ ప్రయత్నపూర్వకంగా చిరునవ్వు నవ్వి "విశాలకు నేను నేర్పగలిగినది ఏమీ లేదు రజని. నేర్చుకొనవలసినవి నీ వద్దనే నేర్చుకుంది" అన్నాడు.

ఏదో మాట్లాడవలెననే ఆతృతేఅతని ఈ మాటలు. అందులో అర్ధం వెతుకుతే శూన్యం.

"కాని నేను స్త్రీని డాక్టర్. జీవితంలో ఒక స్త్రీ ఇంకొక స్తీకి నేర్పగలిగింది వొక భాగం మాత్రమే. మిగిలినది నేర్చుకోడానికి విశాలవంటి అదృష్టవంతులకు మీలాంటిగురుతుల్యులు దొరుకుతారు. నా బోటి వారికి లభించేది నాస్తి" అంది.

అదే సమయానికి గట్టిగా వురుము వినబడింది. ఆకాశం మీద వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.

"ఇప్పుడీ వానలో ఎలా ఇంటికెళ్తావు రజని? రాత్రికి ఇక్కడే నా వద్ద వుండిపోకూడదా?" అంది విశాల.

"నాకూ, ఈ వర్షానికి ఏదో అవినాభావ సంబంధముంది విశాలా. వర్షం కురుస్తుంటే నాలో ఎక్కడలేని వుత్సాహం వస్తుంది. చల్లటి ఆ చినుకులు, తెల్లటి ఈ శరీరం మీద నాట్యమాడుతూ వుంటే నన్ను నేనే మరచి ప్రవర్తిస్తాను" అంది రజని.

సనల్ నవ్వుతూ"అయితే రోగాలు నీ జోలికి రావా? ఆ విధంగా ఏమైనా అంగీకారముందా రజని" అన్నాడు.

రజని కూడా నవ్వి "అది లేదు డాక్టర్. అదే వుంటే మీలాంటి వారి పరిచయ భాగ్యమే లభించదు. స్వతహాగా నాకు డాక్టరు అంటే ఎంతో ప్రీతి" అని క్షణకాలం ఆగి "నేనీనాడు మీకొక రహస్యాన్ని వెల్లడి చేస్తాను డాక్టర్. ఎవ్వరికి వెల్లడి చెయకండి. ఆఖరికి విశాలకు కూడా చెప్పకండి." అని నవ్వసాగింది.

సనల్, విశాల కూడా నవ్వి "నేను ఇంత అదృష్టవంతుడనని నాకు తెలియదు" అన్నాడు.

"ఇదేముంది డాక్టర్. ఆసలైనది విలువైనది ఇంతకు ముందే లభించింది. విశాల చెయ్యిపట్టుకొని వర్షంలో విహరించడం అంటే సామాన్యమా" అంది రజని.

"రజనితో మాటలలో ఎవరూ నెగ్గలేరు. సనల్ బాబు అని "రజనితో తీరికగా పరహాసమాడుదుగాని, రాత్రి ఇక్కడే వుండిపో, వర్షం ఎక్కువవుతుంది" అంది విశాల.

"వద్దు విశాల నేను వెళ్ళిపోవాలి. రాత్రుళ్ళు పిల్లలకి ప్రయివేటు చెప్పుతున్నాను ఇప్పటికే ఆలస్యమైంది" అంది రజని.

మాటలు విని విశాల కొంచెం ఆతృతకనబరచింది.పగలల్లాపని చేస్తావ్, సాయంకాలం ఇక్కడకు వస్తావు. రాత్రిళ్ళు ప్రయివేటు, నీకు విశ్రాంతి ఎక్కడ ఇక్కడ లభిస్తుంది" అంది విశాల.

"ఇలా చేయ్యకుండా వుత్తినేకూర్చోవడమే కాదు. విశాల నేను ఇక్కడికి విశ్రాంతి వినోదాలకోసం వస్తాను" అంది.

"ఇలాగుమాట్లాడుతూంటేతెల్లవారిపోతుంది విశాల నేను వెళ్తాను అని సనల్ తో నవ్వుతూ "అద్దం దొరికినంత మాత్రన సంబరం పడితే లాభం లేదు. డాక్టర్ దానిని భద్రంగా కాపాడుకోవాలి మానవుల నుంచి దైవంనుంచి" అంది.

కాలం గడిచేకొలది వినోద్ ప్రేమ దాదాపు పిచ్చిగా మారింది. రాత్రింబగళ్లు రజనిని, తన వద్దే వుంచమనే వాడు, వేరే ఇతర పనులే చేయవద్దనేవాడు.ఆమెని మానసికంగా ఎంతో బాధ పెట్టేవాడు. కాని ఆమె ఎంతో సహనంగా, ఓరిమితో సంచరించేది. శారీరకంగా అతని పరిస్థితి దినదినం క్షీణించిపోయింది. కీళ్ళనొప్పులతో మంచంమించి లేవలేని పరిస్థితికి వచ్చాడు. దానికితోడు నిమోనియా జ్వరంకూడా వచ్చింది. దానితో పరిస్థితి చాలా విషమించి, ఒళ్ళంతా కాలిపోయే జ్వరం, వళ్ళు తెలియని ప్రేలాపన. ఈమె రాత్రింబగళ్ళు అతని ప్రక్కనే కాలంగడుపుతూండేది. ఒంటిమీద స్పృహవచ్చినప్పుడల్లా రజనీ అని గట్టిగా అరచి లేచేవాడు. సంధిలో కూడా రజనీ, రజనీ, అని పలవరించేశాడు. అనేక సార్లు నన్ను పెళ్ళి చేసుకుంటావా? రజనీ, చేసుకుంటానంటే నాకు ఏమీ అక్కరలేదు అనేవాడు. అప్పుడప్పుడు నేను కుష్టు వాడిని, నన్ను అందరు అసహ్యించుకుంటారు. నువెందుకు అసహ్యించుకోవు అనేవాడు.అడపాదడపా నేను చావను రజనీ, నాకు చావాలని లేదు. నీకోసం నేనుబ్రతుకుతాను. మెలకువ వచ్చినప్పుడల్లా ఆమెతో "నీవు నన్ను విడిచి వెళ్ళకు రజనీ, మృత్యువు నుంచినన్ను మృదువుగా రక్షించుకోలేవా?" అనేవాడు.

"నేను సావిత్రిని గాను వినోద్. మనస్సులో పతివ్రతను కాను. సంఘం దృష్టిలో పతితనుఅనుకొని బయటకు మృత్యువుని మీరూహించుకుంటున్నారు. వినోద్ బాబూ అంతకంటే ఇంకేమి లేదు" అంది.

రజని నిశ్చలమైన మనోధ్యేంతో అన్ని భరించింది జ్వరంలో అతని పలవరింతలు వినినప్పుడే కళ్ళల్లో లోతుగా కన్నీరు తిరిగేది. కాని ఎప్పుడు బయటకు ఏమాత్రం కనబరిచేది కాదు, విశాలకి మాత్రం దుఃఖం ఆగేది కాదు. సాథ్యమయినంతవరకు ఆమె అక్కడనుంచి దూరంగావుండేది. రజని కూడా ఆమెను ప్రాధేయపడింది.

ఆమె నవ్వి "నాకు ఇది చిన్నతనంనుంచి అలవాటేగా విశాలా! రోగులకు సేవ చేయడమనేది నాకేమి కొత్త కాదు కదా? మామయ్యకి, ప్రసాద్ కిసేవ చెయ్యడంలో లేని దోషం ఇందులో ఏముంది? వారు నాకెంతో స్నేహపాత్రులు ఇతను కూడా ఇప్పుడంతే" అంది.

"అది కాదు రజనీ! రోగివద్ద రాత్రింబగళ్ళు అలా ఉండడము నీ ఆరోగ్యానికి మంచిది కాదు. డాక్టర్ సనల్ కూడా అదే అంటున్నారు" అంది.

"అది డాక్టర్ సనల్ చెప్పనవసరం లేదు విశాలా! కాని ఆ అపాయానికి దడిసి నా ఆత్మ ప్రబోధాన్ని పెడచెవిని పెట్టను" అంది.

విశాల దీర్ఘంగా నిట్టూర్చి "అత్యున్నతమైన నీ ఆదర్శాలకు అడ్డు రావడంకూడా అవివేకమే రజనీ! నాపొరపాటు" అందీ.

ఒకనాడు వినోద్ తన తల్లిదండ్రుల ఆచూకీ చెప్పి వారిని పిలవండన్నాడు, కలకత్తాలో ఆయన ఒక పెద్ద లాయరు. వెంటనే టెలిగ్రాం ఇచ్చారు. రెండురోజుల తరు వాత అతని ముసలితల్లిదండ్రులు వచ్చారు. పుత్రుని విషాద పరిస్థితి చూచి హృదయంబ్రద్దలయేటట్లు కన్నీరు కార్చేరు.స్పృహవచ్చిన తర్వాత అతడు కరడుకట్టిన కన్నీరంతా కార్చి వేసాడు.

"అమ్మా! మీకు నేను నా ముఖం ఇక చూపించకూడదనుకున్నాను. నాకు ఇలాంటి అసహ్యపు వ్యాధి వచ్చిందని తెలియకుండా వుంచుదామని ప్రయత్నించాను, కాని రజని బోధ నా మనస్సును మార్చి వేసింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని, మానవత్వాన్ని తిరిగి ఆమె నెలకొలిపింది. కాని అప్పటికే సమయం మించిపోయింది" అన్నాడు.

అతని తల్లి భోరున ఏడుస్తూ రజని మీద వాలిపోయింది. రజని రెండు మూడు నిమిషాలు ఆమెనలాగే కన్నీరు కార్చనిచ్చింది. ఆతర్వాత నెమ్మదిగా "అలాగే అధైర్యపడకండి. ఇంకా మనం ఇతన్ని రక్షించుకొనే అవకాశం పూర్తిగా పోలేదు" అంది.

ఆ మాటతో ఆమెలో ఎక్కడ లేని సంతోషం ఉబికి వచ్చింది. గబగబ కన్నీరు తుడుచుకొని "ఆవును, వినోద్ కి ఏ ప్రమాదం జరుగదు. తప్పకుండా మనమంతా రక్షించగలం. ఇక యిప్పటినుంచి రాత్రింబగళ్ళు నేను దైవాన్ని ప్రార్ధిస్తాను. తిరిగి అతనికి స్వస్థత చేరేవరకు" అంది.

అప్పటినుంచి ఆమె రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని దైవాన్ని ప్రార్థించసాగింది. ఎవరెంత చెప్పినా ఆమె వినలేదు. చివరకు ఆమె రోగివద్దకు కూడ వచ్చేది కాదు. శరీరంలోని శక్తులన్నీ కూడదీసి తన ఇష్ట దైవం శ్రీ రామచంద్రుడిని తన పుత్రుని యముని బారి నుండి రక్షించమని వేడుకొంది.

సనల్ శక్తి వంచన లేకుండా కృషి చేసారు. చివరకు పెదిమ విరిచాడు. నాకు చేతనయినదంతా చేసాను. రజనీ కాని ఫలితం లభించలేదు. శరీరపరిస్థితి అతి బలహీనంగా వుంది, ప్రతిఘటనా శక్తి బొత్తిగా లోపించిపోయింది. లోపలికి ఏమిచ్చినా వంటబట్టటం లేదు లోపల వ్యాధి స్వేచ్ఛావిహారం సలుపుతుది. ఇక దీనిని అడ్డగించేశక్తి ఏవంకా లేదు అన్నాడు.

రజని హృదయం లోలోన పూర్తిగా కృంగిపోయింది. దేనికోసమయితే ఆమె తన సర్వస్వము ధారపోసి కృషి చేసినదో అది నేలకూలిపోయింది. ప్రపంచమంతా ఎడారి మయమనుకొని మరణాన్ని కాంక్షించే వినోద్ కి కనుచూపు మేర వున్న ఉద్యావనాన్ని చూపించి జీవించాలనే కాంక్ష కలుగచేసింది. కాని వాటిని జేరక మునుపే కాలగర్భంలో లీనమై పోతున్నాడనే ఆమె బాధ పడింది. చివరకు అవి ఎండమావులని భ్రాంతి పడి "రజనీ! అందరిలాగే నువ్వు కూడా నన్ను మోసగిస్తున్నావా!" అని ప్రశ్నిస్తే ఆమె ఏలా సలహా ఇస్తుంది? అవి ఎండమావులు కాదని, ఎదురుచూసే పూల వనమని ఆమె ఎలా రుజువు చెయ్యగలదు?

ఉబికివచ్చే కన్నీరుని లోలోనే దిగమింగి "అతన్ని మృత్యువు కబళించి వేస్తోందని నేను విచారించడంలేదు సనల్ బాబూ!జీవితంలోని వెలుగును చూడలేదే అనిమాత్రంబాధపడుతున్నాను. ఆ పట్టుదలతోనే నేను ఇంత కాలం ప్రయత్నించాను" అన్నది.

విశాల దగ్గరే వుంది "ప్రయత్నం మాత్రంలోనే ఫలితం లభించదు. కర్తవ్యానికి ఫలితంతో ప్రమేయం లేదు, అని నీవే నాకొకసారి బోధన జేసావు. అది మరచి అబలలా విలపిస్తున్నావా రజినీ?" అంది.

"నేను విచారిస్తున్నది ఫలితం లభించలేదని కాదు విశాలా! | ప్రయత్నం పూర్తి కాలేదేననిమాత్రమే" అంది రజని.

వినోద్ తల్లి యింకా దైవ ప్రార్ధనలోనే నిమగ్నురాలయివుంది. డాక్టర్ సనల్ ఇంకో రోజుకన్న బ్రతకటం అసంభవమని చెప్పాడు. రోగికి శరీరంమీద స్పృహ అప్పుడే వస్తోంది. వచ్చినప్పుడల్లా తల్లి రూపం కనపడక పోయేసరికి నిరుత్సాహపడేవాడు.

రజని అతని తల్లి వద్దకు వెళ్ళి "అమ్మా!" అని పిలిచింది. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరచింది.

"అస్పష్టమైన ఆ దైవాన్ని మీరు ఆరాధిస్తూ మీ మనస్సుని మోసగించుకొంటున్నారు. జీవించినంత కాలమైనా మీరు వినోద్ దగ్గర వుండాలి. అది మీకు సంతృప్తి కలిగిస్తుంది. వారికి సంతృప్తి కలిగిస్తుంది. విలువైన ఈ కాలాన్ని ఇలా వృధా చేసి పిదప మీరు బాధపడతారు" అంది రజని.

"లేదు-నా బాబుని స్వామి రక్షిస్తాడు" అంది ఆమె.

ఆ మాటలు విని రజని అంత దుఃఖసమయంలో కూడా కొంచెం వ్యంగ్యంగా నవ్వి "ఆలాంటి రక్షించేవ్యక్తివుంటే ఇంతవరకు రానేరాదు, మీ ప్రార్ధన అవసరమేవుండదు. జరుగవలసినది జరుగుతుంది. మీరు వినోద్ ని కనిపెట్టి వుండాలి. అది మీపని. నాది కాదు" అంది.

అయిష్టంతోనే ఆమె వినోద్ వద్దకు వచ్చింది. జ్వరం చాలా తీవ్రంగావుంది, సంధిలో ఏదేదో మాట్లాడుతున్నాడు రజనీ? రాత్రింబవళ్ళు నిన్నారాధించినా నీఋణం తీరదు రజనీ? "అమ్మా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావమ్మా! నాన్నా, నా కోసం ఎంత తీసుకు వచ్చావు?"అని ఏవేవో మాట్లాడుతున్నాడువినోద్.తండ్రి, డాక్టరు సనల్, విశాల రామం అక్కడే వున్నారు. ఆ దృశ్యం చూచి వినోద్ తల్లి గుండెలవిసి వెక్కి వెక్కి ఏడువసాగింది. అది చూచి అందరు కంటతడి పెట్టారు. ఆశ్చర్యకరమయినదేమంటే రజని కళ్ళలో కన్నీటి చాయలే లేవు. నేత్రద్వయం జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమెను రెండు చేతులతో ఆప్యాయంగా చేరదీసి "మనస్సుని చక్కబెట్టుకోవాలమ్మా, కన్నీరు కార్చవలసిన సమయం ఇంకా రాలేదమ్మా, మీ కుమారుడు నాకు వారు భర్త సమామలు" అంది.

ఆ చివరి మాటలిని అందరు నిశ్చేష్టులయ్యేరు. రామం ముఖంలో కత్తి వేసినా నెత్తురు చుక్క లేదు.

"వారు నన్నొకసారి అడిగేరు. మనస్సులో నువ్వు నన్ను భర్తగా స్వీకరించే సహాయం నీలో వుండాలని, స్వీకరించి ఏమి చేసేవంటే నేమి చెప్పలేదు. వారి మనశ్శాంతి కోసం స్వీకరిస్తానని చెప్పేను. అంది రజని.

వినోద్ తల్లి ఏడుస్తూ నువ్వు మాపాలిటి దేవతవమ్మా నీ ప్రార్థన కూడానా శ్రీరామ చంద్రుడు, ఆలకించలేదా? అంది.

"నేను ఎప్పుడు ఎవరిని ప్రార్థించలేదమ్మా? నాకు చేతనయినదంతా నేను చేసాను" అంది.

రజని మాటల అర్ధం ఎవరు పూర్తిగా ఇంకా గ్రహించలేదు. రామం బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించి విశాల కూడా అతనిని అనుకరించింది. రామం చర చర నడచి వెళ్ళిపోతున్నాడు.

విశాల వెనుక నుంచి రామం బాబు, అని పిలిచింది. పిలుపు విని రామం ఆగి, వెనుదిరిగి చూచాడు. విశాల దగ్గరకు వచ్చి "ఎక్కడకు వెళ్ళిపోతున్నారురామం బాబు" అంది.

రామం ముఖంలో నిరుత్సాహం, నిస్పృహ, ధైర్యం తాండవిస్తున్నాయి. "ఇక ఎక్కడికయితే నేమిటి విశాల" అన్నాడు.

"తొందరపడకండి రాంబాబు" అంది విశాల

"తొందరపడి చేసినా, తొందరపడకుండా చేసినా ఫలితం ఇప్పుడు వొక్కటే విశాలా. త్వరలో డిల్లీ వదలి వెళ్ళిపోతాను" అన్నాడు రామం.

"మీరు ఏమి చెయ్యాలొ నేనేమీ చెప్పలేను. కాని కొద్దిరోజుల వరకు మీరు తొందరపడకండి. వినోద్ పరిస్థితి ఇలా వున్నప్పుడు మీరు ఏం చేసినా అసంగతంగా వుంటుంది" అంది విశాల.

హృదయాన్ని రగిల్చివేసే యీ బడబాగ్నిని త్రుంచి, నేనిక్కడ వొక్కక్షణం కూడా వుండలేను విశాలా?"అన్నాడు

"సరే ఇప్పుడు వెళ్ళండి. కాని అప్పుడప్పుడు వస్తూండండి. లేకపోతే రజని చాలా బాధపడుతుంది"అండి.

రామం సరేనని వెళ్ళిపోయాడు. విశాల తిరిగి లోపలికి వచ్చింది. అప్పటికి వినోద్‌కి తిరిగి స్పృహ వచ్చింది. ప్రక్క మీద వినొద్ తల్లిదండ్రులు కూర్చుని వున్నారు. రజని దగ్గర వున్న కుర్చీలో కూర్చుని వుంది.

వినోద్ రజనిని ఉద్దేశించి అంటున్నాడు. "మరణించిన తరువాత నాకేదైనా శక్తి సంక్రమిస్తే ఆ సర్వస్వం నీకోసం వినియోగిస్తాడు. నాకు చేతనయితే ప్రపంచానికంతకు నిన్ను రాణిని చేసి, అందరు నీ పాదాలు తాకేటట్లు చేస్తాను" అన్నాడు.

ఎంతో ప్రయత్నపూర్వకంగా శరీరంలొ మిగిలిన బలమంతావినియోగించి అనిన మాటలివి. అయినా ఆ ప్రయత్నానికే శరీరం తట్టుకోలేకపోయింది. శరీరం మీద స్పృహ మళ్లీ పోయింది. డాక్టర్ సనల్ నాడి పరీక్షించి, అతి బలహీనంగా వుంది. అంతా బయటకు వెళ్ళిపోవాలి. రోగి మాట్లాడకూడదు.

అందరు బయటికి వచ్చేసారు. డాక్టర్ ఎంత ప్రయత్నించినా తిరిగి స్పృహ రాలేదు. సుమారు తెల్లవారు జామున మూడు గంటలకు వినోద్ తోటిమానవులను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయాడు.

 

చాప్టర్ 12

వినోద్ మరణం రజనికి గొడ్డలిపెట్టులా హృదయంలో తగిలింది. పట్టుదలతో తన సర్వస్వాన్ని ధారపోసి ఏ పని సాధించాలని ప్రయత్నించిందో అది విఫలమయింది. హృదయంలో తీరని వెలితి ఏర్పడింది. మనస్సులో అశాంతి చెలరేగింది. వినోద్‌ని నిజంగా ఆమె ప్రేమించిందో లేదో చివరకు ఆమెకు కూడా తెలియదు. వినోదంటే అపరిమితమైన సానుభూతి, అంతులేని జాలి అనుగుణము ఆమె హృదయంలొ ఆమె గుర్తించగలిగింది. వినోద్‌ని రక్షించటంతన కర్తవ్యమని ఆమె భావించింది. ఆ నిశ్చయంతోనే ఆమె ముందడుగు వేసింది. సాధకబాధకాలు, అష్టకష్టాలు, పరిస్థితుల పరిణామాలు, ఆప్తులు ఆత్మీయులు ఇవన్నీ ఆమె ప్రక్కకు త్రొసివేసి, ఆమె మృత్యువుతో పోరాడింది. జీవితంలోమొదటిసారిగా ఆమె ఓటమిని అంగీకరించక తపట్లేదు. ఆనాడు రామం అకస్మాత్తుగ అలా బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఆమె గ్రహించింది. తరువాత విశాలకూడ చెప్పింది. రామం అన్న మాటలువిని రజని బాధపడింది. వినోద్ తల్లిదండ్రులను ఓదార్చే భారం ఆమెమీద పడింది. తన దుఃఖాన్ని దిగమింగి ఆమె వారిని ఓదార్చడానికి ప్రయత్నించింది. కాని అంతులేని పుత్రశోకం వారిది. ఒక్కగానొక పుత్రుడు అనేక సంవత్సరాలు పోయిన తరువాత మరణశయ్యమీద తిరిగి లభించాడు. వారి ప్రార్థనలను పెడచెవిని పెట్టి దైవం వారికి ద్రోహదం చేసాడు.

రజని వారికి కొద్దికాలంలోనే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. పండు యవ్వనంలో వున్న అపురూప సౌందర్యవతి ఆ అభాగ్యుడయిన వారి పుత్రుని యెడ కనబరచిన ఆదరాభిమానాలు, శద్ధాశక్తులు, వారి హృదయాలని కదలించి వేశాయి. మనస్సులో పలుమార్లు ఆ వృద్ధ దంపతులు ఈమె నా కోడలయితే ఎంత బావుండును అని అనుకునేవారు. చివరకు ఆ మాటలు ఆమె నోటి వెంట వినడం తటస్థించేసరికి వారికి దుఃఖము, సంతోషము రెండూ కలిగాయి. వారిద్దరు రజనిని వారితోకలకత్తా వచ్చి వారితో కలిసి జీవించమని ప్రాధేయపడ్డారు. వంటరిగా నువ్వెందుకు ఇక్కడవుండాలి తల్లీ? మాకు కావలసినంత సంపద వుంది అనుభవించే వారు లేరు. ఇక అదంతా నీదే. ముసలివారం. మమ్మల్ని కని పెట్టి వుండేవారు లేరు. భారమంతా నీవే వహించి పుత్రశోకంతో బాధపడుతున్న మమ్మల్ని కరుణించు తల్లీ?"అంది వినోదు తల్లీ.ముసలాయన కూడా "అవునమ్మా రజనీ, ఇక మాకు నీకన్న ఆప్తులెవరు లేరమ్మా ! ఇంత జరిగిన తరువాత ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామమ్మా, మా తరువాత ఏలాగయినా మా సర్వస్వము నీకే వస్తుంది. అంతవరకు కనిపెట్టి వుండే భారం కూడా నీదేనమ్మా! అన్నాడు.

సహృదయంతో, సదుద్దేశ్యంతో పలికిన మాటలవి. కాని వాటిలో అంతరార్ధం ఆమె గ్రహించకపోలేదు. రజని క్షణకాలం ఆలోచించింది. నిజంగా వారిపట్ల సానుభూతి ఆమెకు కలిగింది.

వృద్దులు పుత్రశోకంలో వున్నారు. ఎంతో ఆదరంతో ఆమెని ఆదరించారు. కాని వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తే కలిగే పరిణామాలు ఆమె వూహించగలిగింది. మనస్సులో రామం మెదిలాడు. తక్షణం ఆమె నిశ్చయానికి వచ్చింది.

"మీ ఆదరానికి కృతజ్ఞురాలిని అమ్మా! కాని అది వీలు లేదు. నేనిక్కడ వుద్యోగం చేస్తున్నాను. అది వదలి రావటానికి వీలు లేదు" అంది.

"నీకు వుద్యోగం చేయ్యవలసిన అవసరమేముందమ్మా మావద్ద కావలసిన సిరిసంపదావున్నాయి. అదంతా ఇకనుంచీ నీదే" అన్నారు,

"అదంతా నేనేం చేసుకుంటాను చెప్పండి! మీ వినోద్ జ్ఞాపకార్థం ఏదైనా ధర్మసంస్థకి యివ్వండి-నా రెక్కలతో నేను జీవిస్తాను" అంది.

"నీ చేతికి వచ్చిన తర్వాత నీ యిష్టంవచ్చినట్లు చేసుకో అమ్మా! నువ్వు మాతో వచ్చి యీ కష్టపమయంలో ఓదార్పు కలిగించవమ్మా" అన్నారు.

"ఇప్పుడు కాదండీ! తర్వాత వీలయితే వస్తాను" అంది రజని.

"కాదమ్మా! ఇప్పుడే నీఅవసరం మాకు చాలావుంది. నీవే మావద్ద లేకపోతే మేమిక జీవించలేము" అన్నారు.

రజని క్షణకాలం మౌనంవహించి, "సరేనమ్మా! ఆలాగే వస్తాను" అంది.

ఆ మరునాటి సాయంకాలం రజని రామంలాడ్జికి బయలుదేరింది. ఆమెను చూచి రామం ముఖంచిట్లించుకున్నాడు.

రజని నవ్వుతూ "కళావిహీనమైన మీ సుందరవదనం నాకు కలవర పాటు కలిగిస్తోంది రామంబాబు" అంది.

రామం కోపంతో "పర స్త్రీలు పరిహాసమాడితే నాకు పరమ అసహ్యం" అన్నాడు.

క్రూరత్వమయిన ఆ మాటలు ములుకుల్లా ఆమె హృదయంలో గుచ్చుకున్నాయి. వినోద్ పరిచయమయిన దగ్గర్నుంచీ ఆమె భరించిన భారం, అనుభవించిన బాధ, చేసిన త్యాగం అతను ఏమాత్రము గుర్తించలేకపోయాడు. అన్నాళ్ళనుంచి అణచివుంచిన అలసట వుబికి వచ్చింది. దగ్గరిలో వున్న కుర్చీలో కూలబడి నీరసంగా నవ్వి "పురుషులు పర స్త్రీలని పిలిచే వారంతా అందని ద్రాక్ష పళ్లు" అంది.

"జీవితంలో అందాన్ని మించిన అంతస్థులు కూడా వుంటాయి రజనీ! అది మరచి ప్రవర్తిస్తున్నావు, అందరు నీ సౌందర్యానికి దాసోహమవుతారనుకుంటున్నావు" అన్నాడు కోపంతో.

"ఇతరులగురించి నేనేమనుకున్నా మీ గురించి నేనలాగే అనుకుంటున్నాను రామంబాబు, అలసివచ్చాను. కాసిని మంచినీళ్లు యివ్వండి" అంది.

రామం అయిష్టంగానే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. తిరిగి వచ్చేసరికి రజని గాఢనిద్రలో వుంది. సుందరమయిన ఆమె వదనం కాస్త వాడివుంది. మూసివున్న ఆ నేత్రాలలోంచి అలసట, అశాంతి తొంగిచూస్తున్నాయి. కాని రామాన్ని భయపెట్టి వళ్ళు జలదరింపజేసినది ఇంకొక విషయం. ఆమె ముఖానికి బొట్టు లేదు. అంతకుముందు కోపముతో ఆమెకేసి సరిగా చూడలేదు. ఎప్పుడు నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఆమెకు అలవాటు, రామానికి దుర్నివార్యంగా కన్నీరు వుప్పొంగివచ్చింది. వెంటనే లోపలికి వెళ్ళిఇల్లంతా గాలించాడు. కుంకుమ ఎక్కడా దొరకలేదు. చివరకు వీధిగుమ్మానవున్న కుంకుమ తీసి రామం కన్నీరు కారుస్తూ రజని ముఖాన బొట్టు పెట్టాడు. తాకిడికి రజనిని ఉలికిపడి లేచింది. చేత్తో ముఖం తడిమి చూచుకొని కుంకుమ చూచి నవ్వుతూ "పర స్త్రీ నిద్రిస్తున్నప్పుడు బొట్టు పెట్టడము పురుష లక్షణమా?" అంది.

రామం ఇంకా కన్నీరు కారుస్తూనే వున్నాడు. "అయితే యీ రోజు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు రజనీ!" అన్నాడు.

"కొన్నాళ్ళు వైధవ్యం పాటించాలని కోరిక కలిగింది వైధవ్యపు కఠోర నియమాలు ఆచరించి వాటి విలువ తెలుసుకోవాలనిపించింది. మన సమాజం స్త్రీలకు చేసే ద్రోహం అనుభవించి, ఆకళింపు జేసుకుందామనుకున్నాను. వచ్చిన యీఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకోవాలి? ఇదొక్కటేకాదు మిగతా నియమాలను కూడా ఆచరిస్తున్నాను" అంది.

రామం రజనికి ముఖం చూపించకుండా ప్రక్కకు తిరిగి కళ్లు తుడుచుకొంటూ "రజనీ! ప్రపంచంలో నువ్వెంతోమందికి నిస్వార్థంగా సహాయం చేస్తూవుంటావు నా యెడ నువ్వింత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంటావు రజని?" అన్నాడు.

రజని నవ్వుతూ "పర స్త్రీలమీద అధికారం చెలాయించేవారిని చూస్తే నాకు పరమ విసుగు" అంది.

రామం గద్గదస్వరంతో "నన్ను జీవచ్ఛవాన్ని చేసి, ఇంకా పరిహాసమెందుకాడతావు రజనీ?" అన్నాడు.

రామం ముఖం రజనికి కనబడడం లేదు. వెనుకకు తిరిగి నిలబడివున్నాడు. రజని కుర్చీలోంచి లేచి రామానికి ఎదురుగా నిలబడి "నేను అందుకు ఇక్కడకు రాలేదు రామంబాబూ! వీడ్కోలు చెప్పటానికి వచ్చాను'' అంది.

దగ్గరలో పిడుగుపడినట్లు వులికిపడ్డాడు రామం. "వీడ్కోలా! ఏమిటి వీడ్కోలు? ఎక్కడికి వెళుతున్నావు రజనీ!" అన్నాడు.

"నానుంచి దూరంగా వుండాలనే కోరికతో మీరు ఢిల్లి వదలి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నారని విన్నాను. నా మూలంగా మీరిలా చెయ్యడం నాకిష్టం లేదు. అందుకనే నే వెళ్ళిపోతున్నాను. వినోద్ తల్లిదండ్రులతో కలసి కలకత్తా రేపే బయలుదేరి వెళుతున్నాను" అంది.

రామం హృదయం దుఖంతో నిండిపోయింది కలవరపాటు "కోపంతో నేనన్న మాటలని ఆధారం చేసుకొనినాకిలా అన్యాయం చేస్తావా రజనీ? ఇదివరకోసారి నిన్ను కాపాడుకొన్నాను. మళ్ళా యీసారి నన్నిలా ఎందు కేడిపిస్తావురజనీ" అన్నాడు.

"కష్టసమయంలో వారిని ఆదుకోవటం నా ధర్మం కాదా రామంబాబూ. ఏకైక పుత్రుడు మరణించాడు. కొన్నాళ్లు వారివద్ద వుంటే వారికి కొంత వూరటకలుగుతుంది కదా?" అంది.

"వారికి కలుగుతుంది రజనీ! కానీ ఎంత సేపూ ఇతరుల ధ్యానమే కానీ నా కష్టాలనిగురించి నువ్వెప్పుడూ ఆలోచించవు. నువ్వెంత నిర్లక్ష్యం చేసినా నీ వెంట గ్రహంలా తిరుగుతుంటానని నీకు తెలుసు" అన్నాడు.

రజని రామం కళ్ళల్లోకి మార్దవంతో చూస్తూ "కట్టుబాట్లు,క్రమబద్ధాలూ నాకు గిట్టవని మీకు తెలుసు రామంబాబు.అది తెలిసి కూడామీరు నాకు హృదయంలో చోటెందుకిచ్చారు?" అంది.

సూటి అయిన ప్రశ్న.. పొంగిపొర్లే దుఃఖాన్ని బలవంతాన అణచుకొంటూ "రాత్రింబవళ్ళు నేను పోరాడేను రజనీకి? కాని చివరకు నేను ఓడిపోయారు. ఇదంతా మొదటినుంచీ నీకు తెలుసు. అయినా నన్ను ఇలా ఎందుకడుగడుగునా అడుగుతుంటావు రజనీ?" అన్నాడు.

"మీకు కష్టం కలిగించినా ఒక మాట చెప్పక తప్పదు రామంబాబూ! కేవలం కష్టనష్టాలు, సుఖదుఃఖాలు నా జీవితానికి గీటురాయి కాదు. వాటికి వెరచి నేనేమి జీవితంలో సాధించలేను" అంది.

"అస్పష్టమైన నీ ఆశయాలకి నన్ను బలి చేస్తావారజనీ?" అన్నాడు.

"అలాంటి దుర్దినం రాకూడదనే నాఆశ రామం బాబూ! సమయానికి అందుబాటులోనే వుంటాను. కలకత్తా ఏమి పరదేశంకాదు, అవసరానికి నేను వెనుదీయనని మీకు మాట ఇస్తున్నాను. ఇక నన్ను సంతోషంతో సాగనంపండి" అంది.

"సరే రజనీ! వెళ్ళు. కాని వైధవ్యం పాటించనని నాకు మాటియ్యి. నేను ఇది సహించలేను" అన్నాడు.

"మాటిచ్చి తప్పాననే అభాండం కూడా నా మీద వెయ్య ప్రయత్నిస్తున్నారా! నాకేమి యిందులో నమ్మకం వుండి చెయ్యటం లేదు. అనుభవంకోసం,ఆత్మనిగ్రహం కోసమూ చేస్తున్నాను ఎప్పుడువిసిగితే అప్పుడే వదిలేస్తాను" అంది నవ్వుతూ.

"విచిత్రవ్యక్తిని అప్పుడప్పుడు తలచుకొంటూంటే భయంవేస్తోంటూంది రజని "మానసీకంగా నీ అంతస్థుకి అందే వ్యక్తులు ఎవరు లేరు" అన్నాడు.

"విచిత్రవ్యక్తిని కాదు రామంబాబూ వెర్రిదానిని" అంది రజని నవ్వుతూ.

 

చాప్టర్ 13

మరునాడు స్టేషన్ లో అందరు రజనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రామం, విశాల, డాక్టర్ సనల్, కమల, కమలాకరం, ప్రసాద్, చంద్రిక అందరు వచ్చారు. ప్రసాద్ క్రితం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చాడు.

న్యూఢిల్లీ ప్లాటుఫారంమీద అందరు నిలబడి వున్నారు. ప్రసాద్ రజనితో "నాకు స్టేషన్ కి వచ్చి వీడ్కోలు చెప్పడం చేతిరుమాళ్ళు వూపడం ఇలాంటి పనులంటే ఇష్టం లేదు. రజనీ, అయినా నీ విషయంలో ఇన్స్పెక్షన్ చేసేను" అన్నాడు.

"అది మీ బలహీనత. నాయెడ గౌరవ సూచనమని నేను గర్వపడను" అంది రజని.

"అది నాకు తెలుసును రజనీ, కాని నాకు ఇది గర్వ కారణమే" అన్నాడు ప్రసాదు.

కమల కమలాకరం కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లో చాలా జనసమర్థంగా వుంది. చంద్రిక, విశాల, డాక్టర్, వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుతున్నారు. రైలు ప్లాటుఫారం మీదికి వచ్చే వేళయింది.

ప్రసాదు అక్కడకు వచ్చిన వద్ద నుంచీ కమలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు, ముభావంగా ముడి మాటలు మాట్లాడి మౌనం వహించింది.

ప్రసాద్ నవ్వుతూ"కమలాకరం మా అన్యోన్యతను పదర్శించే తరుణం ఇది కాదోయి... ఇది రైల్వే ప్లాటు ఫారం?అన్నాడు.

కమల ముఖం కోపంతో ఎర్రపడింది. కమలాకరం నవ్వుతూ "అన్యోన్యతకి, ఆదర్శానికి సమయాసమములు వుండవని ప్రదర్శనకి పరిమితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయని రజని అంటుంది. కాని నేను ఒప్పుకోను" అన్నాడు.

"అయితే రజనిని మనస్సులో వుంచుకొని కమలతో కబుర్లు చెప్పుతున్నావా? కమలాకరం. కమల కది కఠిన శిక్ష" అన్నాడు ప్రసాదు.

కమల ముఖం సిగ్గుతో క్రుంగిపోయింది. ఇంతమంది ఎదుట అలాంటి పరిస్థితిలో అలాంటి మాటలు ఆమెకు రుచించలేదు. కానీ విచిత్ర విషయమేమిటంటే మామూలులాగా ఆమె కోపగించలేదు.

కమలాకరం భార్య పరిస్థితిని గమనించి నవ్వుతూ, "ఇది అన్యోన్యతని అర్థం చేసుకోలేని వారమనే మాటలు ప్రసాదు. ఈ విషయంలో రజని నీకు పాఠాలుచెప్పలేనట్లుంది" అన్నాడు.

ప్రసాదేదో సమాధానం చెప్పబోతూంటే చంద్రిక "నువ్వు పూరుకో మామయ్య, మీరు ఎప్పుడు అనవసరంగా వాదించుకుంటునే వుంటారు. రజని పిన్ని వెళ్ళిపోతుందనే దుఃఖం కూడా లేదు. మీకెవరకు" అంది.

"నన్ను కూడా వారితో జతపర్చకు చంద్రికా, ఇందాకటనుంచి నిశ్శబ్దంగా నేను నిరసన తెలియజేస్తున్నాను. అంది కమల.

రైలు ప్లాటుఫారం మీదికి నెమ్మదిగా వచ్చింది. స్టేషనంతా అల్లకల్లోలమయిపోయింది. రైలు నిలవకుండానే జనమంతా పరుగెత్తారు. కొంతమంది అతిచాకచక్యంతో లోనికి దుమికారు. జనసమర్థంలో ఒక యువకుడు రజనీని రాచుకొని వెళ్ళిపోయి "సారీ" అన్నాడు.

రజనీ నవ్వుతూ రామాని కేసి చూసింది. రామం అప్పటి వరకు రజని కేసి తదేకంగా చూస్తున్నాడు. రజని నేత్రాలు తన నేత్రాలను కలుసుకునేటప్పటికి కంగారుగా దృష్టి మరల్చాడు. అతను అంతవరకు గమనించిన దేమిటంటే రజని ముఖాన ఆనాడు కూడా బొట్టు లేదు. పైగా తెల్లటి చీర కూడా ధరించింది. సాధారణంగా రెండు జడలు వేసుకునే అలవాటు ఆమెది. కానీ ఆనాడు అతి సాధారణంగా జుట్టు సిగ చుట్టింది. కానీ ఈ విషయాలను ఇంకెవరు గుర్తించలేదు. రజనీకి తెల్లటి చీరలంటే ఆప్యాయత ఆనీ, అందరికును తెలుసును.విశాలకు తప్ప మిగతా వారికి వినోదు మరణ సమయంలో రజని అనిన మాటలు తెలియవు అందుకనే రజని రూపం ఎవరికి అనుమానం కలిగించ లేదు. విశాల చూచాయగా గ్రహించింది. కానీ రజని ఆమెతో ఏమి చెప్ప లేదు .

విశాల రజనిని కాస్త బయటకు లాగి, నెమ్మదిగా "'రజనీ' నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకు నేనేమి అనను. కాని వొక వ్యక్తి మరణంతో నీ కెక్కడా స్థానం లేదనుకోకు, అది మాఅందరికి అన్యాయం చెయ్యడమే కాదు, నీ గతాన్ని నీవు విస్మరించటం అవుతుంది."

"ఆలాంటి భయమేమి లేదు విశాలా? గతాన్ని విస్మరించాలనే కోరిక నాలో లేదు. అంతా మధురస్మృతి కాక పోవచ్చు. కాని అంతా వొక విచారఘట్టం కూడా కాదు" అంది.

రజనితో ఏకాంతంగా మాట్లాడాలనే వాంఛ రామంలో రగుల్కొనివుంది. అవకాశంలేక అభిమానంతో అశాంతితో నిలబడి వున్నాడు, సమయం మించిపోతుందనే అమిత భయం వేసి అదే సమయమని, రజని దగ్గరకు వచ్చి "మీరు చెప్పవలసిందేమి లేదా రామంబాబు" అంది. రామం అసభ్యంగా "రజనీ నేను నీతో మాట్లాడాలి" అన్నాడు. కంఠస్వరంలో స్పష్టంగా జీరవుంది. బరువైన హృదయంతో రజని తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో అనిన మాటలిని.

రజనీ నవ్వుతూ "మాట్లాడండి! రాంబాబు ఇందాకట నుంచి మీరే మౌనం వహించేరు?"అంది.

రజనీతో మాట్లాడాలనే తీక్షమైన కోరిక కలిగింది. కాని సమయానికి ఏమి మాట్లాడాలో వెంటనే స్ఫురణకు రాలేదు. రజని కేసి తీక్షణంగా చూస్తూ, "సహనం నాలో చాలా తక్కువని నీకు తెలుసు రజని, నువ్వు దానికి కఠినమయిన శిక్షకు గురిచేసావంటే ఫలితం నేనూహించ లేను"అన్నాడు.

రజని అప్యాయంగా "ఇంత వయసు వచ్చినా మీ హృదయం ఎందుకో లేత స్థితిలో వుండిపోయుంది రామంబాబూ. ఈ ప్రపంచంలో అలా జీవించేరంటే అడుగడునామీకు ఆశాభంగమే ఎదురవుతుంది. అది జరుగకుండానే దానిని గట్టి చేద్దామని ప్రయత్నిస్తున్నాను" అంది.

"నువ్వు ఏం చేసినా సహిస్తాను కాని, నాకు దూరం కావడం సహించలేను రజనీ!".

"ఇది అనర్ధానికే దారితీస్తుంది రాంబాబు' అని రజని ఏదో అనబోతూంటే రామం అడ్డువచ్చాడు. "అదిసరే రజనీనువ్వు ఉత్తరాలు వ్రాస్తూంటానని నాకు మాటయియ్యి. లేకపోతే నీ ఎడబాటు సహించలేను" అన్నాడు.

"ఎందుకు వ్రాయను రామంబాబూ! తప్పక వ్రాస్తూంటాను. కాని ప్రేమ లేఖలు నేను వ్రాయను. అవి మీరు ఆశించవద్దు, మీరు ఏమి వ్రాయాలో వ్రాయవద్దు. అజ్ఞాపించే అధికారం మీకు లేదు" అంది.

రైలు కదలబోయే సమయం ఆసన్నమైంది. రజనీ అందరివద్ద వీడ్కోలు తీసుకుంది, చంద్రిక రజనితో "క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా" అంది. అందరు ఫక్కున నవ్వారు రజని రామందగ్గరకు వచ్చి "రామం బాబూ! తిరిగి ఎప్పుడు కలుసుకుందాము?" అంది నవ్వుతూ.

రజని కలకత్తా వెళ్ళి నెలరోజులు గడిచిపోయాయి. ఒక వ్యక్తి జీవితంలో ఇది ఎంతో అల్పమది, సంవత్సరాల కొలదీ శరవేగంతో మాయమవుతుంటాయి. వెనక చూపు చూచి అప్పుడప్పుడు మనం ఆశ్చర్య పోతూంటాము. అరె ఎంత త్వరగా గడిచిపోయాయి అని అనుకుంటాము. కాని అప్పుడప్పుడు దినాలు యుగాలుగా గడుస్తూంటాయి. ఎంత ప్రయత్నించినా కాలంగడవదు. విసిగి, వేసారి మాటిమాటికి ఎదురుగా కనబడే కేలండరు కేసి చిరుకోపంతో చూస్తూంటాము, అప్పుడు గడియారపుగంటలే శ్రావ్యంగా వినబడతాయి. గజగమనంతో తిరిగే చిన్నముల్లు మనకు చిరాకు కలిగిస్తుంది. కాని ఇది గమ్యస్థానమనే సుదినపు సూర్యోదయంకోసం ఎదురు చూసేవారికే వర్తిస్తుంది. వారే ఎదురు చూస్తూవుంటారు. శూన్యమయిన భవిష్యత్తుల వారికి గమనంతో నిమిత్తం లేదు. రామం రెండవ తరగతికి చెందిన వ్యక్తి. రజని ఎప్పుడు తిరిగిస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. రజని వెళ్ళిన మరుసటి దినం నుంచి ఆమె వద్దనుంచి జాబు వస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. కలకత్తానుంచి వచ్చే ఉత్తరాలు మామూలుగా వుదయాన తొమ్మదిన్నరగంటలకి పోస్టుమెన్ఇవ్వడం అలవాటు. సరిగ్గా అదేసమయానికి రామం ఆఫీసుకి వెళ్ళవలసిన సమయం. రజని వద్దనుంచి ఉత్తరం వస్తుందనే ఆశతో ప్రతిరోజూ పోస్టుమెన్ వచ్చేవరకు ఎదురుచూస్తూ ఆఫీసుకి వెళ్లేవాడు. రెండు మూడు రోజులతర్వాత ఆఫీసులో చివాట్లు ప్రారంభమయినాయి. అయినా రోజూ ఆలస్యంగా వెళ్ళేవాడు. పోస్టుమెన్ వెళ్ళిన తరువాత అతనిని ఆవహించే నిరుత్సాహానికి, దుఃఖానికి, కోపానికి అంతులేదు. రజనికి వుత్తరం వాద్దామంటే అమె అడ్రస్ తెలియదు. ఈవిధంగా రెండు వారాలు గడిచి పోయాయి, విశాలకేమయినా కబురు తెలిసిందేమోనని ఆమె వద్దకు ఆ సాయంకాలం ప్రయాణమయ్యాడు. తీరా అక్కడకు వెళ్ళేసరికి డాక్టర్ సనల్ విశాల కలసి షికారు వెళ్ళారనీ అక్కడ వారు చెప్పారు. ఏమి చెయ్యటమా అని క్షణకాలం ఆలోచించి చివరకు వారిని వెదుకుతూ వెళ్ళాడు. దగ్గరలోనే కూర్చొని వారిద్దరు కబుర్లు చెప్పుకొంటున్నారు. రామాన్ని హఠాత్తుగాచూచి విశాల ఎందుకో చాలా సిగ్గుపడింది. ముఖం ఎర్రబడింది. అదే అతనికి ఆశ్చర్యం కలిగించింది. వారిద్దరి సంభాషణకి అంతరాయం కలిగించానేమోనని అనుమాన పడ్డాడు. డాక్టర్ సనల్ తో అట్టేఎక్కువ పరిచయం లేదు.

కంగారుపడుతూ "క్షమించు విశాలా! ఒక విషయం అడగటానికి వచ్చా" నన్నాడు.

విశాల సహజమైన మధుర స్వరంతో మందహాసం చేస్తూ "కూర్చోండి రామంబాబు. నేను చెప్పవలసినది కూడా ఇంకొక విషయం వుంది" అంది.

రామం అక్కడే కూర్చుని కొంచెం సిగ్గుపడుతూ "రజని వద్ద నుంచి ఏదైనా ఉత్తరంవచ్చిందా?" అన్నాడు.

"వెళ్ళిన వెంటనే ఉత్తరం వ్రాసింది రాంబాబు" అంది.

రామం మనస్సు చివుక్కుమంది. విశాలకీవ్రాసి తనకు వ్రాయలేదు. స్త్రీలంతా యింతేప్రేమించిన వారిని చులకన చేసి ఇతరుల ముందు చిన్న చూపు చూస్తారు.

కాంతివిహీనమైన వాని ముఖం చూసి విశాల" మీకు వ్రాయలేదా రామంబాబు'' అంది.

"వ్రాయలేదు విశాలా! వ్రాస్తే ఇక్కడకు ఎందుకు వస్తాను" అన్నాడు.

"అందుకోసమే రానవసరం లేదు రామంబాబు. నేనేమీ మీకు పరాయి దానను కాను. నన్ను చూడటానికి రావచ్చుగా?" అంది.

"పరాయిదానవని నేననటం లేదు విశాలా! కాని నాకంటే ఆప్తులని ఎవరిని అనుకొంటున్నానో వారే. నన్ను పరాయివారిగా భావిస్తున్నారు" అన్నాడు.

ఆమె అతని మాటలను అర్థం చేసుకొంది. మనస్సులో భావం గ్రహించి మందహాసం చేస్తూ "ఎవరు ఆప్తులో, ఎవరు పరాయివారో చేష్టలను బట్టి చెప్పలేము రామం బాబు. నాకిది చెప్పండి, డాక్టర్ సనల్ నాకు ఆప్తులో, లేక పరాయివారా" అంది.

తన పేరు విని ఇందాకటినుంచి మౌనం వహించిన డాక్టర్ మేల్కొని "అన్యాయం విశాలా! నా యెదుట నాకు తెలియనిభాషలో నామీద అభాండాలు వేస్తున్నావా?" అన్నాడు నవ్వుతూ.

"అభాండాలు వెయ్యటం లేదు డాక్టర్ ! మీరు నాకుఆప్తులా, పరాయివారా? అని రామం బాబుని అడుగుతున్నాను" అన్నది

"ఇప్పుడు కేవలం ఆప్తుడ్ని విశాలా! తర్వాత ఏమిటో చెప్పలే" నన్నాడు సనల్.

రామం ఆమాటలని అట్టే పట్టించుకోలేదు. మనసంతా రజనిమీద లగ్నమైవుంది. ఆ మాటలు విశాలకు లజ్జారాగరంజితని చేసాయి.

"నాతో ఒక విషయం చెపుదామనుకుంటున్నా అన్నావేమిటది విశాల?" అన్నాడు రామం.

హఠాత్తుగా విశాల ముఖం మేఘావృతమైంది. వేదనాపూరిత కంఠస్వరంతో "నా భర్తనుంచి నాకు జాబు వచ్చింది రామం బాబూ!" అంది నెమ్మదిగా.

రామం అమితాశ్చర్యంతో "నీ భర్తవద్దనుంచా ? ఏమని వ్రాసేరు? అసలు ఆయన నువ్విక్కడున్నట్లు ఎలా తెలిసింది?" అన్నాడు.

"కాశీ అడ్రసుకి వ్రాసేరు. అక్కడ వారు రజని అడ్రస్సుకి పంపించారు. అది రజనికి కలకత్తా పంపించాను. అక్కణ్నుంచి ఆమె ఇక్కడకు పంపించింది" అంది.

"అయితే అందులో ఏమని వ్రాసారు. విశాలా! అన్నాడు .

"వారి వద్దకు వచ్చి కాపురం చెయ్యాలిట. అలా చెయ్యకపోతే నన్ను కోర్టుకు యిడ్చి విడాకులిస్తారట."

రామం క్షణం మౌనంవహించి వేదనాపూరిత కంఠస్వరంతో "ఏమయినా నిశ్చయానికి వచ్చావా విశాలా?" అన్నాడు.

"వచ్చాను రామం బాబూ! ఒకప్పుడు కోర్టు కెక్కడమంటేభయపడేదాన్ని, దానికి కారణం మా నాన్నగారికి బాధకలుగుతుందని, కానీ ఇప్పుడు నాకేమి భయము లేదు. కోర్టు కెక్కుతాను. నాపై వేసే అభాండాలను నేను ప్రతిఘటిస్తాను" అంది.

"నీ నిర్ణయం క్లిష్టమైనదయినా సరియైనదనే నా ఉద్దేశం విశాలా! రజని ఉద్దేశమేవిటి?" అన్నాడు.

"నిర్ణయించవలసింది నువ్వేవిశాలా! కాని నిర్ణయించే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకో కర్తవ్యమనేది ఏనాడో మెళ్ళో మూడుముడులు వేసి, మానసికంగా త్రుంచివేసింది. భర్త యెడమాత్రమే కాదు. ఆ బంధనకన్నా విలునైన బంధనలు జీవితంలో వుండటం ఎంతో సహజం, దుర్వినియోగం చేయబడిన అధికారానికి తలవొగ్గటం ఆత్మవంచనతో సమానము" అనివ్రాసింది. డాక్టర్ సనల్ నడిగాను. నా సలహా స్వలాభంతో కూడినదయివుంటుంది విశాలా! నన్ను అడగడమే అన్యాయం అన్నాడు" అన్నది.

"నీ నిర్ణయాన్ని వారికి తెలియజేసావా విశాలా? అన్నాడు రామం.

"లేదు రామం బాబు! ఈ రాత్రేవ్రాయటానికి నిశ్చయించుకొన్నాను. మీ సలహాకూడా లభించింది. ఇక నా నిశ్చయం నిశ్చలమైనది" అంది.

రజని అడ్రస్ తీసుకొని రామం ఇంటికి తిరిగివచ్చాడు. తలుపు తెరువబడిన వెంటనే కాలికి ఏదో కాగితం తగిలింది. లైటు వేసి చూస్తే అదో ఉత్తరం దస్తూరీ చూచిన వెంటనే అది రజని ఉత్తరమని గుర్తు పట్టగలిగాడు.

వణుకుతున్న చేతులతో వుత్తరం చించి చదవటం ప్రారంభించాడు. "రామం బాబూ! కోపంలో ఉత్తరం సరిగా చదవటం మానెయ్యకండి. ఎంతో కష్టపడి ఇది వ్రాస్తున్నాను. అన్యాయంగా అమాయకమైన ఈ కాగితంపైన కక్ష తీర్చుకోకండి. అయినా మీకు కోపం రావడం ఎంత సేపు అంది. నేను ప్రపంచంతో దేనికి భయపడననే గర్వం నాలో చిన్నతనంనుంచి వుంది. దాన్ని కొంత వరకు మీరు అణచి వేసారు. మీతో కోపానికి నేను అప్పుడప్పుడు భయపడుతూంటాను. కారణమేమంటే అది కల్మషం లేని కోపం. అది అందర్ని నిరాయుధుల్ని చేస్తుంది.

ఇక్కడకు వచ్చినప్పటి నుంచి మీకు వుత్తరం వ్రాద్దామని రాత్రి పదకొండుగంటలకి కలము, కాగితము పట్టుకోని కూర్చునేదాన్ని. పరిపరివిధాల మనస్సులోని ఆలోచనలో గాని, సరిగా కలం కాగితం మీద పెట్టే సమయానికి నిద్రాదేవత - ఎంత సాహసం నన్నే ప్రతిఘటిస్తావా రాక్షసి ! అని తన శక్తినంతా వుపయోగించి నన్ను నిస్సహాయురాలను చేసేది. కలం చేత పట్టుకొనే నిద్రపోయేదాన్ని అంటే మీరు అడుగుతారు,"రజనీ! అంతదూరంనుంచి కూడా నన్ను మోసగించాలని చూస్తున్నావా!" అని అంటారు. మీకు ఉత్తరం వ్రాయడము రెండు నిమిషాలు కాదు. అలాటివి వ్రాయటము నా కిష్టము లేదు. మీలో ప్రత్యేకత వుంది. ప్రత్యేకపు వుత్తరమే మీకు వ్రాయాలి. అంత వ్యవధి నాకు నిజంగా పదకొండు గంటలదాకా చిక్కదు. కారణము చెప్పటానికి నా మనస్సులో సందిగ్ధంలో పడ్డాను. ఆయినా చెప్తాను. లేకపోతే కోపగిస్తారు. ఇక్కడికి వచ్చిన మరుసటిరోజుల్లోనూ ఒకరి తరువాత ఒకరు వృద్ధదంపతులు మంచమెక్కారు. పుత్ర శోకం వారి పునాదుల్నే కలిపి వేసింది. హృదయాలు వ్రక్కలయిపోయాయి, ఎంత సేపూ వినోద్ ని తలచుకోవడము పసి పాపలలా విలపించడము, నిద్రాహారాలు దాదాపు మానేసారు. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఎలావుంటారు? నాకు చేతనయినంత ప్రయత్నించి ఊరడించడానికి ప్రయత్నించాను. కాని ఫలితము లభించలేదు. ఇద్దరు మంచమెక్కారు. ఇక నాకు చేతినిండా పని లభించినది. నాకు రోగుల పరిచర్య చేయడమనేది పుట్టుకతో వచ్చినవిద్య. కాని ఇద్దరు వృద్ధులకు చెయ్యడమంటే నాకు కష్టంగానే వుండేది. ఒక నర్సుని కుదిర్చాను కాని ఇద్దరు కూడా ఆమెని దగ్గరకు రానీయరు. నన్ను బహురాణి అని పిలుస్తారు. మొదటిలో ఆ పిలుపు నాకేమాత్రము నచ్చేది కాదు. కాస్త కర్ణ కఠోరంగా వుండేది, కాని వారు వృద్ధులు - రోగులు, వారిని కష్ట పెట్టేకన్న అవి సహించడమే వుత్తమమనిపించింది. అయినా పిలుపులో ఏముంది చెప్పండి మీరు నన్ను రజనీ అని పిలిచినా, రాక్షసి అని పిలిచినా నేను పలుకుతాను. నిజం చెప్పాలంటే రాక్షసి అనే పేరు నాకు నచ్చుతుంది. రాక్షసి అని పిలుస్తూంటే ఎంత మృదువుగా, కోమలంగా వుంటుంది. ఇక ఇప్పటినుంచి అలాగే పిలవండి. వారికిప్పుడు కాస్త నయమైనది. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని డాక్టరు చెప్పారు. అందుకనే ఈ రాత్రిపదిగంటకే తీరుబడిగా కూర్చుని మీకు ఈ లేఖ వాస్తున్నాను. కళ్ళల్లో జ్యోతులు వెలిగించుకొని వున్నాను. ఎదురుగుండా వున్న ఆ పెద్ద ఆద్దంలో నారూపం నాకే ఆశ్చర్యం కలిగిస్తోన్నది. ఇంకా తెల్లటిచీరలు కడుతున్నాను .

విశాలమీకు చెప్పేవుంటుంది. ఆమె భర్త వుత్తరం గురించి. ఆమె ఏ నిశ్చయనికి వచ్చింది? ఆత్మాభిమానం గల స్త్రీ అయితే ఆమెకొకే ఒక మార్గం మిగిలివుంది. జీవితంలో ఆమె మొట్టమొదటిసారిగా సుఖాన్ని రుచి చూడకోరుతున్నది. ఇంతదూరంనుంచి కూడా అది నేను పసికట్టాను. ఇక్కడికి రాక మునుపే నేను ఇది ఊహించాను. ఈ తరుణములో ఇలాంటి అనర్థకంగా సంచరించడం నిజంగా ఆమె దురదృష్టమే. నిజానికి ఆమెకు అతను విడాకులిస్తేనే ఎంతో మంచిది. ఎప్పుడో ఆమే తనంతట తానే ఇచ్చి వుండవలసింది అలా చేస్తే ఆమె కేదో కష్టం కలుగుతుందని, సంఘంలో పరువు పోతుందనే అభిప్రాయంతో ఆలా బెదరించారు. కాని నిజనికి అతను ఆమెకెంతో మేలు చేస్తున్నాడు కాని నన్ను భయపెట్టేది ఒకే ఒక విషయం. విశాల మనస్సులో ఎవరికి హానికాని, కీడు కాని తలపెట్టలేదు. ఆమె హృదయమే అలా నిర్మింపబడింది. ఆవిధంగానే ఆమె ఇరుతలు కూడా వుంటారనే భ్రమ పడుతూ వుంటుంది. తన భర్త తన యెడ యెంత ప్రేమతో పశ్చాత్తాపపడి తిరిగి రమ్మన్నాడని అమె అపోహపడుతుందేమో?మీ మాటలకి విశాల విలువయిస్తుంది. మీరు కూడా చెప్పిచూడండి.

అప్పుడే నిద్రముంచుకొస్తుంది. వ్రాయవలసింది కూడా ఏమి కనబడటం లేదు. జవాబు వ్రాస్తారు కదూ? కాని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమ లేఖలు రాయకండి. నీ వుత్తరముకోసం స్వాతివానకు ఎదురు చూసే ముత్యపు చిప్పలా ఎదురు చూస్తున్నాను. నీకోసం నిద్రహారాలు మాని పరితపిస్తాను. నాలోని అణువణువు నీ నామమే వుచ్చరిస్తాయి. నా నవనాడులు నీకోసమే ఘోషిస్తాయి. అని ఈవిధంగా ఉత్తరము వ్రాయకండి. అదంతా బూటకమని నేననను . మీ నిజపరిస్థితి మీకంటే నాకెక్కువ తెలుసు. అదంతా మీరువ్రాయనక్కరలేదు, వ్రాసినా ప్రయోజనం లేదు. జీవితంలో విలువయిన వస్తువులన్నీ వుచితంగా లభిస్తాయని ఎవరో ఇంగ్లీష్ కవులన్నారు. ఆ సూత్రం ఇక్కడే వర్తిస్తుంది. విలువైన ప్రేమ ఉచితంగా లభిస్తుంది. దాని కోసం మీ ఈ ప్రేమ లేఖలు వ్రాయనవసరం లేదు."

ఆ రాక్షసి ఉత్తరం పట్టుకొని రామం అలాగే స్థబ్దుడై కూర్చునిపోయాడు. ఈ స్త్రీ హృదయంలో అనుభూతికి ఆస్కారము లేదా? యంత్రంలాగ ఎప్పుడు విరామం లేకుండా పని చేస్తుంది. జీవితంలో ఏ ఒక వ్యక్తికీ ఇతరులకోసం కష్టపడవలసిన బాధ్య లేదంటుంది. ఇది నా విథి, నా కర్తవ్యం అని ఎవరు ఏమి చెయ్యనవసరం లేదంటుంది. అయితే ఈమె ఎందుకిలా పరుల కోసం సుఖాన్ని త్యజించి కష్టపడుతూంటుంది? మనమంతా ఏదో అస్పష్టమైన కర్తవ్యం నిర్వహిస్తున్నామని పొంగిపోతూంటాము, చేష్టల రూపములో చేసేది ఛాలా తక్కువ, కాని ఈమె సంగతి వేరు. ఆమె స్వభావమే అంత. హృదయ పూర్వకముగా ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేస్తుంది.

ఆ వెంటనే కాగితము, కలము తీసుకొని జవాబు వ్రాయ ప్రారంభించాడు.

రజనీ!

రాక్షసి అని నన్ను పిలువమన్నావు.ఆ శబ్దాన్ని నాలుగైదుసార్లు బయటకు వుచ్చరించాను. మృదువుగా కోమలంగా వుంటుందన్నావు. నాఎదుట నిలబడనప్పుడు నేనెలా వుచ్చరిస్తాను. అప్పటి వరకు రజనీ అని సంబోధించనీ?

నేను వుత్తరం వ్రాయుమునుపే నువ్వు నన్ను నిస్సహాయుని చేసావు.రైలు కదలబోయే ముందు నువ్వు నాకు ప్రేమలేఖలు వ్రాయవద్దన్నప్పుడుకాస్త బాధపడ్డాను. "కాని తరువాత నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. వ్రాయదలచుకున్న దంతా వ్రాసి చివరకు ఇది ప్రేమ లేఖకాదు అని వ్రాద్దామనుకున్నాను, కాని సరిగా నేను ఏది వ్రాద్దామనుకున్నానో అదే వ్రాయవద్దని నీవుత్తరంలో శాసించేవు. ఇక నేనేం చేస్తాను. నాకోపం నిన్ను నిస్సహాయుని చేస్తందన్నావు నీవుత్తరమే నన్ను అస్తరహితుని చేసింది. ఇక ప్రతిఘటన ప్రసక్తి లేదు.

నా గురించి నాకన్న నీకే ఎక్కువ తెలుసన్నావు. ఇది పరమ సత్యమే. అగల్భమో నేను చెప్పలేను. కాని మాటలు ఆశాశ్వతంగా నీవేవ్రాసేవు. అది నిజమని నమ్ముతాను. ఆ ఆశతోనే నీకోసం నిరీక్షిస్తాను. విశాల నీసలహానే అనుసరించ నిశ్చయించింది. ఆమెవంటి వుత్తమ స్త్రీ భర్త విసర్జిత అనితలచుకుంటూంటే పురుషుడనయినందుకు నేను సిగ్గుతో, అవమానంతో దహించుకుపోతున్నాను. విశాలను చూచి యిప్పుడే తిరిగివచ్చాను. ఆమెను చూచిన కొలదీ ఆమెలోని నిశ్చలత్వము, నిష్కలంకయు నన్ను ముగ్దున్ని చేస్తున్నాయి.వ్రాయదలచుకున్నదంతా వ్రాయకుండా వుత్తరం ముగిస్తున్నాను, కాని ఒక విషయం చెప్పకుండా నన్ను నేను నిబ్బరించుకోలేకపోతున్నాను. నాస్మృతి పధంలో మిగిలింది రజనీ రూపం మాత్రమే. నేను నిన్ను చూచేవరకు నేను జీవచ్ఛవాన్నే- రామం

 

చాప్టర్ 14

విశాలకు డాక్టరు సనల్ కు గల పరిచయం దినదినాభివృద్ధి పొందింది. విశాలకు విడాకులివ్వబడ్డాయి. చట్టరీత్యా కూడా ఆమెకేమియిక బంధనాలు లేవు. బాహ్యంగా ఆమె అంగీకరించకపోయినా మానసికంగా ఆమె ఎంతో తేలికపడింది. ఇక ఆమె భవిష్యత్తు ఆమె యిష్టానుసారం దిద్దుకోవచ్చు. మాటి మాటికి, బొంబాయివైపు భయం భయంగా చూడనవసరం లేదు. ఇక భవిష్యత్ జీవితమంతా అక్కడే గడపడానికి నిశ్చయించుకుంది.రాత్రింబవళ్ళు విరామం లేకుండా ఆమె ఆ అనాధ బాలురను సహృదయుల చేసే ప్రయత్నంలో గడపసాగింది.సనల్ పరిచయమయిన దగ్గరనుంచే రహస్యంగా ఆమెలో కోరికలు తిరిగి మొలకలెత్తాయి. మొదటిలో ఆమె వాటిని అణచి వెయ్యిడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కాని ప్రకృతిని ఆమె జయించలేకపోయింది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే ఆశయంతో ఒకేచోట రాత్రింబవళ్ళు చేదోడు వాదోడుగా చాలాకాలం సంచరిస్తుంటే ప్రకృతి చూస్తూ వూరుకోదు, వారి హృదయాల్లో అనురాగపు బీజాలను నాటుతుంది. స్త్రీపురుషులకు మధ్య ఆకర్షణ సహజమైనది కాదు. అది సృష్టికే మూలకారణం అంటుంది రజని. విశాల తన హృదయ పరిస్థితిని అర్ధం చేసుకున్నప్పటి నుంచి సనల్ పట్ల కాస్త ముభావంగా సంచరించడం మొదలు పెట్టింది. ప్రతి రోజూ సాయంత్రం ఇరువురు కలసి షికారుకి వెళ్ళడం వారికి అలవాటయిపోయింది. కాని కొన్ని రోజులనుంచీ విశాల ఏదోవంక పెట్టి తప్పించుకుంటూ వచ్చింది. ఒంట్లో బాగుండటం లేదు విశ్రాంతి తీసుకుంటాననేది .

ఆరోజు సాయంకాలం సనల్ విశాల ఇంటికి వచ్చి తలుపుతట్టి తలుపు తెరచివుంది, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. విశాల వంటరిగా కూర్చుని కిటికీలో నుంచి పరధ్యానంగా బయటకు చూస్తూంది. విశాలా, అనే పిలుపు దగ్గరలో వినబడి త్రుళ్ళిపడింది.సనల్ ని చూచి వెంటనే లేచి నిలబడి కంగారుగా "మీరా?" అంది.

"అవును నేనే విశాలా, వంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు" అన్నాడు.

"విశాలా నేను డాక్టరునని మరచిపోయి మాట్లాడుతున్నావు ఏది నన్ను చూడనీయి" అని దగ్గరకు వచ్చి విశాల చెయ్యి పట్టుకున్నాడు.

విశాల శరీరం గజగజ వణికి సిగ్గుతో తలవంచుకొని "శారీరికమైనది కాదు డాక్టరు గారు మానసికమైనది" అంది.

సనల్ చెయ్యి వదలి పెట్టలేదు. "మానసికంగా నువ్వు చింతించవలసినదేముంది? అన్నీ ఆలోచించే నువ్వు నిర్ణయానికి వచ్చేవు కదా?" అన్నాడు.

"నేను దానిని గురించి మాట్లాడటం లేదు సనల్ బాబూ?" అంది మెల్లగా విశాల

సనల్ విశాల చెయ్యి విడచి పెట్టి "విశాలా ! నేను కొంతకాలం పట్టి నిన్ను వొక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను అడగమంటావా?'' అన్నాడు.

విశాల గుండె వేగం హెచ్చింది. "మెల్లగా అడగండి" అంది.

"నావలన ఏమైనా దోషం జరిగిందా విశాలా ? లేకపోతే నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అన్నాడు.

విశాల ఏమి తెలియనట్లు నటిస్తూ "ఎలా ప్రవర్తిస్తున్నాను చెప్పండి?" అంది.

"నా నుంచి ఎందుకు తప్పుకుని తిరగడానికి ప్రయత్నిస్తున్నావు అన్నాడు.

"మనస్సు బాగా వుండటం లేదు సనల్ బాబూ, అంతకంటె ఇంకేమి కారణం లేదు, నావలన ఏమైనా తప్పు జరిగితే క్షమించండి" అంది.

ఆమాట అంటూ విశాలా సనల్ నుంచి కాస్త దూరం నడచి వెళ్ళి మళ్ళీ కిటికీ వద్ద కూర్చుని "ఎంత విచిత్రంగా వుంటుంది సంధ్యా సమయం. ఇది పగలు కాదు-రాత్రి కాదు కాని రెండింటికీ ఇదేలంకె" అంది.

సనల్ వెనుక వచ్చి నిలబడి "విశాలా అలా బయటకు వెళ్ళి కూర్చుందాము రా. ప్రకృతి ఎంతో మనోహరంగా వుంది. ఇలాంటి సమయంలో లోపల కూర్చోవడం ప్రకృతికే తీరని అపచారం" అన్నాడు.

విశాల ఇక అడ్డు చెప్పలేదు. ఇద్దరు బయటకువచ్చి వారి మామూలు స్థలానికి వచ్చి కూర్చున్నారు. కొంత సేపటి వరకు ఎవరు మాట్లాడలేదు. చల్లని పిల్ల వాయువులు ఒకరి తరువాత వొకరిని రాచుకుని పోతున్నాయి. విశాల చీర చెంగు పూర్తిగా తలమీద కప్పుకుని కూర్చుంది. విశాల ప్రదర్శించే ఆ బిడియము, ముభావము సనల్ ని ఎంతో ఆశ్చర్యపరచాయి. మామూలుగా అతనికంటె ఆమే ఎక్కువగా మాట్లాడేది. అరమరిక లేకుండా స్వేచ్చగా అన్ని సంగతులు చర్చించేది. క్షణ కాలంకూడా నిశ్శబ్దంగా సమయం నడవనిచ్చేది కాదు.

"జీవితంలో వంటరితనాన్ని ముప్పై సంవత్సరాలు భరించాను విశాలా. ఇక భరించలేనేమోనని భయంగా వుంది" అన్నాడు నెమ్మదిగా సనల్

అకస్మాత్తుగా వినబడిన మాటలు విశాలను చకితను చేసాయి మందహాసం చేస్తూ "వివాహం చేసుకోండి" అంది.

"అదీ అందరు చెప్పే సలహాయే. అంతకంటే విలువయినది ఇంకేమీ నువ్వు చెప్పలేవా?" అన్నాడు.

"అంతకంటే ఇంకేముంది చెప్పండి? వివాహమనే పేరుతో నమాజం ప్రతి మానవునికి జీవనయాత్రలో చేదోడు వాదోడుగా వుండటానికి వొక సహచరుని గుర్తిస్తుంది. అది లేకపోతే ప్రయాణం చెయ్యడమే ఒక శిక్షగా పరిగణించవలసి వస్తుంది" అంది.

"జీవిత పర్యంతము వొకే వ్యక్తి, సహచర్యమే ఎందుకు లభించాలి?" అన్నాడు.

విశాలనవ్వుతూ "జీవితపర్యంతము, ప్రేమించగలమనే నమ్మకం కలిగించగలిగిన వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ఆవిధంగా నాకు నమ్మకంకలిగినా, ఆ రెండూ ఆ వ్యక్తికి కూడా కలగాలిగా? సాధారణంగా ఇది సంభవించదు. మనం ప్రేమించేవారు మనల్ని ప్రేమించరు. ఇదే హృదయవిదారకమైన విషయం" అంది.

సనల్ "కొంత మంది సహిస్తారు. మరి కొంతమంది వారికి నచ్చినవారు, ప్రేమించేవారు లేకపోతే వారితోనే సరి పెట్టుకుంటారు అంతే కాని వొకరి నొకరు సంపూర్ణంగా ప్రేమించుకొనే వారు చాలా అరుదు విశాలా, అలాంటివారిని నేను చూడలేదు, చూచేనంటే నిజానికి నేను సహించ లేను కూడా, జీవితమంతా ఇలా గడపవలసిందే విశాలా, పరిసమాప్తికి ఎదురు చూడటమే ఇక మిగిలిన గత్యంతరం" అన్నాడు.

సనల్ చాలా వుద్రిక్తుడయ్యాడు. విశాల క్షణకాలం మౌనం వహించి మృదువుగా మందహాసం చేస్తూ, "స్వానుభవంతో మాట్లాడుతున్నట్లున్నారు సనల్ బాబూ, లేకపోతే వారి బాధకళ్ళకు కట్టినట్లు ఎలా వర్ణించ గలుగుతారు" అంది.

"ఇలాంటి స్వానుభవం శత్రువులకు కూడా వద్దు విశాలా. నీ లాంటి అనుభవం కలుగకూడదనే నా ఆశ" అన్నాడు.

"కలిగిందో, లేదో నేను సరిగా చెప్ప లేను సనల్ బాబూ. వివాహానికి ముందు నేనెన్నో కలలు కన్నాను.ప్రేమించి వివాహం చేసుకోవడం నాకు శక్యంకాదని మొదటిలో గ్రహించాను. ఒకరిద్దరు వ్యక్తులు నా మనస్సుకి నచ్చినా నేను వారిని త్రోసి పుచ్చాను. సంఘనికి వెరచాను. నన్ను ప్రాణపదంగా ప్రేమించే నాన్నగారు నామంచినే కాంక్షిస్తారనే గురి, నమ్మకంతో వివాహం చేసుకోదలచారు. సరిగా వివాహానికి ముందర పిడుగులాంటి వార్త తెలిసింది. నామనసంతాఅల్లకల్లోలమయింది. వివాహమే జరగకపోతే తండ్రి హృదయంవక్కలై పోతుంది. నా కర్తవ్యమేమిటిఅనుకుని వివాహం చేసుకొన్నాను. భర్తను ప్రేమించి ప్రేమించబడి స్వర్గ సౌఖ్యం అనిభవిద్దామని కాంక్షించాను. అవి నీటిపైని అలలు రీతిగా మాయమయ్యాయి. కాని మళ్ళీ నా జీవితంలో వసంతరుతువు ప్రారంభమైందనే భ్రమకలుగుతూంది. ఇప్పుడు ఇంకొక రకమైన బాధ అనుభవిస్తున్నాను" అంది.

ఇంతకు ముందెప్పుడు విశాల తన గతాన్ని గురించి మాట్లాడలేదు. వారినోటా వీరినోటా విశాల విషాదగాధ తెలిసికున్నాడు. అతను కూడా ఎప్పుడు అడగలేదు ఈనాడు విశాల తనంతట తానే అది వెల్లడించింది. విశాలకన్నులు చమర్చాయి. ముఖం ప్రక్కకు తిప్పివేసుకుంది.

"ఋతువులు మారటం ప్రకృతి సహజం విశాలా? అందులో భ్రమపడవలసిందేముంది" అన్నాడు.

"వేనవి కాలం గతించిన తరువాత సన్నటి తుంపర పడి తడిసి, ఎండిన పుష్పాలు ఆశతో కాస్త వికసిస్తాయి. కానీ దానితో వర్షం ఆగిపోతే పుష్పం నిరాశతో నేలకూలి పోతుంది. అప్పుడు ఆమె ఆశ వొక భ్రమ కాక ఇంకేమిటి ? అంది విశాల.

సనల్ నవ్వుతూ "ఆమె అంటున్నావేమిటి విశాలా? పుష్పాలు స్త్రీజాతికి చెందినవా? అన్నాడు.

"ముమ్మాటికి స్త్రీ జాతికి చెందినవి. ఆ సౌందర్యం, ఆ కోమలత్వం, ఆ అమాయకత్వం, ఆ బలహీనత,ఆ అసహాయత ఇవన్నీ స్త్రీ జాతికే వున్నాయి-పురుషులంతా తుమ్మెదలవంటి వారు" అంది.

"స్త్రీ లక్షణలుగా అన్నీ చెప్పేవు కాని ముఖ్యమయివది మరచిపోయావు విశాలా, అది పుష్పానికి కూడా వర్తిస్తుంది" అన్నాడు

విశాలా ఆలోచిస్తూ "ఏమిటది?" అంది.

"భూదేవి మించిన సహనం మీలో వుంది. అదే లేకపోతే ప్రపంచంలో ప్రళయం తాండవిస్తుంది" అని కాసేపాగి, "ఒక విధంగా అదే అన్ని కష్టాలకు కారణం కూడాను" అన్నాడు.

"అదెలా అవుతుంది సనల్ బాబూ! సహనాన్ని మీరు ఆక్షేపిస్తున్నారు" అంది.

"ఆవును. లేకపోతే నీలాంటి స్త్రీలకు ఇంతటి అన్యాయం జరుగుతుందా? నీసహనమే కాదా నీన్నీ స్థితికి తీసుకు వచ్చింది? అన్నాడు.

"కావచ్చు కాని ఇదే వుత్తమమయినదని నా విశ్వాసం " అంది.

"ఉత్తమమయినది కావచ్చు. నేననేదేమిటంటే మీరు సహనవంతులు కాబట్టి పురుషులు మిమల్ని ఇంత సులభంగా వంచించగలరు.చరిత్రలో అణగ ద్రొక్కబడిన వారంతా విప్లవాలు లేవదీసి విజయం సాధించారు. కాని మానవకోటి సగాని కన్నా హెచ్చుగా వున్న స్త్రీలను అణగ ద్రొక్కినంత హీనంగా ఇంకెవరినీ పురుషుడు అణగ ద్రొక్కలేడు. ఇది ఆది నుంచీ వస్తూనే వుంది. కానీ, స్త్రీలు ఎప్పుడూ విప్లవం లేవదీయలేక పోయారు. కాని, మేమిటంటే మిమ్మల్ని తీయని మాటలతో మోసగించి కార్యం నెరవేర్చుకోవడం ఎంతో సులభం. పురుషుని దృష్టిలో ఒక అందమైన ఆట బొమ్మగా పరిగణించిబడితేనే మీకు సంతోషం. మీలో మీకే ఐకమత్యం లేదు. ఇక మీరు సాధించేదేమిటి?" అన్నాడు.

"మీరన్నదంతా నిజమే. స్త్రీ సహనానికి కారణం నేను వొక మాటలో చెబుతాను. స్త్రీ మాతృమూరి. కాని పెంచే కర్తవ్యం ఆమెది. దానికి సహనం ఎంతైనా అవసరం "

"ఆయితే దైవమే మీ కన్యాయం చేసాడంటావా?" అన్నాడు.

"అలా అనుకున్న వాళ్లు అనుకుంటారు. కాని మాతృత్వము శిక్ష కాదు-విలువని కట్ట లేనివారు-ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సఫలత మీకు తెలియదు'' అంది.

"తల్లివి కాకపోయినా నా కళ్ళకు కట్టినట్లు చెప్పావు విశాలా!" అన్నాడు.

విశాల ఇంత క్రితం అన్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి తలవంచుకుంది. తల్లివి కాకపోయినా అనేమాట ఆమె హృదయంలో ములుకులా గుచ్చుకుంది. కొంతసేపు వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వారు నిమగ్నులయ్యారు. సనల్ ఎంతో కాలం పట్టి తన హృదయారంభాన్నిగుర్తించాడు. ఏమైనా విశాలను తన దానిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె వంటి సహృదయతో తన భావిజీవితం సఫలమవుతుందని గుర్తించాడు. ఆమె అడ్డు చెప్పదనికూడా నమ్మకంతో వున్నాడు. కాని ఆ సంగతి ఏవిధంగా తీసుకు రావడమని ఆలోచిస్తున్నాడు, ముందర ఆమె ఇతనిని ఏవిధంగా భావిస్తోందో తెలుసుకోవాలి."విశాలా ఇలాంటి విషయాలలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. కాస్త మొరటు వాడిని. ఇందాకట నుంచీసంభాషణని ఆ ప్రక్కలకు త్రిప్పి, సరియైన సమయం చూచుకోని అడుగుదామనుకుంటున్నాను. కానీ ఫలితం లభించలేదు . ఇప్పుడు ఉపోద్ఘాతం లేకుండానే అడిగి వేస్తాను. కోపగించుకోవు గదా?" అన్నాడు.

విశాలకు ముచ్చెమటలు పోసాయి. గుండెవేగం హెచ్చింది. "చెప్పండి?" అని మాత్రంఅనగలిగింది.

"ప్రశ్నని ఏరూపంలో పెట్టాలో క్షణకాలం అతనికి బోధపడలేదు. చివరకు "నువ్వు నన్ను ఏవిధంగా భావిస్తున్నావు విశాలా? నీ హృదయంలో నాకేమైనా స్థానంవుందా" అన్నాడు.

ఈ విధంగా ఏదో నవలలో, ఎవరో కధానాయకుడు అడిగినట్లు గుర్తు , విశాల ఏ ప్రశ్నకయితే ఇన్నాళ్పు భయపడుతూ వచ్చిందో అది ఎదురయింది. సమాధానం కోసం ఆమె హృదయంలో వెదకలేదు. అది ఆమె అణువు అణువు తెలుసును, కాని ఏలా చెప్పడమా అనే ఆమె ఆలోచింది.

"మీరు పెద్దవారు, లోకానుభవం కలవారు. పురుషులు, మీరింకా సంశయంలో వున్నారా? వర్షపు నాటి రాత్రి మీ ప్రశ్నకు సమాథానం నాకు లభించింది" అంది. అతను సంతోషంతో "విశాలా! నువ్వు నా దానివి" అని ఏదో అనబోతుంటే హఠాత్తుగా బలమయిన పెనుగాలివచ్చి ఆమె తల మీద కప్పుకున్న చీర చెంగును తీసి వేసింది. ఆమె వెనుక వేపు మెడ భాగంపై హఠాత్తుగా దృష్టి పడింది. క్షణకాలం అతను స్తంభించి చేతనారహితుడయిపోయాడు గుండె ఆగి. విశాల ఆది చూచి అపార్థం చేసుకుంది. తన మాటలు అతనికి నచ్చలేదేమో! తొందర పడి తన హృదయం బయట పడెనేమోనని బాధపడింది. ఏదయితే వసంతఋతువని ఆశ పడిందో అది నిజానికి వేసవి కాలమాత్రమని ఆమె ఆపోహపడింది.

చివాలున లేచి "క్షమించండి సనల్ బాబు! నావల్లనే పొరపాటు జరిగింది. తొందరపడ్డాను" అంది బాధపడుతూ.

సనల్ కి అప్పటికి తెలిసివచ్చింది. విశాల చెయ్యి పట్టుకొని తనవద్దకు ఉద్రేకంగా లాగుకొని "నీకోసం నే నేమైనా చేస్తాను విశాలా! మృత్యువును కూడా ఎదిరిస్తాను. భూమ్యాకాశాలు ఏకమైనా నేను నిన్ను వివాహం చేసుకుంటాను." అన్నాడు పుద్రేకంతో.ఆతని తీరు, ముఖకవళికలు ఆమెను నిజంగా భయపెట్టినవి. అతని హృదయాన్ని రగిల్చి వేస్తున్న ఘోరమైన ఆవేదన ఆమె చూచాయగా కూడా గ్రహించలేక పోయింది.

అప్పటికి మసక చీకటి. నెమ్మది నెమ్మదిగా వెలుతురును శూన్యంలోకి తరిమివేసి, భూమినంతా ఆక్రమిస్తోంది. ఆమె కంగారుపడుతూ "ఇదేమిటి సనల్ బాబు! వదలండి, నాకు భయం వేస్తుంది చీకటిపడింది. పోదాంపదండి" అంది.

కానీ అతను ఇవన్నీ వినే పరిస్థితిలో లేదు. " విశాల రేపే మన వివాహం జరిగితీరాలి" అన్నాడు

ఆమె సిగ్గుపడుతూ "అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. వివాహం అంత సులభమైన పనా? ఇంతనంత పనయింది. అక్కడ తెల్లటి పెద్ద మచ్చ కనపడినది సుశిక్షితుడయిన సనల్ కి దాని అర్ధం క్షణంలోనే తెలిసింది. ఎంతో మంది శరీరాలపై ఆదిచూచి గుర్తుపడుతూంటారు. అదే తనవృత్తి. అందులో ఆరి తేరిన చెయ్యి అతనిది.

విశాల సనల్ పరిస్థితిని చూచి కంగారుపడింది. మాట మంతీ లేని అతని వైఖరిని చూచి కంగారుపడుతూ "ఏమిటలా చూస్తున్నారు" అని సిగ్గుపడి తిరిగి చీర చెంగు తల పైకి లాక్కొంది.

సనల్ క్షణకాలంమాత్రమే తన కర్తవ్యంమరచి ఆలోచించాడు. ఆలశ్యం చెయ్యకుండా విశాల చెయ్యి తన చెయ్యిలోకి తీసుకుని, "విశాలా నన్ను వివాహం చేసుకోగలవా? అన్నాడు. అతను ఆలోచించి ఆ క్షణంలోనే నూతనత్వానికి, ఔన్నత్యానికి మానవహృదయంలో తీవ్రమైన సంఘర్షణ జరిగింది. అతని హృదయంలో జరిగిన ఆ సంగ్రామంలో ఔన్నత్యానికి విజయంలభించింది.

విశాల గబుక్కున చెయ్విలాగుకొని "యిది మీరు అడుగవలసిన ప్రశ్న కాదు నేను ఆడగవలసినది ససల్ బాబు"అని సంతోషంతో ముఖం పైకెత్తి సనల్ కళ్ళల్లోకి చూచినది వాటిల్లో ఆమె ఊహించంది, ఆశించినది ఏకోశానా లేదు. హఠాత్తుగా వాటిల్లోంచి సంతోషం పూర్తిగా మాయమయింది దైన్నత్తం, జాలీ, ఆవేదన, ఆతృత అలసట కనపడ్డాయి. శూన్యంలోకి వేదపూరిత నేత్రాలతో వెఱ్ఱిగా చూస్తున్నాడు. త్వరగా నేను వివాహం చేసుకొంటే ప్రజలేమనుకుంటారు" అంది.

"విశాలా? ఇతరులతో మనకు నిమిత్తం లేదు. జరిగితీరవలసిందే ఇక నేను ఒక క్షణంకూడా ఆగలేను" అన్నాడు.

"రజని రాకుండా వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా నాన్నగారు పోయిన తర్వాత ప్రపంచంలో నాకు మిగిలిన బంధువు ఆమె ఒక్కతే. ఆమెను మించిన ఆప్తులు నాకు లేరు" అంది.

"రజని శారీరకంగా ఇక్కడ లేకపోయినా ఆమె మనకు మార్గదర్శకురాలు, ఈనాటి రాత్రి ఆమె మనకు సమ్మతిని ఇచ్చినది. కాని అప్పుడు ఆమె హెచ్చరించింది. "దొరికినంత మాత్రన సంబరపడకండి. దాన్ని మానవులనుంచి, దైవాన్నుంచి పోరాడి భద్రంగా కాపాడుకోవాలంది". మానవుల నుంచి కాపాడుకున్నాను,ఇకదైవం, అదికూడా చూస్తా" నన్నాడు.

"ఈరోజు మీరు చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు. మీ మనస్సు అశాంతితో వుంది. విశ్రాంతి తీసుకోండి" అంది.

"ఇక నాకు విశ్రాంతి లేదు విశాల! మన వివాహము వెంటనే జరగాలి. రేపు కాకపోతే ఎల్లుండెనా జరగాలి నేను అందుకు కావలసిన సన్నాహాలన్నీ చేస్తాను".

ఆమె నిట్టూర్చి "అయితే అలాగే కానీండి. ఈనాటి నుంచి నా భారమంతా మీదే" అంది.

ఆ రాత్రి సనల్ కంటికి నిద్ర లేకుండా కాలం గడిపాడు. అలాంటి భయంకరమైన పరిణామం సంభవిస్తుందని కలలో కూడా అతను అనుకోలేదు దేనినయితే జయించటానికి తన జీవితాన్నంతా వ్యయం జేసి పాటు పడుతున్నాడో, ఆదే తన ప్రాణప్రదంగా ప్రేమించే వస్తువును కబళించి, పగ సాధించటానికి ప్రయత్నిస్తూంది. దైవంకూడ దాని ప్రయత్నానికి తోడ్పడుతాడా? ఈ ప్రశ్న మాటి మాటికి అతని హృదయంలో మారు మ్రోగింది. వినోద్ ని రక్షించటానికి రజని సలిపిన పోరాటం విఫలమైంది. లేదు, అలా జరుగదు. రెండింటికి ఎంతో తేడా వుంది. నేను సనల్ ని కాదు. డాక్టరుని ఇందులో ఎంతో అనుభవముంది. ఇది చాలప్రధమదశలోనే గుర్తుపట్టాను. ఇలాంటి వారినీ ఎంతోమందిని స్వయంగా నయం చేసాను. ఇప్పటి నుంచి చికిత్స ప్రారంభిస్తే ఇంకొక రెండు నెలలలో పూర్తిగా నయమవుతుంది. సందేహం లేదు. ఈ విషయంవిశాలకు చూచాయగా తెలిసిన ఆమె వివాహనికి ఎంత మాత్రము సమ్మతించదు, వివాహము జరిగిన వెంటనే ఆమెకి ఈ విషయం తెలియపర్చాలి కాని ఆమెకు ఏ విధంగా ఈ వార్తను తెలియజేయటము? ఆమె ఎలా భరిస్తుంది! మోసగించానని నిందిస్తుందా? ఇలా మభ్య పెట్టావని కన్నీరు కారుస్తుందా? ధైర్యాన్నీ కోల్పోయి బేలయై విలపిస్తుందా? ఆలశ్యము చేయకూడదు. వెంటనే వివాహం జరగాలి. జరిగిన వెంటనే ఇది ఆమెకు తెలియ జేసి చికిత్స ప్రారంభించాలి, చికిత్స ప్రారంభించడం ఒక రోజు ఆలస్యం చేస్తే చికిత్స పూర్తి అయి ఆమె స్వస్తతకు రావడంకూడ రెండు రోజులు ఆలస్యమవుతుంది. తన శక్తినంతా వుపయోగించి ఆమెను దక్కించుకొంటా. దైవం నన్ను పరీక్షించటానికే నన్నీ అగ్ని పరీక్షకు గురి చేసాడని, ఇందులో ఏమాత్రం తడబడకూడదు."

 

చాప్టర్ 15

రెండు రోజుల తర్వాత సనల్ విశాలల వివాహమైంది. రామం, ప్రసాద్, చంద్రిక, కమల, కమలాకరం మాత్రమే ఈ వివాహానికి హాజరైనారు. అందరినీ ఆశ్చర్యపరచినది ఏమిటంటే సనల్ ముఖంలో ప్రేమించి వివాహం చేసుకునే సమయంలో కనబడే సంతోషం ఏమాత్రం కనబడలేదు. విశాలకి అతని కంటతడికూడ సన్నగా కనబడింది. అది చూచి ఆమె ఎంతో బాధపడింది. అతని ప్రవర్తనకు కారణమేమి? ఆమెకు ఎంత ఆలోచించిన అర్థంకాలేదు. రెండవసారి వివాహం చేసుకుంటూంది ఇది ఎలాగు పరిణమిస్తూంది? సనల్ ఏదో భయంకరమైన ఆవేదనకు గురి అవుతున్నాడని మాత్రం ఆమె గ్రహించగలిగింది గానీ, అది ఎలాంటిదో ఎంత ఆలోచించినా ఆమెకు స్ఫురించలేదు. ఆనాడే సనల్ ని అడిగి తెలుసుకోవాలని నిశ్చయించింది. సిగ్గుని విడిచి, తనంతట తానే అడుగుతుంది తప్పేముంది? భార్యా, భర్తవద్ద యీ మాత్రం చనువు తీసుకుంటే దోష మేముంది. అదే లేకపోతే అన్యోన్యతకు ఆస్కారమేముంది. సనల్ కు తన పై వున్నప్రేమానురాగాలకు ఆమె శంకించలేదు. ఆవిధంగా ఆమె హృదయాన్ని అనుమానించడానికి కూడ ఆస్కారం లేదు. హృదయమంతా సనల్ పై వర్ణించరాని అనురాగంలో నిండి పొంగి పొర్లాడ్డానికి ప్రయత్నిస్తూంది. ఇక ఆ ప్రవాహాన్ని ఆపే శక్తి ఆమెకు కూడా లేదు. ఇక ఆనాటి నుంచి దానిని అడ్డగించే అవసరం లేదు. గట్టున తెచ్చుకుని వారిద్దరి జీవితంలోని సర్వస్వాన్నిప్రేమామృతం ముంచి వేస్తూంది. జీవితమంతా, పండు వెన్నెలలో నిండిన వసంతఋతువుగా గడచిపోతూంది సనల్ వంటి సత్పురుషుడు, సహృదయుడు, స్వారత్యాగి తనకు జీవన సహచరుడు" లభించడం తనకు అదృష్టం.

ఆనాడే విశాల తన చిన్న యిల్లు వదలి సనల్ యింటికి ఇంటి ఇల్లాలుగా వచ్చింది. శూన్యమైన ఆయిల్లు, సుఖమయంతో స్వర్గతుల్యం చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఆమె అడుగుపెట్టింది. అనాడు సాయంకాలం సనల్ అక్కడ వున్న రోగులందరికీ ఒక చిన్న పార్టీ యిచ్చేడు. వారు కాక, రామం, ప్రసాద్. కమల,కమలాకరం, చంద్రికవచ్చేరు. మిగతావారెవరిని అతను పిలువలేదు. అందరూ నూతన దంపతులని హృదయపూర్వకంగా ఆహ్వానించేరు. రోగులకది ప్రత్యేకమైన, శుభకరమైన పర్యవసానంగా పరిగణించింది. విశాల, సనల్ వీద్దరి రూపాలు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోతాయి. వివాహ బంధనతోనే వీరు కంకణం కట్టుకోడంకన్న వారు వాంఛించేది ఏముంది. పిల్లలందరికి ఆరోజు పర్వదినం.

ఆరోజు రాత్రి వాన జోరుగా కురుస్తూంది. యడ తెరిపిలేని వాన, రివ్వున వీచిన చలిగాలి, నిశ్శబ్దాన్ని చీల్చే వురుములు, ప్రకృతిని బీభత్సంగా తయారు చేశాయి. విశాల తన గదిలో వంటరిగా కూర్చుని కిటికీలోంచి పరధ్యాన్నంగా చూస్తూంది. వాన జల్లుకి ముఖము, చీర కూడా బాగా తడిసిపోయినాయి. అయినా ఆమె అక్కడే అలాగే కూర్చునివుంది. వివాహమై మొదటి రాత్రి అది. అయినా ఆమెలో ఏదో ఒక విధమైన, వుదాసీనత్వం, జడత్వం ప్రవేశించేయి, ఏవేవో ఆలోచనలు ఆమె మెదడులో సాగుతున్నాయి. వాతావరణం అపశకునాన్ని సూచిస్తున్నాయి.

వెనుక నుంచి నెమ్మదిగా సనల్ వచ్చి వులెస్ శాలువ ఆమె బాహువులూ చుట్టూ కప్పి, విశాల యీలాగు కూర్చున్నావేమిటి! అన్నాడు. వెంటనే చేతికి తడికూడాతగిలింది. ఆరే ఇది ఏమిటివిశాల ఒళ్ళంతా తడిసిపోయింది.ఆరోగ్యాన్ని ఇక నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు.

"సన్నని వానజల్లు ముఖానికి చల్లగా తగులుతుంటే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది" అంది ముఖం చీర చెంగుతో తుడుచుకుంటూ విశాల.

"తడిగుడ్డతో తడి ముఖాన్ని తుడుచుకుంటే కూడ ఆహ్లాదంగా వుంటుందా విశాల" అన్నాడు సనల్.

విశాలకూడ నవ్వుతూ బట్టలు మార్చుకొని రావటానికి వెళ్ళింది. ఒంటరిగా కూర్చుని సనల్ ఆలోచించ మొదలుపెట్టాడు. విశాలకు భయంకరమైన ఆ వార్త తెలియ చేయడము ఎలాగ? యీ శుభసమయంలో యీ విషాదవార్త తెలియచెయ్యవలసిన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చడం? అయినా ఏమైనా యీ రాత్రే వార్తని ఆమెకు తెలియచేసి, రేపటి నుండి చికిత్స ప్రారంభించాలి. ఆలోచనలో నిమగ్నుడై సనల్ పరధ్యాన్నంగా వున్నారు. విశాల కంఠస్వరం వినపడి వులికిపడి, అటుతిరిగి చూశాడు. విశాలమయిన కురులని విరబోసుకుని పసుప్పచ్చటి చీర కట్టుకొని విశాల ఎదురుగా నిలబడి వుంది. సనల్క్షణకాలం అప్రతిభుడై రెప్ప వాల్చకుండా ఆపాదమస్తకము ఆమెను చూస్తున్నాడు, విశాల ముఖం సిగ్గుతో సిందూరమయింది.

"ఏమిటి చూస్తున్నారు? చివరకు నన్ను కూడా మీరు గుర్తుపట్టే స్థితిలో లేరా?" అంది విశాల.

"కాదు విశాల విశ్వమంతా వెదికినా నీసాటికి రాని, నీ వంటి స్త్రీని అర్ధాంగిని అయిందనేది నమ్మలేక పోతున్నాను. నిక్కచ్చిగా ఇది స్వప్నం మాత్రమే విశాలా?" అన్నాడు.

"పురుషులంతా ఇలాగే మాట్లాడతారు. పొగడ్తలతో మమ్మల్ని కవ్వించి మోసం చేస్తారు" అంది.

హఠాత్తుగా సనల్ దృష్టి విశాల మెడమీద తెల్లటి ఆమచ్చపై పడింది. ఒకసారి అతని శరీరం జలదరించింది. ఇక ఆలస్యం చెయ్యకూడదనే నిశ్చయంతో,"విశాల నీతో ఒక విషయం చెప్పే ముందు కోపగించను, నా మీద విశ్వాసం వుంచుతానని మాట యియ్యాలి" అన్నాడు.

విశాల ముఖం, క్షణకాలంలో మేఘావృతమైంది. "దేనిని అడుగుదామనుకుంటున్నారు. సనల్ బాబూ, కోపగించనని మీమీద విశ్వాసం వుంచుతానని మాటిస్తాను" అంది.

"కష్టాలు నీకేమి కొత్త కాదు విశాలా. ఈనాడు కూడా నీకు ఒకటి ఎదురయింది. ముఖ్యమైన తేడా ఒకటి వుంది. ఈనాటి నుంచి వాటిల్లో భాగస్వామి యింకొకరున్నారు" అన్నాడు.

విశాల సమాధానమేమి చెప్పలేదు. సనల్ మాటల కోసం ఊపిరిబిగించి ఎదురుచూస్తూంది. ఎంత ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకలేదు.

"ఏ శత్రువునయితే మనం రాత్రింబగళ్ళు రూపు మాపటానికి నిర్విరామంగా కృషి చేస్తున్నామో ఆ శత్రువు నీలో కూడా ప్రవేశించింది. విశాలా" అన్నాడు.

ఆమెకు క్షణకాలంవరకు ఆ మాటల పూర్తిఅర్థం బోధపడలేదు. కానీ అందులో అపార్ధానికి ఆస్కారం లేదు. గొడ్డలి పెట్టులాంటి ఆ దెబ్బకు ఆమె నవనాడులు కుంగిపోయినాయి. ముఖాన కత్తి వేటుకు నేతురు చుక్క లేదు. భయవిహ్వల అయిపోయింది. స్పృహ తప్పుతుందేమోనని భయపడింది. కాని శరీర శక్తులన్నీ కూడ దీసుకొని "ఇది మీరు ఎప్పుడు కనుక్కున్నారు?" అంది.

"వివాహము చేసుకోమని నిన్ను నేనడిగేముందు" అన్నాడు.

"తెలిసివుండి మీరిలా ఎందుకు చేసారు'' అంది.

"ఇది నా కర్తవ్యంకాదా విశాలా? నీకు వివాహానికి ముందు టైఫాయిడ్ జ్వరంవస్తే నేనేమి చేస్తానో ఇప్పుడు అదే చేస్తాను. అందరికి నువ్వు ఇదే బోధించావు, కాని నా విషయంలో అన్యాయం జేస్తావా?" అన్నాడు.

సమాధానం చెప్పలేదు.

"ఎలా గుర్తుపట్టారు?" అంది విశాల.

"మెడ మీద తెల్లటి మచ్చ కనబడింది. దాని అర్ధం నీకు తెలుసు. చాలా ఎంగ్ స్టేజీలో వుందన్న మాట. రెండు నెలలలో పూర్తిగా నయమవుతుంది. ఇలాంటి కేసులన్నీఇలాగే నయమయ్యాయి. నేను నీనుంచి అర్ధించేది పూర్తి సహకారం విశాలా? దానితో నేను నిన్ను అతి త్వరలో స్వస్థతకి తీసుకువస్తాను. రేపటి నుంచే చికిత్స ప్రారంభిస్తాను. విజయం మనదే విశాలా?" అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. భావనారహికంగా మౌనంవహించి కూర్చుంది.

మరుసటిదినం నుంచి ఆమెకు చికిత్స ప్రారంభించాడు. కేవలం వ్యాధికి చేయవలసిన చికిత్స బహు స్వల్పమయినది. ఆమెకు కూడా తమను పీడిస్తున్న వ్యాధిసోకిందని తెలిసి రోగులంతా ఎంతో దుఃఖించారు. వివాహమైన మరునాడే ఆవిధంగా జరగటం మరింత శోక హేతువైంది, పరామర్శించి సానుభూతి చెప్పటానికి కూడా వారికి ధైర్యం చాలలేదు.

సనల్ ఇక అప్పటిలో రాత్రింబగళ్ళు ఆమెవద్ద గడుపుతున్నాడు. బలమైన ఆహారం, టానిక్కులు వేళతప్పకుండా యిస్తూ దగ్గర కూర్చునేవాడు. ఇతర రోగులయెడ తన కర్తవ్యాన్ని పూర్తిగా మరచిపోయాడు.

"ఈ ప్రపంచానికి నువ్వొక స్త్రీవి మాత్రమే విశాల కాని, నువ్వే నాకు ప్రపంచానివి. ఇక నాకు ఇంకేమి లేదు" అన్నాడు.

"విచక్షణజ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు సనల్ బాబూ! మీలాంటిస్వార్థత్యాగులు అనవలసిన మాటలు కావు" అంది విశాలా!

"లేదు విశాలా! నేనెప్పుడు స్వార్ధ త్యాగినని చెప్పలేదు నేను స్వార్థ త్యాగినని నువ్వొక సారంటే రజని కాదంది, నేను ఆమెతో అంగీకరించాను. పరుల సేవ నాకు మానసిక తృప్తి నివ్వగలిగింది. కాబట్టి ఆవిధంగా చేసేవాడిని అన్నాను, కాని ఇప్పుడు నీవద్దనుంటేనే నాకు అంతకన్న ఎక్కువ సుఖము, మనశ్శాంతి లభిస్తున్నాయి. అందుకని నేను దాన్ని వదలుకుంటాను. రజని అన్నదే నిజం. స్వార్థ త్యాగమనేది మానవ మనస్తత్వంలో లేదు" అన్నాడు.

"ఎంతోమంది అనాధులు, రోగులు మీ మీద ఆధారపడి వున్నారు. ఒక స్త్రీకోసం మీరు వారందరికి అన్యాయం చెయ్యటం చాలా అధర్మం. నా మనశ్శాంతికి విలువ యిచ్చి నట్లయితే ఇలాంటిపని చెయ్యకండి" అంది.

అతను వేదనతో "ఆలాగనకు, నీ మనశ్శాంతి నాకు చాలా అవసరం. నువ్వు త్వరలో స్వస్థత కావాలంటే అది చాలా అవసరం. కాని నిన్ను విడిచి క్షణకాలమైనా వుండలేను. నాశక్తికిమించిన పని. నా వద్ద మంచి ఆశించి నన్ను కష్టపెట్టకు. ఇప్పటికి నేను భరించగలిగినదంతా భరిస్తున్నాను, ఇక దీనినికూడనా వద్దనుంచి ఆశించకు" అన్నాడు.

ఆతని వేదనాపూరితమైనవాక్యాలుఆమె గుండెలలో దూసుకొనిపోయాయి. కళ్ళల్లో నీరు తిరిగింది , ఈ వుచ్చులోంచి బయటపడే మార్గమేమిటి? ఆ అనాధ బాలలను ఎవరు కనిపెట్టివుంటారు? ఈ రోగులను ఎవరు చూస్తారు? గడచిన పదిహేను రోజులలోను అంతా అల్లకల్లోలమై పోయింది. రోగులకు సరిగా వైద్యం లేదు. పిల్లలు విచ్చలవిడిగా చదువు లేకుండా తిరుగుతున్నారు. ఈవిథంగా ఇంకా కొంత కాలం గడచిందంటే ఆమె అప్పటివరకు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఏం చెయ్యడం! ఆ సమస్యకు పరిష్కార మేమిటి?

సనల్ అమెరికా నుంచి ఈ వ్యాధి చికిత్సతో ప్రపంచ విఖ్యాతయైన తన పాత స్నేహితుడు డాక్టరు హెన్రీని ప్రత్యేకంగా పిలిపించాడు. ఆయన వచ్చి విశాలను పరీక్ష చేయబోయాడు, ఆమెకి మొదట అది చెప్పలేదు. చివరి సమయములో చెప్పాడు. ఆమె చాలా బాధపడింది. ఆమె అంగీకరించలేదు, "అందరకులేని యీ ప్రత్యేకత నాకక్కర్లేదు సనల్ బాబూ! ఈ అన్యాయాన్ని నేను సహించలేను" అంది.

"భర్తనయిన తర్వాత నేను నా భార్యకు ఉత్తమమైనచికిత్స చేయించుకోడం అన్యాయమా? పైగా వినే వుంటావు. డాక్టర్లు తమ ప్రాణప్రదంగా జీవించేవారికి చికిత్స చేయవలసివచ్చినప్పుడు వానిని వారే నమ్మలేరు. ఇతర డాక్టర్ల చేత చికిత్స చేయిస్తారు" అన్నాడు.

"అందుకు ఇండియా దేశం కరువైపోయిందో చెప్పండి." అన్నది."లాభం లేదు డాక్టరుగారు.. స్త్రీ మమతలోపడి మీరు మీ కర్తవ్యాన్ని మరచిపోయారు" అని దీర్ఘంగా నిట్టూర్పు విడచింది.

ఆమె మాటలు సనల్ ని కాస్త బాధపెట్టేయి. ఆమె చెయ్యిని హృదయంవద్ద పెట్టుకొని "ఇవన్నీ ప్రాపంచిక విషయాల విశాలా! వీటినన్నిటినిమించి నీ విగ్రహమే విశాల రూపం. ఆమెను మించిన కర్తవ్యంకాని, దైవం కానీ నాకు లేదు" అన్నాడు.

ఆమె కళ్ళల్లో నీరుతిరిగింది,ప్రక్కకు ముఖం తిప్పుకొని కళ్ళు మూసుకుంది. క్షణకాలం తర్వాత కనుకొలుకుల్లో రెండు నీటిబిందువులు ఏర్పడ్డాయి. అతను ఆమె సమాధానం కోసం ఎదురుచూచి మౌనంవహించటంతో అక్కడ నుంచి లేచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసరికి ఎదురుగుండా రామం, చంద్రిక, ప్రసాద్ కనబడ్డారు.

"డాక్టర్ ! ఇప్పుడే వార్త విన్నాము. మీరు మాటమాత్రమైనా కబురు చెయ్యలేదే?" అన్నాడు.

"విశాలతో జరిగిన సంభాషణ వల్ల అతని మనసంతా అశాంతిగావుంది. "ఏదేమైనా అంత శుభవార్త? ప్రపంచమంతాచాటుకోవటానికి రామంబాబూ!" అన్నాడునీరస కంఠస్వరంతో

ఆతని రూపం కంఠస్వరం మాటలు అందరిని ఎంతో ఆశ్చర్యపరచాయి.

"విశాల లోపల లేదా డాక్టర్ బాబూ?" అంది.

"ఉంది. కానీ నిద్రపోతోందనుకుంటాను" అన్నాడు సనల్.

విశాల ఈమాటలన్నీ వింటునేవుంది. "చంద్రికా! లోపలకు రండి" అంది. లేచి కూర్చునిప్రసాద్ ని, రామాన్ని చూచి "విచిత్రంగావుందే. మీ ముగ్గురు ఎక్కడ కలిసారు? ఇక్కడికి ఎలావచ్చారు?" అంది.

"ఏముంది విశాలా! రామానికి నా కారు క్రింద పడబోవడం అలవాటయిపోయింది. ఢిల్లీలో మొదటిసారి ఆవిధంగానే కలుసుకున్నాము. అప్పుడు రజని నా ప్రక్కన వుంది. ఈసారి కూడా ఆలాగే జరిగింది. కాని ఈ సారి చంద్రిక నా ప్రక్కన వుంది. రజని కలకత్తాలో వృద్ధదంపతుల సేవలో నిమగ్నురాలై వుంది అభాగ్యురాలు" అన్నాడు ప్రసాద్.

అసభ్యమైన ఆ మాటలు, ఆ నవ్వు ఆందరిని సిగ్గుపరచాయి. చంద్రిక అదిగమనించి"మామయ్య మాటల తీరు మీకు తెలియనిది కాదు విశాలా!మీ జబ్బు వార్త విని నేను ఎంత దుఃఖిస్తున్నాననో మాటలలో చెప్పేదానికి గాను నాకు సిగ్గు వేస్తోంది. క్రియారూపేణమీకు నేనేమైనా చెయ్యగలిగితే చెప్పండి సంతోషంతో చేస్తాను" అంది.

బరువైన హృదయంతో బాధపడుతున్న ఆమె హృదయాన్ని చంద్రిక మాటలు ఎంతో తేలికపరిచాయి.

"స్వచ్చమయిన మాటలు నా కెంతో ఓదార్పు కలిగిస్తున్నాయి చంద్రికా! నిన్నడగటానికి నాకెందుకో సందేహము కలగడం లేడు, ఇక్కడ చాలామంది అనాధపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారిని చూసేదిక్కు లేదు. నువ్వేమైనా సహాయం చెయ్యగలిగితే వారికి జెయ్యాలి" అంది.

విశాల స్మృతిపధంలో రజనీరూపం తళుక్కున మెరిసింది, ఆమెలో ఉత్సాహం వుబికివచ్చింది.

"నువ్వన్నదే నిజం చంద్రికా! రజని దగ్గర వుంటేనే నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ భారాలన్నిటిని మోయగల వ్యక్తి రజని ఒక్కతే. మనస్సును బాధించాయి ఆస్పష్ట మయిన ఆలోచనలు, కర్తవ్యపథంకోసం అంధకారంలో కలవరపడే ఈ ఆలోచనలకి ఆమె ఒక కాంతికిరణం" అంది.

అప్పటివరకు రామం ఏమీ మాట్లాడలేదు. రజని అనే శబ్దం వుచ్ఛరించినపుడల్లా అతని హృదయం ఘల్లుమంది. విశాలనోటి వెంట రజని పొగడ్తలు విని అతని మనస్సుఆహ్లాదంతో నిండిపోయింది.

సంతోషంతో "నిజం చెప్పావు విశాలా! రజనికి యీ వార్త తెలిసిందంటే క్షణంకూడా ఆమె ఆలస్యం చెయ్యదు" అన్నాడు.

"కాని అలా చెయ్యడం ఆమెకి లాభదాయకం కాదు. ఆవృద్ధదంపతులు పరలోకం వెళ్ళేవరకు వేచివుంటే ఆమెకుసుమారు లక్షరూపాయలు జేబులో వేసుకొని తిరిగివస్తుంది" అన్నాడు ప్రసాద్.

"రజనికి సంపదమీద మోజు లేదు. ఈ వార్త తెలిసిన వెంటనే రెక్కలుకట్టుకొని వాలుతుంది. ఈ రాత్రికి నేను ఉత్తరం రాస్తాను" అన్నది చంద్రిక.

అక్కడ నుంచి సనల్ బాబు బయటకు వెళ్ళిపోవడం ఎవరు అంతవరకు గుర్తించలేదు. వ్యంగ్యంగా చిరునవ్వు వెలిగింది. విశాల ఆది చూచి దాని భావాన్ని అర్థం చేసుకోని బాధడింది. ఒకనాడు కమల అన్న మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. "వివాహంలోని గంభీర బంధనాన్ని అర్ధం చేసుకోవాలంటే వివాహం చేసుకో విశాలా! ఆనాటి నుంచి నువ్వు సంపూర్ణత పొందుతావు. వివాహమనే తతంగాన్ని ఎంత దుయ్యపట్టినా దాని విలువని గీటు దాటకుండా గ్రహించడం కష్టం" అంది. ఆ మాటలసత్యం ఆమెకి అప్పుడు తెలిసింది. కమలని ఆమె జబ్బు చేసినదగ్గర నుంచి చూడలేదు. ఆప్పుడు ఆమెను చూడాలనే తీవ్రవాంఛ ఆమెలో చెలరేగింది.

"కమల ఈ మధ్య కనబడిందా చంద్రికా?" అన్నది. విశాల.

"కనబడింది. విశాలా? మూడు రోజులముందు వాళ్ళ యింటికి వెళ్ళాను."

కమల పేరువిని ప్రసాద్ ముఖం అకస్మాత్తుగా గంభీరమయిపోయింది. కాని అది ఎవరు గమనించలేదు.

"కబురు పెట్టు చంద్రిక! కమలను చూడాలనీ నాకెంతో ఆభిలాషగావుంది" అన్నది విశాల.

"కమల నామాన్ని నీవు ఒంటరిగా వుచ్చరించే హక్కు నీకు లేదు" అన్నాడు ప్రసాద్.

"కమలాకరం, మీరు ఏపని వంటరిగా చెయ్యరు, వేరు వేరు వ్యక్తులయినా వారి పవర్తనలు, ఆలోచనలు ఒకటైఅన్యోన్య దంపతులు. అన్యులకు వీరిమధ్య ఆస్కారం లేదు" అంది విశాల.

మాటలు అసందర్బమయినా సహజమయినవి. కాని వాటిల్లో దాగివున్న పరిహాసాన్ని ఎవరు గుర్తించలేక పోయినారు. కమలవుంటే జవాబు చెప్పేది.

"అవును, నిజమే. అన్యోన్య దంపతులు, ఆదర్శ ప్రాయులు" అన్నది విశాల

ఆ మాటల్ని ప్రసాద్ సహించలేకపోయాడు. క్రోధం ముఖం ఎర్రబడింది. ఇక అక్కడ నిలువ లేకపోయాడు.

చివాలున లేచి "విశాల! వెళ్ళి కమలను ఇప్పుడే తీసుకు వస్తాను. ఆలస్యం చెయ్యడం అనవసరం" అని సమాధానానికి ఎదురుచూడకుండా బయటకు వచ్చాడు.

ప్రసాద్ కమలయింటికి వచ్చే సమయానికి కమల వారి ఇంటిదాబా మీద పచారు చేస్తోంది. కమలాకరం ఆఫీసు నుంచి చాలా ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళాడు. చేసేదేమీ లేక సంధ్యాసమయంలో ఆమె ఏకాంతంగా పిల్ల వాయువుల్ని పీలుస్తూ మధుర స్మృతుల్ని స్మతిపధంలోకి తెచ్చుకుంటోంది. కారు మలుపుతిరిగి ప్రసాద్ ఇంటి వేపు చూసేసరికి కమల రూపం కళ్ళకి కనబడింది, కమల కూడా అకస్మాత్తుగా ప్రసాద్ ని చూసింది. వెంటనే ఆమె వెనుకకు తప్పుకుంది. ఆమెకు మూర్ఛవచ్చినంత పనయింది. అక్కడే దగ్గర కుర్చీలో కూలబడింది. ప్రసాద్ ఇలా హఠాత్తుగా తటస్థపడతాడని ఆమె ఊహించలేదు. కమలాకరం ఇంటిలో వుంటే ఆమె ఏమి భయపడేది కాదు.

ఇంటిబయట కారాగడం, తలుపుతట్టడం ఆమెకు వినబడినది. రెండు మూడు నిమిషాలవరకు అక్కడ నుంచి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ప్రసాద్ ఎదురుగుండా నిలబడి వున్న కమలనిచూచి చకితుడయ్యాడు. పల్చటి తెల్ల చీరకట్టుకొని, తల్లో దట్టంగా మల్లెపూలు పెట్టుకొనివుంది. భయవిహ్వలయై చీర చెంగుని తలమీదకు లాగుకొని కళ్ళు కిందకు దించుకొని నిలబడి వుంది.

"వారు ఇంట్లో లేరు" అంది.

ఇంటికి వచ్చిన పరిచితునితో అనవలసిన మాటలా అని! ఆమె ఇంట్లోకి రమ్మనమని కూడా అనలేదు. గుమ్మంవద్ద నిలబడి అన్న మాటలవి. కాని చిత్రమేమంటేఅతనికానాడు కోపం రాలేదు, కమలను చూచిన సంతోషం దానిని పూర్తిగా కప్పివేసింది.

"అది తెలుస్తునేవుంది కమలా! కాని నేను నా కోసం రాలేదు"అని క్షణమాగి "నీకోసం వచ్చాను" అన్నాడు.

కమల త్రుళ్ళిపడి కళ్లు పైకెత్తి ప్రసాద్ కళ్ళలోకి చూసింది.

ప్రసాద్ నవ్వుతూ "నీ కోసం వచ్చాను కమలా! కాని నాకోసం కాదు" అని గంభీరంగా"విశాల నిన్ను తీసుకురమ్మనమని పంపించింది. నిన్ను చూడాలనివుందట. ఆమెకు వంట్లో సరిగా లేదు. వినోద్ కు వచ్చినరోగమే వచ్చింది" అన్నాడు.

మృదుత్వం లేని ఆమాటలువిని కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది. అది నమ్మడమో నమ్మకపోవడమో ఆమెకు తెలియలేదు.

"నిజం చెబుతున్నారా? లేక ఇదికూడా మీ క్రూరమయిన పరిహాసాల్లో ఒకటా?" అంది.

"లేదు కమలా! ఇది క్రూరమయిన సత్యం. క్రూరమయిన పరిహాసం కాదు" అన్నాడు.

కమల వెంటనే "అయితే పదండి "అంది.

ఇద్దరు కారులో బయలుదేరారు. కమల ఇంతకు ముందొకసారి ప్రసాద్ తో కారులో ఒంటరిగా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. భయపడతూ, భయపడుతూ ప్రసాద్ వేపు చూచింది. ప్రసాద్ నవ్వుతూ "భయపడకు తిన్నగా విశాలవద్దకు తీసుకు వెళతాను" అన్నాడు.

"క్షంతవ్యంకాని ఆతప్పుని మీరు తిరిగి ప్రయత్నించరని నాకు తెలుసు" ఉన్నది.

"ఆ భరోసా నీకు నేను ఎప్పుడిచ్చాను కమలా?" అన్నాడు.

"మీరివ్వలేదు ప్రసాద్ బాబూ? నేనే తీసుకున్నాను. తిరిస్కరించరని నా నమ్మకం" అన్నది.

"వాగ్దానం చెయ్యలేను కమలా! పరిస్థితుల ప్రాబల్యానికి వ్యక్తులెలా ప్రవర్తిస్తారో చెప్పడము కష్టం."

"కాని మీరు నాకొకసారి మాటిచ్చారు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నా విషయంలో ఏమి చెయ్యనని. ఆ మాటకూడా తప్పుతారా?" అంది.

"లేదుకమలా! ఆ మాట తప్పను. ఇక ఈ సమస్యకు వేరేమార్గమే లేదా?" అన్నాడు.

కమల ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అనవసరం అణుకుంది. లేదని తలమాత్రం వూపింది. కొంతసేపటివరకు ఇద్దరిలోను ఎవరు మాట్లాడలేదు. హఠాత్తుగా కమల గుర్తించినదేమిటంటే ప్రసాద్ కారుని ఎంతో నెమ్మదిగా నడుపుతున్నాడు. అది చూచి ఆమె ఆశ్చర్యానికి మేర లేదు కారు నడుపుతున్నది ప్రసాద్ అని ఆమె నమ్మలేకపోయింది.

"ఏమిటి ప్రసాద్ బాబూ! కారుని ఇంత నెమ్మదిగా నడుపుతున్నారు" అంది.

"ఆశక్తి నీలోవుంది కమలా! ఇంకెవ్వరికి లేదు విశాల వద్దకు తిన్నగా తీసుకు వెళతానని మాటిచ్చాను. ఇంకా నీతో కొంచెంకాలం ఏకాంతంగా గడపాలంటే ఇంక వేరే గత్యంతరంలేదు. ఈ విధంగా నడిపితే ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఎంత వీలైతే కొంతకాలం నీతో ఏకాంతంగా గడపాలని ఇలా చేస్తున్నాను కమలా!" అన్నాడు.

ప్రసాద్ మాటలు కమల మనస్సుని ఎందుకోబాధించేయి. ఆమెలో ఒక విధమైన గర్వభావం కూడా కనిపించింది. ప్రసాద్ వంటి ప్రౌఢ వ్యక్తినికూడా ఆమె లొంగదీయగలిగిందంటే ఆది గర్వించదగినది కాని చివరకు యిదంతా ఏ విధంగా పరిసమాప్తమవుతుంది? అప్రయత్నంగా ఆమె దీర్ఘంగా నిట్టూర్పు విడచింది.

అది విని ప్రసాద్ "నివురుగప్పిన నిట్టూర్పులు కమలా. ఇక వాటికి పరిష్కారం లేదు" అన్నాడు.

ప్రసాద్ కి కోపం వచ్చిందని కమల గ్రహించిమాటలు మార్చుదామనే వుదేశ్యంతో, "విశాలకు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ప్రసాద్ బాబూ. ఎంత దురదృష్టవంతురాలు?" అంది.

"విశాల ఎప్పుడూ ఈ రోగంతోప్రత్యేకంగా భయపడవలసింది కాని, అసహ్యించుకోవలసిందిగాని ఏమి లేదని అంటూండేది. అది అన్ని రోగాలతోను సమానమయినదనే మూఢ నమ్మకంతో మనుష్యులు దాని నుంచి దూరంగా తొలగిపోతారనివిశాల అనేది. ఇప్పుడు దానిని నిరూపించుకోవలసిన విధి ఆమెదే" అన్నాడు.

"ఆమెది కాదు. బాధ్యతమనది. క్రొత్తగా వివాహమయింది. ఇలాంటి అవాంతరం రావడం వల్ల ఆమె హృదయం ఎంత తల్లడిల్లుతోందో?" అంది.

"విశాలలో మనస్థైర్యం వుంది కమల! బహుశా రజని సహచర్యంవలన అబ్బివుంటుంది. అదే నీలో లోపించి వుంది" అన్నాడు.

కమలనవ్వి "మన సైర్యాన్ని ఎప్పటినుంచి మెచ్చుకోవడం మొదలు పెట్టారు ప్రసాద్ బాబు?" అంది.

"మన సైర్యాన్ని మెచ్చుకోవడం లేదు. కమలని మెచ్చుకుంటున్నాను." అని గట్టిగా నవ్వసాగేడు.

ప్రసాద్ మాటలకి కమల సిగ్గుపడింది. అతని అసభ్యపు మాట ఆ చేష్టలు, అప్పటికి ఆమెకి అలవాటు పోయాయి. మొదటిలో అయితే చెంపపెట్టు పెట్టి వుండును. యీసారి మౌనం వహించింది.

కారు నెమ్మదిగా గమ్యస్థానం చేరింది. కారు ఆగిన వెంటనే కమల లోనికి వెళ్ళింది. కమలని చూచి విశాల ముఖం సంతోషంతో విప్పారింది.

"కమలా నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేసేవేమిటి?"అంది.

కమల సమాధానం చెప్పకుండా విశాలని గాఢంగా కౌగిలించుకుంది.

 

చాప్టర్ 16

అమెరికా నుంచి సనల్ స్నేహితుడువచ్చి విశాలను పరీక్షించాడు. కొత్తగా ఆయనేదీ చెప్పలేదు, సనల్ యిచ్చే వైద్యాన్ని సమర్ధించాడు. విశాల కోరిక ననుసరించి ఆయన మిగతా రోగులందరినీ పరీక్షించాడు. సనల్ వైద్యాన్నిఎంతో మెచ్చుకొని , "నువ్వు చేసే వైద్యంకన్నా నేను ఇంకేమీ సలహాలు యివ్వలేను, డాక్టరు సనల్ నవీన పద్దతులు అభిప్రాయాలు చికిత్స యీ వ్యాధితో పోరాడే డాక్టర్లందరికీ ఆదర్శప్రాయలు" అన్నాడు. కాని సనల్ నిరుత్సాహపడ్డాడు. ఆయనేదో ప్రత్యేకమైన చికిత్స చెబుతాడని దానితోవిశాలకు అతి త్వరలో నయమవుతుందని ఆశించాడు.

చంద్రిక ఆ రాత్రి రజనికి పెద్దవుత్తరం వాసింది. రజని వుత్తరం చదువుకోని క్షణకాలం అలాగే కూర్చుండి పోయింది. కర్తవ్యం కోసం క్షణకాలం కూడా ఆమె కాలం గడపలేదు. వుత్తరం అందకముందు కూడా ఆమె ఢిల్లీ తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయానికి వచ్చింది. తగిన సమయం కోసం మాత్రమే ఆమె ఎదురు చూస్తూంది. వృద్ధులిద్దరు స్వస్థతకు వచ్చారు. ఇక చేసేపని లేదు, శాశ్వతంగా వుండిపోయే వుద్దేశ్యం ఆమెకెప్పుడు లేదు. పైగా కొంతకాలంపట్టి వారి అయిష్టతకి ఆమె పాత్రురాలైంది. చాలాకాలం వరకు ఆమె తెల్లటి చీరెలు కడుతూ నొసట కుంకుమ బొట్టు లేకుండా వుండేది రామంతో ఆమె చెప్పినట్లు. అందులో నమ్మకముంది కాదు. కాని అదొక అనుభూతిగా పరిగణించింది. కొన్నాళ్లకామె దానితో విసుగెత్తింది. వెంటనే ఆమె అవన్నీ వదలి పెట్టేసింది. దానితో వృద్ధుల అయిష్టతకు గురి అయింది. రజని వారి విధవ కోడలుగా పరిగణిస్తూ వచ్చారు. హఠాతుగా ఆమె అవన్నీ విసర్జించేసరికి వారికి బాధకలిగింది, కాని రజని దానిని లక్ష్యం చెయ్యక సంచరించ సాగింది. అంతవరకు వారి ఆరోగ్య కారణంగా ఆమె యిల్లు వదలి బయటకుకూడా వెళ్ళలేదు. కాని వారు స్వస్థతకు రాగానే ఆమె బయట వినోదాలలో కూడా పాల్గొనసాగింది. ముస్తాబుగా అలంకరించుకొని, బయటకు వెళ్ళి ఆలస్యంగా రాత్రిళ్లు తిరిగి వచ్చేది. రజని హద్దు మిరుతూందని వారు భావించారు. అది రజని కనిపెట్టక పోలేదు. వారి అభిప్రాయాలను ఆమె గ్రహించింది. వినోద్ పరిచయంలో ఆరంభమయిన ఇంకొక అధ్యాయం తన జీవితంలో ముగిసిందని గ్రహించింది. అలాంటి సమయంలోనే ఆమెకు చంద్రిక వుత్తరం అందింది. మరునాడే ఆమె ప్రయాణమయింది, వృద్దదంపతులు ఎంతో బోధపర్చారు. రజనియెడ వారికి నిజంగానే ప్రేమానురాగాలు ఏర్పడ్డాయి. వారికి ఆమె చేసిన సేవను వారు మరువలేరు. వినోద్ యెడ ఆమె చూపిన ఔదార్వం వారింకా మరువలేదు. కాని రజని నిశ్చయాన్ని సడలించడం అసంభవమని వారు గ్రహించారు. కనీసం ధనరూపానైనా చెప్పుదామనే వుద్దేశం. రజని వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ముసలాయన రజని చేతిలో పదివేల రూపాయల చెక్కు పెట్టి "వంటరిదానివి. ఏనాడు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు? చివరకు నువ్వు ఎందుకు కాకపోతావేమో! ఎందుకయినా పనికివస్తుంది దగ్గర వుంచుకో" అన్నాడు.

రజని మందహాసం చేస్తూ "పనికి రాదని నేనను. కాని అవసరం లేదని మాత్రం అంటాను. వంటరి దానిని ఏదో ఒక పని చెయ్యకుండా వుంటే ఏమితోచదు. దానితో నా ఒక్క కడుపునిండుతుంది. ఇదంతా నేనేం చేసుకోను చెప్పండి!" అంది.

"ఏమయినా చివరకు ఇదంతా నీదే కదా రజనీ!" అన్నాడు.

"అలాంటి అవాంతరం తెచ్చి పెట్టకండి బాబాయి, ప్రపంచంలో డబ్బుకి కొరత వున్న వాళ్లు వేల మంది వున్నారు. అదంతా అలాంటి సత్కార్యానికి వినియోగిస్తే సబబుగా వుంటుంది. వినోద్ జ్ఞాపకార్థం ఏదైనా సంస్థ స్థాపించండి" అంది.

"అయితే నీకు మేమంతా ఇలా ఋణపడవలసిందేనా రజనీ?" అన్నాడు.

"ఎవరికో వొకరికి ఏదోవిధంగా ఋణపడకుండా ఏవ్యక్తి జీవించడం అసంభవం. చివరకు అంతా స్వార్ధపరులే బాబాయి. మీదంతా వొక భ్రమ "అంది.

ముసలాయన నీరసంగా నవ్వి " అంతా నీయిష్టం. కాని వొకటి జ్ఞాపకముంచుకో రజనీ. నీకు ఎప్పుడు ఇక్కడ స్వాగతం లభిస్తుంది" అన్నాడు.

రెండు రోజుల తర్వాతనాటి సంగతి. రామం ఆఫీసు నుంచి అలాషికారుకి వెళ్ళి లాడ్జికి తిరిగి వచ్చి, అలసి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. హఠాత్తుగా నుదుటిపై చల్లటి చెయ్యి స్పర్శ తగిలేటప్పటికి వులిక్కిపడి కళ్ళు తెరిచాడు. వెర్రివాడిలాగ చూడటం మొదలు పెట్టాడు. సంగతేమిటంటేమంచంమీద రజని కూర్చుని వుంది. మృదువుగా "ఈ వేళ కాని వేళ ఇప్పుడు నిద్ర పోతున్నారేమిటి? ఒంట్లో సరిగా లేదా? "అంది

ఇంకా రామం తను చూచే దృశ్యాన్ని నమ్మలేకపోయాడు. మతిభ్రమ కలిగిందేమోనని సందేహంతో రజని వస్త్రాన్ని నెమ్మదిగా తాకి చూచాడు, రజని నవ్వుతూ "స్వప్నంలో మనమిద్దరము చాలాసార్లు కలుసుకున్నాముకాని ఇది స్వప్నం కాదు. మీముందు సాక్షాత్కరించినది రాక్షసి" అంది.

అప్పటి నుంచి రామానికి నిజంగా ఇది స్వప్నం కాదని నమ్మకం కలిగించింది. చివాలున లేచి కూర్చుని, "రజనీ నిజంగా నువ్వేనా? ఎప్పుడు వచ్చావు? అన్నాడు

"నిజంగా నేనే సందేహంబు వలదు" అంది.

"ఎప్పుడు వచ్చావు? ఎక్కడ వుంటున్నావు?" అన్నాడు

"నిన్న రాత్రే వచ్చాను. నేను పూర్వముంటున్న ఇల్లే అద్దెకు మళ్ళీ తీసుకున్నాను నా అదృష్టం. ఇల్లు ఖాళీగా లేదు. పొమ్మనమంది మొదట. కాని, అదే సమయానికి వాళ్ళబ్బాయి బయటకు వచ్చి నన్ను చూచి అలాగే నిలబడిపోయాడు. వాళ్ళమ్మను లోనికి తీసుకు వెళ్ళి ఏమని చెప్పాడో కాని బయటకి వచ్చి ఇల్లాలు ఇంటి తాళం చెవులు ఇచ్చింది. సరే ఒక పని ముగించుకొని మళ్లా పాత ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ ఆ వుద్యోగంలో ఇంకొకామె వుంది. నిరాశతో బయటకు వచ్చేస్తుంటే మా మేనేజరు నన్ను చూచి, రజనీ నీ వంటి స్త్రీకి వుద్యోగం లభించకపోవడం మాఆఫీసు దురదృష్టం కంగారుపడకు. మా ఇంటిలో నీకు వుద్యోగం ఇస్తాను. నాకువొక కూతురు, వొకకొడుకు వున్నారు. వారికి చదువు చేప్పేవంటేనెలకి వంద రూపాయిలు జీతం ఇస్తాను." అని చిరునవ్వు నవ్వుతూ "చూచేరా అందరు నా అందానికి తన్మయులయిపోతారు. మీరొక్కసారయినా నా అందాన్ని సరిగా గుర్తించారా చెప్పండి?" అంది.

రామం చివరిమాటలను సరిగా పట్టించుకోలేదు. వంద రూపాయిలా? దానితో నీకెలా గడుస్తుంది. దారిద్ర్యం కూడా అనుభవిస్తావా రజనీ?" అన్నాడు

రజని నవ్వుతూ "నాకా భయం లేదు. మీరున్నారు కదా? అవసరానికి అప్పయినా యివ్వరా?" అంది.

రామం కుతూహలంతో "అప్పుని ఎలా బదులు తీరుస్తావు?'' అన్నాడు.

"నేనంత చేతకాని దానిననుకుంటున్నారా మీరు? రాక్షసి తలచుకుంటే రత్నాలవర్షం కురుస్తుంది. అయినా తీర్చడం ధనం రూపంలోనే చెయ్యాలా ? చెప్పండి ? మీకింకే విధమైన ఆశలులేవా!?" అంది.

"ఎందుకు లేవు రజనీ. చాలానే వున్నాయి. కాని ఆవన్నీ అడియాసలు చేసేసేవు కదా?" అన్నాడు.

"చూచారా! యీ అన్యాయం. అందరు నన్ను ఆడిపోసుకునే వారే. వంటరి దానిని, అబలను జాలిపడి సహాయం చెయ్యడానికి బదులు నామీద అభియోగాలు వేస్తారు" అంది.

"అభియోగాలు కాదు రజనీ ఫిర్యాదులు. నీ మీద నాకు చాలావున్నాయి" అన్నాడు.

"ఫిర్యాదులా? ఏవీ చెప్పండి" అంది రజని.

"అన్నీ ఒక్కసారి చెప్పేస్తే యెలా ! ఒక్కొక్కటేచెప్తాను" అన్నాడు.

"చెప్పండి రాక్షసిని చూచి భయపడకండి". అంది

"చెప్పమన్నావు కనుక చెప్తున్నాను, నేనుండగా నువ్వు వేరేయింటికి ఎందుకు వెళ్ళావు?" అన్నాడు.

"పిలవని పేరంటానికి వెళ్ళి పార్వతి దేవిలాగా అత్మహత్య చేసుకొంటారా? మీరు పరమేశ్వరులైనాకారు, పార్వతినై పుట్టి మిమ్మల్ని పొందడానికీ" అంది.

రామం బాధపడుతూ "ఈ యింటిలోనీకు పరాభవం జరుగుతుందనినీవెన్నడైనా అనుకుంటే అది కేవలం నీదోషమే రజనీ. అలాంటి భావం కలగడం నా దురదృష్టం కూడాను" అన్నాడు.

రామం ముఖంలోని విచార రేఖలు చూచి, రజని "సరే మొదటిది అయిపోయింది. రెండవది చెప్పండి" అంది.

"నువ్వు మళ్ళీ వుద్యోగం చెయ్యవలసిన అవసరమేమి వచ్చింది రజనీ?" అన్నాడు.

"ఏం చెయ్యమంటారు? బిచ్చమెత్తుకోమంటారా ? లేక నాబోటి వారికి పొట్టగడవడం కష్టంకాదంటారా!?".

రామం రజని ప్రశ్నకు సమాధానం యివ్వలేదు. క్షణకాలం మౌనంగా వుండి, "నిన్ను తిరస్కరించగల శక్తి కల వారెవరు ప్రపంచకంలో లేరు రజని తక్కెడలో ఏవ్యక్తి నీకు సరితూగడు, అందుకేనువ్వు సగర్వంగా "రజని ఎవరిసొత్తు ఎప్పుడు కాదు" అని ఆనగలుగుతున్నావు. నిన్ను పూర్తిగా హృదయంలో యిముడ్చుకోగలశక్తిఎవరికి లేదు" అన్నాడు.

"అది నిజమే కావచ్చు రామంబాబూ. కాని నేను అల్ప సంతుష్టురాలిని. నేను ఇతరులనుంచి ఎక్కువగా ఏమి ఆశించను" అంది.

అయితే ఇది చెప్పు రజనీ "తిన్నగా ఇక్కడకు వచ్చి "రామం బాబూ శాశ్వతంగా ఇక్కడ వుండటానికే వచ్చాను. ఇక నుంచీ నాభారంమీది." అని ఎందుకనలేదు. ఆ మాత్రంచనువు నావద్ద నువ్వు తీసుకోలేవా?" అన్నాడు.

"చనువు తీసుకోగలను రామంబాబూ. కాని నా భారం మీరు మొయ్యలేరు. దానికి కారణం మీరే ఇంతకు ముందు చెప్పారు. ఎప్పుడయినా సమయం వచ్చినప్పుడు మీ భారమే నేను వహించాలి కాని దానికి సమయం ఇంకా రాలేదు" అంది.

"దానికోసం జీవితంలో ఇంకా ఎంతదూరం ప్రయాణం చెయ్యాలి రజనీ. వంటరి ప్రయాణంతో విసిగెత్తి పోయాను. ఇంత జరిగిన తర్వాత ఇంకా దాపరికమెందుకు రజనీ. ఆలోటు నీవే భర్తీ చెయ్యలి, కాని నేను ప్రసాద్ లాటి వాడిని కాను. నడిసముద్రంలో నానావను వదిలిపెట్టేవంటే మునిగిపోతాను. ప్రసాద్ లాగ నావికుని మార్చలేను" అన్నాడు.

"అది నాకు తెలుసు రామంబాబూ. అందుకనే ఆలోచించి ముందు వెనుక చూసుకున్న తరువాతనే సారధ్యం వహించాలి" అంది.

రామం నీరసంగా "ఇంకెంత కాలం రజనీ! ఇన్నాళ్లు నువ్వు కలకత్తాలో వున్నంత కాలం నేనెంత బాధ ననుభవించానో నీకు తెలియదు. రాత్రింబగళ్లునీఆలోచనతోనే సతమతమయ్యే వాడిని. చూడు నేనెంత చిక్కిపోయానో?" అన్నాడు.

రామం కళ్ళలోకి రజని వొకసారి నిండుగాచూచి, స్వచ్చమైన కరుణాభరిత కంఠస్వరంతో "మీకు నేనొక సారి చెప్పాను రామంబాబూ, మీకంటే మీగురించి నాకే ఎక్కువ తెలుసు. అంతకంటే భరోసానేనివ్వలేను. అవసరం లేదు కూడాను" అంది.

"అయితే కలకత్తా శాశ్వతంగా వదలివచ్చేసినట్టేనా రజనీ" అన్నాడు.

"శాశ్వతంగా అని నేనెలా చెప్పగలను చెప్పండి? భవివ్యత్తుని భంధన చేసే శక్తి నాకెక్కడిది ? ప్రస్తుతం తిరిగి వెళ్లే ఆలోచన లేదు" అంది.

"ఈసారి తిరిగి వెళ్ళటమే తటస్థిస్తే వంటరిగా వెళ్ళవు రజనీ, అంతవరకే నాకు తెలుసును" అన్నాడు.

"ఇప్పటికే బాగా చీకటి పడింది. రజని లేచి నిలబడి ఆలస్యమయిపోయింది. రామం బాబూ ఇక నేను వెళ్ళాలి"అంది.

"ఎక్కడికి! విశాలవద్దకే?" అన్నాడు.

"విశాల వద్దకు ఇక్కడకు వచ్చేముందే వెళ్ళాను. ఇప్పుడు కమల వద్దకు వెళ్తున్నాను" అంది.

"విశాల ఏమంటోంది రజనీ ? ఆమెకెలా వుంది?" అన్నాడు.

"విశాల భారంకూడా నేనే మొయ్యాలి. ఇక నేను వీలున్నప్పుడల్లా అక్కడికే వెళ్తూ వుండాలి. చెయ్యవలసినది చాలా వుంది. ఈ కొత్త వుద్యోగంలో చాలా వ్యవధి కూడా దొరుకుతుంది. ఉదయం రెండుగంటల పని అంతే" అంది.

"రాత్రింబగళ్ళు అందరికి సేవ చేస్తూంటావు రజనీ, అందుకని నేనేమి అనను. కానీ కర్తవ్యమనేది నాయెడ కూడా నీకు వుందని మరచిపోకు" అన్నాడు.

రజని నవ్వి వెళ్ళిపోయింది.

 

చాప్టర్ 17

ఆనాటి నుంచీ రజని, తీరిక చిక్కినప్పుడల్లా విశాల వద్ద గడుపుతూవుండేది. దానితోపాటు అక్కడ వున్న అనాధ బాలలను చేరదీసి విశాల ఆంతవరకు చేసినకృషి వృథా కాకుండా చెయ్యాలి. రజని రాక అక్కడ వున్న వారి అందరి మనస్సు రంజింపచేసింది. ఆమె సరళ స్వభావం, సహనం, మందహాసం, అందరిని సమ్మోహితులనుజేస్తాయి. ఆమెలోని ప్రత్యేకత ఏమంటే ఇతరులు ఆమెకి రుణపడి వున్నారనే భావం కలగకుండా ప్రవర్తిస్తుంది. రజనీ వారికి సేవ చెయ్యడం కేవలం, ఆమె తనకర్తవ్యాన్ని నెరవేర్చడమనే భావం కలిగేటట్లు సంచరిస్తుంది. రజని ప్రవర్తన సనల్ లో కూడ మార్పును కలిగించింది. ఇతర రోగులను, నిర్లక్యం చెయ్యడం మానివేశాడు. విశాలదగ్గర రాత్రింబవళ్ళు పూర్వపురీతిగా గడపడం లేదు. సగంభారాన్ని రజని భుజస్కందాల మీద మోపేరు. ఆమెపై అతనికి పూర్తి విశ్వాసముంది. ఆమె బుద్ధి కుశలత పై గౌరవముంది. అతను ఇంకొక విషయాన్ని గుర్తించేడు. రజని వచ్చిన తరువాత, విశాలలో ఒక విధమైన మానసిక సంతృప్తి పొడ చూపింది. ఆమెలోని పూర్వపు ఆవేదన, ఆగ్రహం అశాంతి మాయమయ్యేయి. వీటి స్థానంలో ఆత్మవిశ్వాసం, చిరునవ్వు, మనశ్శాంతి ప్రవేశించాయి. ఈ విధంగా సుమారొక నెలగడిచిపోయింది. ఈలోపున విశాల ఆరోగ్యం చాలా బాగా వుంది. నెమ్మది నెమ్మదిగా శరీరంలోని ప్రతిఘటనా శక్తి వల్ల వ్యాధి పట్టు సడలింది. విశాల ముఖములోని పూర్వపు వెలుగు రాను రాను కానవొచ్చింది. సనల్ చేసే వైద్యం చాలా అల్పమయినది చేసేది, ఇంకేమి లేక సతమతమయ్యేవాడు, రాత్రింబగళ్ళు ఆమె రూపం కళ్ళకు కట్టినట్లు కనబడేది. శ్రీఘ్రంగా ఆమెకు స్వస్థత చిక్కడానకి ఏమి చెయ్యాలా అని, రాత్రింబగళ్ళు ఆలోచించేవాడు. మానసికంగా విశాల తనకు దూరమయిపోతుందేమోననికూడా భయపడేవాడు. రజని వచ్చిన తర్వాత ఆమె కొంచెం అతనిని నిర్లక్ష్యం చేయజొచ్చింది. మొదట అది పట్టించుకోకపోయినా కొంతకాలంపోయిన తర్వాత మనస్సులో భాధపడవొచ్చాడు, విశాల అలా ఎందుకు ప్రవర్తించిందో అతను గ్రహించలేకపోయాడు. అప్పుడప్పుడు విశాలకి ఇష్టం లేకుండా వివాహం జరిగిందా అని అనుమానంపడేవారు. కాని అది అలాంటి ఆలోచన క్షణకాలం మాత్రమే నిలచేది. మరుక్షణంలోనే అలాంటి ఆలోచన వచ్చినందుకు తనను తానే నిందించుకునేవాడు.

ఇంకొక నెల కాలం గడచిపోయింది. విశాలకు బాగా నయమయిపోయింది. ఇంకొక నెలకు పూర్తి స్వస్థత వస్తుందనే నమ్మకం కలిగింది. ఈలోపున అనేక మంది డాక్టర్లు వచ్చి విశాలను పరీక్ష చేసారు. విశాలకు అవేమి ఇష్టం వుండేది కాదు. కాని పూర్వంలా రభస చేసేది కాదు. మొదటిసారి రజని అంది "ఇందులో నాకేమి అసహమయినది కాని, అసమంజసమనది కాని కనబడటం లేదు విశాలా. డాక్టర్లకు భార్య వుండటం సహజమయితే ఆమెపై అనురాగం ఉండటం కూడా సహజమే. ఇందులో సిగ్గుపడవలసింది ఏమి లేదు, ఇతర రోగులను నిర్లక్యం చేయనంత కాలం ఇది సమంజసమైనది కాదు. సమర్ధనీయమైనది కూడా" అంది.

ఆసమయంలో సనల్ కూడా అక్కడ వున్నాడు. రజని యెడ కృతజ్ఞతతో మనస్సంతా నిండిపోయింది. నిశ్శబ్దంగా కృతజ్ఞతలో వందనాలు సమర్పించాడు.

విశాల అస్వస్థత కారణంగా అందరు వీలున్నప్పుడల్లా అక్కడకువచ్చి కొంత కాలం గడుపుతూ వుండేవారు. కమల కమలాకరం, చంద్రిక, రామం తరచుగా అక్కడికి వచ్చేవారు. ఇంకొక నెలగడిచే సరికి విశాలకు పూర్తి స్వస్థత చిక్కింది. విశాలను పూర్తిగా పరీక్ష చేసి సనల్ తీసుకువచ్చినముగ్గురు డాక్టర్లు ఆమెలో ఆవ్యాధి పూర్తిగా నిర్మూలింపబడినదనిచెప్పారు. వార్త విని సనల్ సంతోషం పట్టలేకపోయాడు. డాక్టర్లను బయటకు పంపించి తన గదిలోకి వెళ్ళి ఏకధారగా కన్నీరు కార్చాడు. భరించలేని బరువైన ఆతని హృదయం భరించలేనంత తేలికయిపోయింది. కరడుగట్టిన కన్నీరు పరవళ్ళు తొక్కింది. ఆ సంతోషాన్ని సహించలేక పోయాడు. అలాగే కన్నీరు కారుస్తూ ఆ శుభవార్త చెప్పడానికి విశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ కమల, రజని, విశాల వద్ద వున్నారు. సనల్ ని చూచి అందరు ఆశ్చర్యపోయారు. విశాల కంగారుపడుతూ ఏమన్నారు "డాక్టర్ ? అలా వున్నారేమిటి?"అంది.

"విశాలా నీకు పూర్తిగా క్యూర్ అయిపోయింది. పూర్తిగా నయమయిపోయింది." అని నవ్వుతూ కన్నీరు తుడుచుకున్నాడు. అయినా కళ్లలోంచి ఆ నీరు కారుతూనే వుంది.

రజని వైపు తిరిగి "ఈ కన్నీటికి నేను సిగ్గుపడటం లేదు రజనీ.కాని నన్ను ఆశ్చర్యపరచేదేమంటే యిదంతా ఎక్కడ దాగివుంది. పదినిమిషాల నుంచి ఏకధారగా కారుతూంది" అన్నాడు నవ్వుతు .

సమాధానం కమల యిచ్చింది. "సిగ్గుపడవలసింది అందులో ఏమి లేదు సనల్ బాబూ - ఇది సహజమయినది కాదు - ఇలా జరుగకపోతే అది అసహజం కూడాను" అని ఆమె కూడా చెమర్చిన నేత్రాలని చీర చెంగుతో తుడుచుకుంది.

సనల్ "కాని యింత కన్నీరు ఎక్కడ దాగింది కమలా? కన్నీటి కర్తవ్వమేమిటి" అన్నాడు.

"సప్తసముద్రాల లోతును కొలచవచ్చు సనల్ బాబూ కాని కన్నీటిలోతుని కొలచటం అసాధ్యం" అంది కమల.

రజని అంత వరకు మౌనంగా వుండిపోయింది. ఈసారిమీరెండవ ప్రశ్నకి సమాధానం కమల చెప్పలేదు. "కన్నీరు విశాలకి నిష్కృతి సునల్ బాబూ"

"అయితే కన్నీరును నువ్వెందుకుగర్హిస్తావు కమలా?'

"గర్హించనుకాని ఎందుకో నాకీ నిష్కృతి లేదు" అంది కమల.

విశాల సంతోషాన్ని పట్టలేక కళ్లుమూసుకుని వుంది. సనల్ విశాల ప్రక్కను కూర్చుని విశాలా - అని పిలచాడు- విశాల కళ్లువిప్పి మందహాసం చేసి, సనల్ కన్నీరు తుడచి, "ఇక దీని అవసరం లేదు సనల్ బాబూ" అంది.

విశాల సనల్ విశ్రాంతి కోసమని, కాశ్మీరు ప్రయాణమయ్యారు. ఇద్దరూ అలసివున్నారు. విశాల భయంకరమైన వొక యుద్దంలోంచి బయటపడింది. విజయం లభించింది. కాని ప్రయాణంతో అలసిపోయింది, సనల్ ఆవేదనతోటి, ఆతురతతోటి పూర్తిగా అలసిపోయాడు. అది కాక వివాహమయిననాటి నుంచి నూతన దాంపత్యపు సుఖం వారొక్కరోజుకూడాఅనుభవించలేదు. సనల్ తన భాద్యతలన్నిటిని తనతోటి డాక్టర్లకప్పగించి బయలు దేరాడు. విశాల అందరిని తనతో రమ్మని ఆహ్వానించింది. అందరు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. విశాల రజనిని మాత్రం రమ్మనమని పట్టుపట్టింది. మా అందరిలోకి శాంతి నీకు ఎక్కువ రజనీ యంత్రంలాగ రాత్రింబగళ్లు చాలా కాలంబట్టి పని చేస్తున్నావు. నువ్వనకపోయినా నీ శరీరం మానవ మాత్రమేచల్లటి, మనోరంజకమైన ఆ వాతావరణంలో శరీరానికి విశ్రాంతి, మనస్సుకి శాంతి లభిస్తాయి, ప్రకృతి సౌందర్వంలో వంటరితనమనే అవాంతరం కూడా తప్పుతుంది అంది.

విశాల మాటలు, రజనిలో అణచి పడిన అలసటని లేవతీసింది. నిజంగా ఆమెకు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇంతకు ముందు రెండుసార్లు ఢిల్లీ వదలి వెళ్లిపోయే సమయంలో రామం చేసిన రభస జ్ఞప్తికి వచ్చింది. ఆ సమయంలో రామం అక్కడే వున్నాడు. ఒకసారి అతని వైపు చూసింది. ముఖం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు. దీని అర్ధం ఆమె గ్రహించింది. మొట్టమొదటసారిగా రామంపై కొంచెం కోపంకూడా వచ్చింది.

"నాకు విశ్రాంతి అవసరమనే విషయం నువ్వు మాత్రమే గుర్తించగలిగావు విశాలా.ఆ బాధ్యత వున్న వాళ్లు పెడముఖంపెట్టుకు కూర్చున్నారు. అయినా రాలేను విశాలా మంచి వుద్యోగం దొరికింది. ఈసారి వదలుకుంటే ఇక బిచ్చమెత్తుకోవాలి. ఈ రోజులలో అందమైన ఆడవాళ్లకు బిచ్చం పెట్టె అన్నదాతలు కూడా కరవయిపోతున్నారు" అంది.

రామం యింకా ఏమి మాట్లాడలేదు. ముఖం కాస్త ఎర్రబడింది. విశాల సంగతి గ్రహించింది. ఒకసారి దీర్ఘంగా నిటూర్చి "నీకు యిలాంటి మాటలు అనడం ఇష్టం లేదని నాకు తెలుసు రజనీ, కాని నువ్వంటుంటావు. ఆవేశాలనుకుంటాను. జీవితంలో నీకు నేను ఋణపడినంత ఇంకెవరికి ఋణపడలేదు. ఇంకొకటి కూడా చెప్పడం నాధర్మం. నిన్ను అర్ధం చేసుకున్నంతగా యింకెవరు నిన్నింతవరకు అర్ధం చేసుకోలేకపోయారు. నిజమైన నీ విలువను పూర్తిగా గ్రహించిన వ్యక్తులు ఎవరూ లేరు" అంది.

"ఇతరులు విలువలు గ్రహించేమంటే వారి విలువను మీరు మొదట గ్రహించాలి విశాలా! అది లోటయి నప్పుడు మనం ఫిర్యాదు చెయ్యడం అవివేకం" అంది.

విశాలకు వీడ్కోలు చెప్పడానికి, రజనికి వీడ్కోలు చెప్పటానికివచ్చిన వారంతా వచ్చారు. ఈసారి రజని ఫ్లాటుఫారం మీద నిలబడి వుంది. రజని కేవలం విశాల రైలులో వుంది. ఆనాడు రజని వివాహిత యీనాడు విశాల వివాహిత యీరెండు సంఘటనల మధ్య నున్న వ్యవధిలో వ్యక్తుల జీవిత కాలలో ఎన్నో మార్పులు జరిగాయి, అందరు ఫ్లాటుఫారం మీద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం పటాన్ కోట వెళ్ళే ఆ రైలు బయలుదేరడానికి ఇంకొక పదినిమిషాల వ్యవధి వుంది. అందరి ముఖాల్లోను ఒక విధమైన విచారం వ్యక్తమవుతుంది. వారందరిలోను నిజంగా సంతోషంగా వున్నది ప్రసాద్ వొక్కడే. "ఇంకొక నెలరోజుల్లో నేను మిమ్మల్ని శ్రీనగర్ లోనో లేక వేగాములోనో కలుసుకుంటాను విశాల. వంటరిగా రావడం యిష్టం లేదు. ఎవరినో తోడుతీసుకువస్తాను" అని కమల వైపుక్రీగంట చూచాడు.

అతని దృష్టి ఆమెమీద పడి క్షణంముందరే ఆమె దృష్టి మరల్చింది.

"కాశ్మీరులో కేవలం కాలం గడపడానికి చాలామంది వస్తారు ప్రసాద్. కాని అంతకు మించి, అందరి వద్ద నుంచి ఆశించకు,నన్ను తీసుకు వెళ్తావా ప్రసాద్" అని నవ్వింది.

"గర్వంతో అడిగిన ప్రశ్నయినా నేను దానిని గౌరవిస్తున్నాను. ప్రపంచంలో ఎవరయినా నీ తర్వాతే రజనీ! "కాని నువ్వు రావని నాకు తెలుసు ఆరోజులు శాశ్వతంగా గడచిపోయాయి అన్నాడు".

కమల ఎందుకో ప్రసాద్ మాటలని సహించలేకపోయింది. మౌనంగా కూడా వుండలేకపోయింది. "వ్యక్తుల లాగే వ్యక్తుల విలువలు కూడా చంచలమయినవని మొదటిసారి నువ్వు మాయింటికి వచ్చి నప్పుడన్నావు రజనీ జ్ఞాపక ముందా?" అంది.

కమల అకస్మాత్తుగా అడిగిన ప్రశ్న అందరికి అసందర్భంగా కనబడింది.

రజని మాత్రం అర్థం చేసుకుంది.

"ఎందుకు జ్ఞాపకం లేదు కమలా, నువ్వప్పుడు చాంచల్యం గర్హనీయం కాదా అన్నావు. అది కూడా జ్ఞాపకం వుంది" అంది.

రజని మాటలు విన్న తరువాత ప్రసాద్ కి కమల ఆ ప్రశ్న ఎందుకు వేసిందో అర్థమైంది.

విశాల వీరిమాటలు వింటూనే వుంది. కాని ఆమె దృష్టి రెండుమూడు గజాల దూరంలో వంటరిగా నిలబడి వున్న రామంమీద పడింది. దగ్గరకు వెళ్ళి "రామంబాబు వెళ్ళే లోపల మీతో ఒక మాట చెప్పాలని వుంది. చెప్పమంటారా? అంది.

"చెప్పు విశాలా" అన్నాడు రామం.

విశాల "మీకు పూర్వజన్మపై నమ్మకముందా చెప్పండి? అంది.

విశాల ప్రశ్నవిని రామం ఆశ్చర్యానికి అంతం లేదు. "ఎందుకు విశాలా! అన్నీ వుంటే మనమిద్దరము క్రిందటి జన్మలో కవలపిల్లలమని, నామనస్సు ఈనాడు చెప్తోంది. మన యిద్దరి స్వభావాల్లో ఏకీభవించినంతగా ప్రపంచకంలో ఇంక యేఇతర హృదయాలు సన్నిహితం కాలేదు. ఇది మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు" అంది.

"పూర్తిగా గుర్తించకపోయివుండచ్చు విశాలా, కానీ నా వ్యధకి హృదయానికి మొదటి నుంచీ నేనంటేసానుభూతి సహాయం లభించాయి. అది నేను మరచిపోలేదు " అన్నాడు.

గార్డ్ ఆకుపచ్చటి దీపం వూపడం మొదలు పెట్టాడు. అది చూచి విశాల కంగారుగా అందరివద్ద చివరిసారిగా వీడ్కోలు తీసుకుని రైలెక్కింది. గంభీరంగా శబ్దం చేసుకుంటూ రైలు ముందుకు సాగిపోయింది.

 

చాప్టర్ 18

విశాల వెళ్ళిన తర్వాత మూడు వారాలు గడచిపోయాయి. ప్రసాద్ కీ ఈలోపు కమల కమలాకరం నాలుగైదు సార్లు తటస్థపడ్డారు. కాని కమలతో వంటరిగా మాట్లాడడానికి అవకాశం చిక్కలేదు. కాని అతని క్రోధాన్ని ప్రేరేపించిన దేమిటంటే కమల ప్రవర్తనలో ఒక విధమైన మార్పును గుర్తించాడు. అట్లాంటి పరిస్థితులలో అంతకు ముందొక విధమైన వుదాసీనత్వం ప్రదర్శిస్తూ వుండేది. దానిని అతను ఎంతో కష్టం మీద భరిస్తూ వచ్చాడు. కాని కొద్దికాలంనుంచి నిర్లక్ష్యంతో పాటు పరిహారం కూడా ప్రదర్శిస్తూ వచ్చింది. యుద్ధరంగంలో ప్రగల్భాలు పలికి పిరికి పందలై పారిపోయిన వారి యెడల ప్రతి పక్షం ప్రదర్శించే ప్రవర్తనలా వుండేది. పూర్వం ప్రసాద్ కళ్ళలోకి తిన్నగా చూడటానికి ఆమె జంకుతూ వుండేది. ఆతీక్షణతకు తట్టుకోలేక ఆప్పుడప్పుడు ప్రసాద్ దృష్టి మరలించుకోవలసి వచ్చేది. లోలోన ఒక విధమైన భయం కూడా ఏర్పడింది. దానితో పాటు కమల యెడ మమకారం, మమత రాను రాను భరించలేనంత అభివృద్ధి చెందింది. రాత్రింబవళ్లు ఆ రూపమే అతనికళ్ళకుకట్టినట్లు కనబడుతు వుండేది. కమల కంఠస్వరం వినాలనే కాంక్ష హద్దుమీరి ప్రవర్తించేది. భరించలేని యీ బడబాగ్ని దహించి వేసే ద్రావణంలాప్రసాద్ ని ప్రచండునుగా చేసి వేసేంది. శరీరంలోని అణువు అణువు కమల నామాన్నే వుచ్చరించేది. అర్థరాత్రి హఠాత్తుగా లేచి కారు తీసుకుని బయలు దేరేవాడు. ఆ తరువాత నాలుగు ఐదురోజులుదాక కనబడే వాడు కాదు. యిలాంటి ప్రవర్తనకు చంద్రిక అలవాటుపడినా ప్రసాద్ లోని కర్కశత్వమే ఆమెను బాధ పెట్టేది.

చంద్రిక ఒకనాడు కమలతో సంగతాంతా చెప్పింది. కమల విని చాలా బాధపడింది. కారణం కొంతవరకు మాత్రమే గ్రహించగలిగింది. రెండు మూడు నిముషాలు వేదనాపూరిత వదనంతో ఆలోచిస్తూ కూర్చుంది.

"ఇంతలో ఆశ్చర్యపడ వలసినది ఏమి లేకపోయినా విచారించవలసినది చాలావుంది చంద్రికా? ఇదేమి ఈనాటి సమస్య కాదు" అంది.

చంద్రికకు కాస్త కోపం వచ్చింది. "చంద్రిక అనే వ్యక్తి నువ్వు నీయెదుట చూస్తు ఏవగింపుతో ముఖం ప్రక్కకు తిప్పుకోకుండా మాట్లాడుతున్నారంటే అదంతా మామయ్య ప్రతిభే. చంద్రికకు వేరే వ్యక్తిత్వం లేనే లేదు. కమలా ఈ విషయం నువ్వు పూర్తిగా గ్రహించినట్లయితే ఇంత చులకనగా మాట్లాడవు" అంది.

చంద్రిక కంఠ స్వరం కమలను చకితను చేసింది. ప్రసాద్ ఎడ చంద్రికకు వున్న నిశ్చలమైన కృతజ్ఞత , గుడ్డి నమ్మకం, ఆమెకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే వుంటుంది. కాని ఆమెని అప్పుడప్పుడు భయపెట్టే దేమిటంటే ఈ సంపూర్ణ సమర్థన చివరకు ఏరూపంలో పరిణమిస్తుంది? ప్రసాద్ ఆలోచనలు చంద్రికకు తెలిస్తే ఆమె కమలయెడ ఏవిధంగా ప్రవర్తిస్తుంది? కమలవద్ద నుంచి కూడ సమర్పణ ఆశిస్తుందా!

"చులకన చేయడము లేదు చంద్రిక చేసేదేమి కనబడటం లేదంటున్నాను" అంది.

"ఎందుకు లేదు కమల నువ్వంటే మామయ్యకు ఎంత అభిమానమో ఎంత గౌరవమో నాకు తెలుసు నీమాట కాదనడు" అంది.

కమల హృదయం బరువెక్కింది. క్షణకాలం మౌనం వహించి మనస్సు కుదుట పరచుకుని "లేదు చంద్రిక అధికారం నీకు రజనికి మాత్రమే వుంది. అది సంపాదించాలనే ఆశ కూడా నాకు సుతరామూ లేదు. ఇతరులు నాకు వుందని భ్రాంతి పడితే నేను సహించలేను" అంది.

రజని జ్ఞప్తికివచ్చి చంద్రిక ఆమె వద్దకు వెళ్ళింది

"అంత చెప్పి రజనీ ప్రపంచకంలో ఎవరైనా నీ తరువాతనే అని మామయ్య ఒకసారి అన్నాడు. అధికారం బాధ్యత నీ మీద వున్నది రజనీ"

"ఇతరులకి కర్తవ్య బోధన చెయ్యటం నాకు అలవాటు లేదని నీకు తెలుసు చంద్రిక. ప్రసాద్ కు కూడా అది రుచించదు. అయినా ఇది కేవలం ప్రసాద్ కు సంబంధించిన విషయంకాదని నాకనిపిస్తూంది." అని వెంటనే మాటలు మార్చి"కర్తవ్యం అనే నెపంతో ప్రసాద్ స్వాతంత్రాన్ని అరికట్ట ప్రయత్నించడం అవివేకంకూడాను" అంది.

చంద్రికకు కోపంవచ్చి "కృతజ్ఞతను గుర్తించననే నెపంతో కర్తవ్యాన్ని త్రోసిపుచ్చుతున్నావు రజనీ. కాని చంద్రిక అలాంటిది కాదు" అని బయటకు వెళ్ళిపోయింది.

ఇంటికి తిరిగివచ్చి చంద్రిక పరిపరివిధాల ఆలోచించసాగింది. ప్రసాద్ ను బాధించే కారణం ఆమెకి యెంత వెతికినా ఆమెకి చిక్కలేదు. రజని అన్న ఒక్కమాట ఆమె హృదయంలో పలుమారులు మారుమ్రోగింది.

ఇది కేవలం ప్రసాద్ కి సంబంధించిన విషయం కాదని, నాకు కనిపిస్తూంది. అయితే ఆరెండో వ్యక్తి ఎవరూ? ఎంత ఆలోచించినా ఆమెకు అర్ధం కాలేదు. ప్రసాద్ కి అనేకమంది స్నేహితులున్నారు. అనేక ప్రదేశాలకు వెళుతూ వుంటాడు. అది ఆమెకు ఎప్పుడూ చెప్పడు. అతని జీవితంలో తనస్థానం తగు స్వల్పమైనది. కాని ఆమెకు అతనిని మించిన ఆప్తులు లేరు. ఇక వేరే వ్వకిత్వమే లేదు. ప్రసాద్ ని అడిగి తెలుసుకుంటే తప్పేముంది. అవకాశం మూడు రోజుల తరువాత మాత్రమే ఆమెకు లభించింది. ప్రసాద్ ఆ రాత్రి కాస్త శాంతంగా వున్నాడని ఆమె అనుకుంది, దగ్గరకు వెళ్ళి సూటిగా "మామయ్య మీరు కొంత కాలం నుంచి ఏదో బాధ పడుతున్నట్లున్నారు కారణం నాతో చెప్పరా?" అంది.

"ప్రత్యేకమయిన కారణం ఏమి లేదు. చంద్రికా ఇదేమి కొత్త కాదు" అన్నాడు మృదువుగా

చంద్రిక తల అడ్డం తిప్పుతూ "కాదు ఏదో వుంది నాతో చెప్పక పోతే నామీద ఒట్టే" అంది.

ప్రసాద్ కు నవ్వు వచ్చింది. కాస్త బాధకూడా కలీగింది. "జీవితంలో ఎవరి యుద్ధాన్ని వారే నడుపుకోవాలనే సూత్రం అప్పుడే మరచిపోయావా చంద్రికా?" అన్నాడు.

"మరచిపోలేదు మామయ్య కాని నాకు మీ చ్ఛాయలో తప్ప వేరే వ్యక్తిత్వం లేదు. స్థానం లేదు. అలాంటిటప్పుడు నాకు చెప్పగుండా వుండటం మీలోని ఒక భాగాన్ని అంధకారంలో వుంచడం సమం అవుతుంది" అంది.

ప్రసాద్ "అవి వివేకవంతమయిన మాటలు కావు, చంద్రిక" అని ఏదో అనబోతుంటే చంద్రిక అడ్డము వచ్చింది.

"ఉద్రేకంతో, వివేకం నాకు పని లేదు, వివేకవంతమైన నేనెందుకుచెయ్యాలి? కృతజ్ఞతతో మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకముంది. మీకు లేనంత మాత్రాన నాకు వుండకూడదనే అధికారం మీకు లేదు. నాజీవితంలో మీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. నాసర్వస్వము మీదే. దీనికి మా యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు" అంది .

చంద్రిక వుద్రేకవంతమైన మాటలు ప్రసాద్ ని ఎంతో ఆశ్చర్యపరచేయి. ఆమె మాటలు పూర్తి అర్ధం ఆమె గ్రహించిందా అనే అనుమానం కలిగింది. చంద్రికను మొదటిసారి చూచినప్పుడు కమలన్న మాటలు జ్ఞాపకమచ్చేయి. "కృతజ్ఞత అనే మైకంలో పడి నీయెడ నీకున్న కర్తవ్యాన్ని మరచిపోతావనే నాకు భయంగా వుంది చంద్రిక. అది యెన్నడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కప్పి బుచ్చకూడదు. యీప్రమాదం నుంచే నిన్ను నువ్వే కాపాడుకోవాలని నాకనిపిస్తోంది" అని ప్రసాద్ ని అనుమానించి అన్న మాటలు, చంద్రిక మాటలు వాటి సత్యాన్ని నిరూపించాయి. ఆనాడు ఆ మాటలు విన్నప్పుడు తాను చంద్రికకు ద్రోహం చేస్తాననే అనుమానం కమలకి కలిగినందుకు బాధపడ్డాడు. ఈనాడు చంద్రిక సంపూర్ణ సమర్పణ హృదయంలో ములుకుల్లా గుచ్చుకుంది.

చంద్రిక "జీవితంలో స్పర్శజ్ఞానాలకీ , తర్కశాస్త్రానికి మించిన విలువలు కొన్ని ఉంటాయని కమల అంటుంది. వాటిలో నాకు ఆట్టే నమ్మకం లేకపోయినా ఈనాడు నాకెందుకో నాముఖందాచుకోవాలనిపిస్తోంది" అన్నాడు.

చంద్రిక ఇంకా ఆ వుద్రేకంతోనే వుంది. "మాటలు తప్పించకండి మామయ్య. మిమ్మల్ని బాధపెట్టే విషయ మేమిటో మీరు చెప్పాలి" అంది .

ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్పు విడచి "ఒక స్త్రీని ప్రేమించాను చంద్రికా. అహర్నిశలు ఆమె రూపమే నా నేత్రాల ముందు మెదుల్తూంది కాని ఆమె నన్ను అసహ్యించుకుంటుంది. చీడపురుగులా ఏవగించుకుంటుంది. ఇది నేనెలా సహించగలను?" అన్నాడు.

ప్రసాద్ మాటలు చంద్రికను దిగ్భ్రాంతురాలిని చేశాయి. రజని మాటలలోని సత్వం ఆమెకు తెలిసివచ్చింది.

"ఆమెఎవరో చెప్పండి! నేను వెళ్ళి బతిమిలాడుతాను. ఆమె మనస్సు మారుస్తాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయివుంటుంది. నాకు చెప్పండి" అంది.

"లేదు చంద్రికా అది నీ సాధ్యం కాదు. పేరు తెలిసి నువ్వు ఆవిధంగా ప్రయత్నించేవంటే పరిస్థితి ఇంకా విషమిస్తుంది" అన్నాడు.

చంద్రిక దానికి సమాధానం చెప్పలేదు. తల పూర్తిగా క్రిందకు దించి వేసుకుని "ఆమెతప్ప యింకెవరూ మీకు సరిపడదా?ప్రేమించలేరా ? అంది నెమ్మదిగా.

చంద్రిక మాటలమధ్య వున్ననిగూడార్ధాన్ని ప్రసాద్ గ్రహించాడు. సిగ్గుతో తలంచుకొనివున్న ఆమె కేసి తేరిపార చూచాడు.

"యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు చంద్రిక. ఇది నా కెంతో విచారాన్ని కలిగిస్తోంది కమల హెచ్చరికని నిరూపించకు" అన్నాడు.

"సహజమైన వుద్రేకాన్ని, అసభ్యత అనే పదానికి భయపడి అణచకోవడం ఆత్మవంచనయని మీరేకదా చెప్పేవారు, స్వవిషయం వచ్చేసరికి మీరు కూడా అందరిలాగే సంఘానికి భయపడి తిరస్కరిస్తారా? మీరుకూడా ఇంతేనా? అంది.

చంద్రిక మాటల రూపు ప్రసాద్ ని లోలోన కొంచెం భయం పుట్టించాయి. తన ప్రబోథం తిరిగి తనకే వప్పగిస్తోంది. చంద్రిక ఆనాడు రజనీకి ప్రతిబింబంలా అతని కంటికి కనబడింది. ఆ యువతి భవిష్యత్తు అతనికే భయం కలిగించింది. రజనీవంటి సౌందర్యవతి కాదు. ఆగ్నిలాంటి ఆత్మవిశ్వాసం కూడా లేదు. అయినా భయంకరమైన నిర్భయత్వం, నివురు గప్పిననిర్లక్ష్యం ఈమెలోకూడ మూర్తీభవించి వున్నాయి. ప్రచండ మయిన స్త్రీ సాహస శక్తి ముందు ఎంతటి పురుషుడైనామోకరిల్లవలసిందే,

"సంఘానికి భయపడటం లేదు. చంద్రిక ఒకరికి సహజమయినది ఇంకొకరికి అసహజంగా కనబడటం కూడా సహజమే, ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడిప్పుడు తెలుసుకున్నాను. ఒక వ్యక్తి ఇంకొకరిని నిజంగా ప్రేమిస్తే తప్పనిసరిగా వారంటే కొంచెం ఆ వ్యక్తికి భయం కూడా వుంటుంది. ఇది అసందర్భముయినా ఎందుకో చెప్పాలనిపించింది ఆన్నాడు ప్రసాద్

"ఇదే విషయం రజని వొకసారి చెప్పింది. అందుకు కారణమేమంటే రెండవవ్యక్తి ప్రేమించబడుతున్నాడు. నిజంగాప్రేమించడం లేదు" అంది చంద్రిక.

రజని అన్న మాటల సత్యం తనలో తానే అతను గ్రహించగలిగాడు.ఆమె బుద్దితీక్షణతకు అతని హృదయమంతా గౌరవంతో నిండిపోయింది. రజని తనని విడచిననాడే అతని జీవితం చుక్కాని లేని నావ అయిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న, జలగర్భంలో పాషాణాన్ని నావ ఎప్పుడు వెళ్ళి కలుసుకుంటుందా?ప్రసాద్ మౌనం చంద్రికను మళ్ళీ కొంచెం వుద్రిక్తనుచేసింది.

"నా ప్రశ్నకు సమాధానం యింకా చెప్పలేదు మామయ్య.మీరు కాంక్షించే ఈ స్త్రీ స్థానాన్ని ఇంకెవరు ఆక్రమించలేరా?"అంది.

ప్రసాద్ హఠాత్తుగా లేచి వుద్రిక్తమెన కర్కశ స్వరంతో "లేదు చంద్రికా, యింకెవరు ఆక్రమించుకోలేరు" అని బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలలోనే కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. చంద్రికకు దుఃఖం ముంచుకొచ్చింది. తన ప్రయత్నమంతా విఫలమయిపోయింది. ప్రసాద్ ని ఆ అజ్ఞాన స్త్రీ నుండి రక్షించుకోలేకపోయింది.

 

చాప్టర్ 19

విశాల వెళ్ళిపోయిన తరువాత రజనికి కాస్త విశ్రాంతి తీరిక చిక్కాయి. కాని మనస్సులో అశాంతి కూడా చెల రేగింది. ప్రపంచంలో అందరు ఆమె ఆస్కారం అర్ధించేవారేకానిచేయూతనిచ్చే వారు లేరు. రజని ఒక ద్వీపం లాంటిది. ద్వీపం నలుప్రక్కలా కనబడే సముద్రాన్ని చూచి మనమంతా మోసపోతాము. అది ఇతర భూభాగంతో సంబంధం లేని ప్రత్యేకమయిన పూర్తి స్వాతంత్యంగల ప్రదేశమని మనమంతా భ్రమపడతాము. కాని నిజానికి అది సత్యం కాదు. సముద్రపు అట్టడుక్కి వెళ్ళి పరిక్షించి చూస్తే మనకు కనబడేది కూడా భూమే. అదే ద్వీపానికి వున్నలంకె బ్రహ్మాండమైన సముద్రం దానిని పూర్తిగా నలువైపులా కప్పి వేసి భ్రాంతిని కలిగిస్తూంది? రజనీ కూడా అలాంటిదే. అందరు అమెను చూచి అపోహడతారు. తోటి మానవుల అవసరం లేని సంపూర్ణ వ్యక్తి అని అనుకుంటారు. ఈమె నిర్భయత్వం, స్వాతంత్రత, సముద్ర తరంగాలలాగే అందరిని మోసపుస్తాయి. బాల్యం నుంచీ విశాల, రజని కలసి మెలసి పెరిగి పెద్దవారయ్యారు. విశాల విలువ ఆమెకి ఆనాడు అర్థమయింది. మొదటిసారిగా రజనికి తాను ప్రపంచకంలో ఏకాకి అనే సంగతి ఏర్పడింది. కాని ఆలోచన క్షణికంమాత్రమే మెదిలింది. మరుక్షణంలో రజని మారుప్రశ్న వేసింది. అయితే ఏకాకి కానివారెవరు? రక్త సంబంధం, స్నేహలత,ప్రేమబంధం. ఇవన్నీ తాత్కాలికమయినవే కదా? జన్మించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే.మరణించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే, యీ మధ్యలో మనల్ని పట్టుకొని పీడించేవే యీ భ్రాంతి.

రజని రామాన్ని చూచి చాలా కాలమయింది. అతను కూడా ఆమెవద్దకు రాలేదు. దాని అర్ధం ఆమె గ్రహించక పోలేదు ఏదో విషయంలో కోపగించుకుని వుంటాడు, మనస్సులో దాచుకుని బాధపడుతూ వుంటాడు. కొంత కాలంనుంచి ఆమె అతని గురించి ఆలోచిస్తుంది. అతనిని ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. జాలి, దయ, ఆదరం, అనురాగం అన్నీ కలసి ఆమె హృదయంలో మెదుల్తూ వుంటాయి. అతని హృదయంలోని అమితమయిన ప్రేమ ఆమె గ్రహించింది. అది అపరిచితమైనదని, తిరస్కారం సహించలేదని, ఆమెకు తెలుసు. దాని పర్యవసానమేమిటా అని ఆమెకు అప్పుడప్పుడుభయంకూడా వేసేది. దానికి కొంత వరకు ఆమె భాద్యురాలు. మొదట అతనిని ప్రేమించి, పీడించి అనురాగపు బీజాలను అతని హృదయంలో నాటిన వ్యక్తి ఆమెయే అతనిలో మొదట అగుపించిన ఏవగింపుని, ఆమె సవాలుగా స్వీకరించాలని పాదాక్రాంతుని చేసుకోవాలని ప్రతిష్టపెట్టింది. నిజానికి ఆ ప్రయాస అనవసరమని ఆమె గ్రహించలేక పోయింది. క్షణకాలంలోనే అతని హృదయాన్ని వశపరచుకుంది. అపురూపమైన సౌందర్యం విచిత్రమైన ఆమె ఆశయాలు అగ్నిలాంటి ఆత్మవిశ్వాసం, అతనిని పూర్తిగా తన్మయుని చేశాయి. అతనిలో లోపించిన గుణాలన్నీఅతనికి ఆమెలో దృగ్గోచరమయ్యాయి. ఆమె మీద ఒక విధమైన గుడ్డి నమ్మకంగా ఏర్పడింది. ఆమె ప్రదర్శించే ఆ చనువు, విశ్వాసము రామం అనురాగపు చిహ్నాలుగా అర్ధం చేసుకున్నాడు. తన సర్వస్వాన్ని సమర్పించి ఆమె నీడలో నిశ్చింతగా జీవితం గడపాలనే వాంఛని రామం జయించలేకపోయాడు. ఇదంతా రజని గ్రహించకపోలేదు కానీ ఆమె వారిరువురి స్వభావాలకి మధ్యనున్న అగాధాన్ని కూడా గుర్తించింది. ఆమె నుంచి అతనికి కావలసింది ఎన్నడు లభించలేదు. ఆమెకి కూడా అతని నుంచి ఆమె వాంఛించేది లభించలేదు. రజని ఎంత స్వతంత్ర మనస్తత్వం కలదైనా ఆమె ఇతరుల రక్షణ క్షణికంగా వాంచిస్తుంది. బలమైన బాహువులతో చేరదీసి అభయ హస్తం యిచ్చే వ్యక్తి అవసరం రావచ్చు. ఎంతైనా ఆమె స్త్రీ, రామం ఆపాత్ర ఎన్నడు నిర్వర్తించలేడని ఆమెకు తెలుసు. ఎంతసేపూ అతను ఆమె మీద ఆధారపడివుంటాడు. తన భారమంతా ఆమె భుజస్కంధాల మీద వేస్తాడు కాని ఆమె భారాన్ని ఏమాత్రమూమోయలేడు. అని బుద్ధికుశలతలో విశ్వాసం వుంచే సాహసం ఆమె చేయలేదు. అయితే అ యెడ ఆమె కర్తవ్యం ఏమిటి? వారం రోజులు గడచిపోయాయి. ఈనాటి సాయంకాలం రజని రామం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. రెండుమూడు నిముషాలవరకు తలుపు తెరవబడలేదు. రజని మళ్ళీ తలుపు తట్టుతూ "నిద్రపోతున్నారా ? రామంబాబూ ! మేలుకొలుపు పాడమంటారా?" అంది.

వెంటనే తలుపు తెరచుకొని ఒక యిరవయి సంవత్సారాల యువతి వచ్చి కొంచెం కోపంతో "ఎవరు మీరు? ఎవరు కావాలి?"అంది. రజని క్షణకాలం నిర్ఘాంతపోయింది. కొద్ది క్షణాలవరకు ఆమెకు చేదోడువాదోడుగా వుండే సమయస్ఫూర్తిని కోల్పోయింది

సమాథానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది "ఎవరు మీరు? రామం బాబుకు ఏమవుతారు?"అంది. యువతి "అవ్వవలసినవాళ్ళమే అవుతాము కాని ముందర మీరెవరో చెప్పారు కాదు" అంది.

రజని అప్పటికి తిరిగి సమయస్ఫూర్తిని సంపాదించింది,

"రామంబాబు లోపలవుంటే రాక్షసి వచ్చిందని చెప్పండి" అంది.

రాక్షసి అనే పేరు విని ఆయువతి పక పక నవ్వుతూ"రాక్షసా! మీ సౌందర్యానికి తగిన పేరు పెట్టారు. రండి లోపలికి రండి. నా పేరు మీ అంతటి చక్కనిది కాదు. అతిసాధారణమైనది రాధారాణినాకు రామం బావ అవుతాడు నిన్ననే వచ్చాము. మా మావయ్య నేనూనూ" అంది.

ఈ లోపున లోపలినుంచి ఒక అరువది యేళ్ల ముసలాయన బయలుకు వచ్చి" ఎవరితో మాట్లాడుతున్నావు రాధా"? అన్నారు

బయటకు వచ్చి రజనిని చూసి "కళ్లకు మిరుమిట్లు గొలిపే యి స్త్రీ ఎవరు రాధా"? అన్నాడు.

రజని రాధని సమాథానం యియ్యనియ్యలేదు. ఆయన రామం తండ్రి అని గ్రహించింది. దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించి నన్ను రజని అని పిలుస్తారు బాబాయి. రామం బాబుని కలుసుకుందామని వచ్చాను" అంది.

రజని అందం వినమ్రత, మందహాసం, సరళత్వం ఆవృద్దుని ముగ్దున్ని చేసాయి. హఠాత్తుగా హృదయమంతా పితృ ప్రేమతో నిండిపోయింది. అప్యాయంగా "రా అమ్మా! లోపలికి రా! మావాడు నీ గురించి నిన్ననే చెప్పాడు. నిన్ను ఎప్పుడు చూస్తానా అని ఆతురత పడుతున్నాను" అన్నారు.

ఈ రాధకి కూడ అప్పుడు రామం రజని గురించి చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. రజని దగ్గరకు వచ్చి "అసలు పేరు చెప్పకుండా అలా అన్నావెందుకు రజనీ ! మా బావ నిన్ను అలా పిలుస్తాడా" అన్నది.

"లేదమ్మా! అలా పిలవమని అందరినీ అర్దిస్తూ వుంటాను. కాని అంతా పెడచెవిని పెట్టెవారే ! అది నా రూపానికి వర్తించకపోవచ్చు. కాని నా స్వభావానికి సరిపడుతుంది," అని నవ్వి" చక్కటి పేరు. కృష్ణుడిని వెదుక్కుంటూ వచ్చావా రాథా"? అంది నవ్వుతూ.

రాధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అప్పుడు విశ్వనాథంగారు రామం తండ్రి నవ్వుతూ మాటలో కూడ చమత్కారం. కాని నువ్వు అన్నదే నిజం చిన్నతనం నుంచీ రామానిచ్చి రాధకి వివాహం చేయాలని మేమంతా నిశ్చయించుకున్నాము. ఇక్కడ వచ్చింతర్వాత రామం ఎన్ని వుత్తరాలు వ్రాసినా ఆ విషయంలో ఏమి జవాబివ్వలేదు. అందుకని మా రాధని తీసుకుని వచ్చాను. ఢిల్లీని కూడ చూసినట్టు వుంటుంది.

రజనికి రామం వొకసారిఆ విషయంలో రామం తండ్రి రాసిన వుత్తరం చూపించాడు. అది యిప్పుడు ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఓక్షణకాలం ఆమె హృదయంలో కల్లోలం చెలరేగింది. ఇన్నాళ్ళు ఏ వ్యక్తియితే ఎల్లప్పుడూ తనవాడే అనుకుంటూ వచ్చిందో అతగాడు కూడ పరాయివాడేనని ఆమె గ్రహించింది. ఒకనాడు సరదాగా మీ యింటికి వచ్చి తలుపు తట్టితే ఎవరో పరాయి స్త్రీ వచ్చి తలుపు తెరచి "రజని అనే శబ్దానికి వారి జీవితంలో స్థానం లేదు, వారి అర్ధాంగిని నేను. వారి సర్వస్వంలో నాకు సమపాళ్ళున్నాయి "అని గర్వంతో తలుపు మూసివేస్తుంది." అని రజని వేళాకోళం చేసింది. అది యీనాడు నిజమయింది. క్షణకాలంలోనే రజని మనసులో ఆలోచనలన్నీ సాగిపోయాయి.

రజని సమాధానం చెప్పేలోగా రామం వచ్చాడు. రజనిని రాధని తండ్రిని కలసి చూసి క్షణకాలం ఆశ్చర్యంతో గుమ్మంవదే నిలబడిపోయారు. రజని, రాధా అంత త్వరగా కలుసుకుంటారనీ అనుకోలేదు. మర్నాడు రజని వద్దకు వెళ్ళి రాధ రాక గురించి, తన అభిప్రాయాల గురించి చెప్పుదామనుకున్నాడు. అనుకోకుండా కథ అంతా అడ్డం తిరిగింది.

రామాన్ని మొదట రాధ చూసి వెంటనే "ఏమిటి బావా రజనికి రాక్షసి అని పేరు పెట్టావుట! ఆ విషయం మాతో చెప్పనేలేదు. ఇంటి తలుపు తట్టి రాక్షసి వచ్చిందని రామం బాబుతో చెప్పమని అంటే నాకర్థం కాలేను"అంది.

రాధ మాటలు విని రామం ముఖం ఎర్రబడింది. రజని కేసి కోపంగా చూసాడు.

ఈ లోపల రామం తండ్రి "అలా చూస్తావేమిటి రా? ఇంటికి వచ్చిన వారిని యిలాగేనా పరామర్శంచడం" అన్నాడు.

రామం వులిక్కిపడి "ఏం లేదు నాన్నా రజనిని హఠాత్తుగా యిలా చూసి చాలా ఆశ్చర్యపోయాను." అని లేని నవ్వు తెచ్చుకొని "మా నాన్ననీ, రాధనీ రేపు నీదగ్గర తీసికొని వచ్చిపరిచయం చేద్దామనుకున్నాను. కాని నువ్వు వచ్చావు" అన్నాడు.

రజని నవ్వి "అదంతా బూటకం, నేనే యిక్కడకు రాకపోతే వీరిని నాకు పరిచయం చేసే వారే కాదు! బాబాయినీ, రాధనికలుసుకునే అవకాశమే లభించేది కాదు" అంది.

అందరి ఎదుట రజని అలా మాట్లాడటం రామానికి ఎంతో సిగ్గనిపించింది. ముఖ్యంగా తండ్రి ఎదుట అలా మాట్లాడటం అతనికెంత మాత్రము నచ్చలేదు .

కోపాన్ని దిగమింగి "రజని చమత్కారి నాన్నా. ఆమెను మాటల్లో జయించడం హరి బ్రహ్మాదులకు కూడా సాధ్యంకాదు" అన్నాడు

"బావా అలసి వచ్చావు. కాస్త ముఖం కడుక్కొని రా, కాఫీ తాగుదువుగాని" అంది రాధ.

అలాంటి అవకాశం కోసమే రామం ఎదురు చూస్తున్నాడు, అది జారవిడవకుండ లోనికి వెళ్ళిపోయాడు.

రామం తండ్రి దీర్ఘంగా నిట్టూర్చి "త్వరలో వీళ్ళిద్దరికి వివాహం చెయ్యాలని నా అభిలాషమ్మా, రాధ తండ్రి లేనిది. మాఇంటిలోనే పెరిగింది" అన్నాడు.

రజనీ హృదయం ఒక్కసారి గతుక్కుమంది. మనస్సు మళ్ళీ కల్లోల పూరితమైంది. అలా ఆయన రెండవసారి అనటానికి కారణం లేకపోలేదు. మొదట రామం రజనిని గురించి చెప్పినప్పుడే వారిద్దరిమధ్య సంబంధమేమిటా అని ఆయన అనుమానించాడు. రాధ యేమి గ్రహించలేకపోయినా అనుభవజ్ఞానం గల ఆవృద్దుడు రామం, రజని మధ్య కేవలం స్నేహంమాత్రమే కాదని ఆయన గ్రహించాడు , రజనిని చూసిన తర్వాత ఆమె అందం, చమత్కారం ఆయన్ని భయపెట్టాయి. రజని వలలో పడినట్లయితే రామానికి విముక్తి లేదని గ్రహించాడు.రజనికి మొదట రాధా రామాలమధ్యవున్న సంబంధం వెల్లడించి ఆమెని హెచ్చరించుదామనే ఆయన వుద్దేశ్యం. రజని అది గ్రహించింది. ఆత్మ నిగ్రహం ఆమె వుగ్గుపాలతో నేర్చుకున్న విద్య. తన భావాలన్నింటినీ కప్పివుంచి సహజకంఠస్వరంతో "తప్పక అలాగే చెయ్యండి బాబాయి. రాధచక్కటిది రామం బాబుకి అన్ని విధాలా సరిఅయినది" అంది.

రాధ సిగ్గుతో తలవంచుకుంది. విశ్వనాధంగారు "చిన్నతనం నుంచే ఇది వారిద్దరికీ సమ్మతమే. ఇకముహూర్తం పెట్టడమే మిగిలింది" అన్నాడు.

విశ్వనాధంగారు మాట్లాడే మాటలు వొక్కటే చాకులా రజని హృదయంలో గుచ్చుకుంటున్నాయి. ఈసారి వారి మాటలకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదనుకొని రజని మౌనం వహించింది. కాని ఆయన వూరుకోలేదు.

"రామానికి శలవు లేదని అంటున్నాడు. అందుకని నేనొక వుపాయం ఆలోచించాను. వివాహం ఇక్కడే చేస్తే సరిపోతుంది. రాధ తల్లికి అభ్యంతరం లేదనుకుంటాను. ఇవాళే వుత్తరం వాస్తాను" అని రజని కేసి చూశాడు. మేఘావృతమైన రజని ముఖం ఆయన చూపుల తీక్షణతని సవాలుగా అంగీకరించింది.

నవ్వుతూ "చక్కటి వుపాయం త్వరలోనే కానియండి. నేను కూడా చూడటానికి వీలుపడుతుంది? అంది.

రాధ ఇప్పటివరకు మౌనం వహించింది కాని ఈసారి వూరుకోలేదు "ఎక్కడయినా ఎప్పుడయినా నువ్వు లేకుండా జరుగదు రజనీ" అంది.

రాధ మొదటి నుంచి ప్రదర్శిస్తూన్న ఆప్యాయత రజనీ హృదయాన్ని వశపర్చకొంది, రాధరూపంకూడ మనోరంజకంగా వుంది. మొదటి చూపుల్లోనేచూపరుల అనురాగాన్ని వశపర్చుకునే అమాయక నేత్రద్వయం, నవ్వితే సొట్టలుపడే బుగ్గలు, శరీర ఛాయ తెల్లటి తెలుపు కాకపోయినా నిర్భయంగా తెలిపే శరీర దారుఢ్యం లేకపోయినా, ఆ సన్నటి పల్చటి శరీరంలోంచి ఏదో వర్ణించరాని ఆకర్షణ కనబడుతుంది. రాధ రామానికి సరిఅయిన స్త్రీ అనీ, వారిద్దరి మనస్తత్వాలు సరితూగుతాయని ఆమె కొద్ది కాలంలో గ్రహించింది.

రామం లోపలినుంచి బయటకు వచ్చాడు. రాధ కాఫీ తీసుకు రావడానికి లోనికి వెళ్ళింది. విశ్వనాథంగారు రామం రజనిల విషయం అప్పుడే తేల్చుకుందామని నిశ్చయించుకున్నారు.

"ఏరా రామం అత్తయ్యకు ఉత్తరం రాస్తాను. ఇక్కడకు వచ్చెయ్యిమని చెప్పి నీకు సెలవు లేదంటున్నావు కాబట్టి వివాహం ఇక్కడే కానిచ్చయమందాము" అన్నాడు.

రజని ముందు ఆ మాటలు అనటం బొత్తిగా అతనికి యిష్టంకాదు. అవమానంతోటి, దుఃఖంతోటి అతని హృదయం దహించుకుపోయింది. పెదిమలు వణికిపోతున్నాయి. రామం దుఃఖం గట్టులు తెంచుకుంటుదేమోననీ రజని భయపడింది. రామం ముఖం పైకెత్తి రజని కళ్ళలోకి వొకసారి చూశాడు. తన తండ్రి మాటల ప్రభావం ఆమెయెడల ఎలా వుందా అని పరిశీలించాడు. ఆమె నేత్రాలలోని విశ్చలత, నిర్మలత్వము అతనిలో లేని మనస్థయిర్యాన్ని కలగ చేసాయి.

"ఇప్పుడు అదంతా ఎందుకు నాన్నా! ఇప్పుడు తొందరయేమిటి?" అన్నారు.

"తొందర ఎందుకు లేదురా! నీకంటే రాధ వయస్సుతో నిమిత్తం లేకపోవచ్చు. కాని వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంది. నాకూ యీ బాధ్యత తీరిపోతుంది. ఇంకా నేనెన్నాళ్లు బ్రతుకుతాను" అన్నాడు.

రామం సంభాషణ కట్టి పెట్టి వేద్దామనే వుద్దేశ్యంతో "తరువాత ఆలోచించి చెపుతాను నాన్నా" అన్నాడు.

అదే సమయానికి రాధ కాఫీ తీసుకువచ్చి రామానికి, రజనికి యిచ్చింది. ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయింది.

కాఫీ తాగుతూ రజని అంది "ఢిల్లీ చూద్దామనే వుద్దేశ్యంతోమీనాన్నగారు, రాధా వచ్చారు? ఏం చెయ్యదలుచుకున్నారు" అంది.

రామానికి టూరిష్టు బస్సు జ్ఞాపకానికి వచ్చింది. చింతాక్రాంత వదనంతో చిరునవ్వుతో "టూరిష్టు బస్సు మాత్రం వద్దు రజనీ, కంగారుకూడలేదు. నెమ్మది నెమ్మదిగా నొక్కక్కటి చూడవచ్చును. ఆయినా ఆ బాధ్యత నువ్వే వహించాలి" అన్నాడు.

రాధ "అవును రజనీ! బావమీద బాధ్యత పెట్టావంటే అది యింకా బరువెక్కుతుంది. పైగా ఆఫీసునుంచి వచ్చే సరికి ఆలస్యమవుతుంది. శీతాకాలం కూడాను త్వరగా చీకటి పడుతుంది" అంది.

రజని –"చీకటి పడింతర్వాతే చూడవలసిన కొన్ని వున్నాయి రాధా, రామం బాబుకి చీకటి అంటే యిష్టం" అంది.

అందరూ నవ్వారు. రజని లేచి నిలబడి "ఇక నేను వెళ్తాను చీకటి పడింది" అంది.

విశ్వనాథంగారు "మావాడికి నువ్వుకూడ చెప్పి చూడమ్మా, మేము ఒక నెల రోజులకన్నా ఎక్కువకాలం వుండలేము. ఈ లోగానే అన్ని కార్యాలు సక్రమంగా నిర్వర్తించుకోని వెళ్లాలని నా అభిలాష" అన్నాడు.

తండ్రి మాటలు రామానికి కోపం తెప్పించాయి, రజని మీద కూడ ఆ కారణంగా కోపం వచ్చింది. రజని సమాధానం చెప్పే లోగానే రామం "ఇందులో రజని చెప్పవలసిందేమి లేదు నాన్నా. మీ మాటకన్నా ఆమె మాటంటే నాకెక్కువ విలువ లేదు" అన్నాడు.

రజని రామం కళ్ళలో చూసింది. రామం ముఖం తిప్పుకొని "పద రజనీ, నిన్న బస్సు ఎక్కించి వస్తాను" అన్నాడు.

"పదండి" అంది రజని.

రాధ "తరచుగ యిక్కడకు నువ్వు వస్తూండాలి రజనీ. నాకు యింకెవరూ తోడు లేరు. బావ మాకు ఢిల్లీని చూపించే భారం కూడ నీమీదే వేసారు" అంది.

"ఆలాగే రాధా" అని విశ్వనాథంగారికి నమస్కరించి బయటికి వచ్చేసింది.

బయటకు వచ్చి యిద్దరూ నడక సాగించారు. కొన్ని క్షణాలవరకు ఎవ్వరూ మాట్లాడలేదు.

రజని "బలాడ్యులనీ, పొడుగ్గా వున్నారనీ అంత వేగంగా నడుస్తే నేనేమయిపోతాను చెప్పండి" అంది నీరసంగా.

"ఇన్నాళ్లు నేను నిన్ను అనుసరిస్తూ నీ వెంటవచ్చాను రజనీ, కాని యీ నాటినుంచి నీవు నన్ను అనుసరించాలి" అన్నాడు.

"చివరి మాట రాధతో అనవలసిన వాక్యం రామం బాబూ రజనితో కాదు" అంది.

రామం దానికి సమాథానం చెప్పలేదు. "మా నాన్నతో అలా మాట్లాడేవే" అన్నాడు.

"ఇంకేలా మాట్లాడుతాను చెప్పండి మీరు రాక మునుపు మీ నాన్నగారు మీ గురించి, రాధ గురించి అంతా చెప్పారు" అంది.

"ఇన్నాళ్లు నాకెందుకు రాధ సంగతి చెప్పలేదు! నావద్ద యిది ఎందుకు దాచారు" అని అడుగుతుందని రామం భయపడ్డాడు ఆశించాడు.

"ఆయితే మా నాన్న దగ్గర నువ్వన్న మాటలన్నీ మాటవరసకి మాత్రమే అన్నావా?" అన్నాడు.

"కాదు రామం బాబూ మనస్ఫూర్తిగా అన్నాను" అంది రామం మౌనం వహించాడు. కొంతదూరం పోయిన తర్వాత "నేను నీతో మాట్లాడాలి రజనీ" అన్నాడు.

రజని నవ్వి "ఇందాకటి నుంచి చేస్తున్నది యేమిటీ" అంది. రామం "పరిహాసం కాదు రజనీ ఇది నా జీవన్మరణాల సమస్య" అన్నాడు.

రజని "శుభమా అంటూ పెళ్ళి చేసుకోబోతూ యిలాంటి మాటలు అంటారేమిటి" అంది.

రామం "మొదటినుంచీ నన్ను ఈ వేళాకోళం చేస్తూనే వున్నావు రజనీ! ఏ విషయము నీకు సరిగ్గా మాట్లాడడానికి అవకాశం యివ్వవు" అన్నాడు.

"అయితే చెప్పండి నడిరోడ్డుమీన సావధానంగా వింటాను" అంది.

"ఇప్పుడు కాదు రేపు నిన్ను కలుసుకొని మాట్లాడుతాను" అన్నాడు.

"దానికి నా అనుమతి కావాలా చెప్పండి? అలాగే చెయ్యండి" అంది.

 

చాప్టర్ 20

ఆ రాత్రి రజని రామం గురించే ఆలోచించింది. మరునాడు రామం తనతో మాట్లాడదలచిన దేమిటోకూడ ఆమె గ్రహించింది. సమాధానం ఏం చెప్పాలో ఆమె తర్కించుకుంది. రామం మొదటనుంచీ ఆమెకొక సమస్యగానే వున్నాడు. తిరస్కరించలేని ఆ నిగూఢ ప్రేమ భరించరాని బలహీనత సంపూర్ణమైన ఆసమర్పణ ఆ సమస్యకి పరిష్కారం లభించకుండ చేశాయి. రాధా రాణీ ఆగమనం దానికి పరిష్కారంగా ఆమె మనస్సుకి తోచింది. బాల్యం నుంచి రాధకి రామం మనస్తత్వం తెలుసును. అతనిని అర్ధం చేసుకుంది. రాధ ఆధారంతో రామం నిరాటంకంగా ముందుకు సాగిపోగలడనే ధైర్యం రజనిలో కలిగింది. రామం హృదయంలో రాధ యెడల బలవత్తరమైన ప్రేమ లేకపోయినా అతని సున్నిత హృదయంలో సహజీవనం ఆ బీజాలను నాటగలదని రజనీ గ్రహించింది. ఇతరుల బరువు బాధ్యత మోయడమనేది రజనీకి కొత్త కాదు బాల్యం నుంచీ ఆమెకు అలవాటే. కాని ఆమె సమర్పించలేనిది అతగాడు ఆశించిలభించక సతమతమవుతూంటే ఆమెకు ఎంతో బాధకలిగేది. రామం జీవితంలోంచి శాశ్వతంగా తొలగిపోవాలని ఆమెకు లేదు. కాని అవసరంవస్తే అది రామం భరించగలిగే సయయం ఆసన్నమయితే అలా చెయ్యాలనే నిశ్చయించుకుంది. భవిష్యత్తులో అలా జరగక తప్పదనికూడ ఆమె గ్రహించింది. అంతవరకూ ఎవరూ సాధించలేని కార్యం రామంసాధించాడు. తనబలహీనతతోనే రజనిని బంధించి అంతవరకు వుంచగలిగాడు. ఆ బంధనలనుకూడ త్రేంచుకొనవలసిన సమయం ఆసన్నమయింది.

ఆ మరునాడు ఆఫీసులో రజనీ కాస్త పరధ్యానంగా వుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూండగా హఠాత్తుగా వర్షం పడటం ప్రారంభించింది. క్షణకాలంలోనే శరీరమంతా తడిసి పోయింది. ఎక్కడైనా తలదాచుకొందామనుకునేసరికి వెనుక గట్టిగా శబ్దం చేస్తూ కారు ఆగిన చప్పుడు ఆయేసరికి తుళ్ళిపడి వెనుదిరిగింది, టాక్సీలో రామం కూర్చుని వున్నాడు. తలుపు తెరచి "లోపలికి రా రజనీ'' అన్నాడు.

రజని నవ్వుతూ "బయటే బాగుంది. మీరు బయటకు రండి" అంది.

రామం నిజంగానే తలుపు తీసుకుని బయటకు రాబోతూంటే రజని "ఆగండి ఆగండి తరువాత మీకేమయినా అయితే నన్ను నానా మాటలు అంటారు. రాధకు నేనేమని నచ్చ చెపుతాను" అని లోనికి వెళ్ళి కారులో రామం ప్రక్కన కూర్చుంది. శరీరమంతా తడిసి ముద్దయి వుంది.

"ఇంత వర్షం పడుతూంటే నడిరోడ్డు మీద వెన్నెలలో నడుస్తున్నట్లు నడుస్తున్నావేమిటి?" అన్నాడు రామం.

"అంతా మీదే దోషం" అంది తడిగుడ్డతో ముఖము తుడుచుకుంటూ.

"నా దోషమా? నేనేం చేసేను?" అన్నాడు రామం.

"మీ గురించి ఆలోచిస్తూనే పరథ్యాన్నంగా నడుస్తున్నాను పైగా కారు ఆపి హడలగొట్టారు" అంది.

ఎంతో సరళ కంఠస్వరంతో అన్న మాటలవి. కాని రామం "హడలిపోయే స్వభావం కాదు. నీది రజనీ అందరినీ హడలగొడ్తావు. అమాయకుల్ని, అభం శుభం తెలియని వాళ్ళని అగ్నిలోకి త్రోస్తావు" అన్నాడు.

రామం మాటలు రజనికి అలవాటేకాని, ఆతను వేసిన ఆభాండం రజని వ్యధిత హృదయానికి సూటిగా తగిలింది. ముఖంప్రక్కకు తిప్పుకొని మెదలకుండా వూరుకుంది. కొంచెం సేపు సమాధానం కోసం ఎదురు చూసి రామం రజని వైపు చూసాడు. రజని సన్నగా వణుకుతున్నట్లు కనబడింది కట్టుకున్న తెల్లటి చీర, పచ్చటి జాకెట్టు శరీరంలో లీనమయిపోయింది. తీర్చిదిద్దిన అంగ సౌష్టవం స్పష్టంగా కనబడుతోంది. ముఖాన బొట్టు పెరిగింది, తల మీద నుంచి నీటి బిందువులు క్రిందకు జారుతున్నాయి. కారులో ఒక మూలకు జరిగి కళ్ళుమూసుకుని తలుపు మీద ఒరిగి వుంది. రామం మాటలు ఆమెకు ఎప్పుడూ కలిగించనంత దుఃఖం కలిగించాయి. చలితో వణుకుతున్న ఆమె సుందర శరీరం హృదయంలోని దుఃఖాన్ని యినుమడింపచేసింది. సున్నితమైన అతని హృదయంలోంచి ఆమాటలు ఎందుకు వెలువడ్డాయో ఆమెకూడ గ్రహించలేకపోయింది.

రామం సర్వస్వము మరచిపోయి రజని కేసి ఆపాదమస్తకం చూస్తున్నాడు. టాక్సీహఠాత్తుగా ఆగడంతో రామం వులిక్కిపడి బయటకు చూసి "అరె టాక్సీ లాడ్జికి వచ్చేసిందే. మీ యింటివద్దకు తీసుకువెళ్ళమని చెప్పడం మరచిపోయాను లోనికి వస్తావా రజనీ"అన్నాడు. రజని కళ్లు తెరచి తీక్షణంగా "వణకుతున్న నా శరీరాన్ని కన్నార్పకుండా రాత్రంతా చూస్తూ కూర్చుందామనుకుంటున్నారా?" అంది.

రామం సిగ్గుతో ముఖం క్రిందకు దించి వేసుకుని "పొరపాటయింది రజనీ క్షమించు." అని డైవరుతో రజనీ యింటి అడ్రసు చెప్పి అక్కడకు తీసుకెళ్ళమని చెప్పాడు. రామానికి రజనివైపుచూచే ధైర్యం లేక ముఖం పూర్తిగా ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు. రజనికూడా మౌనం వహించింది. ఒకసారి రామం వైపు చూచింది. సిగ్గుతో దహించుకుపోతున్న అతనియెడ హఠాత్తుగా ఆమె హృదయంలో అనురాగపు వర్షం కురిసింది. ఆమె అన్న మాటలు అతనిని ఎంత బాధిస్తున్నాయో ఆమె గ్రహించింది. అప్పుడు ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చిందో ఆమెకే అర్థం కాలేదు. సాధారణంగా అలాంటి చూపులు ఆమెకలవాటే టాక్సీవచ్చి రజని యింటి ముందు ఆగింది. వర్షంజోరు కాస్త తగ్గింది. కాని ఇంకా కురుస్తూనే వుంది. కాని రామం యింకా ముఖం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చునే వున్నాడు. అతని వుద్దేశం రజని గ్రహించింది. రజని కారుదిగి వెళ్ళిపోతే రామం కారులోనే తిరిగి వెళ్లిపోతాడు. రజని కారు దిగి నిలబడి "లోనికివస్తారా రామం బాబు!? అంది.

ఈసారి ముఖం తిప్పకుండానే "కోరిక లేదు" అన్నాడు కోపంగా రామం.

"ఈసారి ఆ అవసరంకూడా లేదు" అని లోనికి వెళ్ళిపోయింది రజనీ.

రామం అదిగమనించాడు కాని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మనస్సు రజనిని విడచి వెళ్ళిపోవడం బొత్తిగా అంగీకరించలేదు. అభిమానాన్ని, అనురాగం త్రోసిపుచ్చింది. డైవరు ఎంతగానో రామం కేసి చూస్తూ హిందీలో "ఎక్కడకు వెళ్ళమంటారా చెప్పండి సార్" అన్నాడు.

రామం ఆ ప్రయత్నంగానే జేబులోంచి అయిదు రూపాయిలనోటు తీసి అతనికి యిచ్చి బయటకు వచ్చేసాడు. డ్రైవరు టాక్సీతీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు.

వెంటనేలోనికి వెళ్ళే ధైర్యంలేక బయట నిలబడిపోయాడు. బయట వీధి గుమ్మం తీసి వుంది. కొద్ది నిముషాల తరువాత నెమ్మదిగా భయపడతూ భయపడుతూ లోనికి అడుగు పెట్టాడు. గదిలో రజని కనబడలేదు. ఆమె లోపలవుందని గ్రహించాడు. దగ్గరేవున్న కుర్చీలో మనస్సు చిక్క బెట్టుకోని కూర్చున్నాడు, పదిహేను నిముషాలు గడచినా బయటకు రాలేదు. రామానికి రజనిని పిలచే ధైర్యం లేకపోయింది. వెళ్లి పోదామా అనికూడా అనుకున్నాడు. నేను లోనికి రాలేదని రజని అనుకుంటుంది. బయటకు వెళ్లి పోతే అనుమానం కూడా పడదు అని అనుకున్నాడు.

ఆలోచన వచ్చిన తరువాత ఇంకొక నిముషం ఆలస్యం చేశాడు. ఇంక వెళ్లిపోదామని నిశ్చయించుకునే సమయానికి రజని తలుపు తెరచుకొని బయటకు వచ్చింది. దుస్తులు మార్చుకుంది. నల్లటి చీర, తెల్లటి జాకెట్టు ధరించి జుట్టంతా విరబోసుకుని వుంది. రెండు చేతులతో రెండు కప్పులు కాఫీ పట్టుకుని, నవ్వుతూ దగ్గరకు వచ్చి కప్పు అందించింది.

మిరుమిట్లు గొలిపే ఆసౌందర్యాన్ని చూచిరామం దిగ్భాంతుడై "నిజంగా నువ్వు కామినీ దేవిలా వున్నావు?" అని కప్పుఅందుకుని " నేను ఇక్కడవున్నానని నీకెలా తెలుసును రజనీ" అన్నాడు.

"మీ స్వభావం నాకామాత్రం తెలియదా? ఆ ధైర్యంతోనే నేను లోనికి వచ్చాను. మీ కోసమనే కాఫీకూడా కాచి తెచ్చాను" అంది.

రామం కాఫీ తాగుతూ, "నిన్న మా నాన్న నీతో ఏమి చెప్పారు రజనీ!" అన్నాడు.

"ఏమని చెప్పారో మీకు తెలియదా? మీకు రాధకు వివాహం చెయ్యాలని చిన్నతనం నుంచి అనుకున్నారనీ? అందుకోసమే వారిరువురు ఇక్కడకు వచ్చారని, మీరు సెలవు దొరక లేదని అన్నారు. కనుక ఇక్కడే చెయ్య నిశ్చయించుకున్నారని చెప్పారు. అందులో అబద్ధమేమయినా వుందా? అన్నది.

"అయితే దానికి ఏమని సమాధానమిచ్చావు రజనీ?" అన్నాడు.

"శుభస్య శ్రీఘ్రం. ఇక్కడే చేస్తే నాకు కూడా చూచే సదవకాశం లభిస్తుంది" అన్నాను.

"మా నాన్న మాటలు విని నిజంగా ఏమనుకున్నావు రజనీ! నేను నిన్ను మోసగించానని భావించావా?" అన్నాడు.

"లేదు. ఇది నాకు చెప్పే ధైర్యం మీలో లేకపోయినదే అనుకున్నాను. కొంచెం బాధకలిగించినా చివరకు యిది మంచికే అని గుర్తించగలిగాను. ఇన్నాళ్ళు మీరు వంటరివారనే బాధపడుతూ వచ్చాను. ఈనాడు ఆకొరత మీకు తీరిందని తెలుసుకుని సంతోషించాను. రాధ చక్కటిది.మీకన్నివిధాల తగినది- రామం లేచినిలబడి కిటికీ వద్దకు వెళ్ళాడు . రజనికి ముఖం కనబడకుండా ముందుకు తిరిగి "కాని రాధను నేను ప్రేమించలేదు రజనీ? ఆమెను నేను వివాహం చేసుకోలేను. నా మనస్సులో నా హృదయంలో నీకు తప్ప యింకెవ్వరికి స్థానం లేదు. నువ్వు అంగీకరిస్తే నేను నిన్న వివాహం చేసుకుంటాను" అన్నాడు

రామం ఇంతకు ముందెన్నడు వివాహం విషయం గురించి ప్రస్తావించలేదు. ఎందుకో ధైర్యం చాలేది కాదు. కాని ఆనాడు అతనికి ఎక్కడ లేని ధైర్యంవచ్చింది పరిస్థితి విషమించిందని, సమయం మించిపోతుందని అతను గ్రహించాడు.

"మీ మాటలు నాకర్ధమయ్యాయి రామం బాబూ! కాని నేను మొదటినుంచీ చెపుతూనే వున్నాను. నాకు వివాహపు బంధనలో నమ్మకం లేదు. అది కాక మనయిద్దరి మనసత్వాలు ఆలాంటి బంధనకు సరిపడవు. మీకు నామీదున్నప్రేమానురాగాలను కాపాడుకోవాలంటే మనమిద్దరం ఇలాగే వుండాలి. ఒకరికొకరు కొంచెం దూరంగా వుంటేనే భవిష్యత్తులో సన్నిహితమయిన యీ బాంధవ్యం నిలుస్తుంది నేను మిమ్మల్ని ఎప్పుడూ తలుస్తునేవుంటాను అవసరానికి ఎప్పుడు మీ అండనే వుంటాను. మీ పిలుపుని నేనెన్నడు పెడ చెవిని పెట్టను, మీరు నా కెప్పుడూ ప్రియులే?" అంది.

అత్యంత అనురాగ పూరితమైన ఆ వాక్యాలు అతన్ని సమూలంగా కదలించి వేసాయి.

"రాధ నాకు చిన్నతనం నుంచి తెలుసును. ఆమె మీద నాకు ప్రేమ లేదు రజనీ! నేనామెను ఎలా వివాహం చేసుకుంటాను?" అన్నాడు.

"వివాహనికి ముఖ్యంగా కావలసినవి రెండున్నాయి . మెదటది మనసత్వాలు సరిపడాలి. రెండవది ఒకరిమీద ఒకరికి గౌరవం వుండాలి. ఈ రెండు కలుస్తే వివాహం జయప్రదం అవుతుంది. రాధవిషయంలో అన్నీ సమకూరినాయి" అన్నది.

రామం రివ్వున వెనుదిరిగి రజని కేసి తీక్షణంగా చూస్తూ "కాని ఆమెలో నన్నాకర్షించేశక్తి లేదు రజనీ? అది నీలోనే వుంది. దానిని నేను జయించలేను. ఇది నువ్వెందుకు అర్థం జేసుకోవు?" అన్నాడు.

"అర్థం చేసుకున్నాను రామం బాబు! ఈ ఆకర్షణకి అర్ధం లేదు. ఆధారం లేదు. ఒక విధంగా ఇది గ్రుడ్డిది. ఇది వివాహ బంధనలో చిక్కుకుంటే భస్మమైపోతుంది. ఇది మీకు తెలుసును కాని తాత్కాలికమయిన సుఖాన్ని తెంచుకోలేక మథనపడుతున్నారు" అన్నది.

"నువ్వు కాక ఇంకొకరు నా జీవితములో అడుగు పెట్టారనే ఆలోచనే నేను సహించలేక పోతున్నాను రజనీ! నీపై నాకు సంక్రమించిన స్వల్ప అధికారాన్ని దాని ఫలితంగా కోలుపోతానేమోనని నాకు భయంగా వుంది నా జీవితంలో ఇంతకంటే విలువయినది ఇంకేమీ లేదు రజనీ! ఇంకేమి ఉండబోదు" అన్నాడు.

ఆమాటలు అంటూ రామం కంఠస్వరం వ్రక్కలయి పోయింది. అత్యంత వేదనాపూరితమైన ఆ స్వరం నిశ్చలితురాలయిన రజనిని కూడా చలింపజేసింది. కొద్దిక్షణాలవరకు మౌనంగా వుండిపోయింది.

రజని మనస్సు మారుతుందేమోననే ఆశతో రామం "కాదు రజనీ! రామం ఎప్పుడూ నీవాడే" అన్నాడు.

"కాని రజని యెప్పుడు ఎవరిసొత్తు కాలేదు రామంబాబు. ఇదే విషయంమీకెన్ని సార్లు చెప్పాను! ఆ సత్యాన్ని మొండిగా గుర్తించక ఇలా వ్యధన పడుతున్నారు. మళ్ళీ మీకొకసారి చెపుతున్నాను, మన యిద్దరి మధ్య కలసిన బంధాన్నీ, అనురాగాన్నీ జీవితాంతంవరకు మిగిలివుండాలంటే వివాహయత్నం మానివేయ్యండి.రాధని వివాహము చేసుకోండి, చిన్నతనంనుంచి మిమ్మల్నే ఆమె నమ్ముకుంది. మీరు సమ్మతించారు. ఇంత ఆలస్యంగా ఆమెను తిరస్కరించాలనుకోవటం మీ ధర్మం కాదు" అన్నది.

రామం ఆమె నిశ్చయానికి తిరుగులేదని గుర్తించాడు.

"నువ్వు నాకు దక్కకపోయినా నాకు చింత లేదు, కాని నన్ను ఇతరులకు అర్పించి పరాయివాడిననే నెపంతో ఒంటరిగా ముందుకు సాగిపోవాలనుకోవటము ధర్మం కాదు. మన ఇద్దరిమధ్య ఇప్పుడున్న సంబంథాన్ని మించి ఇంకేమీ ఆశించను. ఇలాగే వుండనియ్" అన్నాడు.

"ఒంటరిగా మీరు జీవితం గడపలేరని నాకు తెలుసు. అనుక్షణము మీకు అండగా నిలబడి తన సహచర్యలతో సమస్యలను పరిష్కారించడానికి సంసిద్ధురాలయిన వ్యక్తిమీకు అవసరం. ఇది వివాహరూపంలో తప్ప ఇంకే విథంగాను అది మీకు లభించదు. ఇది మీ తెలుసు నేను మీ జీవితం నుంచి శాశ్వతంగా నిష్కమిస్తాననే భయంకూడా మీకవసరం లేదు. అలాంటి ఉద్దేశం నాకు లేదు" అంది.

రామానికి రజని చెప్పి నమాటలన్నీ నిజమేనని తెలుసు, తన కర్తవ్యమేమిటో ఇంకా అతనికి అవగాహన కాలేదు. ఆత్మీయతని తెంచుకోలేక సతమతమయ్యాడు.

వెనుదిరిగి "భవిష్యత్తులో నీవు ఏ ఒక వ్యక్తికి చెందనని మాటియ్యిరజనీ! అది నేను సహించలేను" అన్నాడు.

"ఇవి ఈర్ష్యాపూరిత వాక్యాలు రామంబాబు. వాగ్దానాలు, బాసలు చేసే అలవాటు నాకు లేదని మీకు తెలుసు? భవిష్యత్తును బంధించేశక్తి నాకు లేదు, మీకా అధికారము లేదు" అంది.

అతనికళ్ళల్లోకి కన్నీరు వుబికి వచ్చింది. వెనుదిరిగి వుండడం వల్ల ఆమె గుర్తించలేదు.

"కేవలం యీనిర్ణయం నీదే రజనీ! దాన్ని అనుకరిస్తాను కాని భవిష్యత్తులో దీనివలన ఏమైనా అనర్థకంవాటిల్లితే దానికి బాధ్యురాలివి నువ్వు మాత్రమే అది గుర్తుంచుకో" అన్నాడు.

"ఈవిధంగా మీరు చేష్టలపరిణామాలనుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా భవిష్యత్తులో నన్ను బంధించి వుంచాలని ఆశిస్తున్నారు. సరే కానీయండి. ఆ భారం కూడా నేనే వహిస్తాను. ఈనాటివరకు నేను తాత్కాలిక అంగీకారాలతోనే గడుపుకుంటూ వచ్చాను, కాని ఈనాడు శాశ్వతమైన ఒక బంధనలో ప్రవేశించాను" అంది.

అతను వుద్రేకంతో "దేదీప్యమానమైన నీ సౌందర్యం నన్ను మొదటినుంచీ పిచ్చివానిగా చేస్తూంది. ఇలాటి అపురూప స్త్రీ పరిచయం కలుగుతుందని నేను నిన్ను కలుసుకోక మునుపు వూహించ లేకపోయాను. జీవితాంతంవరకు సర్వదా నీ సాంగత్యం లభించాలని ఆశించడమనేది దురాశ అని నేను గ్రహించ లేకపోయాను. కాని జీవితంలో నాకు ఇక వేరే ఆశ, కోరిక లేదు. రజని నామశబ్దం, రజని రూప సౌందర్యము- వీటిని మించిన సృష్టి లేదు" అన్నాడు.

తన శక్తినంతా కూడదీసి ప్రయత్నించినా రామం దుఃఖం ఆగలేదు. కన్నీరు కారుస్తూ ముఖాన్నిచేతుల్లో దాచుకొని అక్కడ దగ్గర వున్నకుర్చీలో కూర్చున్నాడు. రజనీ దగ్గరకు వచ్చి చేతుల విప్పి కన్నీరు చీరచెంగుతో తుడిచి "జీవితంలోని పరమార్థాన్ని మీరు గ్రహించ లేకపోతున్నారు రామంబాబు! సామాన్యమైన ఒక స్త్రీ ప్రేమలో పడి మీరు భీరులై కన్నీరు కారుస్తారా? తళుక్కుమంటున్న యీ అందం ఎంతో కాలం వుండదు. ఆ తరువాత మీరే ఆశ్చర్యపడతారు. ఈమెనేనా నేనాప్పుడు అంత గాఢంగా ప్రేమించి వాంఛించాను? అనుకుంటారు. కాని అప్పుడు నేను మిమ్మల్ని పట్టుకు ప్రాకులాడవలసిన అవసరం రావచ్చు నేమో! ఇదే స్త్రీ పురుషులలో వ్యత్యాసము" అంది.

అతను ఆప్యాయంగా ఆమె చీర చెంగుతో తుడుచుకుని, రెండు చేతులు హృదయంవద్ద పెట్టుకుని "ఈ స్పర్శలోనే ఇంత సుఖము, శాంతం ఎలావున్నాయి రజనీ? అనిర్వచనీయమైన ఆనందం నన్ను ఉర్రూతలూగిస్తూంది. కొద్దిక్షణలైనా ఈ సుఖం నన్ను అనుభవించనియ్" అని గట్టిగా నొక్కుతున్నాడు.

ఆమె రెండుమూడు నిమిషాలవరకు అలాగేనిలబడింది. ఆ తరువాత నెమ్మదిగా చేతులు లాగుకుంది. అయినా అతను మారుమాట్లాడలేదు. ఆమె కూడా అక్కడే ఇంకొంత కాలం నిలబడింది. అప్పటికే దట్టంగా చీకటి చుట్టు ప్రక్కల వ్యాపించింది. గదిలో లైటు ఇంకా వేయలేదు. అంత దగ్గరలో వున్న ఒకరి ముఖకవళికలు ఇంకొకరికి స్పష్టంగా కనబడటము లేదు. ఆమె లైటు వెయ్యటానికి వెళ్ళబోతూంటే "వద్దు రజనీ, కాస్సేపు ఇలాగే వుండనీ" అన్నాడు .

"సరే అలాగే కానీయండి కాని ఎంతసేపు మీరీ అంధకారాన్ని సహిస్తారు! వెలుగులోకి రాక తప్పదు" అన్నది

"వెలుగు చీకటి, సుఖదుఃఖాలు, వీటిలో ఏవీ కలకాలం వుండవని వేదాంతం చెప్తూంటారు.అలాంటప్పుడు మనమెందుకు తొందరపడాలి. అయినా కలకాలం మనముండము" అన్నాడు.

రజని సమాధానం చెప్పే అవసరం లేదని గ్రహించింది. అందువలన రామం దుఃఖపడడమే కాని తగ్గడని గ్రహించింది.

కాని రామం ఊరుకోలేదు. నేనిలాంటి స్థితికి దిగజారిపోతానని ఎప్పుడూ అనుకోలేదు రజనీ. ఒకప్పుడు ఆత్మాభిమానం ఆత్మగౌరవం, ప్రాణపదంగా కాపాడుకునే వ్యక్తిని అన్నాడు.

రామం మాటలు రజనికి కాస్త నొప్పి కలిగించాయి.

"ఇప్పుడు వాటికి సంబంధిచిన ప్రమాదమేమి లేదు రామం బాబు" అన్నది.

కాని రామం రజని మాటలను పట్టించుకోలేదు. నాలోనిలోపాలు నా అసమర్థత నాకు తెలుసు రజనీ. నీ ఔన్నత్యంముందు నా అందః పతనం స్పష్టంగా కనబడుతుంది. మేరు పర్వతానికి, మట్టిగోడకి గల విభేధం లాంటివి, సువర్ల పతకానికి గాలిపటానికిగల తేడాలాంటిది. ప్రపంచకంలో ఏవ్యక్తి నిన్ను సంపూర్ణంగా ఇముడ్చుకోలేరు. ఆ తీక్షణతకి ఎవరు తట్టుకోలేరు. స్వార్ధపరత్వంతో ఎవరయినా కాంక్షించినా వారు భస్మమయిపోతారు. ఒకసారి నీపరిచయం అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇంకే ఇతర స్త్రీ ఆక్రమించుకోలేదు. ఆపొలిమేరకయినా ఎవరూ రాలేరు" అన్నాడు.

రామం నోటి వెంట ఆమాటలు శరవేగంతో వెలువడ్డాయి. ముఖమంతా ఎర్రబడింది శరీరం గజగజవణకింది. చీకటిలో రజని అది గుర్తించలేదు. రజని రామానికి కాస్త దూరంగా నిలబడివుంది, ఇప్పుడు దగ్గరకు వచ్చి "మీరన్న ఈ మాటలు దుఃఖంతో, ఆవేశంతోటి అన్న మాటలని నాకు తెలుసు. నేను అతిసామాన్యమయిన స్త్రీని, కాని ఒకటిమట్టుకునిజము రామం బాబు. శాంతి భద్రతలు, సుఖ సౌఖ్యాలు ఆశించే ఏవ్యక్తి అయినా నా బాటనుంచి తప్పుకోవడమే శ్రేయస్కరం" అంది.

"నా శ్రేయస్కరం వాంఛించి నువ్వు పని చేస్తున్నావని నువ్వంటే నేను సహించలేను రజనీ. కావాలంటే కళ్ళకు గంతలుకట్టి నన్ను నీవెంటతీసుకుపో. కాని అలసినప్పుడు ఆస్కారంగా నీ చెయ్యి నాకు లభించాలి. కాని ఇదికూడా నువ్వు త్రోసిపుచ్చావు/ కేవలం ఓటమివల్లనే నేను నిశ్చయాన్ని అంగీకరించాను రజనీ నీ చమత్కారం తోటి, చతురతతోటి నామనస్సు మార్చి అంగీకరింప చేశానని గర్వపడకు" అన్నాడు.

రజనికి, ఆసమయంలో మౌనం వహించడమే వుత్తమమని గ్రహించింది. ఇక సంభాషణ పొడిగించడంకూడా మంచిది కాదని రజని తెలుసుకుంది.

"ఇక పదండి రామం బాబూ, మిమ్మల్ని టాక్సీస్టాండు వద్ద విడచి వస్తాను. చాలా ఆలస్యమయింది" అంది రజని.

రామానికి ఒకనాటి వెన్నెల రాత్రి నడిరోడ్డుమీద జరిగినసంఘటన గుర్తుకొచ్చింది. కాని ఈనాడు ఇది చీకటి రాత్రి.

"ఆనాడు రామం వెన్నెలలో నువ్వునాకు తోడు వచ్చావు. ఈనాడు చీకటిలోకి నేను వంటరిగానే వెళ్లాను, రజనీ" అని క్షణకాలం ఆగి "రాధ నాకోసం ఎదురు చూస్తూంటుంది" అని బయటకి వచ్చాడు రామం.

బయటకూడా చాలా చీకటిగా వుంది. దగ్గర లైటు స్తంభం కూడా లేదు. రామం మాటల అర్ధం రజని గ్రహించింది. తన కృషి ఫలించినదని ఒక వైపున ఆనందం ఆ క్షణంలోనే రామం చేతుల్లోంచి జారిపోయాడనే. దుఃఖం ఆమెని ముంచివేశాయి. క్షణకాలం రామం మీద భరించరాని అనురాగంతో ఆమెహృదయం పొంగిపొర్లింది. చివాలున రామం చెయ్యి పట్టుకుంది.

"కనుచూపు మేరలో కాంతి కనబడుతూంది రామం బాబు. ఆపొలిమేర వరకు నన్ను రానీయండి. చీకటిని దాటి మీ వెంట రానని మాటయిస్తాను" అంది.

రామం చివాలున తన చెయ్యిని లాగుకొని "సమయం వచ్చినప్పుడు ఆ సహాయం కూడా అడుగుతాను రజనీ. ఇప్పుడు వంటరిగానే వెళ్ళనీయి" అన్నాడు.

గద్గద స్వరంతో రజని "రాక్షసి యిక నుంచి కేవలం తరచుగా మీకు స్వప్నంలో సాక్షాత్కరిస్తూంటుంది. రామం బాబు" అంది.

చీకటిని చీల్చుకుపోతున్న రామం హృదయంలోకి ఆమాటలు రివ్వున దూసుకు పోయాయి.

 

చాప్టర్ 21

ప్రసాద్ యింటికి మూడు రోజులు తరువాత తిరిగి వచ్చాడు. చంద్రిక ప్రసాద్ ని చూసి సంతోషంతో వుప్పొంగి పోయింది. మూడురోజుల నుంచి ప్రాణాలరచేతిలో వుంచుకొని చంద్రిక ఎదురు చూస్తోంది. ప్రసాద్ ఉద్రేకవంతుడని ఆమెకు తెలుసు. అతను ఏ అఘాయిత్యం తల బెడతాడోనని భయపడుతూ వుంది. ప్రసాద్ ముఖంలో వుద్రేకం ఎక్కువ కనబడలేదు. కాని నిర్దుష్టమైన నిశ్చయం ఆమెకు కనబడింది.

"మామయ్యా! వచ్చారా. ఇన్నాళ్ళు నన్ను వదలి ఎక్కడున్నారు. భయంతో ఆతురతతో యిన్నాళ్లు పుక్కిరి బిక్కిరి అవుతున్నాను" అంది చంద్రిక.

చంద్రిక మాటలలోని అప్యాయత అతనికి అసభ్యంగా కనబడింది. కాని కారణం కనుక్కోలేక పోయాడు ఆ మాటలు సహజమైనవే.

కృత్రిమముగా నవ్వుతూ "అది నాకు తెలుసుకు చంద్రికా! కాని పనిమీద వుండిపోవలసినచ్చింది" అని లోపలికి వెళ్ళిపోయాడు.

తన గదిలోకి వెళ్ళి తర్వాత రెండుగంటలకు బయటకు వచ్చి చంద్రికతో "నేను యిల్లు వదలి బయటకు వెడుతున్నాను. కొంతకాలంవరికు తిరిగి రాను. కావలసిన డబ్బు అన్నీ ఇందులో వున్నాయి. దగ్గర వున్న డబ్బు అయిపోయేవరకు ఈ కవరు చించకు" అని ఒక పెద్దకవరు చంద్రిక చేతికి అందించాడు.

చంద్రిక భయంతో "ఎక్కడకు వెళుతున్నావు మామయ్యా? కాశ్మీరు వెళుతున్నావా? నన్ను కూడా తీసుకు వెళ్ళవా?" అన్నది.

"లేదు చంద్రికా! అది వీలుపడదు. ఒంటరిగానే వెళ్ళాలి త్వరలోనే తిరిగి వస్తాను. రాకపోయినా నాకేమి ఇబ్బంది వుండదు" అన్నాడు.

ప్రసాద్ మాటలు చంద్రికను భయవిహ్వలని జేసాయి. అతని చెయ్యి గట్టిగా పట్టుకొని "నేను నిన్ను విడచి వుండలేనుమామయ్యా! ఒంటరిగా నేను ఇక్కడ వుండలేను. ఎక్కడికయినా ఫరవాలేదు. వెంట తీసుకు వెళ్ళు మామయ్యా! లేకపోతే నేను బ్రతకలేను" అని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టింది.

చంద్రిక కన్నీరు అతనిలోని క్రోధాన్నిప్రేరేపింపజేసాయి. "చంటిపిల్లలా ఎందుకలా ఏడుస్తావు చంద్రికా? కన్నీరుని నేను సహింపను" అన్నాడు.

చంద్రిక కన్నీరుని ఆపు చేసుకొని "నన్నిలా ఎందుకు బాధ పెడుతున్నావు మామయ్యా! చిన్నతనం నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెద్దదానివి చేసావు, మీరు తప్ప నాకిక వేరే గతి లేదు. నిన్ను విడచి నేను వుండలేను" అన్నది.

"అది నీ బలహీనత చంద్రికా! దానికి నేను బాధ్యుడను కాను" అన్నాడు.

చంద్రికకి దుఃఖం మళ్ళీ ముంచుకువచ్చింది. ముఖం చేతులతో కప్పుకొని దుర్నివార్యంగా వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. ప్రసాద్ రెండు మూడు నిమిషాలవరకు ఆమె కేసి తేరిపార చూసాడు.

"చంద్రికా! అనురాగమే జీవితంలో అన్నింటికీ దుఃఖ హేతువు. అది నువ్వు జయించకపోతే అది నిన్ను అడుగడుగున వెంటాడుతూనే వుంటుంది. ఇంకో విషయం కూడ చెప్పాలనిపిస్తుంది. నా జీవితంలో నువ్వు ఎప్పుడూ కొంత కారణంగానే వచ్చావు. నేను నీ జీవితాన్ని ఇప్పటివరకు వహించటానికి నువ్వు కూడ కొంతవరకు కారణభూతురాలివే. నీ ఆలోచన నాకిప్పుడు మనశ్శాంతి కలిగిస్తూనే వుంది. ఈ సమయంలో నీ జీవితం సాఫీగా, సుఖంగా జరిగిపోవాలని నేను వాంఛించేటంత తీవ్రంగా, స్వచ్చంగా, హృదయపూర్వకంగానే ఇంకేమి వాంఛించటం లేదు" అన్నాడు.

చంద్రిక యింకా వెక్కి వెక్కి ఏడుస్తూనేవుంది. అతను క్షణకాలం ఆగి "రజని వుండగా ప్రపంచంలో నువ్వు ఏకాకివనే భయం నీ కవసరం లేదు చంద్రికా! ఇక నేను వెళుతున్నాను" అని బయటకు వచ్చేసాడు. ఒక పెద్ద సూట్ కేస్ మాత్రం కారులో వుంచుకున్నాడు. కారు తీసుకుని బయలుదేరాడు. కమలరూపం అనుక్షణం అతని మనఃఫలకము మీద కనబడసాగింది. ఆమె అనురాగాన్ని సంపాదించాలనే వాంఛ గట్టు తెగి ప్రవహించనారంభించింది. ఆమెని మొదటిసారి చూచినప్పటినుంచీ జరిగిన సంఘటనలన్నీ మనోవీధిలో మెదలసాగాయి. ఆమె పెట్టిన చెంప పెట్టు, తాజ్ మహల్ మీనారెట్ లో జరిగిన సంఘటన, గాయపడిన ప్రసాద్ ని చూడటానికి వచ్చినప్పుడు హాస్పటల్ లో జరిగిన సంఘటన, ఊరవతల కారులో ఏ కాంతంగా జరిగిన సంభాషణ మొదలయినవన్నీ ఒక దాని తరువాత ఒకటి జ్ఞాపక మొచ్చాయి. మొదటినుంచీ కమల అతనంటే ఒకవిధమైన భయం, తిరస్కారం ప్రదర్శిస్తునే వచ్చింది. దానితోపాటు ఒక విధమైన ఏవగింపుకూడ అప్పుడప్పుడు దృగ్గోచరమయేది. ఒక్కసారి కూడ ఆమె నోటి వెంట అనురాగపువాక్యాలు రాలేదు. వాటి కోసమే ప్రసాద్ పరితపిస్తూ వచ్చాడు. కమల వివాహిత అనే ధ్యాసే అతనికి లేకపోయింది. కమలకి రజనికిగల ప్రచండమైన విభేదం అతనికెంతమాత్రము గుర్తుకు రాలేదు. కమల అనురాగాన్ని పొందాలనే తీవ్రవాంఛ అతని హృదయాన్ని దహించి వేసింది. అది తప్పయిక ప్రపంచంలో ఇంకేమి అతడు గుర్తించ లేకపోయాడు. నిజానికి అది ఎంతో సహజమయినదే. మానవునిప్రేమకు అంతులేదు. సరిహద్దు లేదు. ధర్మాధర్మాలతోటి, యుక్తా యుక్తాలతోటి నిమిత్తం లేదు. సూటిగాకనబడేది ప్రేమించిన వారి ప్రియరూపం. ప్రేమించడము సహజమయితే ప్రేమించబడి నవారువివాహితలయి నంత మాత్రాన అది అసహజ మవలేదు. మనస్సులోని ఆలోచనని, హృదయంలోని ఆవేశాలని అధర్మమనే పేరుతో అణగదొక్కే అధికారం దైవానికి కూడ లేదు. వాటిల్లు దోషం లేదు. కల్మషం లేదు. పాపభీతికి తావు లేదు. దైవ నిర్మితమయిన వాటికి మానవుడు సిగ్గుపడవలసిన అవసరం లేదని ఎవరో అన్నట్లు గుర్తు, ఈ భావాలు కేవలం దైవ నిర్మితాలే కాదు, దైవ ప్రేరితాలుకూడ. చేష్టలను శాసించే అధికారం మానవులకే వుంది. "నాది, నేను" అనే అహంభావంతో బలాఢ్యులు, మూర్ఖులు యితరులకి అన్యాయం చెయ్యకుండా వుండటానికి జరిగిన ఏర్పాటే సమాజం. కాని అది అధికారాన్ని దుర్వినియోగం చేసి నియంతగా ప్రతిష్ఠించింది. ఈ విధంగా సాగాయి ప్రసాద్ ఆలోచనలు. ఆ నియంతృత్వానికి తిరుగుబాటే తన రూపంలో సాక్షాత్కరించిందిఅని భావించాడు.

అప్పటికి సంధ్యాసమయం దాటిపోయి చీకటికి దారి యిస్తోంది. ప్రసాద్ కమల యింటి వైపు కారు నడపసాగాడు. అప్పుడు అతనికి గుర్తువచ్చింది.

సాయంకాలాల్లో సాధారణంగా కమల ఇంటిదగ్గర వున్న చిన్న పార్కుకి వెళ్ళి కూర్చుంటుంది, ఒకసారి ఆమె అలా చెప్పినట్లు గుర్తుకువచ్చింది. అక్కడికే కారు పోనిచ్చాడు. పార్కు చాలా చిన్నది. పూర్తిగా మనుష్య సంచారం లేదు. కారు దిగి లోన వెదకసాగాడు. లోపల ఒకరిద్దరువ్యక్తులు కనబడ్డారు. నిరాశతో బయటకు వచ్చేద్దామనుకునే సమయంతో దూరంలో గడ్డిపై వాలివున్న స్త్రీ స్వరూపం కనబడింది. కమలని వెంటనే గుర్తించసాగాడు. అతనిహృదయం సంతోషంతో వుప్పొంగిపోయింది. ఆమె ఏకాంతంగా వుంది. ఆమె మోచేతిని ఆనుకొని కళ్ళు మూసుకుని పడుకొని ఏదో పరధ్యాన్నంగా ఆలోచిస్తున్నది.

వెనుకగా వెళ్ళి"కమలా!" అని నెమ్మదిగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. మొదట అది కమలాకరంపిలుపు అనుకుంది. అతని రాక కోసమే ఆమె నిరీక్షిస్తోంది. ఆఫీసునుంచి తిరిగి రాలేదు. ప్రతిరోజూ సాయంకాలం వారక్కడే కలుసుకునే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఒక గంట సేపు గడిపిఇంటికి చేరుకునేవారు. ఆమె ఆ ఘడియ కోసమే ఎదురు చూస్తోంది.

"ఇంత ఆలశ్యంచేసావ్" అని నవ్వుతూ వెనుతిరిగి చూసింది. ప్రసాద్ ని చూచి కమల నిర్ఘాంతపోయింది. చివాలున లేచి చెదరిన చీరని సరి చేసుకుంటూ "మీరా?" అంది.

"అవును కమలా! నేనే, ఆశ్చర్యం వేస్తోందా?" అన్నాడు.

"కమల కంగారుపడుతూ "వారనుకున్నాను" వారి కోసమే ఎదురుచూస్తున్నాను" అన్నది,

కాని ప్రసాద్ కమలమాటల్ని వినిపించుకోలేదు. "నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడటం నా కలవాటేనని నీకు తెలుసు కమలా, "నేను నిన్ను తీసుకు పోవటానికి వచ్చాను" అన్నాడు.

కమల పూర్తిగా భయవిహ్వలై పోయింది. అతన్ని చూచిన వెంటనే ఏదో అవాంతరం వచ్చిందని ఆమె మొదటే భయపడింది. ప్రసాద్ మాటలతీరు ఆమెను యింకా భయపెట్టాయి.

"ఎక్కడికి? ఏమిటలా మాట్లాడుతున్నారు. వారొచ్చే వేళయింది" అన్నది.

"నేనిక యిది భరించలేను కమలా రాత్రింబవళ్ళు కనుమూసినా, కనుతెరచినా, నీ రూపమే నాకుకనబడుతోంది. నీసాంగత్యం కోసం, అనురాగంకోసం నాహృదయం బద్దలవుతోంది. ఇక నువ్వు లేకుండా నేను క్షణమైన జీవించలేను. ఇన్నాళ్ళు నా శక్తినంతా కూడదీసుకుని ప్రచండమైన వేదనని భరించాను. ఇక నేను పోరాడలేను కమలా! ఇక నేను భరించలేను" అన్నాడు.

గంభీరమైన కంఠస్వరం ఆమె చెవుల్లో మారు మ్రోగినది.అప్రయత్నంగా ఆమెలో ఒక విధమైన గర్వభావం పొడ చూపింది.

"దానికి నేను బాధ్యురాలను కాను ప్రసాద్. నాలో ఆలాంటి భావాలకి చోటు లేదు. అనవసరంగా రసాభాసా చెయ్యకుండా మీ దారిన మీరు వెళ్ళండి" అంది.

"నేను వంటరిగా వెళ్ళటానికి రాలేదు కమలా! నిన్ను నా వెంట తీసుకునే ఇక్కడ నుంచి వెడతాను, నేను ఆడిన మాట తప్పనని, పట్టిన పట్టు విడువనని నీకు తెలుసుగదా?" అన్నాడు.

కమలకి ముచ్చెమటలు పోసాయి. ప్రసాద్ నిజంగానే ఆ వుద్దేశంతో నచ్చాడని అతని నిశ్చయంతప్పించడం అసంభవమని ఆమె గ్రహించింది.

వణుకుతున్న కంఠస్వరంతో, "నన్ను ఎందుకిలా బాధపెడుతున్నారు మీరు? నేను వివాహితను, నా భర్తే నాకు సర్వస్వం, పర స్త్రీతోమీరనవలసిన మాటలాయివి. ఇది అధర్మం కాదా? మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటాను. నన్ను వదలి వెళ్ళిపోండి" అంది.

"వివాహితపై నంత మాత్రాన నేను నిన్ను ప్రేమించడం అధర్మమంటే నెనంగీకరించను కమలా, ఎన్నడూ అంగీకరించను. వివాహంఒక సామాన్యమైన అంగీకారం. ప్రేమఓక మహత్తరమైన అనుభూతి" అన్నాడు.

"కావచ్చు కాని ఒకరి ఇష్టానికి విరుద్దంగా ఇంకోకరు వారిని లోబరచుకోవడానికి ప్రయత్నించటం అధర్మం కాదా?" అంది.

"ఆ వుద్దేశంతోనే ఇన్నాళ్ళు ఇదంతా సహించాను. కాని ఇక నేను భరించలేను, మానవులంతా స్వార్ధ పరులే కమలా-" అని హఠాత్తుగా ముందుకు అడుగు వేసాడు.

కమల వెనుకకు అడుగు వేసి క్రోధంతో మండిపడుతూ "ముందుకు అడుగు వేసారంటేఏం చేస్తానో చెప్పలేను ప్రసాద్. అబలనని మీరు ఆశ పడుతున్నారేమో జాగ్రత్త" అంది.

కమల కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ప్రసాద్ వాటిల్లోకి చూడకుండా, ఏం చెయ్యగలవు కమలా? ఎంతైనా నువ్వు ఆబలవే. అయినా సాహసమంటే ఇదిగో అని రివ్వున జేబులోంచి రివాల్వరు తీసి కమలకు అందించాడు.

కమల అది అప్రయత్నంగానే అందుకుంది.

"నీలో ఆ ధైర్యమే వుంటే చాలు కమలా, ఆత్మహత్య చేసుకున్నానని వ్రాసియిస్తాను. నీకా భయం అక్కర లేదు." అన్నాడు ప్రసాద్.

కమల శరీరమంతా గజగజ వణక సాగింది. ప్రసాద్ నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. కమల ఎంత ప్రయత్నించినా రివాల్వరు పైకి ఎత్తలేకపోయింది. ప్రసాద్ కమలను హఠాత్తుగా కౌగిలిలోకి లాగుకొని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. భరింపరాని ఆవేశంతో కమల శరీరం తుఫానులో చిక్కుకున్న గాలిపటంలా రెప రెపలాడింది. ఆమెకి స్మృతి తప్పే పరిస్థితికి వచ్చింది.

"నాకు ఇది నిజం చెప్పు కమలా మనస్సులో మర్మం లేకుండా ఈ ఒక్క ప్రశ్నకి సవ్యమయిన సమాధానం ఇయ్యి నా మీద నీ హృదయంలో ప్రేమానురాగాలు లేవా!" అన్నాడు ప్రసాద్.

కమల అస్పష్టంగా సమాధానం యిచ్చింది. "హృదయంలో వాటిని మించినదింకేమి లేదు. కాని నేను వారిని మోసగించలేను. వారు నన్ను నమ్ముకున్నారు. ప్రాణపదంగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారిని నేను మోసగించలేను. వారికి తీరని అలాంటి బాధ కలిగించి నేను జీవితంలో సుఖపడలేను. ఇతరుల దుఃఖాలతో నేను ఆనందంగా వుండలేను" అంది.

"ఆయితే నా దుఃఖం నా బాధ నీకేమి అంటవా కమలా! వాటితో నీకు నిమిత్తం లేదా" అన్నాడు.

కమల ఇంకా ప్రసాద్ కౌగిలిలోనే వుంది. నెమ్మదిగా "ఆలోచన నన్నెప్పుడు బాధ పెడుతూనేవుంది. కాని నా సర్వస్వాన్ని ప్రేమకోసం త్యజించే సాహసం నాలో లేదు. నన్ను సాధించక వదలి వేయండి, నన్ను విడిచి పెట్టండి మీరడిగిన ప్రశ్నకు నిజమైన సమాధానం చెప్పాను, ఇక నన్ను విడచి పెట్టండి" అంది.

విడిచి పెట్టండి అని కమల ఆంది. కాని అలాంటి ప్రయుత్నమేమి చేయలేదు, కాని ప్రసాద్ చివాలున ఆమెను విడిచి పెట్టి ఉద్రిక్తకంఠంతో "కమలా నీ ఇష్టానికి విరుద్దంగా నీకు హానికలిగించేటంత నీచుడినికాను. నీ హృదయంలో నేనంటే ప్రేమ లేదనే ఇన్నాళ్లు బాధపడేవాడిని కాని ఈనాడు తెలిసింది అది అసత్యమని. నువ్వు సంఘానికి వెరసి ఇలా ప్రవర్తిస్తూంటావని ఇప్పుడు నా హృదయం తేలికపడింది. ఇక నేను నిన్ను విడచి వెళ్ళిపోతాను. శాశ్వతంగా నీనుంచి ప్రపంచకం నుంచీ దూరమయిపోతాను. సంతోషంతో నిండిన హృదయంతో మరణిస్తాను" అన్నాడు.

కమల దుఃఖంతో కన్నీరు కారుస్తూ "నన్ను క్షమించండి ప్రసాద్! నన్ను క్షమించేసారని నాకొక వాగ్దానం చేయండి. ఏలాంటిఅఘాయిత్యము చెయ్యనని నాకు మాటియ్యండి"

ప్రసాద్ కఠినంగా "అలాంటి వాగ్దానం అడిగే అధికారం నీకు లేదు కమలా, నీలో నేనంటే ప్రేమానురాగా లున్నాయని తెలిసి నేను నిన్ను పర స్త్రీగా చూస్తూ నేను జీవించలేను" అని మృదువుగా "కమలా నేను నిన్ను ప్రేమించినంతగా, వాంఛించనంతగా ఇంకెవరు ఎప్పుడు ప్రేమించివుండరు. బహుశా దానికి ఇది తగిన పర్యవసానం." అని రివ్వున బయటకు వచ్చేశాడు.

 

అయిపోయింది

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Comments

Please login to post comments on this story